21, ఆగస్టు 2013, బుధవారం
అనాయాస మరణం - దేవుడిచ్చే వరం
కీర్తిశేషులు శ్రీ భండారు పర్వతాలరావు గారు
ఎన్నడయినా చూసారా
ఆయన మొహంలో చిరునవ్వు చెరగడం
ఎప్పుడయినా గమనించారా
అన్ని బాధలు, అందరి వ్యధలు
గుండెల్లో దాచుకోవడం
భాద్యతలన్నీ మోసీ మోసీ
ఆ చిన్ని గుండె అలసిపోయింది
అంతులేని దూరాలకు
అన్నయ్యని తీసుకుపోయింది
అనాయాస మరణం
దేవుడిచ్చే అభయం
నిజమయిన భక్తుడు కనుకే
అన్నయ్యకు దక్కిందా వరం
( మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు పుట్టపర్తిలో 2006 ఆగస్టు 21 నాడు ఆకస్మికంగా మరణించినప్పుడు రాసిన అశ్రుగీతిక - భండారు శ్రీనివాసరావు)
20, ఆగస్టు 2013, మంగళవారం
1991 లో ఒక రోజు
మాస్కోలో ఆ సాయంత్రం తెలిసిన
తెలుగు కుటుంబాలనన్నింటినీ భోజనానికి ఆహ్వానించాను. పిలిచిన వాళ్లందరూ కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. డిన్నరుకు
సర్వం సంసిద్ధం. అంతా ముచ్చట్లు చెప్పుకుంటూ కులాసాగా కాలక్షేపం చేస్తున్న సమయంలో
ఫోను మోగింది. అవతల పీ.టీ.ఐ. మాస్కో విలేఖరి.
ఆయన చెప్పింది చెవులో
పడగానే రిసీవర్ చేతిలోనుంచి జారి పోయింది. ‘రాజీవ్ గాంధి ఈజ్ నో మోర్’
ఎక్కడో తమిళనాడులో
చెన్నైకి దగ్గర్లో నోరు తిరగని పేరు కలిగిన ఒక వూళ్ళో బాంబు బ్లాస్ట్ జరిగింది.
రాజీవ్ గాంధి అక్కడికక్కడే చనిపోయాడు.
వార్త తెలిసి ఇంటికి
వచ్చిన వాళ్ళందరూ నిశ్చేష్టులయ్యారు. అన్నం ముడితే వొట్టు.
నేను హైదరాబాదు ఫోను
చేసాను. రాజభవన్ లో పనిచేస్తున్న నా స్నేహితుడు జ్వాలాకి. విషయం చెప్పకుండా అడిగాను
ఏదయినా జరగరానిది జరిగిందా అని. ఏం లేదు అంతా బాగానే వుంది అన్నాడు. అప్పుడు అసలు
విషయం చెప్పాను. కాసేపటి తరువాత విన్న విషయం నిజమే అని నిర్ధారణ అయింది.
నిజంగా విషాదకరమైన రోజు. భారత
దేశానికి దిశా నిర్దేశనం చేసిన ఆ యువ నాయకుడికి శ్రద్ధాంజలి. (20-08-2013)ఏవస్తువయినా ఆరణాలే
లేబుళ్లు:
ఏవస్తువయినా ఆరణాలే
చిత్రమైన 'చిత్రం'
కొన్ని చిత్రంగా అనిపిస్తాయి. ఈ చిత్రం అలాటిదే.
ఇందులో ఒకరు ఫేస్ బుక్ మిత్రుల్లో చాలామందికి పరిచితుడే. జాగర్లమూడి రామకృష్ణ.
సీనియర్ జర్నలిస్టు. పోతే రెండో వారే ‘ఈచిత్ర నాయకుడు’ అక్షరాలా నలభయ్ మూడేళ్ళ(?)
క్రితం చూసిన ఈ వ్యక్తిని ఈ రోజు మళ్ళీ ఈ ఫోటోలో చూస్తున్నాను. వీరి పేరు
గుడిమెట్ల జగన్నాధ శర్మ గారు. ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంటులో పనిచేసి స్వచ్చంద
పదవీ విరమణ చేసి ప్రసుతం హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ లో వుంటున్నారు. శర్మగారితో
నాకో అవినాభావ సంబంధం ఒకటుంది. అలాటిది ఒకటుందని కూడా ఈ రోజే తెలిసింది. మా ఆవిడతో
నా పెళ్లి, ‘ ప్రేమ పెళ్లి’ కావడం మూలాన, మరీ మూడో కంటికి కూడా తెలియకుండా జరిగిందని
చెప్పలేను కానీ, తిరుపతి (తిరుమల) లో
జరిగిన ఆ మా పెళ్ళికి ‘అక్షరాలా’ మూడో ‘సాక్షి’
శర్మగారే. అదీ ఈ రోజు ఆయన ఫోనులో చెబితేనే తెలిసింది. 1971 డిసెంబరు 16 వ తేదీన ( సరిగ్గా ఆ రోజునే
తూర్పు పాకీస్తాన్ విమోచన జరిగి బంగ్లాదేశ్ గా అవతరించింది) మద్రాసు నుంచి తిరుపతికి
వెళ్ళినప్పుడు ఆ కారులో శర్మ గారు కూడా వున్నారుట. ‘ట’ ఏముంది, ఈ విషయాన్ని ఆయనే ధృవీరించారు
కాబట్టి ఇక పేచీ లేదు. అంత ముఖ్యమైన వ్యక్తిని యెందుకు మరిచిపోయానన్నవిషయంలో ఇక
ఆయనే నాతొ పేచీ పెట్టుకోవాలి. కానీ మనిషిని (ఫోటోలో) చూస్తుంటే పేచీకోరులా
కానరావడం లేదు. ఆ రోజు పెళ్లి భోజనం ఎట్లాగో పెట్టలేదు కాబట్టి, ఇన్నేళ్ళ తరువాత ‘ఆ లాంఛనం’ తీర్చుకునే అవకాశం శర్మ గారు ఇస్తారన్న
నమ్మకం వుంది. పోతే, ఈ ‘చిత్ర’ విజయానికి సూత్రధారి, కర్తా కర్మా క్రియా అయిన మిత్రుడు జాగర్లమూడి రామకృష్ణకు, ‘సారా మామూలు’గా
కృతజ్ఞతలు.
(మిత్రుడు జాగర్లమూడి రామకృష్ణ తో అలనాటి మా పెళ్లి పెద్ద గుడిమెట్ల జగన్నాధ శర్మ గారు)
లేబుళ్లు:
మా పెళ్లి పెద్ద
నిర్ణయానికి ముందు ఆ తరువాత (ఆధారం ఈనాటి టీవీ స్క్రోలింగులు)
"తెలంగాణా విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా
మాకు శిరోధార్యం" – అన్ని ప్రాంతాల కాంగ్రెస్ నేతలు
"హైదరాబాదును వొదిలేదంటున్న టీ కాంగ్రెస్ నేతలు"
"హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రం చేయాలి" – మంత్రులు
దానం నాగేందర్, ముఖేష్ గౌడ్
"ఉత్తరాంధ్రతో గ్రేటర్ తెలంగాణా ఏర్పాటు చేయాలని రేణుకాచౌదరి విజ్ఞప్తి"
"హైదరాబాదును యూటీ లేదా ప్రత్యేకరాష్ట్రం చేయాలి" – కేంద్రమంత్రి కావూరి
సాంబశివరావు
ఏవిటో ఒక్క ముక్క అర్ధం అయిచావదు.
అయినా ఒక్క తల పగలగొట్టుకోవడానికి ఇన్ని ‘రాళ్ళు’
కావాలా?
(20-08-2013)
లేబుళ్లు:
కాంగ్రెస్ నాయకులు,
తెలంగాణా
బాబుగారితో ఓ సాయంత్రం
నిన్న సాయంత్రం ఒక టీవీ ఛానల్ నుంచి తిరిగి
వస్తుంటే ఫోను.
చిరపరిచితమైన నెంబరు. తెలుగుదేశం పార్టీ ప్రధాన
కార్యాలయం ఎన్టీయార్ భవన్ నుంచి ఆ ఫోను. అయిదేళ్ళ క్రితం వరకు ఆ నంబరు నుంచి రోజూ అనేక ఫోన్లు వచ్చేవి. అప్పుడు నేను దూరదర్శన్/
ఆకాశవాణిలో విలేకరిగా పనిచేస్తున్నాను.
‘ఎడ్వైజర్ కృష్ణయ్య గారు మాట్లాడుతారు’ ఆపరేటర్
పలకరింపు.
టీటీడీ ఈవోగా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా
జర్నలిస్టులందరికీ కృష్ణయ్య గారు చిరపరిచితులు. ఉన్నత ఉద్యోగం వొదులుకుని రాజకీయ
రంగ ప్రవేశం చేశారు.
‘రేపు (అంటే ఈ సాయంత్రం) నాలుగు గంటలకు బాబుగారు
మీడియా విశ్లేషకులు కొందరితో ఇష్టాగోష్టిగా ముచ్చటించాలని అనుకుంటున్నారు. మీరు
కూడా వస్తే బాగుంటుంది’
జర్నలిస్టుగా పదవీ విరమణ చేసినప్పటినుంచి మళ్ళీ
ఏనాడు ఏపార్టీ గుమ్మం కూడా ఎక్కలేదు.
కానీ కాదనడానికి కూడా కారణం కనిపించలేదు.
ఎందుకంటే అది విలేకరుల సమావేశం కాదు. పార్టీ ఆఫీసులో కూడా కాదు. చంద్రబాబునాయుడి
గారి ఇంట్లో.
ఇంటికి వచ్చి చూస్తే టీవీల్లో స్క్రోలింగులు
వస్తున్నాయి, రాష్ట్ర రాజకీయ పరిస్తితులపై
మీడియా విశ్లేషకులతో చంద్రబాబు సమావేశం అంటూ. ఆయన ఏం అడుగుతారు ? ఏం చెప్పాలి ? ఇప్పటికే మీడియా విశ్లేషకుల మీద సోషల్ మీడియాలో అనేక రకాల
వ్యాఖ్యలు వెలువడుతున్నాయి, చక్రాంకితాలు కనబడని ఆయా పార్టీల అధికార ప్రతినిధులని.
ముప్పయ్యేళ్ళ పైచిలుకు విలేకరి జీవితంలో కూడా
ఏనాడు ప్రశ్నలు వేసే అలవాటు చేసుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులను, సీనియర్
అధికారులను వేలేకరుల సమావేశాల్లో కొందరు
ప్రశ్నించే తీరుతెన్నులు గమనించిన తరువాత ప్రశ్నలు అడిగే పద్దతికే నేను స్వస్తి చెప్పాను. కీర్తిశేషులు
హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ గారి నుంచి నేను
నేర్చుకున్న పాఠం ఇది. ఆయన ఒకసారి నాతో అన్నారు, ‘ఒక తమాషా చూశారా. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నవారినీ, వారు అడిగే
ప్రశ్నలను గుర్తు పెట్టుకోండి. రేపు వాళ్ల పత్రికల్లో వాటిని గురించి ప్రస్తావన
ఏమైనా వుంటుందేమో గమనించండి.’
అయితే ఇది ఆయన చేసిన ఒక సాధారణ పరిశీలనగానే పరిగణించాలి తప్ప జర్నలిస్టులను అందరినీ ఉద్దేశించి చేసినదిగా భావించనక్కరలేదు.
అయితే, ఆయన మరో మాట కూడా చెప్పారు. ‘
‘కొందరు విలేకరులు ఆర్భాటం కోసం వేసే ప్రశ్నలకు
నాయకులు చెప్పే జవాబులను జాగ్రత్తగా గమనిస్తే మంచి వార్తను పట్టుకునే అవకాశం
వుంటుంది. కాబట్టి ఎంతో అవసరం అనుకుంటే తప్ప ప్రశ్నల జోలికి పోకుండా ‘వినదగునెవ్వరుచెప్పిన’
పాలసీ పెట్టుకుంటే మనం సవివరమైన వార్త అందించడానికి వీలుంటుంది.’
చూసి నేర్చుకోవాలంటారు. కానీ వినడం ద్వారా కూడా
నేర్చుకోవచ్చు.
ఏదిఏమైనా, చంద్రబాబు గారిని ఎన్నో ఏళ్ళ తరువాత
కలుసుకోబోతున్నాను.
షరా మామూలుగా ఆయనే చెబుతారా లేక ఎవరైనా చెప్పింది
వింటారా ?
వేచి చూడాలి.
(20-08-2013 – 10 AM)
లేబుళ్లు:
చంద్రబాబు నాయుడు,
Chandrababu Nayudu
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)






