17, సెప్టెంబర్ 2014, బుధవారం

ఉప ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం?


(Published by  SURYA daily in its edit page on 18-09-2014)
సాధారణంగా సార్వత్రిక ఎన్నికల దరిమిలా వెంటనే వచ్చే ఉపఎన్నికల ఫలితాలు ఆయా పాలకపక్షాల తల  రాతను మార్చలేవు. ప్రతికూల  ఫలితాలు వచ్చినా,  వాటి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశం అసలే వుండదు. అంచేత ఉపఎన్నికల ఫలితాలపై చర్చకు ప్రాధాన్యత తక్కువ. సంకీర్ణయుగంలో వీటికి కొంత ప్రాముఖ్యత వుండే వీలుంది  కాని ప్రస్తుత తరుణంలో దానికీ అవకాశం లేదు. ఎందుకంటే,  గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమికీ, ఆంద్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి, తెలంగాణలో కేసీయార్ ఆధ్వర్యంలోని టీ.ఆర్.యస్. కు ప్రజలు ఎవరి మీదా ఆధారపడి మనుగడ కొనసాగించే అగత్యంలేని  మెజారిటీతో ఆయా పార్టీలకి అధికార పగ్గాలను అప్పగించారు. అందువల్ల ఉపఎన్నికల ఫలితాలు తారుమారయినా కూడా వాటికి అద్యతన భావిలో ఎదురయ్యే ముప్పు ఏమీ వుండదు. అయినా కానీ, ఫలితాల్లో ప్రతికూలతను తేలిగ్గా తీసుకుంటే ముందు ముందు మరిన్ని ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలను తోసిపుచ్చలేము. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే నానుడి ప్రకారం,  'గెలిచి తీరుతాం' అనే నమ్మకం వున్న పాలక పక్షాలు, 'గెలవడం అంత తేలిక కాదు' అనే అనుమానం వున్న ప్రతిపక్ష పార్టీలు కూడా  ఉప  ఎన్నికలను  సయితం ఒక సవాలుగా తీసుకుని ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెడతాయి. తమకున్న శక్తియుక్తులనన్నింటినీ పణంగా పెట్టి పోరాడతాయి. గెలిచిన పక్షంలో  తమ పాలనకు మెచ్చి ప్రజలిచ్చిన కానుకగా అభివర్ణించుకుంటూ పాలక పక్షం జబ్బలు చరుచుకుంటుంది. అదే ప్రతిపక్షానికి ఆ అవకాశం దక్కితే, పాలకపక్షం పట్ల ప్రజల్లో వేగంగా పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం ఒక సంకేతం అంటూ  బొబ్బలు పెడుతుంది. ఇది ఎన్నాళ్ళనుంచో సాగుతూ వస్తున్న జనమెరిగిన రాజకీయమే.
ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకుని ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన 54 అసెంబ్లీ, మూడు  లోక సభ స్థానాల్లో ఉపఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటే తేటతెల్లం అయ్యేది ఒక్కటే. అదేమిటంటే రాజకీయపార్టీల పట్ల ప్రజల ఆదరణ ఎప్పుడూ  ఒకే తీరున ఉండదనీ, ఆ ఆదరణలో హెచ్చుతగ్గులు అతిసహజమనీ.



నాలుగునెలలక్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశం నాలుగుచెరగులా మారుమోగి, ప్రజలను అనూహ్యంగా ఆకట్టుకున్న 'నమో' మంత్రం ఈ ఉపఎన్నికల్లో పనిచేయలేదు. అప్పుడు ప్రభంజనం మాదిరిగా ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లోక సభ సీట్లను కొల్లగొట్టిన బీజేపీ, తాజాగా ఆ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చతికిలపడిపోయింది.  యూపీలో గత అసెంబ్లీ  ఎన్నికల్లో గెలుచుకున్న పది సీట్లలో బీజేపీ ఏకంగా ఏడింటిలో వోటమి చవిచూసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రాష్ట్రంలో ఆ పార్టీ ఎనభయ్ లోకసభ స్థానాల్లో అక్షరాలా డెబ్బయ్ ఒకటి  గెలుచుకుని 'మోడీ హవా' అంటే ఏమిటో యావత్ దేశానికి రుజువుచేసి నెలలు తిరక్క ముందే ఈ మాదిరి పరాజయం మూటగట్టుకోవడం అన్నది నిజంగా బీజీపీ నాయకులకు మింగుడు పడని ఫలితమే. అలాగే మరో దారుణమైన వోటమి రాజస్థాన్ లో ఎదురయింది. ఆ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం పాతిక లోకసభ స్థానాల్లో ఏ ఒక్కటీ బీరుపోకుండా అన్నింటినీ తన ఖాతాలో వేసుకుని విజయకేతనం ఎగరేసిన బీజేపీకి ఈసారి అక్కడ జరిగిన నాలుగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఒక్కటంటే ఒకే స్థానం దక్కింది. కిందటి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయిన కాంగ్రెస్ పార్టీకి మిగిలిన మూడు దక్కాయి.   ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో కేంద్రంలో పనిచేస్తున్న ఎండీయే సర్కారు పట్ల వోటర్ల వైఖరి ఈ కొద్దికాలంలోనే ఇంతగా మారిపోవడానికి ఆయన చేసిన ఘోర తప్పిదాలు ఏమీ లేవు. ఎన్నికలకు ముందు మోడీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఏవీ లేవు, ఈ స్వల్పకాలంలో అవేవీ అమలుచేయలేదని కినుక వహించడానికి. అయినా ఇలా ఎందుకు జరిగింది? ఇప్పుడు అందరి మనస్సుల్లో మెదులుతున్న ప్రశ్నే! దానికి మోడీయే స్వయంగా వివరణ ఇచ్చారు. మొదట్లో చెప్పుకున్న విధంగానే ఆ వివరణ సాగింది. కొత్త పద్ధతిలో తాను పరిపాలన  సాగిస్తున్నాననీ, ఉపఎన్నికల ఫలితాల నేపధ్యంలో తనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు తన పని తీరు అర్ధం కావడానికి కొంత  సమయం పడుతుందనీ  ఆయన అన్నారు. ప్రతిపక్షాలు సరే! వాళ్ళు ఎట్లాగో విమర్శలు చేయక మానరు. ఈ ఫలితాలవల్ల ఇప్పటికిప్పుడు మోడీ సర్కారుకు వచ్చే ముప్పు  ఏవీలేని మాట కూడా నిజమే.  కానీ ప్రజలనుంచి  సయితం  ఇలాటి ప్రశ్నలు మొదలుకాకుండా చూసుకోవాలి. మోడీ విశ్వసిస్తున్నట్టు ప్రజలు మార్పు కోరుకుంటారు. అలా కోరుకునేవారు గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి పట్టం కట్టారు. మళ్ళీ వాళ్ళు మరోసారి మార్పుకోరుకోకుండా చూసుకోవడానికి ఈ ఉపఎన్నికల ఫలితాలను    ఒక హెచ్చరికగా పరిగణించాలి. లేని పక్షంలో ప్రజల ఆదరణ, ఆగ్రహంగా మారడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఈ సూత్రం ఒక్క మోడీకే కాదు ప్రజలు కోరుకుని ప్రభుత్వ పగ్గాలు అప్పగించిన అన్ని రాజకీయ పార్టీలకీ వర్తిస్తుంది. (17-09-2014)                         

15, సెప్టెంబర్ 2014, సోమవారం

పరాశర గోత్రోద్భవభవస్య




ఖ్యాతి, భృగువు భార్య. ఆమె యందు భృగువు ఇద్దరు పుత్రులనుకన్నాడు. వారు పేర్లు ధాత, విధాత. వారి పుత్రులు ప్రాణుడు, మృకండుడు.
ఈ ఇద్దరికీ జన్మించిన  పుత్రసంతానం ఇలా వుంది....ప్రాణుని కొడుకు ద్యుతిమంతుడు. అతడి కుమారుడు  అజావంతుడు, అజావంతుని పుత్రుడు వంశుడు. పొతే,  మృకండుముని పుత్రుడు మార్కండేయుడు. ఈ మహామునికి జన్మించినవాడు వేదశిరుడు. ఇక్కడికి ఇలా ఉండనీ!
నవబ్రహ్మల్లో ఇంకొకడు మరీచి మహర్షి. ఈ మహర్షికి సంభూతి భార్య. వీరి సంతానం పౌర్ణమాసుడు. ఇతడికే విరజుడు పర్వతుడు అని ఇద్దరు పుత్రులు.
ఇట్లాగే మరొక బ్రహ్మ అంగీరసుడున్నాడు. ఈతని భార్య స్మృతి. సినీవాలి, కుహువు, అనుమతి అనే కన్య వీరి సంతానం.
అత్రి మహర్షి అనే బ్రహ్మకు అనసూయ సతి. మహాసాధ్వి ఈమె. వీరికి సోముడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు జన్మించారు. స్వాయంభువ మన్వంతరంలో ఇతడే అగస్త్యమహర్షి.
పులహునికి క్షమ యందు కర్దముడు, చార్వరీవంతుడు, సహిష్ణువు అని ముగ్గురు పుత్రులు జన్మించారు.
క్రతువునకు సంనతి అనే భార్య వల్ల బొటనవ్రేలి కణుపు ఎంత పరిమాణంలో ఉంటుందో, అంత ప్రమాణంలో వాలభిల్యుడు మొదలైన 60 వేల మంది పుత్రులు కలిగారు.
వసిష్ఠునికి ఊర్జవల్ల ఊర్థ్వబాహుడు, రజుడు, అనఘుడు, గోత్రుడు, సవనుడు, సుతపుడు, శుక్రుడు జన్మించారు. వీరు ఉత్తమ మనువుకాలంలో సప్తర్షులు.
బ్రహ్మ పెద్దకొడుకు వహ్నికి, స్వాహావల్ల గొప్ప ఓజస్సంపన్నులైన ముగ్గురు పుత్రులు కలిగారు. వీరే శుచి, పావకుడు, పవమానుడు. వీరికి తిరిగి జన్మించిన సంతానం 45 మందికి, ఈ వహ్ని మొదలగు అగ్నులు కలిసి మొత్తం 49 మంది అగ్నులుగా సుప్రసిద్ధులు.
బ్రహ్మవల్ల సృజింపబడిన అగ్నిష్వాత్‌, బార్హిషద్‌, అనగ్న, సాగ్నాది సంతతి తెలిసింది కదా! స్వధాదేవికి పితృదేవుని వల్ల పితృగణాలు, మేన - వైతరణి అనే యిద్దరు బ్రహ్మవాదినులైన కన్యలు కలిగారు. సర్వశుభలక్షణలు, గొప్పజ్ఞానవంతురాళ్లు. దక్షకన్యల గురించిన సంగతులన్నీ విన్నావు కదా! ఈ వైనం శ్రద్ధగా స్మరించిన వారికి సంతానహీనత కలుగదు" అని చెప్పాడు "పరాశరుడు"

(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు)


ఇదంతా అందరికీ అర్ధం అయ్యే రీతిలో చెప్పింది ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఇలా చెప్పగలిగిన ఒకే ఒక్కరు అందరికీ తెలిసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే మా గోత్రం "పరాశర" - అదీ విషయం - ఇంకో విషయం ఇది మోచర్ల  కృష్ణమోహన్ గారి  సౌజన్యం - భండారు శ్రీనివాసరావు

13, సెప్టెంబర్ 2014, శనివారం

నారావారి నూర్రోజుల పాలన

PUBLISHED IN 'SURYA'  TELUGU DAILY IN ITS EDIT PAGE ON 14-09-2014
(నూతన రాష్ట్రం 'ఆంద్ర ప్రదేశ్' ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల పదిహేనవ తేదీన వంద రోజుల పాలన పూర్తిచేసుకుంటున్న సందర్భంగా) 


గతంలో తొమ్మిదేళ్ళు పై చిలుకు అఖండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నిజానికి ఈ వంద రోజుల పాలన ఓ లెక్కలోనిది కాదు. కానీ ఈసారి లెక్క మారింది. ఆయన ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేనాటికి రాష్ట్రం రెండు ముక్కలయింది. ఇరవై మూడు జిల్లాలు కలిగిన  సువిశాల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పదమూడు జిల్లాలకు కుంచించుకు పోయింది. ఆయన ఒకనాడు కంటిచూపుతో శాసించిన సచివాలయం పరిస్తితీ అదే. వరసగా అనేక సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా సికింద్రాబాదు పెరేడ్ మైదానంలో  జాతీయ పతాకం ఎగరేసిన పంద్రాగష్టు పండుగను ఈసారి కర్నూలు వెళ్లి జరుపుకోవాల్సివచ్చింది. ఒక ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్రం రాజధానిలో ఉంటూ, పొరుగునే వున్న మరో రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వుండడం అనే విచిత్ర పరిస్తితి కనీవినీ ఎరుగనిది. పాలకులు ఒకచోట, పాలితులు మరోచోట అనేది స్వతంత్ర భారత చరిత్రలో ఓ కొత్త ముచ్చట.
ఇలాటి వింత పరిరిస్తితి వల్ల పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి, సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు చెబుతూవస్తూనే వున్నారు.  ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిపి, ఆ తరువాత విడతీయడం వల్ల అనునిత్యం  బయట పడుతున్న కొత్త చిక్కులు ఆయన్ని సతతం చీకాకు పరుస్తున్న మాట కూడా కాదనలేనిది. పైపెచ్చు ఇవన్నీ కొత్తగా ఏర్పడ్డ రెండు రాష్ట్రాల నడుమ సరికొత్త వివాదాలకు కారణం కావడం కూడా మరో కొత్త పరిణామం. పొరుగున వున్న తెలంగాణా ముఖ్యమంత్రి, ఆయన సహచరులు సహకార హస్తాన్ని అందించడం లేదన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో ప్రబలుతోంది. పైగా తమని  చుట్టుముడుతున్న అన్ని చిక్కులకు వారే కారణమన్న భావం కూడా టీడీపీ నాయకుల్లో బలపడుతోంది. దానాదీనా ఉభయుల మధ్య ఒకరకమైన 'అసహన వాతావరణం' నెలకొని, ఇచ్చిపుచ్చుకోళ్ళవంటి సర్దుబాటు ధోరణి కనుమరుగవుతోంది. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు, కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, పాత కొత్త రాష్ట్రాల నడుమ  ఈ విధమైన ఘర్షణ వాతావరణం నెలకొన్న దాఖలా లేదు.  ఏదో ఒక అంశంపై వాదప్రతివాదాలు చోటుచేకుంటూ వుండడం, అవి ప్రసారమాధ్యమాల్లో చర్చోపచర్చలకు దారితీస్తూవుండడం నిత్యకృత్యమైపోతోంది. సహజంగానే ఇవన్నీ సరి కొత్త రాష్ట్రంలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబుకు కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. అధికారం చేతికిచిక్కి నెలలు గడిచిపోతున్నా సొంత రాజధాని, సొంత సచివాలయం, సొంత పాలనా వ్యవస్థ లేకపోవడం అనేది పరిపాలనపై ప్రభావం చూపుతుంది. సమర్ధుడైన పాలకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, మూడో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత గతంలో మాదిరిగా చురుకుగా వ్యవహరించలేకపోతున్నారని, కేవలం పర్యటనలతో, ప్రకటనలతో పొద్దుపుచ్చుతున్నారని ప్రత్యర్ధులు విమర్శించడానికి ఈ నేపధ్యం కొంత కారణం. అయితే, ఇటువంటి విపత్కర పరిస్తితులను నిభాయించుకుని రావడంలో ఆయన అనుభవమే ఆయనకు చక్కగా అక్కరకువస్తోందన్న అభిప్రాయం కూడా వుంది. 'ఏవీ లేకుండా ఆయన మాత్రం ఏం చేస్తాడు' అనే సానుభూతి మాటలు  టీడీపీ కార్యకర్తలనుంచే కాకుండా సామాన్య ప్రజలనుంచి కూడా వినబడుతున్నాయి. రైతుల రుణ మాఫీ హామీ అమలులో జరుగుతున్న  తాత్సారం, లేదా ఆ హామీల విషయంలో వెలువడుతున్న కప్పదాటు ప్రకటనల దరిమిలా కూడా ప్రజలనుంచి నిరసన వ్యక్తం కాకపోగా సానుభూతి పవనాలు వీస్తున్నాయని  టీడీపీ నాయకులు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.  కాకపొతే ఇదంతా మీడియా మీద ఆయనకు వున్న పట్టువల్ల జరుగుతున్న ప్రచారమే కాని,  ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ప్రత్యర్ధులు కొట్టిపారవేయడం జరుగుతోంది. కాని ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధాన ప్రతిపక్షం, వై.ఎస్.ఆర్.సీ.పీ.  తొందరపడి చేపట్టిన ఆందోళన కార్యక్రమం పట్ల ప్రజలనుంచి ఆశించిన స్పందన రానిమాట మాత్రం వాస్తవం. ఇదే విషయంపై మరోసారి, కాకపొతే ఈసారి కొన్నాళ్ళు వేచి చూసిన తరువాత తమ పార్టీ ఆందోళనకు దిగుతుందని అ పార్టీ హెచ్చరికలు చేస్తోంది. రుణ మాఫీ విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం అని ఇన్నాళ్ళుగా చెబుతూ వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి ఆ హామీ అమలు అనుకున్నంత సులభం కాదని నెమ్మది నెమ్మదిగా అర్ధం అవుతోంది. కానీ, తనకున్న అపార పరిపాలనానుభవాన్ని, కేంద్ర ప్రభుత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని తుదికంటా వాడుకుని అయినా సరే రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అడుగులువేస్తున్నట్టు కనబడుతోంది. అసలు ఇటువంటి వాగ్దానాలు చేయడమే రాజకీయం అయినప్పుడు వాటి అమలు తీరు విషయం కూడా రాజకీయం కావడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలు చేసేటప్పుడు కొంత సంయమనం పాటించాల్సిన అవసరాన్ని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడులకు ఈ విషయంలో  ఎదురయిన  అనుభవం తేటతెల్లం చేస్తోంది.
పొతే,  రాజకీయంగా కుదురుకుని, మరో రెండు తడవలు రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా చంద్రబాబు వేస్తున్న అడుగులు ఆయన పరిపక్వతని చాటుతున్నాయి. పార్టీని పటిష్టపరచుకునే క్రమంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆకర్ష్ పధకాన్ని ఆయన కట్టుదిట్టంగా అమలుచేస్తున్నాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ దిగ్గనాధీరులను టీడీపీలోకి తీసుకోవడం ఎంతగానో లాభించిన విషయం ఆయన మరచిపోలేదు. అందుకే, ఎవరిమీద ఆధారపడకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునే సువర్ణావకాశాన్ని ప్రజలు ఎన్నికల్లో కట్టబెట్టిన తరువాత కూడా ఆయన చేతులు  ముడుచుకుని కూర్చోలేదు. ఇలాటి విషయాల్లో  నైతికత అంటూ మడికట్టుకుని  కూర్చోలేదు. జిల్లాపరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు తన రాజకీయ విశ్వరూపాన్ని పూర్తిగా ప్రదర్శించారు. టీడీపీ చేతిలో ప్రభుత్వ పగ్గాలను  2029 వరకు ఉంచుకోవడం లక్ష్యంగా ఆయన చేసిన ప్రకటన ఇందుకు అద్దం పడుతోంది. సరే ఒక రాజకీయ పార్టీ అధినాయకుడిగా ఇలాటి సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకోవడం తప్పేమీ లేదు. ఎన్నికల ప్రచార సమయంలో జగన్ మోహన్ రెడ్డి సయితం కొన్ని దశాబ్దాలపాటు తాము ఏర్పరచబోయే ప్రభుత్వానికి ధోకా ఉండదని పలుమార్లు ఉద్ఘాటించిన విషయం తెలిసిందే. భవిష్యత్తు గురించి పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించడానికి ఈ రకమైన ప్రకటనల అవసరం వారికి వుంటుంది. దాన్ని అలావుంచి, వర్తమానంలో ప్రజలకు ఏమిచేస్తున్నాము అనేది కూడా ప్రధానమైనదే. గతం నుంచి నేరుగా భవిష్యత్తులోకి అడుగువేయాలని   ఆలోచిస్తూ వర్తమానాన్ని మరచిపోవడం విజ్ఞుల లక్షణం అనిపించుకోదు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముందు సవాలక్ష సమస్యలు వున్నాయి. అన్నింటికంటే ముందు రాజధాని నిర్మాణం లేదా ఏర్పాటు. అత్యంత క్లిష్టం అనుకున్న ఈ నిర్ణయం విషయంలో చంద్రబాబు చురుకుగా, వ్యూహాత్మకంగా పావులు కదిపి సమస్యను చాలా సులువుగా తేల్చేసారు. ఇలాటి అతిముఖ్యమైన నిర్ణయంలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయడం ద్వారా,  ప్రజాస్వామ్య స్పూర్తితో వ్యవహరించిందన్న మంచి పేరు ప్రభుత్వానికి  వస్తుందన్న సూచనలను కూడా ఆయన ఖాతరు చేయలేదు. విజయవాడ పరిసర ప్రాంతాలలో కొత్త రాజధాని ప్రతిపాదనకు  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయించుకుని కొన్ని నెలలుగా ఈ అంశంపై నెలకొనివున్న అసందిగ్ధతకు, ముసురుకుంటున్న ఊహాగానాలకు ఒక్కమారుగా తెర దించారు.  బహుశా వంద రోజుల పాలనలో చంద్రబాబు సాధించిన ఘన విజయం ఇదేనేమో!  ఇంకా అనేకం చేసినా, చెప్పినా, ప్రకటించినా, ప్రచారం చేసినా   అవన్నీ చాలావరకు కాగితాలకే పరిమితం. కార్యాచరణకు దూరంగానే వున్నాయి.
అన్ని అవరోధాలను అధిగమించి, ఆయన కలగంటున్న'నవ్యాంధ్ర ప్రదేశ్' (గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 'స్వర్ణాంధ్రప్రదేశ్' తన స్వప్నం అని చెప్పేవారు) కల సాకారం చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆయన వద్ద వున్న 'వనరు'  ఒకే ఒక్కటి. అదే అనుభవం. ఆ వొక్కదానితో మిగిలిన యావత్తు వ్యవహారాలను సంభాలించుకోవడం అన్నది చంద్రబాబు వ్యవహార దక్షత పైనే ఆధారపడివుంటుంది. ఘటనాఘటన సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు, ఆ పేరు నిలబెట్టుకోవడానికి దొరికిన అపూర్వ సువర్ణావకాశం 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం' (13-09-2014)
NOTE: Courtesy Image Owner 

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

నువ్వే కరెక్టు


సింగినాదం రామనాధంతో అన్నాడు.
"నా భార్యతో పడలేకుండా వున్నానురా. ఇంటికి పోవాలంటే భయంగా వుంది. విషం మింగి చావాలని అనిపిస్తోంది"
"అలా నిరాశ పడకు సింగినాదం. మేమంతా లేమా! రేపు మీ ఆవిడతో మాట్లాడి సర్దిచెబుతాను. ఈ లోగా నువ్వు మాత్రం ఎలాటి అఘాయిత్యం చేయబోకు"
అన్నట్టే రామనాధం సింగినాదం భార్యతో మాట్లాడాడు.
"మీ ఆవిడతో మూడు గంటలు మాట్లాడాను సింగినాదం.  నాకు అర్ధం అయింది ఏమిటంటే, నువ్వే కరెక్టు. విషం తాగడమే సరైన నిర్ణయం అనిపిస్తోంది"

9/11



ఈ రెండంకెలు అమెరికన్ ప్రజల మనస్సులో ఎంత బలంగా నాటుకు పోయాయంటే పదమూడేళ్ళు  గడిచిన తరువాత కూడా సెప్టెంబర్ 11 వ తేదీన జరిగిన ఘోర సంఘటనను వారెవ్వరూ మరచిపోలేకుండా వున్నారు. న్యూ యార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాదుల వైమానిక దాడికి గురయి పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు కదలాడుతూనే వుండి వుండాలి.



ఈ దాడి జరిగి నిన్నటికి పదమూడేళ్ళు గడిచాయి. ఇందులో ప్రాణాలు కోల్పోయిన దాదాపు మూడువేలమంది తాలూకు కుటుంబ సభ్యులు ఆ దుఖం నుంచి, ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనబడదు. అలాగే, అమెరికన్ అగ్రరాజ్య అభిజాత్య అహంకార పూరిత చర్యల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ఇన్నేళ్ళుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. వారి కుటుంబాల పరిస్తితి ఇదే. ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరికోసం అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో ఇదొకటి.

తన అధికారానికీ, తన పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి తననే కబళించడానికి వచ్చిన తరువాత కానీ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రతీకారేచ్చలతో అట్టుడికి పోతున్న రెండు వైరి వర్గాల మధ్య పోరు నిరంతరంగా కొనసాగుతోంది. సిరియా కేంద్రంగా పనిచేస్తున్న 'ఇసిస్' ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెకలించి వేస్తాం అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలు దీనికి అద్దం పడుతున్నాయి. 'అమెరికాకు హాని తలపెట్టేవాడి ప్రపంచంలో ఎక్కడా సురక్షిత ప్రాంతం వుండదు. ఇదే నా పాలన మూలసూత్రం' అని హెచ్చరిక చేయడం ఈ విషయంలో ఆయన యెంత పట్టుదలతో ఉన్నారో అన్న సంగతి తెలియచేస్తుంది. సెప్టెంబర్ పదకొండో తేదీనే ఒబామా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాకు చెందినా ఇద్దరు జర్నలిష్టులను ఇస్లాం ఉగ్రవాదులు తలనరికి దారుణంగా చంపివేసిన సంఘటన నేపధ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అయితే ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే ప్రయత్నంలో అమెరికా, అమెరికాను ఉగ్రవాద చర్యలతోనే నిలువరించే దిశగా 'ఇసిస్' , వీటిమధ్య జరిగే పోరులో ఇతర ప్రపంచదేశాలకు నిష్కారణంగా జరుగుతున్న కీడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ వున్నట్టు లేదు.

సెప్టెంబర్ 11 దాడి గురించి మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.

2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని దానితోనే  డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.

అత్తా పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, బహుశా 1968 సెప్టెంబర్ లోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు. 

అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.

కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.

అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.

1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలుఅంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు.

చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.

2001 లో దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఇన్నేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.

హైదరాబాదులో, ముంబైలో,  ఢిల్లీలో జరిగిన పేలుళ్లు జనంలో పెచ్చరిల్లుతున్న అభద్రతా భావానికి పునాది రాళ్ళుగా మారుతున్నాయి.

ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు.

11, సెప్టెంబర్ 2014, గురువారం

345678


మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది
మూడులక్షల, నలభయ్ ఐదువేల, ఆరువందల డెబ్బయ్ ఎనిమిది.
నేటికి నా బ్లాగు వీక్షకుల సంఖ్య. అంకెలు వరుసగా అమరాయని రాసాను. అంతే!

10, సెప్టెంబర్ 2014, బుధవారం

సిగరెట్లు మానడం యెలా?



‘ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశాను’ అనే జోకులు వింటూనే వుంటాము.
చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి.
సిగరెట్లను సిగరెట్టు మాదిరిగా తాగే మా స్నేహితులు నా గురించి చెప్పుకునేమాట వేరు. ‘శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడు’ అన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడు’ అనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను, మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. భాష ఎంతమాత్రం  తెలియని  ఆడామగా రష్యన్   సహోద్యోగులతో కాసేపు ‘మాటామంతీ’ లేని కాలక్షేపం చేయడానికి  ఈ సిగరెట్లు చక్కగా  అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు   సిగరెట్ ప్యాకెట్ల నుంచి  ఏకంగా  కార్టన్ల స్థాయికి పెరిగాయి. 2004లో అమెరికా వెళ్ళినప్పుడు  ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా సిగరెట్ల ప్యాకెట్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!


(అలనాటి మా మాస్కో అపార్ట్ మెంట్లో) 

“మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు? ‘ఏవి తండ్రీ నాడు విరిసిన  రింగు రింగుల  పొగల మేఘాలు” అని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు.
దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో  ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా కడుపులో పడకుండానే జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా  చేరుకున్నాను. మిగిలిన జాతీయ చానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి.  మామూలుగా అయితే బాబుగారి ఇంట్లో  విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి  ఆ రెండు పార్టీల నాయకుల నడుమ  ఎడతెగని చర్చలు లోలోపల సాగుతున్నాయి. బయట ఫుట్ పాత్ మీద నిలబడి కొందరం,  కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం. ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళ కలకలు. అలా నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి  స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు.
కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని  ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం  విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాబోలు  కాకర్ల వారు కూడా స్వయంగా వచ్చి చూసారు. రిపోర్టులన్నీ తిరగేశారు.  కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి, ‘నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమ’ని సలహా ఇచ్చారు.  కళ్ళు తెరిచి  ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను హఠాత్తుగా   ముందుకు వొంగి,  ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారు’ అని ఒక బహిరంగ ప్రకటన చేసాను. ఆయన విలాసంగా మందహాసం చేసి,  నెత్తి మీది వెంట్రుకలు చేత్తో పట్టి చూపిస్తూ, ‘ఇలాటి వాళ్ళను నా సర్వీసులో  ఇంతమందిని చూసాను’ అంటూ,  ‘అదంత తేలిక కాద’ని ఆయనే చెబుతూ,  నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి,  ‘రాత్రి అందరూ  నిద్ర పోయిన తరువాత నీ మొగుడు  నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మా’ అని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా నేనూ పట్టుదల కలిగిన  మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి  సిగరెట్ తాగాలని కూడా అనిపించలేదు.