13, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఆంధ్ర పత్రిక మూడో పేజీ చూశారా గురూ గారూ!


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 17-09-2015, THURSDAY)





నా చిన్నతనంలో చదివిన జోకు ఇది.

ఒకతను పత్రిక చేతబట్టుకుని వీధిలో అందరి వెంటా పడుతూ ‘మూడో పేజీ చూశారా’ అని వేధిస్తుంటాడు. విషయం ఏమిటంటే అతగాడు రాసిన ఉత్తరాన్ని ఆ రోజు ‘పాఠకుల లేఖలు’ శీర్షికలో ప్రచురించారు. దాన్ని గురించి నలుగురికీ తెలపడానికి అతడెన్నుకున్న మార్గం ఇది. (ఆదుర్తి వారు తీసిన తేనె మనసులు/కన్నెమనసులు సినిమాలో కూడా ఈ మాదిరి సన్నివేశం వున్నట్టు గుర్తు)

తాము చేసిన పనులు ( వారి దృష్టిలో ఘనకార్యాలు) నలుగురి దృష్టికి తీసుకురావడానికి రక రకాల పద్ధతులు అనుసరిస్తూ వుండడం మనకు కొత్తేమీ కాదు. కొందరు బాహాటంగా బయటపడి నిస్సిగ్గుగా చెప్పుకుంటే మరికొందరు నర్మగర్భంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. రాజుల కాలంలో భట్రాజులు ఈ పని తమ నెత్తిన వేసుకునేవారు.కొండొకచో, వారి ఆస్తాన కవులు కూడా ప్రత్యేక సందర్భాలలో అన్యాపదేశంగా ఈ కర్తవ్య పాలన చేసి తమ రాజ భక్తిని కవితాత్మకంగా చాటుకునేవారు. తదుపరి జమీందారుల కాలంలో సయితం కొనసాగిన ఈ విధానం ప్రజాస్వామ్య యుగంలో సమాచార పౌర సంబంధ శాఖ రూపంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ‘ప్రచారం కోసం ఇన్నిన్ని కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తారా ? ఆయ్!’ అంటూ హుంకరించి పత్రికల కెక్కి విమర్శలు గుప్పించిన ప్రధాన ప్రతిపక్షం వాళ్ళే తాము అధికారంలోకి రాగానే ఆ విషయం వీలుచేసుకుని మరీ మరచిపోతారు. మరచిపోవడమే కాదు, పబ్లిసిటీ ఇచ్చుకునే విషయంలో తమ వైరి పక్షం కన్నా నాలుగాకులు ఎక్కువే చదివామని అనిపించుకుంటున్నారు. కాలక్రమంలో ఇది మరింతగా ముదిరిపోయి ప్రభుత్వ పధకాల ప్రచారం కాస్తా అధికారంలో కీలక స్తానాల్లో వున్న వారి వ్యక్తిగత ప్రచారంగా రూపుదిద్దుకోవడం, ఆ ఖర్చును పన్నుల రూపంలో ప్రజల మీద రుద్దడం - ఇవన్నీ ప్రజాస్వామ్య యుగంలో సహజాతి సహజంగా జరిగిపోతున్నాయి.


వ్యక్తిగతం అంటే గుర్తుకొచ్చింది. వ్యవస్థలు, ఆ వ్యవస్థలను శాసించే వ్యక్తుల సంగతి అటుంచండి. ఇప్పుడీ ప్రచార ఉధృతి అనేది సామాన్య జనజీవనంలోకి కూడా ప్రవేశించింది. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, పూజలు, పునస్కారాలు అన్నీ ప్రచార ప్రాతిపదికనే జరిగిపోతున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నామన్న భావనకన్నా ఎంత ఆడంబరంగా జరుపుకుంటున్నామన్న అభిజాత్యమే వీటిల్లో బాగా కానవస్తోంది.

కొత్తగా ఫ్రిజ్ కొనుక్కున్నావిడ ఇంటికొచ్చిన ప్రతి వాళ్లకు అడగకుండానే ‘మంచినీళ్ళు తాగుతారా పిన్ని గారు’ అని అడిగి నీళ్ళ గ్లాసు చేతికిచ్చి- ‘చల్లగానే వుంటాయి లెండి కొత్త ప్రిజ్ కదా’ అంటూ ప్రిజ్ కొన్న సంగతి చల్లగా బయటపెట్టే సన్నివేశాలకు సినిమాల్లో కొదవ వుండదు. అలాగే కొన్న చీరెలు గురించీ, నగల గురించీ ఇరుగూ పొరుగుతో చెప్పుకుని తృప్తిపడే ఆడంగులు కొల్లలుగా కనిపిస్తారు. ఇలాటి వాళ్ళతో పేచీ ఏమీ లేదు. ఆహా ఒహో అంటే చాలు మురిసి ముక్కచెక్కలవుతారు.


మరోరకం వాళ్ళతోనే ఇబ్బంది. వాళ్లు ఏది కొన్నా అదే బెస్ట్ అంటారు. తాము ఏది చేసినా అది ఇతరులు ఎవ్వరూ చేయలేరన్న ధీమా అనండి, అతిశయం అనండి వారి మాటల్లో పెల్లుబుకుతుంటుంది. వాళ్ల రూటే సపరేటు. వాళ్లు వెళ్ళిందే మంచి హోటలు. వాళ్లు చూసిందే భేషయిన సినిమా. వాళ్లు చదివిందే చక్కటి పుస్తకం. వాళ్లు చెప్పిందే వేదం. ఇంతెందుకు! వాళ్లు పట్టిన కుందేటికి నాలుగు కాళ్ళు వుంటే నా మీద వొట్టు.

దీన్ని ‘వన్ వే’ పబ్లిసిటీ అనాలేమో. ఇతరులకి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వరు మరి.

ఈ మధ్య ఓ కొత్తరకం సెల్ఫ్ డబ్బా ఒకటి మొదలయింది. ‘పలానా టీవీ పలానా టైం కు పెట్టండి. నా ప్రోగ్రాం వస్తుంది’ అని తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్లకు మొబైల్ ఫోన్లల్లో ‘ఎస్సెమ్మెస్’ లు ఇస్తుంటారు. ‘దయచేసి పలానా వారపత్రికలో/దినపత్రికలో నా వ్యాసం వచ్చింది చదవండి ప్లీజ్’ అని వచ్చే ఎస్సెమ్మెస్ ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. టీవీ చర్చల్లో పాల్గొనే మేధావులలో కొందరు ‘పలానా పత్రికలో ఈ విషయం గురించి ఇప్పటికే రాసేసాను’ అని చెప్పుకోవడం సెల్ఫ్ పబ్లిసిటీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇక ‘ఈ’ మెయిల్ సౌకర్యం వుంటే చాలు పైసా ఖర్చు లేకుండా ప్రచారం చేసుకునే అవకాశాలు అన్నీ ఇన్నీ కాదు.

‘నిన్ను గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. నిజం చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు. అబద్ధం చెబితే మాత్రం ఇంకా యెంత వున్నదో అని సందేహిస్తార’ని మా అన్నయ్య ఎప్పుడూ చెబుతుండేవాడు. కానీ ఈ నాటి సూత్రాలకు ఇది పూర్తిగా విరుద్ధం. సిద్ధాంతాలయినా, ఆదర్శాలయినా దెశ, కాల, మాన పరిస్తితులనుబట్టి మారిపోతుంటాయి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ గా వున్నవాడు ఎప్పటికీ అలాగే వుండి పోనక్కరలేదు. పక్కా సమైక్యవాదులు అని ముద్ర పడ్డవారు రాత్రికి రాత్రే విభజనవాదులుగా మారిపోయి తమ వితండ వాదాలతో టీ వీ చర్చావేదికలపై కుండలు, బల్లలు బద్దలు కొడుతూ వుండవచ్చు. మార్పు మానవులకు సహజం అన్న సిద్ధాంతం సమర్ధించుకోవడానికి ఎలాగూ వుంది.


అంచేత మాస్టారూ, ప్రతివాడూ తన గురించి తానే చెప్పుకోవాలి. ఇతరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే మంచితనం ఈనాడు కలికానికి కూడా దొరకని పరిస్తితి. అందువల్ల, ఏతావాతా చెప్పేదేమిటంటే మనకి మనమే పీఆర్వోలం. మన గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. అవతల మనిషి నమ్మడం లేదని తెలిసినా మన గురించి మనం చెప్పుకుంటూనే పోవాలి. ఎదుటివాడు నమ్మకపోయినా కనీసం అతడి పక్కవాడు మన మాటల్ని నమ్మే ఛాన్సు కొంతయినా వుంటుంది. ఆలశ్యం ఎందుకు? స్వయం భజన బృందంలో చేరుదాం పదండి.

ఇక సిగ్గంటారా! దాన్ని వొదలకపోతే ఈ పాడు ప్రపంచంలో ఎదగడం కష్టం!!




(రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్:  98491 30595)

NOTE: COURTESY IMAGES OWNER


పెళ్లి పుస్తకం


రాత్రి ఏదో ఛానల్లో పెళ్లి పుస్తకం అనే  ప్రోగ్రాం వస్తోంది. అది చూస్తుంటే రెండు పాత జ్ఞాపకకాలు మదిలో మెదిలాయి.


చాలా ఏళ్ళ క్రితం అంటే బోలెడు బోలెడు సంవత్సరాల కిందటి సంగతి. అప్పుడు నేను స్కూల్లో చదువుకునే రోజులు. ఇల్లస్త్రేటేడ్ వీక్లీ అనే ఒక ఇంగ్లీష్ మేగజైన్ వచ్చేది. అందులో దక్షిణాదిలో పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు అనే అంశంపై   ఫోటో ఫీచరు రాయడానికి ముంబై నుంచో ఢిల్లీ నుంచో ఒక తెలుగు తెలియని జర్నలిస్టు వచ్చాడు. మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు  ఆ రోజుల్లో  సమాచార శాఖ అధికారిగా పనిచేస్తుండేవారు. ఆయన్ని ఆ జర్నలిస్టు వచ్చి కలిసి తాను  వచ్చిన పని చెప్పాడు. అంతకు కొద్ది రోజుల క్రితమే మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పెళ్లి ఘనంగా జరిగింది. ఇల్లస్త్రేటేడ్ వీక్లీ సంగతి వినగానే ఆయన యెగిరి గంతేసి ఆ పత్రిక కోసం మొత్తం పెళ్లి తంతు తిరిగి ఏర్పాటు చేశాడు. ఆ వచ్చిన  జర్నలిస్టు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పట్లా ఇలా రాయడం అలా అచ్చు వేయడం కాదుకదా అప్పట్లో.  మొత్తం మీద ఎన్నో నెలలు కళ్ళు కాయలు కాసేలా  ఎదురు చూసిన తరువాత ఆ  ‘మళ్ళీ పెళ్లి’ ఫోటోలు ఎంచక్కా రంగు రంగుల్లో ఆ ఇంగ్లీష్ పత్రికలో వచ్చాయి. అప్పుడు చూడాలి అయన సంతోషం. బెజవాడ రైల్వే స్టేషన్ లో హిగ్గింబాదం బుక్ స్టాల్ లో వున్న ఆ పత్రిక ప్రతులన్నీ కొనేసి చుట్టపక్కాలకి పంచి పెట్టాడు. ఇప్పుడు ఆ కాపీ  ఒక్కటి దొరికితే ఒట్టు.
ఇక రెండో జ్ఞాపకం. తలచుకుంటే జాలేస్తుంది.
ప్రైవేటు టీవీ ఛానళ్ళు ఒకటీ అరా మెల్లమెల్లగా రంగ ప్రవేశం చేస్తున్న రోజులు. ఒక ఛానల్ వాళ్ళు  ఇలానే పెళ్లి పుస్తకం అనో ఇంకోటనో ఏదో పేరుతొ ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళు. సెలెబ్రెటీలను దంపతయుక్తంగా స్టూడియోకు పిల్చి వాళ్ళ అనుబంధాలను అనుభవాలను గుచ్చిగుచ్చి అడిగి మరీ రికార్డు చేసేవాళ్ళు. అందులో పాల్గొనేవాళ్లు కూడా ఈ జన్మకే కాదు వచ్చే ఏడేడు జన్మల్లో కూడా మళ్ళీ భార్యాభర్తలుగానే పుట్టాలని వుందని ఆ టీవీ ఛానల్ సాక్షిగా నొక్కివక్కాణించేవారు. ఆ క్రమంలో కొత్తగా ఎమ్మెల్యే గా ఎన్నికయిన ఒక మహిళను, ఆమె భర్తను స్టూడియోలో కూర్చోబెట్టి ఓ అరగంట ఇంటర్య్వూ చేసారు. చేయడం అయతే చేసారు కానీ ప్రసారం చేయడానికి కొన్ని నెలలు వ్యవధానం పట్టింది. తీరా అది ప్రసారం అయ్యేనాటికి వాళ్ళు విడాకులు కూడా తీసేసుకున్నారు.  ‘ఎన్ని జన్మలెత్తినా మేము భార్యాభార్తలమే’ అని వాళ్ళు  ఉద్ఘాటిస్తున్న దృశ్యాలు మాత్రం పదే పదే ప్రసారం చేసిన ఆ కార్యక్రమాన్ని చూసిన వారికి మంచి కాలక్షేపం కలిగించాయి.
టీవీని ఇడియట్ బాక్స్ అంటాం కానీ అప్పుడప్పుడూ అందులో ఇలాటి ఉచిత వినోదం పుష్కలంగా లభిస్తుంది.              

12, సెప్టెంబర్ 2015, శనివారం

నాసికాశాస్త్రం


ముక్కు వుంది చీదడానికే అని అదేపనిగా  చీదేయకండి. ముక్కుతో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయని ఓ ముక్కు శర్మగారు సెలవిస్తున్నారు. తలనొప్పిని అయిదే అయిదు నిమిషాల్లో ఎగరగొట్టే మహత్తర శక్తి ముక్కుకు వుందన్నది ఆయన మాటల తాత్పర్యం.



ఇంతకీ విషయం ఏమిటంటే -
ముక్కుకు రెండు రంధ్రాలు వుంటాయి. ఈ నిజం తెలుసుకోవడానికి ముక్కు శర్మగారు అవసరం లేదు. కానీ ఆయన చెప్పేది ఇంకా వుంది. ఆ రెండు రంధ్రాల్లో ఎడమవైపుది చంద్రుడి స్థానం అయితే, కుడి వైపుది సూర్యుడి స్థానం. బాగా తలనొప్పిగా వున్నప్పుడు కుడి రంధ్రాన్ని ఓ అయిదు నిమిషాల పాటు మూసివుంచి ఒక్క ఎడమవైపు రంధ్రం ద్వారా మాత్రమే శ్వాస తీసుకుంటే తలనొప్పి గాయబ్.
అంతేనా అంటే అంతే  కాదు అంటున్నారు ముక్కు శర్మగారు.
బాగా అలిసిపోయినప్పుడు ఎడమవైపు రంధ్రాన్ని చేతి వేలితో మూసి, కుడి వైపు రంధ్రం నుంచి శ్వాస పీల్చి చూడండి. ఇక చూడండి,  రిఫ్రెష్ బటన్ నొక్కినట్టు   మనస్సు పాతిక లైకులు చూసినంత హాయిగా తాజాగా అయిపోతుంది (ట)
ప్రయత్నించి చూస్తే పోయేదేమీ లేదు ఓ అయిదు నిమిషాలు టైం తప్ప.
స్టార్ట్ ....వన్ టూ త్రీ....     
తోకముక్క: నెట్లో ఈ సమాచారం ఇంగ్లీషులో పంపిణీ చేసిన దేవినేని మధుసూదన రావు గారికి కృతజ్ఞతలు. దాన్ని స్వేచ్చగా  తెలుగులోకి మార్చిన భవదీయుడికి (అంటే నేనే) అభినందనలు.


NOTE: Courtesy Image Owner

11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

చాదస్తం


వీర వెంకట నరసన్న పంతులుకి ఒక్కడే కుమారుడు, నారాయణ మూర్తి.
తండ్రి వరస కొడుక్కి ఏమాత్రం నచ్చేది కాదు. ‘ఉత్త చాదస్తపు మనిషి, మనం చెప్పింది వినిపించుకోడు’ అనేది నారాయణ మూర్తి అభిప్రాయం, కానీ పైకి అనేవాడు కాదు. తండ్రి అంటే వున్న గౌరవం వల్ల. అలానే ఏండ్లు గడిచిపోయాయి. మూర్తికి కొడుకు పుట్టాడు. తండ్రి పోయాడు. ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి పేరు కలిసివచ్చేలా వీరభద్రరావు అని పేరు పెట్టుకున్నాడు. అతడికి వయస్సు వస్తూనే తండ్రి మాటలు, చేతలు చాదస్తంగా  అనిపించేవి. పైకి తండ్రితో అనలేకపోయినా తల్లితో చెప్పేవాడు తండ్రి చాదస్తం గురించి.

అదేమిటో వీరభద్రరావుకు కూడా ఒక్కడే కొడుకు. తండ్రి చాదస్తం తెలిసిన వాడు కనుక తాను  భిన్నంగా నడవాలనుకున్నాడు. కొడుక్కి ఇంటావంటా ఎరుగని పేరు, ఇంద్రజిత్ అని  పెట్టాడు. తన ఆధునిక భావజాలానికి తానే  మురిసి పోయాడు. ఇంద్రజిత్ పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు వీరభద్రరావుకు జీవితానికి సరిపడా జ్ఞానోదయం అయింది. కళ్ళముందు పెరిగిన పిల్లాడు ఇంద్రజిత్ తన  స్నేహితులతో అంటుంటే అది ఆయన చెవిలో పడింది.  ‘మా నాన్నది అంతా ఉత్త చాదస్తం. చెబితే ఒక పట్టాన అర్ధం కాదు’ 



NOTE: Courtesy Image Owner   

10, సెప్టెంబర్ 2015, గురువారం

అనుబంధం – ఆత్మీయత


రామచంద్ర మూర్తికి కాలు నిలవడం లేదు. అమెరికానుంచి గోపీ పిల్లలూ వస్తున్నారన్న కబురు తెలిసినప్పటి నుంచి ఆకాశంలో తేలిపోతున్నట్టుగా వుంది. అప్పటికప్పుడు పెన్షన్ డబ్బులు బ్యాంకు నుంచి తీసి రెండో గదిలో ఏసీ పెట్టించాడు. పిల్లలకు సౌకర్యంగా వుండాలని బాత్ రూమ్ లో వెస్ట్రన్ టాయిలెట్ పెట్టించాడు. ప్రతి గదిలో దోమలు రాకుండా కిటికీలకి  మెష్ పెట్టించాడు. భార్య మహాలక్ష్మి అంటూనే వుంది, ‘వాడేమన్న పరాయి వాడా, ఇక్కడపుట్టి ఇక్కడ పెరిగి వెళ్ళిన వాడేనాయే. అంతా మీ చాదస్తం’ అని. కానీ రామచంద్రమూర్తి చెవిన పెట్టలేదు. ‘అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, పరాయి దేశంలో కొత్త సౌకర్యాలకు అలవాటు పడి వస్తే ఇబ్బంది లేకుండా చూడ్డం మన ధర్మం’ అని నచ్చచెప్పాడు. ఈ లోగా అమెరికా నుంచి వాళ్ళు వచ్చే రోజు దగ్గర పడింది. ఆయన హడావిడి మరింత పెరిగింది.
అక్కడ అమెరికాలో విమానం ఎక్కబోయేముందు గోపీ, భార్యాపిల్లలతో  మరోసారి చెబుతున్నాడు.
‘చూడండి మనం చాలా ఏళ్ళ తరువాత బామ్మా తాతయ్యల దగ్గరికి వెడుతున్నాం. అక్కడ అన్నీ ఇక్కడి మాదిరిగా వుండవు. ఎలా వున్నా మనందరం సర్దుకు పోవాలి. వున్న మూడు నాలుగు వారాలు మనకేం ఇబ్బంది లేనట్టు గడిపి రావాలి. అది వసతిగా లేదు, ఇది  లేదు  అని సణగొద్దు. ఇండియాలో టాయిలెట్లు మన మాదిరిగా వుండవు. అయినా సరే నాలుగు రోజులు సర్దుకు పోదాం. అంతేకాని బామ్మను తాతయ్యను ఇబ్బంది పెట్టవద్దు. మనం వచ్చామన్న సంతోషం వాళ్లకు కలిగించాలి. వున్నన్నాళ్ళు పూర్తిగా వాళ్ళతోనే గడపాలి. సినిమాలు, షికార్లు ఏవయినా  మళ్ళీ తిరిగి వచ్చిన తరువాతే సుమా!’    

9, సెప్టెంబర్ 2015, బుధవారం

మనసులోని రసం


ఈ పండు ఏమిటి?” అడిగాడు గురువు గారు
“నారింజ పండు” చెప్పాడు  శిష్యుడు
“ఈ పండును గట్టిగా పిండితే ఏం వస్తుంది?”
“నారింజ రసం”
“యాపిల్ రసం ఎందుకు రాదు?”
“వీల్లేదు”
“మరి ద్రాక్ష రసం”
“అయ్యే పనికాదు”
“ఈ పండుని గట్టిగా పిండితే ఏ రసం వస్తుందంటావు?”
శిష్యుడికి సహనం తగ్గిపోతోంది. కానీ అడుగుతున్నది గురువుగారాయె. విసుగును అణచి పెట్టుకుంటూ జవాబు చెప్పాడు.
“నారింజ పండును పిసికితే నారింజ రసమే వస్తుంది”
“అంటే ఏమిటి. నారింజ పండు కాబట్టి లోపల వుండేది నారింజ రసమే, కదా!”
శిష్యుడు ఔనన్నట్టు తలూపాడు.


“ఉదాహరణకు ఈ పండే నువ్వు అనుకుందాం. ఎవరో కావాలని నీ మీద ఒత్తిడి పెంచాడనుకుందాం. నీకు ఇష్టం లేని మాటలు చెబుతున్నాడని అనుకుందాం. నిష్కారణంగా నిన్ను వేధిస్తున్నాడని అనుకుందాం. అప్పుడేమి జరుగుతుంది. నీకు లోపలనుంచి కోపం తన్నుకు వస్తుంది. అంటే నీ లోపల ఉన్నది కోపం అన్నమాట. ఇలా నీ మనసు బాధ పెట్టేవాడు నీ శత్రువు కావచ్చు, నీ మిత్రుడు కావచ్చు, నీ దగ్గరి చుట్టం కావచ్చు. నీ భార్యాపిల్లలు కావచ్చు, అధికారులు కావచ్చు. ప్రభుత్వాలు కావచ్చు. కానీ వాళ్ళు చేసేది ఈ పండును పిండినట్టు నిన్ను పిండడమే. కానీ నీలోనుంచి బయటకు వచ్చేది మాత్రం కోపం,   చీకాకు, ఆందోళన,  ఒక్కోసారి భయం. దీనర్ధం ఏమిటంటే నీ మనసులో పేరుకుపోయి వున్నవి ఇవే. వీటి స్థానంలో ప్రేమ, ఆప్యాయతలు వుంటే అవే బయటకు వస్తాయి. జీవితంలో సాటివాడిని ప్రేమించడం నేర్చుకుంటే మనసులో కూడా ప్రేమే నిండి వుంటుంది. ఒత్తిళ్లకు గురయినప్పుడు అదే బయటకు వస్తుంది”

శిష్యుడికి గురువుగారి మాటల్లో పరమార్ధం బోధపడింది. (09-09-2015)

8, సెప్టెంబర్ 2015, మంగళవారం

కాళోజీ గర్వభంగం


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 13-09-2015, SUNDAY)

(కాళోజీ గర్వభంగం అనే పదాన్ని కాళోజీనే స్వయంగా తన ఆత్మకధలో వాడారు -సెప్టెంబరు తొమ్మిది ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని)


ఈ ఏడాది  కాళోజీ  నూట ఒకటో జయంతి. ఇకనుంచి ప్రతియేడూ కాళోజీ జయంతిని తెలంగాణా భాషా దినంగా పాటించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భాషా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. అధికారికంగా నిర్వహించే ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్ధులకు తెలంగాణా భాషపై చర్చా గోష్టులు మొదలయినవి నిర్వహించాలని చైనా పర్యటనకు బయలుదేరి వెళ్ళే ముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చివెళ్ళారు.
కాళోజీ నారాయణ రావు ‘ఇదీ నా గొడవ’ అనే పేరుతొ తన ఆత్మకధ రాసుకున్నారు. స్నేహసాహితి వారు ప్రచురించిన ఈ పుస్తకం 1995 సెప్టెంబరు నెలలో విడుదల అయింది. తెలుగు భాష గురించీ, తెలంగాణా యాస గురించీ ఆయనకున్న మక్కువను  ఆయన తన ఈ రచనలో వ్యక్తం చేసారు. అలాగే కొన్ని సందర్భాల్లో తనకు జరిగిన ‘గర్వ భంగాలను’ కూడా ఆయన చాలా హృద్యంగా ఆయన శైలి లోనే ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పాఠకుల కోసం కాళోజీ స్వయంగా రాసుకున్న ఆ జ్ఞాపకాల్లో కొన్ని కాళోజీ మాటల్లోనే  :
“కులాల్లో ఎన్నో తరతమ భేదాలు  పాటిస్తున్నాం. అది గ్రామ్యం,  ఇది గ్రాంధికం అంటూ భాషలో కూడా తేడాలు పాటిస్తున్నాం.
“భాషకి సంబంధించి రెండే రెండు. ఒకటి మాట రెండు రాత. అంటే ఉచ్చారణ, దస్తూరి. అదే ‘అ’ అదే ‘ఇ’,
అదే ‘ఉ’ అదే ‘క’, అదే ‘య’. అక్షరమైతే ఒకటే. ‘క’ అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తారు. ఎట్ట రాసినా అది ‘క’ అనే అంటం కాని ‘హ’ అని ఎవడూ అనుకోడు.
“దస్తూరి విషయంలో వుండే ఈ ఉదారత, సహృదయత  ఉచ్చారణ విషయంలో ఎందుకు లేవు ? ఏ ఇద్దరి దస్తూరి ఒక రకంగా వుండనట్టు ఏ ఇద్దరి ఉచ్చారణా ఒక రకంగా వుండది.  ఉచ్చారణ ఏ యాసలో వున్నా అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది  వుండకూడదు. మాండలికాలు లేని భాష చచ్చి వూరుకుంటది. మాండలికంలో తేడాలు, యాసలో వ్యత్యాసాలు వుండడమే భాషకి జీవ లక్షణాలు.
“‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అన్నను. అన్ని భాషలు నేర్చుకో కానీ నీ మాతృభాషని మాత్రం తప్పకుండా  నేర్చుకో. 
“రావిశాస్త్రి విశాఖ భాష, తెలుగు కాదని మేమూ, నల్గొండ వాళ్ళది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగు కాదని బెజవాడవాడు, బెజవాడ వానిది తెలుగే కాదని రాయలసీమ వాడు – ఇట్లా అనుకుంటపొతే మన మద్య సుహృద్భావం ఎట్టవస్తది. మనందరం తెలుగు వాండ్లం అనే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ – ఆత్మీయత ఏముంటది . ఒకని భాష విషయంలో, యాస విషయంలో తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బ తింటది. దానికి వెల  కట్టలేం.
“హైద్రాబాదు రేడియోలో బాలల కార్యక్రమం వచ్చేది.  ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిన (1956) నాటినుంచి  ఈనాటి (1985) దాకా అంటే దాదాపు ముప్పయ్ ఏండ్లపాటు బాలల కార్యక్రమాలు వందలు వేలు జరిగివుండాలె. వీటిల్లో తెలంగాణా పిల్లలు ఎందరు పాల్గొన్నరు. వాండ్ల వాడుక భాష ఏది. వాండ్లు కనబడరు. వాండ్ల భాష వినబడదు. బిరుదు రామరాజు పిల్లలు, పల్లా దుర్గయ్య పిల్లలు, సినారె పిల్లలు ఎన్నడయినా బాలానందంలో పాల్గొన్నరా. రేడియో అన్నయ్య, అక్కయ్యల పాటా, మాటా, యాసా ఏదీ తెలంగాణది కాదు.
“ప్రతి విషయంలో ఈ తేడాలు వుంటుంటే మరి మనమంతా కలిసి తెలుగోళ్ళమనుకుండేదెట్ట. ఆ భాష బాంధవ్యం కానీ, ఆ సామరస్యం కానీ ఎట్ట రావలె. ఏడనుంచి ఒస్తది. ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం” 
పొతే కాళోజీ తన ఆత్మ కధలో తన గర్వం అణిగిన సందర్భం ఒకటి ఉదహరించారు ఇలా.
“వరంగల్లు రాజరాజ నరేంద్ర గ్రంధాలయంల ఆంజనేయులు అనే ఒకవిద్యార్ది సాయంకాలాలు పనిచేసేటోడు. ఐదో ఆరో ఇచ్చేటిది. ఆ లైబ్రరీకి బెజవాడ నుంచి ఓ ఉత్తరం వచ్చిందట. పై కవరు మీద ఆంజనేయులు అడ్రెసు, లోపల మాత్రం రావి నారాయణరెడ్డి నాకు రాసిన ఉత్తరం. మరి సీ.ఐ.డీలు ఎట్ల పసికట్టిన్రో ఏమో, అది పట్టుకుని నన్నూ ఆంజనేయుల్నీ అరెస్టు చేసిన్రు. నన్నొక లాకప్ లోను, ఆంజనేయుల్ని మరో లాకప్ లోను పెట్టిన్రు.  ఆ లాకప్ లో నాతో పాటు ఓ దొమ్మరాయన వున్నడు. .....నేను సత్యాగ్రహిని. ఈ నేరస్థునితో సమానం చేస్తరా. నా ప్రిస్టేజికి భంగం వచ్చినట్టు అనిపించింది. దొమ్మరతని చెవిలో సగం కాలిన ఆకు చుట్ట వుంది. అది తీసి, కొరికి, అక్కడే ఉమ్మి వేసి నా వైపు చూస్తూ ‘అగ్గిపుల్ల ఉందా’ అని అడిగాడు. నేను చీదరించుకున్నట్టు ‘హట్! నన్నడుగుతవా’ అన్న. అతడు సెంట్రీ నడిగి చుట్ట ముట్టించుకుని నా ముంగిట కూర్చుని అడిగిండు నన్ను ఏ నేరంలో పోలీసులు పట్టుకొచ్చారని. రాజకీయ సత్యాగ్రహం, బాధ్యతాయుత ప్రభుత్వం ఇవన్నీ నేను  చెప్తె వానికేమి తెలస్తది.
“చూడండి మనిషి స్వభావం యెంత విచిత్రమో. కులమతాల పట్టింపులు లేనివాడిని. ఆర్య సమాజపు మనిషిని. ఇలాటోడిని లాకప్పులో తోటి మనిషి పట్ల ఇట్లుండడం.
“చోరీ చేస్తివా ?”
“ఎవుడి తలన్నా పగలగొట్టి వస్తివా ?”
“ఎవుడి పెళ్ళాన్నన్నా ఎత్తుకు వస్తివా ?”
ఇలా నేరాలన్నీ ఏకరువు పెట్టి అడుగుతున్నాడు.
“ఛీ ఛీ అంటూ అన్నిటికీ కాదు కాదనే చెబుతున్న. ఈ ప్రశ్నలన్నీ అయినంక ఒక నిమిషం ఆలోచించి ఒక్క ప్రశ్న వేసిండు. కాళోజీ గర్వభంగం అని చెప్పే నాలుగైదు సంఘటనల్లో ఇది మొదటిదన్న మాట.
అతనాలోచించి అడిగిన ప్రశ్న. ‘గాంధీ మహారాజ్ కిన్నీ, హుజూర్ నైజాంకీ లడాయ్ జరుగుతుందట. దాంటోగిన రాలేదు కద నువ్వు?’
“దొంగతనాలు, దోపిడీలు కాకుండా వేరే రకంగా ఓ పోరాటం జరుగుతున్నదనే ఒక పిక్చర్ అతని లోపల కట్టి వున్నదన్నమాట. దాంతో నేను విచిత్రపడిపోయి, దగ్గరకి జరిగి కౌగలించుకుని ‘అవున్నాయనా ఆ లడాయిలోనే వచ్చిన’ అని కళ్ళనీళ్ళు పెట్టుకున్న. నా జీవితంలో ఇది మరపురాని ఘట్టం’ అని కాళోజీ తన ఆత్మకధలో రాసుకున్నారు.
ఈ కాలంలో వచ్చే ఆత్మకధల్లో ఇలాటి నిజాయితీని ఊహించగలమా!  (08-09-2015)  
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595       
          

 NOTE: Courtesy Image Owner