20, ఆగస్టు 2015, గురువారం

తిరగరా తిరగరా తేరగా .....


తిరుగుబోతుల్ని తాగుబోతుల్ని ఓ గాటన కట్టడం న్యాయం కాదు. తిరుగుబోతుల్లో తాగుబోతులు వుండవచ్చు కాక.  కానీ వాళ్ళు చెప్పే విశేషాలు ఎంతో వింతగా వినడానికి విచిత్రంగా వుంటాయి. యెంత ఇంటికి అంటుకుపోయి వుండేవాళ్ళల్లో కూడా నాలుగు చోట్ల తిరిగిరావాలనే కోరిక అణగారి  వుంటుంది. ఆ కోరికే లేకపోతె మనకు అంత చక్కటి మనుచరిత్ర కావ్య రాజం దక్కేది కాదు. త్రికాల సంధ్యాదులతో ఇల్లు దాటి ఎరుగని ప్రవరాఖ్యుడిని ఆ కోరికే ఇంటి గడప దాటించి హిమాలయాల బాట పట్టించింది.


నిజానికి నేల నాలుగు చెరగులూ చుట్టి రావడం వల్ల మనసు విశాలం అవుతుంది. కొత్తవారితో పరిచయాలు అవుతాయి. కొత్త కొత్త విశేషాలు తెలుస్తాయి.  తెలుసుకోవాలనే కోరికే ప్రపంచ పర్యాటకాన్ని పెంచి పోషిస్తోంది. ఇలా కాళ్ళకు చక్రాలు కట్టుకుని ఊళ్లకు ఊళ్ళు, దేశాలు పట్టి తిరిగొచ్చిన తిరుగుబోతులు చెప్పిన వింతలూ విశేషాలే ఇవి.
సౌదీ అరేబియా దేశంలో మచ్చుకు ఒక్క నది కూడా లేదు.
అమెరికాలో ఏ నిమిషం లెక్క వేసినా అక్షరాలా అరవై వేలమంది దేశాలు చుట్టి రావడానికి విమానాల్లో ప్రయాణిస్తుంటారు.  
ఇండోనీసియాలో వున్న 127 పేలుతున్న అగ్ని పర్వతాలను దగ్గర నుంచి చూడడానికి ప్రాణాలకు తెగించి లక్షలాదిమంది పర్యాటకులు వెడుతుంటారు.
సింగపూరు దేశంలో కంటికి కనిపించనిదేమిటో తెలుసా. ట్రాక్టర్. అది వ్యవసాయిక దేశం కాకపోవడం వల్ల అక్కడ నాగలి పట్టిన రైతులు కనిపించరు.
మనవైపు పిల్లలకు మొనాకో అనగానే నోరూరుంచే బిస్కెట్లు గుర్తుకు రావచ్చు కాని మొనాకో అనేది చాలా చిన్న దేశం. యెంత చిన్నది అంటే అ దేశం మొత్తం విస్తీర్ణం  న్యూ యార్క్  సెంట్రల్ పార్కు కంటే కూడా తక్కువ.
లిబియాలో నూటికి తొంభయి తొమ్మిది శాతం ఎడారి భూములే.
మాల్దీవులు సముద్ర మట్టానికన్నా దిగువన ఉన్నందువల్ల భవిష్యత్తులో ఆ దీవులు ఏదో ఒక రోజు సముద్రంలో కలిసిపోతాయనే అనుమానాలు వున్నాయి.
నార్వే దేశం పూర్తిగా పర్యావరణ అనుకూలమైన విద్యుత్తును  ఉత్పత్తి చేస్తోంది. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో తొంభయ్ తొమ్మిది శాతం జల విద్యుత్తు కావడం గమనార్హం.
పొతే, హైతీ అనే దేశం దీనికి పూర్తిగావిరుద్ధం. అక్కడ ఒక్క చెట్టంటే ఒక్క చెట్టు కూడా లేదు.
నౌరా రిపబ్లిక్ ప్రజలు బాగా కలిగిన వాళ్ళు. ఇంట్లో వొంట్లో పుష్కలం అనే బాపతు. ప్రపంచంలోని స్తూల కాయులందరూ ఒక్క చోట చేరారా అన్నట్టుగా ఉంటుందా దేశం.
అమెరికాలోని జైళ్లలో లక్షలాదిమంది, ఒక లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో నాలుగో వంతుమంది, ఎంచక్కా అక్కడి జైళ్లలో కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటె ఆ దేశంలో  జైళ్ళు అంత వసతిగా బాగుంటాయి.
హవాయ్ భాషలో అతితక్కువగా పదమూడు అక్షరాలే వుంటాయి.
‘నా పేరు బుడుగు, అసలు పేరు చాలా పొడుగు’  అన్నట్టు బ్యాంకాక్ అసలు అధికారిక నామం చాలా చాలా పొడుగు. ఆ పేరులో ఏకంగా 169 అక్షరాలు వున్నాయి.
పాన్ అమెరికన్  అమెరికన్  జాతీయ రహదారి పొడవు  ముప్పయి వేల  మైళ్ళు.  పర్యాటకులు తమ జీవితాల్లో హెచ్చు భాగం ఆ రోడ్డుపైనే తిరుగుతూ గడుపుతుంటారు.
భారత దేశంలో లక్షా యాభయ్ వేల పోస్టాఫీసులు వున్నాయి.
ఫిన్లాండ్ లో లక్షా ఎనభయ్ వేల దీవులు వున్నాయి.
జపాన్ వాళ్ళ తెలివి తేటలే వేరు. గుండ్రంగా కాకుండా చదరపు ఆకారంలో వుంటే ఎక్కువ పుచ్చకాయల్ని సులభంగా నిలవచేయవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆ కాయల్ని చదరపు ఆకారంలో ఉండేలా పెంచుతున్నారు.
పలావు అనేది తినేది కాదు. పసిఫిక్ మహాసముద్రంలో ఓ చిన్న దీవి. ఆ దీవిలో వారిది వింత మనస్తత్వం. ఎవరయినా కోళ్ళని పెంచుకుంటారు, కుక్కల్ని పెంచుకుంటారు. కాని, ఆ దీవిలో వాళ్ళు వందల కొద్దీ షార్క్ చేపల్ని ముచ్చటపడి పెంచుతున్నారు.
కోస్టారికా యెంత శాంతి కాముక దేశం అంటే  ఆ దేశంలో సైన్యం అంటూ లేదు. అది అక్కడ  నిషిద్దం.
సాన్ మారినో దేశస్తులు కారు దిగి కాలు కింద పెట్టరు.  ఆ దేశంలో జనాభాకంటే కార్ల సంఖ్యే ఎక్కువ.
(20-08-2015)

NOTE: Courtesy Image Owner and also 50 traveling facts 

14, ఆగస్టు 2015, శుక్రవారం

లవణం గారు లేరు


ఈ రోజు బెజవాడలో కన్ను మూసిన ప్రముఖ నాస్తిక ప్రచారోద్యమ నాయకుడు లవణం గారితో నా పరిచయం వయస్సు నలభయ్ అయిదేళ్ళు. లవణం గారి నాన్నగారు గోరా గారి ద్వారా లవణం గారు పరిచయం అయ్యారు. గోరాగారు (గోపరాజు రామచంద్ర రావు గారు) నాస్తికులు. దేవుడ్ని నమ్మేవారు కాదు. దేవుడ్ని గురించి ప్రస్తావన వస్తే ‘దేవుడు లేదు’ అనేవారు. ‘నేను దేవుడ్నే నమ్మను, ఇక ఆయన ఆడో మగో నాకేమిటి నిమిత్తం’ అని వాదించేవారు.

1975 నాటి మాట. బెజవాడ ఆంధ్ర జ్యోతిలో పనిచేస్తున్నరోజులు. అప్పటికే హైదరాబాదుకు మకాం మార్చిన ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారికి ఓ ఆలోచన వచ్చి బెజవాడలో అసిస్టెంట్ ఎడిటర్ గా వున్న నండూరి రామమోహన రావు గారిని సంప్రదించారు. అనుదినం జరిగే సంఘటనలపై స్పందించి నాలుగు లైన్లలో హస్యస్పోరకంగా వుండే గేయాన్ని రాయించాలని వారి ఉద్దేశ్యం. రాయగలరా అని అడక్కుండా రాయండి అనేసారు రామ్మోహన రావు గారు నాతొ. ఆవిధంగా మొదలయ్యాయి ఆంద్ర జ్యోతి దినపత్రికలో ఎడిట్ పేజీలో కార్టూన్లవంటి నా వాక్టూన్లు. చిత్రకారుడు రమణ గారు ఓ చిన్న చిత్రాన్ని దానికి జోడించేవారు.
ఆరోజుల్లో గోరాగారి కూరగాయల ఉద్యమం మొదలయింది. బెజవాడ గవర్నర్ పేటలోని రాఘవయ్య పార్కులో కార్యక్రమం. వ్యవసాయ శాఖ మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిధి. పూలదండల బదులు కూరగాయల దండలు వేయాలనేది గోరాగారి ఉద్యమం. కూరగాయలు పెంచితే ప్రజలకు ఉపయోగం అనేది ఆయన సిద్దాంతం. సరే సభ మొదలయింది. కూరగాయలతో చేసిన దండలు వేసారు, పుష్ప గుచ్చాల బదులు కాలీ ఫ్లవర్, క్యాబేజీలతో రూపొందించిన గుచ్చాలు అందించారు. సుబ్బారెడ్డి గారు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే రకం. మనసులో  దాచుకుండే మనిషి కాదు. అయన  మాట్లాడుతూ, గోరాగారి ఉద్దేశ్యం మంచిదే  అయినా మనిషి మానసిక ఆనందానికి పూలతోటలు కూడా అవసరమన్నారు. పూల చెట్లు పీకి వాటి స్థానంలో కూరగాయల మొక్కలు పెంచేబదులు, కాలువగట్ల మీద, వృధాగా వున్న ప్రాంతాలలో  కూరగాయల పాదులు వేస్తె నలుగురుకీ ఉపయోగం అన్నట్టు ప్రసంగించారు. ఆ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని నేను వాక్టూన్ రాసాను. అదే ఇది.
కాయ 'గోరా'లు
“కూరగాయలు పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని, మా శ్రీవారా
రోజంతా పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా!”
గోరాగారి గురించి రాసింది లవణం గారికి నచ్చినట్టు లేదు. మర్నాడు ఆ పేపరు పట్టుకుని రామ్మోహన రావు గారిని కలుసుకుని ‘ఇదేమన్నా బాగుందా’ అని అడిగారు. రామ్మోహన రావు గారు సీరియస్ గా పైకి కనిపించినా హాస్య ప్రియులు.
‘జోకుని జోక్కా తీసుకోవాలండీ లేకపోతె మేకులా గుచ్చుకుంటుంది. కార్టూన్ చూసి నవ్వు కున్నట్టే శ్రీనివాసరావు వాక్టూన్ చదివి నవ్వుకోండి. ఓ పనయి పోతుంది’
ఇదీ ఆయన జవాబు.
వాక్తూన్ సంగతి ఏమోకానీ, లవణం గారితో నా పరిచయం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ నడుమ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏదో  కార్యక్రమానికి వెడితే కలిసారు. ఓ ఫోటో కూడా దిగాము. ఆంద్ర భూమి ఫోటోగ్రాఫర్ అనుకుంటాను. ప్రస్తుతం అయితే నా దగ్గర లేదు.
(14-08-2015)



వాదాలతో, వాయిదాలతో ముగిసిపోయిన పార్లమెంటు సమావేశాలు


పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసాయి. ఈ సమావేశాలు జరిగిన వ్యవధానం కంటే వాయిదాల సమయమే ఎక్కువనే రీతిలో పదేపదే వాయిదాలు పడుతూ చివరికి  గురువారం నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి.


కొత్త కోడలు కాపురం చేసే కళ కాలి మెట్టెలు చూసే చెప్పొచ్చన్నట్టు ఈ సమావేశాలు ఇలానే జరుగుతాయని మొదటి రోజునే బోధపడింది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులను, ఒక కేంద్ర మంత్రిని తొలగించాలని ప్రతిపక్ష హోదా సయితం లేని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ డిమాండుతో సమావేశాలకు అంకురార్పణ జరిగింది. అంతవరకు సభను సాగనిచ్చేది లేదన్న వాదనతో వాదోపవాదాలను మరింత సాగతీసింది. ‘అల్లా ఎల్లా కుదురుతుంది కుదరదు కాక  కుదరదు’ అంటూ గతంలో ప్రతిపక్షంలో వుండగా ఇలానే సభను అడ్డుకున్న బీజేపీ, గతాన్ని హాయిగా  మరచిపోయి  మొండికేసింది. ‘ముందు రాజీనామాలు, తరువాతే చర్చ’ అని కాంగ్రెస్ ఓ పక్కా, ‘ముందు చర్చ ఆ తరువాతే సమాధానాలయినా ఇంకేదయినా’ అంటూ పాలకపక్షం, తమదయిన పాత్రలను తమదయిన బాణీల్లో పాత్రోచితంగా అవధులు మీరి మరీ పోషించాయి. ‘కోడి ముందా గుడ్డు ముందా’ అనే రీతిలో సాగిన ఈ వివాదానికి తెర పడే అవకాశాలు ఎటూ లేవు కాబట్టి పార్లమెంటు విలువయిన సమావేశాల సమయమంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. పరిస్తితి ఈ విధంగా గాడి తప్పడానికి ‘మీరు కారణం అంటే మీరు కారణం’ అని ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్నారు తప్పిస్తే,  ఏఒక్కరూ, ‘ఉమ్మడిగా మనం కారణం’ అనుకోలేదు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏ దిశగా సాగుతున్నదో అర్ధం చేసుకోవడానికి ఇదొక్కటి చాలు.
చట్టసభలు సజావుగా నడవాలంటే  పాలక పక్షం ముందు బాధ్యత తీసుకోవాలి. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి. ఈ పవిత్ర కర్తవ్య నిర్వహణలో పాలక ప్రతిపక్షాల వైఫల్యమే, బాధ్యతారాహిత్యమే  పార్లమెంటు సమావేశాలు ఇలా నిరర్ధకంగా ముగియడానికి ప్రధాన కారణం. ఈ విషయం నిర్ధారించడానికి పార్లమెంటరీ నియమ నిబంధలని అపోసన పట్టక్కరలేదు. బజారున పోయే ఏ సామాన్యుడిని అడిగినా ఇదే చెబుతాడు.
నిజానికి సభ సజావుగా నడవకపోతే ప్రతిపక్షానికే  నష్టం. పాలకపక్షానికి ఒకరకంగా వెసులుబాటు. సభ జరిగేలా చూసుకుంటే పాలక పక్షం తప్పొప్పులను ఎత్తి చూపి నిలదీయడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభిస్తుంది. సభ జరక్కపోతే ఏదో అప్పటికి ‘మమ’ అనిపించి పాలక పక్షం బయటపడొచ్చు. అయితే సభను అడ్డుకోవడం ద్వారా లభించే ప్రచార లాభం రాజకీయ పార్టీలను మరోరకంగా ఆలోచింపచేస్తున్నాయి. అందుకే ఇన్ని గడబిడలు. ఇన్ని శషభిషలు.      
ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఒక పార్టీని ఓడించి మరో పార్టీకి పట్టం కడుతున్నారు అంటే ఏమిటి అర్ధం. పాత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి, కొత్తగా వచ్చే ప్రభుత్వం అయినా కొత్త బాటలో నడవక పోతుందా అనే ఆశతో.
నిరుడు జరిగిన లోక సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అక్కున చేర్చుకుని అంతటి స్థాయిలో ఆదరించడానికి దోహదం చేసిన అంశాల్లో ఇదొకటి. ‘మార్పు’ కోరి వారు మోడీకి  ఓటు వేసారు. ఎన్నికలకు ముందు మోడీ కానీ, ఆయన నేతృత్వం వహించిన ఎన్డీయే కూటమి కానీ ప్రజలకు కొత్తగా చేసిన పెద్ద పెద్ద వాగ్దానాలు కూడా ఏమీ లేవు. యేవో కొన్ని నామకర్ధం చేసినా వాటిపై సామాన్యులు పెట్టుకున్న ఆశలు పెద్దగా లేవనే చెప్పాలి.  ప్రజలు మోడీకి పట్టం కట్టింది ఆయన ఏదో మార్పు తీసుకువస్తాడనే ఆశతోనే. ప్రధాని పీఠం ఎక్కిన కొత్తల్లో ఆయన ప్రదర్శించిన వ్యవహార శైలి, చెప్పిన మాటలు, చేసిన ప్రకటనలు ఈ ఆశలకు కొత్త ఊపిరిలూదాయి.
అయితే మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో అధికార పక్షం అటు సభలో, వెలుపలా గతాన్ని మరచి వ్యవహరించిన తీరు, సమర్ధించుకున్న విధానం ప్రజలు మోడీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లాయి. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు, ‘గతంలో మీరు అధికారంలో వున్నప్పుడు మీ నిర్వాకం ఏమిటి’ అని ఎదురు ప్రశ్నించడం,  ‘మార్పు’ తెస్తామన్న సర్కారుకు శోభస్కరం కాదు. తప్పులు చేసారు కనుకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించి బీజేపీని గద్దె ఎక్కించారు. ‘తప్పులు చేస్తూ ఆ తప్పులు  మీరూ చేసినవే కదా’ అని సమర్ధించుకుంటే ఇక వారికీ వీరికీ తేడా ఎక్కడ?
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే – నిరుటి ఎన్నికల తరువాత ఆ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఒకప్పుడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీకి లోకసభలో ప్రధాన ప్రతిపక్షం హోదాకు సరిపడనంతగా అతి తక్కువ స్థానాలు కట్టబెట్టి ఓటర్లు ఆ పార్టీపై తమ కసి ప్రదర్శించారు. ఆ స్థాయిలో పరాజయం మూటగట్టుకున్న పార్టీ నేతల నోళ్ళు చాలా రోజులు మూగనోము పట్టాయి. కానీ ఆ నోళ్ళు మళ్ళీ పెగలడానికి కారణం కాంగ్రెస్  పార్టీ నాయకత్వం ప్రతిభ ఎంతమాత్రం కాదు. ఈ పుణ్యమో, పాపమో ఆ చలవ పూర్తిగా మోడీ ప్రభుత్వానిదే. ఇందుకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి రుణపడివుండాలి.
మోడీ ప్రభుత్వం నిరుడు కేంద్రంలో కొలువు తీరినప్పుడు ఆ ప్రభుత్వం మీద ఇంత  త్వరగా అవినీతి  ఆరోపణలు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు ఆ అవినీతి లెక్కకట్టలేనంత స్థాయిలో మోడీ హయాములో జరిగిందని ఎవ్వరూ అనుకోవడం లేదు. గతంతో పోలిస్తే ఇదేమంత లెక్కలోది కాకపోవచ్చు. కానీ ఇక్కడ అధికార కేంద్రంలో వున్నది మోడీ. ‘మార్పు తెచ్చి తమ తలరాతల్ని మారుస్తాడ’ని ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్న నరేంద్ర మోడీ హయాములో, చాయ్ వాలా నుంచి ప్రధాని హోదాకు ఎదిగిన అతి సామాన్య నాయకుడి పరిపాలనలో ఏ తప్పు జరిగినా దానికి  చిన్నా పెద్దా తేడా ఉండరాదనే నలుగురూ కోరుకుంటారు.  త్రేతాయుగంలో  శ్రీరాముడి పాలనతో పోల్చిచూసుకుని అంచనాలకు వస్తారు. మంచి పేరు తెచ్చుకోవడం ఎల్లవేళలా మంచిదే. కానీ ఏమాత్రం తభావతు వచ్చినా ఆ మంచి పేరు మంచులా కరిగిపోయే ప్రమాదం పొంచుకునే వుంటుంది. ప్రస్తుతం మోడీని చూసేవారు ఇటువంటి కళ్ళతోనే గమనిస్తున్నారు. జరిగింది చిన్నదో పెద్దదో తప్పు తప్పే అని ఒప్పుకుని, గతంలో తాము ప్రవర్తించిన తీరు కూడా సరయినది కాదని  లోకసభ సాక్షిగా హుందాగా ఒప్పుకుని వుంటే, ‘దాసుడి తప్పులు దండంతో సరి’ అన్న చందంగా కధ సుఖాంతం అయ్యేది. పాలకపక్షానికి అనవసర సమర్ధింపుల హైరానా తప్పేది. ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు మనకు అలాటి రాజనీతిజ్ఞులు యేరీ! అందరూ రాజకీయ నాయకులే.  
పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత రాజకీయ ప్రయోజనమో, లేదా మీడియా ప్రచారమో సంపాదించుకుని ఉండవచ్చు. కానీ అంశం ఎలాటిదయినా, అందులోని తీవ్రత ఎంతటిదయినా సాక్షాత్తు ఆ పార్టీ అధినేత్రే లోకసభ వెల్ లోకి ప్రవేశించి నిరసన తెలపడం ఆవిడ స్థాయికి తగింది కాదు. గతంలో ఇదేమాదిరిగా సభను అడ్డుకుకున్న బీజేపీ తీరును గుర్తుచేసి, ఆ పార్టీ గతాన్ని ఎండగట్టడంవరకు పరిమితమై, సభను నడపడంలో సహకరించి వుంటే కాంగ్రెస్ లోని ‘మార్పును’ ప్రజలు గమనించేవారు. ఈ విధంగా హుందాగా ప్రవర్తించకపోవడం ద్వారా,  మీడియా ప్రచారాన్ని మించిన ప్రజాదరాన్ని బీజేపీ, కాంగ్రెస్ రెండూ దారుణంగా కోల్పోయాయి.
పార్లమెంటు సమావేశాలకు అయ్యే ఖర్చు నిమిషానికి రెండున్నర లక్షలు, రోజుకు ఆరుకోట్లు, నూరు రోజులకు వెరసి అక్షరాలా ఆరువందల కోట్లు అంటూ గణాంకాలు చెబుతున్నారు. మరి సభ జరక్కుండా చేసి ఎదుటివారి మీద నిందలు మోపుతున్న ఈ రాజకీయ పార్టీలు ఇంతటి ఖర్చుకు యేమని సమాధానం చెబుతాయి. ఆయా పార్టీలనుంచి ఈ ప్రజాధనాన్ని తిరిగి వసూలు చేసే రాజ్యాంగ సవరణ చేయాలని ఎవరయినా కోరుకుంటే తప్పేమిటి?           

సమావేశాలు ముగిసిన తరువాత, బీజేపీ, కాంగ్రెస్ తరహా చూస్తుంటే ఈ అంశాలపై రెండు పార్టీల నడుమ ఈ పోరు ముందు ముందు కూడా కొనసాగేటట్టు వుంది. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో బీజేపీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు నెల రోజుల పాటు విస్తృతంగా తిరిగి కాంగ్రెస్ తీరును ఎండగట్టాలనీ, ప్రజలకు వాస్తవాలు వివరించాలనీ ప్రధాని మోడీ తమ పార్టీ వారితో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గకపోవచ్చు. అయితే ఒకటే ఊరట. పార్లమెంటును స్తంభింపచేస్తే  ప్రభుత్వ ఖజానాకు, ప్రజాధనానికి చేటు. ఇక ఆ పార్టీలు బయట మాట్లాడుకున్నా,  పోట్లాడుకున్నా అది వాటి తలనొప్పే. ప్రజలమీద భారం పడదు.
పొతే, పార్లమెంటు సమావేశాల తీరుతెన్నులపై సామాన్యుడి మనసులోని మాటను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతి నుద్దేశించి ఆకాశవాణి, దూరదర్సన్ ల ద్వారా ప్రజలకు ఇచ్చిన సందేశంలో బయట పెట్టారు. భారత ప్రజాస్వామ్య వృక్షపు వేర్లు బలంగా ఉన్నప్పటికీ ఆకులు వాడిపోతున్నాయనీ, కొత్త చిగుళ్ళు వేయాల్సిన అవసరం వుందని అన్నారు. ప్రజాస్వామ్య వేదికలు ఒత్తిళ్లకు గురవుతున్నాయని చర్చావేదికగా ఉండాల్సిన పార్లమెంటు యుద్ధ క్షేత్రంగా మారిపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంలో  రాజకీయ పార్టీలు పునః పరిశీలన  చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి హెచ్చరించారు. సామాన్యుడి మాటను రాజకీయ నాయకులు ఎటూ చెవిన పెట్టరు. దేశ రాజకీయాల్లో తలపండిన పెద్దమనిషి, అనేక (రాజకీయ) యుద్దముల ఆరితేరినవాడు అయిన ప్రణబ్ కుమార్ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో ఇచ్చిన సలహా అయినా కనీసం చెవికెక్కించుకుంటారేమో చూడాలి.     
(14-08-2015)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com  మొబైల్:  9849130595

NOTE: Courtesy Image Owner       

ఖమ్మం బాబా ఇక లేరు



ఖమ్మం పొలిమేరల్లో వున్న శ్రీ సాయిబాబా ఆశ్రమంలో సాయిబాబాగా  భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ బాబా, మా బాబాయి చిన్న అల్లుడు. మధురక్కయ్య మొగుడు. విశేషం  ఏమిటంటే ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత కూడా మా అక్కయ్య ఆశ్రమంలోనే వుంటూ ఆయనకు సేవలు చేస్తోంది.  ఖమ్మంలోని మా మేనకోడలు విమల ఇంటికి భిక్షకు వచ్చినప్పుడు మా  మేనల్లుడు దుర్గాప్రసాద్ ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో  పోస్ట్ చేసాడు.
పూర్వాశ్రమంలో మా బావగారు  శ్రీ యోగానంద కృష్ణమూర్తి, బెజవాడ ఎస్సారార్ కాలేజీలో మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారికి డిగ్రీలో సహాధ్యాయి.   హైదరాబాదులో చాలాకాలం పోలీసు అధికారిగా పనిచేశారు. పాఠకుల్లో కొంత మందికి గుర్తు వుండి వుంటుంది. యాభై అరవై ఏళ్ళ కిందటి ముచ్చట.   రైల్లో ఒకర్ని హత్యచేసి శవాన్ని ముక్కలు గా కత్తిరించి ఆ మూటని రైల్లోంచి విసిరి వేసిన కేసు. షర్టుపై వున్న చాకలి గుర్తు ఆధారంగా మా బావగారు ఆ కేసును పరిశోధించి హంతకుడయిన ఒక డాక్టర్ ని అరెస్టు చేశారు. మంచి దక్షత కలిగిన అధికారిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు.



వారి ఆత్మకు శాంతి చేకూరాలి.

12, ఆగస్టు 2015, బుధవారం

ఎంచుకున్నవారికి ఎంచుకున్నంత


అనగనగా ఓ రాజకీయ నాయకుడు. చేసిన పాపాలు పండి ఓ రోజు చెప్పాపెట్టకుండా బాల్చీ తన్నేసాడు. యమభటులు వచ్చి ఆయన్ని పట్టుకుపోయారు. వాస్తు  నమ్మకం పైలోకాల వాళ్ళకీ  పట్టుకున్నదేమో తెలవదు కానీ, పైన నరకలోకానికీ , స్వర్గానికీ కలిపి ఒకే ప్రవేశద్వారం వుంది. మన రాజకీయ నాయకుడు (మ.రా.నా) అలవాటు చొప్పున తలుపు తోసుకుని లోపలకు వెళ్ళబోతే ద్వారపాలకుడు ఆపాడు. ఆపి చెప్పాడు. ‘ఇక్కడ  కొన్ని విధివిధానాలు మీలాగే మాకూ వున్నాయి. మీరు పాటించరు. మేము పాటిస్తాము తు.చ.తప్పకుండా. అంతే తేడా. ఇక్కడికి వచ్చిన ప్రతివారూ ఒక రోజు నరకంలో, మరురోజు స్వర్గంలో గడపాలి. ఏది మీకు బాగా నచ్చితే అక్కడే మీరు శాస్వితంగా వుండిపోవచ్చు.  అక్కడే మీకు  ఆదార్ కార్డు, ఓటరు కార్డు, ఫోటో గుర్తింపు కార్డు గట్రా ఏ ఇబ్బందీ పెట్టకుండా  ఇచ్చేస్తారు’.
ఇదేదో బాగానే వుందే అనుకున్నాడు మ.రా.నా.


సరే! అక్కడి నియమాల ప్రకారం మ.రా.నా.ను ముందు నరకానికి తీసుకు వెళ్ళారు. బతికున్నప్పుడు జనాలకు నరకం చూపించిన మ.రా.నా. అసలు నరకాన్ని చూసి మూర్చపోయాడు. అది సినిమాల్లో చూపే నరకంలా లేదు. స్వర్గానికి తాతలా వుంది. ఎక్కడ చూసినా తివాచీలు పరిచినట్టు పచ్చటి  మైదానాలు, స్వచ్చమైన నీళ్ళు పారుతున్న సెలయేళ్ళు. సినిమా తారల చెక్కిళ్ళ వంటి నునుపైన తారు రోడ్లు. రంభా ఊర్వశులను తలదన్నే అందాల భామలు తమ నృత్యాలతో అక్కడివారిని ఆహ్లాదపరుస్తున్నారు. తాగేవారికి తాగినంత తాగిస్తున్నారు. తినే వారికి తిన్నంత పెడుతున్నారు. ఇది నిజంగా నరకమా లేక తాను వీ.వీ.ఐ.పీ.అని గుర్తించి ఇలా మర్యాదలు చేస్తున్నారా అనేది తెలియక మ.రా.నా. అయోమయంలో పడిపోయాడు. అయితే ఈలోపల ఆయనకు రాజకీయాల్లో పాత సహచరులు కొందరు అక్కడ తారసపడ్డారు. వారు చేసిన ఘోరాలకు తానే  ప్రత్యక్ష సాక్షి కాబట్టి, వాళ్ళూ అక్కడే వున్నారు కాబట్టి  ఖచ్చితంగా అది నరకమే అయి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చాడు మ.రా.నా. తాను నక్కతోక తొక్కి నరకానికి వచ్చాడు. జనాలకు ఇన్నాళ్ళు అరచేతిలో స్వర్గం చూపించిన అనుభవం వుంది కాబట్టి తనకు నరకంలో స్వర్గ మర్యాదలు చేస్తున్నారని అనుకున్నాడు. ఏదయితేనేం, ‘ఈ ఒక్కరోజు ఇలా హాయిగా నరకంలో గడిపేసి అసలు స్వర్గానికి వెళ్ళిపోతే పోలా’ అని కూడా అనుకున్నాడు.
మొత్తం మీద నరకంలో స్వర్గసుఖాలు అనుభవించిన మ.రా.నా.ను మరునాడు స్వర్గానికి తీసుకుపోయారు. నరకమే స్వర్గం మాదిరిగా వుంటే ఇక స్వర్గం మాట చెప్పాలా! ఎక్కడ చూసినా దేవకన్యలసేవల్లో మునిగితేలే స్వర్లోకవాసులే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఒక్కడూ తెలిసిన వాడు లేడు. ఎలా వుంటారు, వాళ్ళంతా కొద్దో గొప్పో పుణ్యం చేసి చచ్చి వచ్చినవాళ్ళా యే! దాంతో, తెలిసిన మొఖం ఒక్కటీ కనిపించక  మ.రా.నా. అక్కడ ఒంటరివాడయిపోయాడు.
స్వర్గమా నరకమా తేల్చుకోవాల్సిన సమయం మర్నాడు ఆసన్నమయింది. సుఖాలు, భోగాల విషయంలో స్వర్గానికి నరకానికీ ఏ తేడా లేనప్పుడు ఒంటరిగా స్వర్గంలో ఎందుకు ? నరకంలోనే తెలిసిన నలుగురితో గడుపుదామని నిర్ణయించుకుని అదే విషయం చెప్పాడు. ‘ఇష్టం వచ్చినప్పుడు ఇష్టారాజ్యంగా పార్టీలు మారడం కాదిది. ఒక్కసారి నిర్ణయించుకుంటే అదే ఫైనల్ అన్నారు అక్కడి వాళ్ళు. ‘ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు’ అంటూ ధీమాగా మాట్లాడిన మ.రా.నా. ను మళ్ళీ నరకంలోకే తీసుకువెళ్ళారు. దాన్ని చూస్తూనే మ.రా.నా.కు మూర్చవచ్చినంత పనయింది. ఒక్కరాత్రిలో  నరకం తీరుతెన్నులు  పూర్తిగా మారిపోయాయి. నిన్న కనిపించిన నున్నటి రోడ్లు, పచ్చటి పచ్చిక మైదానాలు అన్నీ మంత్రం వేసినట్టు మాయమైపోయాయి. ఇప్పుడన్నీ గతుకుల రోడ్లు, నెర్రెలు వేసిన పంట పొలాలు. అర్ధాకలితో అడుక్కుంటున్న నరక వాసులు. పూరిళ్ళు. ఎండిపోయిన సెలయేళ్ళు, గుక్కెడు నీటి కోసం కడవలతో వెడుతున్న ఆడవాళ్ళు. ఇదేమిటి?
ఏవి తల్లీ ‘నిన్న’ కురిసిన హిమసమూహాలు!
అదే అడిగాడు తనని తెచ్చిన వాళ్ళని. వారు చెప్పిన సమాధానం విని మరోసారి మూర్చపోయాడు మ.రా.నా.
‘నిన్న నువ్వు  చూసింది మా దగ్గర జరుగుతున్నఎన్నికల ప్రచారాన్ని. మాకు ఓటు కూడా వేసి నరకాన్నే ఎంచుకున్నావు. ఆ విషయం మరచిపోవద్దు. కోరి కోరి ఎంచుకున్నందుకు ఫలితం అనుభవించక తప్పదు. రాజకీయాల్లో తలపండిన వాడివి. ఈ విషయం వేరే చెప్పాలా!’
NOTE: Courtesy Image Owner

              

సబ్సిడీలు సంపన్నులకా ? ఆపన్నులకా?

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 13-08-2015, THURSDAY)

"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అలా  పోగుపడే బియ్యాన్ని సేకరించండి. మీ పేటలోని ఏ ఆలయంలోనైనా  ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకు, ఇతర  అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది " – కీర్తిశేషులు కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఒకనాటి అనుగ్రహభాషణ
‘మీరు సంపన్నులు. ప్రభుత్వం వంట గ్యాసు సిలిండర్ పై ఇచ్చే సబ్సిడీ మీకు అవసరంలేదు. అయితే  దేశంలో అందరూ సంపన్నులు కారు. కట్టెల పొయ్యి ముందు కూర్చుని, పొగచూరిన కళ్ళతో ఇంటిల్లిపాదికీ వంట చేసిపెట్టే పేద తల్లులకు ఈ దేశంలో కరువు లేదు. వారి కష్టాలు తీర్చాలంటే మీరు కొంత త్యాగం చేయండి. సబ్సిడీ ఒదులుకోండి. దానితో ఓ పేద కుటుంబంబానికి వంటగ్యాసు సదుపాయం లభిస్తుంది. దయచేసి ఈ పుణ్యం కట్టుకోండి’- కొన్ని మాసాలక్రితం ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి.    
ఇదే మోడీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా ఆయన పనితీరు తెలిసిన వాళ్లకి,  ప్రధాని ఇచ్చిన ఈ  పిలుపుకు వస్తున్న స్పందన అంతంత మాత్రంగా వుండడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ రోజుల్లో మోడీ వ్యవహారశైలి విభిన్నంగా వుండేది. తెలుగు తెలియని గుజరాత్  మిత్రుడు ఒకరు, మోడీ ముఖ్యమంత్రిగా వున్న  రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు.
“మోడీని  గుజరాత్ సీతయ్య అనొచ్చు.   కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.
ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రంలో చిన్నపిల్లల్ని స్కూళ్లకు పంపేలా వారి తలితండ్రులను ప్రోత్సహించడం యెలా అన్న ఆలోచన వచ్చిందనుకోండి. వెంటనే సంబంధిత అధికారుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ల అభిప్రాయాలను సావధానంగా వింటారు. తమ మనసులో మాట స్వేచ్చగా, ధైర్యంగా చెప్పేలా అధికారులను ప్రోత్సహిస్తారు. మధ్యలో భోజన సమయం అయితే పదిహేను నిమిషాల్లో ఆపని ముగించుకుని మళ్ళీ  మీటింగుకు హాజరు. అందరూ చెప్పింది జాగ్రత్తగా విని తాను ఒక అభిప్రాయానికి వచ్చి ఏం చేయాలో ఆ ఆదేశాలు జారీచేస్తారు. ఆ తరహా చూసిన వారికి ఒక మిలిటరీ అధికారి తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసే విధానం గుర్తుకు రాకమానదు. ఇక అప్పటినుంచి ఆ కార్యక్రమం  పురోగతి గురించి వెంట వెంటనే సమీక్షా సమావేశాలు. ఎప్పటికప్పుడు పరిస్తితిని బేరీజు వేసుకుని తదుపరి ఆదేశాలు. వేసవి సెలవుల్లో మండుటెండలను లెక్కపెట్టకుండా అధికారులను వెంటేసుకుని ఒక నెలంతా పల్లెల్లో పర్యటించి పిల్లల చదువు ప్రాధాన్యతను గురించి ప్రతి ఒక్కరికీ వివరించే ప్రయత్నం మరోపక్క. ఫలితం గురించి చెప్పే పని ఏముంటుంది. రెండేళ్లలో స్కూళ్ళల్లో చేరే పిల్లల సంఖ్య  ఇరవయ్యారు శాతం నుంచి నూటికి  నూరు శాతానికి పెరిగిపోయింది. 
దటీజ్ మోడీ మోటివేషన్ పవర్.”
అయితే అదంతా గతం. ఆయన  గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా అలా వుండేది ఆయన తీరు.
ప్రధాని పీఠం ఎక్కిన కొత్తల్లో నేల నాలుగు చెరగులకు కాంతులు వెదజల్లిన  మోడీ ప్రభలు గత కొంత కాలంగా  మసక బారుతున్నట్టుగా అనిపిస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ‘గివ్ ఇట్ అప్’ అంటూ గ్యాస్ సబ్సిడీ ఒదులుకోమని మోడీ ఇచ్చిన పిలుపుకు ప్రజలనుంచి లభిస్తున్న అంతంత మాత్రపు స్పందన.

ప్రధానమంత్రి స్థాయి కలిగిన వ్యక్తి చేసిన విజ్ఞప్తి కాబట్టి కొందరు బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి సబ్సిడీ ఒదులుకుంటున్నట్టు  భారీ ప్రకటనలు చేసారు. అంతే  కాకుండా తమ సంస్థల్లో పనిచేసే సిబ్బందిని  కూడా ఈ సదుపాయం వదులుకోవాల్సిందని కోరారు. ఆయా సంస్థలు జారీ చేసిన పత్రికా ప్రకటనలు గమనిస్తే వారి పిలుపుల పట్ల ఉద్యోగుల  స్పందన బాగానే  వున్నట్టు కానవస్తోంది. కానీ మోడీ మంత్రివర్గంలో పనిచేసే మంత్రులలో ఎవరో కొందరి పేర్లు ఈ ‘త్యాగరాజుల’  జాబితాలో వున్నాయి తప్పిస్తే యావత్ మంత్రిమండలి మోడీ పిలుపుకు సానుకూలంగా స్పందించి సబ్సిడీ వదులుకున్న దాఖలా అధికారిక ప్రకటనల్లో ఎక్కడా లేదు. ఒకవేళ సబ్సిడీ వదులుకుని కూడా ఆ విషయం బహిరంగ పరచడంలో వైఫల్యం చెందివుంటే అది మరో వైఫల్యం కిందికే వస్తుంది.
దేశ వ్యాప్తంగా పదిహేను కోట్ల ముప్పయి లక్షలమంది వంట గ్యాసు వినియోగదారులు వున్నారని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రధాని పిలుపుకు స్పందించి ఇప్పటివరకు సబ్సిడీ వదులుకున్న వారి సంఖ్య పద్నాలుగు లక్షలు దాటలేదు. అంటే ఈ గివ్ ఇట్ అప్ అనే పధకం ఏరకంగా నీరుకారిపోతున్నదో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా సామాన్యుల్లో కలిగే సందేహం ఒక్కటే.  ప్రధాని మోడీ ఇలా చేసివుంటే బాగుండు అని కోరుకునేది కూడా ఒక్కటే.
ఏ త్యాగమైనా ఇంటి నుంచి మొదలు కావాలంటారు. అందుకే దాన్ని ముందు పార్లమెంటు నుంచి మొదలుపెట్టాలి. పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు వచ్చే జీతభత్యాల విషయం రహస్యమేమీ కాదు. 'దేశం మొత్తంలో అత్యంత చౌక ధరలకు అత్యంత నాణ్యమైన ఆహార పదార్ధాలు ఎక్కడ దొరుకుతాయి అంటే పార్లమెంటు క్యాంటీనులో మాత్రమే'   అని జవాబు వచ్చేలా అనేక కధనాలు సాంఘిక మాధ్యమాల్లో  నిత్యం సంచారం చేస్తున్నాయి. ఆ  క్యాంటీనులో  వాడుతున్న గ్యాస్ సిలిండర్లు సబ్సిడీవే అయినప్పుడు ఇతరులను సబ్సిడీ ఒదులుకోమని చెప్పడం అసంగతం అవుతుంది. ఒకవేళ సబ్సిడీ లేని సిలిండర్లు అక్కడి క్యాంటీనులో వాడుతూ ఉన్నట్టయితే  ఆవిషయానికి విస్తృత ప్రచారం కల్పించి వుంటే ఈ రకమైన విమర్శలకు అవకాశం వుండేది కాదు.
అదీ కాక సబ్సిడీ భారంగా పరిణమిస్తోంది అని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఈ రకమైన విజ్ఞప్తులు, పిలుపుల పద్ధతికి స్వస్తి పలకాలి. దేశంలో సంపన్నుల జాబితా ప్రభుత్వం వద్దనే సిద్ధంగా వుంటుంది. 'పలానా తేదీ నుంచి అలాటివారందరికీ సబ్సిడీ ఎత్తి వేస్తున్నాం' అని ఒక ప్రకటన చేస్తే సరిపోయేది. గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీ మొత్తానికి కనీసం కొన్ని వందల రెట్లు తమ కుక్క పిల్లల ఆలనాపాలనాపై ఖర్చు పెట్టగలిగిన ఖామందుల సంఖ్య మన దేశంలో తక్కువేమీ కాదు. దుష్టాంగాన్ని తొలగించి శిష్టాంగాన్ని కాపాడమన్నట్టుగా అనర్హులయిన వారిని సబ్సిడీ జాబితా నుంచి తొలగించి అవసరమైన పక్షంలో సబ్సిడీ మొత్తాన్ని  మరింత పెంచి అర్హులైన పేదలకు అందించగలిగితే అది నిజమైన సంక్షేమ ప్రభుత్వం అనిపించుకుంటుంది. పేదల రేషను కార్డుల విషయంలో అనర్హులను తొలగించే కార్యక్రమాలపట్ల  ఎక్కడలేని తొందర ప్రదర్శించే ప్రభుత్వాలు, సంపన్నులకు గ్యాస్ సబ్సిడీ తీసివేసే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తాయన్నది సామాన్యుల మనస్సులను తొలుస్తున్న జవాబులేని ప్రశ్న.     
నిజమే. అభివృద్ధి చెందుతున్న  దేశాల్లో సబ్సిడీలు తప్పనిసరి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ సబ్సిడీ విధానం అమల్లో వుంది. ఎందుకంటె పెరిగే సంపద సక్రమంగా అన్ని చోట్లా సమానంగా పెరగదు. సంపన్నత పెరిగే కొద్దీ సమాజంలో అసమానతలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తాయి. వృద్ధాప్యం, అనారోగ్యం మొదలయిన అంశాలు వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపుతాయి. అంచేతే సిరి సంపదలు పుష్కలంగా వున్న దేశాల్లో కూడా ఆహార సబ్సిడీలు, ఆరోగ్య సబ్సిడీలు  ఘనంగానే ఉంటున్నాయి. కాకపోతే సబ్సిడీల విషయంలో ఆయా  దేశాల ప్రజలు స్వచ్చందంగా  పాటించే కొన్ని నియమ నిబద్ధతతల కారణంగా అవి దుర్వినియోగం కావడం లేదు. సంపన్నులయినవాళ్ళు సబ్సిడీలకోసం ఆరాటపడని మంచి  సమాజాలను వారు సృష్టించుకున్నారు. సంక్షేమ పధకాలకోసం ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు సంపన్నులకోసం కాకుండా ఆపన్నులకోసం ఖర్చు చేయాలని ఆశించేవారు ఆదేశాల్లో అధికంగా వుండడం దీనికి కారణం. మన దేశంలో పరిస్తితి దీనికి పూర్తిగా భిన్నం. సబ్సిడీ బియ్యం నుంచి  ఆరోగ్యశ్రీ కార్డు వరకు ఇదే తంతు. అన్ని రకాల సబ్సిడీలు ఆదాయాలతో నిమిత్తం లేకుండా తమ ఒళ్ళో వచ్చి పడాలని ఆరాటపడేవారే ఎక్కువ.
మరో విచిత్రం అయిన విషయం ఏమిటంటే, ఉత్పత్తి ఖర్చుకంటే అనేక వందల రెట్లు అమ్మకం ధర వుండే వస్తుసామాగ్రి కొనడానికి పరుగులు తీసే వారే సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అన్నీ సరఫరా చేయాలని పట్టుబడుతుంటారు. సబ్సిడీ తగ్గించినప్పుడల్లా నానా  కాకి గోల  చేస్తుంటారు.
ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రభుత్వాలు  కొన్ని  కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పుకాదు. అయితే అటువంటి నిర్ణయాల అమలు ప్రభుత్వాధినేతల నుంచే మొదలు కావాలి. పొదుపు చేయండని పిలుపు ఇచ్చేవాళ్ళు దాన్ని ఆడంబరంగా చేయకూడదు. వాటి ప్రచారానికి అట్టహాసంగా ఖర్చు చేయకూడదు. ‘సబ్సిడీ ఒదులుకోవాలని  పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ గారింట్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వాడడం లేదు’ అనే విషయం  తెలుసుకోగోరే వారుంటే, అలాటి వారిని అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా అలాటి సందేహాలను నివృత్తి చేయగలిగితే మరింత బాగుంటుంది.
గతంలో లాల్ బహదూర్ శాస్త్రి  ప్రధాన మంత్రిగా వున్నప్పుడు దేశంలో ఏర్పడ్డ తిండిగింజల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ప్రతి సోమవారం ఒక పొద్దు మాత్రమే భోజనం చేయాలని ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన లభించింది. ఎందుకంటె ఆయన ఆ నియమాన్ని అయన  బతికున్నంతవరకు పాటించారు.
తమ భవిష్యత్తు గురించి, ఈపూట గడిస్తే చాలు అని ఆలోచించే  రాజకీయ నాయకులు దేశంలో  పుష్కలంగా వున్నారు. రేపటి గురించి, జాతి భవిష్యత్తు గురించి  ఆలోచించే రాజనీతిజ్ఞులే క్రమంగా కనుమరుగయిపోతున్నారు.
ఇదొక విషాదం.   (12-08-2015)

(రచయిత  మొబైల్ నెంబరు : 98491 30595  మెయిల్: bhandarusr@gmail.com)

NOTE: Courtesy Image Owner 

10, ఆగస్టు 2015, సోమవారం

మేరా భారత్ మహాన్ !

సుభాషితం సుమధుర భాషితం

ప్రభుత్వాలు చేసే ప్రతి పనీ ప్రతి ఒక్కరికీ తప్పుగా కనిపిస్తుంది, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం తప్ప.

దేశంలో లెక్క చెప్పుకోవడానికి పదహారు వందల ముప్పయి అయిదు స్వదేశీ భాషలు ఉన్నాయి. కానీ జనాలని కలిపే భాష మాత్రం పరాయిది.

పోలీసును చూడగానే అమ్మయ్య పరవాలేదు  పదిలంగా వున్నామన్న అభిప్రాయం కలగాలి కానీ ఈ ఒక్క దేశంలోనే పోలీసును చూసి భయపడే పరిస్తితి వుంది.

ఎవర్ని చూడండి నిమిషం టైం లేదన్నట్టు  ఎంతో హడావిడి పడుతుంటారు. కానీ ఏ ఒక్కడూ సమయపాలన చేస్తున్న దాఖలా కనబడదు.

అది దేవుడి గుడి కావచ్చు, మసీదు కావచ్చు, లేదా చర్చి కావచ్చు, సంపన్నులు లోపల దేవుడ్ని దేబిరిస్తుంటే

బయట పేదవాళ్ళు అడుక్కుంటూ కానవస్తారు.