3, అక్టోబర్ 2014, శుక్రవారం

పరిశుద్ధ భారతం

(Published by 'SURYA' telugu daily in its Edit page dated 05-10-2014, SUNDAY)

ఎప్పుడో యాభయ్ ఏళ్ళక్రితం పత్రికల్లో వచ్చిన వార్త.
1960లో అనుకుంటాను. నాటి సోవియట్  యూనియన్  అధినేత నికితా కృశ్చెవ్ భారత దేశంలో అధికార పర్యటన నిమిత్తం మాస్కో నుంచి న్యూ ఢిల్లీ చేరుకున్నారు. అప్పటి పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన భారత ప్రధమ ప్రధాన మంత్రి జవహర లాల్ నెహ్రూ, రష్యన్ నాయకుడిని వెంటబెట్టుకుని ఉదయపు వేళలో కారులో వస్తుంటే, తోవలో అక్కడక్కడా కొందరు ఆడామగా మోకాళ్ళ మీద కూర్చుని వుండడం కృశ్చెవ్ కంటబడింది. ఆయన ఉత్సుకత ఆపుకోలేక నెహ్రూ వైపు సాలోచనగా  చూసారు. సమాధానం చెప్పలేక నెహ్రూ గారి మొహం పాలిపోయింది. ఈ పేద దేశంలో అధిక సంఖ్యాకులు ఇలా బహిర్భూములలోనే బహిరంగంగా కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్తితి గురించి బయటకు చెప్పుకోలేక  ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారని నాటి వార్తల సారాంశం.
ఇది జరిగి యాభయ్ నాలుగేళ్ళు దాటుతోంది. దేశంలో పరిస్తితి ఏమైనా మారిందా అంటే చప్పున అవునని జవాబు చెప్పలేని స్తితిలోనే ఉన్నాము. ఒకానొక రోజుల్లో యావత్ ప్రపంచానికి నాగరీకం నేర్పిన దేశంగా మన దేశానికీ పేరు. మరిప్పుడో! మురికి కూపంగా చూపాల్సివస్తే విదేశీ మీడియాకు ముందు కనబడేది మన దేశమే. దీనికి ఎవ్వరు కారణం? పాలకులా? పాలితులా? విధానాలా? వాటి అమలు తీరా?


వీటికి జవాబులు చెప్పలేకే, ఈ నెల రెండో తేదీన భారత ప్రభుత్వం మొదలెట్టిన స్వచ్చ భారత్ ఉద్యమం. మోడీ మార్క్ తరహాలోనే అట్టహాసంగా మొదలయింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు చీపుర్లు చేతబట్టి ఈ ఉద్యమంలో మహోద్యమంగా పాల్గొన్న చిత్రాలు, దృశ్యాలు  మీడియాలో దర్శనమిచ్చాయి. మోడీ గారు షరా మామూలుగానే తనదయిన పద్దతిలోనే ఈ స్వచ్చ భారత్ ప్రయోగం గురించి వివరణ ఇచ్చారు. దేశాన్ని శుభ్రం చేసే పని ఒక్కడివల్ల అయ్యేది కాదనీ, ప్రజలందరూ పాలుపంచుకుని సహకరిస్తేనే ఫలితాలు ఉంటాయనీ అన్నారు. ఎర్రకోట నుంచి పంద్రాగష్టున చేసిన ప్రసంగంలో కూడా ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దానికి కొనసాగింపుగానే ఈ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందని అనుకోవాలి.


ఇన్నేళ్ళ స్వతంత్ర భారతం ఎలాటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పడం కాదు. అయితే, అనేక విషయాల్లో ఇతర అగ్రరాజ్యాలకు పోటీగా ముందుకు దూసుకుపోతున్న భారత దేశం  ఈ ఒక్క విషయంలోనే ఎందుకు వెనుకబడి వున్నది అన్న ప్రశ్నను మోడీ వేసుకున్నారు. కానీ వాస్తవానికి ఇది నూరుకోట్లు దాటిన మన యావత్ భారత జనాభా వేసుకోవాల్సిన ప్రశ్న. సమాధానం అన్వేషించుకోవాల్సిన ప్రశ్న. ఈనాడు అందివచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ మన దేశం నుంచి ఏటా లక్షలాదిమంది ఇతర దేశాలకు ఉపాధుల నిమిత్తం వలస పోతున్నారు. సరే. మంచిదే. కానీ,  ఒక జీవితానికి సరిపడా సంపాదించుకున్న వాళ్ళు సయితం ఎందుకు తిరిగి స్వదేశానికి రావడానికి విముఖత చూపుతున్నారు?
"ఇక్కడ రోడ్లు బాగుండవు. స్వచ్చమైన నీళ్ళు దొరకవు. పరిశుద్ధమైన గాలి కలలో మాట. ఇక ఇళ్ళూ వాకిళ్ళూ, వాటి  పరిసరాలు అపరిశుభ్రతకు నిలయాలు. మేము వద్దామని అనుకున్నా మా పిల్లలకు ఎవ్వరికీ  దేశంలోని ఈ పరిస్తితులు నచ్చడం లేదు. అందుకే రావాలని వున్నాకూడా  రాలేని పరిస్తితి" ఇవీ వాళ్ళు ఇచ్చే  సంజాయిషీ.
" భారత దేశానికి రండి. వచ్చి  పరిశ్రమలు పెట్టండి. మేక్ ఇన్ ఇండియా అని పేరుపడేలా చేయండి' ఈ  నినాదాలు వినడానికి బాగానే వుంటాయి. మరి వచ్చేవారికి, వద్దామనుకున్నవారికి  వసతుల  విషయం?  వాళ్ళ మెదళ్ళను ప్రధానంగా తొలుస్తున్న పారిశుధ్యం విషయం? వీటికి జవాబు చెప్పకుండా నినాదాలకు ప్రతిస్పందన ఆశించడం వృధా.
అందుకే  కాబోలు మోడీ గారు 'స్వచ్చ భారత్ నినాదం' అందుకున్నారు. ఉద్దేశ్యం మంచిదే. ఇది విజయవంతం అయితే లాభపడేది కూడా దేశంలోని సాధారణ జనమే. కలిగినవాళ్ళు ఎట్లాగు మురికికీ,  మాలిన్యాలకూ దూరంగానే వుంటారు. లేనివాళ్ళకు ఉపయోగపడే ఇటువంటి ప్రయోగాలు ఎప్పటికీ ఆహ్వానించతగినవే.
'పచ్చదనం, పరిశుభ్రం' అనే పదాలు మనకు కొత్తవేం  కావు కాని, వీటిని గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినబడే పేరు ఒక్కటే. అది సింగపూరు. మన దేశం లాగానే ఆ చిన్ని దేశం కూడా చాలా ఏళ్ళు బ్రిటిష్ పాలనలో మగ్గింది. మనకు  స్వతంత్రం వచ్చిన పదహారేళ్ళ తరువాతనే  ఆ దేశం  స్వేచ్చావాయువులు పీల్చగలిగింది. స్వేచ్చావాయువులతో పాటు  స్వచ్చమైన గాలిని పీల్చగలగడం, మరింత పరిశుద్ధమైన నీటిని తాగ గలగడం, కాలుష్య రహిత నగరంగా పేరు తెచ్చుకోవడం అనతికాలంలోనే జరిగిపోయింది కూడా.  సిగరెట్ పీకెలు, బస్సు టిక్కెట్లు, ప్లాస్టిక్ సంచులు రోడ్లమీద పారేయడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం  అక్కడ నిషిద్దం. అలాటివారికి విధించే జరిమానాలు కూడా చాలా భారిగా వుంటాయి.  అందుకే అక్కడి రోడ్లు ఎలాటి చెత్తా చెదారం లేకుండా మిలమిలా మెరిసిపోతుంటాయి.
కానీ ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. అలాగని ఏళ్ళతరబడి సమయం తీసుకోలేదు. పరిశుభ్రత అన్నది జనం జీవితంలో భాగంగా మారిపోవడానికి అక్కడి ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయి. దానికి పౌరుల సహకారం తోడయింది.
సింగపూరులో ఉంటున్న ఒక హైదరాబాదీ చెప్పిన ఒక ఉదంతం ప్రస్తావనకు అర్హమైనది.
ఆ దేశంలో ఒక దృశ్యం నిత్యకృత్యం.
అదేమిటంటే - ప్రతిరోజూ సింగపూరులో ఎక్కడో ఒక చోట ఒక సమూహం బయలుదేరుతుంది. వారి చేతుల్లో చెత్తాచెదారం శుభ్రం చేసే పరికరాలు వుంటాయి. పారిశుధ్య పనివారు ధరించే పై దుస్తులు (యాప్రాన్లు) ధరించి వారు నిర్దేశించిన ప్రాంతంలో కొన్ని గంటలపాటు శ్రమించి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. పబ్లిక్ టాయిలెట్లు బాగుచెయ్యడం దగ్గర నుంచి, వీధుల్ని శుభ్రం చేయడం వరకు అన్నిరకాల కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు,  నిజానికి పారిశుధ్య కార్మికులు కాదు. అలాగని స్వచ్చంద సంస్థల కార్యకర్తలూ కాదు. వారిలో పెద్ద ఉద్యోగస్తులు వుంటారు. వ్యాపారస్తులు వుంటారు. చదువుకునే యువతీ యువకులూ వుంటారు. పరిశుభ్రతకు సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించి చట్టానికి చిక్కిన వాళ్ళు వారు. అలాటి వారికి జరిమానాలతో పాటు అదనంగా విధించే శిక్షలు ఇవి. పనంతా  పూర్తయిన తరువాత వారికి ఒక శీతల పానీయం ఇచ్చి,  నిబంధనలు పాటించడం వల్ల పౌరులకు, సమాజానికి వొనగూరే ప్రయోజనాలు గురించి వివరించి చెప్పి  మరీ సాగనంపుతారు.
అంచేత మన  దేశాన్ని 'మురికిలేని పరిశుద్ధ భారతం'గా తయారుచేయాలన్న మోడీ గారి సంకల్పం విజయవంతం కావాలని కోరుకుంటూనే, సింగపూరు వంటి చిన్న దేశాలు ఈ విషయంలో సాధించిన పురోగతిని ఓ కంట గమనించాలని కూడా ఆశిద్దాం. (03-10-2014)
NOTE : Courtesy Image Owner 

ఊసరవెల్లులు

  

‘పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు?’  అనేది చిన్నప్పుడు స్కూల్లో అడిగే ప్రశ్న.
‘తెలుగు మాస్టారు’ ఠకీమని సమాధానం.
ప్రశ్న అడిగిన లెక్కల మాస్టారుకి ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. తరువాత ఏదో తప్పువెతికి పట్టుకోవడం, చెయ్యి చాపమనడం, చాచిన చేతిని తిరగేయించడం,  దానిమీద డష్టరు తిరగేయడం - అది వేరే కధ.



తమదగ్గర  చదువుకునే పిల్లల్లో ఐ.ఏ.ఎస్. లు ఎంతమంది అవుతారన్నది వారికొచ్చిన  డౌటేహం కావచ్చు. వాళ్ళల్లో రాజకీయనాయకులు, జర్నలిస్టులు కొంతమంది అయినా కాకపోతారా అనే నమ్మకం కావచ్చు. అందుకే కాబోలు,  పిల్లలకు   వక్తృత్వపోటీలు పెట్టి, ‘కలం గొప్పదా? కత్తి గొప్పదా?’ – ‘అణ్వస్త్రాలు కావాలా?  అన్నవస్త్రాలు కావాలా?’ అని ప్రతి అంశానికి అనుకూలంగా ప్రతికూలంగా రెండు విధాలుగా చెప్పించేవారు. అప్పుడర్ధంయ్యేది కాదు కానీ ఇప్పుడు టీవీ చర్చల తీరుతెన్నులు, రాజకీయ నాయకుల ప్రకటనలు గమనిస్తుంటే  అందులోని తత్వం  నెమ్మది నెమ్మదిగా తలకెక్కుతోంది. విషయం ఒకటే అయినా, తమ పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా  ఎలా మాటలు తిరగేసి మాట్లాడొచ్చు అనే దానిలో అందరూ  మాస్టర్స్ డిగ్రీ సాధించేశారు. నరం లేని నాలుక ఏవిధంగానయినా మాట్లాడుతుందంటారు చూడండి. అలా రాజకీయ నాయకులు ‘మొన్న ఏం మాట్లాడాం, నిన్న ఏం చెప్పాం’ అన్నదానితో నిమిత్తం లేకుండా ‘ఈరోజు చెప్పిందే ఫైనల్’ అన్న పద్ధతిలో  బల్లగుద్ది వాదిస్తున్న విధం చూస్తుంటే 'రాజకీయాల్లో సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం   కాకరకాయా ఏమీలేదు వొట్టి అవకాశవాదం తప్ప' అని  అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ వుండదు. అలాగే, నిన్న కప్పుకున్న పార్టీ కండువా తెల్లారేకల్లా మార్చేసి అందుకు తగ్గట్టుగా మాటల ఘాటు పెంచడం చూస్తేమాత్రం ఆశ్చర్యపోకా  తప్పదు. విశ్వనాధవారు అన్నట్టు ఇదో వైచిత్రం. 

NOTE: Courtesy Image Owner 

1, అక్టోబర్ 2014, బుధవారం

రాజు గారికి కోపం వచ్చిందా!


రాజు గారికి కోపం రావచ్చు కాని, నాకు బాగా తెలిసిన ఈ రాజు గారికి కోపం వచ్చే అవకాశం బొత్తిగా లేదు.
ఈరోజు పత్రికల్లో ఈ రాజు గారికి అంటే నాకు తెలిసిన రాజుగారు, కేంద్ర మంత్రి శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి కోపం వచ్చినట్టు వార్తలు చదివి (గుంటూరు గోల) ఓ పట్టాన నమ్మలేకపోయాను.


కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగుదేశం పార్టీలో  శిఖర సమానులు. అధికారాలు, హోదాలు ఆయనకు పుట్టుకతో అబ్బినవే కనుక వాటిని అడ్డం పెట్టుకుని విర్రవీగాల్సిన అవసరం లేని ఏకైక రాజకీయ నాయకుడు ఆయన. అందుకే, ముఖ్యమంత్రి తరువాత రెండో స్థానంగా అందరూ పరిగణించే ఆర్ధిక శాఖ, రెవెన్యూ మంత్రిత్వ శాఖలు రెండూ నిర్వహించిన సమయంలో కూడా  ఆయన తన తీరు మార్చుకోలేదు. హైదరాబాదులో వుంటే మాత్రం ఠంచనుగా సచివాలయానికి వచ్చి కూర్చునేవారు. ఎప్పుడన్నా సెక్రెటేరియేట్ బీట్లో తిరుగుతూ అటు తొంగి చూస్తె ఆయన చాంబర్ ఖాళీగా కనిపించేది.  చిన్న చిన్న శాఖలు చూసే మంత్రుల పేషీలు కూడా కూడా వచ్చిపోయే సందర్శకులతో కిటకిటలాడుతుండేవి. రూలు ప్రకారం తప్ప పైరవీలు చెల్లవు అనే పేరు పడడం వల్లనేమో  రాజుగారి ఆఫీసులో  జన సందోహం చాలా తక్కువ. ఆయన ప్రైవేట్ సెక్రెటరీ కమ్  ఓ.యస్.డీ,,  బీ ఎన్ కుమార్ గారు నన్ను  చూడగానే, చిరునవ్వుతో, 'లోపలకు వెళ్ళండి పరవాలేదు' అనేవారు. తలుపులు తీసేవాళ్ళు, చీటీలు పట్టుకుని ఇచ్చేవాళ్ళు లేని వ్యవహారం కనుక,  తలుపు తోసుకుని  లోపలకు వెళ్ళేవాడిని.  విశాలమైన మేజాబల్ల వెనుక కుర్చీలో కూర్చుని, సిగరెట్ తాగుతూ,  ఇంగ్లీష్ పుస్తకం ఏదో ఒకటి చదువుతూ, రాజుగారు దర్శనం ఇచ్చేవారు.  రేడియో విలేకరిని కాబట్టి, సంచలన వార్తల అవసరం ఏమాత్రం లేనివాడ్ని కాబట్టి ఆయన  నన్ను చూడగానే, హాయిగా ఇంగ్లీష్ లో పలకరిస్తూ, కూర్చోబెట్టి రకరకాల విషయాలు చర్చించేవారు. రాజకీయాలను మినహాయిస్తే మిగిలిన విషయాల్లో ఆయన పరిజ్ఞానం  అమోఘం. కాసేపు అవీ ఇవీ మాట్లాడి సెలవు తీసుకుని వచ్చేసేవాడిని. వార్త దొరకలేదన్న చింత లేని మనిషిని కదా!    
నా జర్నలిష్టు మిత్రుడు ఎం.యస్. శంకర్ ఆ రోజుల్లో బీబీసీ తెలుగు వార్తలకు తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసాడు. అతడు రికార్డు చేసి బీబీసీకి పంపాల్సిన స్టూడియో రాజభవన్ రోడ్డులో వుండేది. రాజుగారి ఇంటర్వ్యూ అడిగితె ఆయన ఔనడం, మేము ఆర్చుకుని తీర్చుకుని మినిస్టర్స్ కాలనీలోని (ఇప్పటి సీ ఎం క్యాంప్ కార్యాలయం వున్నచోటుకు కూతవేటు దూరంలో) వున్న ఆయన ఇంటికి శంకర్ స్కూటర్ పై వెళ్ళాము. ఆయన్ని తీసుకుని స్టూడియోకి వెళ్ళాలనేది మా ప్లాను. కానీ, మంత్రిగారు సాయంత్రం ఇంటికి రాగానే డ్రైవర్ ని ఉంచుకోకుండా పంపించేస్తారు అన్న సంగతి మాకు తెలవదు. ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తుండగానే రాజుగారు బయటకు వచ్చి కారు తీసి మమ్మల్ని ఎక్కమని చెప్పి 'ఎక్కడకు వెళ్ళాలి' అని అడిగేసరికి మాకు మతి పోయినంత పనయింది. ఆయనే స్వయంగా డ్రైవ్  చేసుకుంటూ తీసుకువెళ్ళడం, రికార్డింగు పని పూర్తిచేసుకోవడం అన్నీ  సక్రమంగా జరిగిపోయాయి. ఆరోజుల్లో మా ముగ్గురినీ కలిపి వుంచిన బంధం ఒకటి వుంది. అందరం ఒకే బ్రాండ్ సిగరెట్ తాగేవాళ్ళం. తరువాత నేను మానేసాను. శంకర్ మానేసినట్టు చెబుతున్నాడు. రాజు గారిని కలవక దశాబ్దం దాటింది. ఆయన సంగతి తెలవదు. మానేస్తారన్న నమ్మకం నాకయితే లేదు. ఎన్టీ రామారావు గారంతటి వారు కూడా ఈ విషయంలో రాజుగారికి కొంత మినహాయింపు ఇచ్చారని ఆరోజుల్లో చెప్పుకునేవారు.  

ఇదీ భారత్!



అయినా 'మేరా భారత్ మహాన్'


ఇక్కడి రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం జనాలను విడతీయాలని చూస్తారు. టెర్రరిస్టులు మాత్రం తమ ఉగ్రవాద చర్యలతో  ప్రజలను సంఘటితం చేస్తారు.
వన్ వే (ఒకే వైపు వాహనాలు వెళ్ళడానికి అనుమతి వున్నదారి) దాటడానికి జనాలు రెండు వైపులా చూసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్తితి ఈ దేశంలోనే కనిపిస్తుంది.
ఎవర్ని చూసినా ఏదో హడావిడిలో వున్నట్టు కనిపిస్తారు. కానీ చాలా తక్కువమందే ఆఫీసులకు సకాలంలో చేరుకుంటారు.
వచ్చీరాని ఇంగ్లీష్ లో మాట్లాడండి. అంతా గౌరవంగా చూస్తారు. మాతృభాషలో అనర్ఘలంగా మాట్లాడండి. ఎవ్వరూ పట్టించుకోరు.
ఈ దేశంలో ఎక్కువ మంది భగవద్గీత గురించీ, ఖురాన్ గురించీ చాలా తెలివైన వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కానీ వారిలో చాలామంది ఆ రెండింటినీ ఏనాడు చదివిన పాపానపోయుండరు.
ఆడపిల్లల చదువుల మీద కంటే వారి పెళ్ళిళ్ళపై ఎక్కువ ఖర్చు చేసే తలితండ్రులు ఇక్కడే ఎక్కువ కానవస్తారు.
ఆడపిల్ల ఇంటికి దీపం అనే తియ్యటి మాటలు,  గుండెల మీద కుంపటి అనే శాపనార్ధాలు  ఒకే ఇంట్లో వినవచ్చే విచిత్రమైన సంస్కృతి ఇక్కడే కనిపిస్తుంది.
మనం వేసుకునే చెప్పుల్ని ఎయిర్ కండిషన్ షో రూముల్లో కొంటాం. తినే కూరగాయల్ని రోడ్డు పక్కన కొంటాం.
ఆఫీసులో బంట్రోతు ఉద్యోగం చేయడానికి కనీసం ఎనిమిదో తరగతి పాసయి వుండాలి.
దేశాన్ని పాలించే మంత్రులకు మాత్రం ఎలాటి విద్యార్హతలు అవసరం లేదు.
అయినా కానీ, ఇలాటి  అవలక్షణాలు ఎన్నివున్నాకానీ -
మేరా భారత్ మహాన్!


(ఇంగ్లీష్ మెయిల్ కు తెలుగు అనువాదం)
NOTE: Photo Courtesy Image Owner 

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పిలుపుల పరిణామక్రమం



"నాన్నగారండీ!...... నాన్నారూ! ......నాన్నా!..... ఒరేయ్ నాన్నా!..... ఏరా నాన్నా!...... ఏం గురూ ఏంటి సంగతి మీ ఆవిడ అదేరా మా అమ్మ ఎలావుంది ? "

విభజన పూర్తికాలేదా!


ఈ ఏడాది జూన్ రెండో తేదీన మునుపటి ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. ఇది చారిత్రిక సత్యం.

నిన్నటికి నిన్న ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో జరిగిన మిక్సడ్ డబుల్స్ లో భారత జోడీ సానియా మీర్జా, సాకేత్ మైనేని కలిసి మన దేశం ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని చేర్చారు. సానియా మీర్జా తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్. సాకేత్ విశాఖ కుర్రవాడు. వీరిద్దరూ కలిసి సాధించిన విజయం పట్ల యావత్ దేశప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన నాయకులు మాత్రం వారిని ఆంద్ర, తెలంగాణాలకు చెందినవారిగా గుర్తించి విడివిడిగా అభినందనలు తెలియచేస్తున్నారు. నగదు బహుమతులు, వేరే పురస్కారాలు అంటే అర్ధం చేసుకోవచ్చు, ఆంద్ర తెలంగాణా తేడా లేకుండా వారిద్దరూ కలిసి శ్రమించి సాధించిన విజయాన్ని 'ప్రశంసించడం'లో అడ్డొచ్చిన అడ్డుగోడలు ఏమిటో అర్ధం కాదు. నిజంగా అయాం సారీ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్! 

      

29, సెప్టెంబర్ 2014, సోమవారం

కాపీ జోకులు



'రాత్రి రైల్లో నిద్ర పట్టక చాలా అవస్థ  పడ్డాను' ఏకాంబరం చెప్పాడు.
'ఎందుకని'
'ఖర్మ! పై బర్త్ దొరికింది'
'కింద పడుకున్నవాళ్ళని అడక్కపోయావా?'
'ఆ మాత్రం నాకు తెలియదని అనుకున్నావా! అడగడానికి కింద బర్తుల్లో ఎవరయినా వుంటే కదా! రైలంతా ఖాళీ!'

'ఏకాంబరం! నీ భార్య చనిపోయింది'
ఆ కబురు విన్న అతడికి  మతి పోయింది. భార్య లేని జీవితం వృధా అనిపించింది. వెంటనే తనుంటున్న భవనం వందో అంతస్తుకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు.
యాభయ్యో అంతస్తు దగ్గరికి రాగానే అతడికి తనకు పెళ్ళే కాలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది.
పాతిక అంతస్తు దగ్గర మరో దారుణమైన విషయం గుర్తుకు వచ్చింది. తాను ఏకాంబరం కాదని, తనపేరు లంబోదరం అని. ఏం లాభం. అప్పటికే ఆలస్యం అయిపోయింది.  

హోటల్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు ఏకాంబరం తలలో మెరుపు మెరిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ లంబోదరం దగ్గరికి వెళ్ళాడు. అతడికి ఆరోజు గాలిలో తేలిపోతున్నట్టు వుంది. తన స్నేహితులెవరు  జవాబు చెప్పలేని ఓ చిక్కు ప్రశ్నకు సమాధానం తనకే ముందు తట్టింది.
'గుడ్డు ముందా చికెన్  ముందా అని అడుగుతుండేవాడివి కదా. ఇప్పుడు చెబుతాను చూడు. హోటల్ కు వెళ్లి ముందు ఏది ఆర్డర్ చేస్తే అది ముందు వస్తుంది'   

ఏకాంబరం భార్యను తీసుకుని హోటల్ కు వెళ్ళాడు. భార్య కాఫీ ఆర్డర్ చేసింది. తను కోల్డ్ కాఫీ తెప్పించుకున్నాడు. 'కాఫీ చల్లారి పోతుంది త్వరగా తాగమ'ని భార్యను తొందర చేసాడు. ఎందుకంటె ఆ హోటల్లో హాట్ కాఫీ అయిదు రూపాయలు. కోల్డ్ కాఫీ పది రూపాయలు. 


ఏకాంబరం ఆర్ట్ గ్యాలరీ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఓ బొమ్మ అతడికి యెంత మాత్రం నచ్చలేదు. 'ఇలాటి దరిద్రపు బొమ్మ పెట్టి,  పైగా మోడరన్ ఆర్ట్ అంటూ పబ్లిసిటీ ఒకటీ...'
అంటూ చిందులు తొక్కాడు.
'అయ్యా అది బొమ్మకాదు. ముందు, ఆ అద్దం ఎదట నుంచి బయటకు రండి' ఎవరో అన్నారు.


(స్వేచ్చానువాదం ఒక్కటే సొంతం) 

NOTE:COURTESY IMAGE OWNER