14, ఆగస్టు 2015, శుక్రవారం

ఖమ్మం బాబా ఇక లేరు



ఖమ్మం పొలిమేరల్లో వున్న శ్రీ సాయిబాబా ఆశ్రమంలో సాయిబాబాగా  భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ బాబా, మా బాబాయి చిన్న అల్లుడు. మధురక్కయ్య మొగుడు. విశేషం  ఏమిటంటే ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత కూడా మా అక్కయ్య ఆశ్రమంలోనే వుంటూ ఆయనకు సేవలు చేస్తోంది.  ఖమ్మంలోని మా మేనకోడలు విమల ఇంటికి భిక్షకు వచ్చినప్పుడు మా  మేనల్లుడు దుర్గాప్రసాద్ ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో  పోస్ట్ చేసాడు.
పూర్వాశ్రమంలో మా బావగారు  శ్రీ యోగానంద కృష్ణమూర్తి, బెజవాడ ఎస్సారార్ కాలేజీలో మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారికి డిగ్రీలో సహాధ్యాయి.   హైదరాబాదులో చాలాకాలం పోలీసు అధికారిగా పనిచేశారు. పాఠకుల్లో కొంత మందికి గుర్తు వుండి వుంటుంది. యాభై అరవై ఏళ్ళ కిందటి ముచ్చట.   రైల్లో ఒకర్ని హత్యచేసి శవాన్ని ముక్కలు గా కత్తిరించి ఆ మూటని రైల్లోంచి విసిరి వేసిన కేసు. షర్టుపై వున్న చాకలి గుర్తు ఆధారంగా మా బావగారు ఆ కేసును పరిశోధించి హంతకుడయిన ఒక డాక్టర్ ని అరెస్టు చేశారు. మంచి దక్షత కలిగిన అధికారిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు.



వారి ఆత్మకు శాంతి చేకూరాలి.

12, ఆగస్టు 2015, బుధవారం

ఎంచుకున్నవారికి ఎంచుకున్నంత


అనగనగా ఓ రాజకీయ నాయకుడు. చేసిన పాపాలు పండి ఓ రోజు చెప్పాపెట్టకుండా బాల్చీ తన్నేసాడు. యమభటులు వచ్చి ఆయన్ని పట్టుకుపోయారు. వాస్తు  నమ్మకం పైలోకాల వాళ్ళకీ  పట్టుకున్నదేమో తెలవదు కానీ, పైన నరకలోకానికీ , స్వర్గానికీ కలిపి ఒకే ప్రవేశద్వారం వుంది. మన రాజకీయ నాయకుడు (మ.రా.నా) అలవాటు చొప్పున తలుపు తోసుకుని లోపలకు వెళ్ళబోతే ద్వారపాలకుడు ఆపాడు. ఆపి చెప్పాడు. ‘ఇక్కడ  కొన్ని విధివిధానాలు మీలాగే మాకూ వున్నాయి. మీరు పాటించరు. మేము పాటిస్తాము తు.చ.తప్పకుండా. అంతే తేడా. ఇక్కడికి వచ్చిన ప్రతివారూ ఒక రోజు నరకంలో, మరురోజు స్వర్గంలో గడపాలి. ఏది మీకు బాగా నచ్చితే అక్కడే మీరు శాస్వితంగా వుండిపోవచ్చు.  అక్కడే మీకు  ఆదార్ కార్డు, ఓటరు కార్డు, ఫోటో గుర్తింపు కార్డు గట్రా ఏ ఇబ్బందీ పెట్టకుండా  ఇచ్చేస్తారు’.
ఇదేదో బాగానే వుందే అనుకున్నాడు మ.రా.నా.


సరే! అక్కడి నియమాల ప్రకారం మ.రా.నా.ను ముందు నరకానికి తీసుకు వెళ్ళారు. బతికున్నప్పుడు జనాలకు నరకం చూపించిన మ.రా.నా. అసలు నరకాన్ని చూసి మూర్చపోయాడు. అది సినిమాల్లో చూపే నరకంలా లేదు. స్వర్గానికి తాతలా వుంది. ఎక్కడ చూసినా తివాచీలు పరిచినట్టు పచ్చటి  మైదానాలు, స్వచ్చమైన నీళ్ళు పారుతున్న సెలయేళ్ళు. సినిమా తారల చెక్కిళ్ళ వంటి నునుపైన తారు రోడ్లు. రంభా ఊర్వశులను తలదన్నే అందాల భామలు తమ నృత్యాలతో అక్కడివారిని ఆహ్లాదపరుస్తున్నారు. తాగేవారికి తాగినంత తాగిస్తున్నారు. తినే వారికి తిన్నంత పెడుతున్నారు. ఇది నిజంగా నరకమా లేక తాను వీ.వీ.ఐ.పీ.అని గుర్తించి ఇలా మర్యాదలు చేస్తున్నారా అనేది తెలియక మ.రా.నా. అయోమయంలో పడిపోయాడు. అయితే ఈలోపల ఆయనకు రాజకీయాల్లో పాత సహచరులు కొందరు అక్కడ తారసపడ్డారు. వారు చేసిన ఘోరాలకు తానే  ప్రత్యక్ష సాక్షి కాబట్టి, వాళ్ళూ అక్కడే వున్నారు కాబట్టి  ఖచ్చితంగా అది నరకమే అయి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చాడు మ.రా.నా. తాను నక్కతోక తొక్కి నరకానికి వచ్చాడు. జనాలకు ఇన్నాళ్ళు అరచేతిలో స్వర్గం చూపించిన అనుభవం వుంది కాబట్టి తనకు నరకంలో స్వర్గ మర్యాదలు చేస్తున్నారని అనుకున్నాడు. ఏదయితేనేం, ‘ఈ ఒక్కరోజు ఇలా హాయిగా నరకంలో గడిపేసి అసలు స్వర్గానికి వెళ్ళిపోతే పోలా’ అని కూడా అనుకున్నాడు.
మొత్తం మీద నరకంలో స్వర్గసుఖాలు అనుభవించిన మ.రా.నా.ను మరునాడు స్వర్గానికి తీసుకుపోయారు. నరకమే స్వర్గం మాదిరిగా వుంటే ఇక స్వర్గం మాట చెప్పాలా! ఎక్కడ చూసినా దేవకన్యలసేవల్లో మునిగితేలే స్వర్లోకవాసులే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఒక్కడూ తెలిసిన వాడు లేడు. ఎలా వుంటారు, వాళ్ళంతా కొద్దో గొప్పో పుణ్యం చేసి చచ్చి వచ్చినవాళ్ళా యే! దాంతో, తెలిసిన మొఖం ఒక్కటీ కనిపించక  మ.రా.నా. అక్కడ ఒంటరివాడయిపోయాడు.
స్వర్గమా నరకమా తేల్చుకోవాల్సిన సమయం మర్నాడు ఆసన్నమయింది. సుఖాలు, భోగాల విషయంలో స్వర్గానికి నరకానికీ ఏ తేడా లేనప్పుడు ఒంటరిగా స్వర్గంలో ఎందుకు ? నరకంలోనే తెలిసిన నలుగురితో గడుపుదామని నిర్ణయించుకుని అదే విషయం చెప్పాడు. ‘ఇష్టం వచ్చినప్పుడు ఇష్టారాజ్యంగా పార్టీలు మారడం కాదిది. ఒక్కసారి నిర్ణయించుకుంటే అదే ఫైనల్ అన్నారు అక్కడి వాళ్ళు. ‘ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు’ అంటూ ధీమాగా మాట్లాడిన మ.రా.నా. ను మళ్ళీ నరకంలోకే తీసుకువెళ్ళారు. దాన్ని చూస్తూనే మ.రా.నా.కు మూర్చవచ్చినంత పనయింది. ఒక్కరాత్రిలో  నరకం తీరుతెన్నులు  పూర్తిగా మారిపోయాయి. నిన్న కనిపించిన నున్నటి రోడ్లు, పచ్చటి పచ్చిక మైదానాలు అన్నీ మంత్రం వేసినట్టు మాయమైపోయాయి. ఇప్పుడన్నీ గతుకుల రోడ్లు, నెర్రెలు వేసిన పంట పొలాలు. అర్ధాకలితో అడుక్కుంటున్న నరక వాసులు. పూరిళ్ళు. ఎండిపోయిన సెలయేళ్ళు, గుక్కెడు నీటి కోసం కడవలతో వెడుతున్న ఆడవాళ్ళు. ఇదేమిటి?
ఏవి తల్లీ ‘నిన్న’ కురిసిన హిమసమూహాలు!
అదే అడిగాడు తనని తెచ్చిన వాళ్ళని. వారు చెప్పిన సమాధానం విని మరోసారి మూర్చపోయాడు మ.రా.నా.
‘నిన్న నువ్వు  చూసింది మా దగ్గర జరుగుతున్నఎన్నికల ప్రచారాన్ని. మాకు ఓటు కూడా వేసి నరకాన్నే ఎంచుకున్నావు. ఆ విషయం మరచిపోవద్దు. కోరి కోరి ఎంచుకున్నందుకు ఫలితం అనుభవించక తప్పదు. రాజకీయాల్లో తలపండిన వాడివి. ఈ విషయం వేరే చెప్పాలా!’
NOTE: Courtesy Image Owner

              

సబ్సిడీలు సంపన్నులకా ? ఆపన్నులకా?

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 13-08-2015, THURSDAY)

"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అలా  పోగుపడే బియ్యాన్ని సేకరించండి. మీ పేటలోని ఏ ఆలయంలోనైనా  ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకు, ఇతర  అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది " – కీర్తిశేషులు కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఒకనాటి అనుగ్రహభాషణ
‘మీరు సంపన్నులు. ప్రభుత్వం వంట గ్యాసు సిలిండర్ పై ఇచ్చే సబ్సిడీ మీకు అవసరంలేదు. అయితే  దేశంలో అందరూ సంపన్నులు కారు. కట్టెల పొయ్యి ముందు కూర్చుని, పొగచూరిన కళ్ళతో ఇంటిల్లిపాదికీ వంట చేసిపెట్టే పేద తల్లులకు ఈ దేశంలో కరువు లేదు. వారి కష్టాలు తీర్చాలంటే మీరు కొంత త్యాగం చేయండి. సబ్సిడీ ఒదులుకోండి. దానితో ఓ పేద కుటుంబంబానికి వంటగ్యాసు సదుపాయం లభిస్తుంది. దయచేసి ఈ పుణ్యం కట్టుకోండి’- కొన్ని మాసాలక్రితం ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి.    
ఇదే మోడీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా ఆయన పనితీరు తెలిసిన వాళ్లకి,  ప్రధాని ఇచ్చిన ఈ  పిలుపుకు వస్తున్న స్పందన అంతంత మాత్రంగా వుండడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ రోజుల్లో మోడీ వ్యవహారశైలి విభిన్నంగా వుండేది. తెలుగు తెలియని గుజరాత్  మిత్రుడు ఒకరు, మోడీ ముఖ్యమంత్రిగా వున్న  రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు.
“మోడీని  గుజరాత్ సీతయ్య అనొచ్చు.   కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.
ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రంలో చిన్నపిల్లల్ని స్కూళ్లకు పంపేలా వారి తలితండ్రులను ప్రోత్సహించడం యెలా అన్న ఆలోచన వచ్చిందనుకోండి. వెంటనే సంబంధిత అధికారుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ల అభిప్రాయాలను సావధానంగా వింటారు. తమ మనసులో మాట స్వేచ్చగా, ధైర్యంగా చెప్పేలా అధికారులను ప్రోత్సహిస్తారు. మధ్యలో భోజన సమయం అయితే పదిహేను నిమిషాల్లో ఆపని ముగించుకుని మళ్ళీ  మీటింగుకు హాజరు. అందరూ చెప్పింది జాగ్రత్తగా విని తాను ఒక అభిప్రాయానికి వచ్చి ఏం చేయాలో ఆ ఆదేశాలు జారీచేస్తారు. ఆ తరహా చూసిన వారికి ఒక మిలిటరీ అధికారి తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసే విధానం గుర్తుకు రాకమానదు. ఇక అప్పటినుంచి ఆ కార్యక్రమం  పురోగతి గురించి వెంట వెంటనే సమీక్షా సమావేశాలు. ఎప్పటికప్పుడు పరిస్తితిని బేరీజు వేసుకుని తదుపరి ఆదేశాలు. వేసవి సెలవుల్లో మండుటెండలను లెక్కపెట్టకుండా అధికారులను వెంటేసుకుని ఒక నెలంతా పల్లెల్లో పర్యటించి పిల్లల చదువు ప్రాధాన్యతను గురించి ప్రతి ఒక్కరికీ వివరించే ప్రయత్నం మరోపక్క. ఫలితం గురించి చెప్పే పని ఏముంటుంది. రెండేళ్లలో స్కూళ్ళల్లో చేరే పిల్లల సంఖ్య  ఇరవయ్యారు శాతం నుంచి నూటికి  నూరు శాతానికి పెరిగిపోయింది. 
దటీజ్ మోడీ మోటివేషన్ పవర్.”
అయితే అదంతా గతం. ఆయన  గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా అలా వుండేది ఆయన తీరు.
ప్రధాని పీఠం ఎక్కిన కొత్తల్లో నేల నాలుగు చెరగులకు కాంతులు వెదజల్లిన  మోడీ ప్రభలు గత కొంత కాలంగా  మసక బారుతున్నట్టుగా అనిపిస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ‘గివ్ ఇట్ అప్’ అంటూ గ్యాస్ సబ్సిడీ ఒదులుకోమని మోడీ ఇచ్చిన పిలుపుకు ప్రజలనుంచి లభిస్తున్న అంతంత మాత్రపు స్పందన.

ప్రధానమంత్రి స్థాయి కలిగిన వ్యక్తి చేసిన విజ్ఞప్తి కాబట్టి కొందరు బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి సబ్సిడీ ఒదులుకుంటున్నట్టు  భారీ ప్రకటనలు చేసారు. అంతే  కాకుండా తమ సంస్థల్లో పనిచేసే సిబ్బందిని  కూడా ఈ సదుపాయం వదులుకోవాల్సిందని కోరారు. ఆయా సంస్థలు జారీ చేసిన పత్రికా ప్రకటనలు గమనిస్తే వారి పిలుపుల పట్ల ఉద్యోగుల  స్పందన బాగానే  వున్నట్టు కానవస్తోంది. కానీ మోడీ మంత్రివర్గంలో పనిచేసే మంత్రులలో ఎవరో కొందరి పేర్లు ఈ ‘త్యాగరాజుల’  జాబితాలో వున్నాయి తప్పిస్తే యావత్ మంత్రిమండలి మోడీ పిలుపుకు సానుకూలంగా స్పందించి సబ్సిడీ వదులుకున్న దాఖలా అధికారిక ప్రకటనల్లో ఎక్కడా లేదు. ఒకవేళ సబ్సిడీ వదులుకుని కూడా ఆ విషయం బహిరంగ పరచడంలో వైఫల్యం చెందివుంటే అది మరో వైఫల్యం కిందికే వస్తుంది.
దేశ వ్యాప్తంగా పదిహేను కోట్ల ముప్పయి లక్షలమంది వంట గ్యాసు వినియోగదారులు వున్నారని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రధాని పిలుపుకు స్పందించి ఇప్పటివరకు సబ్సిడీ వదులుకున్న వారి సంఖ్య పద్నాలుగు లక్షలు దాటలేదు. అంటే ఈ గివ్ ఇట్ అప్ అనే పధకం ఏరకంగా నీరుకారిపోతున్నదో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా సామాన్యుల్లో కలిగే సందేహం ఒక్కటే.  ప్రధాని మోడీ ఇలా చేసివుంటే బాగుండు అని కోరుకునేది కూడా ఒక్కటే.
ఏ త్యాగమైనా ఇంటి నుంచి మొదలు కావాలంటారు. అందుకే దాన్ని ముందు పార్లమెంటు నుంచి మొదలుపెట్టాలి. పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు వచ్చే జీతభత్యాల విషయం రహస్యమేమీ కాదు. 'దేశం మొత్తంలో అత్యంత చౌక ధరలకు అత్యంత నాణ్యమైన ఆహార పదార్ధాలు ఎక్కడ దొరుకుతాయి అంటే పార్లమెంటు క్యాంటీనులో మాత్రమే'   అని జవాబు వచ్చేలా అనేక కధనాలు సాంఘిక మాధ్యమాల్లో  నిత్యం సంచారం చేస్తున్నాయి. ఆ  క్యాంటీనులో  వాడుతున్న గ్యాస్ సిలిండర్లు సబ్సిడీవే అయినప్పుడు ఇతరులను సబ్సిడీ ఒదులుకోమని చెప్పడం అసంగతం అవుతుంది. ఒకవేళ సబ్సిడీ లేని సిలిండర్లు అక్కడి క్యాంటీనులో వాడుతూ ఉన్నట్టయితే  ఆవిషయానికి విస్తృత ప్రచారం కల్పించి వుంటే ఈ రకమైన విమర్శలకు అవకాశం వుండేది కాదు.
అదీ కాక సబ్సిడీ భారంగా పరిణమిస్తోంది అని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఈ రకమైన విజ్ఞప్తులు, పిలుపుల పద్ధతికి స్వస్తి పలకాలి. దేశంలో సంపన్నుల జాబితా ప్రభుత్వం వద్దనే సిద్ధంగా వుంటుంది. 'పలానా తేదీ నుంచి అలాటివారందరికీ సబ్సిడీ ఎత్తి వేస్తున్నాం' అని ఒక ప్రకటన చేస్తే సరిపోయేది. గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీ మొత్తానికి కనీసం కొన్ని వందల రెట్లు తమ కుక్క పిల్లల ఆలనాపాలనాపై ఖర్చు పెట్టగలిగిన ఖామందుల సంఖ్య మన దేశంలో తక్కువేమీ కాదు. దుష్టాంగాన్ని తొలగించి శిష్టాంగాన్ని కాపాడమన్నట్టుగా అనర్హులయిన వారిని సబ్సిడీ జాబితా నుంచి తొలగించి అవసరమైన పక్షంలో సబ్సిడీ మొత్తాన్ని  మరింత పెంచి అర్హులైన పేదలకు అందించగలిగితే అది నిజమైన సంక్షేమ ప్రభుత్వం అనిపించుకుంటుంది. పేదల రేషను కార్డుల విషయంలో అనర్హులను తొలగించే కార్యక్రమాలపట్ల  ఎక్కడలేని తొందర ప్రదర్శించే ప్రభుత్వాలు, సంపన్నులకు గ్యాస్ సబ్సిడీ తీసివేసే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తాయన్నది సామాన్యుల మనస్సులను తొలుస్తున్న జవాబులేని ప్రశ్న.     
నిజమే. అభివృద్ధి చెందుతున్న  దేశాల్లో సబ్సిడీలు తప్పనిసరి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ సబ్సిడీ విధానం అమల్లో వుంది. ఎందుకంటె పెరిగే సంపద సక్రమంగా అన్ని చోట్లా సమానంగా పెరగదు. సంపన్నత పెరిగే కొద్దీ సమాజంలో అసమానతలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తాయి. వృద్ధాప్యం, అనారోగ్యం మొదలయిన అంశాలు వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపుతాయి. అంచేతే సిరి సంపదలు పుష్కలంగా వున్న దేశాల్లో కూడా ఆహార సబ్సిడీలు, ఆరోగ్య సబ్సిడీలు  ఘనంగానే ఉంటున్నాయి. కాకపోతే సబ్సిడీల విషయంలో ఆయా  దేశాల ప్రజలు స్వచ్చందంగా  పాటించే కొన్ని నియమ నిబద్ధతతల కారణంగా అవి దుర్వినియోగం కావడం లేదు. సంపన్నులయినవాళ్ళు సబ్సిడీలకోసం ఆరాటపడని మంచి  సమాజాలను వారు సృష్టించుకున్నారు. సంక్షేమ పధకాలకోసం ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు సంపన్నులకోసం కాకుండా ఆపన్నులకోసం ఖర్చు చేయాలని ఆశించేవారు ఆదేశాల్లో అధికంగా వుండడం దీనికి కారణం. మన దేశంలో పరిస్తితి దీనికి పూర్తిగా భిన్నం. సబ్సిడీ బియ్యం నుంచి  ఆరోగ్యశ్రీ కార్డు వరకు ఇదే తంతు. అన్ని రకాల సబ్సిడీలు ఆదాయాలతో నిమిత్తం లేకుండా తమ ఒళ్ళో వచ్చి పడాలని ఆరాటపడేవారే ఎక్కువ.
మరో విచిత్రం అయిన విషయం ఏమిటంటే, ఉత్పత్తి ఖర్చుకంటే అనేక వందల రెట్లు అమ్మకం ధర వుండే వస్తుసామాగ్రి కొనడానికి పరుగులు తీసే వారే సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అన్నీ సరఫరా చేయాలని పట్టుబడుతుంటారు. సబ్సిడీ తగ్గించినప్పుడల్లా నానా  కాకి గోల  చేస్తుంటారు.
ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రభుత్వాలు  కొన్ని  కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పుకాదు. అయితే అటువంటి నిర్ణయాల అమలు ప్రభుత్వాధినేతల నుంచే మొదలు కావాలి. పొదుపు చేయండని పిలుపు ఇచ్చేవాళ్ళు దాన్ని ఆడంబరంగా చేయకూడదు. వాటి ప్రచారానికి అట్టహాసంగా ఖర్చు చేయకూడదు. ‘సబ్సిడీ ఒదులుకోవాలని  పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ గారింట్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వాడడం లేదు’ అనే విషయం  తెలుసుకోగోరే వారుంటే, అలాటి వారిని అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా అలాటి సందేహాలను నివృత్తి చేయగలిగితే మరింత బాగుంటుంది.
గతంలో లాల్ బహదూర్ శాస్త్రి  ప్రధాన మంత్రిగా వున్నప్పుడు దేశంలో ఏర్పడ్డ తిండిగింజల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ప్రతి సోమవారం ఒక పొద్దు మాత్రమే భోజనం చేయాలని ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన లభించింది. ఎందుకంటె ఆయన ఆ నియమాన్ని అయన  బతికున్నంతవరకు పాటించారు.
తమ భవిష్యత్తు గురించి, ఈపూట గడిస్తే చాలు అని ఆలోచించే  రాజకీయ నాయకులు దేశంలో  పుష్కలంగా వున్నారు. రేపటి గురించి, జాతి భవిష్యత్తు గురించి  ఆలోచించే రాజనీతిజ్ఞులే క్రమంగా కనుమరుగయిపోతున్నారు.
ఇదొక విషాదం.   (12-08-2015)

(రచయిత  మొబైల్ నెంబరు : 98491 30595  మెయిల్: bhandarusr@gmail.com)

NOTE: Courtesy Image Owner 

10, ఆగస్టు 2015, సోమవారం

మేరా భారత్ మహాన్ !

సుభాషితం సుమధుర భాషితం

ప్రభుత్వాలు చేసే ప్రతి పనీ ప్రతి ఒక్కరికీ తప్పుగా కనిపిస్తుంది, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం తప్ప.

దేశంలో లెక్క చెప్పుకోవడానికి పదహారు వందల ముప్పయి అయిదు స్వదేశీ భాషలు ఉన్నాయి. కానీ జనాలని కలిపే భాష మాత్రం పరాయిది.

పోలీసును చూడగానే అమ్మయ్య పరవాలేదు  పదిలంగా వున్నామన్న అభిప్రాయం కలగాలి కానీ ఈ ఒక్క దేశంలోనే పోలీసును చూసి భయపడే పరిస్తితి వుంది.

ఎవర్ని చూడండి నిమిషం టైం లేదన్నట్టు  ఎంతో హడావిడి పడుతుంటారు. కానీ ఏ ఒక్కడూ సమయపాలన చేస్తున్న దాఖలా కనబడదు.

అది దేవుడి గుడి కావచ్చు, మసీదు కావచ్చు, లేదా చర్చి కావచ్చు, సంపన్నులు లోపల దేవుడ్ని దేబిరిస్తుంటే

బయట పేదవాళ్ళు అడుక్కుంటూ కానవస్తారు.

8, ఆగస్టు 2015, శనివారం

"Back to village" - శ్రీమంతుడు



'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో  రిటైర్ కావడానికి ముందే రాశాను. నాకు తెలిసి, ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి, వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు  మాత్రమే ఈ పని చేసి చూపించారు.  హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,   పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.  చదువులకోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా,  స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.

ఈరోజు 'శ్రీమంతుడు' సినిమా చూస్తున్నప్పుడు ఈ జ్ఞాపకం మరో సారి మదిలో మెదిలింది. (08-08-2015)


(మా ఊర్లో మా పూర్వీకులు కట్టించిన ఇల్లు)

వివాదాల సుడిగుండాల్లో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 09-08-2015,SUNDAY)

దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు మాదిరిగా నడుస్తోంది పోలవరం కధ. కొత్తగా పురుడుపోసుకున్న రెండు రాష్ట్రాల నడుమ ఈ పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కంచికి చేరని కధలా సాగిపోతోంది. బాలారిష్టాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. వార్తల్లో మాత్రమే  కనిపించే ఈ ప్రాజెక్ట్  వాస్తవరూపం దాల్చడానికి ఏండ్లూ పూండ్లూ పట్టేట్టు వుంది.  
దేశంలోని నదులన్నింటినీ  అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941  జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్  ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా  మూడు లక్షల యాభై  వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్  మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. ఆరోజుల్లో మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ కు నామకరణం  కూడా చేశారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న  భద్రాచలం  సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు,  పోలవరం కుడి గట్టు కాల్వని,   కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం  2004  కల్లా ఎనిమిదివేల ఆరువందల కోట్లకు పెరిగిపోయింది. 

1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న  పోలవరానికి,  వై. ఎస్.  రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం వున్న ఆయకట్టు స్థిరీకరణతో సహా సేద్యపు నీటి సౌకర్యం కల్పించడం ప్రాజెక్ట్ లక్ష్యం.  పోలవరం నుంచి మళ్లించిన గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ప్రకాశం బరాజ్ ఎగువన కొత్తగా మరో బరాజ్ నిర్మించడం కూడా ఈ పధకంలో ఓ భాగం. ఇందువల్ల హైదరాబాదు నుండి తొమ్మిదో నెంబరు జాతీయ రహదారిలో ప్రయాణించే వారు  విజయవాడ వరకు పోకుండానే ఆ బరాజ్ పైనుంచి  గుంటూరు జిల్లాకు చేరడానికి వీలుపడుతుంది. ఇవీ ఈ ప్రాజెక్ట్ వల్ల అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కానీ, విభజన అనంతరం ఏర్పడ్డ కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వొనగూడే ప్రయోజనాలు. కొద్దో గొప్పో తెలంగాణాలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు కూడా ప్రయోజనం వుంటుంది.          
అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా గోదావరి నదులే ప్రధాన సేద్యపు నీటివనరులు. ఇందులో కృష్ణానది నుంచి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. పోతే,  గోదావరిలో మిగులు జలాలు ఎక్కువ. ఏటా కొన్ని వందల వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళించడం ద్వారా కృష్ణానదీ జలాలను వాటి అవసరం ఎక్కువగా వున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడం సాధ్య పడుతుంది. ఈ కోణంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే పోలవరం. అసలు ఏ సేద్యపు నీటి  ప్రాజెక్ట్ అయినా కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందించడం లక్ష్యంగా రూపుదిద్దుకుంటుంది. కానీ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా సరఫరా అయ్యే జలాలు ఉభయగోదావరి,  కృష్ణాజిల్లాల్లో వున్న ఆయకట్టు స్థిరీకరణకు మాత్రమే  ప్రధానంగా ఉపయోగపడతాయి. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల మునకకు గురయ్యే ప్రాంతాలు మాత్రం తెలంగాణలో వున్నాయి. వాటిల్లో చాలావరకు ఆదివాసీలు నివసించే ప్రదేశాలు. ప్రధానమైన అడ్డంకి  ఇదే.
రాష్ట్రంలో పలు జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ ప్రాజెక్ట్ కు కొన్ని సహజ సిద్ధమైన బాలారిష్టాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్ట్  నిర్మాణం వల్ల సుమారు రెండువందల డెబ్బయ్ ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయి. దాదాపు నలభయ్ వేల పైచిలుకు కుటుంబాలవారు నిరాశ్రయులవుతారు. వారికి  పునరావాసం కల్పించాల్సి వుంటుంది. ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఈ తిప్పలు తప్పవు. కానీ పోలవరం వల్ల నిరాశ్రయులయ్యేవారిలో  సగం మంది అక్కడి నేలను, అడివినీ నమ్ముకున్న షెడ్యూల్ల్ తెగలవారు కావడం గమనార్హం. దీనికితోడు ఈ ప్రాజక్ట్  తలపెట్టినప్పుడు రాష్ట్రం ఒకటిగా వుంది. తరువాత రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సమయంలో కూడా పోలవరం అంశం ప్రధాన అవరోధంగా  నిలిచింది. ప్రాజెక్ట్ ఒక రాష్ట్రంలో,  ముంపుకు గురయ్యే ప్రాంతాలు మరో రాష్ట్రంలో వుండే విచిత్ర పరిస్తితి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు విభజన  నిర్ణయం తీసుకున్న నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం,  తెలంగాణాలోని అనేక గ్రామాలను  ఆంధ్ర ప్రదేశ్ కు బదలాయించే ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఆఖరి క్షణంలో ప్రయత్నించినా అది కుదరలేదు. ఆ తరువాత వచ్చిన మోడీ నాయకత్వంలోని  ఎండీయే సర్కారు ఆ ఆర్డినెన్సు తీసుకురావడమే  కాకుండా దాన్ని లోకసభలో ఆమోదింపచేసుకోవడంతో  తెలంగాణా ప్రాంతంలో అగ్గి రాజుకుంది.  పోలవరం డిజైన్ మార్చాలని, తద్వారా ముంపుకు గురయ్యే ప్రాంతాల విస్తీర్ణం తగ్గేలా చూడాలని మొదటి నుంచి పట్టుబడుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులకు కేంద్రం వైఖరి  మింగుడు పడలేదు. అయినా కానీ టీఆర్ ఎస్ ప్రభుత్వం ఓ మెట్టు దిగి ఈ విషయంలో మరింత పట్టు పట్టకుండా పట్టువిడుపు ధోరణి ప్రదర్శించిన ఫలితంగా రాజుకున్న అగ్గి మరింత ప్రజ్వరిల్లకుండా ఆదిలోనే సమసిపోయింది.
పొరుగునవున్న ఒడిశా,  ఛత్తీస్ ఘడ్   ప్రభుత్వాలు కూడా ఈ పోలవరం  ప్రాజక్ట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల తమ రాష్ట్రాల్లో భూములు విస్తారంగా మునకకు గురవుతాయని, మునుపటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణంతో ముందుకు పోతోందని ఆరొపిస్తూ ఒడిశా, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాలు గతంలోనే సుప్రీం కోర్టులో కేసు వేశాయి.    
పోలవరం ప్రాజెక్ట్ పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో వున్నట్టు కానవస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో దీన్ని జాతీయ ప్రాజక్ట్ గా చేపట్టి పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు.  అధికార పీఠం ఎక్కిన బీజేపీ ఇప్పుడు ఈ విషయంలో నిరాసక్తతతో కూడిన ఆసక్తి చూపుతోందన్న అపప్రధ మోస్తోంది. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.
నిధుల లేమితో కునారిల్లుతున్న పోలవరం  ప్రాజెక్ట్ అనుకున్న విధంగా,  అనుకున్న  వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే. ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం  అంచనాలకు మించి పెరిగిపోవడం మాత్రం  ఖాయం.

అయితే, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తిచేయడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికీ, ప్రత్యేకించి అక్కడ పాలనసాగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికీ ఎంతో ప్రయోజనం లభిస్తుంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరతామని ఆ పార్టీ అధినాయకులు పదేపదే ప్రకటనలు చేయిస్తున్నారు. కానీ పార్టీ అధినేతకు అది అంత సులభంగా అయ్యేపని కాదని తెలుసు. కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం వరకు చేసింది. కానీ నిధుల విడుదల అరకొరగా జరుగుతోంది. అంచేతే టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు అనే కొత్తపల్లవి ఎత్తుకుంది. పోలవరం అన్ని గండాలు గడిచి పూర్తయ్యేలోగా పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. కాబట్టే పట్టిసీమ ప్రాజెక్టును ఆఘమేఘాల మీద పూర్తిచేయాలని అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆగస్టు పదిహేనుకల్లా పూర్తిచేసి నీరు విడుదల చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఒక్క చిత్తశుద్ధి మాత్రమే సరిపోదు. అందుకు  అవసరమైన విత్తం కూడా కావాలి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దగ్గర బాగా కొరతగా వున్నది అదొక్కటే.
దీనికి తోడు పట్టిసీమ ప్రాజెక్టుపై ముసురుకుంటున్న వివాదాల ముసురు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన వై.ఎస్.ఆర్.సీ.పీ. దీనికి ఏకంగా 'మాయలేడి' అనే పేరు పెట్టింది. కేవలం కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికే తెలుగుదేశం ప్రభుత్వం, పోలవరాన్ని పక్కనబెట్టి పట్టిసీమ ప్రాజెక్టును తెర మీదకు తీసుకు వచ్చిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సహజంగా పాలక పక్షాలు భావిస్తుంటాయి. అయితే అదే ప్రశ్న ప్రజలనుంచి రాకుండా చూసుకోవాలి. తాడును పామనుకుని జాగ్రత్త పడడానికి, పామును తాడనుకుని నిర్లక్ష్యంగా వుండడానికీ ఎంతో వ్యత్యాసం వుంది.  
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 9849130595


(08-08-2015)

NOTE: Courtesy Image Owner 

మూడు పెగ్గులు నాలుగు హగ్గులు


'ప్రతిరోజూ నియమం తప్పకుండా రెండో మూడో పెగ్గులు లాగించడమే  నా ఆరోగ్య రహస్యం' అన్నాడొక శతాయుష్కుడు.
తాగుబోతుల లెక్కలు వేరు. జగ్గుల లెక్కలో సీసాలకు సీసాలు పట్టించేవాళ్లు కూడా 'నేను తాగేది చాలా తక్కువ. మహా అయితే ఒకటో రెండో..' అంటుంటారు నాలుగో పెగ్గు పట్టిస్తూ.
ఈ పెగ్గులు సరే! తాగిమాట్లాడే మాటలు. మరి హగ్గులు అంటున్నారు, అవేమిటి?
ఈ హగ్గులు ఇంగ్లీషు హగ్గులు. అంటే కౌగలింతలు అన్నమాట.
ఆడామగా హాయిగా మరో ధ్యాస లేకుండా గట్టిగా కావిలించుకుంటే, అదీ రోజుకు మూడు నాలుగు సార్లు, ఇక ఆ జంటకు ఆయుస్సు అమాంతం పెరిగిపోతుందని హగ్గారావుల ఉవాచ. దీనికి మద్దతుగా వాళ్లు అనేక శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను ఉదహరిస్తున్నారు. అవి వింటుంటే కౌగలింతల్లో తేలిపోతున్నట్టుగా వుంటుంది.
సాధారణంగా ఓ జంట ఎంతసేపు కౌగలించుకుంటుంది అన్న పరిశోధనలతో మొదలు పెట్టి ఈ శాస్త్ర కారులు తేల్చినదేమిటంటే -
ఉత్తుత్తి కౌగలింతలు మూడు సెకన్లలో ముగిసిపోతాయి.
అదే ఇరవై సెకన్లు గాట్టిగా కావిలించుకుంటే దానివల్ల కలిగే మేళ్ళు అంతా ఇంతా కాదని అంటున్నారు. ఈరకం కౌగలింతలు శరీరం మీదా, మనస్సు మీదా కూడా ఏకకాలంలో సానుకూల ప్రభావం చూపుతాయన్నది వారి అభిప్రాయం.
ఎలాటి భేషజాలు లేకుండా, నిజాయితీతో అవతల వ్యక్తిని దగ్గరకు తీసుకుని కౌగలించుకోవడం వల్ల శరీరంలో "oxytocin" అనే నోరు తిరగని ఓ హార్మోను తయారవుతుందట. దీనికి వాళ్లు 'లవ్ హార్మోను' అని పేరు కూడా పెట్టేసారు. ఈ హార్మోను పుణ్యమా అని శారీరకంగా, మానసికంగా ఎంతో మంచి జరుగుతుందట. శరీరం గాల్లో తేలిపోతున్న విధంగా తేలిక పడుతుందట. మానసిక ఆందోళనలు వగయిరా మంత్రం వేసినట్టు మాయం అయిపోతాయిట. లేనిపోని భయాలు ఏమైన వుంటే కౌగలింతలు కలిగించే హాయిలో కనుమరుగయిపోతాయిట.
మనం కోరుకున్న అబ్బాయో, అమ్మాయో మన బాహుబంధాల్లో వున్నట్టయితే ఇక అన్ని రకాల భవబంధాలు హుష్ కాకి. ప్రేమ బంధం ఒక్కటే శాశ్వితం.
కేవలం కౌగలింతల దగ్గరే ఈ పరిశోధకులు ఆగిపోలేదు. పసి పాపను ఉయ్యాల్లో ఊపుతున్నప్పుడు, పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్నప్పుడు, జీవిత భాగస్వామితో కాలు చేయీ కలిపి నృత్యం చేస్తున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆత్మీయులతో కరచాలనం చేస్తున్నప్పుడు సయితం 'లవ్ హార్మోను' లావాలా తన్నుకువస్తుందట. పైగా ఇదంతా టోటల్ గా ఫ్రీ. ముఫ్థ్, ఉచితం. ఇంకా యెందుకు ఆలశ్యం.
కౌగలించుకుందాం రండి.
గట్టిగా అనకండి. ఏ తెలుగు నిర్మాతో విన్నాడంటే ఏకంగా ఈ పేరు పెట్టి ఓ సినిమా చుట్టేసి మనమీద ఒదిలేసే ప్రమాదం వుంది.     (08-08-2015)

NOTE: Courtesy Image owner