13, డిసెంబర్ 2014, శనివారం

వండనలయదు వేవురు వచ్చిరేని..


ఎనభయ్యవ దశకం చివర్లో మేము మాస్కోలో వున్న ఆ రోజుల్లో,  ఆవిడను చూసినప్పుడల్లా 'వండనలయదు వేవురు వచ్చిరేని...అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి...' అని మనుచరిత్రలో ప్రవరాఖ్యుడి భార్య గురించి చదువుకున్న పద్యం గుర్తుకు వచ్చేది.
ఆవిడ ఇవ్వాళ లేరు. నిన్ననే అన్నీ ముగిసిపోయాయని ఆమె కుమారుడు రాహుల్ పొద్దున్నే ఇచ్చిన  ఎస్ ఎం ఎస్.
ఆవిడ సుందరమ్మ గారు.  ఆ రోజుల్లో మాస్కోలో చదువుకునే చాలామంది తెలుగు పిల్లలకు మాస్టరు గారి భార్య. ఆ మాస్టారు సామాన్యుడు కాదు. రాదుగ  ప్రచురణ విచాగంలో పనిచేసి ఈ మధ్యనే కన్నుమూసిన ప్రసిద్ధ రచయిత, గ్రంధ విమర్శకుడు రాళ్ళభండి వెంకటేశ్వర రావు గారు. (ఆర్వీయార్ గా  ప్రాచుర్యం పొందిన ఆయన సుప్రసిద్ధ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ మీది అభిమానంతో తన ఏకైక పుతృడికి  ఆ పేరే పెట్టుకున్నారు) మాస్కోలో ఆయన ఇల్లు అన్నపూర్ణ నిలయం. రోజూ ఎంతమందో అక్కడ సుందరమ్మ గారి  చేతివంట రుచి చూసి  వెళ్ళేవారు. ఆర్వీయార్ గారి ముచ్చట్లు, సుందరమ్మగారి చేతి వంటలు వినీ, తినీ భుక్తాయాసంతో వెనక్కిమళ్లడం నాకింకా గుర్తు.

(మాస్కోలో శ్రీ ఆర్వీయార్ గారి ఇంట్లో అప్పటి కేంద్ర మంత్రి శ్రీ శంకరానంద్ తో - గులాబీ రంగు చీరెతో వున్నది సుందరమ్మ గారు) 


ఎంతోమందికి పట్టెడన్నం పెట్టిన ఆ పుణ్యాత్మురాలికి సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను. (13-12-2014)

అన్నీ ఆశ్చర్యాలే!

  
ఒక పోలీసు ఉన్నతాధికారి పదవీ విరమణ అనంతరం ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే ఏమంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఈ మధ్య కాలంలో అది సర్వసాధారణమై పోయింది. కానీ 'ఆయన' విషయంలో అల్లా కాదు. వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ మనిషి. నరనరాన  కాంగ్రెస్ రక్తం. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ,  కాంగ్రెస్ బద్ధ శత్రువు అయిన తెలుగుదేశంలో చేరారు పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గా రిటైర్ అయిన ఆ పెద్ద మనిషి.
మరో ఆశ్చర్యం ఏమిటంటే ఎవరయినా ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలని అనుకున్నప్పుడు అధికారంలో వున్న పార్టీని ఎంపిక చేసుకుంటారు. ఈయన గారు మాత్రం ఏరికోరి అప్పుడే ఎన్నికల్లో వోడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగుదేశంలో చేరారు. అధికారంలో లేని పార్టీ నాయకుడ్ని కలవడానికి ఆ పార్టీ వాళ్ళే ఇష్టపడరు. వీలైనప్పుడల్లా మొహం చాటేస్తుంటారు. అలాటిది ఈయన ఆ పార్టీలో చేరడం ఆ రోజుల్లో చుట్టపక్కాల్లో, స్నేహితుల్లో ఒక చర్చనీయాంశం అయింది. నిజంగా విడ్డూరమే. సరే. చేరాడు. చేరిన తరువాత ఎన్నికలు రావడానికి  అయిదేళ్ళు నిరీక్షణ.  అంతటితో కధ ముగిస్తే బాగుండు. అయిదేళ్ళ తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన చేరిన తెలుగుదేశం పార్టీకి తిరిగి పరాజయమే ఎదురయింది. అంటే మరో అయిదేళ్ళు. ఆ తరువాత కూడా ఆ పార్టీకి ఎలాటి ఆశలు  లేని రోజులు వచ్చిపడ్డాయి. తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గరనుంచి అంటిపెట్టుకుని వుండి అధికార పదవులు అనుభవించిన  వారిలో కొందరు, పార్టీకి చెడ్డ రోజులు దాపురించగానే  ఎవరి దారి  వారు చూసుకున్నారు.  అయినా ఆ పార్టీని, ఆ పార్టీ నాయకుడినే అయన నమ్ముకున్నాడు. ఎట్టకేలకు  సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. తాను  ఎంపిక చేసుకున్న పార్టీ, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. కోరుకున్న చంద్రబాబే  కొత్త ముఖ్యమంత్రి అయ్యారు.  ఆరునెలలు గడిచాయి. నాయకుడి వద్ద నుంచి అడపాదడపా ఆశావహమైన సంకేతాలే  కాని ఖచ్చితమైన  ఆదేశాలు లేవు. అయినా నమ్మకం గొప్పది. నమ్మకాన్ని నమ్ముకున్నవాళ్ళు విజేతలవుతారని రుజువయింది. నాయకుడు మాట నిలబెట్టుకున్నాడు.  జీవో వచ్చింది,  ఆంధ్రప్రదేశ్ పోలీసు  హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ. అదీ క్యాబినెట్ హోదాతో.


పోలీసు ఉన్నతాధికారిగా వివిధ హోదాల్లో  పనిచేసి పదవీ విరమణ అనంతరం అదే శాఖలో ఒక ముఖ్యమైన సంస్థకు అలా చైర్మన్ అయ్యింది  ఎవ్వరో కాదు  మా మేనకోడలు శారద భర్త, మా సావిత్రక్కయ్య అల్లుడు  శ్రీ రావులపాటి సీతారామారావు గారు. వారికి మనః పూర్వక అభినందనలు.
ఒక చేత్తో కలం పట్టి రచనా వ్యాసంగం, మరో చేత్తో లాఠీ పట్టి శాంతిభద్రతలు పర్యవేక్షించిన మనిషికి ఈ కొత్త బాధ్యత మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిద్దాం.     

   

12, డిసెంబర్ 2014, శుక్రవారం

సర్వే జనా స్సుఖినోభవంతు


ఏకాంబరానికి కష్టాలు కట్టగట్టుకుని వచ్చాయి. ఏం చేయాలో తెలియక శివుడ్ని గురించి సుదీర్ఘ తపస్సు చేశాడు. చివరకి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు.



'మా ఆవిడకి నలతగా వుంది. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఎన్నో రకాల వైద్యాలు చేయిస్తున్నాను. అయినా నిమ్మలించడం లేదు' చెప్పాడు ఏకాంబరం
'సరే! ఆవిడ సంగతి చూస్తా! ఇంకేమిటి చెప్పు' అన్నాడు భోళాశంకరుడు
'మా చిన్నాడు చదువులో బాగా పూర్. ఒక్కో క్లాసులో రెండేళ్ళు లాగిస్తున్నాడు, వాడ్ని ఐ ఏ ఎస్ చెయ్యి స్వామీ నీకు పుణ్యం వుంటుంది'
'ఇంకా' అన్నాడు' వరాలు ఇచ్చే హుషారులో పరమేష్టి
'ఇంకా అంటే ఇంకా వున్నాయి, ఆఫీసులో చాకిరీ చేయించుకోవడమే కాని ఓ ప్రమోషనూ లేదు చట్టుబండలు లేదు. నువ్వు తలచుకుంటే నన్ను మా ఆఫీసుకి మేనేజర్ని చెయ్యలేకపోతావా?'
'ఓస్ అంతేనా ఇంకా ..'
ఏకాంబరం నోరు తెరిచేలోగా విష్ణు మూర్తి హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పాల సముద్రంలో శేష పాన్పుపై పవ్వళించి లక్ష్మీ దేవితో పాచికలు, పరాచికాలు  ఆడుతూ మరో కంట ముక్కంటి వరాల జల్లు కురిపిస్తున్న చందాన్ని వీక్షించినవాడై 'సిరికిన్ చెప్పడు...' పద్యం బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుండగా ఏకాంబరం కోరికల చిట్టాకు అడ్డం  పడి అడిగాడు.
'ఏమయ్యా ఏకాంబరం! ఏవిటా అడగడం. నటరాజుకి నీలాగా  పనీపాటా లేదనుకున్నావా! నీ తపస్సు చూసి ముచ్చటపడి,  ఆయన పార్వతీ దేవితో కలిసి చేస్తున్న శివ తాండవ నృత్యం కూడా మధ్యలో వొదిలేసి వచ్చేసాడు. నువ్వేమో అంతూ పొంతూ లేని కోరికల జాబితా ఆయన ముందు పెడుతున్నావు. ఇవన్నీ ఎందుకు కాని ఓ చిట్కా చెబుతా విను. ఒకే ఒక వాక్యం తో కూడిన వరం. నీకూ మంచిది, ఆయనకూ మంచిది. లోకానికి మరీ మంచిది.
అదేమిటంటే -
సర్వేజనా స్సుఖినోభవంతు - అందరూ బాగా వుండాలని కోరుకో! ఒక్క ముక్కతో  సరిపోతుంది.
ఆ అందరిలో నువ్వూ ఉంటావు కదా! ' అన్నాడు.
ఏకాంబరానికి విష్ణువు లాజిక్ అర్ధం కాలేదు, కానీ పరమేశ్వరుడు మాత్రం  వరాలు ఇవ్వడంలో తనకున్న బలహీనత తెలిసిన విష్ణువే ఇలా సమయానికి వచ్చి తాను  మరో పొరబాటు చేయకుండా అడ్డుపడ్డాడని అర్ధం చేసుకున్నాడు.

NOTE Courtesy Image Owner 

మళ్ళీ 'పవనాలు' వీయబోతున్నాయా !


1982 - 2008 - 2014
తెలుగు జాతి రాజకీయ  చరిత్రకు  సంబంధించి  ఈ సంవత్సరాలకు చాలా ప్రాధాన్యత వుంది. ఆ మూడు సంవత్సరాలలో  తెలుగు సినీరంగ ప్రముఖులు మువ్వురు తెలుగునాట రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. వీరిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు అలనాడు ధృవతారగా వెలిగిన శ్రీ నందమూరి తారక రామారావు. 1982 మార్చి21 వ తేదీన ఆనాటి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 'తెలుగుదేశం' పేరుతొ ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు నాటకీయ పక్కీలో ఒక ప్రకటన చేసి మొత్తం రాజకీయ వర్గాలను ఆశ్చర్య చకితులను చేసారు. అంతకుముందు  సినీ రంగానికి చెందిన జగ్గయ్య వంటి కళాకారులు ఎన్నికల్లో పోటీచేసినా  అది పరిమిత పరిధుల్లోనే జరిగింది. పొరుగున వున్న తమిళనాట మాదిరిగా సినీ రంగానికి చెందిన వారు రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసే సంప్రదాయం మన రాష్ట్రానికి అప్పటికి కొత్త. పార్టీని స్థాపించిన  తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా  అధికార పగ్గాలు చేపట్టి దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్టీయార్  ఒక రికార్డు నెలకొల్పారు. ఆ తరువాత చాలా ఏళ్ళు గడిచిన అనంతరం  2008 లో మరో అగ్రనటుడు రాజకీయాల్లోకి వచ్చి 'ప్రజారాజ్యం' పేరుతొ మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  వరసగా అనేక సంవత్సరాలు తెలుగు చలనచిత్రసీమను వొంటి చేత్తో శాసించిన మెగా  స్టార్ చిరంజీవి  తన పార్టీని ఓ ప్రభంజనం మాదిరిగా జనంలోకి తెచ్చి మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. అయితే ఆయన ప్రయత్నాలు అనుకున్న విధంగా  ఫలించక పోవడంతో పద్దెనిమిది సీట్లు, పద్దెనిమిది శాతం వోట్లతో అధికారానికి ఆమడ దూరంలోనే ఆగిపోయారు. తన మనస్తత్వానికి ఈ రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు సరిపడవని నిర్ధారణకు వచ్చారేమో తెలియదు కాని, తొమ్మిదినెలల్లో అధికారానికి వచ్చిన ఎన్టీయార్ రికార్డు మాదిరిగా పార్టీని స్థాపించిన మూడేళ్ళలోనే దాన్ని కాంగ్రెస్ లో కలిపేసి చేతులు దులుపుకున్నారు. దరిమిలా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో  ఒక స్థాయి మంత్రి పదవితో సంతృప్తి పడి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నామమాత్రంగా ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అన్నగారి ప్రజారాజ్యం పార్టీ  యువజన విభాగం అయిన యువ రాజ్యం నాయకుడుగా రాష్ట్రం నలుమూలలు తిరిగి ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసి, కాంగ్రెస్ వారి పంచెలు వూడదీస్తాననే తీరులో తనదైన బాణీలో  ఆవేశపూరిత ప్రసంగాలు  చేసి, ఎన్నికల అనంతరం అన్నగారు పార్టీతో సహా ఆ కాంగ్రెస్ పంచనే చేరడం హరాయించుకోలేక  పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా, మౌనంగా వుండిపోయారు.. మళ్ళీ ఈ ఏడాది ఎన్నికలకు ముందు  హఠాత్తుగా రంగ ప్రవేశం చేసి  2014 మార్చిలో జనసేన పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసున్నట్టు ఆర్భాటంగా ప్రకటించి తన అభిమానులను అలరించారు. రాజకీయ ప్రత్యర్ధులను అదరగొట్టారు. అప్పటివరకు అన్నచాటు  తమ్ముడిగా పేరున్న పవన్, అదే  అన్నగారి పార్టీకి  వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయడం అందరికీ ముఖ్యంగా అయన కుటుంబంలోని వారికే ఎంతో  ఆశ్చర్యం కలిగించింది. పేరుకు  పార్టీ అయితే పెట్టారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మరో ప్రకటన చేసి అభిమానులను ఉసూరుమనిపించారు. ఈలోగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.  రాష్ట్ర విభజన అంశం ఆయనకు బాగా కలిసివచ్చింది. జాతీయ రాజకీయాల్లో కొత్త మెరుపులు మెరిపిస్తున్న మోడీ ఆయనకు బాగా నచ్చారు.  పవన్ వంటి జనాదరణ వున్న సినీ హీరోల అవసరం మోడీకి లేదా ఆయన నాయకత్వం  వహిస్తున్న బీజేపీకి వున్న మాట కూడా కాదనలేనిది. ఆనాటి పరిస్తితులు అలాటివి. అది పవన్ కళ్యాణ్ కు మరింతగా కలిసివచ్చింది. మంచి డైరెక్టర్, చక్కని తారాగణం, గట్టి కధాబలం వున్న సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది అన్న సినీ సూత్రం వంటబట్టించుకున్న పవన్, తెలివిగా అడుగులు వేసి బీజేపీతో చేతులు కలిపాడు. అంతే  కాదు, తాను కొత్తగా స్థాపించిన 'జనసేన' పార్టీని ఎన్నికలబరిలో దింపకుండా, సీట్లకోసం బేరసారాలు ఆడకుండా,  తాను కూడా పోటీ చేయకుండా ఒక కొత్త వ్యూహంతో మోడీ పార్టీకి ప్రచారం చేసిపెట్టాడు. ఇది సినీ రంగంలో మామూలే. తాము వాడని సబ్బులకు వారు తమ ప్రకటనలతో  గిరాకీ కలిపిస్తారు. అదే వాణిజ్య సూత్రాన్ని పవన్  ఎన్నికల్లో ప్రయోగించి ఫలితాలను ప్రభావితం చేసే విధంగా  అటు మోడీకి, మరోపక్క బీజేపీ మిత్రపక్షం అయిన టీడీపికి ప్రచారం చేసిపెట్టారు. పవన్ ఆవేశం, సమాజంపట్ల  ఆవేదన ఆయన ప్రసంగాలలో ప్రతిఫలించడంతో  అభిమానులనే కాకుండా సాధారణ  జనాలను సయితం ఆయన ఆకట్టుకోగలిగాడు. ఫలితం గురించి వేరే చెప్పక్కర లేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి లభించిన విజయంతో మోడీ దృష్టిలో  పవన్ నిజంగా ఒక హీరో అయిపోయాడు. మోడీ తన  ప్రమాణస్వీకారానికి రావాల్సిందని  స్వయంగా ఆహ్వానించడం దీనికి దృష్టాంతం.
సరే! ఎన్నికలు ముగిసాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొలువు తీరారు. ఎవరికి వారు తమ పనుల్లో తీరికలేకుండా మునిగి పోయారు. వారు అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, కొద్దో, గొప్పో సహకరించిన  మరి పవన్ కళ్యాణ్  ఇన్నాళ్ళు ఏమైనట్టు? ఆయన పెట్టిన జనసేన సంగతి ఏమిటి? కాకపొతే, ఇటీవల ఒక సందర్భంలో ఆయనే చెప్పారు కొత్త చిత్రాలతో బిజీగా వున్నానని.
ఈ నేపధ్యంలో ఒక వార్త తిరిగి సంచలనం సృష్టించింది. పవన్ పార్టీ జనసేన, రిజిస్ట్రేషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని. పార్టీ ఎన్నికల చిహ్నం విషయం కూడా త్వరలో నిర్ణయం కాబోతోందని. స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకే గుర్తుపై పోటీ చేయడానికి వీలుగా తాము పెట్టుకున్న అర్జీకి ఆమోదం రాగానే జనసేన భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటించడం  జరుగుతుందని స్వయంగా పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన 'జనసేన' వెబ్ సైట్ లో కానవస్తోంది. అంటే క్రియాశీలక రాజకీయ పార్టీగా జనసేన ఇక ముందు వ్యవహరించబోతోందన్న ధ్వని ఇందులో వుంది. దానికి తోడు 2019  ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పిన  మాట గమనార్హం.
ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో పవన్ పార్టీ,  రాష్ట్ర రాజకీయాలను  అంటే,  ఇటు తెలంగాణాలో, అటు ఆంద్ర ప్రదేశ్ లో ఏమేరకు ప్రభావితం చేయగలుగుతుంది అన్నది చర్చనీయాంశంగా తయారయింది. ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధానం వుంది కాని అది వేరే సంగతి.
ప్రస్తుతానికయితే దేశంలో మోడీ హవా బాగా సాగుతోంది. స్వయంగా ముందరి కాళ్ళకు తనకు తానుగా బంధాలు వేసుకోకపోతే చంద్రబాబు నాయుడికీ అంత ఇబ్బందికర పరిస్తితి ఏమీ కనబడడం లేదు. ఏదయినా అలాటి  అవకాశం వస్తే ఎగరేసుకుపోవడానికి వైయస్సార్ పార్టీ కాచుకునే వుంది. మరి ఈ పరిస్తితుల్లో - అప్పుడప్పుడు  మెరిసి  మురిపించే పార్టీగా పేరు తెచ్చుకున్న పవన్ పార్టీ కి కొత్తగా లభించే అవకాశాలు ఏపాటివి?
భవిష్యత్ ఎన్నికల్లో ప్రత్యేకించి ఆంద్ర ప్రదేశ్ లో పవన్ సాయం తీసుకోవడానికి బీజేపీకి ఎలాటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పవన్ వంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు వొప్పుకోవాలే  కాని జనసేనను తమ పార్టీలో కలుపుకోవడానికి కూడా సిద్ధపడవచ్చు. ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో, ముందస్తు చూపుతో 'కాంగ్రెస్ రహిత భారత దేశం' అనే స్వప్నాన్ని  సాకారం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో, ప్రధానంగా దక్షిణాదిన,   ప్రజాదరణ వున్న స్థానిక నాయకులను దగ్గరికి తీసుకునెందుకు పావులు కదుపుతున్న విషయం రహస్యమేమీ కాదు.  మోడీకి దగ్గరవాడు కావడం, రాజకీయాలకు కొత్తకావడం పవన్ కు ఈ విషయంలో అదనపు అర్హతలు.


అయితే ఇక్కడ చిక్కుముడి ఎవరో కాదు.  పవన్ కల్యాణే.  పవన్ అంటేనే గాలి. అది ఎటు  వీస్తుందో ఎవరికీ తెలియదు. పవన్ మనసులో ఏముందో పవన్ కే తెలియదని హాస్యోక్తిగా చెప్పుకుంటారు.
అట్టహాసంగా పార్టీ పెట్టాడు. పోటీ చేయలేదు. పెట్టిన పదేళ్ళ తరువాత పోటీకి దిగుతానని మరో ప్రకటన చేసాడు. రాజకీయాల్లో ఇవన్నీ కొత్త పుంతలు.
రాజకీయ విశ్లేషణలు చేసేవారికి కూడా ఆయన ఒక పట్టాన  కొరుకుడు పడడు.  అందుకే అయన ఏం చెయ్యబోతున్నాడన్నది ఊహకు అందని విషయం.
కొసమెరుపు:
'జనసేన' వెబ్ సైట్ చూసిన వారికి ప్రముఖంగా ఒక వాక్యం కనిపిస్తుంది.
"నేను రాజకీయవాదిని కాను - పవన్ కళ్యాణ్"   
(12-12-2014)
NOTE : Image Courtesy Owner 

11, డిసెంబర్ 2014, గురువారం

భూమంత్రం


యాభై ఏళ్ళకు పూర్వం అప్పటి కేంద్ర మంత్రి కే ఎల్ రావు గారి పుణ్యమా అని మా ఊళ్లకు కరెంటు వచ్చింది. వీధి  దీపాలే కాని,  బాగా కలిగిన కామందులు కూడా ఇళ్ళకు  కరెంటు కనెక్షన్ తీసుకోవడానికి సంక్షేపించారు. ఆ రోజుల్లో అప్పుడే తండ్రి చనిపోయి ఇంట్లో పెత్తనం చేతికి వచ్చిన మా స్నేహితుడొకరు మొత్తం ఇంటిని  ఆధునికం చేసే పని మొదలు పెట్టాడు. పెంకుటిల్లు తీసి డాబాగా మార్చాడు. గోడలకు కొత్తగా మార్కెట్లోకి వస్తున్న రంగులు వేయించాడు. కరెంటు కనెక్షన్ తీసుకున్నాడు. ప్రతి గదిలో ఫ్యాన్లు, ట్యూబు లైట్లు, ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా గుండ్రటి అద్దాలు వున్న దీపాలు పెట్టించాడు.  నాలుగు బ్యాండ్ల  రేడియో కొన్నాడు. ఇంటి ముందు వసారాలో పేము కుర్చీలు వేసాడు. లోపల డైనింగ్ టేబులు, డెకొలాం మంచాలు, దోమతెరలు,  తిరగడానికి మోపెడ్ ఇలా చూస్తుండగానే వూళ్ళో వాళ్లకు ఓ అద్భుత ప్రపంచాన్ని కన్నుల ముందు ఉంచాడు. అంతా భేష్ అన్నారు. ఇంట్లో వాళ్ళయితే సంతోషం పట్టలేకపోయారు. ఇది ఇంటర్వెల్ ముందు కధ. ఇలాటివి ఇరవై రీళ్ళు వుండవు. షార్ట్ ఫిలిమ్స్. అలా చూస్తుండగానే ముగింపు తోసుకువస్తుంది. అదే జరిగింది. పొలాలు చూసి అప్పులిచ్చిన వాళ్ళు ఆ పొలాలమీదే కన్నేశారు. బాకీలు తీర్చడానికి వున్న ఆస్తి సున్నా అయింది. పూలమ్మిన చోట సామెత మాదిరిగా జీవితం తయారయింది. ఇంతే కావాలి, లేకపోతే ఏం చూసుకుని ఆ ఎగురుడు అని నలుగురూ నానా మాటలు అన్నారు. దాంతో నలుగురిలో తలెత్తుకుని తిరగలేక మొత్తం కుటుంబం ఓ రోజు వూరు విడిచి వెళ్ళిపోయింది.

ఇన్నేళ్ళ తరువాత ఇదెందుకు గుర్తుకు వచ్చింది అంటే -
కొత్తగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్తితులు చూసి.
ఒకరి దగ్గర డబ్బుందని అంటున్నారు. మరొకరేమో 'డబ్బా అసలేలేదు ఎలానో ఏమిటో' అని పేద మాటలు చెబుతున్నారు. కానీ ఇద్దరి తరహా చూస్తె, పెట్టె ఖర్చులు చూస్తె, చేసే ఆలోచనలు చూస్తె ఆకాశాన్ని తాకుతున్నాయి. అవి నిజం కావాలంటే, వున్న డబ్బే కాదు  యెంత డబ్బున్నా ఏ మూలకూ చాలదు.
అందుకే కాబోలు ఇద్దరూ 'భూ మంత్రం' అందుకున్నారు.

చూద్దాం ఏం జరుగుతుందో!  
NOTE : Courtesy Image Owner       

10, డిసెంబర్ 2014, బుధవారం

రక్తం తాగుతున్న రోడ్లు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 11-12-2014, THURSDAY)

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని వేలమంది మరణిస్తున్నారని ప్రభుత్వాలు గణాంకాలు విడుదల చేస్తుంటాయి. కానీ ఆ ప్రమాదాల్లో అర్ధాంతరంగా కన్నుమూసిన వారి కుటుంబాల వ్యధ గురించి ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోరు. అటువంటి వారి అకాల మరణం ఒక తీరని వెత అయితే, అందువల్ల వారి వారి కుటుంబాల్లో ఏర్పడే పరిణామాలు, పర్యవసానాలు చాలా తీవ్రంగా వుంటాయి. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి  ఒక కుటుంబానికి ఏకైక ఆధారం కావచ్చు. మంచిగా  చదువుకుంటూ భవిష్యత్తులో ఒక కుటుంబానికి చక్కని ఆసరా కాగలిగిన విద్యార్ధి కావచ్చు. అన్నింటికీ మించి ఆ పోయిన ప్రాణం, విలువ కట్టలేని అతి విలువైన ప్రాణం. అలాటివాటికి పరిహారం ప్రత్యామ్నాయం కానేరదు.
అనేక విలువైన ప్రాణాలను గాలిలో కలిపేస్తున్న రోడ్డు ప్రమాదాలకు అనేకానేక కారణాలు. అతివేగం వీటిల్లో ప్రధానమైనది. వేగంగా దూసుకుపోయే అధునాతన మోటారు వాహనాలు, వాటితో వాయువేగంతో ప్రయాణించగల అధ్బుతమైన రహదారులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని అన్న చందంగా  వాటిని నడిపే వారిలో అత్యధికులు పాత పద్దతుల్లోనే వాహనాలను నడపడానికి అలవాటు పడిన వారు. అధవా వాటిని నడిపే మెలకువల్లో ప్రవేశం వున్నా వేగంగా వాహనాలను నడపడంలో వారికి ఉత్సాహం వుంది కానీ ఎదురుకాగల ప్రమాదాల విషయంలోనే  ఎరుక లోపిస్తోంది. అందుకే మంచి రోడ్లు, మంచి వాహనాలు వున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే బెరుకు పుట్టిస్తున్నాయి. బాధితుల కుటుంబాల్లో గుబులు రేకిస్తున్నాయి. విలువైన మానవ వనరులను ఆవిరి చేస్తున్నాయి.
ప్రమాదాలకు పెద్దంతరం చిన్నంతరం లేదు, పేదా గొప్పా తారతమ్యం లేదు. చివుక్కుమనిపించే నిజం ఏమిటంటే, రోడ్డు ప్రమాదాల్లో కలవారు కన్నుమూస్తే, పత్రికల్లో పతాక శీర్షికలు, సామాన్యులు చనిపోతే సింగిల్ కాలాలు. అంతే  తేడా!     
హైదరాబాదు నగరం చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు చూసినప్పుడు మనమూ ఎవరికీ తీసిపోలేదని అనిపిస్తుంది. దానిమీద ప్రయాణిస్తున్నప్పుడు అద్భుతమైన అనుభూతి. ఎక్కడో విదేశాల్లో చూసే అవీ సినిమాల్లో చూసే అందమైన రహదారులు మన సొంతం అయ్యాయని అనిపిస్తుంది. ఈ మధ్య అమెరికా నుంచి వచ్చిన మితృడిని ఆ మార్గంలో తీసుకువెడితే అతడన్న మాట నన్ను నిరుత్తరుడిని చేసింది. ఇలాటి రోడ్డు  వేసిన వాళ్ళను ఆ దేశంలో జైలుకు పంపుతారని అతడి వ్యాఖ్యానం. వేగంగా వెళ్ళే వాహనాలు అంతే వేగంతో మలుపు తీసుకోవడానికి వీలైన విధంగా రోడ్డు నిర్మాణం లేదన్నది అతగాడి అభిప్రాయం. అంటే రోడ్డు నిర్మాణ దశలో ఎదురయిన వొత్తిళ్ళకు అనుగుణంగా రోడ్డు మలుపులు తిరుగుతూ వెళ్ళిందన్నది అతడి మాటల తాత్పర్యం. అందులో నిజానిజాల మాట తెలియదు కాని, ఆ రోజుల్లో  పనిచేసిన రాజకీయ వొత్తిళ్ళు ఎలాటివో తెలుసు కనుక కిమ్మనకుండా వుండిపోయాను. అలాగే సాధారణ వేగంతో సాధారణ రహదారులపై సాధారణ వాహనాలను నడపడానికి అలవాటుపడిన వాళ్ళు అసాధారణమైన వేగంతో వెడుతూ, లేన్లు మార్చుకుంటూ వాహనాలను నడిపే ప్రావీణ్యం సంపాదించుకోలేదన్న వాస్తవం ఆ రోడ్డుపై తిరిగే వాహనాలను కొద్దిసేపు పరికిస్తే ఇట్టే అర్ధం అవుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రహదారి సూచికలను ఓ పక్క గమనిస్తూ, మరో పక్క అలవాటులేని వేగంతో ప్రయాణిస్తూ, సరయిన బాటలో వేడుతున్నమా లేదా అనే సంశయంతో మధన పడుతూ, దారిపక్కన కనీసం టెయిల్ ల్యాంపులు కూడా లేకుండా ఆపివుంచిన వాహనాలను చూస్తూ బండి నడపడం అన్నది ఇంకా చాలామందికి అలవడినట్టు లేదు.
ఇక హైదరాబాదు నుంచి విజయవాడ వైపు అలాగే రెండు రాష్ట్రాలలో అనేక ప్రదేశాలను కలుపుతూ కొత్తగా  నిర్మించిన నాలుగు లేన్ల రహదారుల పరిస్తితి కూడా ఏమంత భిన్నంగా లేదు. విశాలమైన రహదారులను విదేశాలకు దీటుగా నిర్మించుకోగలిగాం అని గొప్పలు చెప్పుకోవడం కూడా 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామెతను మరిపించేదిగా వుంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ హైవేస్ (జాతీయ రహదారులు) ని ఫ్రీ వేస్ అంటారు. అవి నగరాలను కలుపుతాయి కాని వాటి మధ్యగా పోవు. దారి నడుమ నగరాలను కలుపుతూ మళ్ళీ అనుసంధాన మార్గాలు వుంటాయి. అదే మన దగ్గర హైదరాబాదు - విజయవాడ అరవై అయిదో నెంబరు జాతీయ రహదారి విషయం చూడండి. ఆ రోడ్డు కొన్ని చోట్ల వూళ్ళ మీదుగా పోతుంది. మరికొన్ని చోట్ల వూళ్ళ నడుమ నిర్మించిన  ఫ్లయ్ వోవర్ల మీదుగా వెడుతుంది. ఇంకొన్ని చోట్ల ఊళ్లకు దూరంగా వెడుతుంది. అంటే ప్రతిచోటా రాజకీయ వొత్తిళ్ళకో లేక మరో మరో కారణం చేతనో  రోడ్డు 'రూటు' మారిపోయిందని అనుకోవాలి.  అంటే అర్ధం ఏమిటి? రోడ్డు నిర్మాణంలో ఆత్రుత  తప్పితే భద్రతా ప్రమాణాల విషయంలో శ్రద్ధ పెట్టలేదనుకోవాలి. ఈ దారిలో ఒక్క నల్గొండ జిల్లాలోనే ఏటా వెయ్యిమంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు  కోల్పోతున్నారని లెక్కలు తెలుపుతున్నాయంటే భద్రత పట్ల పెట్టాల్సిన శ్రద్ధలో శ్రద్ధ తగ్గిందని కూడా అనుకోవాలి. ఆ విషయం అలా వుంచండి.  అధికారులు నిర్ణయించిన వేగ  పరిమితుల్లోనే వాహనాలు నడుపుతున్న డ్రైవర్ కు హఠాత్తుగా రోడ్డు మధ్యలో ఆవులూ, గేదెలు  ఇతర జంతువులు  కనిపిస్తే, రాంగు రూటులో ఎదురుగా దూసుకువస్తున్న మరో వాహనం ఎదురయితే,  'యాక్సిడెంటు' సంగతి దేవుడెరుగు ముందు గుండె ఆగినంత పనవుతుంది. మరి వీటికి ఎవరు కారణం? పాలకులా, అధికారులా, వాహనదారులా?  

       
ఒక ప్రమాదం జరిగినప్పుడు మరీ ప్రత్యేకించి అందులో ఎవరయినా ముఖ్యుడు మరణించినప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి. మీడియాలో చర్చలు జరుగుతాయి. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే దానిపై నిపుణులు సలహాలు ఇస్తారు.
అంతే! మరో ప్రమాదం జరిగి మరో ముఖ్యుడు మరణించేవరకు నిశ్శబ్దం.
కటువుగా అనిపించవచ్చు కాని నిజానికది  'స్మశాన నిశ్శబ్దం'
(10-12-2014)

NOTE: Courtesy Image Owner 

అంతా భ్రాంతియేనా!


రహదారులపై వాహనాలు మితిమించిన వేగంతో వెళ్ళకుండా నియంత్రించాలంటే ఏం చెయ్యాలి. స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలి. నిఘా కెమెరాలను అమర్చాలి. ట్రాఫిక్ సిబ్బందినీ,  జరిమానాల మొత్తాన్నీ పెంచాలి లేదా ఉల్లంఘనులకు వేసే శిక్షలను మరింత కఠినతరం చేయాలి.
ఇవన్నీ ఎందుకని అనుకున్నారేమో కెనడాలో 'భ్రాంతి'ని నమ్ముకున్నారు.
చక్కని రహదారుల మధ్యలో అక్కడక్కడా గుంటలు తవ్వారు. వాటిని గమనించి వాహనదారులు ఎవరికివారే వేగం తగ్గించి నడపాల్సిన పరిస్తితి ఏర్పడింది. రోడ్ల గుంతల వల్ల వాహనాల వేగాన్ని బాగా నియంత్రించగలిగామని అక్కడివారు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదేం గొప్ప మా దేశంలో రోడ్ల కంటే గుంటలే  ఎక్కువని మనమూ గొప్పలకు పోవచ్చు కానీ కెనడా గుంటలు మనదగ్గర మాదిరిగా నిజం గుంటలు కావు. గుంతలమాదిరిగా కానవచ్చే పోస్టర్లను రోడ్లపై అతికిస్తారు.(ఫోటోలలో కనబడే చిత్రాలను గమనిస్తే అర్ధం అవుతుంది) వాటిని చూసి డ్రైవర్లు అసంకల్పితంగానే వేగం తగ్గిస్తారు. ఈ నకిలీ గుంటలను మార్చి మార్చి మరోచోటకు మార్చుకునే సౌలభ్యం కూడా వుంది. భ్రాంతితో భయం కలిగించి వేగనియంత్రణ చేస్తున్నారన్నమాట.


ఇంకో విషయం ఏమిటంటే ఈ సమాచారం ఇంటర్ నెట్లో బహుళ ప్రచారంలో వున్న ఓ 'ఈ వదంతి' అంటే, 'ఈ మెయిల్', 'ఈ సేవ'  మాదిరిగా 'ఈ వదంతి' (E Rumour)  అన్నమాట. అది అన్నమాట అయినా, ఉన్నమాట అయినా వినడానికి, చదవడానికి బాగుంది కాబట్టి నమ్మేస్తే ఓ పనయిపోతుంది.     

NOTE: Courtesy Image Owner