8, ఏప్రిల్ 2015, బుధవారం

పేలుతున్న తుపాకులు - పోతున్న ప్రాణాలు

(Published by 'SURYA' telugu daily in it's edit page on 09-04-2015, THURSDAY)

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో తుపాకులు టపటపా పేలుతున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసి  పోతున్నాయి. సిమి ఉగ్రవాదులు జరిపిన కాల్పులు  నలుగురు  పోలీసు అధికారులను  బలితీసుకోగా,  ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు  కాల్పుల్లో నేలకొరిగారు. ఈ సంఘటనలో పోలీసులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు బహుధా ప్రసంశనీయం. శిక్షణ పొందిన కరడుగట్టిన ఉగ్రవాదులతో వారు తలపడ్డ విధానం  అపూర్వం. వారి బలిదానాలను  ప్రజలు కలకాలం గుర్తుపెట్టుకుంటారు.  ఈ సంఘటనలతో రేకెత్తిన  సంచలనం సద్దుమణక్క ముందే వరంగల్ జిల్లా కేంద్ర కారాగారం నుంచి  విచారణ నిమిత్తం హైదరాబాదు తరలిస్తున్న ఆరుగురు ఉగ్రవాద నేరస్తులు  పోలీసులమీద దాడి జరిపి  తప్పించుకునేందుకు విఫల ప్రయత్నం చేసి  పోలీసులుల చేతుల్లోనే  కన్నుమూసారు. ఈ అంశంపై మీడియాలో చర్చలు సాగుతుండగానే మరో కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం చెట్లు నరికి అక్రమంగా తరలిస్తున్న రెండు ముఠాలపై  పోలీసులు కాల్పులు జరపడంతో ఏకంగా ఇరవై మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు.
దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన ఈ సంఘటనలు కొన్ని ప్రశ్నల్ని, మరికొన్ని అనుమానాలని జనం ముందు వుంచుతున్నాయి.

సాధారణంగా ఇటువంటి సంఘటనలను  'ఎన్ కౌంటర్లు' అని పిలుస్తుంటారు. ఈ పదానికి దగ్గరి  అనువాదం 'ఎదురు కాల్పులు'. అంటే ఏమిటి? ఎవరయినా కాల్పులు జరిపితే ప్రతిగా ఎదురు కాల్పులు జరపడం అన్నమాట. సూర్యాపేట, జానకీపురం సంఘటనలను  ఎన్ కౌంటర్లుగా భావించడానికి ఆస్కారం వుంది. మిగిలిన రెండు సంఘటనలు జరిగిన తీరు వేరే విధంగా వుంది. ఇరవై ఆరుమంది ప్రాణాలు కోల్పోయిన ఈ రెండు సందర్భాలలోనూ రక్షక సిబ్బంది 'ఆత్మరక్షణ' కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇస్తున్నారు. ఎన్ కౌంటర్ అనే పదం వీటికి వర్తించదు. ఎందుకంటె కాల్పులే తప్ప ప్రతికాల్పులు లేవు. ఉభయ పక్షాల్లో ఆయుధాలు వున్నది పోలీసుల దగ్గరే. అందువల్లే 'ఆత్మరక్షణ' పల్లవి ఎత్తుకున్నారు. ఇది మరీ విడ్డూరంగా వుంది. వరంగల్ జిల్లా ఆలేరు  సంఘటనలో మరణించిన ఆరుగురు ఉగ్రవాదుల చేతులకు బేడీలు తప్ప వారి చేతుల్లో ఆయుధాలు లేవు. తమ మీద దాడిచేసి, తమ ఆయుధాలను లాక్కుని తమపైనే ప్రయోగించాలని చూసారనీ, అంచేతే 'ఆత్మ రక్షణ'కోసం కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. ఈ కారణం యెంత మాత్రం హేతుబద్ధంగా లేదు. పైగా తమ అసమర్ధతని తామే బయట పెట్టుకుంటున్నట్టుగా వుంది. ఏదో ఒక హేతువు చూపాలి కాబట్టి ఒక కారణం చెప్పినట్టు వుంది. అంతేకాని సందర్భానికి అతికే విధంగా ఎంతమాత్రం లేదు. అలాగే శేషాచలం అడవుల్లో జరిగిన సంఘటనలు. ఈ సందర్భంగా కూడా పోలీసులు మళ్ళీ 'ఆత్మరక్షణ' సాకునే ఎంచుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లర చేత నియోగించబడిన 'కూలీలు' తమపై రాళ్ళతో దాడి జరిపారని, ప్రాణాలు కాపాడుకునేందుకు కాల్పులు జరిపామని షరా మామూలు వివరణే ఇచ్చారు. అయితే మీడియాలో కానవచ్చిన దృశ్యాలు ఈ వాదనకు యెంత మాత్రం బలం ఇచ్చేవిగా కనబడడం లేదు.


ఉగ్రవాదులను మట్టుబెట్టడం, స్మగ్లర్ల ఆట కట్టించడం తప్పని ఎవ్వరూ అనరు. కానీ అందుకు ఎంచుకున్న విధానమే ప్రశ్నార్ధకమవుతోంది. ప్రతి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే పోలీసు యంత్రాంగం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సమర్ధించుకోవడానికి ఇచ్చే ఈ విధమైన వివరణలే వారి చర్యల  విశ్వసనీయత పట్ల సందేహాలను పెంచుతున్నాయి. ఉదాహరణకు వరంగల్ సంఘటన తీసుకుంటే, కాలకృత్యం నెపంతో  సెక్యూరిటీ వాహనం దిగిన ఉగ్రవాదులు పారిపోవడానికి ప్రయత్నించారని, దాన్ని నిరోధించే క్రమంలో కాల్పులు జరిపామని చెప్పివుంటే మరో విధంగా వుండేదేమో. అలాగే శేషాచలం సంఘటన. ఆయుధాలు వున్నది పోలీసుల దగ్గర. కూలీలు దాడి చేసింది రాళ్ళతో. వాస్తవంగా ఆలోచిస్తే 'ఆత్మ రక్షణ' లో పడింది కూలీలా లేక పోలీసులా? ఇదంతా ఏదో హక్కుల సంఘాలు చెప్పినట్టు చెప్పడం కాదు. పోలీసులు చెప్పే వివరణ వాస్తవ ప్రాతిపదికపై వుండాలని మాత్రమే. పోలీసుల నిర్వాకంపై  హక్కుల సంఘాలకు ఎలాగూ అపనమ్మకమే. వారి వ్యవహారంపై  పోలీసుల విశ్వాసమూ అంతంత మాత్రమే. అయితే వీరిద్దరే కాదు. మధ్యలో జనం కూడా వున్నారు. హక్కుల పేరుతొ ఒకరూ, అధికారం పేరుతొ మరొకరూ వాదవివాదాలు పెంచుకుంటూ పోతుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేది మధ్యలో సంఘ విద్రోహశక్తులే అనే విషయం మరవకూడదు.
వరంగల్ సంఘటనలో చనిపోయిన ప్రధాన ముద్దాయి వికారుద్దీన్ కు ఉగ్రవాద సంస్థలతో అనుబంధం మాట అటుంచి నేర ప్రవృత్తి కూడా వుంది. జానకీపురం సంఘటనలో మరణించిన ఉగ్రవాదులు శిక్షణ పొందినవారు. వారు తాము నమ్మిన సిద్ధాంతం -  అది మంచిదా, కాదా అనేదానితో నిమిత్తం లేకుండా ముందుకు  సాగుతున్నవారు. వికారుద్దీన్ వ్యవహారం కొంత భిన్నమైనది. ఉగ్రవాదం ముసుగులో దందాలు చేసి పబ్బంగడుపుకోవాలని చూడడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతోంది. ఇటువంటివారివల్ల ప్రయోజనం పొందేవారు కూడా అధికంగానే వుంటారు. అందుకే వికారుద్దేన్ ఎన్ కౌంటర్ (?) రాజకీయ రంగు పులుముకుంటోంది.
ఉగ్రవాద భూతం యావత్ ప్రపంచాన్ని వొణికిస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి ఒంటరి ప్రయత్నాలు సరిపోవు. సంఘటిత కృషి అవసరం.
ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ సంగతి. కూలీల మరణం రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత రాష్ట్రం రాజకీయాలే కాదు, పొరుగు రాష్ట్రం రాజకీయాలు సయితం ఇందులో  జొరబడ్డాయి. ఇక అది ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.
కాకపోతే, సందర్భం ఎలాగు తటస్థ పడింది కాబట్టి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని మరో కోణంలో చూడాలి. స్మగ్లర్లు, వారి సంపాదనలు, వారి రాజకీయాలు పక్కనబెట్టి, ఒక్క ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే హక్కుభుక్తంగా వున్న ఎర్ర చందనం సంపదను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న దిశగా ఆలోచించాలి. అక్రమ రవాణాను నిరోధించడానికి వృధా ప్రయత్నాలు చేసే బదులు ఆ సంపదను సక్రమ మార్గంలో ఎగుమతి చేయగలిగితే ఉభయతారకంగా వుంటుంది. ఎర్ర చందనం అక్రమ తరలింపుల వల్ల అనేకమంది కోట్లకు పడగలెత్తివుండవచ్చు. అలాటి వారిలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు లేరంటే నమ్మశక్యంగా వుండదు. కొందరు అధికారులు, నాయకుల ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయల ఎర్ర చందనం దేశపు  ఎల్లలు దాటిపోవాలంటే, పోతున్నదంటే అది జేబులో పెట్టుకుని తీసుకువెళ్ళే బంగారం బిస్కెట్టు కాదు. ఎర్ర చందనం దుంగల్ని శేషాచలం అడవులనుంచి బయటి దేశాలకు తరలించాలంటే మధ్యలో అవరోధాలు, అవాంతరాల సంగతి అటుంచి ఎంతో మంది కూలీలు, మేస్త్రీలు, ఎన్నో వాహనాలు అవసరమవుతాయి. వీటన్నిటినీ మించి వాటిని అక్రమంగా తరలించేది పొరుగు ప్రదేశాలకు కాదు, ఓడల్లో విదేశాలకి. ఇన్ని దాటుకుని ఎర్ర చందనం జపాన్, చైనా వంటి దేశాలకు అలవోకగా చేరిపోతున్నదంటే, ఎన్ని చేతులు కలిస్తే ఇది సాధ్యం అవుతున్నదో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాలి. చెట్లను నరికే కూలీలకు కూడా ఈ నేరంలో భాగస్వామ్యం వుంటుంది. నిజమే. కానీ, వారిని మట్టుబెట్టి భయపెట్టడం ఒక్కటే పరిష్కారం కాబోదు. స్మగ్లర్లు  చేస్తున్న వ్యాపారాన్ని ప్రభుత్వమే తన చేతుల్లోకి తీసుకోవాలి. అప్పుడే అన్ని ఆగడాలకు, అరాచకాలకు కళ్ళెం పడుతుంది.
ఎర్ర చందనం సమస్యకు కావాల్సింది తాత్కాలిక ఉపశమనం కాదు. శాశ్విత పరిష్కారం. (08-04-2015)

(రచయిత మొబైల్: 98491 30595 ఈ మయిల్:  bhandarusr@gmail.com)          

6, ఏప్రిల్ 2015, సోమవారం

సొరకాయ


'మీ ఇంట్లో కరెంటు ఉందా శంకరం?'
ముగ్గురు స్నేహితుల్ని కాన్ఫరెన్సు కాల్ లో పెట్టి అడిగాడు ఏకాంబరం.
'లేదు. పోయి రెండు గంటలు అవుతోంది' చెప్పాడు శంకరం.
' కామేశం మీ ఇంట్లో?'
'డిటో'
'మరి నీ సంగతి ప్రభాకరం'
'నేను మాత్రం సింగపూర్లో వున్నానా, హైదరాబాదులోనే కదా! అదే పరిస్తితి'
'అది సరే కానీ మీ ఇంట్లో కరెంటు ఉందా?'  ఏకాంబరాన్ని అడిగారు ముగ్గురూ ఒకేసారి.
'వుంది. కాకపొతే ఇన్వర్టర్ కరెంటు'
'అలాటప్పుడు ఈ ఆరాలన్నీ ఎందుకు?'



'ఎందుకా! అందుకే. ఇన్వర్టర్ కరెంటు వుంది. ఎదురుగా 'ఈనాడు' పేపరు  వుంది. అందులో   'వచ్చే  ఏడాది  కూడా విద్యుత్  కోతలుండవ్' అంటూ  ట్రాన్స్ కొ సీ.ఎం.డీ. ఇచ్చిన ఇంటర్వ్యూ తాటికాయంత అక్షరాల్లో కనబడుతూ వుంది. ఇప్పుడు అర్ధమయిందా నా బాధ'  చెప్పాడు ఏకాంబరం. (05-04-2015 , 9 PM)

నమ్మితే నమ్మండి


ఈ చిత్రంలో కనపడే బోన్సాయ్ (మరుగుజ్జు వృక్షం) వయస్సు కేవలం నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే. ఇదొక్కటే దీని ప్రత్యేకత అనుకునేరు. 1945 లో అమెరికా, జపాన్ పై  ప్రయోగించిన అణుబాంబు సృష్టించిన భయానక విస్పోటాన్ని కూడా ఈ పొట్టి చెట్టు గట్టిగా తట్టుకుని నిలబడింది. ఈ జపాన్ మరుగుజ్జు వృక్షాన్ని చూడాలనుకునే వాళ్ళు వాషింగ్టన్ డీసీ లోని జాతీయ బోన్సాయ్ మ్యూజియం సందర్సించాలి. ఎందుకంటె దీన్ని అక్కడే భద్రపరచి పదిలంగా కాపాడుతున్నారు


.   
(Courtesy Shri PVVG Swami, USA)

బ్రహ్మాస్త్రం


అమ్మాయిలూ ఇలా చేసి చూడండి !

ఆ భవనంలో మీరు వెళ్ళాల్సింది ఆఖరు అంతస్తులోకి. బాగా పొద్దుపోయింది. లిఫ్ట్ లోకి మీతో పాటు  పరిచయం లేని ఓ మగవాడు కూడా  ఎక్కాడు. అతడి చూపులు, ప్రవర్తన మీకు అనుమానం కలిగించాయి.   అప్పుడు ఏం చెయ్యాలంటే, మీరు వెళ్ళాల్సిన అంతస్తు పన్నెండు అనుకోండి. పన్నెండు లిఫ్ట్ బటన్లు ఒకేసారి వరసగా ప్రెస్ చేయండి. దాంతో లిఫ్ట్ ప్రతి అంతస్తులో ఆగుతూ వెడుతుంది. అలా ఆగుతూ వెళ్ళే లిఫ్ట్ లో ఎలాటి అఘాయిత్యం చేయడానికీ ఏ మగవాడు సాహసించడు.

ఇంట్లో మీరు ఒంటరిగా వున్నారు. ఎవడో ముక్కూ  మొహం తెలియని మనిషి లోపల ప్రవేశించి  మీ మీద దౌర్జన్యం చేయబోయాడు. వెంటనే వంట గదిలోకి వెళ్ళిపొండి. కారపు పొడి డబ్బా ఎక్కడ వుంటుందో మీకు మాత్రమే తెలుసు. కత్తులూ, ప్లేట్లు ఎక్కడ ఉంటాయో తెలిసిందీ మీకే. వాటిని మీ రక్షణ కవచాలుగా మార్చుకోండి. స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లు, చెంచాలు  గదంతా విసరడం మొదలు పెట్టండి. ఆ చప్పుడుకు ఇరుగూపొరుగూ రావడం ఏమో కాని ఆ  ఆగంతకుడి గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖాయం. కాలికి బుద్ది చెప్పడం అంతకంటే ఖాయం.

రాత్రి వేళ వొంటరిగా ఆటోలోనొ,  టాక్సీలోనొ  వెళ్ళాల్సిన అవసరం పడింది. ఆటో ఎక్కే ముందే దాని నెంబరు రాసుకోండి. ఎక్కగానే మొబైల్ ఫోనులో ఇంటి వారికి వివరాలు ఆటో డ్రైవర్  వినేటట్టు పెద్దగా చెప్పండి. అవతల లైను కలవకపోయినా సరే,  ఆటో  వివరాలు ఎవరికో చెబుతున్నట్టు కాసేపు నటించండి. ఇక అంతే! అప్పటిదాకా వాడి మనసులో వేరే చెడు ఉద్దేశ్యాలు వున్నా  ఆ ఫోను కాలుతో అన్నీ సున్నా. తన వివరాలు మీకు తెలుసనీ, మీకే కాకుండా మీ వాళ్లకు కూడా తెలిసిపోయాయని  తెలుసుకుని  భయపడి పోతాడు. మీరు వెళ్ళాల్సిన చోటుకు భద్రంగా తీసుకువెళ్ళి దింపుతాడు. ఎందుకంటె మీకేదైనా జరిగిందంటే ముందు చుట్టుకునేది వాడి మెడకే అని వాడికి అప్పటికే  అర్ధం అయి వుంటుంది.  

మీరు ఎక్కిన ఆటోవాడు హఠాత్తుగా వేరే సందులోకి మళ్ళాడనుకోండి. గాభరా పడకండి. అదును చూసి మీ చున్నీతో వాడి మెడ గట్టిగా వెనక్కి లాగండి. ఊపిరాడక వాడే గిజగిజలాడుతాడు. అపాయం నుంచి తప్పించుకోవడానికి ఆ మాత్రం వ్యవధానం చాలు.

ఇంతకీ  చెప్పేదేమిటంటే...


'మృగాళ్ళ' నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేరే ఆయుధాలు అక్కరలేదు. మానసికంగా చురుగ్గా, సంసిద్ధంగా వుంటే చాలు, అదే మీ చేతిలో కనబడకుండా వుండే 'బ్రహ్మాస్త్రం'.

ఏమంటారు?

తవ్వుకుందాం రండి!


మా చిన్నతనంలో మునిసిపాలిటీ అనే పదానికి నానార్ధాలు, పర్యాయ పదాలు అనేకం ఉండేవి. కొందరు మున్సిపాలిటీ అంటే చెత్త కుండీ అనేవారు. పురాతత్వ శాఖను తవ్వకాల శాఖ  అనేవారు.

ఇప్పుడీ 'తవ్వకాలు' రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాయి. ఒక పార్టీ వారు ఏదన్నా అంటే చాలు,  గతాన్ని తవ్విపోసి లోగడ వారన్నమాటల్ని ఎదుటి పార్టీవాళ్లు ఒకటికి నాలుగు తగిలించి  అదే శ్రుతిలో తిరిగి వినిపిస్తున్నారు. తవ్వగా తవ్వగా నీటి జల బయట పడుతుందంటారు. అదృష్టం (దేశాలది) బాగుంటే కొండొకచో పెట్రోలు కూడా పడొచ్చు కానీ మన రాజకీయ నాయకుల తవ్వకాలవల్ల అలాటి ఉపయోగం కూడా వుండడం లేదు, కాకపొతే, మీడియాకు చేతినిండా పని, చూసేవాళ్లకు కాలక్షేపం కాసింత వినోదం తప్ప. అందుకే ఈ మధ్య అదనపు పన్నులు అదనంగా దేనిమీద  వేయాలని అదేపనిగా  ఆలోచిస్తున్న ప్రభుత్వ నేతలకు కొందరు,  టీవీలు చూసేవారిపై 'వినోదపు పన్ను' వేస్తె పోలా అని ఓ ఉచిత సలహా ఇచ్చారని అనధికార వర్గాల భోగట్టా.

(NOTE: COURTESY IMAGE OWNER) 
      

5, ఏప్రిల్ 2015, ఆదివారం

సభకి నమస్కారం

(నిన్న - 04-04-2015 -  సాయంత్రం హైదరాబాదు ఆర్టీసీ కళ్యాణ మంటపం మందిరంలో అరోరా పీజీ కళాశాల వార్షికోత్సవంలో నేను చేసిన ప్రసంగపాఠం)
సభకి నమస్కారం -
ఈ ఒక్క వాక్యం కనిపెట్టి నా స్నేహితుడు, సినిమా దర్శకుడు 'జంధ్యాల'  సభల్లో వృధా అవుతున్న ఎంతో విలువయిన సమయాన్ని ఆదా చేసాడు. వేదికమీద వున్న పెద్దల పేర్లు,  ప్రతివక్తా ప్రస్తావిస్తూ వచ్చే ఒక సంప్రదాయానికి జంధ్యాల ఆ విధంగా మంగళం పాడాడు.
సరే. విషయానికి వస్తాను. ఈ సభలో మాట్లాడమని నన్ను ఆహ్వానించిన క్షణం నుంచి నన్నో ప్రశ్న అదేపనిగా తొలుస్తూ వచ్చింది. ఇందుకు, నాకున్న అర్హత ఏమిటన్నది ఆ ప్రశ్న. రేడియోలో పనిచేసాడు కనుక ఏదో కొంత మాట్లాడకపోతాడా అన్న నమ్మకం కావచ్చు. అయితే రేడియో వాళ్ళతో ఓ ఇబ్బంది వుంది. వాళ్లకు అన్నీ టైం ప్రకారం జరగాలి. పదినిమిషాలు వార్తలు అంటే పిడుగులు పడ్డా ఒక్క క్షణం ఎక్కువ కాకూడదు, అలాగే పది నిమిషాలు దాటకూడదు. విషయం యెంత పెద్దదయినా క్లుప్తంగా చెప్పాలి. బ్రివిటీ ఈజ్ సోల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రేడియోలో చెప్పే మొదటి పాఠం.
అంచేత క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు ఇలాటి సభల్లో మాట్లాడడానికి పనికి రారేమో అనేది నాకు కలిగిన మరో  సందేహం.
మాట్లాడ్డం అంటే గుర్తుకు వచ్చింది.
పశుపక్ష్యాదులు కూడా భావాలను పంచుకుంటాయి. కానీ మాటలతో వాటిని  వ్యక్తీకరించలేవు. అయితే  ఒకటినొకటి అర్ధం చేసుకుంటాయి. మాటలు రాని పాపాయి మాటలు తల్లి అర్ధం చేసుకున్నట్టుగా.
గుర్రం సకిలిస్తుంది. ఆవు అంబా అంటుంది. సింహం గర్జిస్తుంది. పాము బుస కొడుతుంది. అయితే ఈ చరాచర  సృష్టి మొత్తంలో మాట్లాడగలిగే శక్తి ఒక్క మనిషికే దక్కింది. 
అంటే ఏమిటన్నమాట. మాట్లాడే ప్రతిమాటా ఆచితూచి మాట్లాడాలి. ఆదీ మంచి మాట అయివుండాలి. మంచికోసమే మాట్లాడాలి. ఇతరులని నొప్పించడం కోసం కాకుండా సాధ్యమైనంతవరకు వారిని  మెప్పించడం కోసం లేదా ఒప్పించడం కోసం  మాట్లాడాలి. మంచిని చూసి, మంచిని విని,  మంచినే  మాట్లాడ్డం వల్ల మనలో పాజిటివ్ వేవ్స్ ప్రసరిస్తాయి. శరీరం మనస్సూ రెండూ తగిన శక్తిని సమకూర్చుకుంటాయి.
విద్యార్ధి దశలో ఇవన్నీ మీకు ప్రతిరోజూ అనుభవంలోకి వచ్చే విషయాలే. మంచి ఉపాధ్యాయులు, మంచి స్నేహితులు, మంచి వాతావరణం ఇంతకంటే మనిషీ, మనసూ ఎదగడానికి ఏం కావాలి చెప్పండి. ఉపాధ్యాయులు చెప్పే  మంచి వినండి. స్నేహితులతో మంచి పంచుకోండి. మంచిగా మెలగండి. అలా మంచిగా ఉండడానికీ, లేకపోవడానికీ వుండే తేడా ఏమిటో మీ మనసుకే తెలుస్తుంది. అంతేకాదు, అలా రోజల్లా పంచుకుని, పెంచుకున్న మంచిని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి. ఇంట్లో కూడా అమ్మానాన్నతో, అక్కాచెల్లెళ్ళతో, అన్నాతమ్ములతో, ఇరుగూ పొరుగుతో మంచిగా ఉన్నారనుకోండి. ఇక పండగే పండగ. చెడు అన్నది దరి చేరనీయకుండా మంచినే పెంచుతూ పొతే ఇక ఆ సమాజానికి అంతా మంచే జరుగుతుంది. ఇందులో ఇంత  విషయం వుంది  కాబట్టే నాకిచ్చిన ఈ సమయాన్ని ఇందుకోసం వాడుకుంటున్నాను.
షరామామూలుగా యేవో కొన్ని అనుభవాలు, యేవో కొన్ని ఉద్భొదలు చెప్పి వెళ్లిపోవచ్చు. మాది గుంకే వయసు, మీది పొడిచే పొద్దు. మీరే సమాజానికి కావాల్సిన వాళ్ళు. మీ అవసరం సమాజానికి వుంది. నేను మాట్లాడుతోంది భావి పౌరులతోటి అన్న స్పృహతో మాట్లాడుతున్నాను. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ చేతుల్లో మాత్రమే అది భద్రంగా వుంటుంది.  సరయిన పౌర సమాజం మీవల్లనే రూపు దిద్దుకుంటుంది. అల జరిగిన నాడు ఇక భవిష్యత్తు గురించి మాకెవ్వరికీ  బెంగ అక్కరలేదు.
చదువుకునే మీరందరూ దీపాల్లాంటి వారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ పొతే, ఇన్ని కోట్ల దీపాలున్న మన దేశం వెదజల్లే  వెలుగులు ఎల్లల్ని దాటి, సమస్త ప్రపంచానికి విజ్ఞాన కాంతుల్ని ప్రసరింపచేస్తాయి. యావత్ లోకం ఓ విజ్ఞానఖనిగా తయారవుతుంది.
మరో మాట. నా పిల్లల చిన్నతనంలో,  మా ఇంటికి దగ్గరలో వున్న అరోరా కాలేజీలో చదివించాలని అనుకున్నాను. కానీ ఆ ఆశ అప్పుడు  తీరలేదు. అందుకే ఈనాడు మిమ్మల్ని అందర్నీ  చూస్తుంటే నా కడుపు నిండినంత ఆనందంగా వుంది.
మంచి కాలేజీలో చేరారు. ఆరోరా విద్యార్ధిని అని గొప్పగా చెప్పుకునేలా మీ ప్రవర్తన వుండాలి. అంతే  కాదు, పలానా విద్యార్ధి  మా కాలేజీలో చదివాడు  సుమా అని యాజమాన్యం కూడా చెప్పుకోగలిగితే ఇరువురూ ధన్యులే.
ఈ ధన్యత అరోరా కాలేజీ ఇప్పటికే సంపాదించుకుని ఉంటుందని నా నమ్మకం.
నా మాటలు ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.
సభకి మరోమారు నమస్కారం.
 - భండారు శ్రీనివాసరావు

(04-04-2015)

4, ఏప్రిల్ 2015, శనివారం

పెచ్చరిల్లుతున్న 'తుపాకీ సంస్కృతి'


(Published by 'SURYA' telugu daily in it's Edit Page on 05-04-2015, SUNDAY)

గత కొద్ది రోజులుగా మీడియాలో నేర స్వభావం కలిగిన సమాచారాలు చోటు చేసుకుంటున్నాయి.
సూర్యాపేట హైటెక్ బస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒక కానిస్టేబులు, ఓ హోమ్  గార్డు చనిపోయారు. పోలీసు ఇన్స్పెక్టర్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే దుండగులు దారిన వెడుతున్న ఓ కారును ఆపడానికి విఫల ప్రయత్నం చేసి ఆ కారును నడుపుతున్న వ్యక్తిని తుపాకీతో కాల్చి గాయపరిచారు.
హైదరాబాద్ సరూరు నగర్ ప్రాంతంలో ఇంట్లో ప్రవేశిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వారు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. హైదరాబాదు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులపై పెట్రోలు పోసి తగులబెట్టే ప్రయత్నం జరిగింది. నగరంలో తుపాకీని అమ్మజూపతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన  ఓ వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇవన్నీ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా జరిగిన సంఘటనలు. అయితే వీటిలో దండలో దారంలా దాగున్న నిజం ఒక్కటే. అది  పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి, నేర ప్రవృత్తి.         
సూర్యాపేట బస్ స్టేషన్ వంటి  బహిరంగ ప్రదేశాల్లో జరిగిన సంఘటన సంచలనంతో పాటు ఆందోళన కూడా కలిగిస్తోంది.  పోలీసులపై తెగబడి కాల్పులు జరిపిన ఈ నేరస్తుల అసలు లక్ష్యం ఏమిటన్నది ఇంకా బయట పడలేదు.  ఎందుకంటె వీటికి కారణభూతులయిన వారు ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. వారిని పట్టుకునేందుకు పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది.
సరూర్ నగర్ కాల్పులకు ఆస్తి తగాదాలు కారణంగా చెబుతున్నారు. పెట్రోలు పోసి తగలబెట్టడానికి ప్రయత్నించిన సంఘటనల్లో  అలాటి హేతువు కూడా కానరావడం లేదు.
తుపాకీ సంస్కృతి ప్రబలడం అనేది విశ్వవ్యాప్తంగా జరుగుతోంది. ఇంగ్లండులో గత పదేళ్ళలో ఈ రకమైన నేరాలు 89 శాతం పెరిపోయాయి. వీటిని అరికట్టడం ఎలాగా అని అక్కడి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఇక అమెరికాలో తుపాకులు అనేవి పౌరుల జీవితాల్లో ఒక భాగమై పోయాయి. ఇళ్ళల్లో ఆయుధాలు అట్టిపెట్టుకోవడం, ఆత్మ రక్షణ కోసం వాటిని యధేచ్చగా ఉపయోగించుకోవడం చట్టరీత్యాకూడా అక్కడ చెల్లుబడి అవుతోంది. అయితే ఆయుధాలను మారణాయుధాలుగా వాడుకోవడం అనుమతించరు. ఆయుధాల వినియోగం విషయంలో అక్కడి పోలీసులకు విపరీతమైన స్వేచ్ఛ వుంది. పరిమితి మించిన వేగంతో వాహనాలను నడిపేవారు పోలీసుల చేతికి చిక్కినప్పుడు వారి అనుమతి లేకుండా జేబులో చేయి పెట్టబొయినా పోలీసులు ఊరుకోరు. మారణాయుధం తీయడానికి ప్రయత్నిస్తున్నట్టుగానే అనుమానించి పోలీసులే  ముందుగా కాల్పులు జరుపుతారు. అయినా ఆ దేశంలో జరిగే కాల్పుల సంఘటనలు తక్కువేమీ కావు. తుపాకీ ధరించిన దుండగుడు ఏదైనా పాఠశాలలోకి  హఠాత్తుగా దూరిపోయి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉదంతాలు అక్కడ నిత్యకృత్యంగా మారిపోతున్నాయి.
సూర్యాపేట సంఘటన పరిశీలిస్తే పోలీసులకంటే దుండగులే ముందుగా కాల్పులకు పూనుకున్నట్టు తెలుస్తోంది. పోలీసుల దగ్గర కూడా ఆయుధాలు ఉన్నప్పటికీ వారు సకాలంలో స్పందించలేదనే ఆరోపణ వుంది. బస్సులో రొటీన్ గా జరిపే సోదాల్లో పోలీసులు అయుధాలు ప్రదర్శించి వుంటే అది మరో సంచలనవార్తగా మారివుండేది. కాబట్టి అమెరికా పోలీసుల మాదిరిగా కఠినంగా వ్యవహరించగల వెసులుబాటు మన పోలీసులకు లేదనేది కూడా కాదనలేని వాస్తవం.
వీటితో పోల్చలేకపోయినా మరో దారుణమైన విషయం గోవాలో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆధునిక దుస్తులు అమ్మే ఒక దుకాణంలో కొనుగోలు చేసిన దుస్తులు తమకు తగ్గట్టుగా సరిగా ఉన్నాయా లేదా అనే విషయం సరిపోల్చుకోవడానికి ఏర్పాటు చేసిన  గదిలో రహస్య కెమెరాలు అమర్చిన వైనం ఓ కేంద్ర మహిళా మంత్రి చేసిన పిర్యాదు కారణంగా వార్తలకెక్కింది. దుకాణంలో దొంగతనాలు జరగకుండా ఈ ఏర్పాటు చేసినట్టు యజమానులు చెబుతున్న కారణం ఆకుకూ పోకకూ అందకుండా వుంది.
తుపాకీతో చేసే ఘోరాలకన్నా  మహిళలపై  జరిగే అత్యాచారాల నైత్యం  తక్కువేమీ కాదు. మారణాయుధంతో నిండు  ప్రాణం తీయడానికి, 'మగతనం' అడ్డుపెట్టుకుని అబలల మానం  నిలువునా హరించడానికీ నేరస్థాయిలో తేడా ఏమీ లేదు. వీటికి చట్టంలో శిక్షలు కఠినంగానే వున్నాయి. కానీ చట్టం దోవ చట్టందే, నేరాల దోవ నేరాలదే అన్నట్టు విశృంఖలంగా పెరిగిపోతున్నాయి.

         

అయితే, కేవలం కఠిన శిక్షలు మాత్రమే  పెచ్చరిల్లుతున్న హింసా ప్రవృత్తికి అడ్డుకట్టవేయలేవు అన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం వుంది. చట్టాలకు పదును పెట్టి కఠిన శిక్షలు వేయడం అన్న ఒక్క ప్రక్రియే ఈ సమస్యలకు పరిష్కారం కాదు.
అసలు సిసలు మార్పు ఇళ్లనుంచి  మొదలు కావాలి. పిల్లల పెంపకం పట్ల తలితండ్రులు  తీసుకునే జాగ్రత్తలు కూడా సానుకూల మార్పుకు దోహదం చేస్తాయి. గతంలో పాఠశాలల్లో నైతిక ప్రవర్తనకు సంబంధిన పాఠాలు బోధించే పద్దతి వుండేది. యేది మంచి యేది చెడు అన్నది చిన్నతనం నుంచే అవగాహన చేసుకోవడానికి అవకాశం వుండేది. ఉమ్మడి కుటుంబాలకు మూలస్తంభాలు అయిన బామ్మలు, తాతయ్యలు పసితనం నుంచే పిల్లలకు నడత, నడవడిక గురించిన మార్గదర్శనం చేసేవాళ్ళు. ఎదిగే దశల్లో మనసును నియంత్రించుకోవడానికి అవసరమయిన నీతి పాఠాలు కుమార శతకం, కుమారి శతకాల్లో లభ్యం అయ్యేవి. అవన్నీ ఇప్పుడు కలికానికి కూడా కానరావడం లేదు. అధవా ఎవరయినా కలిగించుకుని చెప్పే నీతి వాక్యాలను  పాత చింతకాయ పచ్చడిలా పరిగణిస్తున్నారు.
అలాగే,   ఇప్పటి వేగ యుగంలో, పోటీ ప్రపంచంలో వాణిజ్యరూపం సంతరించుకున్న విద్యాసంస్థలకు నైతిక పాఠాలు బోధించే వ్యవధానం వుంటుందని ఆశించడం వృధా.   అటు కుటుంబాలలో కూడా పిల్లలకు  మంచీచెడూ చెప్పే వాళ్లు లేకుండా పోతున్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలు జీవన శైలి మెరుగుదలకు ఓపక్క దోహదం చేస్తూనే మరోపక్క యువత పెడదారులు తొక్కటానికి మార్గాలను  సులువు చేస్తున్నాయి. అందుకే  సమస్య మూలాల్లోకి పోయి పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది.  
ఏ సమాజనికయినా విలువల పతనాన్ని మించిన అధోగతి వుండబోదు.
దాన్ని నిరోధించకుండా చేసే ఏ ప్రయత్నాలయినా పై పూత మందులే అవుతాయికాని  అసలు రోగాన్ని సమూలంగా  నిర్మూలించలేవు. (04-04-2014)

Note : Courtesy Image Owner