18, డిసెంబర్ 2013, బుధవారం

వయసు నవ్వింది


రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.
చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో  బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే.  బస్సెక్కి తుర్రున  వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె -  నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. మరో అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు  కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు.  టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు  పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల వూరొచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి  వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.
పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి. అరచేతి మందాన మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.  
రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్నగీత  గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు  నాగేశ్వర్రావులావుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు.  నవ్వుకోవడం నా వంతయింది.
రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు.  తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు.  కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. ‘నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క’ అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. ‘చూశారా నా స్పెషాలిటీ’ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని  చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.


చూస్తుండగానే రామారావుకు ఏళ్ళు మీదపడడం మొదలయింది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. అతికించినట్టు పెదాలపై   చిరునవ్వు. అయితే అందులో నాకు జీవం కనబడ్డం లేదు.
రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతున్నట్టు అనిపిస్తోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కావు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.
ఎందుకంటె నా పేరు ‘వయస్సు’ కనుక.
(Note: Courtesy Image Owner)

    

17, డిసెంబర్ 2013, మంగళవారం

బుడుగు


బుడుగు
“ఒరేయ్ బుడుగు కన్నా. నేను నీ నాన్ననుకదా. నువ్వు అల్లరి చేస్తే నాకు కోపం రావాలి కదా. వచ్చి బెత్తంతో గాట్టిగా కొట్టాననుకో. నీకూ ఉక్రోషం రావాలి కదా. అప్పుడు ఏం చేస్తావురా?”
“నువ్వు నాన్నగాడివికదా. కొట్టేస్తావ్. నేను చిన్న పెద్దోడిని కదా.నిన్నేమీ అనలేను కదా. అందుకని లెట్రిన్ లోకి వెళ్లి కమోడ్ శుభ్రం చేస్తాను.”
“అదేమిటి? కమోడ్ కడిగితే నీ కోపం తగ్గుతుందా.యెలా?”
“యెలా ఏమిటి యెలా. అదే మీ పెద్దోళ్ళకు మా చిన్నోళ్ళకు తేడా. నేను లెట్రిన్ కడిగేది నీ టూత్ బ్రష్ తో.”

బుడుగుని తీసుకుని వాళ్ల నాన్న ఆరోజు జూ పార్క్ కు వెళ్లాడు. బోనులో వున్న పులిని చూపించి అది ఎంత భయంకరమయిన జంతువో కొడుక్కుచెప్పసాగాడు. వున్నట్టుండి బుడుగు – పులి బయటకు వచ్చి నిన్ను తినేసింధనుకో. అప్పుడు ఇంటికి వెళ్ళడానికి నేను యే బస్సు ఎక్కాలి?”

బుడుగు స్కూలుకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు పిల్లలకు ట్రాఫిక్ పాఠాలు నేర్పిస్తున్నారు. బుడుగును పిలిచి ఏదయినా స్లోగన్ రాయమన్నారు. బుడుగు రాసిన స్లోగన్ ఇలా వుంది.
“ఇది స్కూలు జోన్. చిన్నపిల్లలు రోడ్డు దాటుతుంటారు. వాహనాలు వేగంగా నడిపి మమ్మల్ని చంపకండి. టీచర్లు వచ్చేదాకా ఆగండి”

బుడుగు స్కూల్లో అసెంబ్లీ జరుగుతోంది. పిల్లలు ఎవరిమట్టుకు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ప్రిన్సిపాల్ చెప్పేది ఎవరికీ వినబడడం లేదు. ఆయనకు చర్రున కోపం వచ్చింది.
“ఏమిటిది. స్కూలనుకున్నారా.మీ ఇల్లనుకున్నారా.వెధవలందరూ ఒకచోట చేరినట్టుంది. ఒకరి తరవాత ఒకరు మాట్లాడలేరా? ఆయ్!” అంటూ గయ్యిమన్నాడు.
బుడుగు లేచి అన్నాడు.
“సరే!ముందు మీరు మొదలు పెట్టండి”    

ఆశానిరాశేనా!


(ఇది నిరుడాఖరులో రాసింది. ఏవన్నా తేడా కనిపిస్తోందా కేలండరు మారడం తప్ప)
పదమూడయినా చూపదా మార్గం? – భండారు శ్రీనివాసరావు 
 
2012 వ సంవత్సరం అంచున నిలబడి ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ......
ఎన్ని వ్యాపకాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు
కొన్ని మధురం కొన్ని  మరికొన్ని వ్యధామధురం  
కొన్ని మరపురానివి మరికొన్ని మరచిపోవాలని అనుకునేవి
కొన్ని తీపి గురుతులు  కొన్ని చేదు గుళికలు
ఉగాది పచ్చడిలా కష్టసుఖాల సమ్మేళనమా అంటే కాదాయె
కొని తెచ్చుకున్న ఇక్కట్లు కొన్నయితే పైనబడ్డ ఇబ్బందులు మరి కొన్ని
కొన్ని ప్రకృతి ప్రకోపాలు  మరికొన్ని మనిషి స్వయంకృతాలు
కొన్ని స్వార్ధశక్తుల ప్రేరేపకాలు మరికొన్ని రాజకీయ  కుశ్చిత కుతంత్ర విషజనితాలు  
పులులు పంజాలు విసిరే చోట లేడికూనల దీనాలాపాలు
విష నాగులు సంచరించే వనంలో రెక్కలు విప్పుకుంటున్న శాంతి కపోతాలు
ఎవరి దోవ వారిదే ఎవరి యావ వారిదే
ఎవరి వాదన వారిదే ఎవరి రోదన వారిదే
ఎవరి గోల వారిదే ఎవరి లీల వారిదే  
ఒకరి మాట మరొకరికి ఎక్కదు
ఒకరి గోడు మరొకరికి పట్టదు
వివాదాల ముందు వివేచన తల వంచుకుంది
వాదప్రతివాదాల నడుమ హేతువు తల దించుకుంది  
పంతాలు పట్టింపుల హోరులో నోర్లు తెగబడ్డాయి, వూర్లు తగలడ్డాయి
నాలుకలు చీలిన  నాయకుల  ప్రేలాపనలతో బుల్లితెరలు చిల్లులు పడ్డాయి  
మాటల తూటాలతో మాధ్యమాలు దద్దరిల్లాయి
అమృతం కురవాల్సిన చోట విషం  ధారగా కారింది  
మంచితనం మనుగడే  ప్రశ్నార్ధకంగా మారింది
వాస్తవాలను ఎరుక పరచాల్సిన విజ్ఞులు తామూ  తానులో ముక్కలయ్యారు
మౌనంగా పరికిస్తున్న సామాన్యులు నోటమాట రాక అవాక్కయ్యారు    
యుగాంతం వదంతి నిజమయినా బాగుంటుందన్న భావన ప్రబలుతోంది.  
అయినా ఏదో ఆశ
మనిషిని బతికిస్తున్న ఆశ
నిరాశ నిస్పృహల  నడుమ జోగాడుతున్న ఆశ
మంచి రోజులు వస్తాయన్న ఆశ
మంచి కాలం ముందుందన్న ఆశ
తిట్టుకుంటున్న నోళ్ళు కట్టుబడతాయన్న ఆశ
కొట్టుకుంటున్న చేతులు కలుసుకుంటాయన్న ఆశ
జనాలను దోచుకుంటున్న   నాయకులు జనాలను కాచుకుంటారన్న ఆశ
ఈ ఆశ కొత్త ఏడాది రూపంలో ఎదుట నిలబడి వుంది
చెబుదాం దానికి స్వాగతం
కాలమే సమస్యలకు పరిష్కారం
రెండువేల పదమూడయినా చూపకపోతుందా  ఓ మార్గం

(30-12-2012)             

అప్పు 'పుట్టిన' రోజు

అప్పు పుట్టిన రోజులే కాని పుట్టిన రోజులు లేవన్నాడు ఓ కవి.


తెలుగు తిధులు, ఇంగ్లీష్ తారీఖుల పుణ్యమా అని ఏడాదికి రెండు సార్లు పుట్టినరోజు జరుపుకునే అదృష్టం కొందరికి పడుతుంది.  బోలెడు  బోలెడు వెనుకటి రోజుల్లో ఇళ్లల్లోనే మంత్రసానుల పుణ్యమా అని  పురుళ్ళూ పుణ్యాలు జరిగిపోతున్నప్పుడు, మాతామహులో,పితామహులో లేక వూళ్ళో వున్న సిద్ధాంతిగారో రాసిపెట్టిన కాగితం ముక్క ఆధారంగా పుట్టిన రోజులు జరుపుకునే వాళ్లు కొందరయితే, జనన మరణ దస్తావేజుల ప్రాతిపదికపై జన్మదినోత్సవాలు జరుపుకునే వారు మరికొందరు.     
మరికొందరు అదృష్టవంతులు కూడా వున్నారు. దేవుడు మేలు చేయకుండానే ముచ్చటగా మూడో  మారు కూడా హ్యాపీ బర్త్ డే గ్రీటింగులు ఏటేటా అందుకుంటూ వుంటారు. ఇప్పటికి షష్టి పూర్తి జరుపుకున్న వాళ్లల్లో  చాలామందికి చిన్నప్పుడు బళ్ళో వేసినప్పుడు   నమోదు చేసిన తేదీయే  అధికారికంగా పుట్టిన తేదీ అయికూర్చుంటుంది. స్కూలు ఫైనల్ నాటికి ఇంత వయస్సు వుండి  తీరాలనే నిబంధనకు అనుగుణంగా వేళ్ళమీద  అప్పటికప్పుడే  లెక్కలు వేసి అక్కడికక్కడే ఇస్కూలు రిజిస్టర్లలో   పుట్టిన తేదీ వేసే సంప్రదాయం కారణంగా కొందరికి ఈ అదృష్టం పడుతుంది.
అయితే ఈ అదృష్టాలు తెచ్చిపెట్టే ఇబ్బందులు కూడా వుంటాయి.
డెబ్బయ్యవ దశకంలో నేను ఆంధ్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు అక్కడ గ్రూపు ఇన్స్యూరెన్సు చేసే పెద్దమనిషి వచ్చి నా చేత భీమా చేయించుకుని వెళ్లాడు. తన దగ్గర బీమా చేయించున్నవాళ్లకు తన రికార్డుల్లో వున్న తేదీల ప్రకారం ప్రతియేటా క్రమం తప్పకుండా  ఓ పోస్ట్ కార్దుమీద గ్రీటింగ్ పంపడం ఆయనకు అలవాటు. అటు ఆంధ్ర జ్యోతికీ,ఇటు  భీమా కిస్తీలకీ సైతం  నీళ్ళు వొదిలి హైదరాబాదు రేడియోలో చేరిన తరువాత కూడా ఆయన గారు పంపే జన్మదిన శుభాకాంక్షల సందేశం ప్రతియేటా ఠంచనుగా డిసెంబర్ పదిహేను నాడు మా ఆఫీసుకు చేరేది. కార్డు ముక్క కావడం వల్ల ఆ ముక్క నలుగురికీ ఎంచక్కా తెలిసిపోయేది. నా పుట్టిన రోజు ఈ రోజు కాదు మొర్రో అని సర్ది చెప్పలేక తల ప్రాణం తోకలోకి వచ్చేది.
ఇప్పుడు మళ్ళీ నెట్లూ నెట్లాగుల పుణ్యమా అని పొద్దుపొడవక ముందే  పొద్దున్న పొద్దున్నే నెట్లో అందుకునే శుభాకాంక్షలకు ‘థాంక్ యూ  వెరీ మచ్’ లు చెప్పుకోవాల్సివస్తోంది.  ఎస్ ఎం ఎస్ లకు జవాబు ఇవాల్సివస్తోంది.
అదేదో ఇంగ్లీష్ సామెత మాదిరిగా తప్పనిసరి అయినప్పుడు ఆనందించమన్నట్టు అందుకుంటున్నది అభినందనలేగా కిమ్మనకుండా అవునంటే పోలా!
అందుకని మిత్రులారా! విష్ మీ హ్యాపీ బర్త్ డే టుడే. మళ్ళీ ఆగస్ట్ ఏడవ తేదీన కూడా మరచిపోకండేం! (15-12-2013)

దేవతలు - వ్యక్తిత్వ వికాసం


భక్తి టీవీ ఛానల్ లో పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ చక్కని ముక్కలు చెప్పారు.


(పరిపూర్ణానందస్వామి)

"శ్రీ దేవి అంటే లక్ష్మీదేవి. సకల సంపదలు అనుగ్రహించే దేవత. భూదేవి అంటే భూమాత. చరాస్తికి ప్రతిరూపం శ్రీదేవి. స్తిరాస్తికి సంకేతం భూదేవి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ ఇద్దరు దేవేరులను తన వక్షస్థలంపై కుడి ఎడమల  ప్రతిష్టించుకున్నాడు. తనను దర్సించ వచ్చే భక్తులకు   భౌతిక సుఖాలకు నెలవయిన ఈ ఇద్దరినీ కాకుండా   వామ హస్తంతో తన  పాదాలను చూపిస్తుంటాడు. చరాస్తులు, స్తిరాస్తులు ప్రధానం కాదు మనిషి అనేవాడు తన సొంత ప్రతిభతో  సొంత కాళ్ళపై నిలబడాలని  వ్యక్తిత్వ వికాస బోధకులు ప్రబోధించే సూత్రాన్ని స్వామి ఆ విధంగా భక్తులకు బోధిస్తున్నాడన్న మాట.
"ఇక పరమేశ్వరుడిని తీసుకుంటే ఆయన వొంటిపై అన్నీ పాములే. ఒక సర్పాన్ని చూస్తేనే వొళ్ళు జలదరిస్తూ వుంటుంది. అలాటిది అన్ని నాగుపాములను ధరించి కూడా శాంత మనస్కుడిగా వుండగలగడానికి కారణం ఆయన సిగలో నెలవయిన గంగమ్మ తల్లి. అన్నిరకాల ఉద్రికతలను ఉపశమింపచేయడానికి మెదడును ఎల్లప్పుడు చల్లగా, ప్రశాంతంగా  వుంచుకోవాలని చెప్పడమే శివతత్వం.
"పోతే కృష్ణుడు. గోవులను కాచే గోపాలకుడు. గోవర్ధన గిరిధారి. హిందీలో గోవర్  అంటే గోమయము. (ఆవు పేడ) ధన్ అంటే ధనము. ఒక్క ఆవుపేడతో కొన్ని ఎకరాల భూమిని సారవంతం చేయడానికి వీలుపడుతుంది. సారవంతమయిన పొలంలో పంటలు బాగా పండుతాయి. దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వుంటుంది. ఆహారానికి కొరత వుండదు. అలా  సస్యశ్యామలమయిన పల్లెటూళ్ళే దేశానికి ఆయువుపట్లు."
ఇలా హిందూ దేవతలనుంచి వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే మంచి విషయాలను నేర్చుకోవచ్చని పరిపూర్ణానందస్వామివారు వాకృచ్చారు.

ఎవరు చెప్పినా మంచి మాటలు నాలుగు చెవిన వేసుకోవడం మంచిదే కదా!

16, డిసెంబర్ 2013, సోమవారం

పసిడి పలుకులు



ఒకడు ఏకంగా జీవితాన్నే అడిగాడు యెందుకు ఇన్ని ఇబ్బందులు పెడతావని.
జీవితం నవ్వి బదులు చెప్పింది.
‘అదేమరి. ఇన్ని ఇబ్బందులు పెడుతుంటూవుంటేనే  మీ మనుషులు  ఇంతగా ఎగిరెగిరి పడుతున్నారు. అవి కూడా లేకపోతే మిమ్మల్ని పట్టేవారెవరుంటారు?’  

‘ఇతరులు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంటే వాళ్లని క్షమించి వొదిలేయండి. వాళ్లు క్షమార్హులని కాదు చెప్పేది. మీకు కూడా మనశ్శాంతి అవసరం కదా!’

‘ఒక నమ్మలేని నిజం చెప్పమంటారా!
‘మన శరీరంలో మూడొంతులు పైగా నీరే వుంటుందని అంటారు. కాని డెబ్బ తగిలితే నీరు రాదు రక్తం స్రవిస్తుంది. గుండె నిండా నెత్తురు వుంటుంది. కానీ హృదయానికి  బాధ కలిగితే నెత్తురు రాదు. కంటి వెంట నీరు కారుతుంది’   

‘పూలుపరచిన పక్క మీద పడుకుంటే అది మొదటి రాత్రి

అవే పూలు మనమీద పరచుకుంటే అది జీవితానికి చివరి రాత్రి’

అద్వైతం


తెలుగులో నాకున్న కొద్దిపాటి  పాండిత్యం నలుగురిలో నాకొక పెద్ద  గుర్తింపు తెచ్చిపెట్టింది. నిజానికి నా తెలుగు అంతంత మాత్రమే. కానీ ఏమీ లేనిచోట ఆముదపు మొక్క మాదిరిగా అమెరికాలో నేనొక తెలుగు పండితుడన్న పేరు తెచ్చుకోవడానికి అది అడ్డం కాలేదు. చిన్నప్పుడు అప్పయ్య మాస్టారు బట్టీ వేయించిన తెలుగు పద్యాలనే కాస్త అటూ ఇటూ తిప్పి సందర్భం అసందర్భం అని చూసుకోకుండా అందరి నడుమ   ప్రయోగించే నా తెంపరితనాన్ని  నలుగురు నాలుగు రకాలుగా మెచ్చుకుంటూ వుండడంతో తెలుగు పండితుడన్న బిరుదు, దేశం కాని దేశంలో నాకు  స్తిరపడిపోయింది. దానితో ఆటా, తానా సభల్లో నేను ఆడింది ఆట పాడింది పద్యం అయిపోయింది.
అసలే ఎన్.ఆర్.ఐ. అనే మూడక్షరాలే  నా వొంట్లో పొగరును బాగా పెంచాయి. వీటికి తోడు ఈ మధ్య గ్రీన్ కార్డుఅనేది మరొకటి జత కలిసింది. ఇంకేముంది అసలే కోతి, కల్లు తాగింది కధలో మాదిరిరిగా పొగరుకు విగర్తోడయింది. ఇండియా వచ్చినప్పుడల్లా తెలుగు పుస్తకాలు భారీగా కొనుక్కుని వెళ్లి  అమెరికాలో తెలుగువారికి  పంచి పెడుతూ నా పేరును సార్ధకం చేసుకునే కొత్త భారాన్ని నెత్తికెత్తుకునేలాచేసింది.
ఈ సొంత గోల ఆపి అసలు విషయానికి వస్తాను.
ఈ మధ్య ఇండియా వచ్చి తిరిగివెళ్ళబోయేముందు తెలుగు పుస్తకాలు కొందామని వెళ్లాను. నేను అంతకు ముందు ఆ షాపుకు వెళ్ళలేదు. చాలా పెద్ద దుకాణం. కొనేవారికి సాయపడేందుకు సహాయకులను కూడా పెట్టారు. నాకు సాయంగా వచ్చిన అమ్మాయికి ఇరవై లోపే వయసు.  అందవికారంగా వుంది. వేసుకున్న దుస్తులు కూడా ఆమెకు నప్పలేదు. అసలే చింపిరి జుట్టు,  సరిగా దువ్వుకోకుండా ముడేసుకుంది.
మీరు ఏరకమైన పుస్తకాలు ఇష్టపడతారని మామూలుగా  అడిగింది. ఆమె ముందు నా పాండిత్యం వొలకబోయాలన్న దుర్బుద్ధి కలగడంతో  అద్వైతం గురించిన గ్రంధాలేమయినా వున్నాయా వుంటే చూపించుఅన్నాను, నిజానికి ద్వైతాద్వైతాలగురించి నాకు ఎలాటి  అవగాహన లేకపోయినా. అడిగినదే తడవుగా ఆ అమ్మాయి కొన్ని గ్రంధాలు తీసి చూపించింది.
నా తెలివిని మరింత ప్రదర్శించడానికి అద్వైతం అంటే నీకు ఏమాత్రం తెలుసు. పురాణ వాజ్మయంలో నీకున్న అవగాహన ఏపాటిది?’ అని అడిగాను.
ఆ ఆమ్మాయి చెప్పిన జవాబుతో నా కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. నా అజ్ఞానం ఏస్థాయిలో వున్నదో  అర్ధం అయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు  అద్వైతాక్షర మాలిక అనే అనువాద గ్రంధాన్ని 2003 లో  ప్రచురించారు. భాగవతుల కుటుంబరావు గారు అనువాదం చేశారు. గ్రంధ సంపాదకులు పుల్లెల రామచంద్రుడు గారు. చూస్తుంటే  అద్వైతం పట్ల మీకు ఆసక్తి వున్నట్టుంది. వ్యవధానం వున్నట్టయితే  కొన్ని విషయాలు చెబుతాను.
చాలా సంవత్సరాలకిందట కొందరు పండితులు సంస్కృతంలో 51  వ్యాసాలు   రాశారు.  1945 లో   కుంభకోణంలో జరిగిన అద్వైత సభ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర స్వామి వారి ఆశీస్సులతో ఈ గ్రంధాన్ని ప్రచురించారు.  
పోతే, పురాణ వాజ్మయం గురించి అడిగారు కదా. వేదవ్యాసులవారు తొలుత బ్రహ్మ నుంచి వేదాలను గ్రహించారు. వాటిని నాలుగు భాగాలుగా విభజించి తన శిష్యులయిన పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఉపదేశించారు. వారు వారి శిష్యులకు, వారు తమ అనుయాయులకు పరంపరగా అందించారు.
ఇక వేదాల విషయంలో కూడా మన తెలుగు పండితులు విశేష కృషి చేశారు. సంస్కృతంలో వ్యాస విరచిత వేద వాజ్మయాన్ని దాశరధి రంగాచార్య గారు 70 ఏళ్ళ వయస్సులో అయిదు వేల  పేజీల్లో  తెలుగులోకి అనువదించారు.  ఇందులో ఒక భాగమయిన శుక్ల యజుర్వేదాన్ని ఎమెస్కో ఆర్షభారతి వారు రెండువేల సంవత్సరంలో ఆవిష్కరించారు.  
వేద వాజ్మయాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు సాయణాచార్యుడి ప్రసక్తి అనివార్యం. ఎందుకంటే ఆయన అచ్చ తెలుగువాడు. భారద్వాజగోత్రుడు. అనేక ప్రకాండులను సమకూర్చుకుని అనేకమయిన వేద వ్యాఖ్యానాలు రచించాడు.
సాయణాచార్యులవారు మరికొన్నింటికి కూడా వ్యాఖ్యలు రాశారు.
తైత్తిరేయ బ్రాహ్మణము,  ఆర్షేయ బ్రాహ్మణము, దేవాధ్యాయ బ్రాహ్మణము, ఉపనిషద్ బ్రాహ్మణము, సంహితోపనిషద్ బ్రాహ్మణము  వీటిల్లో ముఖ్యమయినవి.
ఈ గ్రంధాల్లో కొన్ని దొరుకుతున్నాయి. కొన్ని లభ్యం కావడం లేదు. ఆదరించేవారు తక్కువ కావడం ప్రధాన కారణం. అమెరికాలో వుంటూ కూడా ఇలాటి ప్రాచీన భారతీయ  సాహిత్యం  పట్ల మీవంటి వారు చూపుతున్న ఆసక్తే, చనిపోతున్న ఈ సాహిత్యాన్ని  బతికించాలి.
అప్పటికే సిగ్గుతో సగం చచ్చిపోయి వున్నానేమో ఆ అమ్మాయి మాటలకు ఏం జవాబు చెప్పగలనో మీరే చెప్పండి.


గమనిక: పుస్తక ప్రేమికులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు ఇంగ్లీష్ లో వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి రాసిన ఓ అద్భుత వ్యాసాన్ని నాకు మెయిల్లో పంపారు. తమిళనాడు నేపధ్యంలో సాగిన రూపొందిన రచన అది. తెలుగు వాతావరణానికి అనుగుణంగా కొన్ని మార్పులను చేసి ఆ వ్యాస భావం చెడకుండా రాయడానికి చేసిన ప్రయత్నం ఇది. భండారు శ్రీనివాసరావు