13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

చూడు చూడు తమాషా ఫోను తమాషా! సెల్ ఫోను తమాషా!



అంతా కలిసే వుంటారు. కలిసే కాఫీలు తాగుతారు. కానీ ఏం లాభం ఎవరి మొబైల్ వారిదే. ఎవరి గోల వారిదే.


స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా గడపడానికి సముద్ర తీరానికి వెడతారు. అక్కడా ఎవరి ఫోను వారిదే. ఫోనులో ఎవరి ఫ్రెండ్స్ వారికే.  


అభిమాన ఆటగాళ్లను చూడడానికి పనికట్టుకుని స్టేడియాలకు టిక్కెట్లు కొనీ మరీ వెడతారు. తీరా చూస్తే ఏముంది. ఆట దోవ ఆటదే! ఫోన్లలో ఎవరి ముచ్చట్లు వారివే.


నలుగురూ కలవాలని, ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చేయాలని  మనసు పడతారు. తీరా వెళ్ళిన తరువాత షరా మామూలే!


ప్రేమికులు ఒకచోట కలిస్తే మాటామంతికి కొదవేముంటుంది. నిజమే. కాకపోతే ఎవరి ‘మాట’ వారిదే. ఎవరి ‘మంతి’’ వారిదే.


ఎన్నాళ్ళబట్టో కలవాలనుకున్న చిన్ననాటి ఫ్రెండ్ కలుస్తాడు. ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని మనసు పడతారు. కలుస్తారు. కబుర్లూ  చెప్పుకుంటారు. కాకపొతే ఎవరి ఫోనులో వాళ్ళే.


మనసుపడి మ్యూజియానికి వెళ్ళినా ఇదే తంతు.


చూడదగ్గ ప్రదేశాలకు వెళ్ళినా ఇదే తీరు.


మనకు బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి చెప్పినట్టు  అసలీ  మొబైల్ ఫోను అన్న సంగతే తెలియని రోజుల్లో ఆల్ బర్ట్  ఐన్ స్టీన్ పశ్చిమ దేశాలవారికి   ఎప్పుడో చెప్పారు. మనసుల మధ్య సంబంధాలను సాంకేతిక పరిజ్ఞానం ఘోరంగా దెబ్బతీస్తుందని, మనిషి  తాను సృష్టించుకున్న సాంకేతిక పరికరాలకే  బానిసగా మారుతాడని.

ఈ ఫోటోలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదూ! 
NOTE: Courtesy respective photographers       

12, సెప్టెంబర్ 2013, గురువారం

ఇలాటి ‘రత్నాలు’ కూడా వుంటాయి సుమండీ!


కొందరికి బాధ్యత అనేది అసలు సిసలు  బాధ్యత.  మరికొందరికి అదో కర్తవ్యం. అంటే చేసి చేతులు దులుపుకోవడం అన్నమాట.
మరికొందరు వుంటారు. బాధ్యతను కూడా ప్రచారానికి వాడుకుంటారు. వీరినే రాజకీయ నాయకులు అని కూడా అంటుంటారు. పావలా పనిచేసి పాతిక రూపాయలు ప్రచారంకోసం ఖర్చు పెడతారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అట్లాంటి వాళ్లని గురించికాదు. ఇట్లాంటి వాళ్లు కూడా వుంటారా అని అబ్బురపడే ఓ వ్యక్తి గురించి.
అయిదేళ్ళ క్రితం ముంబైలో జరిగిన పాక్ ఉగ్రవాదుల దాడికి మూలకారకుడయిన  కసబ్ ను సుదీర్ఘంగా విచారణ జరిపి ఎట్టకేలకు ఉరితీశారు.
అది పక్కన పెడదాం.


(కుక్కకు విశ్వాసం వున్నట్టే మనిషి స్పందించే హృదయం అవసరం )

ఆ దాడిలో ప్రధానంగా  దెబ్బతిన్నది రతన్ టాటా కు చెందిన తాజ్ హోటల్. దేశానికే తలమానికం అయిన ఈ హోటల్ ఆ దాడిలో పూర్తిగా దెబ్బతిన్నది.  టాటాలకేం తక్కువ చాలా తక్కువ వ్యవధిలోనే ఆ హోటల్ ను పునరుద్ధరించారు.  కానీ రతన్ టాటా ఇంకా చాలా చేసాడు. నిజానికి ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు అవి. దీనికి ఒక్క డబ్బు వుంటే చాలదు. గుండె కూడా వుండాలి. అది స్పందించే హృదయం అయి వుండాలి. రతన్ టాటాకు ఈ రెండూ వున్నాయి. కనుకే, ఆయన అనుకున్నది అనుకున్నట్టు అనుకున్న వ్యవధిలో పూర్తిచేశాడు, అదీ ప్రచార పటాటోపం లేకుండా.
దాడి జరిగిన రోజు   హోటల్లో వందలాదిమంది సిబ్బంది విధుల్లో వున్నారు. వారిలో అదే రోజు పనిలో చేరిన వారు కూడా వున్నారు. హోటల్ మూతపడ్డ కాలంలో  ఎవ్వరినీ వొదిలి పెట్టకుండా  అందరికీ ఎప్పటిమాదిరిగానే నెలనెలా జీతాలను వారి వారి ఇళ్లకు మనిఆర్డర్ ద్వారా పంపించారు.
దాడిలో చనిపోయిన హోటల్ సిబ్బందికి ఉదారంగా ఆర్ధిక సాయం అందించారు. ఇందులో వింతేమీ లేదు. కానీ ఆ రోజు ముంబై లో జరిగిన వివిధ దాడుల్లో చనిపోయిన వారికీ, గాయపడ్డవారికీ, ఇంకా చెప్పాలంటే పావ్ బాజీ, పాన్ దుకాణాల వారికి కూడా ఈ సాయం అందించారు.  హోటల్ తో ఏమాత్రం సంబంధం  లేని వాళ్లకి కూడా నెలకు పదివేల రూపాయల చొప్పున ఆరు మాసాలపాటు  ఆర్ధిక సాయం  అందించారు.
శారీరకంగా మానసికంగా దెబ్బతిన్న సిబ్బంది సంక్షేమం కనిపెట్టి చూడడానికి ఒక్కొక్కరికీ ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేశారు.  అతడికి ఎలాటి సాయం అవసరమయినా ఎవరికోసమో ఎదురు చూడకుండా  అప్పటికప్పుడు సాయపడడానికి   ఈ ఏర్పాటు.
ముంబై వెలుపల ఇతర ప్రాంతాలలో వున్న వారి బంధువులను ఆత్మీయులను విమానాలలో ముంబైకి తరలించడమే కాకుండా వారికి  ప్రెసిడెంట్ హోటల్ లో మూడువారాలపాటు అవసరమైన వసతి ఏర్పాట్లు ఉచితంగా చేశారు.
ఆనాటి ముష్కరుల దాడిలో ఓ నాలుగేళ్ళ అమ్మాయికి నాలుగు బులెట్లు దిగాయి. సర్కారు దవాఖానాలో   వొకటి తొలగించారు. విషయం తెలుసుకున్న రతన్ టాటా ఆ ఆమ్మాయిని ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించి మిగిలిన బులెట్లను కూడా శరీరం నుంచి తీసివేయించారు. అందుకు లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
చనిపోయిన సిబ్బంది కుటుంబాలకు యాజమాన్యం ఉదారంగా ఆర్ధిక సాయం అందించింది. కనీస మొత్తం ముప్పై ఆరులక్షల నుంచి ఎనభయ్ అయిదు లక్షల వరకు చెల్లించారు.
అంతేకాదు, ఉద్యోగి ఆఖరి నెల వేతనాన్ని వారి కుటుంబాలకు  జీవించి వున్నంత కాలం ప్రతి నెలా చెల్లించేలా ఏర్పాటు చేశారు. వారి పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా ఆ ఖర్చును భరించడానికి రతన్ టాటా హామీ ఇచ్చారు.  ఆ కుటుంబాలకు అవసరమయ్యే  వైద్యం ఖర్చు జీవిత  పర్యంతం వారికి అందేలా ఏర్పాటు చేశారు.
ఉద్యోగంలో వుండగా వారికి ఇచ్చిన అన్ని రకాల రుణాలను పూర్తిగా రద్దు చేశారు.

ఇంత చెప్పిన తరువాత ఇక చెప్పడానికి ఏముంది చెప్పండి.

రేడియో రోజులు – 6



బ్రహ్మ లోకంలో విధాత తన పద్మాసనంపై బాసింపట్టు వేసుక్కూర్చుని సృష్టికర్తగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన సతీమణి, హాటకగర్భురాణి అయిన చదువులతల్లి  పక్కనే వుండి ఓరకంట తన భర్త చేతివేళ్లల్లో రూపుదిద్దుకుంటున్న జీవరాశుల్ని తదేకంగా గమనిస్తోంది.

సృష్టికార్యంలో నిమగ్నుడయివున్న బ్రహ్మదేవుడు పక్కన భార్య వున్న సంగతి సయితం మరచిపోయి, ఒక లావణ్యవతి రూపాన్ని రూపొందించి దానికి స్త్రీమూర్తి అని పేరుపెట్టాడు. ఆ బొమ్మకు బ్రహ్మ గారు  ప్రాణం పోసి భూమిమీదకు పంపే సమయంలో సరస్వతమ్మకు కరణేషు మంత్రిఅనే సతీధర్మం తటాలున గుర్తుకువచ్చి ఆగండాగండి! తొందరపడి యావత్ సృష్టినే గందరగోళంలోకి నెట్టకండిఅని వేడుకుంది. వేడుకుంటూనే మరోపక్క మాటల్లో వేడిని కాస్త పెంచింది.
ఇన్ని తలలున్నాయని పేరే కానీ చేస్తున్నదేమిటో, దాని పరిణామాలేమిటో ఒక్క మారయినా, కనీసం ఒక్క తలకాయతోనయినా ఆలోచించారా ?’ అని వాగ్దేవి తన వాగ్ధాటితో మొగుడ్ని అడ్డుకుంది.

ప్రతిక్షణం లక్షల కోట్ల జీవరాసులను ఒకదానితో మరొకటి పోలిక లేకుండా సృష్టించగల అపార శక్తియుక్తులున్న ఆ బ్రహ్మదేవుడు కూడా, ఎంతవారలయినా కాంతాదాసులే అన్నట్టు పెళ్ళాం మాటకు బద్ధుడే కదా!  అవటాన -

రెండోమాట లేకుండా సతీమణి సలహాకు అంగీకార సూచకంగా మూడు తలలు ఒకేమారు వూపుతూ కాసేపు చేస్తున్న పనికి విరామం ఇచ్చాడు.



అదే అనువుగా తీసుకుని, హితవచన రూపంలో ఆయన అర్ధాంగి వాణి తనదయిన బాణీలో విధాతకు భగవద్గీత బోధించడం ప్రారంభించింది.

మీరు సృష్టించిన ఆ స్త్రీమూర్తి అందాన్ని చూసి ఆడదాన్నయిన నాకే మతిపోతున్నది. ఇక భూలోకవాసుల సంగతి వేరే చెప్పాలా! ఏమయినా సరే ఇటువంటి  అతిలోకసుందరిని భూలోకానికి పంపడానికి సుతరామూ వీల్లేదు. సత్యలోకంలో కూడా వుంచడానికి  ఒప్పుకోను.  నా కాపురం నాకు ముఖ్యం. ఇటువంటి  ఆడంగుల  పొడ నాకు గిట్టదు గాక గిట్టదు.అని గట్టిగా తెగేసి చెప్పింది.

భగవతి మాటలతో విధాత మూడు తలలు పట్టుకున్నాడు. సత్యలోకం నిబంధనల ప్రకారం ఒకసారి తన చేతులతో సృష్టించిన జీవిని భూలోకానికి పంపకుండా వుండేందుకు వీలులేదు. ఆ సంగతే అర్ధాంగికి అవగతమయ్యేలా చెప్పి తరుణోపాయం కూడా చెప్పి పుణ్యం కట్టుకోమని కోరాడు.

ఎంతకట్టుకున్నవాడయినా, ఎంత తన కట్టుబాట్లలో వున్న మొగుడయినా బ్రహ్మ సామాన్యుడేమీ కాదు. సాక్షాత్తు త్రిమూర్తుల్లో ఒకడు. ఆ ఎరుక ఎరిగినది కనుక సరస్వతి కొంత మెత్తబడింది.

అలా మెత్తబడ్డ వీణావాణి మనసులో ఓ కొత్త ఆలోచన పురుడు పోసుకుంది.

మొగుడు ముచ్చటపడి సృష్టించిన ఆ స్త్రీమూర్తి  ఎంతో అద్భుత సౌందర్య రాశి. అంతే కాదు. పరమాద్భుతమయిన తెలివితేటలూ ఆమె సొంతం. ఇంతటి ప్రతిభాశాలినీ, అసాధారణ ప్రజ్ఞాధురీణనీ  అదుపులో వుంచడం మానవమాత్రులకు అసాధ్యం. దాన్ని సాధ్యం చేయాలంటే, ఆ పడతి తన ప్రతిభాపాటవాలను మరచిపోయేలా, అవి మరుగున పడిపోయేలా ఆమె దృష్టిని మళ్లించి, ఆ లలన మనసును ఆకట్టుకోగల మరికొన్నింటిని సృష్టించాలి. చదువులలో సారం తెలిసిన చదువుల తల్లికి ఆ ఆనుపానులేవిటో వెంటనే తెలిసిపోయాయి.

ఫలితం.  ఆ అందాల సుందరితో పాటే బ్రహ్మ దేవుడు, ఇల్లాలి సలహాపై మరో రెండింటిని సృష్టించి భూలోకానికి పంపాడు. అవే పట్టు చీరెలు, స్టీలు గిన్నెలు.

(ఉపసంహారం: డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి వారం ప్రసారం అయ్యే జీవన స్రవంతిఅనే కార్యక్రమానికి నేను కర్తా, కర్మా క్రియగా పనిచేస్తున్న రోజుల్లో ఓ వారం ఆ కార్యక్రమంలో భాగంగా పైన పేర్కొన్న ఈ పిట్ట కధ చదివాను. అంతే! ఆనాడు నేను ఆఫీసుకు వెళ్ళగానే రేడియో కార్యక్రమాలలో దిట్టలుగా పేరుగాంచిన నలుగురు మహిళా మూర్తులు, నా సీనియర్లు తురగా జానకీ రాణి, మాడపాటి సత్యవతి, వింజమూరి సీతాదేవి, సునందిని ఐప్ - నాకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నన్ను చూసిందే తడవుగా ఒక్కుమ్మడిగా నా మీద మాటల దాడికి దిగారు. స్త్రీజాతిని కించబరిచే విధంగా ఇలాటి కాకమ్మ కధలు ప్రసారం చేయడానికి ఎంత ధైర్యం!అవటాని కేకలు వేసారు. వయస్సులో, అనుభవంలో వారందరికంటే నేను చాలా చిన్నవాడిని. అంచేత ఆ పెద్దల అక్షింతలను ఆశీస్సులుగా తీసుకున్నాను. హాస్యానికి కూడా ఎవరినీ నొప్పించడం తగదన్న నీతి నాకానాడే బోధపడింది. అందుకే అప్పటినుంచి నా కార్యక్రమంలో నేను ఏనాడు ఎవరినీ కించబరిచే వ్యాఖ్యలు చేయలేదు.

తోక వాక్యం : కాకపోతే, ఆనాటి జీవనస్రవంతిని మెచ్చుకుంటూ శ్రోతలు అనేకమంది ఉత్తరాలు రాసారు. అది వేరే సంగతి.)

11, సెప్టెంబర్ 2013, బుధవారం

రేడియో రోజులు -5




నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు  డి. వెంకట్రామయ్య.
నేను అభిమానించే ఓ కధా రచయితే నాకు సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.
'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే  ఆయన రాయడం బాగా తగ్గించారు.  తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో!

వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి - ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి- 'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం.

రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు- నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే  'కలం సన్యాసం' స్వీకరించినట్టున్నారు.  అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే- అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీ, రాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.


(ఆయన పదవీ విరమణ చేసిన సందర్భంలో)


1975 నవంబర్లో - తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను.  ప్రాచుర్యం పొందిన రచయితతో  ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ,  పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం మాత్రం  అరుదు.
వృత్తిరీత్యా కలసి పనిచేసే ఉద్యోగాలు. ప్రవృత్తి రీత్యా  మావి ఉత్తర దక్షిణ ధృవాలు.  ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.
ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని  ఆయన కోరుకుంటారు.  నేను ఇందుకు  పూర్తిగా విరుద్ధం. పనిచేసేచోట,  పనిచేసేవాళ్ళందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నది నా థియరీ.
వైరుధ్యాలు ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి.
టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు.
చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా - నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.
ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే- అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాదాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. ‘అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం’  అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో- పరిచయస్తులనో –మొహమాటపడిపోయి  వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని రకాల మొహమాటాలు  ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి నాది.
పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే,  దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో - వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! వెంకట్రామయ్యగారు దీనికి పెద్ద మినహాయింపు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో- మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది.నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు-
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు-
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి-
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని- వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదుల్చుకుని  చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని - పాపపుణ్యాల పైనా, దేవుళ్ళూ దెయ్యాల పైనా  ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన తన పేరుపెట్టు కోకుండానో, లేదా కలం పేరులాగా  'గళం'పేరుతోనో (కార్మికుల కార్యక్రమం లో రాంబాబు) - రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దే' అయినప్పటికీ, పుస్తక ప్రియులను 'పెద్దగా' ఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ  ఒక ఏడాది తన వార్షిక  పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించింది.  పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగే, రావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని  ఆశించాను కాని, (రచన ఇంటింటి పత్రికలో సాయిగారు పట్టుబట్టి  నెలనెలా  రాయిస్తున్న రేడియో అనుభవాలు తప్పిస్తే) నాది పేరాశ అనే ఆయన తేల్చేసారు. (12-09-2013)



వైకల్యం శాపం కాదు


‘యాటిట్యూడ్’ గురించిన రెండున్నర  నిమిషాల నిడివి కలిగిన ఒక మహాలఘు చిత్రాన్ని ఇప్పుడే నెట్లో చూసాను. దాన్ని అందరితో పంచుకోవాలన్న కోరికతో ఓ అరగంట టైం వృధా చేసాను. ఆ సాంకేతిక నైపుణ్యం సున్నా అని తెలుసుకుని దాన్ని గురించి క్లుప్తంగా రాస్తున్నాను.
శారీరకంగా బాగా బలంగా వున్న యువకుడు తనని తాను పోషించుకోవడానికి యాచక వృత్తికి దిగుతాడు. నలుగురి సానుభూతిని పొందడం కోసం రెండు కాళ్ళు సరిగానే వున్నా, కుంటివాడి మాదిరిగా కర్ర చేతిలో పట్టుకుని  వీధుల్లో తిరిగి అడుక్కుంటూ వుంటాడు. ఒకరోజు అతడికి కారులో వెడుతున్న ఓ వ్యక్తి కనబడతాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి చేయి చాపుతాడు. ఈలోగా వాచ్ మన్ వచ్చి గేటు తెరవడం ఆ కారు లోపలకు వెళ్ళి ఆగడం జరుగుతుంది.  యెర్ర దీపం  వున్న ఆ కారు నెంబరు ప్లేటు మీద ‘జిల్లా కలెక్టర్’ అని రాసివుంటుంది. యాచక యువకుడు గేటులోనుంచి చూస్తూ వుండగా  కారు డ్రైవర్ వచ్చి వెనుక డోరు తెరుస్తాడు. ముందు చేతి వూతం కర్ర కనబడుతుంది. ఆ తరువాత కుంటివాడయిన ఓ వ్యక్తి దిగి  డ్రైవర్ సాయంతో ఆఫీసులోకి వెళ్లడం గమనిస్తాడు. అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి, కర్ర పొడుచుకుంటూ వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసి ఆగిపోతాడు. చేతిలో కర్రను రోడ్డుపై విసిరి వేసి కొత్తగా తనను ఆవరించిన ఆత్మ స్తైర్యంతో ముందుకు కదులుతాడు. దానితో చిత్రం ముగుస్తుంది. 
(11-09-2013)

పేగు తీపి


తల్లీ కొడుకూ  అడవి మార్గాన వెడుతుంటే ఓ నది  అడ్డం వచ్చింది. తల్లి ముందుగా ప్రవాహంలోకి దిగి కొడుకును తన చేయి పట్టుకోమంది.
‘అలా కాదు నువ్వే నా చేయి పట్టుకో’ అన్నాడు కొడుకు.
‘తేడా ఏముంది’  అడిగింది తల్లి.
‘పెద్ద అల వస్తే నేను నీ చేయి వొదిలేసి నా దారి చూసుకుంటాను.  అదే నువ్వు పట్టుకుంటే నాకు ఎంతో  భరోసా. ఏం జరిగినా  నా చెయ్యి వొదిలి పెట్టవు. నువ్వు మునిగయినా సరే  నన్ను బయట పడేస్తావు. అదే  తేడా’ అన్నాడు కొడుకు.

టీవీ ఛానళ్ళ వాళ్ళూ కాస్త ఈ మాట వింటారా!


ఈమధ్య వివిధ టీవీ ఛానళ్లలో వస్తున్న కార్యక్రమాలపై అనేక సోషల్ నెట్ వర్కుల్లో కానవస్తున్న వ్యాఖ్యానాలు గమనిస్తుంటే,  పూర్వం దూరదర్శన్  కూడా ఇంతటి తీవ్ర  స్థాయిలో విమర్శలు ఎదుర్కోలేదేమో అని  అనిపిస్తోంది. దూరదర్శన్ కార్యక్రమాలు గురించి జంధ్యాల మార్కు సినిమాల్లో చక్కటి హాస్య స్పోరక సన్నివేశాలు అనేకం  వచ్చాయి. కానీ,  ప్రస్తుతం విస్తృతంగా వ్యాపించివున్న ప్రైవేటు న్యూస్  ఛానళ్ళకు  మాత్రం  విమర్శకులు ఆమాత్రం మినహాయింపు (అంటే హాస్య ధోరణిలో ఎండగట్టడం)  కూడా ఇవ్వడం లేదు, పైగా కడిగి గాలించేస్తున్నారు. వాటికి రాజకీయ రంగులను పులుముతున్నారు. ఈ ఛానల్ ఇలాగే చెబుతుందిలే అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలం మీడియాలో పనిచేసిన మా బోంట్లకు ఇది మింగుడు పడడం లేదు.

నేను ఖమ్మం కాలేజీలో చదివేటప్పుడు మాకు ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్ ఒకరు వుండేవారు. ఆయన రాగానే గోలగోలగా వున్న క్లాసును అదుపుచేయడానికి డష్టర్ తో బల్ల మీద చప్పుడు చేస్తూ,  లెస్ నాయిస్ చిల్డ్రన్ లెస్ నాయిస్’ అని పదేపదే అనేవారు. ‘పిల్లలు ఎలాగూ గోల చెయ్యకమానరు,  కాబట్టి ఆ చేసేదేదో కాస్త తక్కువ చేయండ’న్నది దానికి టీకా తాత్పర్యం.
ఇప్పుడున్న పోటా పోటీ కాటా కుస్తీ  ప్రపంచంలో పూర్తిగా మడికట్టుకుని ఛానళ్ళు నిర్వహించడం సాధ్యం కాని మాట నిజమే. కాకపోతే  రేటింగులనుఓపక్క కనిపెడుతూనే జనం నాడిని పట్టుకునే  కార్యక్రమాలకు రూపకల్పన చేయడానికి కూడా అనేక  వీలుసాళ్లు వున్నాయి. వాటిని గురించి  ఛానళ్ళ యజమానులు ఆలోచిస్తే బాగుంటుంది. అదిగో,  ఆ ఉద్దేశ్యంతోనే ఈ ‘నా గొడవ’
ఇంతకీ ఆ సలహాలు సూచనలు ఏవిటంటే:
వారేరీ! ఎక్కడ ఇప్పుడు?’ అనే పేరుతొ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. రాజకీయ రంగంలో, సినిమారంగంలో కొన్నేళ్ళ పాటు ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు కనుమరుగయి  అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లు అనేకమంది వున్నారు. అలాటి వాళ్ళను వెతికిపట్టుకుని అప్పుడు ఇప్పుడువారి పరిస్తితి యెలా వుండేది  ఎలావుంది అన్న విషయాలను చూపగలిగితే వీక్షకులు ఆసక్తిగా చూసే అవకాశం వుంటుంది. వీళ్ళ వారసులు ఎవరు  ఎక్కడ వున్నారు  ఏం చేస్తున్నారు’  అనే సంగతులు నిజానికి  చాలా ఆసక్తిని రగిలించే అంశాలు.
కొన్ని ఉదాహరణలు కూడా వున్నాయి.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారి వారసులు ఏం చేస్తున్నారు. అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు  గారి వారసులు ఎవరు, వారు ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ వరసలోనే తెలుగు సినిమా రంగాన్ని కూడా ఒక పట్టు పట్టవచ్చు. ఒకనాడు తమ  కంటి చూపుతో సినిమా రంగాన్ని శాసిస్తూ అంతులేని ఐశ్వర్యాలను, రాజభోగాలను అనుభవించి,   చివరకు అన్నీ పోగొట్టుకుని నేలకు రాలిన ‘తారల’ వారసుల పరిస్తితి ఏమిటి? ఇప్పుడెలావున్నారు?  
వీరిలో కొందరి గురించి లోగడ పత్రికల్లో కొన్ని వ్యాసాలు వచ్చిన మాట నిజమే అయినా టీవీ  ఛానళ్ళ ద్వారా అయితే మరింత విస్తృతంగా ఆసక్తిని రేకెత్తించే అవకాశం వుంటుంది.
అలాగే, భర్తలు మరణించిన కారణంగా అనుకోకుండా  రాజకీయ వారసత్వం దక్కించుకున్న కొందరు మహిళలు వున్నారు. అయితే అలా దొరికిన అవకాశాన్ని సమర్ధంగా వాడుకుని ఆ పదవులను హోదాలను  పదిలం చేసుకున్నవారు బహు కొద్దిమందే.  అయాచితంగా లభించిన అవకాశాలను చేజేతులా జారవిడుచుకున్నఅలాటి  వారి  కధనాలు కూడా వీక్షకుల్లో  ఆసక్తి కలిగించేవే. (ఉదాహరణలు: బాలయోగి భార్య, కరణం రామచంద్రరావు సతీమణి)             
ఇప్పుడు ఎన్ని చెప్పినా,  ఏవి చెప్పినా అవన్నీ రాజకీయం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. కాబట్టి ఆ రాజకీయాలనే ఒక అంశంగా తీసుకుని కొన్ని ఆసక్తి కరమైన కార్యక్రమాలను రూపొందించడానికి వీలుంది.
ఉదాహరణకు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొనివున్న రాజకీయ పరిస్తితి. ఇప్పుడు చాలా ఛానళ్ళలో  -  వున్న పరిస్తితికి మరింత ఆజ్యం పోసే కార్యక్రమాలే ఎక్కువగా  వుంటున్నాయి. వీక్షకుల్లో చాలా మంది వీటిని విధిలేక చూస్తున్నారు కాని హృదయపూర్వకంగా ఆస్వాదించలేకపోతున్నారు. పైకి అందరూ అంగీకరించలేకపోయినా లోలోపల అంతా వొప్పుకునే వాస్తవం ఇది.
ఈ నేపధ్యంలో ఎలాటి కార్యక్రమాలకు రూపకల్పన చేయొచ్చు అంటే –

రాష్ట్రంలో ప్రభుత్వం వుంది. మంత్రులు  వున్నారు. అన్ని  జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులు కూడా వున్నారు. గమ్మత్తేమిటంటే రాష్ట్రంలో ప్రస్తుతం వున్న రాజకీయ గందరగోళానికి తగ్గట్టుగానే ఈ ఇంచార్జ్ మంత్రుల ఏర్పాటు వుండడం ఒక విచిత్రమైన పరిస్తితి. తెలంగాణా మంత్రులెవ్వరూ సీమాంధ్ర జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులుగా లేరు. అలాగే సీమాంధ్ర మంత్రులెవ్వరూ తెలంగాణా జిల్లాలకు ఇంచార్జ్ గా లేరు. ఇది కాకతాళీయమా! కావాలని చేసిందా! ఇంతవరకూ దీనిమీద దృష్టి పెట్టిన వాళ్లు ఎవ్వరూ లేరు. 

క్యాబినెట్ సమావేశాలకే దిక్కులేకుండా పోయినప్పుడు జిల్లా అభివృద్ధి మండళ్ళ సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనేది పట్టించుకునే తీరిక ఎవరికీ వున్నట్టు లేదు.  ఇటువంటి అంశాలపై దృష్టి పెడితే చక్కని ప్రయోజనకరమైన కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయి.
ఛానలూ పేపరూ చేతిలో వున్నవాళ్ళు కొద్దిగా పరిశోధన ( దొంగ కెమెరాలు అవసరం లేదు) చేస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క మంత్రి కూడా, ప్రాంతాల గొడవ పక్కనపెట్టండి, కనీసం  తన సొంత  జిల్లాను దాటి (పెళ్ళిళ్ళూ మొదలైన వాటిని మినహాయిస్తే) వేరే జిల్లాలకు ఒక్కటంటే ఒక్కసారి అధికార కార్యక్రమాలపై  వెళ్ళిన దాఖలాలు  లేవు. ఇందులో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి పెద్దగా  కష్టపడాల్సిన పని కూడా లేదు. మంత్రుల కార్యాలయాల్లో టూరు వివరాలు గురించి వారి వ్యక్తిగత సిబ్బందిని వాకబు చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఓ ఉదాహరణ ఇస్తే బాగుంటుంది.  ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు మాత్రం తన పొరుగున వున్న తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లివచ్చారు. అదీ ఎందుకటా! ఆయన గారికి పందెపుటెడ్లు అంటే మక్కువ ఎక్కువ. వాటి కొనుగోలు కోసం,  జిల్లాలు ఏమిటి మొత్తం దేశంలో ఎక్కడికయినా వెళ్ళి వస్తారు.  తూర్పు గోదావరి జిల్లాలో మంచి లక్షణాలు వున్న కపిల గోవుకు పుట్టిన ఆవుదూడను కొనుక్కురావడానికి మాత్రమే ఆయన మొట్టమొదటిసారి ఆ జిల్లాలో అడుగుపెట్టారట. ఒక మంత్రి అన్నవాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు బాధ్యత వహించాల్సినవాడు. మరి దీన్ని  ఏవిధంగా అర్ధం చేసుకోవాలి?  
ఇక్కడ పేర్లు పెట్టి ప్రస్తావించాలంటే చాలా పెద్ద జాబితా అవుతుంది. మంత్రుల జాబితా తీసుకుని వాళ్లు ఇటీవలి కాలంలో కానీ,  వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కానీ,  వాళ్లు తమ జిల్లాలు,  ఆ మాటకు వస్తే తమ నియోజకవర్గాల పరిధులను దాటి (రాజధాని హైదరాబాదును మినహాయిస్తే) ఏ జిల్లాకు అయినా వెళ్ళి వచ్చారేమో వాకబు చేయండి అసలు నిజాలు బయట పడతాయి. మళ్ళీ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఆరోగ్యశాఖకు సంబంధించి సీమాంధ్రకు చెందిన క్యాబినెట్ మంత్రి ఒకరు వున్నారు.  ఆదిలాబాదు జిల్లాలో అంటువ్యాధులు ప్రబలడం గురించి పత్రికల్లో అనేక వార్తలు వచ్చాయి. కానీ అధికారులు తప్ప సంబంధిత  మంత్రి ఒక్కనాడు  కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు. అలాగే, తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు. తమ శాఖలకు చెందిన అనేక సమస్యలు సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తినా కిక్కురుమనలేదు. అటు వైపు తొంగి చూడలేదు.  
ఈ రకమైన అంశాలను తీసుకుని కార్యక్రమాలను రూపొందిస్తే – వాటికి రాజకీయ పరమైన రంగూ రుచీ వాసనా వున్నప్పటికీ – ప్రజోపయోగంగా కూడా వుంటాయి. మీడియా తన సామాజిక బాధ్యతను కూడా నిర్వహించినట్టు అవుతుంది.
ఏమంటారు?
(11-09-2013)