7, నవంబర్ 2014, శుక్రవారం

భారం


ఇద్దరు సన్యాసులు అడవి మార్గాన వెడుతున్నారు. దారిలో ఓ యేరు అడ్డం వచ్చింది. ఏటి వొడ్డున ఒక యువతి కాలికి దెబ్బ తగిలి పడివుంది. యేరు దాటి అవతల తన వూరికి  చేరుకోవాలి. సన్యాసుల్లో ఒకడు ఆమెను జాగ్రత్తగా రెండుచేతులతో వొడిసిపట్టుకుని యేరు దాటించి  వూరు చేర్చాడు. సన్యాసులు మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టారు. చాలాసేపటి తరువాత  రెండో వాడు అన్నాడు. 'నువ్వలా ఆ ఆమ్మాయిని ఎత్తుకోకుండా వుండాల్సింద'ని. మొదటివాడు బదులిచ్చాడు. 'నేను ఆ అమ్మాయిని ఎప్పుడో దింపేశాను. నువ్వే ఇంకా ఆమెను మనసులో మోస్తున్నావు'


(జెన్ బౌద్ధగాధల నుంచి తెలుగుసేత)
NOTE: COURTESY IMAGE OWNER

5, నవంబర్ 2014, బుధవారం

ముఖ్యమంత్రి చెప్పిన జోకు



ముఖ్యమంత్రి చెప్పిన జోకు అంటే మనిద్దరు చంద్రుల్లో ఒకరు చెప్పిన జోకనుకుంటారేమో. ఆ ఛాన్సే లేదు. వారు నవ్వరు. మనల్ని నవ్వించరు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకోవడానికే సమయం సరిపోవడం లేదు. ఇక జోకులు పేల్చే టైమెక్కడిది.
ఈ జోకు చెప్పింది గోవా బీ.జే.పీ. ముఖ్యమంత్రి  శ్రీ మనోహర్ పర్రీకర్.


(దేశంలో మొట్టమొదటి ఐ.ఐ.టి. గ్రాడ్యుయేట్ ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్)  

మనోహర్ పర్రీకర్. ఈ పేరు రోజంతా టీవీ స్క్రోలింగుల్లో దొర్లుతూనే వుంది. కాబోయే రక్షణ మంత్రి అని ఊహాగానాలు జోడిస్తున్నారు. పారీకర్, పర్రేకర్ అని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు.  అంచేత నేను కూడా పర్రీకర్ అని రాసి నేను సైతం నా ఇష్టం వచ్చినట్టు రాయగలను సుమా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. టీవీలో స్క్రోలింగులు చూసిన తరువాత ఆయన్ని గురించి నిరుడెప్పుడో రాసింది గుర్తుకు వచ్చింది.
పుణేలో నిరుడు   ఒక సదస్సు జరిగింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్  ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.  మాట్లాడుతూ మాట్లాడుతూ  మాటల మధ్యలో  ఓ జోకు పేల్చారు. దాన్ని  సభికులందరూ ఆసక్తిగా వినడమే కాదు, విని  కడుపుబ్బా నవ్వుకున్నారట కూడా.
ఆ జోకేమిటంటే....
ఆయన మాటల్లోనే విందాం.
జూ నుంచి రెండు సింహాలు తప్పించుకున్నాయి. వాటిల్లో ఒకటి అడవి సింహం. అడవిలో  పట్టుబడి పట్నంలో వున్న  జూకి వచ్చింది. తప్పించుకోవడమే తడవు  అది మళ్ళీ అడవిలోకి పారిపోయింది.
పోతే రెండో సింహం అడవిలో దొరికింది కాదు. అది జూలోనే పుట్టి  జూలోనే పెరిగిన సింహం. దాంతో దానికి అన్నీ బస్తీ అలవాట్లే అలవడ్డాయి. అడవీ, వేటా ఇవన్నీ దాని వంటికి పడవు. జూ సిబ్బంది పెట్టింది తిని తొంగుండే బాపతు. బద్దకానికి పెట్టింది పేరు.
మూడు రోజులు గడిచాయో లేదో, పారిపోయిన అడవి సింహం జూ సిబ్బందికి ఇట్టే  దొరికిపోయింది.  దాన్ని తీసుకువచ్చి మళ్ళీ జూలో బోనులో బంధించారు. కానీ బస్తీ సింహం ఆచూకీ మాత్రం పట్టుకోలేకపోయారు.
నెల గడిచింది. రెండు నెలలు గడిచాయి. మూడో నెల నడుస్తున్నా బస్తీ సింహం ఎటు పోయిందన్న సమాచారం లేదు.    
చివరికి ఎట్లాగయితేనేం బస్తీ సింహం ఆచూకీ ఆరుమాసాల తరువాత దొరికింది. దాన్ని పట్టి బంధించి మళ్ళీ జూకే తీసుకువచ్చారు.
పాత నేస్తాన్ని చూడగానే అడవి సింహం మొహం వికసించింది.
వాటి నడుమ సంభాషణ ఇలా సాగింది.
ఏం మిత్రమా! ఈ మానవ మృగాల కంట బడకుండా ఈ ఆరు నెలలు ఎక్కడ దాక్కున్నావు? యెలా దాక్కున్నావు?  ఈ రక్కసి  మనుషుల నుంచి  తప్పించుకుని ఏవిధంగా తిరగగలిగావు? ముందు  ఆ సంగతి చెప్పు
ఏం లేదు మిత్రమా! నువ్వేమో అలా అడవిలోకి వెళ్లావు. ఇక నాకు ఆ  అడవీ, దాని  ఆనుపానులు అసలే తెలియవాయె. ఏం చెయ్యాలి ఎక్కడ దాక్కోవాలి అని ఆలోచిస్తుంటే  దారిలో సచివాలయం కనిపించింది. వెంటనే దాంట్లోకి దూరిపోయాను. నా సామిరంగా! యే గదిలో చూసినా ఎక్కడ చూసినా అన్నీ ఫైళ్ళే. దుమ్ముకొట్టుకుపోయి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయివున్నాయి.  హాయిగా వెళ్ళి వాటి మాటున దాక్కున్నాను.
భలే భలే. మరి తిండీ తిప్పలమాటేమిటి
నిజానికి తిండికి వెతుక్కోవాల్సిన పనే లేదనుకో! ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఎటు చూసినా సిబ్బందే. హాయిగా రోజుకొకడ్ని నంజుకు తిన్నా అడిగేవాడులేదు. ఎందుకంటే ఒకడు కనిపించకపోయినా అక్కడ అయిపూ అజా కనుక్కునేవాడే లేడు. ఒకడు రాకపోయినా, పత్తా లేకుండా పోయినా  వాడి స్థానంలో ఇంకోడ్ని టెంపరరీగా వేసుకుంటారు కానీ,  అసలు వాడు ఎటు పోయాడు అని ఆరా తీసే వాడేలేడనుకో. అసలక్కడ పనిచేసేవాడంటూ వుంటే కద.  అందువల్ల నేను ఎంతమందిని  కొరుక్కుతిన్నా లెక్కతెలిసే అవకాశమేలేదు. అంచేత నాకు ప్రతిరోజూ మృష్టాన్న భోజనమే”  
మరి ఇంత హాయిగా రోజులు గడిచిపోతూ వుంటే మళ్ళీ వీళ్ళ  చేతికి యెలా చిక్కావ్
అదే ఖర్మ అంటే. హాయిగా రోజుకో ప్రభుత్వ ఉద్యోగిని తింటూ పోతే నన్ను ఎవడూ పట్టుకునే వాడు కాదు. బుద్ధి తక్కువై  ఓ రోజు,  వాళ్లకు రోజూ  టీ పట్టుకువచ్చేవాడు దొరికితే, ముందూ వెనకా చూడకుండా  వాడిని పొట్టనబెట్టుకున్నాను. అదే నా పొట్టమీద కొట్టింది. రోజూ టీ ఇచ్చేవాడు కనబడకపోవడంతో అప్పుడు వారికి మన వ్యవహారం అర్ధం అయినట్టుంది.  అంతా కలిసి మాటువేసి  నన్ను  పట్టేసుకున్నారు. అదీ మిత్రమా నా విషాద గాధ

(24-04-2013)

4, నవంబర్ 2014, మంగళవారం

రేడియోకు జీవం పోస్తున్న ప్రధాని మోడీ

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 06-11-2014, THURSDAY)

చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో 'మీడియా సావీ ముఖ్యమంత్రి'గా ఉమ్మడి రాష్ట్రంలో ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు'  ఏ టైంలో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న  రోజులవి.  ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు  మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. కరెంటు తీయడం, ఇవ్వడం ఒక పధ్ధతి ప్రకారం జరిగేవి. ఇక  ఆ కోతల సమయాలు ఒకసారి పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. ఇలాటి సందర్భాలలో కూడా రేడియోని పక్కన బెట్టి  ముఖ్యమంత్రిగారు 'టీవీ' లకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ,  నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్నలోని మర్మం ఇట్టే గ్రహించగలిగినవాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి,  'సాంబశివరావుగారూ! (నాటి ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచెప్పి ఆయన లోపలకు వెళ్ళిపోయారు.
ప్రధాన మంత్రి మోడీ రేడియో ప్రసంగాల పుణ్యమా అని ఈ నేపధ్యాన్ని మరో మారు నెమరువేసుకోవాల్సివచ్చింది.


దేశంలో లెక్కకు మిక్కిలిగా  ఇన్నిన్ని టీవీ ఛానల్స్ వుంటే ప్రధాని గారు తన మనస్సులో మాట (మన్ కీ బాత్) ను  ప్రజలతో పంచుకోవడానికి రేడియోనే ఎందుకు ఎంచుకున్నట్టు. ఎందుకంటె తనుచేప్పేది ఎవరికి చేరాలని  అనుకుంటున్నారో ఆయనకు బాగా తెలుసు కనుక. ఆయన లక్ష్యం సాధారణ ప్రజలు కనుక.  వారికి చేరువగా వుండే ప్రసార మాధ్యమం రేడియో. కరెంటు వున్నా లేకపోయినా పనిచేస్తుంది. పనిపాట్లు చేసుకునే వాళ్ళు కూడా తమ పని చెడగొట్టుకోకుండా వినొచ్చు. రైతులు, గ్రామీణ మహిళలు, వ్యవసాయ కూలీలు, రోడ్డు పక్కన, తోపుడుబళ్ళ మీద    చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చెప్పులు కుట్టుకునేవాళ్ళు,  ప్రయాణాల్లో వున్నవాళ్ళు ఇలా  అందరికీ అందుబాటులో వున్న సాధనం రేడియో అన్న ఎరుక కలిగిన వ్యక్తి కనుకనే  ప్రధానమంత్రి ప్రజలకు చేరువ కావడానికి ఈ మాధ్యమాన్ని ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. దసరా పండుగ నాడు ప్రధాని మోడీ ఈ రేడియో ప్రసంగ పరంపర మొదలుపెట్టారు. కారణం తెలియదు కానీ రేడియోలో  ఎలా మాట్లాడాలి అనే విషయంపై  ప్రధానికి మంచి అవగాహన  వున్నదని  ఈ ప్రసంగాలు వినేవారికి అనిపిస్తుంది. రేడియోలో ప్రసంగాన్ని  చదివినా పైకి మాట్లాడినట్టు వినిపించాలి.  భాష కూడా సరళంగా వుండాలి. పెద్ద పెద్ద పద ప్రయోగాలు కూడదు. అప్పుడే మనసులోని మాటల్ని జనం మనసుపెట్టి వింటారు. రేడియోకి సంబంధించిన ఈ ధర్మసూక్ష్మం మోడీ గారికి బాగా తెలిసినట్టు వుంది. గత ఆగస్టులో ఎర్రకోట మీద నుంచి ఆయన చేసిన ప్రసంగం గుర్తుంది కదా. సాంప్రదాయక విధానానికి స్వస్తి చెప్పి, అధికారులు తయారు చేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని పక్కనబెట్టి, సాధారణ ప్రజలకు సులువుగా అర్ధం అయ్యే రీతిలో, మామూలు మనుషులు మాట్లాడుకునే  భాషలో ఆయన మాట్లాడారు. అది దేశ వ్యాప్తంగా ప్రజల మనసుల్ని చూరగొన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే కాబోలు, తన మనసులోని మాటని జనాలతో చెప్పుకోవడానికి ఆయన కొత్తగా రేడియో ప్రసంగ ప్రక్రియను ప్రారంభించారు. ప్రధానమంత్రి కార్యాలయానికి అందుతున్న సమాచారాన్ని బట్టి  మోడీ మహాశయులు మొదలెట్టిన  ఈ కొత్త కార్యక్రమానికి శ్రోతల ఆదరణ విశేషంగా వున్నట్టు తెలుస్తోంది. ఆయన మాటల్లో ఎక్కువగా గాంధీగారి పేరు ప్రస్తావనకు రావడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా సందర్భానికి అనువుగానే ప్రధాని మాటల్లో గాంధీ  పేరు వస్తోందని అనుకోవచ్చు. అక్టోబర్ మూడో తేదీన ప్రారంభించిన  ఈ ప్రసంగ  ప్రహేళికను ప్రధాని,  'ఖాదీ వస్త్రధారణ, నేటి పరిస్తితుల్లో దాని ఆవశ్యకత' అనే అంశంతో మొదలు పెట్టారు.
"మీతో ఇలా రేడియోలో  మాట్లాడడం అనేది నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఒక్క రేడియో ద్వారానే నేను మిమ్మల్ని, ముఖ్యంగా పేదవారినీ, పల్లె ప్రజల్నీ కలుసుకోగలుగుతాను' అని చెప్పారు మోడీ తన ప్రసంగంలో. ఇది ఆయన మనసులోని మాట మాత్రమే కాదు, వాస్తవం కూడా.
'ప్రజలనుంచి  నాకెన్నో విలువైన సలహాలు సూచనలు అందుతున్నాయి. వాటిని చదువుతుంటే నాకు చాలా సంతోషంగా వుంది. మంచి ప్రభుత్వం మంచి పాలన  గురించి మీకు ఎలాటి ఆలోచనలు వున్నా వాటిని నాకు పంపండి. నేను వాటిని చదవడమే కాదు రేడియో ప్రసంగాలలో వాటిని నేను మీతో పంచుకుంటాను.' అని ప్రధాని అన్నారు.  
ప్రతిపక్ష కాంగ్రెస్ మొదట్లోనే తప్పుపట్టింది. 'మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు ముందు ప్రధాని చేసిన రేడియో ప్రసంగం ఎన్నికల నియమావళికి విరుద్ధం' అంటూ ఎన్నికల కమీషన్ కు పిర్యాదు కూడా చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆకాశవాణి  యంత్రాంగాన్ని దుర్వినియోగం  చేయడమే అని కాంగ్రెస్ ఆరోపించింది.
నవంబర్ రెండో తేదీన ప్రసారం అయిన రెండో కార్యక్రమంలో  ప్రధాని 'నల్ల ధనం' గురించి ప్రస్తావించారు. సుప్రీం ఆదేశాల  దరిమిలా పాలకపక్షం కొంత ఆత్మ రక్షణలో పడ్డట్టయింది. అందుకే మోడీ తెలివిగా ఈ  అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ అంశంపై ప్రభుత్వ విధానాన్ని అరమరికలు లేకుండా ప్రజలకు తెలియచెప్పడానికి మంచి ప్రయత్నం చేసారు.

ప్రధాని రేడియో ప్రసంగాల గురించి  దేశ వ్యాప్తంగా చేసిన ప్రచారానికి కోటి  రూపాయలవరకు ప్రజాధనం  ఖర్చు చేసారని కూడా గుసగుసలు వినవస్తున్నాయి. సరే! ఇవన్నీ షరా మామూలుగా రాజకీయాల్లో సహజమే కాబట్టి అసలు విషయం ఒకటి ముచ్చటించుకుందాం.
రాజకీయ నాయకులు ప్రజలను ఆకట్టుకోవడంలో వారికి వుండే ఆకర్షణ శక్తికి వారి ప్రసంగ పాటవం తోడవుతుంది. రెండో  ప్రపచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రధానిగా వున్న విన్ స్టన్ చర్చిల్ 'రాజకీయ నాయకులకు వాక్చాతుర్యం, వాక్పటిమను మించిన ఆయుధం లేదన్నారు. బహిరంగ సభల్లో వారు  చేసే ఉపన్యాసాల బలమే వారి అసలు బలం అన్నారు.  ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా  అధ్యక్ష ఎన్నికల్లో  డెమోక్రాటిక్ పార్టీ  అభ్యర్ధిగా నామినేట్ కావడానికి దోహదం చేసిన అంశాలలో ఇదొకటి. అమెరికా అధ్యక్షుడిగా తొలి పర్యాయం ఎన్నిక కావడానికి కూడా ఒబామా  ప్రసంగశైలి బాగా ఉపకరించిందని చెబుతారు.  భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా చక్కని వక్త. ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో, వారిని ఉత్తేజపరిచే బాణీలో మాట్లాడడం ఆయనకు కొట్టిన పిండి. లోక్ సభ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ చేసిన ప్రసంగాలే  బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించాయని నమ్మేవారు వున్నారు. అందుకే తనకున్న ఈ 'అర్హతను' రేడియో ప్రసంగాల ద్వారా ప్రదర్శించి ప్రజల మనస్సులను గెలుచుకునే క్రమంలోనే మోడీ ఈ మనసులోని మాట కార్యక్రమాన్ని మొదలుపెట్టారని అనుకోవాలి. ఐతే మరో నిజాన్ని కూడా గమనంలో వుంచుకోవాలి. ధాటీగా ప్రసంగాలు చేసే వాళ్ళందరూ గొప్ప నాయకులు కాలేరు. గొప్ప నాయకులందరూ విధిగా బాగా మాట్లాడేవారు అయివుండనక్కరలేదు. కాకపోతే గొప్ప నాయకుడికి గొప్పగా ప్రసంగించే సత్తా వున్నప్పుడు ఆయన మరింత గొప్ప నాయకుడు కాగల అవకాశాలు కూడా గొప్పగా వుంటాయి.                    
గొప్పగా మాట్లాడి చరిత్ర గతిని మార్చిన సందర్భాలు చరిత్రలో కానవస్తాయి. అమెరికాలో అబ్రహం లింకన్ ఒకసారి రెండే  రెండు నిమిషాలపాటు ప్రజలనుద్దేశించి బహిరంగంగా  ప్రసంగించారు. ఉపయోగించినవి  కూడా పదే పది  వాక్యాలు. ఆ ప్రసంగం ఎంతటి ప్రభావం చూపిందంటే  అమెరికాలో వేళ్ళూనుకుని వున్న  బానిసత్వం అనే దురాచారం కూకటివేళ్ళతో కూలిపోవడానికి  దోహదం చేసింది. అలాగే,  వందేళ్ళ తరువాత 'నాకో కల వుంది' అంటూ వాషింగ్టన్ లోని లింకన్  మెమోరియల్ మెట్లమీద  నిలబడి మార్టిన్ లూధర్ కింగ్  చేసిన ప్రసంగం ఆ దేశంలో  జాతి వివక్షకి చరమ గీతం పాడింది.
ప్రధాని మోడీ నవతరాన్ని విశేషంగా ఆకర్షించడానికి ఆయనకు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి ఆధునిక సోషల్ మీడియాలో వున్న అనుభవమే చాలావరకు ఉపయోగపడింది. ఆయన ట్విట్టర్ ఖాతాకు ఇంచుమింహుగా డెబ్బయి లక్షల మంది ఫాలోయర్లు వున్నారు. ఇక ఫేస్ బుక్ లో మోడీ గారి పేజీకి ఏకంగా కోట్లాదిమంది 'లైక్స్' వస్తున్నాయి అంటే ఈ రెండు మాధ్యమాలలో మోడీకి వున్న ఆదరణ అర్ధం అవుతుంది. ఇక ఇప్పుడు అయన మరో బ్రహ్మాస్త్రాన్ని తన అంబుల పొదిలో చేర్చుకున్నారు. అదే ఆకాశవాణి. దేశవ్యాప్తంగా 413  రేడియో స్టేషన్లు వున్నాయి. మొట్టమ జనాభా  120 కోట్లమందిలో 99.19 శాతం మంది ప్రజలకు రేడియో ప్రసారాలు అందుబాటులో వున్నాయి.
ఇప్పుడు అర్ధం అయింది కదా మోడీ జనాలకు దగ్గర కావడానికి రేడియోనే ఎందుకు ఎంచుకున్నారో. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఇది మొదలు పెట్టినప్పటికీ ఒక మంచి పని జరిగింది. ఒకనాడు తన ప్రసారాలతో దేశంలో 'సస్య విప్లవానికి' దోహదం చేసిన రేడియోకి, ప్రస్తుత పోటాపోటీ కాటా కుస్తీ పోటీల యుగంలో కనుమరుగు అవుతోందని జాతి జనులు వేదన చెందుతున్న రేడియోకి మోడీ మళ్ళీ జవసత్వాలు సమకూరుస్తున్నారు. పూర్వ వైభవాన్ని, ఔన్నత్యాన్ని, గౌరవ మర్యాదలను, గుర్తింపును తెచ్చిపెడుతున్నారు. గత కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో సయితం రేడియో గురించిన కబుర్లే, రేడియో గురించిన ప్రసంగాలే. రేడియో గురించిన చర్చలే. ఇంతవరకు మోడీ గారిని మనః స్పూర్తిగా అభినందించాలి.
ఉపశృతి: 1935లో హైదరాబాదు డెక్కన్ రేడియో,  ఆ తరువాత సెప్టెంబర్ పదో తేదీన  మైసూరులో ఒక రేడియో కేంద్రం ఏర్పాటు చేశారు. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వశాస్త్ర  ఆచార్యులుగావున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి ఆ కేంద్ర సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు. (04-11-2014)

NOTE: Courtesy Image Owner 

3, నవంబర్ 2014, సోమవారం

నేర్చుకుందాం రండి


ఇది కధా అంటే కావచ్చు. నిజమూ కావచ్చు. ఏదైనా నేర్చుకోవాల్సింది మాత్రం ఎంతో వుందనిపించింది. అందుకే అనువదించి అందరితో పంచుకోవాలని కోరిక కలిగింది. ఇది నెట్లో తారసపడిన ఓ ఇంగ్లీష్ పెద్దమనిషి మనసులోని మాటలు. ఇక చదవండి.
" విమానం ఎక్కి  లగేజి సర్దుకుని సీటు బెల్టు పెట్టుకుని కూర్చున్నాను. ఇంతలో బిల బిలలాడుతూ కొంతమంది యువ సైనికులు ప్రవేశించి నా చుట్టుపక్కల సీట్లలో సర్దుకున్నారు. వారితో ముచ్చట పెట్టాలనిపించి అడిగాను 'ఎక్కడకు వెడుతున్నారని'.
'సైప్రస్' నా పక్క సీట్లో కుర్రాడు చెప్పాడు. అక్కడ రెండు వారాలు శిక్షణ తీసుకుని  తరువాత ఆఫ్గనిస్తాన్ వెడతాము'
అమెరికాలో, ఇంగ్లాండులో ఇదంతా మామూలే. యువతీ యువకులందరూ కొంత కాలం  సైనిక శిక్షణ తీసుకుంటారు. వారిలో చాలామందిని అవసరమనుకున్నప్పుడు సైన్యంలోకి చేర్చుకుని  యుద్ధరంగాలకు పంపుతారు.
ఓ గంట గడిచింది. 'భోజనాలు రెడీగా వున్నాయి. అయిదు పౌండ్లు చెల్లించిన వారికి సప్లయి  చేస్తాము' అంటూ ప్రకటన.
"నేను పర్సు తీసి అయిదు  నోటు ఎయిర్ హోస్టెస్ చేతిలో పెట్టాను.
" నా పక్కన కూర్చున్న కుర్రవాడు తోటివాడితో అంటున్నాడు  'ఇప్పుడు వద్దు. అయిదు పౌన్లు అనవసరంగా దండగ ఖర్చు. విమానాల్లో అంతే.  కొద్ది గంటలు ఆగి దిగిన తరువాత ఏదైనా హోటల్లో తిందాం. ఈ అయిదు పౌన్లతో అయిదుగురం తినొచ్చు'
'అదీ నిజమే' అన్నాడు అతడు స్నేహితుడు.
"మిగిలిన వాళ్ళవైపు దృష్టి సారించాను. అందరిదీ అదే మాట లాగుంది. తిండి సంగతి  పక్కనబెట్టి కబుర్లల్తో కడుపు నింపుకుంటున్నారు.
"లేచి వెళ్లి అటెండెంటు చేతిలో యాభయ్ నోటు ఉంచాను. 'దయచేసి ఆ కుర్రాళ్ళులు అందరికీ లంచ్ ఏర్పాటు చేయండి'
ఆవిడకు ఒక్క క్షణం నేను ఏమి చెబుతున్నానో అర్ధం కాలేదు. అర్ధం అవగానే ఆవిడ కళ్ళల్లో నీళ్ళు చిమ్ముకువచ్చాయి.
నా చేతిని పట్టుకుని మృదువుగా నొక్కి వదిలేసింది. కన్నీరు చెంపల మీదుగా కారుతుంటే తుడుచుకుంటూ అన్నది.
'మా చిన్న వాడు కూడా ఇరాక్  యుద్ధంలోనే వున్నాడు. వేళకు తింటున్నాడో పస్తులుంటున్నాడో తెలవదు. మీరిప్పుడు పెట్టమని అంటున్న భోజనం వాడికోసం కూడా  అనుకుంటాను. మీ ఔదార్యానికి ధన్యవాదాలు'
యువ సైనికులందరికీ భోజనం ప్లేట్లు సర్ది వచ్చి చెప్పింది.
'మా కోసం ఫస్ట్ క్లాస్ ప్రయాణీకుల భోజనం సిద్దంగా వుంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే అది మీకు సర్వ్ చేస్తాను'
భోజనం ముగించుకుని రెస్ట్ రూమ్ వైపు వెడుతుంటే పక్క నుంచి ఒక చేయి నా వైపు వచ్చింది. ఆ చేతిలో కొన్ని పౌన్లు వున్నాయి.
' అ కుర్రాళ్ళ విషయంలో మీరు తీసుకున్న శ్రద్ధ చూసి కదిలి పోయాను. ముందే అలా ఎందుకు చేయలేదని బాధ పడుతున్నాను. నా వంతుగా ఈ పాతికా  వుంచండి'
నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను. విమానం కెప్టెన్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అతడి మొహం వెలిగిపోతున్నట్టుగా వుంది. ' మీతో చేతులు కలపొచ్చా!' అంటున్నాడతను. నేను సీట్లోనుంచి లేచి అతడితో కరచాలనం చేసాను. కెప్టెన్ నన్ను గట్టిగా కౌగలించుకున్నాడు.  'నేనూ ఒకప్పుడు యుద్ధ విమానాల్లో పనిచేసాను. ఒక రోజు ఇలాగే ఓ పెద్ద మనిషి నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి భోజనం కొన్నాడు. అది ఇంకా నా  కళ్ళల్లో మెదుల్తూ వుంది'
విమానంలో అందరూ నా  వైపే మెచ్చుకోలుగా చూస్తూ వుండడం గమనించి ఇబ్బందిగా అనిపించింది. అంతటితో  ఆగితే సరిపోను. ఒక్కసారిగా అందరూ లేచి నిలబడి అభినందన సూచకంగా చప్పట్లు చరవడం మొదలు పెట్టారు. నేను ఖర్చు చేసింది యాభయ్ పౌన్లు. వారం  రోజుల సిగార్ల ఖర్చు. 'ఇవ్వడంలో ఇంత హాయి ఉందా!'    
ఒక పిల్లవావడు లేచి వచ్చి నన్ను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. వెడుతూ కొన్ని నోట్లు చేతిలో పెట్టాడు. దూరం నుంచి అతడి తలితండ్రులు మందహాసం చేస్తూ నన్నే చూస్తున్నారు. లెక్క పెట్టకుండానే తెలిసిపోతోంది అవి పాతిక పౌన్లని.


సైప్రస్ చేరిన తరువాత సామాను తీసుకుని బయటకు వస్తుంటే ఎవరో నా చొక్కా జేబులో కొన్ని నోట్లు కుక్కి త్వరత్వరగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు.
టెర్మినల్ లో మళ్ళీ నాకు ఆ  యువ సైనికులు కనిపించారు. సామాన్లు సర్దుకుని తమ శిక్షణా శిబిరానికి వెళ్ళే పనిలో వున్నారు.
నేను వాళ్ళ దగ్గరకు వెళ్లాను. తోటి ప్రయాణీకులు  నాకిచ్చిన సొమ్ముకు మరో వంద కలిపి వారి  చేతిలో ఉంచాను. వుంచి చెప్పాను. 'దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి'
కారులో ఎక్కి కూచోగానే ఎవరో నా చెవిలో గుసగుసలాడినట్టు అనిపించింది.
'చూసావా! ముక్కుపచ్చలారని ఈపిల్లలే తమకున్న సమస్తం మాతృ భూమికి బదులు ఆశించకుండా  ఇస్తున్నారు. వారికి ఒక పూట భోజనం కొని పెట్టడం ఓ  పెద్ద ఘన కార్యమా!"   
ఇప్పుడు చెప్పండి ఈ కధనుంచి నేర్చుకోవాల్సింది ఉందంటారా లేదా. ఇది చదువుతున్న మీ అందరి సంగతి నాకు తెలవదు కానీ నాకు మాత్రం, నిజాయితీగా చెబుతున్నాను, కార్గిల్  యుద్దంలో మన వీర సైనికులు ఎంతమంది మరణించారో తెలవదు. వారెవరో తెలవదు.  ఇలా కంప్యూటర్ ముందు హాయిగా కూర్చుని ఇలా మీ అందరితో ముచ్చటిస్తూ ఉన్నానంటే, ఎక్కడో చలిలో, నిసిలో, వానలో, వంగడిలో మన సిపాయిలు  సరిహద్దుల్ని కాపాడుతుండబట్టే కదా!


అందుకే మంచి ఎక్కడ వున్నా -  అది విదేశీయుల నుంచి అయినా సరే నేర్చుకోవాలి. ఇక్కడ అభిజాత్యాలు, శషభిషలు పనికిరావు.
(03-11-2014)

NOTE: Courtesy Image Owner

1, నవంబర్ 2014, శనివారం

తిక్క కుదిరిస్తా!


ఏకాంబరం తన బాసుతో కలిసి పగటివేళ రైల్లో పోతున్నాడు. ఆ రైలు ఓ పెద్ద సొరంగ మార్గంలో పోతోంది. అదే బోగీలో మరో ఇద్దరు వున్నారు. ఓ వయస్సు మళ్లినావిడ, ఆవిడతో పాటు మాంచి వయస్సులోవున్న వాళ్ళమ్మాయి. రైలు సొరంగంలో ప్రవేశించగానే బోగీ అంతా చీకటి అలుముకుంది. ఎవరికెవరు కనిపించడం లేదు. వున్నట్టుండి ఎవర్నో ముద్దు పెట్టుకున్న ధ్వని, వెనువెంటనే చెంప చెల్లుమన్న చప్పుడు.
రైలు సొరంగం నుంచి బయటకు వచ్చింది. వెలుతురు వచ్చింది.
వృద్ధురాలు, ఏకాంబరం మొహాల్లో తెలియని కంగారు. మేనేజర్ చెంప కందిపోయి వుంది. తలదించుకుని కూర్చున్నాడు. ఏం జరిగిందో తెలియనట్టు అమ్మడు అమాయకంగా చూస్తోంది. మౌనంగా వున్నారు కానీ ఎవరి ఆలోచనలు వారివి.   
పెద్దావిడ మనసులో అనుకుంటోంది " పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు కానీ ఈ మేనేజర్లవన్నీ పిదప బుద్దులు. ఆఫీసులో అమ్మాయిలతో చనువు తీసుకున్నట్టే మా ఆమ్మాయిని కూడా ఏదో చేసివుంటాడు. ఇది చెంప చెళ్ళుమనిపించింది. మహ మంచి పనిచేసింది. ఇలాటి వెధవలకి ఇలాగే జరగాలి"
అమ్మాయి ఆలోచనలు వేరుగా వున్నాయి "బహుశా ఆ మేనేజర్ వెధవ నన్నే ముద్దుపెట్టుకోవాలని చూసివుంటాడు. చీకట్లో తెలియక  అమ్మకు పెట్టి ఉంటాడు. అమ్మ తక్కువదా! చాచి కొట్టి వుంటుంది"  
మేనేజర్ మరో విధంగా అనుకుంటున్నాడు "ఛ! ఛ! ఎంతపని జరిగింది. చెప్పుకుంటే సిగ్గుచేటు.  ఇది ఖచ్చితంగా ఏకాంబరం గాడి పనే అయివుంటుంది. వాడు ముద్దు పెట్టుకుంటే ఆ అమ్మాయి పొరబడి నా లెంపలు పగలగొట్టింది. కానీ ఎలా చెప్పడం? పగిలింది నా చెంప కదా!"
ఏకాంబరం ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి. కానీ అవి చస్తే బయటపెట్టడు.
" ఈ మేనేజర్ పీనుక్కి తగిన శాస్తే జరిగింది. అస్తమానూ ఆఫీసులో నా మీద పెత్తనం చేస్తాడు. అయిన దానికీ, కాని దానికీ వంకలు పెట్టి నలుగురిలో అవమానిస్తాడు. ఇన్నాల్టికి దొరికాడు వెధవ. ఇంకో టన్నెల్ రానీ,  మరోసారి ముద్దు పెట్టిన చప్పుడు చేస్తాను. మేనేజర్ గాడిద రెండో చెంప కూడా  పగలగొడతాను. ఏకాంబరం అంటే అల్లాటప్పా అనుకుంటున్నాడు వెధవన్నర వెధవ"
(Usharani Nutulapati పోస్ట్ చేసిన ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner 

పక్షి ప్రేమ



అనగనగా ఓ బ్రూనై,  పేరు లాగే ఈ దేశం  చాలా చిన్నది. అయితే డబ్బులో మాత్రం మాలావు. ఆదేశపు రాజుగారు, అంటే సుల్తాను ప్రభువులవారు  మొత్తం ప్రపంచంలోనే సంపన్నుడయిన రాజు. రాచరికం ఇంకా సాగుతున్న  ఆ దేశంలో దేనికీ కొదవలేదు. ఎందుకంటె అక్కడ సముద్ర గర్భంలో ముడి చమురు నిక్షేపాలకు కొదవలేకపోవడమే. పెట్రోలుకు, డీసెలుకు  ఈ  క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) మూలాధారం. అది యెంత పుష్కలంగా లభిస్తుందంటే  వరసగా నాలుగు రోజులు ఎండ కాసిందంటే చాలు  నేల మీద పచ్చగడ్డి దానంతట  అదే అంటుకుని తగలబడిపోతుందట. అలాటి ప్రమాదాలు జరక్కుండా చూడడానికే  భగవంతుడు ఆ దేశంలో ఎప్పుడూ వానలు కురిపిస్తుంటాడు.
సరే! ఈ బ్రూనై కధ ఎందుకంటె అక్కడ ఓ తెలుగు కుటుంబం కాపురం ఉంటోంది. ఒక్కటే కాదు చాలా తెలుగు కుటుంబాలు, ఆ మాటకి వస్తే భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఆ దేశంలో నివసిస్తున్నారు. ముందు చెప్పిన కుటుంబంతో ముఖ పరిచయం లేకపోయినా ముఖ పుస్తక పరిచయం చాలా రోజులుగా వుంది. ధూళిపూడి రాం ప్రసాద్ గారు  కాకినాడ వాస్తవ్యులు.  డిజైన్ ఇంజినీరు. ఆఫ్ షోర్ క్రూడాయిల్ డ్రిల్లింగులో రాం ప్రసాద్ గారి పాత్ర కూడా ఎంతో కొంత వుండే వుంటుంది. వారక్కడ ఒకింట్లో అద్దెకు వుంటున్నారు. జన సాంద్రత తక్కువ కాబట్టి అక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించరు. ఒకటి రెండు అంతస్తుల ఇళ్ళే ఎక్కువ. ఆయనది  పై పోర్షన్. ఇంటి యజమానులు కింద వుంటారు. మంచి మనుషులు కాబట్టి ఇంటి యజమాని కుటుంబంతో బాగా కలిసిపోయారు. ఇలా హాయిగా రోజులు గడుస్తున్న సమయంలో ఓ పక్షి జంట తమకు తాముగా ఆ ఇంటికి వచ్చి మంచి ముహూర్తం చూసుకుని  గృహ ప్రవేశం చేసింది.  మెట్లకింద, ట్యూబు లైట్  మీద జాగా చూసుకుని ఏకంగా ఓ  గూడుకట్టుకుని కాపురం పెట్టింది. చూస్తుండగానే పక్షి సంసారం పెరిగింది. గుడ్లు పెట్టడం పొదగడం జరిగిపోయింది. నల్లటి ఆకారంలో వుండే ఆ పక్షులు ఏజాతివో కూడా  రామప్రసాద్ గారికీ వారి భార్యకూ తెలవదు. మెట్లు ఎక్కేటప్పుడూ, దిగే టప్పుడూ వాటితో మొదలయిన అవినాభావ సంబంధం బాగా పెరిగిపోయింది. సంసారం పెరగడంతో గూడు సరిపోలేదు. గూడు పిల్లలకు ఇచ్చి తల్లి పక్షి, తండ్రి పక్షి ట్యూబ్ లైట్ పై కాలక్షేపం చేయడం చూసి రాం ప్రసాద్ దంపతులు ముచ్చట పడ్డారు.  పక్షులు కూడా  ఆ వాతావరణానికి అలవాటు పడిపోయాయి. అసలు సమస్యల్లా 'స్వచ్ఛపరిసరాల' నినాదంతో వచ్చింది. పక్షులకు గూడంటూ దొరికింది కానీ వాటికి విడిగా లెట్రిన్ సౌకర్యం లేకపోవడంతో అవి యధేచ్చగా వున్నచోటునుంచే కాలకృత్యాలు తీర్చుకోవడం మొదలెట్టాయి. అవి వేసే రెట్టలు ఇంటి యజమానురాలికి  చిరాకు తెప్పించాయి. మెట్ల నిండా రెట్టలు కనిపిస్తుంటే ఎవరికి మాత్రం కోపం రాదు. 'అదంతా ఎవరు శుభ్రం చేస్తారు' అని లా పాయింటు తీసి, ముందు ఆ పక్షి గూడును అక్కడినుంచి  తక్షణం తీసివేయాల్సిందే అని హుకుం జారీ చేసింది. పక్షుల మీద అకార  మమకారం పెంచుకున్న రామప్రసాద్ దంపతులు సుతారమూ దానికి వొప్పుకోలేదు. పక్షుల రెట్టల్ని శుభ్రం చేసే బాధ్యతను రామప్రసాద్ గారి భార్య స్వచ్చందంగా తలకెత్తుకోవడంతో సరిహద్దు వివాదం చల్లారి పోయింది.
కింద ఫోటోలో కనిపించేదే ఆ పక్షి గూడు. వాటిని ఎవరయినా గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి.





NOTE : Photo Courtesy Shri Dhulipudi Ramprasad



పొదుపు మంత్రం పఠిస్తున్న మోడీ ప్రభుత్వం

(Published by 'SURYA' Telugu Daily in its Edit Page on 02-11-2014, SUNDAY)

గత గురువారం నాడు మోడీ ప్రభుత్వం కొన్ని పొదుపు చర్యల్ని ప్రకటించింది. ఒకరకంగా ఇవి వ్యయ నియంత్రణ చర్యలు. ఖర్చు చేయని రూపాయే మనం మిగిల్చుకున్న రూపాయని అంటారు. అలాగే, ప్రభుత్వం కూడా కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలని తలపెట్టింది. ఖర్చులు పెంచుకుంటూపోయే ఈ రోజుల్లో 'తగ్గించుకుంటాం' అంటే మంచి మాటే కదా!. అయితే, గతంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే సర్కారు కూడా రెండోవిడత పాలనలో ఇదేమాదిరి కొన్ని పొదుపు చర్యల్ని ప్రకటించింది. కాబట్టి దీనికి పూర్తి ఖ్యాతిని పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వ ఖాతాలోనే వెయ్యాల్సిన  అవసరం లేదు. ప్రభుత్వాల నిర్వహణలో భాగంగానే వీటిని చూడాల్సివుంటుంది.
ద్రవ్యలోటు బాగా పెరిగిపోతూ ఉండడంవల్ల ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోకతప్పడం లేదు. ప్రణాళికేతర వ్యయం అపరిమితంగా పెరిగిపోతూ వుండడం అనేది ప్రభుత్వాలకు ఆందోళన కలిగించే విషయం. దీన్ని అదుపు చేయడం వల్ల  ముందు ఇబ్బంది పడేది కూడా ప్రభుత్వాన్ని నడిపేవారే  కావడం ఒక విశేషం. మంత్రులూ, అధికారులూ కొన్ని సౌకర్యాలు తాత్కాలికంగానైనా కోల్పోతారు. మునపటి మాదిరిగా సర్కారు సొమ్ముతో జల్సాలు చేయడం కుదరదు. ప్రస్తుతం అధికారరీత్యా పర్యటనలు చేసేటప్పుడు కొందరు ఉన్నతాధికారులకు విమానాల్లో ఫస్ట్ క్లాసులో ప్రయాణించే వెసులుబాటు వుంది. సాధారణ  టిక్కెట్టు ధరకంటే ఇది రెండు మూడు రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఆ పద్దతికి ముగింపు పలికారు. అంతే  కాదు, విమానాల్లో చౌకగా దొరికే టిక్కెట్లతోనే  ప్రయాణాలు చేయాలి. ఒక స్థాయి అధికారులకు, అనధికారులకూ దేశ విదేశ ప్రయాణాలు చేసేటప్పుడు తమకు తోడుగా మరొకరిని వెంట తీసుకుని వెళ్ళే సదుపాయం వుంది. ఈ సౌకర్యం ఇక ముందు వుండదు.  సదస్సులు, గోష్టుల పేరుతొ పెట్టె ఖర్చులకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇలాటి సందర్భాలలో  విందు వినోదాల పేరిట చేసే ఖర్చు చుక్కల్ని తాకుతోందనడం వాస్తవ దూరమేమీ కాదు. ఎంతో అవసరమైన సందర్భాల్లో తప్ప సదస్సులు ఏర్పాటుచేయరాదని ఆదేశించింది.  ఒకవేళ సదస్సుల ఏర్పాటు తప్పనిసరి అయితే, ఎటువంటి పరిస్తితుల్లోను వాటిని ఖరీదయిన అయిదు నక్షత్రాల హోటళ్ళలో అసలే  ఏర్పాటు చేయకూడదన్నది మరో ఆంక్ష.  వీలయినంతవరకు, డబ్బు తక్కువ ఖర్చయ్యే వీడియో కాన్ఫరెన్సు విధానాలను అనుసరించాలనీ, పర్యటనలు, ప్రయాణాలు తగ్గించుకోవాలనీ  ప్రభుత్వం సూచించింది. పొదుపు మంత్రం ప్రభావం ప్రభుత్వ వాహనాల మీద కూడా పడుతుంది.  కొత్త వాహనాల కొనుగోళ్ళపై నిషేధం విధించింది. ఇలానే మరికొన్ని షరా మామూలు చర్యలు ఈ జాబితాలో వున్నాయి.
మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచీ అనవసర  వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. అధికార పీఠం ఎక్కగానే,  ప్రధాని హోదాలో  వెంట వెంటనే  చేసిన అనేక విదేశీ ప్రయాణాల్లో కూడా కొన్ని సాంప్రదాయక పద్ధతులకు స్వస్తి చెప్పారు. గతంలో ప్రధానమంత్రి విదేశీ ప్రయాణం అంటే చాలా హడావిడి వుండేది. ఆయన వెంట వెళ్ళే పరివారంలో అనేకమంది పత్రికా విలేకరులు కూడా వుండేవారు. మోడీ వీటికి రాం రాం చెప్పేసారు. ప్రధానులు   ప్రయాణం చేసే ఎయిర్ ఇండియా విమానాల్లో  మద్యం ఏరులా ప్రవహించేదని గతంలో  ఆ అవకాశం దక్కిన విలేకరులు తమతోటివారికి చెప్పుకునేవారు. మోడీ వాటన్నిటికీ ఒకేసారి భరతవాక్యం పలికారు. ఇవన్నీ దేశ ప్రజల దృష్టిలో పడి, ఆయన వ్యక్తిత్వ శోభ మరింత ఇనుమడించే  మాట నిజమే. కానీ, ఇటీవల మోడీ జరిపిన అమెరికా పర్యటనలో ఆయన ధరించిన ఖరీదైన డిజైనర్ దుస్తులకు  సోషల్ మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం లభించింది. గతంలో ఇందిరా గాంధీ విషయంలో ఇదే విధమైన ప్రచారం సాగేది. పర్యటనల సమయంలో ఆవిడ రోజు మొత్తంలో అనేక పర్యాయాలు ఎలా చీరెలు మార్చేవారు అనే సంగతులను ఫొటోలతో సహా ఆసక్తికర  కధనాలను  పత్రికలు  ప్రచురించేవి.  ఆరాధ్య దైవాలుగా ప్రజల్లో తమ ప్రభ  కొనసాగినన్నాళ్లు ఈ ప్రచారాలు ఆయా నాయకులకు  సానుకూలంగానే  సాగుతాయి. పరిస్తితులు తలకిందయినప్పుడు, తాడే పామయి కరిచినట్టు ఇలాటి అంశాలే,  వారిపై వ్యతిరేక  ప్రచారానికీ, వారి  వ్యక్తిత్వ హననానికీ దారితీసే ప్రమాదం వుంది. చరిత్ర చెప్పే ఈ  పాఠాలను  నేతలు సదా  గుర్తుపెట్టుకోవాలి.


కొన్ని విషయాలు వినడానికి ఆసక్తికరంగా వుంటాయి. తమ అభిమాన నాయకులు లేదా వ్యక్తుల జీవన శైలిని, విపరీత పోకడలను  అభిమానించేవారు కొందరయితే, ఆ పేరుతొ  ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించే ప్రత్యర్ధులు  కూడా వుంటారు. గతంలో కాంగ్రెస్  ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య అధికారిక పర్యటనలకోసం యాదగిరి అనే ఒక  హెలికాఫ్టర్ వాడేవారు. ఆనాటి  ప్రభుత్వాలను విపరీతంగా విమర్శించి, ప్రజల్లో పెల్లుబికిన కాంగ్రెస్ వ్యతిరేకతతో  అధికారపగ్గాలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు సయితం ఆ తరువాతి రోజుల్లో హెలికాఫ్టర్ ని  విచ్చలవిడిగా  వాడిన విధానం విమర్శలకు  గురయింది. బెజవాడ నుంచి కృష్ణ అవతల వొడ్డున వున్న మంగళగిరి వెళ్ళడానికి కూడా ఎన్టీయార్ హెలికాఫ్టర్ వాడారని ఆరోజుల్లో ప్రత్యర్ధి కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. అయితే, ప్రజల్లో ఆయనకు వున్న విపరీతమైన అభిమానం వల్ల ఆ ఆరోపణలు గాలికి కొట్టుకుపోయాయి.
తన 'నోటి మాటే' జీవో అని ప్రకటించిన మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రభుత్వ వ్యయంపై అనేక ఆంక్షలు  ఉండేవి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన వెంట వెళ్ళే అధికారులకు విమానయాన అర్హత  వుండేది కాదు. ప్రతిసారీ, ఆ అధికారులు విమానయానం కోసం ఆర్ధిక శాఖనుంచి ప్రత్యేకంగా  ముందస్తు అనుమతులు తీసుకోవాల్సివచ్చేది. ఆ అనుమతులను విడిగా జీవోల  రూపంలో విడుదల చేయాల్సిన పరిస్తితి వుండేది.  ఆయన పేషీ సిబ్బందిలో చాలామందికి ప్రభుత్వ వాహనాలు ఉండేవి కావు.
సచివాలయంలో అతికొద్దిమంది అధికారులకు తప్ప  ఏసీ సౌకర్యం వుండేది కాదు. తరువాత తరువాత ప్రపంచ బ్యాంకు రుణాలు ఇబ్బడిముబ్బడిగా రావడం మొదలయిన తరువాత నుంచి కాబోలు  ప్రభుత్వ కార్యాలయాల రూపురేఖలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఒక మంత్రి కార్యాలయంలో వాడిన ఫర్నిచర్ కొత్తగా వచ్చే  మరో మంత్రి వాడే ప్రసక్తి లేదు.  కిటికీ తెరలతో సహా మళ్ళీ అన్నీ కొత్తవే కొంటున్నారు. 'యధారాజా....' అన్నట్టు  ఉన్నతాధికారులదీ అదే వరస అయింది. వారి  అభిరుచులకూ, వారి జాతకాలకు  సరిపడే వాస్తుకు అనుగుణంగా వారి  కార్యాలయాలు, ఇళ్ళల్లో మార్పులూ, చేర్పులూ  ప్రభుత్వ ఖర్చుతో ఆఘమేఘాలమీద జరిగిపోతూ వుండడం నేడు చూస్తున్నాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి  ఒకరు ఉదయం ఢిల్లీ వెళ్లి సాయంత్రం హైదరాబాదు తిరిగొచ్చి, తిరిగి మర్నాడు ఉదయమే ఢిల్లీకి విమానంలో వెళ్ళిన సందర్భాలు వున్నాయి. 'రాత్రి ఢిల్లీలోనే ఉండొచ్చు కదా, రాత్రికి రాత్రి హైదరాబాదు వచ్చి చక్కబెట్టే  రాచకార్యాలు ఏమిట'ని ప్రతిపక్షాలు తప్పుబట్టిన ఉదంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల విమాన ప్రయాణాలను ఎద్దేవా చేసిన వారే  ఇప్పుడు  ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. ఇదొక రాజకీయ వైచిత్రి. ఒకప్పుడు   ప్రభుత్వ వాహనాలు అంటే  అంబాసిడర్ కార్లు మాత్రమె.  ఇందిరా గాంధి ప్రధానమంత్రిగా వున్నప్పుడు కూడా ఆవిడ అధికారిక వాహనం అంబాసిడర్ కారే. ఇప్పుడు మంత్రులూ, ఆ హోదా కలిగిన వారూ  వాడుతున్న అతి ఖరీదయిన కార్లు, వాటిని  విచ్చలవిడిగా వాడుతున్న విధానం  గమనిస్తే, దుబారా ఎక్కడ జరుగుతున్నదో ఇట్టే తెలిసిపోతుంది. ఇల్లు చక్కపెట్టే పని ఇలాటి వాటినుంచి మొదలు పెడితే బాగుంటుంది.
మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే.  కానీ మనకంటే బాగా అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో అధ్యక్షులు, ప్రధానమంత్రులు చాలా నిరాడంబరంగా విధులను నిర్వహించడం చూస్తున్నాం. ఒక దేశపు ప్రధాని ఎలాటి భద్రతా ఏర్పాట్లు లేకుండా భార్యతో కలిసి నడుచుకుంటూ సినిమాకు వెళ్ళే వాడని, మరో దేశం అధినేత విమానాశ్రయంలో బోర్డింగ్ పాసుకోసం  క్యూలో నిల్చునేవాడనీ, మరోదేశపు ప్రధాన మంత్రి సరదాగా టాక్సీ డ్రైవర్  వేషం కట్టి జనాలను అలరించాడనీ ఇలా వార్తలు వింటున్నప్పుడు, పత్రికల్లో చదువుతున్నప్పుడు, సోషల్ మీడియాలో గమనిస్తున్నప్పుడు   మన నాయకులు కూడా అలా వుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఇటువంటి వృత్తాంతాల నుంచి  పాఠాలు నేర్చుకుంటే మంచిది కానీ, ఉత్తుత్తి పొదుపు మంత్రాలవల్ల  చింతకాయలు రాలవు. సౌకర్యాలకు, సదుపాయాలకు అలవాటుపడ్డ ప్రాణాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఇట్టే కనుక్కుంటాయి. పొదుపు చర్యలు, ఉత్తర్వులు కాగితాలకే పరిమితమైపోతాయి. నిబంధలను రూపొందించే వారికే వాటిని ఉల్లంఘించే  అడ్డదారులు ముందుగా తెలుస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. (01-11-2014)

NOTE: Courtesy Cartoonist