5, మే 2014, సోమవారం

షరా మామూలే!

తెలంగాణా ప్రాంతంలో ఎన్నికలు జరిగినప్పటి మాదిరిగానే ఈసారి సీమాంధ్ర ప్రాంతంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడో  తేదీ పోలింగు ముగిసేవరకు సుమారు నలభయ్ ఎనిమిదిగంటలపాటు  నా బ్లాగులో రాజకీయ సంబంధమైన వ్యాసాలు  కానీ వ్యాఖ్యానాలు కానీ చోటుచేసుకోవు. ఇది నాకై నేను విధించుకున్న నిబంధన.


 భండారు శ్రీనివాసరావు 

4, మే 2014, ఆదివారం

"ఎవరు చేసిన ఖర్మ ......."



పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు వేమన. అలాగే - విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తి తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ఒసే అనడం - తండ్రిని ఒరే అనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.

వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా గురూ-గురూ అని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం అమ్మగారూ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచే వారికి వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలక్కు అదే కొలమానంగా భావించేవారు.

ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా  చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు. 
కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా! జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత వేగవంతం చేయడంలో ఈనాటి ఎ టూ జెడ్ ఛానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది.  తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వెఐరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను ఒసేఅనడం, నాన్నను ఒరేఅనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే, ఈనాటి ఛానళ్ళే ఈనాటి పత్రికలే, ఈనాటి పుస్తకాలే, ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు.రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు. 
 
పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

ధర్మ సందేహం


రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఎన్నికల యుద్ధం రాజకీయ పార్టీల మధ్యనా లేక కొన్ని పత్రికల నడుమా?

కుడి ఎడమైతే....


సీమాంధ్రలో తొలి దశ పోలింగు జరిగి, రెండో దశ తెలంగాణా ప్రాంతంలో జరిపివుంటే రాజకీయ నాయకుల ప్రసంగాలు యెలా వుండేవో ఆలోచిస్తే తమాషాగా అనిపిస్తుంది.

2, మే 2014, శుక్రవారం

పత్రికా స్వేచ్ఛకు సరికొత్త భాష్యాలు - భండారు శ్రీనివాసరావు


అవి ఎమర్జెన్సీ రోజులు.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.
 పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజం ను వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేసే నాకు వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. ‘నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు దయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్చవుందని ఒప్పుకుంటాను.’
పత్రికా స్వేచ్చపట్ల అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్చ గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు.
ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికా స్వేచ్చకు భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్చ అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో.
నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం – అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా - ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ‘ఎడిట్’ చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో ‘పత్రికా స్వేచ్చకు’ పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు  ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రా యించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని విషయం వారి ‘ఎడిటోరియల్ పాలసీ’కి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగావున్నప్పుడు వారి పత్రికలలో ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరెవ్వరు - ‘ఎడిటోరియల్ పాలసీ’ అంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమే  పరిమితం కావాలి కాని, . పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం – ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికా స్వేచ్చకు అర్ధమేముంటుంది?
ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక ప్రముఖ దినపత్రిక – సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది.
“అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది.
‘అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు ఎదురుగా ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో ఎప్పుడు సిద్దంగా వుంటారు. సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి”

29, ఏప్రిల్ 2014, మంగళవారం

'ఒరేయ్ నేను శారదని....'

క్షమించాలి నేను గీసుకున్న గీతను నేనే దాటి వస్తున్నందుకు. కానీ సరయిన కారణం వుంది. ఇందులో నాకు రాజకీయం కనబడలేదు. ఈ ఫోటోలో వున్నది మా రెండో అక్కయ్య. ఆవిడకు వోటు ఖమ్మంలో వుంది. కానీ మూడు నెలల క్రితం వాళ్ల అబ్బాయి దగ్గరకు వచ్చి ఆరోగ్యకారణాల రీత్యా హైదరాబాదులోనే వుండిపోవాల్సివచ్చింది. రేపు ఇక్కడ వోట్ల రోజు అన్న సంగతి తెలుసుకుని ఈ రోజు పొద్దటి నుంచి అందర్నీ ఫోనులో పలకరించి వోటు వేసి రమ్మంటోంది. అంతే కాదు వేసి వచ్చిన తరువాత ఆ విషయం మళ్ళీ ఫోను చేసి చెప్పమని మాట తీసుకుంటోంది. తొంభయ్ ఏళ్ళ వయస్సులో ఆవిడ పడుతున్న ఆత్రుత చూసిన తరువాత ఇక దీన్ని షేర్ చేయాలన్న ఆత్రుత నాలో పెరిగిపోయింది. అందుకే వొట్టు తీసి గట్టున పెట్టేసాను.మన్నించాలి. - భండారు శ్రీనివాసరావు
మా మేనకోడలు భండారు రేణు సుధ కధనం:



(శ్రీమతి కొలిపాక శారద)

ఫోను కలపవే చిన్నమ్మాయ్!
" పొద్దున్నే లచ్చుబాబు నుంచి ఫోను. ఒక్కసారి వచ్చివెళ్ళవే అమ్మ అడుగుతోంది"
'ఆర్చుకుని తీర్చుకుని జూబిలీ హిల్స్ నుంచి బయలుదేరి వెళ్లేసరికి పదకొండు దాటింది. అమ్మ కిందటి నెలలోనే ఖమ్మం నుంచి హైదరాబాదు పటాన్ చెర్వు సమీపంలో వున్న మా చిన్నన్నయ్య ఇంటికి వచ్చింది. తొంభయ్ ఏళ్ళ మనిషిని అలా కదిలించడం నిజంగా సాహసం అనిపించింది కాని తప్పలేదు. మేముంటోంది జూబిలీ హిల్స్ లో. వారానికో పది రోజులకో వెళ్ళి చూసి వస్తుంటాను. ఎర్రటి ఎండలో పడివచ్చానని ఇంట్లో అంతా అనుకుంటుంటే అమ్మ మాత్రం తాపీగా 'ఫోను కలపవే చిన్నమ్మాయి' అంటోంది. అప్పటికే మా లచ్చుబాబు అన్నయ్య, గాయత్రి ఒదినె, వాళ్ల పిల్లల వరస అయిపోయినట్టుంది. ఆవిడ మంచం మీద కూర్చుని, హైదరాబాదులోని చుట్టపక్కాలు అందరికీ ఫోను కలిపి ఇవ్వమంటుంటే ఏమిటో అనుకున్నాను. తీరా చూస్తే. ఈ వయస్సులో ఎవరయినా అలా చేస్తారా అని అనిపించింది కూడా.
ఆవిడ పుట్టింది కాంగ్రెస్ వాదుల ఇంట్లో. మెట్టింది కాంగ్రెస్ కుటుంబాన్ని. పెళ్ళయిన కొత్తల్లోనే భర్త అంటే మా నాన్నగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్ర రావు గారు, స్వాతంత్ర సమర యోధుడిగా, గర్భిణి అయిన అమ్మను వొదిలి పద్దెనిమిది మాసాలు జైల్లో వున్నారు. తొలి చూరు బిడ్డని పుట్టిన వెంటనే చూసుకునే అదృష్టం కూడా లేదు. జైలు నుంచి వచ్చిన ఎన్ని నెలలకో కళ్ళారా చూసుకున్నారు. స్వతంత్రం వచ్చిన దరిమిలా మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి క్రితంసారి ఎన్నికల వరకు దేన్నీ విడిచిపెట్టకుండా ప్రతిసారీ వోటు వేసి రావడం మా అమ్మకు అలవాటు. ఈసారి తనకు వోటు లేని హైదరాబాదులో వున్నప్పుడు ఈ వోట్ల పండుగ వచ్చిపడింది. వోటు వేయాలని ప్రాణం యెంత కొట్టుకులాడిపోతున్నా చేతకాని స్తితి. వీలులేని పరిస్తితి. అందుకని కొడుకునీ, కోడల్నీ, మనుమల్నీ పక్కన కూర్చోపెట్టుని అందరికీ ఫోన్లు కలపమని చెబుతూ, 'వొరేయ్ నేను శారదని, రేపు మరిచిపోకుండా వోటు వేసి రండి. వేసి వచ్చిన తరువాత నాకు ఫోను చేసి చెప్పండి.' అంటోంది.
ఇదంతా వింటూ నాకు కళ్ళు తిరిగాయో తెలియదు కాని తెరిపిళ్ళు పడ్డాయి. - భండారు రేణు సుధ

28, ఏప్రిల్ 2014, సోమవారం

తాత్కాలిక విరామం



బ్లాగర్, ట్విట్టర్,  ఫేస్ బుక్ సయితం ప్రభావవంతమైన సోషల్ మీడియా అయినందువల్ల  ఈరోజు సాయంత్రం ఆరుగంటల నుంచి ఎల్లుండి ముప్పయ్యవతేదీ సాయంత్రం పోలింగు ముగిసేవరకు రాజకీయ సంబంధమైన వార్తలు, వాటిపై వ్యాఖ్యలు, లేదా రాజకీయ కార్టూన్లు షేర్ చేయడం, లేదా వాటికి వ్యాఖ్యానాలు జత చేయడం, ఇతరులు పోస్ట్ చేసిన రాజకీయ  అంశాలపై స్పందించడం మొదలయిన వాటన్నిటికీ దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను.ఇది నాకు నేనుగా స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయం.- భండారు శ్రీనివాసరావు