13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

నీరు కారిపోతున్న ఆశలు



ఈరోజు  శుక్రవారంనాడు ప్రధాన తెలుగు దినపత్రికల్లో పతాక శీర్షికలు చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పడ్డ సంబరం ఆ రోజు సాయంత్రానికే ఆవిరై పోయింది. మాట్లాడుకుందాం రండి, సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందాం అంటూ తెలుగుదేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గతం గతః , ఆంధ్ర తెలంగాణా గొడవలేవీ  మనసులో పెట్టుకోవద్దని  టీ.ఆర్.యస్. అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నట్టు పత్రికల్లో చదివి ఆహా! మంచి రోజులు వచ్చేస్తున్నాయని జనం అటుపక్కా, ఇటు పక్కా మురిసి ముక్కచెక్కలయ్యారు. కానీ ఒక్క రోజుకూడా తిరక్కుండానే నాగార్జున సాగర్ దగ్గర రెండు రాష్ట్రాల అధికారుల నడుమ సంఘర్షణ ముదిరిపాకాన పడింది. సాగర్ లో నీటిమట్టం మాదిరిగానే మాటలు తగ్గి చేతులు కలుపుకునే పరిస్తితి దాపురించింది. అంతటితో  ఆగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు రంగం లోకి దిగి ఒకరిపై మరొకరు లాఠీలు ఝలిపిస్తున్న దృశ్యాలు టీవీ తెరలపై దర్శనమిచ్చాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పిన మంచి ముక్కలు ఉదయం పత్రికల్లో అయితే వచ్చాయి కానీ, వాళ్ల మాటల్లో కానవచ్చిన మంచితనం కింది స్థాయి దాకా చేరినట్టులేదు. రెండు దేశాల నడుమ సైనికుల్లా ఈ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు తలపడితే ఏమవుతుందని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. వాస్తు, ముహూర్తాలపట్ల నమ్మకాలు  లేనివాళ్ళకు కూడా ఈ పరిణామాలు చూస్తుంటే,  రాష్ట్ర విభజన 'మంచి ముహూర్తం'లో జరగలేదేమో అని అనుమానించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  



(మంచితనం మాటలకే పరిమితమా?)
       

దేవుడా! మజాకా!


లోకంలోని మగవాళ్ళందరూ కలసి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు.
'మంచి గుణవతి, సౌందర్యవతి, సౌశీల్యవతి, అణగిమణిగి నడుచుకుంటూ తమ చెప్పుచేతల్లో పడివుండే భార్యల్ని'  ఇమ్మని అడిగారు.
'ఓస్!  ఇంతేనా!' అన్నాడు దేవుడు.
'ఈ ప్రపంచం నలుమూలల్లో ఏమూలలో  చూసినా మీరు చెప్పిన ఆడవాళ్ళు వెతక్కుండానే మీకు  దొరుకుతారు, పోయి చూసుకోండి' అన్నాడు.
వచ్చిన పని వెంటనే అయిందని సంతోషపడుతూ వాళ్ళందరూ వెనుదిరగ్గానే, భూమిని గుండ్రంగా మార్చేసి, కడుపు పగిలేట్టు నవ్వుకున్నాడు దేవుడు.


(Note: Courtesy Image Owner)

10, ఫిబ్రవరి 2015, మంగళవారం

స్వీప్ చేసిన ఆప్

(Published in 'SURYA' telugu daily in its Edit Page on 12-02-2015, THURSDAY)

కేజ్రీవాల్ ది  ఘన విజయం అనుకోవాలా? ఇంకేదయినా గొప్ప  పదం వుందా!
మోడీది  ఘోర పరాజయం అనుకోవాలా? ఇంకేదయినా  మంచి విశేషణం వుందా!
మొత్తం డెబ్బయి సీట్లు వుంటే అందులో అరవై ఏడింటిలో ఆప్ విజయ పతాకం రెపరెపలా! కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కమల ధ్వజం ఎగురవేయాలని కలలుకంటున్న బీజేపీ అగ్ర నాయక ద్వయం మోడీ- అమిత్ షా ల విజయం కేవలం  మూడు స్థానాలకే పరిమితమా!
ఇలాటిది ఇంతకుముందు ఎప్పుడయినా జరిగిందా! మునుపెప్పుడయినా విన్నామా! కన్నామా!
నిరుడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆప్ పార్టీని  ఆనవాళ్ళు లేకుండా తుడిచిపెట్టిన మోడీ ప్రభంజనం ఇంత తక్కువ సమయంలోనే ఏమయిపోయినట్టు? యెలా ఆవిరై పోయినట్టు? అందివచ్చిన అధికారాన్ని కాలదన్నుకుని ఆ పొరబాటుకు లెంపలు వేసుకోవాల్సివచ్చిన  అరవింద్  కేజ్రీవాల్ ని మళ్ళీ హస్తిన ఓటర్లు  యెందుకు ఇంత త్వరగా అక్కున చేర్చుకుని ఆదరించినట్టు?
నిజంగా ఇదంతా జరిగిందా! జరిగిందంతా నిజమేనా!


(మోడీ వర్సెస్ మఫ్లర్ వాలా) 
   
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం  నుంచి అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి.
ఒకటి మాత్రం వాస్తవం. ఏ కొలమానంతో కొలిచినా, ఏ గీటురాయితో చూసినా, ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సాధించిన విజయం మాత్రం అపూర్వం, అనితర సాధ్యం.  అయితే, ఆయన సాధించిన విజయం కంటే మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి లభించిన ఘోర పరాజయం  ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితం మోడీ పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ప్రత్యర్ధులు బహిరంగంగా అంటుంటే, మోడీ మార్గం మార్చుకోవాల్సిన సమయం ఆసన్నం అయిందనడానికి సంకేతం అని ఆయన పార్టీవారే ఆంతరంగిక సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
కేజ్రీవాల్ గెలుపు, రానున్న రోజుల్లో రాజకీయాలు తీసుకోబోయే గొప్ప మలుపుకు నాంది అని అభిప్రాయపడేవారు కూడా లేకపోలేదు. భవిష్యత్ భారతంపై కొత్త తరం పెంచుకుంటున్న ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాల్లో గుణాత్మక మార్పులు చోటుచేసుకోవడానికి ఈ పరిణామాలు దోహదం చేస్తాయని భావించే ఆశావాదులు కూడా వున్నారు.
తొమ్మిదిమాసాలక్రితం జరిగిన లోకసభ ఎన్నికల్లో  విజయ దుందుభి మోగించి తనదయిన మార్కు పాలనతో ప్రజల  అభిమానం అపారంగా చూరగొంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఈ స్వల్పకాలంలో చేసిన పెద్ద తప్పిదాలు కూడా ఏవీ లేవు, ఢిల్లీ పౌరులు ఆయన పార్టీని ఇంత ఘోరంగా,  ఇంత భారీ స్థాయిలో తిరస్కరించడానికి. దేశమంతా 'మోడీ మోడీ' అని ఓ పక్క బ్రహ్మరధం పడుతుంటే, దేశ రాజధాని ఢిల్లీలో ఆయన నాయకత్వంలోని బీజేపీకి మూడంటే మూడు సీట్లు రావడం చూస్తే మోడీ  ప్రభావానికి అడ్డుకట్టపడబోతున్నదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే,  ఢిల్లీ ఫలితం మోడీ పరిపాలనపై ప్రజాతీర్పు అనడం కంటే, ఎన్నికల క్రతువులో విజయసాధన కోసం ఆయన పార్టీ అనుసరించిన కొన్ని అనైతిక విధానాల పట్ల ప్రజల నిరసనకు సంకేతంగా భావించడం సముచితంగా వుంటుంది. కేజ్రీవాల్ చెబుతున్న 'మార్పు' ను కోరుకుంటున్న ప్రజలకు బీజేపీ అగ్రనాయకులు అమలుచేసిన సాంప్రదాయిక రాజకీయ ఎన్నికల ఎత్తుగడలు మొహం  మొత్తించి వుంటాయి. మోడీ నాయకత్వంలోని బీజేపీ కూడా 'అదే తానులో ఒకముక్క' అనే అభిప్రాయాన్ని కలిగించి వుంటాయి. ఎన్నికల  ప్రచారం జరిగిన తీరు, అందులో నాయకులను పెద్దయెత్తున మోహరించిన విధానం, వ్యక్తిగత ఆరోపణలకు పెద్ద పీట వేసిన వైనం, 'మార్పు'ను బలంగా కోరుకుంటున్న ప్రజలకు బీజేపీ పట్ల  వైమనస్యాన్ని పెంచివుంటాయి.  ఓసారి ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని కాలదన్నుకుని, గతంలో చేసిన ఆ తప్పిదం మరో మారు చేయనని బహిరంగంగా అంగీకరించిన అరవింద్  కేజ్రీవాల్ పట్ల సానుభూతిని రగిలించివుంటాయి.      
ఇది ఆప్ విజయమా, బీజేపీ పరాజయమా అనే ప్రశ్న వేసుకుంటే నిస్సంశయంగా కేజ్రీవాల్ వ్యక్తిగత విజయమని ఒప్పుకోక తప్పదు. కుల, మత, వర్గాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ కలిసి కేజ్రీవాల్ కి కట్టబెట్టిన ఘన విజయం ఇది. లేకపోతే ఓటర్లలో సగానికి పైగా ఆయన పార్టీని ఎంచుకోవడం సాధ్యపడదు. 'పాంచ్ సాల్  - కేజ్రీవాల్' అనే నినాదానికి అనుగుణంగా, 'ఏమైనా సరే,  పూర్తి కాలం పాలించేలా  ఈసారి ఆయన్ని పూర్తి మెజారిటీతో  గెలిపించి తీరాలి' అనే కసితో జనం ఓట్లు వేసినట్టు కనబడుతోంది. కాబట్టే,  రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల్లో ఒకటయిన  కాంగ్రెస్ పార్టీని  వాక్యూం క్లీనర్ తో శుభ్రంగా  వూడ్చేసినట్టు సమూలంగా తిరస్కరించారు.   మరో జాతీయ పార్టీ బీజేపీని మూడు సీట్లతో సరిపుచ్చి,  ఆప్ పార్టీ ఎన్నికల గుర్తయిన 'చీపిరికట్ట'తో వూడ్చి పక్కనబెట్టారు. అందుకే కేజ్రీవాల్ దీన్ని 'ప్రజావిజయం' గా అభివర్ణించారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్ని ఆత్మ రక్షణలో పడేస్తే, ఆప్ కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. అదే సమయంలో ఓటర్లు  తమ తీర్పుతో రాజకీయ పార్టీలకి ఓ గట్టి సంకేతాన్ని కూడా ఇచ్చారు. తాము గట్టిగా తలచుకుంటే యెంత గట్టి పార్టీ తలరాతను అయినా ఇట్టే మార్చగలం అనే వారి హెచ్చరిక కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో అంతర్లీనంగా వుంది.                      
ఓడల్ని బండ్లుగా, బండ్లను ఓడలుగా చేయగల 'ఓటు' అనే మహత్తర ఆయుధం సగటు ఓటరు చేతిలో వుంది. 'ఒకసారి  ఓటరు ఇచ్చిన తీర్పుతో అధికార అందలం ఎక్కి, అదే శాశ్వతం అనుకుని ఆదమరచి వ్యవహరిస్తే ఫలితాలు యెలా వుంటాయి' అనడానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలే మంచి ఉదాహరణ. ఇవి బీజేపీకి, దానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోడీకి గుణపాఠం. అలాగే, ఆప్ నాయకుడు, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఓ హెచ్చరిక కూడా.  గతంలో చెప్పింది చేయలేకపోవడానికి ఆయన కారణాలు ఆయనకు వున్నాయి. ఈసారి అలా కుదరదు. చేయగల పనులన్నీ చేయగల 'చేవ'ను 'గొప్ప మెజారిటీ' రూపంలో ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. కాబట్టి సాకులు చూపి తప్పించుకునే వెసులుబాటు ఇక  ఎంతమాత్రం వుండదు.
అంతే  కాదు, ప్రజలు అనుక్షణం గమనిస్తూనే వుంటారు. వారి కళ్ళు కప్పడం అంత సులభం ఏమీ కాదు. వెనుకటి రోజుల్లో మాదిరిగా తాపీగా వ్యవహరిస్తాం అంటే కుదిరే పని కాదు. అయిదు రోజుల క్రికెట్ టెస్ట్ నుంచి 'ట్వంటీ ట్వంటీ' పోటీల  పట్ల మోజు పెరుగుతున్న రోజులివి. ఏదయినా త్వరత్వరగా జరిగిపోవాలని అనుకుంటారు. ఆ వేగం, ఆ వడీ చేతల్లో కానరాకపోతే ఇంతే సంగతులు.      
రాజకీయాల్లో రోజులు యెలా మారిపోయాయంటే,  పరమపద సోపానపఠంలో మాదిరిగా పెద్ద నిచ్చెన ఎక్కిన వారికి పెద్ద పాము నోట్లో పడడానికి కూడా అవకాశాలు ఎక్కువే. బీజేపీకి జరిగింది అదే! అది జరక్కుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత కేజ్రీవాల్ భుజస్కంధాలపై వుంది.
తస్మాత్ జాగ్రత్త!

(11-02-2015)

NOTE: Courtesy Image Owner

6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఇల్లాళ్ళ శ్రమకు సుప్రీం కోర్టు గుర్తింపు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 08-02-2015, SUNDAY)

ఇది జరిగి పాతికేళ్ళవుతోంది.
జైవంతిబేన్ జితేంద్ర త్రివేది సాధారణ గృహిణి. ఆర్ధికంగా కుటుంబానికి సాయపడేందుకు ఇంట్లోనే కుట్టు మిషన్ పెట్టుకుని ఇరుగూ పొరుగుకీ దుస్తులు కుట్టుపెడుతూ నెలకు కొంచెం అటూ ఇటూగా మూడువేలు సంపాదించేది. 1990, సెప్టెంబర్ 21 వ తేదీన ఒక రోడ్డుప్రమాదంలో ఆమె కన్ను మూసింది. కేసు విచారించిన ట్రిబ్యునల్ ఆమె భర్తకు, కుమార్తెకు  2,24 000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని ప్రమాదానికి కారకులయిన వారిని ఆదేశించింది. ప్రతికక్షులు హైకోర్ట్ ని ఆశ్రయించారు. హైకోర్టు పరిహారాన్ని 2,09400 రూపాయలకు తగ్గించింది. దాంతో మృతురాలి భర్త, ఆమె కుమార్తె కలిసి  అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తలుపు తట్టారు. పాతిక సంవత్సరాలుగా ఆ కుటుంబం చేస్తున్న న్యాయ పోరాటం ఇన్నాల్టికి  ఫలించింది.  పూర్వాపరాలను పరిశీలించిన మీదట,  తొమ్మిది శాతం వడ్డీతో సహా  మొత్తం 6,47000 పరిహారం చెల్లించాలని గతవారం కోర్టు తీర్పు చెప్పింది. మామూలుగా అయితే ఇదో మామూలు వార్తే. అందుకే కాబోలు సుప్రీం తీర్పు అనేక  పత్రికల్లో కానరాలేదు.
తీర్పు ప్రకటిస్తూ, జస్టిస్ భానుమతి,  జస్టిస్ గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవే ఈ వ్యాసానికి ప్రేరణ.


కుటుంబం కోసం గృహిణి అందించే సేవలు  విలువ కట్టలేవన్నది  ఆ వ్యాఖ్యల తాత్పర్యం. ఇల్లాళ్ళు  చేసే ఇంటెడు  చాకిరీని డబ్బుతో ముడిపెట్టి లెక్కలు కట్టడం సంభావ్యం కాదని సుప్రీం అభిప్రాయపడింది.
మోటారు కారు కిందపడి మరణించిన మహిళకు పరిహారం నిర్దేశించే సమయంలో సాధారణంగా గమనంలోకి తీసుకునే అంశాలతో పాటు ఆమె కుటుంబం కోసం పడే శ్రమను కూడా లెక్కలోకి తీసుకోవాలన్నది అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం.
ఇలాటి కేసులు విచారించేటప్పుడు,  ప్రమాదాల్లో మరణించిన వ్యక్తులపై వారి కుటుంబ సభ్యులు  ఏమేరకు ఆధారపడి వున్నారు, లేదా వారి మృతి కారణంగా ఆ కుటుంబాలకు ఏమేరకు ఆర్ధిక పరమైన లోటువాటిల్లిందన్న విషయాలు కూడా  కోర్టులు పరిగణన లోకి తీసుకోవడం కద్దు. సరిగ్గా ఈ అంశాన్నే న్యాయమూర్తులు తమ తీర్పులో ప్రస్తావించారు.
'ఇంటిపనిచేసే గృహిణులు గడియారం చూసుకుంటూ పనులు చేయరు. చేసిన పనికి యెంత  గిట్టిందని కూడా లెక్కలు చూసుకోరు.  సమయంతో నిమిత్తం లేకుండా, కాలంతోపాటు పరిగెడుతూ వాళ్లు రోజంతా తమవారికోసం కష్టపడతారు. మొత్తం కుటుంబాన్ని ఇరవై నాలుగుగంటలపాటు కంటికి రెప్పలా కనిపెట్టి చూసుకుంటారు. కాబట్టి వారి మరణంవల్ల కలిగిన లోటును నిర్ధారించే సమయంలో ఈ విషయాలను మనసులో వుంచుకోవాలి'  ఇదీ సుప్రీం తీర్పు తాత్పర్యం.
జస్టిస్ భానుమతి  తమ తీర్పులో ఇంకా ఇలా పేర్కొన్నారు.
'ఇళ్ళల్లో వుంటూనే ఇంటెడు చాకిరీ చేసే ఆడవాళ్ళ శ్రమదమాదులు  మొత్తం ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మానవ సమాజాల పురోగతికి (పరోక్షంగా) దోహదం చేస్తాయి.'        
న్యాయమూర్తులు  వెల్లడించిన ఈ  ధర్మ సూత్రాలు ఎన్నదగినవిగా, మెచ్చదగినవిగా  వున్నాయనడంలో ఎలాటి సందేహం లేదు.    
బాధితులకు సంపూర్ణ న్యాయం జరగడానికి న్యాయస్థానాల్లో  ఏండ్లూ పూండ్లూ పట్టిన విషయాన్ని పక్కనపెడితే, ఈ కేసును పురస్కరించుకుని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ పట్ల ఆశలు రేకిస్తున్నాయి. ఇళ్ళల్లో ఆడవారి చాకిరీని గుర్తించి గౌరవించే రోజులు రాబోతున్నాయేమో అనే ఆశను కలిగిస్తున్నాయి.
ఏది ఏమైనా సభ్యసమాజంలో ఆడవారి చాకిరీకి తగిన గుర్తింపు లేదనే మాట వాస్తవం. గుర్తింపు లేకపోగా 'ఇరవై నాలుగ్గంటలు ఇంటి పట్టున పడివుండి వాళ్లు చేసేది ఏముంది ' అని చులకనగా మాట్లాడేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కాబట్టే సుప్రీం వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ అవకాశాన్ని తీసుకుని దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. ఇళ్ళల్లో ఆడవారి సేవలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు, గౌరవం దక్కేలా అడుగులు పడాలి.
అయితే ఆ అడుగు వేసేది ఎవరు? వేయించేది ఎవరు?
'కార్యేషు దాసీ, కరణేషు మంత్రి' అంటూ కుటుంబంలో మహిళల  పాత్రను ఓ పక్క  శ్లాఘిస్తూనే,  వారిని శతాబ్దాల తరబడి ఇళ్ళల్లో కట్టు బానిసలుగానే వుంచేసారని కొందరు అంటారు.  స్వాభావికంగానే కుటుంబానికి సంబంధించిన అనేక రకాల పనులను  స్వచ్చందంగా చేయడానికి మహిళలు  మానసికంగా సిద్ధపడి వుండడం వల్లనే వాళ్లు  ఇలా నిస్వార్ధసేవలు అందించగలుగుతున్నారని అనేవారూ వున్నారు.  ఆడా మగా పెంపకం అనేది వివక్షతో కూడుకుని వున్నందువల్ల, చిన్నతనం నుంచి ఆడవారిలో  ఈవిధమైన సేవాతత్వం  జీర్ణించుకుని పోయింది. అయితే ఇలాటి వివక్ష మచ్చుకు కూడా కనిపించని పాశ్చాత్య సమాజాల్లోని మహిళలు  కూడా తల్లులుగా తమ బాధ్యతలను అదనంగా పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపొతే,  కాలానుగుణంగా  పిల్లల పెంపకం విషయంలో  ఈనాటి తలితండ్రులు బాధ్యతలు పంచుకుని సర్దుకుపోతున్న విషయం కూడా వాస్తవదూరం కాదు. అయితే, తండ్రి పాత్ర పోషించే మగవారు కొన్ని విషయాల్లో బాధ్యతలను ఒక పరిధిలోనే నిర్వహిస్తున్నారు. ఆడవారి మాదిరిగా అన్ని విషయాల్లో పసిపిల్లల మంచిచెడులను కనిపెట్టి చూడడంలో ఒక అడుగు వెనకే వున్నారు. పసిపిల్లల తల్లులు పారిశుధ్య కార్మికులుగా కూడా సేవలు అందిస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. ఉద్యోగాలు చేస్తున్న తలితండ్రులలో కొందరు మగవాళ్ళు తమ అభిజాత్యాలను కొంత పక్కనబెట్టి, ఇలాటి విషయాల్లో కూడా తమ  పిల్లల ఆలనాపాలనా  కనిపెట్టి  చూస్తూన్న సందర్భాలు లేకపోలేదు.  నగరాల్లోని మాల్స్ లో, సినిమా ధియేటర్లలో, రెస్టారెంట్లలో ఈరకమైన అధునాతన సర్దుబాటు  మనస్తత్వం కలిగిన తండ్రులు తారసపడుతూనే వుంటారు. ఈ మార్పు ఆహ్వానించతగ్గదే. అయితే ఇలాటి తండ్రుల సంఖ్య మనదేశంలో పరిమితమనే చెప్పాలి.
కొన్నాళ్ళక్రితం చదివిన ఒక ఆంగ్ల గల్పిక ఈ సందర్భంలో గుర్తుకు వస్తోంది.
విదేశాల్లో నివసిస్తున్న తన పిల్లల దగ్గరికి వెళ్ళి రావడానికి ఓ మహిళ వీసా కోసం కాన్సులేటు కార్యాలయానికి  వెడుతుంది. అక్కడి అధికారి ఆమెను 'మీరెవరు, ఏం చేస్తుంటారు' అని ప్రశ్నిస్తాడు.
'భారతదేశంలో సాధారణ మహిళలు ఏం చేస్తుంటారు?' అనే ప్రశ్నకు సమాధానం ఆమె బదులిచ్చిన పద్దతిలో కనిపిస్తుంది. పనీపాటా లేకుండా రోజులు గడపడం తప్ప ఆడవారికి మరో పని లేదని  పిడివాదం చేసేవారికి రోజంతా ఆడవారు ఇంట్లో ఎన్నెన్ని పనులు చక్కబెడుతుంటారో అర్ధం అయ్యేలా ఆమె జవాబు వుంటుంది. ఒక గృహిణిగా, ఒక  ఇల్లాలిగా, ఒక తల్లిగానే కాకుండా పారిశుధ్యకార్మికురాలిగా, పనికత్తెగా, వంటమనిషిగా, ఇంటి జమాఖర్చులు చూసే ఆడిటర్ గా, పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలిగా, సమాజానికి అవసరమయ్యే బాధ్యతకలిగిన  భావిపౌరులను తయారు చేసి ఇచ్చే సామాజిక కార్యకర్తగా ఒక  సాధారణ మహిళ ఎన్ని పాత్రలు పోషిస్తుందో, పడ్డ శ్రమకు ప్రతిఫలం ఆశించకుండా, పనిగంటలతో నిమిత్తం లేకుండా ఎన్నెన్ని పనులు చక్కబెడుతుందో ఆమె నోటి ద్వారా విన్న ఆ వీసా అధికారి ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతాడు.
ఇది కల్పన కావచ్చు కానీ,  ఒక విషయం మాత్రం నిజం.
ఆడవాళ్ళు కుటుంబంకోసం పడే శ్రమకు ఎటువంటి గుర్తింపు కోరుకోరు, ఎలాటి ప్రతిఫలం ఆశించరు. అందుకే వాళ్లు తరతరాలుగా అలాగే వుండిపోతున్నారు. (07-02-2015).
NOTE: Courtesy Image Owner

4, ఫిబ్రవరి 2015, బుధవారం

రాజకీయాల్లో 'ఉచితానుచితాలు'

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 05-02-2015, THURSDAY)



'గెలిపిస్తే వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తా' అన్నారు ఆ రోజుల్లో వై.యస్.ఆర్.
'అది అసాధ్యం' అన్నారు అప్పుడు  ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు.
తరవాత జరిగిన ఎన్నికల్లో కరెంటు ఉచితంగా ఇస్తానన్న వై.యస్.రాజశేఖర రెడ్డిని ప్రజలు గెలిపించారు. ఆ హామీ అసాధ్యం అన్న చంద్రబాబును ఓడించారు.
'మనమూ ఉచితం అంటే పోయేదేమో' అన్నారు చంద్రబాబు పార్టీవాళ్లు.
'అలా యెలా అంటాం . అది సాధ్యం కాని పని' అన్నారు అప్పట్లో చంద్రబాబు. 
పదేళ్ళు గడిచాయి. మరోసారి ఎన్నికలు వచ్చాయి.
రెండు తడవలుగా అధికారానికి దూరంగా వున్న చంద్రబాబు, 'నన్ను గెలిపిస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తా' అన్నారు.
'అది అసాధ్యం' అన్నారు వై.యస్. జగన్ మోహన రెడ్డి.
ఆ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఓడిపోయి జగన్ ప్రతిపక్షనేత స్థానానికి పరిమితమయ్యారు.
'మేమూ రుణ మాఫీ అని వుంటే మేమే గెలిచేవాళ్ళం. అలా అబద్దం చెప్పలేకపోయాం' అని చింతించడం వై.యస్.ఆర్. పార్టీ వంతయింది.
హామీలు ఎన్నికల వైతరిణిని దాటిస్తాయా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేకపోవచ్చు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూసిన తరువాత కాదని కూడా చెప్పలేని పరిస్తితి.
సర్వేల్లో గెలిచి అసలు ఎన్నికల్లో చతికిలపడిన వై.యస్.ఆర్.పార్టీకి ఓటమి అనేది జీర్ణించుకోలేని వ్యవహారమే.
సాధించిన ఓట్లశాతం బాగానే వున్నా, సీట్ల శాతం తగ్గిపోయి,  కనుచూపు దూరంలో అందివచ్చినట్టు కానవచ్చిన అధికార అందలం ఆఖరు నిమిషంలో చేజారిపోవడం ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు కడుపు రగిలించే విషయమే.
అందుకే, టీడీపీ  అధికారంలోకి వచ్చిన కొత్తల్లో  రుణ మాఫీ అమలు  విషయంలో ఆ పార్టీ కిందమీదవుతూ కుదేలవుతున్న తీరు చూసి ఆదిలోనే ప్రతిపక్ష వై.యస్.ఆర్.సీ.పీ. ఆందోళనకు దిగింది.  'నరకాసుర వధ 'పేరుతొ ఆందోళన చేపట్టింది. టీడీపీ అధికార పీఠం ఎక్కి ఎక్కువ రోజులు గడవకముందే ఆందోళనకు దిగడం వల్లనో,   ఆరునూరయినా రుణ మాఫీ హామీని నూటికి నూరు శాతం అమలుచేసి తీరుతామని తెలుగుదేశం నాయకులు పదేపదే చేస్తూవస్తున్న ప్రకటనల కారణమో తెలియదు కానీ  జగన్ ఆందోళన పట్ల  జనం స్పందన అంతంత మాత్రమే కావడం  తెలుగుదేశం నేతలకు కాసింత  వూరట కలిగించింది. ఆ తరువాత కూడా ఏదో ఒక పేరుతొ వై.యస్.ఆర్.పార్టీ  అనేక సమస్యలను ఎత్తి చూపుతూ ఆందోళనలు, దీక్షాశిబిరాలు నిర్వహించింది.  ప్రతిపక్షంలో వున్న ఏ పార్టీ అయినా ఇలాగె చేస్తుంది. అది వాటి రాజకీయ ధర్మం.                
మరోపక్క హామీ అమలును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చర్యలు మొదలు పెట్టింది. కానీ ఎటు చూసినా అవరోధాలే. కేంద్రం నుంచి వస్తుందనుకున్న సాయం మాటలకే మిగిలిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ససేమిరా అంది. ఇక రాష్ట్రంలోని బ్యాంకులతో ఎన్ని పర్యాయాలు చర్చలు జరిపినా వారు కొండెక్కి కూర్చున్నారు. కేంద్రంలో అధికారంలో వున్నది మిత్ర పక్షమే అయినా రుణ మాఫీ విషయంలో ప్రధాని మోడీ ఆలోచనలు వేరుగా వున్నట్టు వున్నాయి. ఇక దానితో తెలుగు దేశమే స్వయంగా రంగంలోకి దిగింది. కోటయ్య కమిటీ వేసింది. వాళ్లు సూచించిన దానికంటే ఎక్కువగానే ప్యాకేజీలు తయారు చేసింది. ఏమయితే మాత్రమేం అన్నీ అసలు హామీకి సరితూగనివే. అరకొర అనిపించే విధంగానే వున్నాయి. కొత్త రాష్ట్రం ఎదుర్కుంటున్న ఆర్ధిక ఇబ్బందులు వివరించి రుణ విమోచనకు కొన్ని  షరతులు పెట్టారు.  అయినా సరే, రైతుల నుంచి నిరసన వ్యక్తం కావడంలేదన్న ఒకే కారణం చూపి ప్రభుత్వం రోజులు దొర్లించింది.
మళ్ళీ ఇప్పుడు వై.యస్.ఆర్. పార్టీ అదే రుణ మాఫీ  అంశంపై తణుకులో గత వారం  రెండు రోజుల దీక్ష నిర్వహించింది.
ఈ దీక్షపట్ల ప్రజల స్పందన అమోఘం అని వై.యస్.ఆర్. పార్టీ సంబరపడుతుంటే అంత సీనేమీ లేదని  అధికారపక్షం ఎద్దేవా చేస్తోంది. రాజకీయాల్లో ఇదీ సహజమే.     
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఎన్నికల వాగ్దానం ఏదన్నా వున్నదంటే అది రైతుల రుణ మాఫీ హామీ ఒక్కటే. ఎన్నికల్లో ఎన్నెన్నో వాగ్దానాలు చేయడం అన్ని  రాజకీయ పార్టీలకి పరిపాటే. కాకపొతే, ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే ఆ హామీల అమలు ఉత్తర్వులపై 'మొదటి సంతకం చేస్తాం, రెండో సంతకం చేస్తాం' అంటూ చేసే  ప్రకటనలే ఒక్కోసారి వాటి మెడకు చుట్టుకుంటాయి. తెలుగుదేశం విషయంలో జరిగింది ఇదే. 'అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాము, త్వరలోనే అధికారంలోకి రాబోతున్నాము. త్వరపడి ఎవరూ రుణ బకాయిలు చెల్లించకండి' అని పిలుపు ఇచ్చింది కూడా ఆ పార్టీ అధినాయకులే.
నిజానికి తెలుగు దేశం పార్టీ ఇచ్చిన ఈ ఎన్నికల వాగ్దానం తప్పుపట్టాల్సిందేమీ కాదు. ఈ దేశంలో ఇటువంటి సాయానికి అర్హులైన వాళ్లు ఎవరయినా వున్నారంటే, వారిలో మొట్టమొదటి వాళ్లు మాత్రం  తిండి గింజలు పండించి జనాలకు ఇంత అన్నం పెడుతున్న వ్యవసాయదారులే. అందులో ఎంతమాత్రం సందేహం లేదు.  పంట పంటకీ అప్పులు చేస్తూ, పంట రాగానే వాటిని తీరుస్తూ, ప్రకృతి ప్రకోపించి వానలు, వరదలు, కరువులు కాటకాలతో పంటల్ని దెబ్బతీసినప్పుడు,  పెరిగిన వడ్డీలతో అప్పులు తీర్చలేక, వూరివారిలో తలఎత్తుకుని తిరగలేక వుసురు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యే రైతుల రుణాలు రద్దు చేస్తామని ఎవరయినా అంటే అది తప్పని అనేవారు వుండరు. అంటే మాత్రం వారిది పెద్దతప్పే.  
అయితే, అలాటి హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవాలంటే అది రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకి అలవిమాలిన పని. రైతుల రుణాలు రద్దుచేయడం అనేది ఒక ఫైలుమీద సంతకం చేయగానే జరిగిపోయే వ్యవహారం కాదు. అది అప్పులిచ్చిన బ్యాంకులతో ముడిపడిన విషయం. బ్యాంకుల మీద ఆజమాయిషీ చేయగలిగిన కేంద్ర ప్రభుత్వం కలగచేసుకోవాల్సిన అంశం. గతంలో రైతుల రుణాలు మాఫీ చేసిన దాఖలాలు లేకపోలేదు కానీ,  నూతన ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో ఇప్పుడా వెసులుబాటు కూడా  కానరావడం లేదు. రిజర్వ్ బ్యాంక్  నియమనిబంధల ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్తితి. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష వై.యస్.ఆర్. పార్టీ అసాధ్యం అని కొట్టివేసినా, 'మనసుంటే మార్గం వుంటుందని, ఆరునూరయినా అమలుచేసి చూపుతాం' అంటూ టీడీపీ నాయకులు  బీరాలు పలికారు. ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం ఎక్కిన తరువాత కానీ తత్వం బోధపడలేదు.  అందులో ముడిపడివున్న చిక్కుముడులన్నీ అవగతం కాలేదు.
తరువాత రకరకాల ఆలోచనలు చేశారు. నిజానికి ఈ విషయంలో చంద్రబాబు ఎన్ని పాట్లు పడాలో అన్నీ  పడ్డారు. బ్యాంకులను వొప్పించడం కోసం, కేంద్రాన్ని అర్ధించడం కోసం ఎక్కిన గడప ఎక్కకుండా కాలుకు బలపం కట్టుకుని తిరిగారు. సమావేశాలు పెట్టారు. సమీక్షలు జరిపారు. కానీ ఫలితం పూజ్యం. మరోపక్క కొత్త రాష్ట్రం  ఆర్ధిక పరిస్తితి చూస్తే మరింత అధ్వాన్నం. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు, పోను పోను ఉద్యోగుల  నెల జీతాలు చెల్లించడం కూడా  గగనంగా మారే ప్రమాదం పొంచి వుందని. ఈ స్తితిలో వేల కోట్లు అవసరం అయ్యే రుణమాఫీకి నిధులు సమకూర్చుకోవడం అంటే మాటలు కాదు. అందుకే కాస్త మాట తప్పినట్టు అనిపించినా సరే, ఇచ్చిన మాటను ఎంతో కొంతయినా నిలబెట్టుకోవాలని చంద్రబాబు తాపత్రయపడ్డారు. ఈ క్రమంలో రుణమాఫీ పధకానికి ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. రైతుల రుణాలకు కొత్త భాష్యాలు చెప్పారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి అర్ధం కాని మాటలు చెప్పారు. కుటుంబానికి ఒక రుణం అన్నారు. బంగారం తాకట్టు రుణాల మాట పక్కన బెట్టారు. డ్వాక్రా రుణాలు తరువాత చూస్తాం అన్నారు. దొంగ ఖాతాలు అన్నారు. ఆధార్  కార్డుల మెలిక పెట్టారు. బ్యాంకు ఖాతాలకే నేరుగా జమ చేశాం చూసుకొండన్నారు. ఇంత చేసినా, చివరికి  వ్రతం చెడ్డా ఫలం దక్కని చందం అయింది. నానా ఇబ్బందులు పడి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాం అని తృప్తి పడడమే మాత్రమే మిగిలింది.
ముఖ్యమంత్రిగా విశేష అనుభవం, పరిపాలనాదక్షుడిగా ఎంతో పేరూ వున్న చంద్రబాబు, ఒక్క హామీ కోసం ఇంతగా లాయలాస పడాలా అని అనుకున్నవాళ్ళు వున్నారు. 'ఆరునూరయినా సరే, రైతుల రుణ మాఫీ  హామీని నూటికి నూరుపాళ్ళు అమలుచేసి తీరుతాం' అని తెలుగుదేశం నాయకులు  పదేపదే ప్రకటనలు చేస్తూ పోవడంతో,  ఈ విషయంలో సన్నగిల్లిన రైతుల ఆశలు మళ్ళీ చిగుళ్ళు వేస్తూ వచ్చాయి. వున్న వాస్తవాన్ని ప్రజలకు వివరించి, హామీ అమల్లో వున్న ఇబ్బందులను విడమర్చి చెప్పి వుంటే రైతులు సకాలంలో తమ బకాయిలు ఏదోవిధంగా సర్దుబాటు చేసుకుని వుండేవారు. నిజానికి రుణమాఫీ చేయాల్సిందని రైతులు ఎప్పుడూ అడగలేదు. తన పాద  యాత్ర సమయంలో రైతుల కడగండ్లు గమనించి టీడీపీ అధినేత  అడక్కుండా ఇచ్చిన వరం అది.  బహుశా అందుకే కాబోలు ఆయన ఈ హామీ అమలుపట్ల అంతగా ప్రయాస పడివుంటారని అనుకోవాలి.
ప్రతి కధకూ ఒక నీతి వుంటుంది.
హామీల విషయంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా నేర్చుకోవాల్సిన నీతి పాఠం వుందని ఈ రుణ విమోచన హామీ ఉదంతం తెలియచేస్తోంది.
అమలు చేయగలిగిన హామీ మాత్రమే ఇవ్వాలన్నది ఆ నీతి.
తమ పరిధిలో లేని, తమ చేతిలో లేని  హామీలు గుప్పిస్తూ పోతే, ఇదిగో  ఇలాటి అనుభవాలే మిగులుతాయి.



NOTE: COURTESY CARTOONIST

(04-02-2015)

2, ఫిబ్రవరి 2015, సోమవారం

వైకల్యం శాపం కాదు



‘యాటిట్యూడ్’ గురించిన రెండున్నర నిమిషాల నిడివి కలిగిన ఒక మహాలఘు చిత్రాన్ని ఇప్పుడే నెట్లో చూసాను. దాన్ని అందరితో పంచుకోవాలన్న కోరికతో ఓ అరగంట టైం వృధా చేసాను. ఆ సాంకేతిక నైపుణ్యం సున్నా అని తెలుసుకుని దాన్ని గురించి క్లుప్తంగా రాస్తున్నాను.
శారీరకంగా బాగా బలంగా వున్న యువకుడు తనని తాను పోషించుకోవడానికి యాచక వృత్తికి దిగుతాడు. నలుగురి సానుభూతిని పొందడం కోసం రెండు కాళ్ళు సరిగానే వున్నా, కుంటివాడి మాదిరిగా కర్ర చేతిలో పట్టుకుని వీధుల్లో తిరిగి అడుక్కుంటూ వుంటాడు. ఒకరోజు అతడికి కారులో వెడుతున్న ఓ వ్యక్తి కనబడతాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి చేయి చాపుతాడు. ఈలోగా వాచ్ మన్ వచ్చి గేటు తెరవడం ఆ కారు లోపలకు వెళ్ళి ఆగడం జరుగుతుంది. యెర్ర దీపం వున్న ఆ కారు నెంబరు ప్లేటు మీద ‘జిల్లా కలెక్టర్’ అని రాసివుంటుంది. యాచక యువకుడు గేటులోనుంచి చూస్తూ వుండగా కారు డ్రైవర్ వచ్చి వెనుక డోరు తెరుస్తాడు. ముందు చేతి వూతం కర్ర కనబడుతుంది. ఆ తరువాత కుంటివాడయిన ఓ వ్యక్తి దిగి డ్రైవర్ సాయంతో ఆఫీసులోకి వెళ్లడం గమనిస్తాడు. అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి, కర్ర పొడుచుకుంటూ వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసి ఆగిపోతాడు. చేతిలో కర్రను రోడ్డుపై విసిరి వేసి కొత్తగా తనను ఆవరించిన ఆత్మ స్తైర్యంతో ముందుకు కదులుతాడు. దానితో చిత్రం ముగుస్తుంది.

NOTE: below is the LINK to watch the 2.42 mts short film

https://www.youtube.com/watch?v=uvH_RRyLcBc

31, జనవరి 2015, శనివారం

నాయకులు, నమ్మకాలు


(Published by 'SURYA' telugu daily in its edit page on 01-02-2015,Sunday)   
హైదరాబాదులో నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ వొడ్డున వున్న సచివాలయాన్ని ఎర్రగడ్డ ప్రాంతంలోని చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణానికి తరలించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది.  ముఖ్యమంత్రితో సహా మంత్రులందరి  కార్యాలయాలు, సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ విభాగాల ప్రధానాధికారుల కార్యాలయాలు మొత్తం అన్నింటినీ  ఒకే చోట నిర్మిస్తే, ప్రజలకు అనేక వ్యయ ప్రయాసలు తగ్గిపోతాయన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  మొన్న గురువారం సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్టు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నిర్ణయం గురించి ఇప్పటికే మీడియాలో కధనాలు వస్తున్నందువల్ల ఇదేమంత సంచలన నిర్ణయం కాదు. అలాగే అందుకు చూపిన కారణాన్ని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు.  కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆయన వెల్లడించిన మరో ప్రధాన  కారణం మాత్రం సంచలనాత్మకమైనదే. సందేహం లేదు.
నిజాం కాలంలో నిర్మితమయిన ప్రస్తుత సచివాలయం వాస్తు రీత్యా అనుకూలం అయినది కాదని ముఖ్యమంత్రి అభిప్రాయం. నిజానికి ఇది ఒక కారణం అయినా అధికార పదవుల్లో వున్నవాళ్ళు తమ వ్యక్తిగత నమ్మకాలను బహిరంగంగా వొప్పుకోరు,  ఇలాటి వాటిని గురించి  బయటకు చెప్పుకోరు. కానీ కేసీఆర్ వ్యవహార శైలే వేరు. భయంకరమైన వాస్తు దోషం వున్నందువల్ల ప్రస్తుత సచివాలయాన్ని అక్కడినుంచి మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఎలాటి భేషజాలకు పోకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. సచివాలయం తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న విపక్షాల విమర్శలకు ముఖ్యమంత్రి వాస్తు నమ్మకాలు మరింత  పదును పెట్టాయి. దీనితో అసలు విషయం వెనక్కిపోయి 'నాయకులూ, నమ్మకాలూ' అనే కొత్త చర్చ మొదలయింది.



ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ గురించి ఒక మాట  చెబుతారు. చేయి చాపుకునే హక్కు ఎవరికయినా వుంటుంది. కానీ ఆ చాపిన చేయి పక్కవాడి ముక్కుకు తాకనంతవరకే ఆ స్వేచ్ఛ. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది పక్కవారికి ఇబ్బంది కలిగించకూడదనేది  ఇందులోని అంతరార్ధం. దీన్నే కాస్త అటూ ఇటూ మార్చి, వాస్తు, జ్యోతిష్యం వంటి కొన్ని వ్యక్తిగత విశ్వాసాలకు కూడా అన్వయింపచేయొచ్చు. ప్రజాజీవితంలో వున్నంత మాత్రాన వ్యక్తిగత విశ్వాసాలకు నీళ్ళు వొదులుకోవాల్సిన అవసరం లేకపోయినా వాటికోసం ప్రభుత్వ ఖజానాలోని ప్రజా ధనాన్ని ఖర్చుచేయడం సమంజసం అనిపించుకోదు. వాస్తు అనేది వ్యక్తిగతం. మీకున్న నమ్మకాలనుబట్టి, మీ సొంత వనరులతో ఏం చేసుకున్నా ఎవ్వరు అభ్యంతర పెట్టాల్సిన అవసరం వుండదు. కానీ వాటికోసం ప్రభుత్వ నిధులను వెచ్చించాలని చూసినప్పుడే విమర్శలు ఎదురవుతాయి. వీటికి జవాబు చెప్పడం కొన్ని సందర్భాలలో తలకు మించిన  పని అవుతుంది.
రాజకీయ నాయకులు అనేకమందికి ఇటువంటి నమ్మకాలు వుండడం ఇటీవలి కాలంలో బాహాటంగానే చూస్తున్నాం.  ప్రతిదానికీ వాస్తు చూడడం, ప్రతి పనికీ ముహూర్తాలు అనడం ఒక ఆనవాయితీగా మారుతోంది. ప్రమాణ స్వీకారాలకు ముహూర్తాలు సరే, క్యాబినెట్ సమావేశాలు  సయితం ముహూర్తాల ప్రకారం మొదలుపెట్టడం  కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. పేర్లు ప్రస్తావించడం అనవసరం కానీ, గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు కూడా వాస్తు నమ్మకంతో అనేక నిర్మాణాలు చేశారు. కొన్ని కట్టడాలు పడగొట్టారు. సచివాలయం, అసెంబ్లీ ప్రధాన ప్రవేశ మార్గాలను మార్చారు. తమకు పనికొచ్చే వాస్తుకు అనుగుణంగా తమ కార్యాలయాల్లో, అధికారిక నివాస భవనాల్లో ప్రభుత్వ ఖర్చుతో పలుమార్పులు చేశారు. కానీ వారెవ్వరూ వాస్తు నమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తపరచకపోవడం వల్ల వారి చర్యలు మీడియాలో అంతగా వివాదాస్పదం కాలేదు.    
'వాస్తు హేతుబద్ధమా, జ్యోతిష్యం శాస్త్రీయమా' అనే మీమాంస కాదు ఇప్పుడు చర్చనీయాంశం. ఎవరి నమ్మకాలు వారివి. ఒకరి నమ్మకం మరొకరికి మూఢ నమ్మకంగా కానవస్తుంది. వ్యక్తిగా ఎవరు ఎలాటి నమ్మకాలు పాటించినా అది పూర్తిగా వారి వ్యక్తిగతం. కానీ ప్రజాజీవితంలో వున్నప్పుడు అర్ధాలు మారిపోతాయి. భాష్యాలు వేరుగా వుంటాయి. అది గమనంలో పెట్టుకుని వ్యవహరిస్తే ఆత్మ రక్షణలో పడే ప్రమాదాలు తగ్గిపోతాయి.
ఇక పోతే ఈ నమ్మకాలకు సంబంధించి కొన్ని సరికొత్త పాత సంగతులు:
ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా అధికారిక నివాస భవనం వుండాలనే ఉద్దేశ్యంతో గతంలో బేగం పేటలోని ప్రభుత్వ అతిధి భవనాన్ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి హయాములో ఆయన పేరు కలిసివచ్చేలా 'ఆనంద నిలయం' పేరుతొ ఏర్పాటు చేశారు. విజయ భాస్కరరెడ్డి మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే భవనంలో వుండేవారు. డాక్టర్ చెన్నారెడ్డి  తార్నకాలోని తన సొంత ఇంట్లో వుంటూ ముఖ్యమంత్రి హోదాకు తగినట్టు సౌకర్యాలను, తన వాస్తు విశ్వాసాలకు సరిపడేలా మార్పులనూ చేయించారు.  అంజయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు బరఖత్ పురాలోని ఆయన ఇల్లు చాలా చిన్నది కావడం వల్ల గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ని అనేక వాస్తు మార్పులతో 'జయప్రజా భవనం'గా తయారు చేశారు. ఆయన అర్ధంతరంగా పదవి దిగిపోయేవరకు అందులోనే వుండి, ఇరుకిరుకు గదులున్న తన చిన్న ఇంటిలోనే చనిపోయేవరకు రోజులు గడిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు కూడా ఈ విశ్వాసాలు జాస్తి. సినిమారంగం నుంచి వచ్చిన వ్యక్తి కావడం వల్ల వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన చంద్రబాబు నాయుడుకి వాస్తు పట్ల మొదట్లో  అంతగా పట్టింపు వున్న దాఖలాలు లేవు. కాకపొతే రెండు పర్యాయాలు అధికారానికి దూరం అయిన తరువాత ఆయనలో కూడా ఈ నమ్మకాలు పెరిగాయని చెబుతారు. గుంభన పాటించే తత్వం కాబట్టి ఈ నమ్మకాల విషయంలో ఆయన వ్యవహార శైలి పెద్దగా వార్తలకు  ఎక్కలేదు. కొత్త రాజధాని విషయంలో, సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం విషయంలో చంద్రబాబు వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ, పెద్దగా చర్చనీయాంశం కాలేదు.
రాజకీయ నాయకులే కాదు ఉన్నతాధికారుల్లో  సయితం వాస్తుకు తగ్గట్టు నడుచుకునేవారు పెక్కుమంది వున్నారు. వారి కార్యాలయాలను, అధికారిక నివాస భవనాలను ఎటువంటి భేషజం లేకుండా హాయిగా ప్రభుత్వ  ఖర్చుతో మార్పులు చేసుకున్నారు. కాబట్టే ఈ విషయంలో చంద్రశేఖర రావు నిర్ణయాన్ని రాజకీయంగా ప్రశ్నించగలుగుతున్నారు కానీ గట్టిగా నిలదీయలేకపోతున్నారు.
నమ్మకాలు అనండి, మూఢ నమ్మకాలు అనండి ఇప్పుడివి సమాజంలో చాలా విస్తృతంగా అనేక రంగాలలో అల్లుకుపోయాయి. అధికారం, డబ్బు ముడిపడివున్న రాజకీయ, చలనచిత్ర, వ్యాపార రంగాల్లో వీటి ఉనికి మరింత ప్రస్పుటంగా కానవస్తుంది. శాస్త్రీయ పరిశోధనా రంగాల్లో ప్రకాశిస్తున్న అనేకమంది కూడా వీటికి అతీతులు కారన్నది జగద్విదితం. కేవలం నిరక్ష్యరాస్యుల్లో మాత్రమే ఈ మూఢ నమ్మకాలు ఎక్కువ అనే వాదాలు ఇటువంటివారివల్ల పూర్వపక్షం అవుతున్నాయి. నాటి జన గణన ప్రకారం మన దేశ జనాభాలో నిరక్షరాస్యుల శాతం డెబ్బయి నాలుగు. కానీ వాస్తు, జ్యోతిష్యం వంటి నమ్మకాలు వున్నవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ. అంటే ఏమన్నమాట. చదువుకూ నమ్మకాలకూ ముడి పెట్టి మాట్లాడడం అంత సమంజసం కాదని.
ఈ నమ్మకాలకు సంబంధించి అనేక రసవత్తర విషయాలు చరిత్రలో చోటుచేసుకున్నాయి.
1951లో ఒక వార్తాపత్రికలో 'పాకిస్తాన్ తో మనకు యుద్ధం తప్పదు' అని ఒక జ్యోతిష్కుడు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. అది చదివిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా కోపం వచ్చింది. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వంటి వాటికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని సంకల్పించేంత వరకు వెళ్ళింది ఆయన ఆగ్రహం.
1962 జనవరిలో కొందరు భారతీయ జ్యోతిష్కులు అదే ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రపంచ ప్రళయం సంభవిస్తుందని జోస్యం చెప్పారు. ఆ ప్రచారానికి భీతిల్లి కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి కొండలు గుట్టలు ఎక్కి తలదాచుకున్నారు. సిక్కిం మహారాజు తన పెళ్లి వాయిదా వేసుకున్నారు. వ్యాపారాలు మందగించాయి. ఇదంతా చూసి నెహ్రూ, 'నవ్వుకోవడం మినహా చేసేదేమీ లేదు' అని వ్యాఖ్యానించారు. 1984 మార్చిలో ప్రపంచ యుద్ధం వస్తుందని 1981 లోనే అనేకమంది జ్యోతిష్కులు భవిష్యత్ వాణి వినిపించారు. 1995 లో విలయం వాటిల్లి 70-80 శాతం జనం తుడిచి పెట్టుకుపోతారని జ్యోతిష్యం చెప్పిన వాళ్లు వున్నారు. ఇవేవీ నిజం కాలేదు.

1981 జూన్ లో ఒక జ్యోతిష్కుడు ఒక అడుగు ముందుకు వేసి అదే ఏడు సెప్టెంబర్ లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురవుతారని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, ఆ  తరువాత కొద్దిరోజుల్లోనే శ్రీమతి గాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని కూడా చంపేస్తారని ఆయన చెప్పారు. ఆ దరిమిలా హెచ్ ఎన్ బహుగుణ ప్రధాని అవుతారని కూడా  ఆయన ముక్తాయింపు ఇచ్చారు. ఆయన జ్యోతిష్యం అప్పుడు నిజం కాలేదు కానీ, ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకు ఇందిరా, రాజీవ్ లు ఇద్దరూ హత్యకు గురయ్యారు. కానీ ముందే కూసిన ఆ 'కోయిల'ను  మాత్రం పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.  

'పనిచేసే ఆఫీసుల్లో మూఢనమ్మకాలు' అనే అంశంపై 2012 లో ఒక సర్వే చేశారు. ఎనిమిది నగరాల్లో  సుమారు ఎనిమిదివందల కంపెనీల్లో పనిచేసే సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకున్నారు. చివరికి  తెలిసింది ఏమిటంటే వారిలో అరవై ఒక్క శాతం మందికి వాస్తులో విశ్వాసం వుందన్నవాస్తవం.
అందుకే అన్నారు, 'మొక్కితే సాయి, తొక్కితే రాయి' అని.
అంతా నమ్మకంలోనే వుంది. నమ్మితే అది నమ్మకం, నమ్మకపోతే అది  మూఢ నమ్మకం.
 (31-01-2015)
NOTE: Courtesy Image Owner