12, నవంబర్ 2014, బుధవారం

నాయకులు - నమ్మకాలు


(Published by 'SURYA' telugu daily in its edit page on 13-11-2014, Thursday)
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ విడుదలచేసిన 'జన్మభూమి - మా వూరు' పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చేతిలో మైకు పట్టుకుని, మరో చేతిని ప్రజలకు చూపుతూ కానవస్తారు. అందులో విశేషం ఏముంది అనిపించవచ్చు. కానీ దాన్ని పరిశీలనగా చూస్తె చంద్రబాబు నుదుటిపై ఎర్రటి బొట్టు కనిపిస్తుంది. ఆయన్ని చాలా ఏళ్ళుగా తెలిసిన వాళ్ళకు మాత్రం చిత్రంగానే అనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత లేదా ఆయన మంత్రిగా ముఖ్యమంత్రిగా గతంలో పాలించిన రోజుల్లో కూడా తన వ్యక్తిగత విశ్వాసాలను ఇంటికే పరిమితం  చేసుకునే వారు. వాస్తు, జాతకం వంటి నమ్మకాలు వున్నా వాటిని బహిరంగంగా బాహాటంగా ప్రదర్శించేవారు కారు. చంద్రబాబు ముఖ్యమంత్రి  అయినందువల్ల నుదుటిపై బొట్టు పెట్టుకోవడం అపరాధం అని చెప్పడం కానీ,  పొరబాటు అని సూత్రీకరించడం కానీ ఈ వ్యాసకర్త  ఉదేశ్యం ఎంతమాత్రంకాదు. లోగడ ఎప్పుడూ  ఇటువంటివాటిని పది మంది ముందు ప్రదర్శించడం ఆయనకు అలవాటులేని పని. అయితే పదేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన అనంతరం కొన్ని నమ్మకాలపట్ల ఆయనకున్న నమ్మకం మరింత పెరిగిందన్నది మాత్రం వాస్తవం.
పదవీ ప్రమాణ స్వీకారాలకు మాత్రమే  ప్రస్తుతం పరిమితం అయివున్న ముహూర్తాలను  ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈసారి శాసన సభ తొలి సమావేశం ప్రారంభానికి కూడా విస్తరించారు. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈ విషయాల్లో నాలుగాకులు ఎక్కువే చదివారు. అయితే వాస్తు, ముహూర్తాలు మొదలయిన విషయాల్లో ఆయన యెప్పుడూ గోప్యత పాటించిన దాఖలా లేదు. ఏదిఏమైనా ఇటువంటివన్నీ వ్యక్తిగత నమ్మకాలు. వాటిని తప్పుబట్టి ఎత్తి చూపే హక్కు ఎవ్వరికీ వుండదు. కాకపొతే తమ నమ్మకాలు, విశ్వాసాలు తమ వరకే పరిమితం చేసుకుని తద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా చూసుకోగలిగితే ఎవ్వరూ వారిని  వేలెత్తి చూపే అవకాశం కూడా వుండదు.
దేశ విదేశాల్లో సయితం రాజకీయ నాయకులకు కొన్ని విశ్వాసాలు వుండడం కొత్త విషయం ఏమీ కాదు. హిట్లర్, ముస్సోలినీల కాలంలో కూడా ఇవి వున్నాయి. హిట్లర్ కి సంఖ్యా శాస్త్రం పట్ల నమ్మకం ఎక్కువ. ఏడు అంకె తనకు బాగా కలిసి వస్తుందని విశ్వసించేవారు. అంతే  కాదు యుద్ధ వ్యూహాల విషయంలో కూడా హిట్లర్ జ్యోతిష్కులను సంప్రదించేవాడని  ప్రతీతి. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే జర్మనీ సైన్యాలు ఎలా, ఏ దిక్కుగా కదులుతున్నాయో తెలుసుకోవడానికి మిత్ర దేశాల సైన్యాధిపతులు హిట్లర్ హారోస్కోప్ ని ఆధారం చేసుకునేవారని ఆరోజుల్లో కధలుగా చెప్పుకునేవరకూ వెళ్ళింది.       
అలాగే మరో నియంత ముస్సోలినీ. హిట్లర్ కి మంచి స్నేహితుడు కూడా. అంచేతేనేమో ముస్సోలినీకి కూడా ఈ పట్టింపులు జాస్తి. విమానాల్లో తోటి ప్రయాణీకుల మీద అనుమానం కలిగిందంటే చాలు ఆ విమానం దిగి మరో విమానం ఎక్కేవాడు. తోటి ప్రయాణీకుడి మీద అనుమానం తన ప్రాణాలు తీస్తాడని కాదు. ఆ ప్రయాణీకుడివి పిశాచ నేత్రాలు అన్న సందేహం తోటే.   
అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన రొనాల్ద్ రీగన్ గురించి కూడా ఇదే విధమైన ప్రచారం వుంది. వెయిట్ హౌస్ లో ఏదయినా కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు రీగన్, కాలిఫోర్నియాలో వుండే ఒక మహిళను సంప్రదించేవారు. ఆవిడ ప్రెసిడెంట్ రీగన్ జాతక చక్రం చూసి, గ్రహాలూ, వాటి స్థానాలను బట్టి వాటికి  అనుగుణంగా వుండే సలహాలు, సూచనలు ఇచ్చేవారుట. వైట్ హౌస్  నిర్ణయాలు కూడా తదనుగుణంగా మారిపోయేవట. అక్కడ ఇవన్నీ బహిరంగ రహస్యాలు. అలాగే ముందుగా నిర్ణయమైన  ప్రెసిడెంట్ పర్యటనలు, ప్రసంగాలు, విలేకరుల సమావేశాలు సయితం 'ఆ రోజు జాతకరీత్యా  మంచిది కాదు' అనే కారణంతో రద్దయిన సందర్భాలు ఉండేవి.   
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇదే మాదిరి. ఎలెక్షన్ జరిగే రోజున ఆయన ఎన్ని పనులున్నా మానుకుని బాస్కెట్ బాల్ ఆట ఆడతారు. అలా చేస్తే ఎన్నికలలో విజయం వరిస్తుందని ఒబామా నమ్మకం. కాకపొతే ఒక్కసారి మాత్రం ఈ మంత్రం పనిచేయలేదు. న్యూ హాంప్ షైర్  ప్రైమరీ ఎలెక్షన్ రోజున బరాక్ ఒబామా బాస్కెట్ బాల్ ఆడారు కానీ, ఫలితం మాత్రం వేరేగా వచ్చింది. అయినా సరే ఆయన మాత్రం తన నమ్మకాన్ని వొదులుకోలేదు.
కమ్యూనిస్ట్ చైనాలో కూడా ఈ నమ్మకాలకు కొదవలేదు. అక్కడి వారికి ఎనిమిది సంఖ్య అదృష్టం తెస్తుందని విశ్వాసం. 2008 లో బీజింగులో జరిగిన ఒలింపిక్స్ పోటీల ప్రారంభ ముహూర్తాన్ని  ఆగస్టు ఎనిమిదో తేదీ, రాత్రి ఎనిమిది గంటలకు నిర్ణయించడం వెనుక ఎనిమిది అంకె మీదగల మమకారమే అని నోళ్ళు నొక్కుకున్న వాళ్ళు లేకపోలేదు.
ఇక మన దేశం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటువంటి విశ్వాసాలకు పుట్టిల్లు అనే పేరు పడిన దేశం మనది.
బీహారు మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్  రాజకీయంగా కలిసి రావడంలేదని ఇంట్లో వున్న స్విమ్మింగ్ పూల్ ని  రాత్రికి రాత్రే ఇసుకతో  పూడ్పించారు.
ఈ మధ్య బీహార్ లో జరిగిన ఉపఎన్నికల సభల్లో లాలూ మహాశయులు ఈ నమ్మకాలపై తనకున్న నమ్మకాన్ని మరో రకంగా ప్రదర్శించే ప్రయత్నం చేసారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం మంచిదికాదని అయన సెలవిచ్చారు.  ఉత్తరాంచల్ లో ఆకస్మిక వరదల్లో హైదరాబాదు విద్యార్ధుల మరణానికి  ఆ ముహూర్తమే కారణమని ముడిపెట్టారు. మోడీ నేపాల్ పర్యటనకు వెళ్ళగానే అక్కడకూడా వరదలు వచ్చిన విషయాన్ని లాలూ ప్రస్తావించారు.
ఇక చత్తీస్ ఘర్  మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ ఈ విషయంలో ఒక అడుగు ముందుకే వేసారు. ఓసారి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రంలో 'కాంగ్రెసేతర అభ్యర్ధి గుర్తుపై మీట నొక్కితే ఎలెక్ట్రిక్ షాక్ కొడుతుంద'ని గిరిజనులను బెదరగొట్టారు.     
కర్ణాటకలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల్లో చాలామందికి ఈ నమ్మకాలు మెండుగా వున్నాయి. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు చొక్కా మీద చొక్కా అలా ఎనిమిది చొక్కాలు వేసుకుని వెడితే మంచిదనే నమ్మకంతో ఒక నాయకుడు ప్రతి ఎన్నికలో ఇదే సూత్రాన్ని విధిగా పాటిస్తూ వస్తున్నారు.


అందుకే, తెలివితేటలతో పుట్టడం కంటే అదృష్టంతో పుట్టడం మంచిదని డాక్టర్ గో కెంగ్ స్వీ ఏనాడో చెప్పారు. (12-11-2014)

11, నవంబర్ 2014, మంగళవారం

నా వ్యాపకాల్లో మరో జ్ఞాపకం


మిత్రుడు నందిరాజు రాధాకృష్ణ చాలా మంచి పాత ఫోటోలను ఎంపిక చేసి మరీ పోస్ట్ చేస్తుంటాడు. ఆయన్ని చూసి  ఆ వాతలు యేవో నేనూ  పెట్టుకుందామని ఈ రోజు ఓ పూటల్లా వెతికి పాత కాగితాల్లో నుంచి పాత జ్ఞాపకాలను తవ్వి తీస్తుంటే - డెబ్బయ్యవ దశకంలో బెజవాడ 'ఆంద్రజ్యోతి'లో పనిచేసేటప్పుడు రిపోర్టర్ గా కవర్ చేసిన ఓ సందర్భం తటస్థపడింది. నిజానికి నేను పేపర్లో రాసిన వార్త క్లిప్పింగు కాదు. ఆ ఫంక్షన్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను హడావిడిగా రాసుకున్న నోట్స్ అది. అందులో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరు కనిపించడంతో ఒకింత ఉత్సుకతతో తీసిచూసాను. ఎన్టీయార్ సినీ నటుడిగా వున్నప్పుడు, రాజకీయ ప్రవేశం చేయకముందు బెజవాడలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కార్యక్రమం అది. సభకు హాజరయిన వారి జాబితా చూస్తే ఖచ్చితంగా  అది ఫిలిం డిస్త్రి బ్యూషన్ కంపెనీ ప్రారంభోత్సవం అయివుండాలి. అధ్యక్షత వహించిన నాటి మంత్రి మూర్తిరాజు గారు, ఎన్టీయార్ ఉపన్యాసాలు మాత్రం దొరికాయి. రామారావుగారు చేసిన ప్రసంగాన్ని నేనిలా చిత్తు ప్రతిలో (ఒక రకం షార్ట్ హ్యాండ్ అన్నమాట) రాసుకున్నాను. 


(Late Shri NTR)
    
ఆయనిలా మాట్లాడారు:
"సినిమా ప్రదర్శనలో ముఖ్యమైన శాఖ డిస్ట్రి బ్యూషన్. సినిమా అనేది కళాత్మక వ్యాపారం. వ్యాపారాత్మకమైన కళ కూడా........
"ఒక కొత్త సంస్థ వస్తున్నదంటే పరిశ్రమకు బలం పెరుగుతున్నదన్న మాట. చిత్రాలు ఈనాడు దెబ్బ తింటున్నాయంటే  ప్రజలకు కావాల్సింది మనం ఇవ్వలేకపోతున్నామని అర్ధం......
"ప్రేక్షకులకు, నిర్మాతలకు మధ్య వంతెన లాంటి వాళ్ళు పంపిణీదారులు. ఇదొక ఫ్యామిలీ బిజినెస్ కాదు. ఇదొక ఉత్తేజకరమైన మీడియం.........
"పరిజ్ఞానంలో  కానివ్వండి, వ్యాపార దక్షతలో కానివ్వండి, వయస్సులో కానివ్వండి ఇక్కడ వున్న అందరికంటే నేను చిన్నవాడ్ని. అందుకే ఈ సంస్థను పరమేశ్వరుడు అనుగ్రహించాలని వేడుకుంటున్నాను......
"విజయవాడ కార్యక్రమం అంటే ఒక రకంగా నా కుటుంబ కార్యక్రమం లాంటిది.....
"నేషనల్ డిఫెన్స్ ఫండ్ కలెక్షన్ సమయంలో వెస్ట్ గోదావరి జిల్లాలో కార్యక్రమం అంతా మూర్తి రాజుగారు నిర్వహించారు. మూర్తి రాజుగారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తనని తానే గౌరవించుకున్నది....."


(Late Shri CHVP Murthy Raju)

మంత్రి మూర్తి రాజుగారి ప్రసంగం సంక్షిప్తంగా:
"మీరు దండలు వెయ్యకా తప్పదు, మేము మొయ్యకా తప్పదు. ఇప్పుడు దండలు వెయ్యడం కాదు. దండకొక వేయి చొప్పున పోగుచేసి రామారావులాంటి కళాకారులను తయారు చేసే ఒక నటనా కళాశాలను స్థాపించండి....
"నటులలో పోటీ వుండడం మంచిదే. మాకే వూళ్ళో సంఘాలు లేవు. కానీ వీళ్ళకి మాత్రం ప్రతి వూళ్ళో అభిమాన సంఘాలు వున్నాయి.........

"....ఎక్కువ డబ్బు సంపాదించండి. కాదనను. కానీ సంపాదించిన దానిలో కొంతయినా సమాజానికి ఉపయోగించండి. సినిమా పరిశ్రమ వారికి నేనిచ్చే సలహా ఇదే"         

10, నవంబర్ 2014, సోమవారం

కారణం

నగరం చలి దుప్పటి కప్పుకుంది
కారణం
ఆలస్యం అనిపించి కనిపించని శీతాకాలమా!
అలవాటయిన అల్పపీడనమా!!


7, నవంబర్ 2014, శుక్రవారం

అసెంబ్లీలో ఏం జరుగుతుంది?

(Published by 'SURYA" telugu daily in its Edit page on 09-11-2014, SUNDAY)

నాకు జ్యోతిష్యం తెలియదు. అయినా ఈ ఉదయం టీవీ  యాంఖర్ అడిగిన ఈ  ప్రశ్నకు తడుముకోకుండా జవాబు చెప్పాను.
'ఏం జరుగుతుంది? సభ ఖచ్చితంగా సమయం  ప్రకారం సమావేశమవుతుంది. స్పీకర్ ప్రతిపక్ష సభులు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసులను వరసగా చదివి వినిపించి వాటిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి ఎజెండాలోని  ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపడతారు. ప్రతిపక్ష సభ్యులు పోడియం దగ్గరకు వెళ్లి తమ వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుపడతారు. స్పీకర్ వారిని తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోండని పదే పదే విజ్ఞప్తి  చేస్తారు. పాలకపక్షం తరపున శాసనసభా వ్యవహారాల మంత్రో లేక ముఖ్యమంత్రో కలగచేసుకుని ప్రభుత్వం ఆ అంశాలు అన్నింటిపైనా చర్చకు సిద్దమనీ, వెనుకాడదనీ, అయితే నిబంధల ప్రకారం నడుచుకోవాలనీ స్పష్టం చేస్తారు. అయినా ప్రతిపక్షాలు తగ్గవు. కాసేపు చూసి స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేస్తారు. పేరుకు పది నిమిషాలు కానీ, ఓ అరగంట తరువాత మళ్ళీ మొదలవుతుంది. సభలో షరామామూలుగా ఏదో ఒక అంశంపై గొడవ మళ్ళీ షురూ. మళ్ళీ ఓ పది నిమిషాలు వాయిదా. తిరిగి సమావేశం అయినా సజావుగా పది నిమిషాలు సాగుతుందన్న నమ్మకం లేదు. వాయిదా పడ్డం కోసం మరోసారి సమావేశం అవుతుంది.'
నేను అలా చెప్పాను కనుక అలాగే జరగాలని నేనూ  కోరుకోను. సభ సజావుగా సాగాలనే నేనే కాదు ఎవరయినా కోరుకుంటారు. అయితే  కోరుకున్నవి జరగాలని రూలేమీ  లేదు కదా!



భారం


ఇద్దరు సన్యాసులు అడవి మార్గాన వెడుతున్నారు. దారిలో ఓ యేరు అడ్డం వచ్చింది. ఏటి వొడ్డున ఒక యువతి కాలికి దెబ్బ తగిలి పడివుంది. యేరు దాటి అవతల తన వూరికి  చేరుకోవాలి. సన్యాసుల్లో ఒకడు ఆమెను జాగ్రత్తగా రెండుచేతులతో వొడిసిపట్టుకుని యేరు దాటించి  వూరు చేర్చాడు. సన్యాసులు మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టారు. చాలాసేపటి తరువాత  రెండో వాడు అన్నాడు. 'నువ్వలా ఆ ఆమ్మాయిని ఎత్తుకోకుండా వుండాల్సింద'ని. మొదటివాడు బదులిచ్చాడు. 'నేను ఆ అమ్మాయిని ఎప్పుడో దింపేశాను. నువ్వే ఇంకా ఆమెను మనసులో మోస్తున్నావు'


(జెన్ బౌద్ధగాధల నుంచి తెలుగుసేత)
NOTE: COURTESY IMAGE OWNER

5, నవంబర్ 2014, బుధవారం

ముఖ్యమంత్రి చెప్పిన జోకు



ముఖ్యమంత్రి చెప్పిన జోకు అంటే మనిద్దరు చంద్రుల్లో ఒకరు చెప్పిన జోకనుకుంటారేమో. ఆ ఛాన్సే లేదు. వారు నవ్వరు. మనల్ని నవ్వించరు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకోవడానికే సమయం సరిపోవడం లేదు. ఇక జోకులు పేల్చే టైమెక్కడిది.
ఈ జోకు చెప్పింది గోవా బీ.జే.పీ. ముఖ్యమంత్రి  శ్రీ మనోహర్ పర్రీకర్.


(దేశంలో మొట్టమొదటి ఐ.ఐ.టి. గ్రాడ్యుయేట్ ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్)  

మనోహర్ పర్రీకర్. ఈ పేరు రోజంతా టీవీ స్క్రోలింగుల్లో దొర్లుతూనే వుంది. కాబోయే రక్షణ మంత్రి అని ఊహాగానాలు జోడిస్తున్నారు. పారీకర్, పర్రేకర్ అని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు.  అంచేత నేను కూడా పర్రీకర్ అని రాసి నేను సైతం నా ఇష్టం వచ్చినట్టు రాయగలను సుమా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. టీవీలో స్క్రోలింగులు చూసిన తరువాత ఆయన్ని గురించి నిరుడెప్పుడో రాసింది గుర్తుకు వచ్చింది.
పుణేలో నిరుడు   ఒక సదస్సు జరిగింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్  ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.  మాట్లాడుతూ మాట్లాడుతూ  మాటల మధ్యలో  ఓ జోకు పేల్చారు. దాన్ని  సభికులందరూ ఆసక్తిగా వినడమే కాదు, విని  కడుపుబ్బా నవ్వుకున్నారట కూడా.
ఆ జోకేమిటంటే....
ఆయన మాటల్లోనే విందాం.
జూ నుంచి రెండు సింహాలు తప్పించుకున్నాయి. వాటిల్లో ఒకటి అడవి సింహం. అడవిలో  పట్టుబడి పట్నంలో వున్న  జూకి వచ్చింది. తప్పించుకోవడమే తడవు  అది మళ్ళీ అడవిలోకి పారిపోయింది.
పోతే రెండో సింహం అడవిలో దొరికింది కాదు. అది జూలోనే పుట్టి  జూలోనే పెరిగిన సింహం. దాంతో దానికి అన్నీ బస్తీ అలవాట్లే అలవడ్డాయి. అడవీ, వేటా ఇవన్నీ దాని వంటికి పడవు. జూ సిబ్బంది పెట్టింది తిని తొంగుండే బాపతు. బద్దకానికి పెట్టింది పేరు.
మూడు రోజులు గడిచాయో లేదో, పారిపోయిన అడవి సింహం జూ సిబ్బందికి ఇట్టే  దొరికిపోయింది.  దాన్ని తీసుకువచ్చి మళ్ళీ జూలో బోనులో బంధించారు. కానీ బస్తీ సింహం ఆచూకీ మాత్రం పట్టుకోలేకపోయారు.
నెల గడిచింది. రెండు నెలలు గడిచాయి. మూడో నెల నడుస్తున్నా బస్తీ సింహం ఎటు పోయిందన్న సమాచారం లేదు.    
చివరికి ఎట్లాగయితేనేం బస్తీ సింహం ఆచూకీ ఆరుమాసాల తరువాత దొరికింది. దాన్ని పట్టి బంధించి మళ్ళీ జూకే తీసుకువచ్చారు.
పాత నేస్తాన్ని చూడగానే అడవి సింహం మొహం వికసించింది.
వాటి నడుమ సంభాషణ ఇలా సాగింది.
ఏం మిత్రమా! ఈ మానవ మృగాల కంట బడకుండా ఈ ఆరు నెలలు ఎక్కడ దాక్కున్నావు? యెలా దాక్కున్నావు?  ఈ రక్కసి  మనుషుల నుంచి  తప్పించుకుని ఏవిధంగా తిరగగలిగావు? ముందు  ఆ సంగతి చెప్పు
ఏం లేదు మిత్రమా! నువ్వేమో అలా అడవిలోకి వెళ్లావు. ఇక నాకు ఆ  అడవీ, దాని  ఆనుపానులు అసలే తెలియవాయె. ఏం చెయ్యాలి ఎక్కడ దాక్కోవాలి అని ఆలోచిస్తుంటే  దారిలో సచివాలయం కనిపించింది. వెంటనే దాంట్లోకి దూరిపోయాను. నా సామిరంగా! యే గదిలో చూసినా ఎక్కడ చూసినా అన్నీ ఫైళ్ళే. దుమ్ముకొట్టుకుపోయి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయివున్నాయి.  హాయిగా వెళ్ళి వాటి మాటున దాక్కున్నాను.
భలే భలే. మరి తిండీ తిప్పలమాటేమిటి
నిజానికి తిండికి వెతుక్కోవాల్సిన పనే లేదనుకో! ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఎటు చూసినా సిబ్బందే. హాయిగా రోజుకొకడ్ని నంజుకు తిన్నా అడిగేవాడులేదు. ఎందుకంటే ఒకడు కనిపించకపోయినా అక్కడ అయిపూ అజా కనుక్కునేవాడే లేడు. ఒకడు రాకపోయినా, పత్తా లేకుండా పోయినా  వాడి స్థానంలో ఇంకోడ్ని టెంపరరీగా వేసుకుంటారు కానీ,  అసలు వాడు ఎటు పోయాడు అని ఆరా తీసే వాడేలేడనుకో. అసలక్కడ పనిచేసేవాడంటూ వుంటే కద.  అందువల్ల నేను ఎంతమందిని  కొరుక్కుతిన్నా లెక్కతెలిసే అవకాశమేలేదు. అంచేత నాకు ప్రతిరోజూ మృష్టాన్న భోజనమే”  
మరి ఇంత హాయిగా రోజులు గడిచిపోతూ వుంటే మళ్ళీ వీళ్ళ  చేతికి యెలా చిక్కావ్
అదే ఖర్మ అంటే. హాయిగా రోజుకో ప్రభుత్వ ఉద్యోగిని తింటూ పోతే నన్ను ఎవడూ పట్టుకునే వాడు కాదు. బుద్ధి తక్కువై  ఓ రోజు,  వాళ్లకు రోజూ  టీ పట్టుకువచ్చేవాడు దొరికితే, ముందూ వెనకా చూడకుండా  వాడిని పొట్టనబెట్టుకున్నాను. అదే నా పొట్టమీద కొట్టింది. రోజూ టీ ఇచ్చేవాడు కనబడకపోవడంతో అప్పుడు వారికి మన వ్యవహారం అర్ధం అయినట్టుంది.  అంతా కలిసి మాటువేసి  నన్ను  పట్టేసుకున్నారు. అదీ మిత్రమా నా విషాద గాధ

(24-04-2013)

4, నవంబర్ 2014, మంగళవారం

రేడియోకు జీవం పోస్తున్న ప్రధాని మోడీ

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 06-11-2014, THURSDAY)

చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో 'మీడియా సావీ ముఖ్యమంత్రి'గా ఉమ్మడి రాష్ట్రంలో ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు'  ఏ టైంలో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న  రోజులవి.  ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు  మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. కరెంటు తీయడం, ఇవ్వడం ఒక పధ్ధతి ప్రకారం జరిగేవి. ఇక  ఆ కోతల సమయాలు ఒకసారి పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. ఇలాటి సందర్భాలలో కూడా రేడియోని పక్కన బెట్టి  ముఖ్యమంత్రిగారు 'టీవీ' లకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ,  నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్నలోని మర్మం ఇట్టే గ్రహించగలిగినవాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి,  'సాంబశివరావుగారూ! (నాటి ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచెప్పి ఆయన లోపలకు వెళ్ళిపోయారు.
ప్రధాన మంత్రి మోడీ రేడియో ప్రసంగాల పుణ్యమా అని ఈ నేపధ్యాన్ని మరో మారు నెమరువేసుకోవాల్సివచ్చింది.


దేశంలో లెక్కకు మిక్కిలిగా  ఇన్నిన్ని టీవీ ఛానల్స్ వుంటే ప్రధాని గారు తన మనస్సులో మాట (మన్ కీ బాత్) ను  ప్రజలతో పంచుకోవడానికి రేడియోనే ఎందుకు ఎంచుకున్నట్టు. ఎందుకంటె తనుచేప్పేది ఎవరికి చేరాలని  అనుకుంటున్నారో ఆయనకు బాగా తెలుసు కనుక. ఆయన లక్ష్యం సాధారణ ప్రజలు కనుక.  వారికి చేరువగా వుండే ప్రసార మాధ్యమం రేడియో. కరెంటు వున్నా లేకపోయినా పనిచేస్తుంది. పనిపాట్లు చేసుకునే వాళ్ళు కూడా తమ పని చెడగొట్టుకోకుండా వినొచ్చు. రైతులు, గ్రామీణ మహిళలు, వ్యవసాయ కూలీలు, రోడ్డు పక్కన, తోపుడుబళ్ళ మీద    చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చెప్పులు కుట్టుకునేవాళ్ళు,  ప్రయాణాల్లో వున్నవాళ్ళు ఇలా  అందరికీ అందుబాటులో వున్న సాధనం రేడియో అన్న ఎరుక కలిగిన వ్యక్తి కనుకనే  ప్రధానమంత్రి ప్రజలకు చేరువ కావడానికి ఈ మాధ్యమాన్ని ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. దసరా పండుగ నాడు ప్రధాని మోడీ ఈ రేడియో ప్రసంగ పరంపర మొదలుపెట్టారు. కారణం తెలియదు కానీ రేడియోలో  ఎలా మాట్లాడాలి అనే విషయంపై  ప్రధానికి మంచి అవగాహన  వున్నదని  ఈ ప్రసంగాలు వినేవారికి అనిపిస్తుంది. రేడియోలో ప్రసంగాన్ని  చదివినా పైకి మాట్లాడినట్టు వినిపించాలి.  భాష కూడా సరళంగా వుండాలి. పెద్ద పెద్ద పద ప్రయోగాలు కూడదు. అప్పుడే మనసులోని మాటల్ని జనం మనసుపెట్టి వింటారు. రేడియోకి సంబంధించిన ఈ ధర్మసూక్ష్మం మోడీ గారికి బాగా తెలిసినట్టు వుంది. గత ఆగస్టులో ఎర్రకోట మీద నుంచి ఆయన చేసిన ప్రసంగం గుర్తుంది కదా. సాంప్రదాయక విధానానికి స్వస్తి చెప్పి, అధికారులు తయారు చేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని పక్కనబెట్టి, సాధారణ ప్రజలకు సులువుగా అర్ధం అయ్యే రీతిలో, మామూలు మనుషులు మాట్లాడుకునే  భాషలో ఆయన మాట్లాడారు. అది దేశ వ్యాప్తంగా ప్రజల మనసుల్ని చూరగొన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే కాబోలు, తన మనసులోని మాటని జనాలతో చెప్పుకోవడానికి ఆయన కొత్తగా రేడియో ప్రసంగ ప్రక్రియను ప్రారంభించారు. ప్రధానమంత్రి కార్యాలయానికి అందుతున్న సమాచారాన్ని బట్టి  మోడీ మహాశయులు మొదలెట్టిన  ఈ కొత్త కార్యక్రమానికి శ్రోతల ఆదరణ విశేషంగా వున్నట్టు తెలుస్తోంది. ఆయన మాటల్లో ఎక్కువగా గాంధీగారి పేరు ప్రస్తావనకు రావడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా సందర్భానికి అనువుగానే ప్రధాని మాటల్లో గాంధీ  పేరు వస్తోందని అనుకోవచ్చు. అక్టోబర్ మూడో తేదీన ప్రారంభించిన  ఈ ప్రసంగ  ప్రహేళికను ప్రధాని,  'ఖాదీ వస్త్రధారణ, నేటి పరిస్తితుల్లో దాని ఆవశ్యకత' అనే అంశంతో మొదలు పెట్టారు.
"మీతో ఇలా రేడియోలో  మాట్లాడడం అనేది నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఒక్క రేడియో ద్వారానే నేను మిమ్మల్ని, ముఖ్యంగా పేదవారినీ, పల్లె ప్రజల్నీ కలుసుకోగలుగుతాను' అని చెప్పారు మోడీ తన ప్రసంగంలో. ఇది ఆయన మనసులోని మాట మాత్రమే కాదు, వాస్తవం కూడా.
'ప్రజలనుంచి  నాకెన్నో విలువైన సలహాలు సూచనలు అందుతున్నాయి. వాటిని చదువుతుంటే నాకు చాలా సంతోషంగా వుంది. మంచి ప్రభుత్వం మంచి పాలన  గురించి మీకు ఎలాటి ఆలోచనలు వున్నా వాటిని నాకు పంపండి. నేను వాటిని చదవడమే కాదు రేడియో ప్రసంగాలలో వాటిని నేను మీతో పంచుకుంటాను.' అని ప్రధాని అన్నారు.  
ప్రతిపక్ష కాంగ్రెస్ మొదట్లోనే తప్పుపట్టింది. 'మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు ముందు ప్రధాని చేసిన రేడియో ప్రసంగం ఎన్నికల నియమావళికి విరుద్ధం' అంటూ ఎన్నికల కమీషన్ కు పిర్యాదు కూడా చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆకాశవాణి  యంత్రాంగాన్ని దుర్వినియోగం  చేయడమే అని కాంగ్రెస్ ఆరోపించింది.
నవంబర్ రెండో తేదీన ప్రసారం అయిన రెండో కార్యక్రమంలో  ప్రధాని 'నల్ల ధనం' గురించి ప్రస్తావించారు. సుప్రీం ఆదేశాల  దరిమిలా పాలకపక్షం కొంత ఆత్మ రక్షణలో పడ్డట్టయింది. అందుకే మోడీ తెలివిగా ఈ  అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ అంశంపై ప్రభుత్వ విధానాన్ని అరమరికలు లేకుండా ప్రజలకు తెలియచెప్పడానికి మంచి ప్రయత్నం చేసారు.

ప్రధాని రేడియో ప్రసంగాల గురించి  దేశ వ్యాప్తంగా చేసిన ప్రచారానికి కోటి  రూపాయలవరకు ప్రజాధనం  ఖర్చు చేసారని కూడా గుసగుసలు వినవస్తున్నాయి. సరే! ఇవన్నీ షరా మామూలుగా రాజకీయాల్లో సహజమే కాబట్టి అసలు విషయం ఒకటి ముచ్చటించుకుందాం.
రాజకీయ నాయకులు ప్రజలను ఆకట్టుకోవడంలో వారికి వుండే ఆకర్షణ శక్తికి వారి ప్రసంగ పాటవం తోడవుతుంది. రెండో  ప్రపచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రధానిగా వున్న విన్ స్టన్ చర్చిల్ 'రాజకీయ నాయకులకు వాక్చాతుర్యం, వాక్పటిమను మించిన ఆయుధం లేదన్నారు. బహిరంగ సభల్లో వారు  చేసే ఉపన్యాసాల బలమే వారి అసలు బలం అన్నారు.  ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా  అధ్యక్ష ఎన్నికల్లో  డెమోక్రాటిక్ పార్టీ  అభ్యర్ధిగా నామినేట్ కావడానికి దోహదం చేసిన అంశాలలో ఇదొకటి. అమెరికా అధ్యక్షుడిగా తొలి పర్యాయం ఎన్నిక కావడానికి కూడా ఒబామా  ప్రసంగశైలి బాగా ఉపకరించిందని చెబుతారు.  భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా చక్కని వక్త. ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో, వారిని ఉత్తేజపరిచే బాణీలో మాట్లాడడం ఆయనకు కొట్టిన పిండి. లోక్ సభ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ చేసిన ప్రసంగాలే  బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించాయని నమ్మేవారు వున్నారు. అందుకే తనకున్న ఈ 'అర్హతను' రేడియో ప్రసంగాల ద్వారా ప్రదర్శించి ప్రజల మనస్సులను గెలుచుకునే క్రమంలోనే మోడీ ఈ మనసులోని మాట కార్యక్రమాన్ని మొదలుపెట్టారని అనుకోవాలి. ఐతే మరో నిజాన్ని కూడా గమనంలో వుంచుకోవాలి. ధాటీగా ప్రసంగాలు చేసే వాళ్ళందరూ గొప్ప నాయకులు కాలేరు. గొప్ప నాయకులందరూ విధిగా బాగా మాట్లాడేవారు అయివుండనక్కరలేదు. కాకపోతే గొప్ప నాయకుడికి గొప్పగా ప్రసంగించే సత్తా వున్నప్పుడు ఆయన మరింత గొప్ప నాయకుడు కాగల అవకాశాలు కూడా గొప్పగా వుంటాయి.                    
గొప్పగా మాట్లాడి చరిత్ర గతిని మార్చిన సందర్భాలు చరిత్రలో కానవస్తాయి. అమెరికాలో అబ్రహం లింకన్ ఒకసారి రెండే  రెండు నిమిషాలపాటు ప్రజలనుద్దేశించి బహిరంగంగా  ప్రసంగించారు. ఉపయోగించినవి  కూడా పదే పది  వాక్యాలు. ఆ ప్రసంగం ఎంతటి ప్రభావం చూపిందంటే  అమెరికాలో వేళ్ళూనుకుని వున్న  బానిసత్వం అనే దురాచారం కూకటివేళ్ళతో కూలిపోవడానికి  దోహదం చేసింది. అలాగే,  వందేళ్ళ తరువాత 'నాకో కల వుంది' అంటూ వాషింగ్టన్ లోని లింకన్  మెమోరియల్ మెట్లమీద  నిలబడి మార్టిన్ లూధర్ కింగ్  చేసిన ప్రసంగం ఆ దేశంలో  జాతి వివక్షకి చరమ గీతం పాడింది.
ప్రధాని మోడీ నవతరాన్ని విశేషంగా ఆకర్షించడానికి ఆయనకు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి ఆధునిక సోషల్ మీడియాలో వున్న అనుభవమే చాలావరకు ఉపయోగపడింది. ఆయన ట్విట్టర్ ఖాతాకు ఇంచుమింహుగా డెబ్బయి లక్షల మంది ఫాలోయర్లు వున్నారు. ఇక ఫేస్ బుక్ లో మోడీ గారి పేజీకి ఏకంగా కోట్లాదిమంది 'లైక్స్' వస్తున్నాయి అంటే ఈ రెండు మాధ్యమాలలో మోడీకి వున్న ఆదరణ అర్ధం అవుతుంది. ఇక ఇప్పుడు అయన మరో బ్రహ్మాస్త్రాన్ని తన అంబుల పొదిలో చేర్చుకున్నారు. అదే ఆకాశవాణి. దేశవ్యాప్తంగా 413  రేడియో స్టేషన్లు వున్నాయి. మొట్టమ జనాభా  120 కోట్లమందిలో 99.19 శాతం మంది ప్రజలకు రేడియో ప్రసారాలు అందుబాటులో వున్నాయి.
ఇప్పుడు అర్ధం అయింది కదా మోడీ జనాలకు దగ్గర కావడానికి రేడియోనే ఎందుకు ఎంచుకున్నారో. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఇది మొదలు పెట్టినప్పటికీ ఒక మంచి పని జరిగింది. ఒకనాడు తన ప్రసారాలతో దేశంలో 'సస్య విప్లవానికి' దోహదం చేసిన రేడియోకి, ప్రస్తుత పోటాపోటీ కాటా కుస్తీ పోటీల యుగంలో కనుమరుగు అవుతోందని జాతి జనులు వేదన చెందుతున్న రేడియోకి మోడీ మళ్ళీ జవసత్వాలు సమకూరుస్తున్నారు. పూర్వ వైభవాన్ని, ఔన్నత్యాన్ని, గౌరవ మర్యాదలను, గుర్తింపును తెచ్చిపెడుతున్నారు. గత కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో సయితం రేడియో గురించిన కబుర్లే, రేడియో గురించిన ప్రసంగాలే. రేడియో గురించిన చర్చలే. ఇంతవరకు మోడీ గారిని మనః స్పూర్తిగా అభినందించాలి.
ఉపశృతి: 1935లో హైదరాబాదు డెక్కన్ రేడియో,  ఆ తరువాత సెప్టెంబర్ పదో తేదీన  మైసూరులో ఒక రేడియో కేంద్రం ఏర్పాటు చేశారు. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వశాస్త్ర  ఆచార్యులుగావున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి ఆ కేంద్ర సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు. (04-11-2014)

NOTE: Courtesy Image Owner