15, డిసెంబర్ 2013, ఆదివారం

ఇలా కూడా జరుగుతుందా?



(శ్రీమతి పింగిలి ప్రేమ కుమారి)

పది  రోజులక్రితం హైదరాబాదులో ఇల్లిల్లూ తిరిగి చుట్టపక్కాలను పలకరించింది. మూడు వారాలక్రితం పుణే నుంచి  హైదరాబాదులో విమానంలో దిగి నేరుగా ఆసుపత్రికి వచ్చి మా ఆవిడను చూసివెళ్ళింది. ఆమె ఈరోజు లేదు.

చివరి శ్వాస వరకు అందరితో పాటే ప్రేమక్కయ్య వున్న  ఆసుపత్రిలో వున్నాను.  అందరితోపాటే ఈ రోజు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నాను. కానీ ఇంట్లో చెప్పలేని పరిస్తితి. చెప్పుకోలేని పరిస్తితి. ‘ప్రేమ వొదినె గారు ఎలావున్నారు’ అని నిన్నగాక మొన్న ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయిన మా ఆవిడ అడుగుతుంటే ‘బాగానే వుంది’ అని అబద్ధం చెప్పాల్సివస్తోంది. నిజంగా ఈ అబద్ధం నిజం అయితే యెంత బాగుంటుందో కదా!

14, డిసెంబర్ 2013, శనివారం

అచ్చంగా నా గొడవ

    
దాదాపు మూడువారాల తరువాత మా ఆవిడకు బెయిల్ దొరికింది. అదీ షరతులతో కూడిన బెయిల్.
ఇన్నాళ్ళు ఆసుపత్రిలో వున్నది చాల లేదట. రెండు మూడు రోజులకోమారయినా వచ్చివెడుతుండాలట. ఇంట్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా వుండాలట. వైద్యమా మజాకా మరి.
మా ఆవిడ గుండె మంచిదని తెలిసిన వాళ్లందరూ అంటుంటారు. మంచిదే కాదు గట్టిది కూడా అని ఆ గుండెకు  రెండుసార్లు ఆపరేషన్లు చేసిన డాక్టర్లు చెబుతుంటారు. పాతికేళ్ళ వయస్సులో ఓ ఆపరేషన్ మళ్ళీ మరో పాతిక ముప్పయ్యేళ్ళు  గడిచిన తరువాత మళ్ళీ అదే గుండెకు  ఇంకో ఆపరేషన్. ఇంతెందుకు మొన్నటికి మొన్న ఆసుపత్రిలో మా గోలలో మేముంటే – 1989లో అదే ఆసుపత్రిలో  ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన డాక్టరు సీతారామారెడ్డి గారు వచ్చి చూసి వెళ్ళడమే కాదు మిగిలిన డాక్టర్లకు  చూపించి ‘ఈవిడకే  నేను ఆ రోజుల్లో గుండె ఆపరేషన్ చేసాను. గుండెకు ఆపరేషన్ అంటే గుండె ఆగిపోయే రోజుల్లో ఈవిడ ధైర్యంగా చేయించుకుంది. అది సక్సెస్ కావడానికి ఈవిడ గుండె ధైర్యం కూడా కొంత కారణం’ అని చెప్పుకుంటుంటే పెద్ద కష్టం నుంచి బయటపడిన నాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుని సంబరపడాలో, లేక నేటి గడ్డు పరిస్తితి  గురించి బాధపడాలో అర్ధం కాలేదు.       
ఈ ఇరవై  రోజులు నిజానికి మా జీవితాల్లో కఠిన పరీక్షాకాలం. పరీక్షల్లో నెగ్గడం మాట అటుంచినా కాస్తోకూస్తో  నిగ్గుదేలడానికి అవకాశం వుంటుంది. ఇన్ని రకాల వైద్య పరీక్షలు వుంటాయా అన్నట్టు అన్ని రకాల పరీక్షలు ఎన్నో రకాలుగా  చేశారు. వొంట్లో రక్తం పరీక్షలకే అన్నట్టు గుచ్చి గుచ్చి తీశారు. యాభయ్ ఏళ్ళ పైచిలుకు జీవితంలో సొంత  సంతానాన్ని సాకినట్టే షుగరు, బీపీ, గుండె జబ్బుల్ని జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తోందేమో అవి కూడా ‘గుడి పదిలం’ అన్న పద్ధతిలో వొంట్లో  సెటిల్ అయిపోయాయి. ఇన్నింటిని సంభాలించుకుంటూ డాక్టర్లు వైద్యం చేయాల్సిన పరిస్తితి. ఈ స్తితికి రావడానికి ఆమె యెంత బాధ్యురాలో తెలియదు కాని నా బాధ్యతారాహిత్యం మాత్రం కొండంత వుంది. బాధ్యతల్నీ బరువుల్నీ ఆమెకు వొదిలేసి నా మానాన నేను టీవీలు చర్చలు అంటూ తిరగడం పరిస్తితి ఇలా దిగజారడానికి కారణం అని ఏ భేషజం లేకుండా వొప్పుకోవాల్సిన వాస్తవం. అందుకే జరిగినది తలచుకుంటూ, జరుగుతున్నది చూస్తూ  ఈ క్రమంలో నన్ను నేను ఎన్నోసార్లు  తిట్టుకున్నాను. గింజుకున్నాను. గుంజుకున్నాను. అన్నీ అయిపోయి  ఇదిగో ఇప్పుడిలా బెయిళ్లు, షరతులు అంటూ  అడ్డమయిన జోకులు పేలుస్తున్నాను. నన్ను నేను సముదాయించుకోవడానికి నాకు దొరికిన సులభ మార్గం ఇదేనేమో!
పద్దెనిమిది రోజులక్రితం షుగర్  పరీక్ష చేయించుకుని అటునుంచి అటే హోటల్లో టిఫిన్లు చేసి ఇంటికి వద్దామని ఆస్పత్రికి ఉదయాన్నే వెళ్ళిన వాళ్ళం – అటునుంచి అటే ఆమెను  ఐ.సీ.యూ.కి తీసుకువెడుతుంటే కలో నిజమో తెలియక  కళ్ళప్పగించి చూసిన వాళ్ళం – మొత్తానికి ఇంటికి చేరాం. ఇక్కడా మార్పే. అమ్మకు బాగాలేదని తెలిసి  అమెరికానుంచి వచ్చిన మా పెద్దవాడు సందీప్, రెండోవాడు సంతోష్ కలిసి ఈ మూడు వారాల్లోపే  కావూరి హిల్స్ లో కొత్త అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుకోవడం, సామాను మార్చడం, సదరడం అన్నీ కలలోలాగా జరిగిపోయాయి.
ఆసుపత్రి నుంచి నేరుగా కొత్త ఇంట్లో ‘గృహ ప్రవేశం’. 1975లో హైదరాబాదులో ఆకాశవాణిలో చేరినప్పుడు చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆ పిమ్మట మాస్కో, తరువాత పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రమంజిల్, ఎల్లారెడ్డి గూడాల మీదుగా ఇదిగో ఇప్పుడు కావూరి హిల్స్ ఇలా కదులుకుంటూ వస్తున్నాం.  
నిజమే కదా!  చలనం లేకపోతే జీవితమే లేదు.

(14-12-2013)

12, డిసెంబర్ 2013, గురువారం

అసెంబ్లీ అప్పుడూ ఇప్పుడూ


శాసన సభ సమావేశాలు రిపోర్ట్ చేయడానికి రేడియో విలేకరిగా తొలిసారి అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలోకి అడుగుపెట్టి 38 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు అసెంబ్లీ పాత భవనంలో వుండేది. అందులోని  ప్రెస్ గ్యాలరీ చాలా చిన్నది. చెక్క మెట్లెక్కి అందులోకి వెళ్ళే వాళ్ళం. సర్దుకుని కూర్చుంటే ఓ పాతిక మందికి సరిపోతుంది. సభా భవనంలో సభ్యుల సీట్లు సినిమా హాళ్ళలో మాదిరిగా కింద నుంచి పైకి అంచెలంచెలుగా వుండేవి కాబట్టి వారు కూర్చునే చివరి వరుసకూ, మా గ్యాలరీకి నడుమ ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా వుండేది. కొండొకచో – వెనుక వరుస సభ్యులు తలలు వెనక్కి తిప్పి జర్నలిష్టులతో గుసగుసలాడడం – సభాపతి గమనిస్తున్నారని తెలియగానే బుద్దిమంతుల మాదిరిగా సర్దుకోవడం- నిజంగా అవో తమాషా రోజులు.
ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో పేజీల సంఖ్య తక్కువ. ఒకటి రెండు మినహాయిస్తే – మిగిలిన అన్ని దిన పత్రికలు విజయవాడ నుంచే వెలువడేవి. తెలుగు పత్రికల రాజధానిగా బెజవాడకు పేరుండేది.
అసెంబ్లీ వార్తలయినా, మరో వార్త అయినా హైదరాబాదు నుంచి బెజవాడ పంపాలంటే టెలెక్స్, టెలి ప్రింటర్ లే శరణ్యం. డెడ్ లైన్ దాటిన తరువాత వార్త   పంపాలంటే విలేకరులు ట్రంకాల్ బుక్ చేసి చెప్పాల్సిందే. అంతకు కొన్నేళ్ళ క్రితం నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్  ఎడిటర్ గా పనిచేసేటప్పుడు హైదరాబాదు నుంచి జ్యోతి విలేకరులు శ్రీ జి. రామారావు, శ్రీ ఆదిరాజు వేంకటేశ్వరరావు, శ్రీ ఎన్. ఇన్నయ్య ప్రభ్రుతులు ఫోనులో చెప్పే వార్తలు రాసుకున్న అనుభవం నాకుంది. ఎడిషన్ గడువు లోగా వార్త పంపితేనే మర్నాడు పేపర్లో వచ్చేది. లేకపోతే మరో రోజు వరకు దానికి మోక్షం దొరికేది కాదు. అలాగే రేడియో వార్తలకు కూడా సమయ పరిమితులు వుండేవి.
సభలో ఏం జరిగిందో సవివరంగా అదేరోజు తెలుసుకోవాలంటే వున్న ఏకైక వెసులుబాటు రేడియోలో ప్రసారం అయ్యే అసెంబ్లీ సమీక్ష. సమావేశాలు జరిగే రోజుల్లో రాత్రి 7.45 గంటలకు ఈ కార్యక్రమం పదిహేను  నిమిషాల పాటు సాగేది. పల్లెటూళ్ళలో పంచాయతీ రేడియోల ద్వారా వినడానికి జనాలు గుమికూడేవారు. హైదరాబాదు లోని న్యూ ఎం.ఎల్. యే. క్వార్టర్స్ లో మైకులు ఏర్పాటుచేసి వినిపించేవారు. ఆ సమీక్షలు రాసే బాధ్యతను కూడా పత్రికల్లో పనిచేసే సీనియర్ జర్నలిష్టులకు ఒప్పగించేవారు. ఇప్పుడు ప్రధాన పత్రికలకు ఎడిటర్లుగా వున్న వారిలో చాలా మంది ఆ రోజుల్లో రేడియోకోసం అసెంబ్లీ సమీక్షలు రాసేవారు. ఏమాత్రం తభావతు వచ్చినా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వచ్చే ప్రమాదం వున్నందున – ఆ  సమీక్షలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి కానీ రికార్డింగు కు  అనుమతించడం జరిగేది కాదు.  సభలో చర్చల సందర్భంలో వాడిన వ్యంగాస్త్రాలు రేడియో సమీక్షలో వచ్చాయో లేదో తెలుసుకోవడానికి సీనియర్ శాసన సభ్యులు అనేకమంది ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేవారు.
మరునాడు కలిసినప్పుడు చెప్పేవారు. శాసన సభ వ్యవహారాలను గురించి వార్తలు రాసే పత్రికల వారు కూడా ముందు తమలో తాము చర్చించుకుని కానీ వార్త రాసేవారు కాదు. యేది రాయాలో యేది రాయకూడదో ఆలోచించుకుని రాసేవారు. అసెంబ్లీ  రిపోర్టింగ్ ను విలేకరులు గొప్ప విషయంగా భావించేవారు. సహజంగా ఇలాటి భావన బాధ్యతని పెంచుతుంది. వక్రీకరణలకు అవకాశం తగ్గుతుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పత్రికా రంగంలో ‘కదలిక’ మొదలయింది. విజయవాడ కేంద్రంగా వెలువడుతున్న పత్రికలన్నీ క్రమేపీ  తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదుకు మార్చుకున్నాయి. అప్పట్లో చిన్న చిన్న గదుల్లో న్యూస్ బ్యూరోలు నిర్వహించిన పత్రికలు రాజధానిలో ఏకంగా సొంత భవనాలనే ఏర్పాటు చేసుకున్నాయి. ఆంధ్ర జ్యోతి బ్యూరో సచివాలయం పాత గేటుకు ఎదురుగా వున్న మేడ మీద వుండేది. హిందూ పత్రిక బ్యూరో హిమాయత్ నగర్ లో చిన్న వాటాలో పనిచేసేది. అలాగే  మిగిలిన పత్రికల వాళ్లు.
కొన్నాళ్ళకు ఆంధ్రపత్రిక కార్యాలయాన్ని బషీర్ బాగ్ లో ప్రస్తుతం  లోకాయుక్త కార్యాలయం వున్న పెద్ద  భవనానికి తరలించారు. పత్రిక బ్యూరోలో శ్రీయుతులు ముక్కు శర్మ, ఎం ఎస్.శర్మ, పాపయ్య శాస్త్రి, రత్నం, కె.వేణుగోపాల్, విద్యారణ్య ప్రభ్రుతులు పనిచేసేవారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడు లో ఆయన్ని సమర్ధిస్తూ వార్తలు రాసారన్న అనుమానంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ భవనం నుంచి ఆంధ్ర పత్రిక కార్యాలయాన్ని ఖాళీ చేయించిందని ఆ రోజుల్లో చెప్పుకునే వారు. కారణాలు ఏమయినా ఆ తరువాతి కాలంలో యాజమాన్యాలు మారి ఒకప్పుడు తెలుగు పత్రికల్లో తలమానికంగా వెలుగొందిన ఆంధ్ర పత్రిక కాలగర్భంలో కలిసిపోయింది.
ఇక శాసన సభ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో అనేక కొత్త పత్రికలు పురుడుపోసుకున్నాయి. పాతపత్రికల యాజమాన్యాలు మారిపోయాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసాయి. అసెంబ్లీ ప్రత్యక్ష  ప్రసారాలు మొదలయ్యాయి. దానితో రికార్డులనుంచి తొలగించడం అన్న నిబంధన కాగితాలకే పరిమితమయిపోయింది. హక్కుల ఉల్లంఘన గురించి  పట్టించుకునే వ్యవధానం లేకుండా పోయింది. సభలో కంటే సభ బయట అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద సభ్యుల హడావిడి పెరిగింది. అర్ధవంతమయిన చర్చలు సరే అసలు సభ సజావుగా కొద్ది గంటల పాటు నడిచినా ఒక వార్తగా చెప్పుకునే రోజులు వచ్చాయి.


(కొత్త అసెంబ్లీ హాలు) 

అసెంబ్లీ పాత భవనం నుంచి కొత్త భవనానికి మారింది. ఆ కొత్త భవనానికి కూడా కొత్తగా మరిన్ని రంగులు హంగులు సమకూర్చారు. కొత్త కుర్చీలు, కొత్త తివాసీలు, పూలకుండీలతో భవనం రూపురేఖావిలాసాలు మారాయి. కానీ, సభ జరిగే తీరులో మార్పులేదు. మరోసారి వాయిదా వేయడం కోసం సభ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతోంది. ఈ వాయిదాల సమావేశాలు చూసేవారికి విరక్తి పుడుతోంది. ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి తగ్గుతోంది. ఇది నిష్టుర నిజం. శాసనకర్తలే ఈ మంచి చెడులకు కర్తలుగా మిగులుతారు. (21-02-2012)

అసెంబ్లీ అప్పుడు – ఇప్పుడు


1976
ఉదయం ఎనిమిదిన్నర.
ఆనరబుల్ స్పీకర్అనే ప్రకటనతో పాటు స్పీకర్ ఆసనం వెనుక తలుపు తెరుచుకునేది. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో సహా నిండు సభలో వున్నవారందరూ గౌరవపురస్సరంగా లేచి నిలబడి అభివాదం చేస్తుండగా, స్పీకర్ ప్రవేశించి సభకు నమస్కారం చేసి  తన స్థానంలో ఆసీనులయ్యేవారు.
వెనువెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయ్యేది. సుమారు గంట సేపు సాగాల్సిన ఈ కార్యక్రమం కొండొకచో కాస్త ఆలశ్యం అయ్యేది. ఆ మాత్రానికే స్పీకర్ అసహనం తెలియచేస్తూ నిర్దేశిత ఎజెండా ప్రకారం కార్యక్రమం జరిగేలా చూడడానికి తాపత్రయపడేవారు. ఆ తరువాత జీరో అవర్. ఈ సమయంలో సభ్యులు ఎవరయినా సరే,  ముందుగా సభాపతికి తెలియచేయకుండానే తాము అత్యవసరం అనుకున్న  అంశాలను సభ దృష్టికి తేవడానికి అవకాశం వుంటుంది. సంబంధిత మంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం వుండదు. అయినా కాని, కొందరు మంత్రులు అప్పటికప్పుడే జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తుండేవారు. ఆ తరువాత కొన్ని నిబంధలకింద సభ్యులు ఇచ్చిన నోటీసులపై చర్చ, వాటికి సంబంధిత మంత్రుల సమాధానాలు, అప్పుడప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మంత్రులకు మద్దతుగా ఇచ్చే మరికొన్ని వివరణలు ఇలా సాగిపోయేది. మధ్యలో టీ విరామసమయం. మళ్ళీ సభ సమావేశమై ఎజెండాలోని ఇతర కార్యక్రమాలను చేపట్టడం, మధ్యాహ్నం ఒకటిన్నర కాగానే సభను మరునాటికి వాయిదా వేయడం అంతా నియమానుసారంగా జరిగిపోయేది. సభాకార్యక్రమాలను కవర్ చేయడానికి ఆయా పత్రికల వాళ్లు తమ విలేఖరులకు తగిన సమయాలను కేటాయించడానికి కూడా వీలుండేది. అంటే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఒకరికి, మిగిలిన కార్యక్రమాలు వేరే విలేఖరులకు అప్పగించేవారు. వీరుకాకుండా లాబీల్లో జరిగే వ్యవహారాలను ఓ కంట గమనించడానికి విడిగా బ్యూరో చీఫ్ లు వచ్చేవాళ్ళు. అప్పట్లో టీవీ ఛానళ్ళు లేకపోవడం వల్ల మీడియా పాయింటు అంటూ వుండేది కాదు. పత్రికలకు అన్ని అంశాలు వివరంగా ఇవ్వాల్సిన అవసరం వుండడం వల్ల ఇద్దరు ముగ్గురు ఒక్కో పత్రిక నుంచి వచ్చేవాళ్ళు. రేడియోకి అంత సమాచారం అవసరం లేదు కాని ఇచ్చిన సమాచారంలో ఏమాత్రం తభావతు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఎక్కువ. ఏమాత్రం తేడా పాళా వచ్చినా పరిణామాలు చాలా తీవ్రంగా వుండేవి.


(అసెంబ్లీ పాత భవనం)

ఇక ఇప్పుడో అంతా ఇళ్ళల్లో కూర్చుని చూస్తూనే వున్నారు.

స్పీకర్ గంట  కొట్టినట్టు సమయానికి సభలో ప్రవేశిస్తారు. ముందు వాక్యంలో రాసినట్టే అంతా యధావిధిగా జరుగుతుంది, ఒక్క సభలో హాజరు మినహా. తరువాత స్పీకర్ వివిధ పార్టీల వాళ్లు ఇచ్చిన వాయిదా తీర్మానాలను వరసపెట్టి చదువుతారు. ఒక్కో పార్టీ ఒక్కో అంశంపై తీర్మానం నోటీసు ఇస్తుంది. అవన్నీ చదివి, వాటిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటిస్తారు. అంతే!  అన్ని పార్టీల వాళ్లు ఈ ఒక్క విషయంలో ఏకమవుతారు. పోడియం చుట్టుముట్టి నినాదాలు మొదలు పెడతారు. సభలో అంతంత మాత్రంగా వున్న మంత్రులు, ఇతర సభ్యులు చోద్యం చూస్తుంటారు. సభ్యులను తమ స్థానాలకు వెళ్ళాల్సిందని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేస్తారు. ఎవ్వరూ పట్టించుకున్న దాఖలా కనబడదు. దాంతో స్పీకర్ విధి లేక ఓ పదినిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి తన చాంబర్ కు వెళ్ళిపోతారు. పేరుకు పదినిమిషాలే అయినా, ఓ గంటకో, మరో గంటకో సభ మళ్ళీ సమావేశం అవుతుంది. సీన్ రిపీట్.
ఈ లోగా సభ వెలుపల వున్న మీడియా పాయింటు వద్ద వివిధ పార్టీల నాయకులు వరసలు కట్టి వరస వెంబడి తమ వాదనలు వినిపిస్తారు. అన్ని చానళ్ళు తమ వీలునుబట్టి వాటిని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటాయి.
ఇదే  వరస, ఇదే కధ మరునాడు, ఆ మర్నాడు.

అడిగేవాడు లేకపోవడం అంటే ఇదేనేమో!

వానాకాలం చదువులకన్నా 'అన్నాయం'



మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి
మళ్ళీ మళ్ళీ వాయిదాలు పడడానికి కాబోలు.


11, డిసెంబర్ 2013, బుధవారం

అరవైలో ఇరవై రావాలంటే


పల్లెటూళ్ళకో, అడవులకో వెళ్ళినప్పుడు చూడండి. వందేళ్ళు దాటిన చెట్లు వేల సంఖ్యలో కానవస్తాయి. కానీ నూరేళ్ళు నిండిన మనుషులు మాత్రం నూటికో కోటికో ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తారు. అంటే ఏమిటన్నమాట. మనిషికి నూరేళ్ళ జీవితం అని రాసిపెట్టి వున్నా ఎక్కువమంది బతికేది మాత్రం ఎక్కువలో ఎక్కువ ఎనభై తొంభయ్ ఏళ్ళే! కాబట్టి అరవై దాటగానే మొదటి బెల్లు కొట్టినట్టు అనుకోవాలి. మరో పదిహేను ఇరవై దాటుతుంటే రెండో బెల్లు. మూడో దానికోసం ఎదురు చూడ్డం అర్ధం లేని పని. అంటే నిరాశగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. జీవితం ఇప్పుడే ప్రారంభం అయిందనుకోవాలి. అప్పుడే ఎలాటి బాకీ లేకుండా అనుకున్నవన్నీ చేసుకుంటూ పోవచ్చు. మొత్తం జీవితమంతా పద్దతీ పాడూ లేకుండా గడిపేశామనుకునేవాళ్లు కూడా చక్కగా మళ్ళీ ప్లాను చేసుకుని బతకొచ్చు. ఈ బతకడం మనకోసం అనుకోవాలి. అప్పుడే ఈ బతుకు కొనసాగింపు వల్ల ఇతరులకు ఇబ్బందులు చాలావరకు తగ్గించిన వాళ్ళం అవుతాము.


అలాగే ‘యావలు’ తగ్గించుకోవాలి. చైనా సామెత చెప్పినట్టు ఎన్నివేల ఎకరాల పంట భూములువున్నా, ఎన్ని క్వింటాళ్ళ ధాన్యం పండించినా నోట్లోకి వెళ్ళేవి నాలుగు ముద్దలే. ఎన్ని అంతస్తుల భవనాలు ఎన్నెన్ని వున్నా రాత్రివేళ నిదురించడానికి అవసరం అయ్యేది ఆరుగజాల జాగానే.
తినడానికి తగిన తిండి, అవసరం అయిన మేరకు డబ్బులు వుంటే ఇక చింతను చెంతకు రానివ్వకూడదు. మార్చలేని విషయాలను మార్చే ప్రయత్నం మానుకోవాలి. విషయాలను ఏమార్చే పద్దతులు మానుకుంటే అంతకు మించింది ఈ వయస్సులో మరోటి వుండదు.
మన సంతోషం మనది. మన ఆలోచనలు మనవి. అవి యెంత మంచివి అయితే అంత మంచిని చేస్తాయి. అంత హాయిని కలిగిస్తాయి.
చూస్తుండగానే ఒక రోజు గడిచిపోతుంది. ఆయుస్సులో ఒక రోజు తగ్గిపోతుంది.
అదే హాయిగా ఒక రోజు గడిపామనుకోండి. ఒక రోజు ఆయువు పెరుగుతుంది.
మనసును ప్రశాంతంగా  వుంచుకుంటే కొన్ని రోగాలు కూడా మటుమాయం అయిపోతాయని చెబుతారు. ఇందులో నిజమెంతో తెలుకోవడానికి ఎవరూ అక్కరలేదు. మీకు  మీరు చాలు.
(ఇంగ్లీష్ లోకి అనువదించిన చైనీస్ వ్యాసాన్ని ఒక మిత్రుడు మెయిల్ చేశారు. దానికిది స్వేచ్చానువాదం. వారికి కృతజ్ఞతలు) 

NOTE: Courtesy Image Owner

7, డిసెంబర్ 2013, శనివారం

నవ్వుకు దిష్టి తగిలింది


నిన్న కాక మొన్న ఏవీఎస్
మళ్ళీ ఈరోజు ధర్మవరపు సుబ్రహ్మణ్యం
ఇలాటి నవ్వులరేడులు అందరూ నవ్వుల్ని మనకు వొదిలేసి నవ్వుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. ఇదొక విషాదం.


సుబ్రహ్మణ్యం గారు తెలియనివాళ్ళు వుండరు. కానీ ఆయనతో మా పరిచయం యెలా జరిగిందో గుర్తులేదు కానీ ఆ పరిచయం అలా పెరిగిపోయి మా కుటుంబాల్లో అందరికీ గుర్తుండి పోయింది. నేనూ జ్వాలా ఆయనతో చేసిన అసంఖ్యాక ‘సాయంకాలక్షేపాలు’ ఇంకా కళ్ళల్లో సుడులు తిరుగుతూనే వున్నాయి. ఆయన సినిమాల్లో చూపించిన హాస్యం చూసి జనమంతా కడుపుబ్బానవ్వుకున్నారు. కానీ హాస్య నటులు తెర మీదే కాదు నలుగురితో కూర్చున్నప్పుడు కూడా నవ్వుల పువ్వులు పూయించగలరని జంధ్యాల, ధర్మవరపు నిరూపించారు.
ఇంత చిన్న వయస్సులోనే అంతటి నవ్వుల చక్రవర్తులు అందరినుంచి సెలవు తీసుకుంటూ వున్నారంటే ఎక్కడో ఏ లోకంలోనో నవ్వులు తక్కువయ్యాయని అనుకోవాలి. అందుకే కాబోలు ఈ అర్ధాంతర, హడావుడి ప్రయాణాలు.
మిత్రుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి నా శ్రద్ధాంజలి
(07-12-2013)