8, జనవరి 2014, బుధవారం
"ఇ" లో "ఇంత" విషయం వుందా!
6, జనవరి 2014, సోమవారం
మౌనమె నాభాష
“I get
intoxication while talking” అన్నాట్ట వెనుకటికి
నాలాటి వాడు. మద్యం సేవించినప్పటికంటే కంటే కూడా మాట్లాడుతుంటే నాకు బాగా ‘కిక్కు’
వస్తుందన్నది మా ఆవిడ వువాచ. ‘అది’ కూడా తోడయితే పట్టేవాళ్ళు వుండరన్నది ఆవిడ
వ్యక్తిగత అభిప్రాయం. అదేవిటో నా వదరుబోతుతనం ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిందన్నది అచ్చంగా నా సొంత అభిప్రాయం. మాట్లాడడానికి తగ్గ వాతావరణం వుండాలని అప్పుడే మాట బాగా
పెగులుతుందని ‘వసకారుడు’ ఏనాడో చెప్పాడు.
చదువుకునే రోజులనుంచి
నాకీ మాటల పిచ్చి వుందనీ అందుకే చదువు చెట్టెక్కిందనీ మా పెద్దవాళ్ళు అంటుండగా
అనేకసార్లు వినే అదృష్టం నాకు కలిగింది. అయినా వేరే ఆటలకన్నా నాకు ‘మాటల ఆటలు’
అంటే వున్న వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు. బహుశా రేడియోలో ఉద్యోగం ఇవ్వడానికి నాకు
వున్న అనర్హతలను ఈ అదనపు అర్హత కప్పిపెట్టిందేమో అని అనుకునేవాళ్ళు కూడా
లేకపోలేదు. ఎస్సారార్ కాలేజీలో నాకంటే వయస్సులోనూ, చదువులోనూ పెద్దవాళ్లయిన ఇద్దరు
అక్కాచెల్లెళ్లు వుండేవాళ్ళు. కాస్త వీలు దొరికితే చాలు వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు
మొదలు పెట్టేవాడిని. శ్రద్ధ, సుధ అనే పేర్లు కలిగిన వాళ్ళిద్దరూ వాళ్ల నోట్సులు
రాసిపెట్టేవరకు నా మాటలు విని ఆ తరువాత ఎంచక్కా ‘మంచిది వెళ్ళి రండి’ అనేసేవాళ్ళు.
అలా అని మాటల వల్ల అసలు ఏమాత్రం ఉపయోగం లేదనే
గొప్ప అభిప్రాయానికి వెంటనే రానక్కర లేదు. వెనుకటికి నేను రైళ్ళలో రిజర్వేషన్
లేకుండానే ఈ మాటల మంత్రంతో తేలిగ్గా ప్రయాణాలు చేసేవాడిని. నిలుచుని కాసేపు
కూర్చున్న వాళ్ళతో మాటలు కలిపేవాడిని. ఆ తరువాత వాళ్లు మాటల మైకంలో పడిపోయి ‘అదేమిటి మాస్టారు అలా నిలబడేవున్నారు వచ్చి ఇలా
కూర్చోండి’ అని జాగా ఇచ్చేవాళ్ళు. కొండొకచో మరికొందరు శ్రోతలు మరీ మొహమాట పడిపోయి
నా మాటలు వింటూ వాళ్లు లేచి నిలబడి నాకు కూర్చునే జాగా ఇచ్చేవాళ్ళు. రేడియో ఉద్యోగంలో చెప్పక్కర లేదు. ఆఫీసుకి పోవడమే గగనం కాని వెళ్ళానంటే చాలు న్యూస్ యూనిట్
చిన్న సభా ప్రాంగణంగా మారిపోయేది.
అలాటి ఘన చరిత్ర కలిగిన నేను ఈ నడుమ యెందుకు మాటలాటలు తగ్గించానని మా ఆవిడ సయితం అనుమానిస్తోంది. ‘వున్నట్టుండి
ఈ వయస్సులో అంటే అరవై ఎనిమిది దాటిన తరువాత మా ఆయనకు కాసింత పెద్దమనిషితనం కానీ రాలేదు కదా’ అని బోలెడు బోలెడు సంతోషం కూడా పడిపోతోందష. తెలుగు సీరియళ్ల ప్రోత్సాహాక ఉద్యమంలో మునిగిపోయి
టీవీల్లో రాజకీయ చర్చలు పట్టించుకోకపోవడంవల్ల ఆవిడకు ఈ జ్ఞానోదయం ఆలశ్యం అయిందని
నా అనుమానం.
నిజమే. టీవీ
చర్చావేదికల్లో ఒకరిని మించి మరొకరు దూషణలతో
కూడిన తిరస్కారాలవల్ల కలిగిన మాత్సర్యసహిత ప్రేలాపనలతో నాకు మాట పడిపోతోందన్న మాట
మాత్రం నిజమే.
అంతయు మన మేలునకే. (06-01-2014)
NOTE: Courtesy Image Owner
లేబుళ్లు:
సంభాషణామైకం,
Conversation
5, జనవరి 2014, ఆదివారం
వినదగునెవ్వరు చెప్పిన – అది ఇంగ్లీషోడయినా సరే!
TIME HEALS
ALL PAINS – BUT GIVE SOME TIME TO TIME
DREAM MORE
WHILE YOU AWAKE
WHAT OTHERS
THINK OF YOU, IS NONE OF YOUR BUSINESS
NO ONE IS
IN CHARGE OF YOUR HAPPINESS EXCEPT YOU
LIFE IS TOO
SHORT TO WASTE TIME HATING ANY ONE
కరివేపాకు కధ
అనగనగా ఓ
అమ్మ. ఆ అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి
రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ
ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది.
పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ ఆ మాతృహృదయం
మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు
కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. ఆ పిల్లాడేమో – చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం
పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ – పొరుగు పెరట్లోని కరివేపాకు
రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని – బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో ఆ కన్నతల్లి మరింత
మురిసిపోయేది. ‘నా బాబే!
నా తండ్రే!’ అంటూ
గారంగా ఓ బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట
చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా
పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ
తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.’ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని ఈ దొంగతనాలేమిట్రా!
దొంగతనం చేయడం తప్పురా తండ్రీ ‘
అంటూ ఆ అమ్మ తల్లడిల్లిపోతుంటే – ‘ ఈ ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మా’ అనేసి ఆ దొంగ పిల్లాడు
చక్కా జైలుకు పోతాడు.
ఈ నీతికధ
అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న కధనాలు
గమనిస్తున్నప్పుడు ఈ కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తోంది.
వార్తకు, వ్యాఖ్యకు నడుమ వున్న
సన్నటి విభజనరేఖను చెరిపేసి, తాము
అచ్చేసిందే సరయిన వార్త అంటూ కొన్ని పత్రికలు నిస్సిగ్గుగా సాగిస్తున్న పరోక్ష
యుద్ధాలు పతాక స్తాయికి చేరుకుంటున్నప్పుడు –
ఇంటి
నాలుగ్గోడల నడుమ గుంభనగా వుండాల్సిన భార్యాభర్తల గొడవలు గడప దాటి ఛానళ్ళ రూపంలో
ఇంటింటికీ ప్రవేశించి ప్రశాంతతను భగ్నం చేస్తున్నప్పుడు -
ఏడాదిక్రితం
దాకా భజన చేసిన నోటితోనే విమర్శల జడివాన కురిపిస్తున్న రాజకీయ చద్మవేష ధారులను
చూస్తున్నప్పుడు -
అమ్మను ‘ఒసే’ - నాన్నను ‘ఒరే’ అనే దుష్ట సంస్కృతిని పెంచి
పోషిస్తూ తెలుగునాట వీరవిహారం చేస్తున్న సినిమాలను విధిలేక భరిస్తున్నప్పుడు –
ఇవన్నీ
కంటూ, వింటూ –
వొళ్ళుమండుతున్నా
నిలదీయలేని నిస్సహాయులను గమనిస్తుంటే –
ఈ ‘నీతికధ’ మనసు మూలల్లో కదలాడుతుంది. ‘కరివేపాకునాడే
చెప్పవయితివేమమ్మా!’ అనే అన్న
దొంగ మాటే వినబడుతుంది.
సమాజంలో
నేడున్న సమస్త సమస్యలకు, నాయకుల
మానసిక వైకల్యాలకు, మీడియా
చిత్త చాంచల్యాలకు, ఆదిలోనే
కళ్ళెం వేయగలిగిన శక్తివుండీ ఆ పని చేయలేకపోయిన జనాలకు –
అదేమిటి
అని ప్రశ్నించలేకపోయిన ప్రజలకు –
ఇప్పుడు
అడిగే హక్కు ఎక్కడిదంటే - చేయగలిగిందేమిటి?
(Courtesy Image Owner)
లేబుళ్లు:
కరివేపాకు కధ - Self Control
కధలు రాయడం యెలా?
‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దుర్మార్గానికి పూనుకుంది కూడా నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
‘కధలెలా రాయాలి’ అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా అంతే వుంటుంది. ఏమంటారు?
లేబుళ్లు:
కధలు రాయడం యెలా?
ఓటర్ల మేనిఫెస్టో – భండారు శ్రీనివాసరావు
ఎన్నికలకు ముందు ప్రతి
రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ను విడుదల చేస్తుంది. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి
తమను మాత్రమే ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే ఆ
పవిత్రమయిన వోటు వేసినందుకు (గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం
తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి చేయబోతున్నదో అనే అనేకానేక ఉచిత వరాలతో
కూడిన ఎన్నో వివరాలు ఈ మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి
పార్టీ ఎంతో పెద్ద కసరత్తు చేస్తుంది. ఇందునిమిత్తం పార్టీ ఏర్పాటు చేసిన
మేనిఫెస్టో కమిటీ పలు మార్లు సమావేశాలు జరిపి – ఎన్నికల
ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా
చర్చిస్తుంది. అర చేతిలో వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి
పెద్ద పెద్ద పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక
మేనిఫెస్టో విడుదల అనేది మరో పెద్ద తంతు. వోటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ
యా పార్టీలకు చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ
అంతకంటే అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా
రిలీజ్ మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు
పడే యాతన ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు ముందు ఓ తప్పనిసరి
తతంగంగా తయారయింది. కాకపొతే,
ఎన్నికల తరువాత మాత్రం మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.
‘మీరిలా
వోటు వేసి గెలించండి. మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాం’ అనే
రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మాదిరిగానే, ‘ మీరిలా
చేస్తామని మాట ఇవ్వండి. అప్పుడు మా వోటు అచ్చంగా మీకే’ అంటూ
ఓటర్లే తమ మేనిఫెస్టోలతో ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జయ ప్రకాష్
నారాయణ గారు తమ లోక్ సత్తాను రాజకీయ పార్టీగా రూపు మార్చకుండా వుండి వుంటే బహుశా ఈ
ప్రయోగం ఆయనే చేసివుండేవారేమో. ఇలా
ఈ దిశగా సాగిన ఆలోచనలనుంచి పుట్టుకొచ్చినదే ఇదిగో ఈ ‘ఓటర్ల
మేనిఫెస్టో’.
1. ఎన్నికలకు
ముందు ప్రజలకు ఇచ్చే ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి
రాగానే తాము దాన్ని యెలా అమలు చేయబోతున్నామో అన్న విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన
అసంగ్దిగ్ధతలకు తావివ్వకుండా, శష
భిషలకు పోకుండా ఎన్నికల ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను
తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది
యెలా సాధ్యమో కూడా వోటర్లకు
తెలియచెప్పాలి. యేరు దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన
తరువాత బోడి మల్లయ్య సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక
నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం
తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత
వాగ్దానాల అమలుకు అయ్యే మొదటి ఏడాది వ్యయాన్ని తమ పార్టీ నిధులనుంచే ఖర్చు చేయాలి.
ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి చెప్పాలి.
(మీడియాకు మనవి: ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై
వొదులుతున్న ‘ఉచిత’ హామీలను
యెలా అమలు చేస్తారని మీడియా ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు
తెలియచెప్పాలి.)
2.
భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే పాత పద్ధతులకు
స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న సమావేశాల ద్వారా
ఎన్నికల ప్రచారం సాగించాలి.
3.
ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. (ఆన్ లైన్ విధానంలో
నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.)
4.
ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ
రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య హక్కు పేరుతొ నడిరోడ్లపై ధర్నాలు, బైఠాయింపులు, రాస్తా రోఖోలు
నిర్వహించరాదు.(అలాగే ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను
ఎటువంటి పరిస్తితిలోను ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి
స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ
రకమయిన ఆందోళనల కారణంగా ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా
ప్రసారం చేయాలి. ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని
బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం
చూపిస్తున్నారు. అలాకాకుండా రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న
పౌరుల స్పందనలను ప్రత్యక్ష ప్రసారం చేయాలి)
5.
ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ ప్రకటనలు, అవాకులు
చవాకులులతో కూడిన స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6.
‘త్వంశు౦ఠ అంటే
త్వంశు౦ఠ’ అంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా గోష్టులను పదే
పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ‘ఉచిత
వినోదపు పన్ను’ రాబట్టాలి.
7.
సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే కుదుర్చుకోవాలి. ఎన్నికలు
ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకోసం
అవకాశవాద కూటముల ఏర్పాటును నిషేధించాలి.
గమనిక: ఇవి కేవలం తొలి
ఆలోచనలే. ఎన్నికల ఘడియ దగ్గర పడే లోగా వీటికి మరింత స్పష్టమయిన పటిష్టమయిన
రూపం ఇవ్వడంలో అంతా తలా ఓ చేయి వేయాలని మనవి.
NOTE: Courtesy Image Owner
లేబుళ్లు:
Voters' menifesto
4, జనవరి 2014, శనివారం
ఉచితానుచితాలు ఎరుగని ఉచితాలు
‘రాజకీయ
పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా
అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం చంపుకుంటారు.’ – విల్
రోగర్స్
“సుమతీ
శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు” ఇది
నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి
మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు
వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో
వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక, మండు
వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. కలర్ టీవీలు, లాప్
టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు
చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్
ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు
మాది తరహా హామీలు – ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో
దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న మేనిఫెస్టోలకు ఇక కాలం
చెల్లిందని అనుకోవాలేమో. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి
ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో
వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్
ప్రోఖో’ ఎత్తులకు సుప్రీం కోర్టు నిరుడు జులై లోనే లక్ష్మణ రేఖలు గీసింది.
వాగ్దానకర్ణుల
మాదిరిగా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు
ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి
వాడిని తిననిచ్చిందీ లేదు. ఎన్నికల కోయిల ఇంకా కూయకముందే వివిధ రాజకీయ పార్టీలు
చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు చూస్తుంటే అసలు మేనిఫెస్టోలో ఇంకెన్ని ఉంటాయో అన్న
భేతాళ ప్రశ్నకు సుప్రీం కోర్టు చెప్పిన సమాధానం అది.
అర్ధం పర్ధం లేకుండా
చేసే హామీలు ఇక కుదరవు కాక కుదరవు అని తేల్చి చెప్పింది.
తోక వాక్యం : అయినా
రాజకీయ పార్టీలు సుప్రీం నిరుడు తేల్చి చెప్పిన ‘లెక్క’ను లెక్క చేసేది లేదు అన్న
తరహాలోనే ముందుకు సాగుతున్నాయి.
NOTE: Courtesy Cartoonist
లేబుళ్లు:
ఆకాశం దించాలా నెలవంకను తుంచాలా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





