9, సెప్టెంబర్ 2013, సోమవారం
8, సెప్టెంబర్ 2013, ఆదివారం
కలల్లో కూడా కళలు, కళాకారులు గురించి ఆలోచించే ఆర్వీ రమణమూర్తి ఇక లేరు.
డెబ్బయ్యవ దశకం పూర్వార్ధం.
డాక్టర్ సీ.హెచ్. దేవానందరావు గారు వెంగళరావుగారి
మంత్రివర్గంలో సభ్యులు. విలేకరులతో చాలా కలుపుగోలుగా వుండేవారు. ఓ సారి శాసనమండలి
విరామ సమయంలో బయట లాన్ లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న వేళ, తెల్లటి
ప్యాంటు షర్టు ధరించిన వ్యక్తి అక్కడికి వచ్చారు. ఆయన్ని చూస్తూనే మంత్రిగారు “ఏం కింగ్
మేకర్! ఏమిటి సంగతులు” అని పలకరించారు. రమణమూర్తిగారిని కలుసుకున్నది అదే
మొదటిసారి. ఆ తరువాత అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇక సరేసరి. ‘(అంజయ్య)ఇంట్లో
ఇంద్రసేనారెడ్డి, రూంలో రమణ మూర్తి’ అని
ఈనాడులో కార్టూన్లు కూడా వచ్చాయి. పోతే రోశయ్యగారు మంత్రిగా వున్నా, ముఖ్యమంత్రిగా
వున్నా ఇప్పుడు గవర్నర్ గా వున్నా ఏదో ఒక సమయంలో ఆయన పక్కన రమణమూర్తి వుండాల్సిందే. ఇంతమంది
పెద్దవాళ్ళు తెలిసివున్నా ఆయన బావుకుంది ఏమీ లేదు. చివర చివర్లో రోశయ్య గారు
ఇచ్చిన ఓ పదవి (రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు) తప్పిస్తే. రమణమూర్తి అనగానే చాలామంది సభలు సన్మానాలు అంటారు కాని
కళాకారులను గుర్తించి వాళ్ళను ప్రోత్సహించడానికి ఆయన పడ్డ పాట్లు వారికి తెలవవు.
ఎంతోమంది సినిమా వాళ్ళతో సన్నిహిత పరిచయం వున్నప్పటికీ రమణమూర్తి తీసిన సినిమాలు చాలా తక్కువే, కాని,
వాసిలో మాత్రం చాలా చాలా ఎక్కువ.
కీర్తిశేషులు ఆర్వీ రమణమూర్తి
రమణమూర్తి స్వతహాగా కళాకారుడేమీ కాదు. కాకపోతే
వాళ్లని అభిమానించడం, గౌరవించడం ఆయనకు స్వతహాగా అబ్బిన గుణం. ఆయన లేని లోటు ఆయన కుటుంబానిదే
కాదు యావత్ కళాకారుల కుటుంబానిది.
స్వర్గంలో కూడా ఆయన చేసేది కళా పోషణే. సందేహం
లేదు.
మిత్రుడిగా ఆయనకు నా నివాళి. (08-09-2013)
లేబుళ్లు:
ఆర్వీ రమణమూర్తి
అమెరికాలో గణేష్ నిమజ్జనం
మూడేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు మధ్యలో వినాయక
చవితి పర్వదినం వచ్చింది. కొబ్బరికాయలతో సహా పూజా సామగ్రి యావత్తు ఇండియన్ స్టోర్
లో దొరుకుతాయి కానీ మట్టి వినాయకుడు యెట్లా. మా వాడు సందీప్ కొనుక్కున్న ఇంటి
పెరట్లో చక్కటి బంక మన్ను కనబడింది. అంతే ! దాంతో వినాయకుడి ప్రతిమను కాస్త అటూ ఇటూగా
గుర్తుపట్టే విధంగా తయారు చేసాను. ఇందులో మా మనుమరాళ్ళు సఖి, సృష్టి బాగా
సహకరించారు. పూజ పూర్తి అయింది. వుండ్రాళ్ళు తయారు చేయడం, ఆ సాయంత్రం ఇళ్ళ కప్పుపై విసరడం అంతా సజావుగా
సాగిపోయింది. కానీ అసలు చిక్కల్లా గణేష్ ప్రతిమను నిమజ్జనం చేయడం ఎల్లా అన్నదే.
సియాటిల్ నీటి వనరులకు ప్రసిద్ధి. కనుచూపు మేరలో ఎటు
చూసినా పెద్ద పెద్ద సరస్సులే. కానీ గణేష్
ప్రతిమను నిమజ్జనం చేయడం అంత తేలిక కాదు. అక్కడి చట్టాలు వొప్పుకోవు. అందుకని
కారేసుకుని లాంగ్ డ్రైవ్ లో వూరు దాటి వెళ్ళి అనేక మైళ్ల దూరంలో నిర్జన ప్రదేశంలో కనబడిన
ఓ సరస్సులో, ఒక రకంగా చెప్పాలంటే, ఎవ్వరికంటా పడకుండా నిమజ్జనం చేసివచ్చాము.
(08-09-2013)
లేబుళ్లు:
అమెరికాలో గణేష్ నిమజ్జనం
7, సెప్టెంబర్ 2013, శనివారం
రేడియో రోజులు - 2
వెనుకటి రోజుల్లో ఇతర ప్రాంతాలనుంచి విద్యార్ధులు
హైదరాబాదు ఎక్స్ కర్షన్ కు వస్తే వాళ్లకు చూపించే ప్రదేశాల్లో రేడియో స్టేషన్ కూడా
వుండేది. బేగం పేట ఏరోడ్రోం (విమానాశ్రయం అనే వాళ్ళు కాదు ఏరోడ్రోం అంటేనే చెప్పుకోవడానికి గొప్పగా
వుండేది. ఆరోజుల్లో ఇప్పట్లా కాదు, రోజు మొత్తంలో కలిపి ఒకటీ అరా విమానాలే హైదరాబాదు వచ్చి వెళ్ళేవి. కొన్ని నైట్
హాల్ట్ బస్సుల మాదిరిగా రాత్రంతా అక్కడే వుండి మరునాడు బయలుదేరి వెళ్ళేవి. అందుకని స్కూలు పిల్లల్ని తీసుకువచ్చిన
మాస్టర్లు కూడా ఏదో ఒక విమానం వచ్చే టైమో, వెళ్ళే టైమో ముందుగా కనుక్కుని అక్కడికి
తీసుకువెళ్ళేవాళ్ళు. విమానాశ్రయం మేడ మీద అద్దాల కిటికీల్లో నుంచి విమానం దిగివస్తున్న వాళ్ళను చూసి
సంతోషంతో కేరింతలు కొట్టేవాళ్ళు), అల్లాగే అసెంబ్లీ బిల్డింగ్, దానిపక్కనే పబ్లిక్
గార్డెన్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం ఇలా అన్ని చోట్లకీ తిప్పి వెనక్కి
తీసుకుపోయేవాళ్ళు. తరువాత తరువాత ఈ జాబితాలో నెహ్రూ జూ పార్కు, రవీంద్రభారతి వచ్చి
చేరాయి.
ఇంతకుముందే చెప్పినట్టు
గొప్ప సంస్థల్లో పనిచేసే అవకాశం రావడం వల్ల అంతవరకూ చాలా గొప్పవాళ్ళు, వీళ్ళను
ఒక్కసారి కలిస్తే చాలు అనుకున్నవాళ్ళతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం లభిస్తుంది. రేడియోలో చేరడం వల్లనే, పన్యాల
రంగనాధ రావు గారు, తిరుమలశెట్టి శ్రీరాములు గారు, మాడపాటి సత్యవతి గారు, డి.వెంకట్రామయ్య
గారు ఇలాటి గొప్ప స్వర సంపన్నులతో సహోద్యోగిగా సాంగత్యం చేసే స్వానుభవం సొంతం
అయింది. (నిజానికి రేడియో వార్తల్లో ‘గారు’ వాడరు ‘శ్రీ’ తప్ప. కానీ ఈ గొప్పవారిపట్ల
పెంచుకున్న గౌరవంతో ‘గారు’ చేర్చి గౌరవించుకుంటున్నాను. జర్నలిజం వృత్తిలో
చేరినప్పుడే సీనియర్లు, జూనియర్లు అనే తేడా వొదులుకోవాలని, ‘హోదాలతో’ సమకూరే
పెద్దరికాలను పక్కనబెట్టాలని నా పెద్దలు నాకు నేర్పిన పాఠం. అందుకే నా వృత్తి
జీవితంలో నాకు ఎవ్వరూ ‘బాసులు’ కారు, నేను ఎవ్వరికీ ‘బాసును’ కాను. ఇదే సూత్రాన్ని
నేను మూడు దశాబ్దాలపాటు పాటించాను. ఆచరించాను. (07-09-2013)
లేబుళ్లు:
రేడియో రోజులు - 2
తప్పులున్న క్షమించగలరు
పూర్వం
కార్డులు, కవర్లు
రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా ‘తప్పులున్న
క్షమించగలరు’
అనే అభ్యర్ధనతో ముగిసేది.
సంఘజీవనంలో
తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో
సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం
బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు , రోజువారీ ‘సారీ’ అనే పదాన్ని
ఉదారంగా ఎక్కువసార్లు వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట
మాట్లాడితే ‘ఇజ్వెనీచ్
పజాలుస్త’ (సారీ
ప్లీజ్) అంటారు. అసలు క్షమించమని కోరడం, క్షమాగుణం
కలిగివుండడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని
సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాకపోతే, కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ
సంఖ్య మాత్రం పెరుగుతోంది.
చర్చికి
వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి, చేసిన
తప్పులను దేవుడికి నివేదింఛి, క్షమాపణలు
కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది. జైనులు
పాటించే విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా
అని ప్రచారం లోకి వచ్చింది. దీని వాళ్లు ‘మిచ్చామి
దుఖఃడం’ అని
పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు
దీన్ని పాటిస్తారు. మిచ్చామి దుఖః డం అనేది ప్రాకృతంలో ఒక పద బంధం.
మిచ్చామి
అంటే మరచిపోవడం,
మన్నించడం అని అర్ధం.
దుఖః డం
అంటే దుష్క్రు త్యాలు. చేసిన చెడ్డ పనులు అని అర్ధం.
జైనులు
ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున – భాద్రపద
శుద్ద చవితి నాడు ఒకరికొకరు ‘నేను
చేసిన తప్పులను మన్నించండి’ అని మనవి చేసుకుంటారు.
అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు.
ఫోన్ల ద్వారా,
ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది. (07-09-2013)
లేబుళ్లు:
‘మిచ్చామి దుఖఃడం’
ఎద్దు పుండు కాకికి రుచి
లేబుళ్లు:
సోనియాగాంధీ,
Sonia Gandhi
6, సెప్టెంబర్ 2013, శుక్రవారం
రేడియో రోజులు (ప్రారంభం)
పాటల్లోనే కాదు మాటల్లో
కూడా సంగీతం వినవచ్చు. ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.
డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు
రేడియో కేంద్రం నుంచి సరిగ్గా సాయంత్రం అయిదు
గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.
‘యే ఆకాష్ వాణి హైదరాబాద్
హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే’
ఉర్దూ తెలియని వాళ్లు కూడా
వసీం అక్తర్ చదివే వార్తలు వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం
వింటున్నట్టుగా వుండేది. నేను ఆయనతో కలిసి
చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను.
కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా పెద్దవా అన్న మాట అటుంచి
గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది.
దేశానికి స్వాతంత్ర్యం
రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో
ప్రసారాలు మొదలయ్యాయి. 1933 లో రెండువందల వాట్ల
ట్రాన్స్మిషన్ శక్తితో, ‘డెక్కన్ రేడియో’
అనే పేరుతో ఒక ప్రైవేటు రేడియో స్టేషన్ ను
హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఆ రేడియో ట్రాన్స్ మిటర్ ను స్తానికంగా రూపొందించడం విశేషం. వాస్తవానికి
ఈ రేడియో కేంద్రం ఒక కుటుంబం ఆద్వర్యంలో
ఏర్పడింది. ఆ కుటుంబసభ్యులే కేంద్రం
నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. చిరాగ్ ఆలీ లేన్ లోని ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో
కేంద్రం పనిచేసేది.
ఉర్దూలో
వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు, పాటలు
ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు.
దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను
రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి
మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో
ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ
కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.
మొహరం
మాసంలో రేడియో కేంద్రానికి సెలవు
ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.
ఆ తరువాత కొన్ని మార్పులు
చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా
సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల
ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే
వార్తల్లో చోటుచేసుకునేది.
రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్ రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం
చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్ లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు
పెట్టింది. నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో
డెక్కన్ రేడియో కేంద్రానికి మరిన్ని
హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన
రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో
కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతా బాద్ లోని యావర్ మజిల్ అనే భవనంలోకి
మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు. నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా
నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక
ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని
లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.
(డెక్కన్ రేడియో స్టూడియోలో అలనాటి సంగీతకారులు)
తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి విశేషమైన ఆదరణ లభించడం
అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్ బరడేకర్,
ఆవిడ సోదరి సరస్వతీ రాణే వంటి సుప్రసిద్ధ
సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత
కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్
రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చారు.
డెక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా కొన్ని
కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి కాని వాటి వ్యవధి చాలా పరిమితం.
(సమాచార సేకరణకు సహకరించిన అనేకానేకమందికి అనేక వందనాలు. కృతజ్ఞతలు –
భండారు శ్రీనివాసరావు - 06-09-2013)
లేబుళ్లు:
ఆకాశవాణి,
డెక్కన్ రేడియో,
All India Radio
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)











