10, సెప్టెంబర్ 2013, మంగళవారం

కప్పల గోల


మనసు పదిలం తమ్ముడూ!అన్నాడో కవి.
ఎందుకంటే మనసు చేసే గందరగోళం ఇంతా అంతా కాదు. లేని దాన్ని సృష్టిస్తుంది. వున్నదానిని కానరాకుండా చేస్తుంది. మనసు చేసే మాయనుంచి బయటపడలేకపోతే ఇక ఆ మనిషి గతి ఇంతే!
చైనా లో ఓ నీతి కధ వుంది.
ఓ వయసు మళ్ళిన పెద్దమనిషికి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఇంటి పక్క మడుగులో వున్న కప్పలు రాత్రి వేళల్లో చేసే గోల.
మండూక సంతానం చేసే బెకబెకల శబ్దాలు ఆ పెద్దమనిషికి చిన్నపాటి కునుకు కూడా పట్టకుండా చేస్తున్నాయి. వాటి బెడద వొదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఆసామీ పొరుగున బస్తీలో హోటల్ నడుపుతున్న మరో పెద్ద మనిషిని సంప్రదించాడు.
నా దగ్గర ఓ లక్ష కప్పలు వున్నాయి. మీరు కొంటానంటే రోజూ ఓ వేయి కప్పలయినా సప్లయి చేస్తాను
బస్తీ పెద్దమనిషి సంతోషంతో కప్పలా గెంతబోయి వెంటనే తమాయించుకుని, రోజూ ఓ వెయ్యి చొప్పున  కొనడానికి  పల్లెటూరి పెద్దమనిషితో కప్పల బేరంకుదుర్చుకున్నాడు.
వూరికెళ్లిన పెద్దమనిషి మర్నాడే తిరిగొచ్చాడు. ఆయన చేతిలో రెండే రెండు కప్పలు వున్నాయి.
మిగిలినవేవి?’ అని బస్తీ మనిషి అడిగాడు.
రాత్రిళ్ళు  అవి చేసే బెకబెకల ధ్వనులు విని ఆ మడుగులో కనీసం ఓ లక్ష కప్పలయినా వుంటాయని భ్రమ పడ్డాను. తీరా చూస్తే అంత గోల చేస్తున్నవి ఈ రెండే!పల్లెటూరి మనిషి బదులు చెప్పాడు.
అంటే ఏమిటన్న మాట!
చుట్టూ జగమంతా నిద్రిస్తున్నప్పుడు, వొంటరితనం వేధిస్తున్నప్పుడు మనసు చేసే అల్లరి ఇది. చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. 


రేడియో రోజులు - 4



‘శ్రీనివాసరావు గారు ఎలావున్నారు బాగున్నారా!’
పాతికేళ్ళ సుదీర్ఘ పరిచయ కాలంలో ఆవిడ  నోటి నుంచి  నేను విన్న అతి  పెద్ద వాక్యం ఇదే.
మాడపాటి సత్యవతి గారు ఎంతో  క్లుప్తంగా మాట్లాడుతారు. మాటలు తూచినట్టే వచ్చేవి ఆవిడ గారి నోటినుంచి. అంతటి మితభాషి. మరి  పది నిమిషాలు విడవకుండా ఏకబిగిన వార్తలు యెలా చదివేవారో అనిపించేది. కానీ ఆవిడ  స్వరం భగవంతుడు కేవలం రేడియో కోసమే తయారుచేసాడేమో అనిపిస్తుంది.  ఒక రకమైన మార్ధవంతో, సంగీతం వినిపిస్తున్నట్టుగా మాడపాటి సత్యవతిగారు వార్తలు చదువుతుంటే మరీ మరీ వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు బోలెడుమంది. ఒకరు అనువాదం చేసిన వార్తలు చదవడం కన్నా తాను సొంతంగా అనువదించి చదవడానికి ఆవిడ ఇష్టపడేవారు. నిజానికి ఆవిడ న్యూస్ రీడర్ కాదు. న్యూస్ ఎడిటర్. కానీ వారంలో కొన్ని రోజులు విధిగా వార్తలు చదివేవారు. వీటికి తోడు వారానికి ఒకమారో రెండు సార్లో వీలునుబట్టి ‘వార్తావాహిని’ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పించేవారు.


(మాడపాటి సత్యవతి) 



(కూర్చున్న వారు : ఎడమ నుంచి: తురగాజానకీరాణి, మాడపాటి సత్యవతి : వెనుక ఎడమనుంచి : డి. వెంకట్రామయ్య, వారి శ్రీమతి కరుణ, శ్రీమతి పార్వతీ ప్రసాద్, ఆ పక్కన మా ఆవిడ నిర్మల)   


వార్తావిభాగం పనితీరు గురించి ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి. హిందీలో చెప్పాలంటే (నిజానికి నాకూ ఆ భాషకు చుక్కెదురు) అక్కడ వాతావరణం ‘బహుత్  బహుత్ గంభీర్.’  నేను అడుగుపెట్టేంత వరకు పరిస్తితి అదే. పని అయిపోయేంతవరకు అందరూ ముక్తసరిగా మాట్లాడుకునేవారు. అంతా రొటీన్ గా  ‘స్క్రీన్ ప్లే’  పుస్తకంలో రాసివున్నట్టు జరిగిపోయేది. వార్తల్లో ఎలాటి తభావతు  రాకుండా  బులెటిన్ల తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక వార్త ఇవ్వాలా వద్దా  ఇస్తే ఎన్ని వాక్యాలు ఇవ్వాలి  యెంత ప్రాధాన్యం ఇవ్వాలి ఒకటి రెండు సార్లు ఆలోచించే వాళ్లు. మరీ  ముఖ్యంగా సత్యవతిగారికీ, వెంకట్రామయ్య గారికీ ఈ విషయంలో పట్టింపులు మెండు. అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకునే నా తత్వం వారికి అంతగా రుచించకపోయినా ఇంట్లో చిన్నవాడిని ముద్దు చేసినట్టు నన్ను చూసీ చూడనట్టు వొదిలేసేవారు. దానితో నాది ఆడింది ఆట పాడింది పాట అయింది.  అంతకు ముందు దినపత్రికలో పనిచేసిరావడం వల్ల కొంత స్వేచ్చను ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడిని. బహుశా నాతో పడ్డన్ని తలనొప్పులు వాళ్లు ఎవరితోనూ పడివుండరేమో కూడా.
నేను చేరిన కొత్తల్లో అనుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జట్ గురించి వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన ప్రత్యేక వార్తావాహిని తయారు చేస్తున్నారు. అభిప్రాయాలు రికార్డ్ చేసుకొచ్చే బాధ్యత నా మీద పడింది. అన్నీ తీసుకొచ్చి ఆ టేపులన్నీ సత్యవతిగారికి వొప్పచేప్పేసి చక్కాపోయాను.  రాత్రి ఏడుగంటల నలభై అయిదు నిమిషాలకు  ప్రసారం. లోపల డబ్బింగు స్టూడియోలో సత్యవతి గారు నానా అవస్థ పడుతున్నారు. గొంతులు వినబడుతున్నాయి.  ఎవరి గొంతు ఎవరిదో తెలియచెప్పే ‘క్యూ షీట్’ సత్యవతి గారికి ఇవ్వడం మరచిపోయాను. ఓపక్క  టైం దగ్గర పడుతోంది. ఆవిడకి నరాలు తెగిపోయే టెన్షన్. నేనెక్కడో ఎవరితోనో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఇప్పట్లా  సెల్ ఫోనులు లేని రోజులాయె.   ఆవిడ అనుభవమే ఆవిడకు  అక్కరకు వచ్చింది. కాని ఆరోజు,  డబ్బింగు పని  పూర్తిచేసి టేపు స్టూడియోలో వొప్పగించేసరికి ఆవిడ తల ప్రాణం తోకకు వచ్చివుంటుంది.
మరునాడు ఆఫీసుకు వెళ్ళిన తరువాత కాని నాకు విషయం తెలియలేదు. కనబడగానే బాగా కోప్పడాలి. అంతే కోపడ్డారు. యెలా అనుకున్నారు? నోరు తెరిచి ‘ఇదేంటి శ్రీనివాసరావు గారూ’ అన్నారు. అంతే!  
రేడియోలో పనిచేసేవారికి ముందుగా ఓ నీతి పాఠం బోధిస్తారు.  యెంత క్లుప్తంగా (వార్త) చెబితే  భావం అంత ఖచ్చితంగా అర్ధం అవుతుంది అని. (Brevity is sole of wit)
సత్యవతి గారి భావం నాకు చాలా బాగా అర్ధం అయింది.  తీరు పూర్తిగా మార్చుకోకపోయినా  కొంత గాడిలో పడ్డాను.  

(10-09-2013) 

మా వూరి తొలి న్యూస్ రీడర్ ఇక లేరు

నాకు ఓనమాలు దిద్దించిన అప్పయ్య మాస్టారు కన్నుమూశారు.
ఆయన్ని తలచుకుని, ఆయన్ని గురించి రాసి, వోనమాలు దిద్దించిన ఆ గురుదేవుని గురించి  ‘గురుపూర్ణిమ’ సందర్భంగా నాలుగు మంచి మాటలు చెప్పుకుని అయిదురోజులు కూడా గడవలేదు.
అప్పయ్య పంతులుగారు చనిపోయారని పదినిమిషాల క్రితం ఖమ్మం నుంచి మా అన్నయ్య కొడుకు రమేష్ ఫోను.
వెంటనే వివరాలకోసం మా వూరు కంభంపాడులో వుంటున్న నా చిన్ననాటి స్నేహితుడు పర్చా రామ్మూర్తికి ఫోను చేసాను. అప్పయ్యగారి ఇంటికి అతడిది మూడో ఇల్లే.


(కీర్తిశేషులు శివరాజు అప్పారావు గారు)

అప్పయ్యగారి వియ్యంకుడు మొన్నీమధ్యనే చనిపోయాడట. నిన్న ఖమ్మంలో పన్నెండోరోజు  కర్మకాండకు హాజరై  రాత్రే తిరిగివచ్చారట. అదీ రానూ పోనూ బస్సులో. ఆయనదేమీ చిన్నాచితకా వయస్సు కాదు. ఈ మధ్యనే ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడిలో పడ్డారట.  అయినా ఎలాటి అనారోగ్యం ఆయన దరిదాపుల్లోకి రావడానికి సాహసించలేదు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  అంత వయస్సులో ఎవరయినా వొంటరిగా బస్సు ప్రయాణం చేయగలగడం అనేది మాటలు కాదు.  నిన్నటి ఖమ్మం ప్రయాణంతో అప్పయ్యగారి జీవనయానం కూడా ముగిసింది. మాకు ఇంత అక్షర బిక్ష పెట్టిన మహానుభావుడు దాటిపోయాడు. నిజంగా మహానుభావులకు మాత్రమే లభించే అనాయాస మరణం ఆయనకు దక్కింది.
మరో యాదృచ్చికం. అప్పయ్యగారి మరణ వార్త గురించిన ఫోను వచ్చినప్పుడు నేను ‘రేడియో రోజులు’ మరో భాగం మొదలు పెడుతున్నాను. ఇందులో కాకతాళీయం ఏమిటంటే అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్.  అదేమిటంటారా!
మాచిన్నప్పుడు గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంద్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. వినే మా బోంట్లకు అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.   
శివరాజు అప్పయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. (10-09-2013)

9, సెప్టెంబర్ 2013, సోమవారం

రేడియో రోజులు - 3


“ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుమలశెట్టి శ్రీరాములు – ఢిల్లీ నుంచి ప్రసారం అవుతున్న ఈ వార్తల్ని మద్రాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలు రిలే చేస్తున్నాయి”
ఉదయం  ఏడుగంటల సమయంలోనో, లేదా రాత్రి ఏడు కొడుతున్నప్పుడో ఈ కంఠస్వరం తెలుగు లోగిళ్లను పలకరిస్తూ వుండేది. వార్తల్లో విషయం కన్నా ఆయన వార్తలు చదివే పధ్ధతి, వాక్యాలను విరుస్తూ,  అక్కడక్కడ నొక్కుతూ ఉచ్చరించే తీరుకోసమే వింటున్నామనే వాళ్లు నాకు చిన్నతనంనుంచీ  తెలుసు. అయితే,  రేడియోలో వినబడే ఆ స్వరం తప్ప శ్రీరాములు గారు యెలా వుంటారో తెలియని వాళ్ళే కాని  ఆయన్ని తెలియని తెలుగు వాళ్లు అంటూ ఎవ్వరు వుండరు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, ఆసేతుహిమాచలం హై పవర్ రేడియో  ట్రాన్స్ మిటర్లు వున్న ప్రతిచోటా ఆయన గొంతు వినబడేది.
ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క బాణీ. ఎవరి స్టైల్ వారిదే. దుగ్గిరాల పూర్ణయ్య, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, జోలిపాళ్యం మంగమ్మ, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి  ఇలా ఎందరో మహానుభావులు. ఎవరికి ఎవరు తీసిపోరు. వార్తలు మధ్యనుంచి విన్నా  చదువుతున్నది పలానా అని చెప్పగలిగేలా తమదయిన తరహాలో వార్తలు చదివేవాళ్ళు. (సందర్భాన్నిబట్టి కొన్ని పేర్లు మాత్రమే  ప్రస్తావించడం జరిగింది. మిగిలిన వారిని కూడా వీలువెంట గుర్తుచేయడం జరుగుతుంది. దురదృష్టం ఏమిటంటే రేడియో అభిమాని అనే బ్లాగులో, మాగంటి వారు నిర్వహించే బ్లాగులో తప్ప వీరిలో కొందరి ఫోటోలు సంపాదించడం అనేది గగన కుసుమంగా మారింది)


(కీర్తిశేషులు తిరుమలశెట్టి శ్రీరాములు - ఫోటో కర్టెసీ శ్రీ సుధామ) 


శ్రీరాములు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా! ఆయన ఢిల్లీ నుంచి కొన్నాళ్ళు మాస్కో వెళ్ళి ఆ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్ళకుండా హైదరాబాదు బదిలీపై వచ్చారు. వార్తలు చదివే పద్దతే కాదు ఆయన ఆహార్యం కూడా ప్రత్యేకమే. ఎప్పుడు ఫుల్ సూటులో కనబడేవారు. ఆరోజుల్లో ప్రాంతీయ వార్తా విభాగం ప్రస్తుతం క్యాంటీన్ వున్న షెడ్లలో వుండేది. అందులో రెండు విశాలమైన గదులు – ఒకదానిలో న్యూస్ బులెటిన్లు తయారుచేసే సిబ్బంది, అంటే న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు, బులెటిన్ టైప్ చేసే వాళ్లు, రెండో గదిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్లు ఆఫీసు అసిస్టెంట్లు కూర్చునే వారు.
నేను చేరినప్పుడు న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధ రావు గారు, కరస్పాండెంట్ ఎం ఎస్ ఆర్ కృష్ణా రావు గారు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ మాడపాటి సత్యవతి గారు, న్యూస్ రీడర్ గా వుంటూనే బులెటిన్లు తయారు చేసే బాధ్యతను ఐచ్చికంగా భుజాలకు ఎత్తుకున్న డి. వెంకట్రామయ్యగారు, సరే, ఆ వరసలో నేనూ. చివర్లో ‘ఈ నేను’ ఎందుకంటే అసలు నేను ఆఫీసుకు వచ్చి పోయేదే చాలా తక్కువ. రిపోర్టింగ్ పని మీద రోజులో ఎక్కువ భాగం బయటే తిరిగేవాడిని.

మరో గదిలో తిరుమలశెట్టి  శ్రీరాములు గారు, ఉర్దూ న్యూస్ రీడర్ వసీం అక్తర్ కూర్చునే వారు. శ్రీరాములు గారు వార్తల టైము కాగానే  ఒక చేతిలో వెలిగించిన సిగరెట్, మరో చేతిలో న్యూస్ బులెటిన్  పట్టుకుని స్టూడియోకు బయలుదేరేవారు. మేమున్న చోటునుంచి స్టూడియోకి కొంతదూరం నడిచి వెళ్ళాలి. శ్రీరాములు గారు అడుగులో అడుగువేసుకుంటూ స్టుడియో దగ్గరికి వెళ్లేసరికి సిగరెట్ అయిపోయేది. వార్తలు చదవడానికి స్టూడియోకి వెళ్లేటప్పుడు యెంత టైం పట్టేదో తిరిగివచ్చేటప్పుడు కూడా సరిగ్గా అంతే సమయం పట్టేదని చెప్పుకునేవారు. వేసే అడుగులు కూడా లెక్కబెట్టినట్టు వుండేవి. ఒక్కోసారి ఏదయినా తాజా సమాచారం అందివ్వడానికి నేను స్టూడియో వైపు పరిగెత్తుకుంటూ వెడుతుంటే శ్రీరాములు గారు మాత్రం  నింపాదిగా నడుస్తూ  మధ్యలోనే కనిపించేవారు. ఆ కాగితం ఆయన చేతిలో పెడితే దాన్ని చదువుకుంటూ అలాగే అంతే  తాపీగా నడుస్తూ వెళ్ళేవారు కాని ఆయనలో ఏమాత్రం ఆందోళన కాని, కంగారు కాని ఏనాడు చూడలేదు. అలాగే ఒక్కోసారి చివరి నిమిషంలో మొత్తం వార్తని తిప్పిరాసి ఇచ్చినా ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా దాన్ని అనువాదం చేసేపనిలో నిమగ్నం అయ్యేవారు. అన్నట్టు చెప్పడం మరిచాను. ప్రాంతీయ వార్తా విభాగంలో మాస్టర్ బులెటిన్ ను ఇంగ్లీష్ లో తయారుచేసి ఇచ్చేవాళ్ళం. దాన్ని కాపీలు తీసి ఇస్తే తెలుగు న్యూస్ రీడర్, ఉర్దూ న్యూస్ రీడర్ తమ భాషల్లోకి అనువదించుకునేవారు. 
(09-09-2013)  

వినాయక చవితి శుభాకాంక్షలు







" వక్రతుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభనిర్విఘ్నమ్ కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.."

వినాయక చవితి శుభాకాంక్షలు

నిర్మలాదేవి-భండారు శ్రీనివాసరావు


8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కలల్లో కూడా కళలు, కళాకారులు గురించి ఆలోచించే ఆర్వీ రమణమూర్తి ఇక లేరు.


డెబ్బయ్యవ దశకం పూర్వార్ధం.
డాక్టర్ సీ.హెచ్. దేవానందరావు గారు వెంగళరావుగారి మంత్రివర్గంలో సభ్యులు. విలేకరులతో చాలా కలుపుగోలుగా వుండేవారు. ఓ సారి శాసనమండలి విరామ సమయంలో బయట లాన్ లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న వేళ, తెల్లటి ప్యాంటు షర్టు ధరించిన వ్యక్తి అక్కడికి వచ్చారు. ఆయన్ని చూస్తూనే మంత్రిగారు “ఏం కింగ్ మేకర్! ఏమిటి సంగతులు” అని పలకరించారు. రమణమూర్తిగారిని కలుసుకున్నది అదే మొదటిసారి. ఆ తరువాత అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇక సరేసరి. ‘(అంజయ్య)ఇంట్లో ఇంద్రసేనారెడ్డి,  రూంలో రమణ మూర్తి’ అని ఈనాడులో కార్టూన్లు కూడా వచ్చాయి. పోతే రోశయ్యగారు మంత్రిగా వున్నా, ముఖ్యమంత్రిగా వున్నా ఇప్పుడు గవర్నర్ గా వున్నా ఏదో ఒక సమయంలో  ఆయన పక్కన రమణమూర్తి వుండాల్సిందే. ఇంతమంది పెద్దవాళ్ళు తెలిసివున్నా ఆయన బావుకుంది ఏమీ లేదు. చివర చివర్లో రోశయ్య గారు ఇచ్చిన ఓ పదవి (రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు) తప్పిస్తే. రమణమూర్తి అనగానే చాలామంది సభలు సన్మానాలు అంటారు కాని కళాకారులను గుర్తించి వాళ్ళను ప్రోత్సహించడానికి ఆయన పడ్డ పాట్లు వారికి తెలవవు. ఎంతోమంది సినిమా వాళ్ళతో సన్నిహిత పరిచయం వున్నప్పటికీ  రమణమూర్తి తీసిన సినిమాలు చాలా తక్కువే, కాని, వాసిలో మాత్రం చాలా చాలా ఎక్కువ.


కీర్తిశేషులు ఆర్వీ రమణమూర్తి 

రమణమూర్తి స్వతహాగా కళాకారుడేమీ కాదు. కాకపోతే వాళ్లని అభిమానించడం, గౌరవించడం ఆయనకు స్వతహాగా అబ్బిన గుణం. ఆయన లేని లోటు ఆయన కుటుంబానిదే కాదు యావత్ కళాకారుల కుటుంబానిది.
స్వర్గంలో కూడా ఆయన చేసేది కళా పోషణే. సందేహం లేదు.

మిత్రుడిగా ఆయనకు నా నివాళి.  (08-09-2013)    

అమెరికాలో గణేష్ నిమజ్జనం


మూడేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు మధ్యలో  వినాయక చవితి పర్వదినం వచ్చింది. కొబ్బరికాయలతో సహా పూజా సామగ్రి యావత్తు ఇండియన్ స్టోర్ లో దొరుకుతాయి కానీ మట్టి వినాయకుడు యెట్లా. మా వాడు సందీప్ కొనుక్కున్న ఇంటి పెరట్లో చక్కటి బంక మన్ను కనబడింది. అంతే ! దాంతో వినాయకుడి  ప్రతిమను కాస్త అటూ ఇటూగా గుర్తుపట్టే విధంగా తయారు చేసాను. ఇందులో మా మనుమరాళ్ళు సఖి, సృష్టి బాగా సహకరించారు. పూజ పూర్తి అయింది. వుండ్రాళ్ళు తయారు చేయడం,  ఆ సాయంత్రం ఇళ్ళ కప్పుపై విసరడం అంతా సజావుగా సాగిపోయింది. కానీ అసలు చిక్కల్లా గణేష్ ప్రతిమను నిమజ్జనం చేయడం ఎల్లా అన్నదే. సియాటిల్ నీటి  వనరులకు ప్రసిద్ధి. కనుచూపు మేరలో  ఎటు చూసినా పెద్ద పెద్ద సరస్సులే.  కానీ గణేష్ ప్రతిమను నిమజ్జనం చేయడం అంత తేలిక కాదు. అక్కడి చట్టాలు వొప్పుకోవు. అందుకని కారేసుకుని లాంగ్ డ్రైవ్ లో వూరు దాటి వెళ్ళి అనేక మైళ్ల దూరంలో నిర్జన ప్రదేశంలో కనబడిన ఓ సరస్సులో, ఒక రకంగా చెప్పాలంటే, ఎవ్వరికంటా పడకుండా   నిమజ్జనం చేసివచ్చాము.  











(08-09-2013)