2, ఫిబ్రవరి 2013, శనివారం

ముగింపు తెలియని కధ








ఫోను  గణగణమంది.
గుండెలు బిగబట్టుకుని ఎత్తాను. ఏం మాట్లాడాలో తెలియదు. ఆవేశంలో ఏం మాట్లాడుతానో తెలియదు. నా సంగతి నాకు బాగా తెలుసు కనుక ముందే రాసి పెట్టుకున్న కాగితాన్ని వొణుకుతున్న చేతులతో గట్టిగా పట్టుకుని, ‘హలో’ అన్నాను.  
అవతలనుంచి ఏమీ వినిపించలేదు. ఆ నిశ్శబ్ధం చాలు నా మనసును నా వశంలో లేకుండా చేయడానికి. కోపం కట్టలు తెంచుకునే లోగా  నెమ్మదిగా ‘ఉ’ అని భారంగా  వినిపించింది.
నేననుకున్న రెస్పాన్స్ రాకపోవడంతో నాకు వొళ్ళు మండిపోయింది. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియని పరిస్తితి  దాపురించింది.
‘ఇక నీవు రానక్కరలేదు. ఇంతటితో మన ఆలుమగల సంబంధం సరి’
ఫోనులో సన్నగా రోదిస్తున్న ధ్వని. కానీ నా పట్టుదలముందు నాకేమీ పట్టదు. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి. నేను రమ్మన్నట్టుగా  పుట్టింటి నుంచి రెండు రోజుల్లో వచ్చి వాలిపోవాలి.
‘మా నాన్న గారు వూళ్ళో లేరు. రాగానే రిజర్వేషన్ చేయించుకుని వారం రోజుల్లో వచ్చేస్తాము. లేకపోతే చంటి పిల్లవాడితో ప్రయాణం ఇబ్బంది. దయచేసి అర్ధం చేసుకోండి. మొండి పట్టు పట్టకండి. మీకు చెప్పాల్సినదాన్ని కాను. మీరూ చెప్పించుకోవాల్సిన మనిషి కారు’
నేను కోపం వస్తే మనిషిని కాను. కానీ, వేరే వాళ్లు ఆ నిజాన్ని నా మొహం మీదే చెబితే విని వూరుకునే ఉదారగుణం నాకు లేదు.
‘ఇక నీతో మాట్లాడే తీరుబడి నాకు లేదు. అలాగే, ఇక నీకూ నాకూ సంబంధం లేదు. ఫోను పెట్టేస్తున్నాను.’ ఇలాంటిదేదో చెత్త నోటికి వచ్చినట్టు వాగి ఫోను పెట్టేశాను.
పురిటికి పుట్టింటికి వెళ్లి, పండంటి తొలి చూలు బిడ్డతో, పుట్టెడు సంతోషంతో తిరిగివచ్చే భార్యతో ఈ ప్రపంచంలో యే మగాడూ ఇలా మాట్లాడడు. కానీ నా తరహాయే వేరాయే. అది నా ఒక్కడికే చెల్లు.
పట్టింపులు, పంతాలు నా మనసును చెదలా పట్టి, నా జీవితాన్ని కొరుక్కు తినేస్తున్నాయి. అంతటితో పోతే ఇబ్బంది లేదు. నన్ను ప్రేమించి, నాకోసం అయినవారందరిని కాదనుకుని వచ్చి  నా ఇల్లాలిగా నాతో  జీవితం పంచుకుని, తన నడవడితో, మంచితనంతో  మెట్టింటివారిని మెప్పించి, పుట్టింటి వారిని వొప్పించి తనకో సంసారాన్ని, నాకో సంసార జీవితాన్ని అందించి మాతృత్వపు మాధుర్యం చవి  చూసే తరుణంలో నా నోటి నుంచి ఇలాటి మాటలు.
ఫోను బూతునుంచి బయటపడి తడబడే నడకతో ఇంటి దారి పట్టాను. వర్షం పడుతోంది. రిక్షా పిలవాలని కూడా అనిపించలేదు. అలా తడుస్తూనే ఇంటికి చేరాను. తాళం తీసి లోపలకొచ్చాను. అద్దంలో మొహం చూసుకుంటే నేనేనా అనిపించింది. మనసులో వికారపు ఆలోచనలు సుళ్ళు తిరుగుతూ వుంటే మొహం యెందుకు బాగుంటుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారందుకే కాబోలు. గడ్డం పెరిగింది. వాన నీటి  చుక్కలు తల వెంట్రుకల కొసలనుంచి కారుతున్నాయి. తల తుడుచుకోవాలని అనిపించలేదు. బట్టలు మార్చుకోవాలని అనిపించలేదు

కరెంటు పోయినప్పుడు టీవీ ఆగిపోయినట్టు హఠాత్తుగా ఆగిపోయింది.
ముడతలు పడిన కాగితంలో రాసివున్న  వాక్యాల వెంట పరిగెత్తుతున్న నా కళ్ళు కూడా అలాగే ఆగిపోయాయి.
కొత్తగా కిరాయికి తీసుకున్న ఇంటిని సర్డుకుంటుంటే కళ్లబడిన కాగితం అది.  
ఎవరితను? రచయితా? అతడు మొదలుపెట్టి పూర్తిచేయని కధలో భాగమా?  భార్యకు రాసిన లేదా రాసి పోస్ట్ చేయని ఉత్తరమా? అలా అయితే అసంపూర్తిగా యెందుకు వుంది?
ఆవిడ పుట్టింటి నుంచి వచ్చిందా? అతడికంత ఆవేశం వచ్చి ఆ విధమయిన ఉత్తరం రాయాలని అనుకోవడానికి కారణం యేమయివుంటుంది?
కొన్ని విషయాలు అంతే! అర్ధం అయ్యీ అవనట్టు వుంటాయి. (02-02-1978)
     

Open Secret - Debate on NTR Statue Issue (TV5)

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఇదేరా జీవితం !





(కధలకోసం కంచికే పోనక్కరలేదు.వెతుక్కుంటే జీవితాల్లోనే కనబడతాయని ప్రబోధిస్తూ నెట్లో సంచరిస్తున్న ఆంగ్ల కధనానికి  స్వేచ్చానువాదం. ఆస్ట్రేలియాలోని  వృద్ధుల సంరక్షణ కేంద్రంలో  ఓ ముదివగ్గు మరణిస్తూ వొదిలి వెళ్ళిన ఓ లేఖ ఇది. - భండారు శ్రీనివాసరావు)

‘అప్పుడు నాకు పదేళ్లు. అమ్మానాన్న, అన్నలు,తమ్ముళ్ళు,అక్కలు చెల్లెళ్ళు ఒకరికోసం ఒకరు, అందరికోసం అందరూ.
‘పదహారేళ్ళు వచ్చేసరికి మొలుచుకొచ్చాయి కాళ్ళకు రెక్కలు.
‘ఇల్లు పట్టదు. ఇంట్లోవాళ్ళు పట్టరు. ఏ ఆడపిల్లను చూసినా నా కోసమే పుట్టిందనే నమ్మకం.
‘పాతికేళ్ళు వచ్చాయి. వెనక్కు తిరిగి చూసుకుంటే అన్నీ నెరవేర్చని హామీలే నిలబెట్టుకోలేని వాగ్దానాలే.
‘మూడుపదుల వయస్సు మీదపడింది. పెళ్లయింది. పిల్లలు పుట్టారు. బాధ్యతలు మీద పడ్డాయి.
‘మరో అయిదేళ్లు గడిచాయి. పిల్లలు పెరుగుతున్నారు. పిల్లలతో పాటే వారితో అనుబంధాలు పెరుగుతున్నాయి. భుజానపడ్డ బరువు బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి.
‘నలభయ్యో పడిలో పడేసరికి చదువులపేరుతోనో, ఉద్యోగాల పేరుతోనో  పిల్లలు బయటి వూళ్ళ బాట పట్టారు. బాధ్యతల భారం తగ్గింది. కాని వాళ్ళతో దూరం పెరిగింది.
‘చూస్తుండగానే యాభై! అప్పుడే సగం జీవితం గడిచిపోయిందా!
‘అనుకునేంతలో కాస్త స్వాంతన. పిల్లల పిల్లలతో బతుకు కొత్త చిగురు వేస్తోందన్న చిన్న ఆశ.
‘బాధ్యతలు పూర్తికాకుండానే షష్టిపూర్తి.
‘పెట్టుకున్న ఆశలు ఆకాంక్షలు తీరకుండానే నేను పుట్టిన సంవత్సరం గిర్రున తిరిగొచ్చి పలకరించింది.       
‘మరో పదేళ్లు గడిచాయి. విధి చావుదెబ్బ కొట్టింది.
‘నాతో  జీవితాన్ని పంచుకుని, నా వెంటే నడిచివస్తున్న నా సహధర్మచారిణి ‘ఇంక  సెలవం’టూ  శాశ్వితంగా సెలవు తీసుకుంది.
‘నా ముసలితనాన్ని కూడా లెక్కచేయకుండా వొంటరితనం నన్ను కౌగలించుకుంది. ఆ కౌగిట్లో అంతా అంధకారమే!
‘పెరిగి పెద్దయిన  మా పిల్లలు  వాళ్ల పిల్లల పెంపకంలో మునిగి తేలుతున్నారు.
‘ఒకప్పటి నా ఆ వయస్సు గుర్తుకొచ్చింది. అమ్మానాన్నలు లీలగా కళ్ళల్లో కదిలారు. వాళ్లు అనుభవించిన  వొంటరి జీవితం తడారిపోయిన నా కంటిగుడ్డుపై  కదలాడింది.
‘ఆ రోజుల్లో అద్దంలో పదే పదే  చూసుకుని మురిసిన నా రూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
‘నిగనిగ లాడే నల్లని జుట్టు, కండలు తిరిగిన వొళ్ళు, రాళ్ళను సైతం కరకర నమిలే పళ్ళు, ఖంగున మోగే కంఠం, ఆయాసపడకుండా  అంతస్తులను ఎక్కగలిగిన పటుత్వం. ఇవన్నీ అనుకున్నాను శాశ్వితం.
‘కానీ! ఏవీ అవి ఎక్కడ?


‘ముడతలు పడ్డ మొహం, నెరిసి రాలిపోయిన జుట్టు, బోసి నోరు, నంగి మాటలు, ఎవరు ఎవరో చప్పున గుర్తుపట్టలేని స్తితి.
‘వొళ్ళు వొణుకుతుంది, మాట తడబడుతుంది.
‘ఒకప్పుడు స్పందించే, జ్వలించే గుండె వుండేది. ఇప్పుడక్కడ వుంది మాత్రం చలనం లేని  ఓ బండ.
‘అయితే- ఎవరో కవి అన్నట్టు ‘ఎముకలలో,బొమికలలో కానరానిదొకటున్నది’
‘ఈ ఎముకల గూటిలో పరికించి చూస్తే ఒకనాటి యువకుడు కనబడతాడు.
‘అతడి కనుకొలకుల్లో నాటి ఆశారేఖలు రేఖామాత్రంగా కానవస్తాయి.
‘ఆ ఆశల తడిలో ఇంకా పచ్చగా వున్న జీవితేచ్చ కనబడుతుంది.
‘జీవితంపై పెంచుకున్న ప్రేమ కనబడుతుంది.
‘చూడండి. కళ్ళు తెరుచుకుని ఓమారు చూడండి.
‘నాలో మిమ్మల్ని చూసుకోండి.
‘ఇది జీవితం. ఇదే జీవితం. వద్దన్నా వొదిలిపోదు.
‘కట్టిపడేసుకుందామన్నా కట్టుబడి వుండదు.
‘ఈ సత్యం  తెలుసుకోండి.’
(ఉత్తరం రాసిన అజ్ఞాత వ్యక్తికి, ఇమేజ్ సొంతదారుకు  కృతజ్ఞతలతో)  

26, జనవరి 2013, శనివారం

అభివృద్ధిపధంలో - 'భారత రిపబ్లిక్'


అభివృద్ధిపధంలో  - 'భారత రిపబ్లిక్'



దసరా,దీపావళి మొదలయిన పండగల సరసన చేర్చదగిన జాతీయ పర్వ దినాలు ఆగస్టు పదిహేను, జనవరి యిరవయి ఆరు.
పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో జాతి యావత్తు ఒక్కటై  జరుపుకున్ననాటికి  నేను నెలల బిడ్డని. రెండో పండగ- రిపబ్లిక్ డే  తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూఇటుగా నాలుగేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి.
భారత రిపబ్లిక్ కు - దానితోపాటే జాతీయ గీతం 'జనగణమన' కు షష్టిపూర్తి కూడా పూర్తయి నాలుగో ఏడు నడుస్తోంది. నిండు నూరేళ్ళు జీవించ గలిగే అవకాశం వుంటే - అరవై సంవత్సరాలు అన్నది మనుషుల విషయంలో పెద్దమాటే. కానీ ఒక జాతి జీవితంలో అరవై ఏళ్ళు ఒక లెక్క కాదు. కానీ, యే ఏటికాయేడు వెనక్కి తిరిగి చూసుకుని సాధించినది ఎంతో లెక్కలు వేసుకోకపోతే సాధించాల్సిన లెక్కలు తేలడం కష్టం. అందుకని ఈ ఏడాది ఈ పండుగ సమయంలో అందరం పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పాటు  'నడిచి వచ్చిన దారి' ని ఒకమారు పరిశీలించుకోవాల్సిన సందర్భం ఇది.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరి లో పాల్గొనే వాళ్ళం.

ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి  భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది.  'జనగణమన' గీతంలో- ఏ ఏ భాషల ప్రస్తావనవుందో, ఏ ఏ ప్రాంతాల  ప్రసక్తి వుందో మాకు తెలియదు.  ఆ గీతాన్ని ఎవరు రాసారో,  ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం. జనగణమన చరణాలలోని - '' ను '' లాగా- '' ను '' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ  ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ  జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.
అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?
'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అంటే- ‘కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలు నసిగే  రోజులు వచ్చేసాయి. పండగ దినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా ‘జనగణమన' పాడడం పోయి – ఆ  గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. భారతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండ వాదం పుట్టుకొచ్చింది.ఏటేటా జరిగే  పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్య, నిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ , జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.

సైనిక కవాతులు, శస్త్రాస్త్ర ప్రదర్శనలు, భారీ టాంకులు, వైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతను, జాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?
శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి  దారుణం?
మతమన్నది మనకంటికి మసకయితే
గతమన్నది మనకంటికి కురుపయితే
మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం ఈనాటి పరిస్తితులను చూసి – మనం కోరుకున్న స్వేచ్చా భారతం ఇదేనా  అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?
మతాల దురభిమానాలతో, కులాల కుంపట్లతో, ప్రాంతీయ ద్వేషాలతో దేశం  యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే-
స్వార్ధమే పరమావధిగా, సంపాదనే ఉపాధిగా, అడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా , నీతికి దూరంగా, అవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై  జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే-
జనరంజకంగా పాలించాల్సిన అధికార  యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే -
రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి  కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితం, తానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే –
నిస్సహాయంగా జనం చూడాల్సి రావడం యెంత విషాదం, యెంత దారుణం, యెంత దుస్తరం, యెంత బాధాకరం?  

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, ప్రపంచం గర్వించదగిన  గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై ఏళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా, అప్రతిహతంగా ఎంచుకున్న మార్గంలోనే పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.

జనాభాలో అత్యధిక భాగం నిరక్షర కుక్షులయినా 'వోటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం. అక్షర జ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి. గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది. అలాగే, వీసెలు, మణుగులనుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు,  'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా   ఇంకా మైలురాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీ, ఎందుకు  పనికిరాని వాళ్ళనీ  ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్ళు - దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత  ఒకే బాలట్ పేపరుపై  ముద్రించిన అనేక పార్టీల  గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే   గుర్తుపట్టి  వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన  ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు.

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.

'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన  దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ  క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగ లిగాము.       

ఏ ఇంగ్లీష్ వారితో తలపడి, అహింసా మార్గంలో వారితో  పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని - దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.  

అయితే ,అంగట్లో  అన్నీవున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత మాదిరిగా ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పై చిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. కానీ, నడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. ఒకదానికి మరొకటి అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

వినిపిస్తున్న సందేశం మంచిదే. విభిన్న స్వరాలే అపస్వరాలతో అసలు అర్ధాన్ని మార్చి వేస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే  వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగా, ధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం రూపుదిద్దుకుంటోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యం, అతి సహజం. అయితే అవి  తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన భాద్యత మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండా, తప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం.

భారత రిపబ్లిక్ వార్షికోత్సవ శుభసమయంలో  మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

25, జనవరి 2013, శుక్రవారం

బాపు గారికి పద్మశ్రీ అట! అక్కటా!


బాపు గారికి పద్మశ్రీ అట! అక్కటా!




బాపూ గారికి 'పద్మశ్రీ' పురస్కారమట. నవ్వాలో ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇన్నేళ్ళకు మన ప్రభుత్వాలకు ఆయన గుర్తువచ్చినందుకు సంతోషించాలా. బాపు అనే రెండక్షరాలతో ప్రసిద్దుడయిన మహామనీషికి మరో మూడక్షరాలు తగిలించి అదో గొప్పగా అనుకుంటున్నందుకు బాధపడాలా! అంత గొప్పవాడికి ఇవ్వడానికి ఇంత చిన్న బిరుదే దొరికిందా! బాపు గారికి దీనివల్ల వొనగూడే అదనపు గౌరవం ఏమీ లేదు. నిజానికి ఆ పురస్కారానికే గౌరవం బాపు గారి పేరుకు ముందో వెనకో పట్టుకుని వేళ్ళాడుతున్నందుకు. అందుకే, ఆ గౌరవానికి నా అబినందనలు (25-01-2013)

మన జీవితమే మనకు గురువు





మన జీవితమే మనకు గురువు

ఎక్కడో చదివినట్టు, ఏదో సినిమాలో చూసినట్టు  అనిపించే ఓ కధ ఇది.
అనగనగా ఓ అమ్మడు. పొద్దున్న బెంగళూరు వెళ్ళి ఆఫీసు పనిచూసుకుని  సాయంత్రానికల్లా   హైదరాబాదు తిరిగొద్దామని  శంషాబాదు  ఎయిర్ పోర్ట్ కు వెళ్ళింది. కాస్త వ్యవధానం వుండడంతో  ఓ ఇంగ్లీష్ నవలను,  దాంతో పాటే ఓ బిస్కెట్ ప్యాకెట్టును  కొనుక్కుని  వెయిటింగ్ హాలు కుర్చీలో తీరుబడిగా చేరగిలపడి పుస్తకం చదువుతూ ఒక్కో బిస్కెట్ తీసుకుని నోట్లో వేసుకుంటున్నతరుణంలో ఆ అమ్మడికి వున్నట్టుండి ఓ అనుమానం పొడసూపింది. పక్కన కూర్చున్న కుర్రాడు కూడా తాపీగా తన ప్యాకెట్ నుంచే ఒక్కో  బిస్కెట్టు  తీసుకుని తింటున్నట్టు అనిపించి అతడివైపు తేరిపార చూసింది. అతగాడు ఆమెను, ఆమె చూపుల్ని ఏమాత్రం  పట్టించుకోకుండా ప్యాకెట్ లోనుంచి బిస్కెట్లు తీసుకుని తింటూ చదువుతున్న పేపరులో మునిగిపోయాడు.  అలా ఇతరుల ప్యాకేట్ నుంచి  తింటూ కూడా ఏమీ తెలియని నంగనాచిలా పేపరు చదువుకుంటున్న అతడి తరహా చూసి ఆమెకు  చిరాకేసింది. మొహం మీదే కడిగేయాలన్నంత కోపం వచ్చినా  సభ్యతకోసం పైకి ఏమీ అనకుండా మిగిలిన ప్యాకెట్ ను  అక్కడే వొదిలేసి, చరచరా అడుగులు వేసుకుంటూ వెళ్ళి    బెంగుళూరు విమానం ఎక్కి తన సీట్లో సర్దుకుని కూర్చుంది.  రీడింగ్ గ్లాసులకోసం హ్యాండ్ బ్యాగు ఓపెన్ చేస్తే ఓపెన్ చెయ్యని బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. అప్పుడు కాని ఆమెకు జరిగిన పొరబాటు అర్ధం కాలేదు. నిజానికి తానే అతడి ప్యాకెట్ లోనుంచి బిస్కట్లు తీసుకున్న సంగతి తెలిసివచ్చి ‘అయ్యో ఇంకా ఏదన్నా మాట తూలాను కాదు’ అని మధనపడింది.
ప్రతికధకు ఏదో ఒక నీతి వున్నట్టే  ఈ కధనుంచి నేర్చుకోవాల్సిన నీతి కూడా వుంది.
జీవితంలో  వెనక్కు తీసుకోలేని విషయాలు  మూడు  వున్నాయి. అవేమిటంటే:
1. రాయి :  ఒకసారి విసిరితే దాన్ని మల్ళీ  వెనక్కు తీసుకోవడం కష్టం.
2. మాట : ఒక్కసారి నోరు జారితే అంతే సంగతులు.
3.  కాలం :  క్షణం గడిచిందంటే  అది శాశ్వితంగా  గతంలో కలసిపోయినట్టే.
ఇంకా ఇలాటివి మరికొన్ని వుండవచ్చు. నేర్చుకునే తీరిక వుండాలే కాని జీవితమే ఈ మాదిరి  నీతి పాఠాలను నేర్పుతుంది.

(Image Courtesy :  inspired.gumnet.net)