11, ఆగస్టు 2014, సోమవారం

రేడియోతో ఎన్టీయార్ తకరారు

రేడియోతో ఎన్టీయార్ తకరారు
టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల దరిమిలా రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ పాలన మొదలయింది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వుండడంతో రాజకీయ క్రీనీడలు అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియో, దూరదర్శన్ ల మీద కూడా పడ్డాయి. ఆ రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని అనావృష్టి ప్రాంతాల్లో పర్యటించివచ్చిన ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు, ప్రెస్ మీట్  పెట్టి రేడియో, దూరదర్శన్ లకు కూడా కబురు పంపారు. కరవు ప్రాంతాలలో ప్రభుత్వం తీసుకునే చర్యలు గురించి ముఖ్యమంత్రి సందేశం రూపంలో రికార్డ్ చేసి ప్రసారం చేయాలని కోరారు.
ఆబిడ్స్ లోని ముఖ్యమంత్రి నివాసాన్ని చేరుకున్న మా సిబ్బంది రికార్డింగ్ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటికి ఎన్టీయార్ కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగివచ్చారు. పీ ఆర్ వొ తయారు చేసిన సందేశం ప్రతిని ఆమూలాగ్రం ఓ మారు తిరగేసి, తాము సిద్ధం అన్నట్టు తలపంకించారు. రికార్డింగు మొదలయింది.


"ప్రియమైన రాష్ట్ర ప్రజలారా!..." అని ప్రసంగం ప్రారంభించారు. అదే స్పీడులో కొనసాగుతుందని అంతా అనుకున్నాం. కానీ ఆయన హఠాత్తుగా ఆపి, 'కట్ వన్ - టేక్ టు' అన్నారు. మా వాళ్ళు రికార్డింగు ఆపేశారు. వందల సినిమాల్లో అనర్ఘళంగా డైలాగులు చెప్పిన అనుభవం ఆయనది. ఏ పదాన్ని ఎక్కడ వొత్తి పలకాలో, ఏ వాక్యాన్ని ఎక్కడ విరిచి చెప్పాలో ఆయనకు కొట్టిన పిండి. కానీ, ఇక్కడే ఎదురయింది మాకు వూహించని,  ఆ మాటకు వస్తే అంతవరకూ అనుభవంలో లేని ఇబ్బంది. ఈ  కట్లు, టేకుల విషయం తెలియకుండా రికార్దింగుకు రావడం వల్ల, తెచ్చిన టేపులు సరిపోలేదు. ఆఘమేఘాల మీద పంపించి స్టూడియో నుంచి అదనపు టేపులు తెప్పించి రికార్డింగు ముగించామనిపించారు. అసలు కధ స్టూడియోకు చేరిన తర్వాత మొదలయింది. ఏ టేపు విన్నా కట్లూ, టేకులూ అన్న రామారావుగారి స్వరమే. ఆరాత్రే ప్రసారం కావాల్సి వుండడంతో సిబ్బంది అంతా టెన్షన్ కు గురయ్యారు. సీ ఎం గారి మొదటి ప్రసంగం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమీషనర్ (పూర్వాశ్రమంలో తపాలా శాఖ డైరెక్టర్) సైదులు గారు సయితం అంతసేపూ మాతోపాటే రేడియో డబ్బింగు గదిలోనే వుండిపోయారు. కట్లూ టేకుల మధ్య వున్న ముఖ్యమంత్రిగారి సందేశాన్ని మా వాళ్లు కష్టపడి మాస్టర్ టేపు మీదకు ఎక్కించి  డబ్బింగు పని పూర్తి చేసి ప్రసారం నిమిత్తం అనౌన్సర్ కి అప్పగించి వూపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే,  డబ్బింగు పూర్తయిన తరువాత చూసుకుంటే మాకెంత నిడివి అవసరమో ఖచ్చితంగా ముఖ్యమంత్రి సందేశం అంతే వ్యవధికి అతికినట్టు సరిపోయింది. దటీజ్ ఎన్టీయార్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాడపాటి సత్యవతి


‘శ్రీనివాసరావు గారు ఎలావున్నారు బాగున్నారా!’
పాతికేళ్ళ సుదీర్ఘ పరిచయ కాలంలో ఆవిడ  నోటి నుంచి  నేను విన్న అతి  పెద్ద వాక్యం ఇదే.
మాడపాటి సత్యవతి గారు ఎంతో  క్లుప్తంగా మాట్లాడుతారు. మాటలు తూచినట్టే వచ్చేవి ఆవిడ గారి నోటినుంచి. అంతటి మితభాషి. మరి  పది నిమిషాలు విడవకుండా ఏకబిగిన వార్తలు యెలా చదివేవారో అనిపించేది. కానీ ఆవిడ  స్వరం భగవంతుడు కేవలం రేడియో కోసమే తయారుచేసాడేమో అనిపిస్తుంది.  ఒక రకమైన మార్ధవంతో, సంగీతం వినిపిస్తున్నట్టుగా మాడపాటి సత్యవతిగారు వార్తలు చదువుతుంటే మరీ మరీ వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు బోలెడుమంది. ఒకరు అనువాదం చేసిన వార్తలు చదవడం కన్నా తాను సొంతంగా అనువదించి చదవడానికి ఆవిడ ఇష్టపడేవారు. నిజానికి ఆవిడ న్యూస్ రీడర్ కాదు. న్యూస్ ఎడిటర్. కానీ వారంలో కొన్ని రోజులు విధిగా వార్తలు చదివేవారు. వీటికి తోడు వారానికి ఒకమారో రెండు సార్లో వీలునుబట్టి ‘వార్తావాహిని’ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పించేవారు.
వార్తావిభాగం పనితీరు గురించి ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి. హిందీలో చెప్పాలంటే (నిజానికి నాకూ ఆ భాషకు చుక్కెదురు) అక్కడ వాతావరణం ‘బహుత్  బహుత్ గంభీర్.’  నేను అడుగుపెట్టేంత వరకు పరిస్తితి అదే. పని అయిపోయేంతవరకు అందరూ ముక్తసరిగా మాట్లాడుకునేవారు. అంతా రొటీన్ గా  ‘స్క్రీన్ ప్లే’  పుస్తకంలో రాసివున్నట్టు జరిగిపోయేది. వార్తల్లో ఎలాటి తభావతు  రాకుండా  బులెటిన్ల తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక వార్త ఇవ్వాలా వద్దా  ఇస్తే ఎన్ని వాక్యాలు ఇవ్వాలి  యెంత ప్రాధాన్యం ఇవ్వాలి ఒకటి రెండు సార్లు ఆలోచించే వాళ్లు. మరీ  ముఖ్యంగా సత్యవతిగారికీ, వెంకట్రామయ్య గారికీ ఈ విషయంలో పట్టింపులు మెండు. అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకునే నా తత్వం వారికి అంతగా రుచించకపోయినా ఇంట్లో చిన్నవాడిని ముద్దు చేసినట్టు నన్ను చూసీ చూడనట్టు వొదిలేసేవారు. దానితో నాది ఆడింది ఆట పాడింది పాట అయింది.  అంతకు ముందు దినపత్రికలో పనిచేసిరావడం వల్ల కొంత స్వేచ్చను ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడిని. బహుశా నాతో పడ్డన్ని తలనొప్పులు వాళ్లు ఎవరితోనూ పడివుండరేమో కూడా.
నేను చేరిన కొత్తల్లో అనుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జట్ గురించి వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన ప్రత్యేక వార్తావాహిని తయారు చేస్తున్నారు. అభిప్రాయాలు రికార్డ్ చేసుకొచ్చే బాధ్యత నా మీద పడింది. అన్నీ తీసుకొచ్చి ఆ టేపులన్నీ సత్యవతిగారికి వొప్పచేప్పేసి చక్కాపోయాను.  రాత్రి ఏడుగంటల నలభై అయిదు నిమిషాలకు  ప్రసారం. లోపల డబ్బింగు స్టూడియోలో సత్యవతి గారు నానా అవస్థ పడుతున్నారు. గొంతులు వినబడుతున్నాయి.  ఎవరి గొంతు ఎవరిదో తెలియచెప్పే ‘క్యూ షీట్’ సత్యవతి గారికి ఇవ్వడం మరచిపోయాను. ఓపక్క  టైం దగ్గర పడుతోంది. ఆవిడకి నరాలు తెగిపోయే టెన్షన్. నేనెక్కడో ఎవరితోనో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఇప్పట్లా  సెల్ ఫోనులు లేని రోజులాయె.   ఆవిడ అనుభవమే ఆవిడకు  అక్కరకు వచ్చింది. కాని ఆరోజు,  డబ్బింగు పని  పూర్తిచేసి టేపు స్టూడియోలో వొప్పగించేసరికి ఆవిడ తల ప్రాణం తోకకు వచ్చివుంటుంది.
మరునాడు ఆఫీసుకు వెళ్ళిన తరువాత కాని నాకు విషయం తెలియలేదు. కనబడగానే బాగా కోప్పడాలి. కోపడ్డారు కూడా.  యెలా అనుకున్నారు? నోరు తెరిచి ‘ఇదేంటి శ్రీనివాసరావు గారూ’ అన్నారు. అంతే!  
రేడియోలో పనిచేసేవారికి ముందుగా ఓ నీతి పాఠం బోధిస్తారు.  యెంత క్లుప్తంగా (వార్త) చెబితే  భావం అంత ఖచ్చితంగా అర్ధం అవుతుంది అని. (Brevity is sole of expression).

సత్యవతి గారి భావం నాకు చాలా బాగా అర్ధం అయింది.  తీరు పూర్తిగా మార్చుకోకపోయినా  కొంత గాడిలో పడ్డాను. (అని అనుకున్నాను)  


(ఆకాశవాణి మేరునగధీరులు)
  
                        

8, ఆగస్టు 2014, శుక్రవారం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ........



నలభయ్ ఏళ్ళ క్రితం  రేడియోలో  వార్తలు  చదివే  న్యూస్ రీడర్లను ఎంపిక చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. పరీక్షలో నెగ్గినవారికి స్టూడియోలోనే కొన్ని నమూనా వార్తలు ఇచ్చి రికార్డ్ చేయించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపిక కోసం వచ్చిన ఓ పెద్దమనిషి వచ్చినవాళ్ళల్లో ఓ అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ ని పదికాలాలపాటు భద్రపరచమని సూచించారు. అంత బాగా చదివిందా అని మేము ఆశ్చర్య పోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు. వార్తలు ఎలా చదవకూడదో అన్నదానిని బోధపరచడానికి ముందు ముందు అది  పనికొస్తుందన్నది  ఆయన తాత్పర్యం.

రేడియో వార్తలను ఏర్చి కూర్చడం ఒక వంతయితే, వాటిని చదివే తీరుతెన్నులే శ్రోతల ఆసక్తిలో హెచ్చుతగ్గులను నిర్ధారిస్తాయి.

పది  నిమిషాలేనా! ఇంకావుంటే బాగుండు అనుకోవడానికీ-
పది నిమిషాలేగా! వింటే ఓ పనయిపోతుంది అని సరిపెట్టుకోవడానికీ  ఎంతో తేడా వుంది.

సమర్దుడయిన న్యూస్ రీడర్ తనదయిన శైలితో శ్రోతలను ఆకట్టుకుంటాడు. రేడియో కట్టేయాలని కసితో వున్న శ్రోతను కూడా  రేడియోకి కట్టిపడేయగలుగుతాడు.

నోటికీ, చెవికీ మధ్యవున్నది నిజానికి బెత్తెడు దూరమే. అయితే, రాసింది చదవడానికీ, చదివేది వినడానికీ నడుమ కాసింత తేడా వచ్చినా సరే అందులోనే స్వారస్వం దెబ్బతింటుంది. ఈ చదవడం వినడం అన్న ప్రక్రియ రేడియో వార్తలకు ఎక్కువగా వర్తిస్తుంది కాబట్టి ఈ తేడాని పట్టుకోగలగడం లోనే రేడియోవారి ప్రతిభ బయట పడుతుంది. వెనుకటి తరం రేడియో న్యూస్ రీడర్లు
వార్తలను మనసు పెట్టి చదవడం వల్లనే వారి పేర్లు ఈనాటి తరానికి కూడా గుర్తుండిపోయాయి.

కాలం వేగంగా మారుతోంది. ఛానళ్లకు  వేగంగా వార్తలను అందించే క్రమంలో విలేకర్లు కూడా వార్తాప్రసారంలో తమ వంతు పాత్ర పోషించాల్సి వస్తోంది. స్టుడియోలో కూర్చుని వార్తలు చదివే వారికి దీటుగా బయటనుండి వార్తలు అందించే విలేకరులు సయితం ఎలాటి తడబాటు లేకుండా అప్పటిఅకప్పుడు తాజా వార్తని వివరించాల్సి రావడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో న్యూస్ రీడర్లకు కొంత  వెసులుబాటు ఉంది. ఎందుకంటె- వారు చదవాల్సిన వార్తల స్క్రిప్ట్ వారివద్దనే సిద్ధంగా వుంటుంది.  స్పాట్ నుంచి వార్తలు అందించే విలేకరి పరిస్తితి ఇందుకు భిన్నం. అంతేకాకుండా విలేకరులు వార్తలు చదవకూడదు. వార్తని చెప్పగలగాలి. పైగా అంతకుముందు పంపిన వార్తకు తాజా సమాచారాన్ని జోడించి తడుముకోకుండా చెప్పాల్సివుంటుంది. ఏకకాలంలో న్యూస్ రీడర్ పాత్రనీ, న్యూస్ రిపోర్టర్ పాత్రనీ పోషించగలగాలి. అప్పుడే వార్తలు వింటున్న శ్రోతకు కంటిన్యుటీ వున్న భావన కలుగుతుంది.

వార్తలు పంపేటప్పుడు, ముఖ్యంగా రేడియోకి విలేకరులు మూడింటిని -   సూటిగా, స్పష్టంగా, సరళంగా అనే పదాలు గుర్తుంచుకోవాలి. అంటే చెప్పదలచుకున్న వార్త, డొంకతిరుగుడులు లేకుండా  సూటిగా వుండాలి. స్పష్టంగా చెప్పడం వల్ల వార్త లోని నిబద్ధత పెరుగుతుంది. సామాన్య శ్రోతకు సయితం అర్ధం అవడానికి సరళత తోడ్పడుతుంది. వీటికి తోడు సాధికారత తోడయితే ఆ వార్తకు ఇక అడ్డే వుండదు.




7, ఆగస్టు 2014, గురువారం

వార్తల కొరత



 ఎనభయ్యవ దశకం చివర్లో మేము మాస్కోలో వున్నప్పుడు మాకు ఏ కొరతా వుండేది కాదుఒక్క తెలుగు పేపర్ రాదే అన్న లోటు తప్ప. అందుకే ఇండియా నుంచి మా వాళ్ళు ఏదయినా సరుకులు అంటే చింతపండు, బెల్లం  లాటివి పంపేటప్పుడు వాటిని న్యూస్ పేపర్ లలో చుట్టి పంపాలని కోరేవాళ్ళం. ఆ విధంగానయినా ఆ  పాత పేపర్లలోని  పాత  వార్తలనయినా  తాజాగా  చదువుకోవచ్చన్నది మా తాపత్రయం. ఆ రోజుల్లో  మాస్కోలో విదేశీ పత్రికలు  దొరికేవి కావు. విదేశీ రేడియోలు వినబడేవి కావు. విదేశీ టీవీ ఛానళ్ళు కనబడేవి కావు. అందుకని ఇండియా వార్తలకోసం ముఖ్యంగా తెలుగు వార్తలకోసం మొహం వాచినట్టుగా వుండేది. నేను పని చేసేది మాస్కో రేడియోలో కాబట్టి కొంత పరవాలేదు. కాస్త  ఆలస్యంగానన్నా యేవో కొన్ని వార్తలయినా చెవిన పడుతుండేవి. కానీ వాటిని శ్రోతల చెవిన వేయాలంటే వెయ్యి అడ్డంకులు. ఒక రోజు ఎం జీ రామచంద్రన్ మరణించిన వార్త వచ్చింది. కానీ వెంటనే ప్రసారానికి నోచుకోలేదు. ఎందుకంటె ఆ మదరాసీ రాజకీయ నాయకుడు ఢిల్లీ లోని ఫెడరల్ ప్రభుత్వానికి అనుకూలమో కాదో నిర్ధారణ చేసుకునేవరకు ఆ చావు వార్తను చావనివ్వకుండా బతికించే వుంచారు.
పోతే, సమాచారానికి సంబంధించినంతవరకు  మాస్కోలో వున్న మిగిలిన ఇండియన్ల పరిస్తితి మరీ ఘోరం. అర్ధం కాని రష్యన్ టెలివిజన్, చదవడానికి భాష తెలియని  రష్యన్ పత్రికలూ తప్ప, కనీసం ఒక్క  ఇంగ్లీష్ పత్రిక  కూడా కనబడేది కాదు.  అయితే ఈ విషయంపై  మాస్కోలోని హిందుస్తానీ  సమాజ్ చేసిన  అభ్యర్ధన మేరకు ఇండియన్ ఎంబసీ వారు ఢిల్లీ నుంచి కొన్ని ఇంగ్లీష్ దినపత్రికలు తెప్పించేవారు.  పదిరోజులకోమారు ఎయిర్ ఇండియా విమానంలో వచ్చే డిప్లొమాటిక్ బాగ్ లో ఈ పత్రికలు భారత రాయబార కార్యాలయానికి చేరేవి. మాస్కో రేడియో నుంచి మూడు మెట్రో రైల్వే స్టేషన్ల  అవతల ఇండియన్ ఎంబసీ వుండేది. రేడియోలో పనిచేసే భారతీయులం వంతులు వేసుకుని  ఎంబసీ కి వెళ్లి పత్రికలు పట్టుకొచ్చేవాళ్ళం. ఈ బాధ్యతను ఒకటికి రెండు సార్లు నేనే భుజానికి ఎత్తుకునేవాడిని. దీంట్లో నా స్వార్ధం కూడా కొంత వుంది. ఇంటికి తిరిగి వస్తూ ఎంచక్కా మెట్రో లోనే పేపర్లు చదువుకోవచ్చు. అంతేకాదు, డిప్లొమాటిక్ బాగ్ లోనే మాస్కోలోని ఇండియన్లకు ఉత్తరాలు కూడా  వచ్చేవి. అదెలాగంటే, హైదరాబాద్ లో కానీ మరో చోట వున్న వారు కానీ మాస్కోలో వున్న తమ వాళ్లకు  జాబు రాయాలనుకుంటే ఎయిర్ మెయిల్ అవసరం లేదు. కవరుపై   పేరురాసి కేరాఫ్ ఇండియన్ ఎంబసీ, మాస్కో -  విదేశీ వ్యవహారాల శాఖ, న్యూ ఢిల్లీ అని రాసి ఢిల్లీ కి పోస్ట్ చేస్తే అది డిప్లొమాటిక్ బాగ్ ద్వారా మాస్కో చేరేది. కాకపొతే ఆ ఉత్తరాలను ఎంబసీ కి వెళ్లి ఎవరికి వారే తెచ్చుకోవాలి. ఉత్తరాలతో పాటు అలా తెచ్చుకున్న పత్రికలనే రేడియో మాస్కో బిల్డింగ్ లో వున్న భారతీయులం  అందరం అపురూపంగా చదువుకునేవాళ్ళం.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే దూరంగా వున్నప్పుడు  సొంత వూరి సమాచారం కోసం మనిషి ఎంతగా వెంపర్లాడి పోతాడో చెప్పడానికి.
అయితేవిదేశాల్లో వుంటున్న భారతీయులకు కానీ, ప్రత్యేకించి తెలుగు వారికి కానీ ఇలాటి ఇబ్బందులు వున్నట్టు వినలేదు. ఉపగ్రహాల ద్వారా సమాచార  వినిమయం పెరిగిన తరువాత విషయాలు తెలిసిరావడానికి అమలాపురంలోవున్నా ఒకటే అమెరికాలో వున్నా వొకటే. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ ల పుణ్యమా అని ఎలాటి కబురయినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది.

ముప్పయి నలభయ్ ఏళ్ళ క్రితం మన దగ్గర కూడా  పరిస్తితి వేరుగా వుండేది. ఆ రోజుల్లో ఏదయినా వార్త ముందు తెలిసినప్పుడు దాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఆత్రుత వుండేది. విషయం తెలుసుకున్న వారు కూడా తెలిపినవారిపట్ల కృతజ్ఞతతో వుండేవారు. ప్రత్యేకించి వార్తా పత్రికల్లో, రేడియోలో పనిచేసే వారిపట్ల ఒక ప్రత్యేక గౌరవభావం సమాజంలో వుండడానికి కూడా ఇది ఒక కారణం. కొన్ని విషయాలు జర్నలిష్టులు ఫోను చేసి చెప్పేవరకు అధికారులకు, మంత్రులకు కూడా ముందుగా తెలిసేవి కావు. రేడియోలో వార్తలు రోజూ నియమబద్ధంగా నియమిత సమయాల్లో మాత్రమే ప్రసారం అయ్యేవి. పత్రికలు చదవాలంటే మరునాటి దాకా ఆగాలి. అందుకే మాకు ముందుగా తెలిసిన వార్తలను తెలిసినవారితో పంచుకోవడం ఒక ఉత్సాహంగా వుండేది. అలాగే, మానుంచి వార్తలు తెలుసుకోవాలనే వాళ్ళల్లో  ఓ మంచి ఆత్రుత  కనబడేది. కానీ,   ఇప్పుడో!. మిన్ను విరిగి మీద పడ్డంత సంచలన సమాచారం తెలుపుదామని ఎవరికయినా ఫోను చేసారనుకోండి. ‘ఓస్ ఇదా! మాకెప్పుడో తెలుసు. టీవీ స్క్రోలింగుల్లో ఆల్రెడీ చూసేశాము’ అనేస్తారు. అందుకే,  వార్త అనే దానిలో ఒకప్పుడు దాగున్న ఉత్సుకత ఇప్పుడు కలికానికి కూడా లేకుండా పోయింది. 


NOTE: Courtesy Image Owner  

6, ఆగస్టు 2014, బుధవారం

మన జీవితమే మన గురువు


ఎక్కడో చదివినట్టు, ఏదో సినిమాలో చూసినట్టు  అనిపించే ఓ కధ ఇది.
అనగనగా ఓ అమ్మడు. పొద్దున్న బెంగళూరు వెళ్ళి ఆఫీసు పనిచూసుకుని  సాయంత్రానికల్లా   హైదరాబాదు తిరిగొద్దామని  శంషాబాదు  ఎయిర్ పోర్ట్ కు వెళ్ళింది. కాస్త వ్యవధానం వుండడంతో  ఓ ఇంగ్లీష్ నవలను,  దాంతో పాటే ఓ బిస్కెట్ ప్యాకెట్టును  కొనుక్కుని  వెయిటింగ్ హాలు కుర్చీలో తీరుబడిగా చేరగిలపడి పుస్తకం చదువుతూ ఒక్కో బిస్కెట్ తీసుకుని నోట్లో వేసుకుంటున్నతరుణంలో ఆ అమ్మడికి వున్నట్టుండి ఓ అనుమానం పొడసూపింది. పక్కన కూర్చున్న కుర్రాడు కూడా తాపీగా తన ప్యాకెట్ నుంచే ఒక్కో  బిస్కెట్టు  తీసుకుని తింటున్నట్టు అనిపించి అతడివైపు తేరిపార చూసింది. అతగాడు ఆమెను, ఆమె చూపుల్ని ఏమాత్రం  పట్టించుకోకుండా ప్యాకెట్ లోనుంచి బిస్కెట్లు తీసుకుని తింటూ చదువుతున్న పేపరులో మునిగిపోయాడు.  అలా ఇతరుల ప్యాకేట్ నుంచి  తింటూ కూడా ఏమీ తెలియని నంగనాచిలా పేపరు చదువుకుంటున్న అతడి తరహా చూసి ఆమెకు  చిరాకేసింది. మొహం మీదే కడిగేయాలన్నంత కోపం వచ్చినా  సభ్యతకోసం పైకి ఏమీ అనకుండా మిగిలిన ప్యాకెట్ ను  అక్కడే వొదిలేసి, చరచరా అడుగులు వేసుకుంటూ వెళ్ళి    బెంగుళూరు విమానం ఎక్కి తన సీట్లో సర్దుకుని కూర్చుంది.  రీడింగ్ గ్లాసులకోసం హ్యాండ్ బ్యాగు ఓపెన్ చేస్తే ఓపెన్ చెయ్యని బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. అప్పుడు కాని ఆమెకు జరిగిన పొరబాటు అర్ధం కాలేదు. నిజానికి తానే అతడి ప్యాకెట్ లోనుంచి బిస్కట్లు తీసుకున్న సంగతి తెలిసివచ్చి అయ్యో ఇంకా ఏదన్నా మాట తూలాను కాదుఅని మధనపడింది.
ప్రతికధకు ఏదో ఒక నీతి వున్నట్టే  ఈ కధనుంచి నేర్చుకోవాల్సిన నీతి కూడా వుంది.
జీవితంలో  వెనక్కు తీసుకోలేని విషయాలు  మూడు  వున్నాయి. అవేమిటంటే:
1. రాయి :  ఒకసారి విసిరితే దాన్ని మల్ళీ  వెనక్కు తీసుకోవడం కష్టం.
2. మాట : ఒక్కసారి నోరు జారితే అంతే సంగతులు.
3.  కాలం :  క్షణం గడిచిందంటే  అది శాశ్వితంగా  గతంలో కలసిపోయినట్టే.



ఇంకా ఇలాటివి మరికొన్ని వుండవచ్చు. నేర్చుకునే తీరిక వుండాలే కాని జీవితమే ఈ మాదిరి  నీతి పాఠాలను నేర్పుతుంది.

నా గురించి నలుగురూ ...........3


"మ్యాపు చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో రామారావుగారు, వెంగళరావుగారు, సెక్యూరిటీ వాళ్లు జీపు వెనుక ఎక్కారు. నేనూ, సురేందర్ పరిగెత్తుకువెళ్ళి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము. భద్రాచలం సమీపంలోని అడవుల్లో ప్రయాణం షురూ. ఆ ప్రయాణం యెలా సాగింది, యెలా ముగిసిందీ అన్న ఆసక్తికరమైన సొంత అనుభవాన్ని రేడియోలో సుదీర్ఘకాలం పనిచేసిన భండారు శ్రీనివాసరావు అందిస్తారని 'వార్తల వెనుక కధ' సంపుటం సంపాదకులు, ప్రస్తుతం నమస్తే తెలంగాణా ఎడిటర్ అయిన శ్రీ కట్టా శేఖరరెడ్డి తన ప్రస్తావనలో రాశారు.



శ్రీ శేఖరరెడ్డి నా గురించి రాసిన పరిచయ వాక్యాలు:
1971 లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సబ్ ఎడిటర్ గా పత్రికా జీవితం ప్రారంభం. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో మూడు దశాబ్దాల అనుభవం. నాలుగున్నర ఏళ్ళ పాటు (1987 - 1991 మధ్య) ఆనాటి  సోవియట్ రాజధాని మాస్కోలో,  'రేడియో మాస్కోలో ఉద్యోగం. సోవియట్ కుప్పకూలడానికి దారితీసిన పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి. ఆ అనుభవాలను పొందుపరుస్తూ 'మార్పుచూసిన చూసిన కళ్ళు' పుస్తక రచన.  2005 డిసెంబరులో దూరదర్శన్ నుంచి ఉద్యోగ విరమణ. రేడియోలో వారం వారం నిర్వహిచిన జీవన స్రవంతి కార్యక్రమం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆంధ్రజ్యోతిలో అనుదినం రాసిన 'వాక్టూన్లు' కూడా మంచి గుర్తింపు తెచ్చాయి."   

(సుప్రసిద్ధ జర్నలిస్ట్ , హెచ్ .ఎం.టీ.వీ. మాజీ సీ...,  శ్రీ కె. రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణా ఎడిటర్ శ్రీ కట్టా శేఖర్ రెడ్డి  సంపాదకత్వంలో  45 మంది జర్నలిష్టులు రాసిన  అనుభవాలను ఒక సంకలనంగా 'వార్తల వెనుక కధ' అనే పేరుతొ New Media Communications  వారు 2007 లో వెలువరించారు.)

5, ఆగస్టు 2014, మంగళవారం

నా గురించి నలుగురూ.....2


1988 లో ఆంధ్ర జ్యోతి మాజీ ఎడిటర్, మహా టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీ ఐ. వెంకట్రావ్, నాటి సోవియట్ ప్రభుత్వ వార్తా సంస్థ 'నోవొస్తీ' ఆహ్వానంపై  రెండు వారాలపాటు సోవియట్ యూనియన్ ని సందర్శించారు. అందులో భాగంగా మాస్కో వచ్చారు. 'ఫ్లాష్ బ్యాక్' అనే పేరుతొ రచించిన పుస్తకంలో శ్రీ వెంకట్రావ్ నా గురించి ప్రస్తావించారు.
"మాస్కోలో వున్నప్పుడు మిత్రుడు భండారు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లాను. ఆకాశవాణిలో పనిచేసే శ్రీనివాసరావు రేడియో మాస్కోలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. శ్రీనివాసరావు, నేనూ ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో సహచరులం. శ్రీనివాసరావు సరదా మనిషి. ఒకటే జోకులు. తెగ నవ్విస్తుంటారు. ఆయన కుటుంబం అంతా నాకు తెలుసు. అందువల్ల నన్ను డిన్నర్ కు ఇంటికి ఆహ్వానించారు. నాతొపాటు ఇండియా నుంచి వచ్చిన మరో ఇద్దరు జర్నలిష్టులను కూడా. ఆయన ఇంటిలోనే ప్రముఖ కూచిపూడి నర్తకి శోభానాయుడి గారిని కలిసాను. ఆవిడా, ఆవిడ బృందం ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా సోవియట్ నగరాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. మాలాగే, ఆవిడా, ఆవిడ సహచర బృందం కూడా శ్రీనివాసరావుకి గెస్టులు. అర్ధరాత్రివరకు కబుర్లు, తిండి తినడాలతో కాలం ఇట్టే గడిచిపోయింది. హోటల్ కు తిరిగి రావడానికి ఇంటి బయటకు వస్తే వీధులన్నీ నిర్మానుష్యం. లైట్లు  దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. కానీ జనసంచారం నిల్. శ్రీనివాసరావుని అడిగాను - 'భయం వుండదా?'అని. మిగతా సమస్యలు యెలా వున్నా మాస్కోలో భయం అన్నది మాత్రం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి వొంటరిగా ఆడమనిషి బయటకు వెళ్ళినా నిక్షేపంగా ఇంటికి చేరగలదని ఆయన చెప్పారు. దగ్గర్లో  వున్న మెట్రో స్టేషన్ వరకు మా వెంట వచ్చి రైలు ఎక్కించి వెళ్లారు."