14, సెప్టెంబర్ 2013, శనివారం

మౌన వేదన


ఐ నో సీఎం. ఐ నో పీఎంఅనుకునే  జర్నలిస్టుల జీవితాలు పైకి కనిపించేంత గొప్ప కరెన్సీ కాగితాలేమీ కావు.  వారికి వృత్తి రీత్యా  సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో  పరిచయాలకు ఆస్కారం చాలా తక్కువ. అందుకే, కొందరు సాటి జర్నలిస్టులు  చనిపోయినప్పుడు  విషయం  తెలిసికూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్లి పరామర్శించలేకపోవడానికి ఇదే కారణం. చనిపోయిన వ్యక్తి  తప్ప వేరే ఎవ్వరూ  తెలవదు. తెలిసిన ఒక్కరికి మనం  వచ్చిన విషయం తెలియదు. ఇది పైకి చెప్పుకోలేని ఓ  పెను విషాదం.
ఇలాటి  సందర్భాలు రాకూడదని కోరుకుంటాము. కానీ కోరినదే జరిగినచో దైవం ఎందులకు.


(మిత్రుడు వి. చంద్రశేఖర ఆజాద్) 

ఈ సాయంత్రం వి. .చంద్రశేఖర ఆజాద్ కన్నుమూసాడు. ఆజాద్ గా నలుగురికీ తెలిసిన అతడు  ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో సుదీర్ఘ కాలం పనిచేశాడు. నాకంటే పెద్దవాడు. డెబ్బయ్ వుంటాయేమో. నేను 1971లో బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరిన కొన్నాళ్ళకు ఆజాద్ కూడా సబ్ ఎడిటర్ గా వచ్చాడు. దాదాపు మూడున్నర  ఏళ్ళు కల్సి ఒకే ఆఫీసులో పనిచేశాము. భేషజాలు లేని మనిషి. మనసులో ఏదీ దాచుకోని తత్వం.  నేను రేడియోలో చేరిన తరువాత మళ్ళీ  చాలా ఏళ్ళ తరువాత హైదరాబాదులో కలిశాము. ఈనాడు హైదరాబాదు ఎడిషన్ లో చేరాడు.
కొన్నాళ్ళుగా కేన్సర్ తో బాధ పడుతున్నాడు. చికిత్సకు లొంగని ఆ పాడురోగం శారీరకంగా దెబ్బతీసింది కాని, మానసికంగా లొంగదీసుకోలేక  పోయింది. అతడి  ధైర్యం చూసి ఇతగాడు ఆ జబ్బును జయిస్తాడని కూడా అనిపించింది. అయితే చివరకు ఆ జబ్బే జయించింది. ఈ సాయంత్రం తుది శ్వాస విడిచాడు.
జాతస్య మరణం ధృవం అనే మాటలో నిజం వున్నా తెలిసిన వాళ్లు పోయినప్పుడు ఇది గుర్తుకురాదు. ఇదో నిజం.

(14-09-2013)

మార్పు దిశగా అడుగులు పడాలి


పక్కింట్లో ఏం జరిగినా పట్టించుకోని మౌన భారతం అన్న అపప్రధ నుంచి దేశం బయట పడింది.
దేశరాజధానిలో జరిగిన ఒక సంఘటన జాతి యావత్తును కుదిపివేసింది. స్పందించే గుణం ఇంకా మిగిలే వుందని యువ భారతం నిరూపించింది. వీధులకెక్కిన జనాగ్రహం పాలకుల మెడ వంచింది. ఒక సంఘటన  మూలంగా ఏకంగా  ఒక చట్టమే రూపుదిద్దుకోవడడం అనే అరుదయిన ప్రక్రియకు నాంది పలికింది.
ఎల్లలు మరిచి, విభేదాలు విడిచి  జాతి యావత్తు  ఒక్క తాటిపై నిలబడి  స్పందించడం అన్నది స్వతంత్ర భారతంలో కనీ వినీ ఎరుగని విషయం.  ఇటువంటి సందర్భాలలో బాధితుల పట్ల సాధారణంగా అనుసరించే నిర్దాక్షిణ్య వైఖరికి భిన్నంగా మీడియా బాధితుల పేర్లను బహిరంగపరిచే విధానానికి ముగింపు పలికి కొత్తవొరవడికి శ్రీకారం చుట్టడం అనేది స్వాగతించతగ్గ మరో పరిణామం.        
ఆనాటి దురదృష్టకర క్షణాల్లో బాధితురాలు పడిన క్షోభకు, అనుభవించిన మానసిక క్లేశానికి,  పోగొట్టుకున్న ప్రాణాలకు ఢిల్లీ కోర్టు తీర్పు పరిహారం కాకపోవచ్చు కాని, స్థాలీపులాకన్యాయం మాదిరిగా ఈ కేసు దర్యాప్తు త్వరితగతిన జరిగిన తీరు మాత్రం ‘భయం లేదు’  అన్న భరోసాను ప్రజలకు కలిగించింది.
మానసికంగా  భౌతికంగా ఒక అమాయకురాలిని పరమ దారుణంగా హింసించి,  అత్యంత  కిరాతకంగా ఈ ఘోరానికి  పాల్పడి, ఆమె మరణానికి కారణభూతులయిన నేరస్తులకు తగిన శిక్ష పడింది. చనిపోయేవరకూ వారిని ఉరి తీయాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అయితే, కేవలం కఠిన శిక్షలు మాత్రమే  పెచ్చరిల్లుతున్న హింసా ప్రవృత్తికి అడ్డుకట్టవేయలేవు అన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం వుంది. చట్టాలకు పదును పెట్టి కఠిన శిక్షలు వేయడం అన్న ఒక్క ప్రక్రియే ఈ సమస్యలకు పరిష్కారం కాదు.
అసలు సిసలు మార్పు ఇళ్లనుంచి  మొదలు కావాలి. పిల్లల పెంపకం పట్ల తలితండ్రులు  తీసుకునే జాగ్రత్తలు కూడా సానుకూల మార్పుకు దోహదం చేస్తాయి. గతంలో పాఠశాలల్లో నైతిక ప్రవర్తనకు సంబంధిన పాఠాలు బోధించే పద్దతి వుండేది. యేది మంచి యేది చెడు అన్నది చిన్నతనం నుంచే అవగాహన చేసుకోవడానికి అవకాశం వుండేది. ఉమ్మడి కుటుంబాలకు మూలస్తంభాలు అయిన బామ్మలు, తాతయ్యలు పసితనం నుంచే పిల్లలకు నడత, నడవడిక గురించిన మార్గదర్శనం చేసేవాళ్ళు. ఎదిగే దశల్లో మనసును నియంత్రించుకోవడానికి అవసరమయిన నీతి పాఠాలు కుమార శతకం, కుమారి శతకాల్లో లభ్యం అయ్యేవి. అవన్నీ ఇప్పుడు కలికానికి కూడా కానరావడం లేదు. అధవా ఎవరయినా కలిగించుకుని చెప్పే నీతి వాక్యాలను  పాత చింతకాయ పచ్చడిలా పరిగణిస్తున్నారు.
అలాగే,   ఇప్పటి వేగ యుగంలో, పోటీ ప్రపంచంలో వాణిజ్యరూపం సంతరించుకున్న విద్యాసంస్థలకు నైతిక పాఠాలు బోధించే వ్యవధానం వుంటుందని ఆశించడం వృధా.   అటు కుటుంబాలలో కూడా పిల్లలకు  మంచీచెడూ చెప్పే వాళ్లు లేకుండా పోతున్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలు జీవన శైలి మెరుగుదలకు ఓపక్క దోహదం చేస్తూనే మరోపక్క యువత పెడదారులు తొక్కటానికి మార్గాలను  సులువు చేస్తున్నాయి. అందుకే  సమస్య మూలాల్లోకి పోయి పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది.  
ఏ సమాజనికయినా విలువల పతనాన్ని మించిన అధోగతి వుండబోదు.
దాన్ని నిరోధించకుండా చేసే ఏ ప్రయత్నాలయినా పై పూత మందులే అవుతాయికాని  అసలు రోగాన్ని సమూలంగా  నిర్మూలించలేవు.

(14-09-2013)

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

చూడు చూడు తమాషా ఫోను తమాషా! సెల్ ఫోను తమాషా!



అంతా కలిసే వుంటారు. కలిసే కాఫీలు తాగుతారు. కానీ ఏం లాభం ఎవరి మొబైల్ వారిదే. ఎవరి గోల వారిదే.


స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా గడపడానికి సముద్ర తీరానికి వెడతారు. అక్కడా ఎవరి ఫోను వారిదే. ఫోనులో ఎవరి ఫ్రెండ్స్ వారికే.  


అభిమాన ఆటగాళ్లను చూడడానికి పనికట్టుకుని స్టేడియాలకు టిక్కెట్లు కొనీ మరీ వెడతారు. తీరా చూస్తే ఏముంది. ఆట దోవ ఆటదే! ఫోన్లలో ఎవరి ముచ్చట్లు వారివే.


నలుగురూ కలవాలని, ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చేయాలని  మనసు పడతారు. తీరా వెళ్ళిన తరువాత షరా మామూలే!


ప్రేమికులు ఒకచోట కలిస్తే మాటామంతికి కొదవేముంటుంది. నిజమే. కాకపోతే ఎవరి ‘మాట’ వారిదే. ఎవరి ‘మంతి’’ వారిదే.


ఎన్నాళ్ళబట్టో కలవాలనుకున్న చిన్ననాటి ఫ్రెండ్ కలుస్తాడు. ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని మనసు పడతారు. కలుస్తారు. కబుర్లూ  చెప్పుకుంటారు. కాకపొతే ఎవరి ఫోనులో వాళ్ళే.


మనసుపడి మ్యూజియానికి వెళ్ళినా ఇదే తంతు.


చూడదగ్గ ప్రదేశాలకు వెళ్ళినా ఇదే తీరు.


మనకు బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి చెప్పినట్టు  అసలీ  మొబైల్ ఫోను అన్న సంగతే తెలియని రోజుల్లో ఆల్ బర్ట్  ఐన్ స్టీన్ పశ్చిమ దేశాలవారికి   ఎప్పుడో చెప్పారు. మనసుల మధ్య సంబంధాలను సాంకేతిక పరిజ్ఞానం ఘోరంగా దెబ్బతీస్తుందని, మనిషి  తాను సృష్టించుకున్న సాంకేతిక పరికరాలకే  బానిసగా మారుతాడని.

ఈ ఫోటోలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదూ! 
NOTE: Courtesy respective photographers       

12, సెప్టెంబర్ 2013, గురువారం

ఇలాటి ‘రత్నాలు’ కూడా వుంటాయి సుమండీ!


కొందరికి బాధ్యత అనేది అసలు సిసలు  బాధ్యత.  మరికొందరికి అదో కర్తవ్యం. అంటే చేసి చేతులు దులుపుకోవడం అన్నమాట.
మరికొందరు వుంటారు. బాధ్యతను కూడా ప్రచారానికి వాడుకుంటారు. వీరినే రాజకీయ నాయకులు అని కూడా అంటుంటారు. పావలా పనిచేసి పాతిక రూపాయలు ప్రచారంకోసం ఖర్చు పెడతారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అట్లాంటి వాళ్లని గురించికాదు. ఇట్లాంటి వాళ్లు కూడా వుంటారా అని అబ్బురపడే ఓ వ్యక్తి గురించి.
అయిదేళ్ళ క్రితం ముంబైలో జరిగిన పాక్ ఉగ్రవాదుల దాడికి మూలకారకుడయిన  కసబ్ ను సుదీర్ఘంగా విచారణ జరిపి ఎట్టకేలకు ఉరితీశారు.
అది పక్కన పెడదాం.


(కుక్కకు విశ్వాసం వున్నట్టే మనిషి స్పందించే హృదయం అవసరం )

ఆ దాడిలో ప్రధానంగా  దెబ్బతిన్నది రతన్ టాటా కు చెందిన తాజ్ హోటల్. దేశానికే తలమానికం అయిన ఈ హోటల్ ఆ దాడిలో పూర్తిగా దెబ్బతిన్నది.  టాటాలకేం తక్కువ చాలా తక్కువ వ్యవధిలోనే ఆ హోటల్ ను పునరుద్ధరించారు.  కానీ రతన్ టాటా ఇంకా చాలా చేసాడు. నిజానికి ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు అవి. దీనికి ఒక్క డబ్బు వుంటే చాలదు. గుండె కూడా వుండాలి. అది స్పందించే హృదయం అయి వుండాలి. రతన్ టాటాకు ఈ రెండూ వున్నాయి. కనుకే, ఆయన అనుకున్నది అనుకున్నట్టు అనుకున్న వ్యవధిలో పూర్తిచేశాడు, అదీ ప్రచార పటాటోపం లేకుండా.
దాడి జరిగిన రోజు   హోటల్లో వందలాదిమంది సిబ్బంది విధుల్లో వున్నారు. వారిలో అదే రోజు పనిలో చేరిన వారు కూడా వున్నారు. హోటల్ మూతపడ్డ కాలంలో  ఎవ్వరినీ వొదిలి పెట్టకుండా  అందరికీ ఎప్పటిమాదిరిగానే నెలనెలా జీతాలను వారి వారి ఇళ్లకు మనిఆర్డర్ ద్వారా పంపించారు.
దాడిలో చనిపోయిన హోటల్ సిబ్బందికి ఉదారంగా ఆర్ధిక సాయం అందించారు. ఇందులో వింతేమీ లేదు. కానీ ఆ రోజు ముంబై లో జరిగిన వివిధ దాడుల్లో చనిపోయిన వారికీ, గాయపడ్డవారికీ, ఇంకా చెప్పాలంటే పావ్ బాజీ, పాన్ దుకాణాల వారికి కూడా ఈ సాయం అందించారు.  హోటల్ తో ఏమాత్రం సంబంధం  లేని వాళ్లకి కూడా నెలకు పదివేల రూపాయల చొప్పున ఆరు మాసాలపాటు  ఆర్ధిక సాయం  అందించారు.
శారీరకంగా మానసికంగా దెబ్బతిన్న సిబ్బంది సంక్షేమం కనిపెట్టి చూడడానికి ఒక్కొక్కరికీ ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేశారు.  అతడికి ఎలాటి సాయం అవసరమయినా ఎవరికోసమో ఎదురు చూడకుండా  అప్పటికప్పుడు సాయపడడానికి   ఈ ఏర్పాటు.
ముంబై వెలుపల ఇతర ప్రాంతాలలో వున్న వారి బంధువులను ఆత్మీయులను విమానాలలో ముంబైకి తరలించడమే కాకుండా వారికి  ప్రెసిడెంట్ హోటల్ లో మూడువారాలపాటు అవసరమైన వసతి ఏర్పాట్లు ఉచితంగా చేశారు.
ఆనాటి ముష్కరుల దాడిలో ఓ నాలుగేళ్ళ అమ్మాయికి నాలుగు బులెట్లు దిగాయి. సర్కారు దవాఖానాలో   వొకటి తొలగించారు. విషయం తెలుసుకున్న రతన్ టాటా ఆ ఆమ్మాయిని ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించి మిగిలిన బులెట్లను కూడా శరీరం నుంచి తీసివేయించారు. అందుకు లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
చనిపోయిన సిబ్బంది కుటుంబాలకు యాజమాన్యం ఉదారంగా ఆర్ధిక సాయం అందించింది. కనీస మొత్తం ముప్పై ఆరులక్షల నుంచి ఎనభయ్ అయిదు లక్షల వరకు చెల్లించారు.
అంతేకాదు, ఉద్యోగి ఆఖరి నెల వేతనాన్ని వారి కుటుంబాలకు  జీవించి వున్నంత కాలం ప్రతి నెలా చెల్లించేలా ఏర్పాటు చేశారు. వారి పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా ఆ ఖర్చును భరించడానికి రతన్ టాటా హామీ ఇచ్చారు.  ఆ కుటుంబాలకు అవసరమయ్యే  వైద్యం ఖర్చు జీవిత  పర్యంతం వారికి అందేలా ఏర్పాటు చేశారు.
ఉద్యోగంలో వుండగా వారికి ఇచ్చిన అన్ని రకాల రుణాలను పూర్తిగా రద్దు చేశారు.

ఇంత చెప్పిన తరువాత ఇక చెప్పడానికి ఏముంది చెప్పండి.

రేడియో రోజులు – 6



బ్రహ్మ లోకంలో విధాత తన పద్మాసనంపై బాసింపట్టు వేసుక్కూర్చుని సృష్టికర్తగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన సతీమణి, హాటకగర్భురాణి అయిన చదువులతల్లి  పక్కనే వుండి ఓరకంట తన భర్త చేతివేళ్లల్లో రూపుదిద్దుకుంటున్న జీవరాశుల్ని తదేకంగా గమనిస్తోంది.

సృష్టికార్యంలో నిమగ్నుడయివున్న బ్రహ్మదేవుడు పక్కన భార్య వున్న సంగతి సయితం మరచిపోయి, ఒక లావణ్యవతి రూపాన్ని రూపొందించి దానికి స్త్రీమూర్తి అని పేరుపెట్టాడు. ఆ బొమ్మకు బ్రహ్మ గారు  ప్రాణం పోసి భూమిమీదకు పంపే సమయంలో సరస్వతమ్మకు కరణేషు మంత్రిఅనే సతీధర్మం తటాలున గుర్తుకువచ్చి ఆగండాగండి! తొందరపడి యావత్ సృష్టినే గందరగోళంలోకి నెట్టకండిఅని వేడుకుంది. వేడుకుంటూనే మరోపక్క మాటల్లో వేడిని కాస్త పెంచింది.
ఇన్ని తలలున్నాయని పేరే కానీ చేస్తున్నదేమిటో, దాని పరిణామాలేమిటో ఒక్క మారయినా, కనీసం ఒక్క తలకాయతోనయినా ఆలోచించారా ?’ అని వాగ్దేవి తన వాగ్ధాటితో మొగుడ్ని అడ్డుకుంది.

ప్రతిక్షణం లక్షల కోట్ల జీవరాసులను ఒకదానితో మరొకటి పోలిక లేకుండా సృష్టించగల అపార శక్తియుక్తులున్న ఆ బ్రహ్మదేవుడు కూడా, ఎంతవారలయినా కాంతాదాసులే అన్నట్టు పెళ్ళాం మాటకు బద్ధుడే కదా!  అవటాన -

రెండోమాట లేకుండా సతీమణి సలహాకు అంగీకార సూచకంగా మూడు తలలు ఒకేమారు వూపుతూ కాసేపు చేస్తున్న పనికి విరామం ఇచ్చాడు.



అదే అనువుగా తీసుకుని, హితవచన రూపంలో ఆయన అర్ధాంగి వాణి తనదయిన బాణీలో విధాతకు భగవద్గీత బోధించడం ప్రారంభించింది.

మీరు సృష్టించిన ఆ స్త్రీమూర్తి అందాన్ని చూసి ఆడదాన్నయిన నాకే మతిపోతున్నది. ఇక భూలోకవాసుల సంగతి వేరే చెప్పాలా! ఏమయినా సరే ఇటువంటి  అతిలోకసుందరిని భూలోకానికి పంపడానికి సుతరామూ వీల్లేదు. సత్యలోకంలో కూడా వుంచడానికి  ఒప్పుకోను.  నా కాపురం నాకు ముఖ్యం. ఇటువంటి  ఆడంగుల  పొడ నాకు గిట్టదు గాక గిట్టదు.అని గట్టిగా తెగేసి చెప్పింది.

భగవతి మాటలతో విధాత మూడు తలలు పట్టుకున్నాడు. సత్యలోకం నిబంధనల ప్రకారం ఒకసారి తన చేతులతో సృష్టించిన జీవిని భూలోకానికి పంపకుండా వుండేందుకు వీలులేదు. ఆ సంగతే అర్ధాంగికి అవగతమయ్యేలా చెప్పి తరుణోపాయం కూడా చెప్పి పుణ్యం కట్టుకోమని కోరాడు.

ఎంతకట్టుకున్నవాడయినా, ఎంత తన కట్టుబాట్లలో వున్న మొగుడయినా బ్రహ్మ సామాన్యుడేమీ కాదు. సాక్షాత్తు త్రిమూర్తుల్లో ఒకడు. ఆ ఎరుక ఎరిగినది కనుక సరస్వతి కొంత మెత్తబడింది.

అలా మెత్తబడ్డ వీణావాణి మనసులో ఓ కొత్త ఆలోచన పురుడు పోసుకుంది.

మొగుడు ముచ్చటపడి సృష్టించిన ఆ స్త్రీమూర్తి  ఎంతో అద్భుత సౌందర్య రాశి. అంతే కాదు. పరమాద్భుతమయిన తెలివితేటలూ ఆమె సొంతం. ఇంతటి ప్రతిభాశాలినీ, అసాధారణ ప్రజ్ఞాధురీణనీ  అదుపులో వుంచడం మానవమాత్రులకు అసాధ్యం. దాన్ని సాధ్యం చేయాలంటే, ఆ పడతి తన ప్రతిభాపాటవాలను మరచిపోయేలా, అవి మరుగున పడిపోయేలా ఆమె దృష్టిని మళ్లించి, ఆ లలన మనసును ఆకట్టుకోగల మరికొన్నింటిని సృష్టించాలి. చదువులలో సారం తెలిసిన చదువుల తల్లికి ఆ ఆనుపానులేవిటో వెంటనే తెలిసిపోయాయి.

ఫలితం.  ఆ అందాల సుందరితో పాటే బ్రహ్మ దేవుడు, ఇల్లాలి సలహాపై మరో రెండింటిని సృష్టించి భూలోకానికి పంపాడు. అవే పట్టు చీరెలు, స్టీలు గిన్నెలు.

(ఉపసంహారం: డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి వారం ప్రసారం అయ్యే జీవన స్రవంతిఅనే కార్యక్రమానికి నేను కర్తా, కర్మా క్రియగా పనిచేస్తున్న రోజుల్లో ఓ వారం ఆ కార్యక్రమంలో భాగంగా పైన పేర్కొన్న ఈ పిట్ట కధ చదివాను. అంతే! ఆనాడు నేను ఆఫీసుకు వెళ్ళగానే రేడియో కార్యక్రమాలలో దిట్టలుగా పేరుగాంచిన నలుగురు మహిళా మూర్తులు, నా సీనియర్లు తురగా జానకీ రాణి, మాడపాటి సత్యవతి, వింజమూరి సీతాదేవి, సునందిని ఐప్ - నాకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నన్ను చూసిందే తడవుగా ఒక్కుమ్మడిగా నా మీద మాటల దాడికి దిగారు. స్త్రీజాతిని కించబరిచే విధంగా ఇలాటి కాకమ్మ కధలు ప్రసారం చేయడానికి ఎంత ధైర్యం!అవటాని కేకలు వేసారు. వయస్సులో, అనుభవంలో వారందరికంటే నేను చాలా చిన్నవాడిని. అంచేత ఆ పెద్దల అక్షింతలను ఆశీస్సులుగా తీసుకున్నాను. హాస్యానికి కూడా ఎవరినీ నొప్పించడం తగదన్న నీతి నాకానాడే బోధపడింది. అందుకే అప్పటినుంచి నా కార్యక్రమంలో నేను ఏనాడు ఎవరినీ కించబరిచే వ్యాఖ్యలు చేయలేదు.

తోక వాక్యం : కాకపోతే, ఆనాటి జీవనస్రవంతిని మెచ్చుకుంటూ శ్రోతలు అనేకమంది ఉత్తరాలు రాసారు. అది వేరే సంగతి.)

11, సెప్టెంబర్ 2013, బుధవారం

రేడియో రోజులు -5




నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు  డి. వెంకట్రామయ్య.
నేను అభిమానించే ఓ కధా రచయితే నాకు సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.
'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే  ఆయన రాయడం బాగా తగ్గించారు.  తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో!

వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి - ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి- 'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం.

రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు- నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే  'కలం సన్యాసం' స్వీకరించినట్టున్నారు.  అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే- అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీ, రాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.


(ఆయన పదవీ విరమణ చేసిన సందర్భంలో)


1975 నవంబర్లో - తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను.  ప్రాచుర్యం పొందిన రచయితతో  ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ,  పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం మాత్రం  అరుదు.
వృత్తిరీత్యా కలసి పనిచేసే ఉద్యోగాలు. ప్రవృత్తి రీత్యా  మావి ఉత్తర దక్షిణ ధృవాలు.  ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.
ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని  ఆయన కోరుకుంటారు.  నేను ఇందుకు  పూర్తిగా విరుద్ధం. పనిచేసేచోట,  పనిచేసేవాళ్ళందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నది నా థియరీ.
వైరుధ్యాలు ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి.
టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు.
చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా - నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.
ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే- అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాదాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. ‘అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం’  అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో- పరిచయస్తులనో –మొహమాటపడిపోయి  వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని రకాల మొహమాటాలు  ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి నాది.
పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే,  దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో - వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! వెంకట్రామయ్యగారు దీనికి పెద్ద మినహాయింపు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో- మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది.నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు-
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు-
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి-
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని- వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదుల్చుకుని  చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని - పాపపుణ్యాల పైనా, దేవుళ్ళూ దెయ్యాల పైనా  ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన తన పేరుపెట్టు కోకుండానో, లేదా కలం పేరులాగా  'గళం'పేరుతోనో (కార్మికుల కార్యక్రమం లో రాంబాబు) - రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దే' అయినప్పటికీ, పుస్తక ప్రియులను 'పెద్దగా' ఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ  ఒక ఏడాది తన వార్షిక  పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించింది.  పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగే, రావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని  ఆశించాను కాని, (రచన ఇంటింటి పత్రికలో సాయిగారు పట్టుబట్టి  నెలనెలా  రాయిస్తున్న రేడియో అనుభవాలు తప్పిస్తే) నాది పేరాశ అనే ఆయన తేల్చేసారు. (12-09-2013)



వైకల్యం శాపం కాదు


‘యాటిట్యూడ్’ గురించిన రెండున్నర  నిమిషాల నిడివి కలిగిన ఒక మహాలఘు చిత్రాన్ని ఇప్పుడే నెట్లో చూసాను. దాన్ని అందరితో పంచుకోవాలన్న కోరికతో ఓ అరగంట టైం వృధా చేసాను. ఆ సాంకేతిక నైపుణ్యం సున్నా అని తెలుసుకుని దాన్ని గురించి క్లుప్తంగా రాస్తున్నాను.
శారీరకంగా బాగా బలంగా వున్న యువకుడు తనని తాను పోషించుకోవడానికి యాచక వృత్తికి దిగుతాడు. నలుగురి సానుభూతిని పొందడం కోసం రెండు కాళ్ళు సరిగానే వున్నా, కుంటివాడి మాదిరిగా కర్ర చేతిలో పట్టుకుని  వీధుల్లో తిరిగి అడుక్కుంటూ వుంటాడు. ఒకరోజు అతడికి కారులో వెడుతున్న ఓ వ్యక్తి కనబడతాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి చేయి చాపుతాడు. ఈలోగా వాచ్ మన్ వచ్చి గేటు తెరవడం ఆ కారు లోపలకు వెళ్ళి ఆగడం జరుగుతుంది.  యెర్ర దీపం  వున్న ఆ కారు నెంబరు ప్లేటు మీద ‘జిల్లా కలెక్టర్’ అని రాసివుంటుంది. యాచక యువకుడు గేటులోనుంచి చూస్తూ వుండగా  కారు డ్రైవర్ వచ్చి వెనుక డోరు తెరుస్తాడు. ముందు చేతి వూతం కర్ర కనబడుతుంది. ఆ తరువాత కుంటివాడయిన ఓ వ్యక్తి దిగి  డ్రైవర్ సాయంతో ఆఫీసులోకి వెళ్లడం గమనిస్తాడు. అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి, కర్ర పొడుచుకుంటూ వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసి ఆగిపోతాడు. చేతిలో కర్రను రోడ్డుపై విసిరి వేసి కొత్తగా తనను ఆవరించిన ఆత్మ స్తైర్యంతో ముందుకు కదులుతాడు. దానితో చిత్రం ముగుస్తుంది. 
(11-09-2013)