14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

చిన్నసార్లు వస్తున్నారు – భండారు శ్రీనివాసరావు


చిన్నసార్లు వస్తున్నారు 
దేశంలో అతిపెద్ద రాష్ట్రం  అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కుడయిన అఖిలేష్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన దరిమిలా తలలు పండిన రాజకీయ నాయకుల్లో చిన్న కదలిక మొదలయింది.  రేపో మాపో తమ రాజకీయ వారసులను తెర మీదకు తీసుకు రావాలని పధకాలు రచిస్తున్న రాజకీయ పితాశ్రీలందరూ  ఆ పని ఇంకా ఎంతమాత్రం ఆలశ్యం చేయకుండా వెనువెంటనే ఆచరణలోకి తీసుకురావాలని తొందర పడుతున్నారు. ఈ  విషయంలో  మాత్రం అన్ని పార్టీల నాయకులదీ, ప్రత్యేకించి అవకాశం వున్న నాయకులందరిదీ ఒకే తీరు.
అఖిల భారత స్తాయిలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ రాజకీయ రంగ ప్రవేశం అంతగా కలిసి రాకపోయినా ఆ పార్టీకి అంతకంటే ప్రత్యామ్నాయం లేదు. భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడడం ఒక్కటే ఆ పార్టీ శ్రేణుల లక్ష్యం. రాహుల్ గాంధీకి ఆ నాయకత్వ లక్షణాలు, ప్రతిభా పాటవాలు వున్నాయా లేదా అన్న దానితో వారికి నిమిత్తంలేదు. ఆ పార్టీకి చెందిన అధి నాయకులు, ముఖ్యమంత్రుల నుంచి అట్టడుగు నాయకులవరకు ఇదే వరస. ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతారు. ఇటీవల జరిగిన యూ పీ ఎన్నికల్లో మొత్తం బాధ్యతను రాహుల్  ఒంటి భుజం మీదకు ఎత్తుకుని వొంటరిగా  పాటుపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకలేదు. ఇదే వేరొకరయితే అతగాడి రాజకీయ భవితవ్యం పార్టీలో ప్రశ్నార్ధకంగా మారివుండేది. అధినేత్రి కుమారుడు కాబట్టి పరాజయ కారణాలకు అతడిని బాధ్యుడుడిని చేయలేదు. అందుకే ఇంకా ఆయన్ని భావి భారత ప్రధాని అభ్యర్ధుల జాబితానుంచి తొలగించలేదు.
అప్పుడప్పుడు, అడపాదడపా ప్రియాంకా గాంధీ పేరు నలుగుతున్నప్పటికీ, రాహుల్ మాత్రమే ఇప్పటికీ దారీ తెన్నూ లేని కాంగ్రెస్ పార్టీకి దారి చూపే  చుక్కాని. ప్రధాని అభ్యర్ధిగా పార్టీ శ్రేణులు రాహుల్ భజన చేస్తున్నప్పటికీ జనం ఆమోదం లభించడానికి మాత్రం మరో రెండేళ్ళు వేచివుండక తప్పదు, గత్యంతరం లేక మధ్యంతరం ముంచుకు వస్తే తప్ప.
మరో జాతీయ పార్టీ బీజేపీకి ఈ ‘యువరక్తం’ గొడవలేదు. అక్కడి అగ్రనాయకులందరూ కురు వృద్ధులే. మోడీ పేరు మీడియాలో మోగుతున్నప్పటికీ, వయస్సు రీత్యా ఆయనంత కుర్రకారేమీకాదు. నడికారు దాటినవాడే.
ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే, యువతరం నాయకుడిగా జగన్ జనంలోకి దూసుకు పోతున్నాడు. ఆయన్ని ఎదుర్కునే రాజకీయ పార్టీలన్నీ గతంలో  చేసిన, లేదా ప్రస్తుతం  చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలే జగన్ పట్ల శ్రీరామరక్షగా మారుతూ వున్నాయి. పాతతరం నాయకులెవరికీ ఎన్నికల సమరంలో ఆయన్ని  ఎదిరించి నిలవగల సత్తా లేదని ఇటీవలి  గత చరిత్రే చెబుతోంది. వ్యక్తిగతంగా అన్ని మరకలు అంటి కూడా, అవినీతి ఆరోపణల్లో కూరుకుని పోయి కూడా, జైల్లో కాలుపెట్టి మూడు మాసాలు దాటిపోతున్నా కూడా అన్ని పార్టీల్లో వున్న దిగువ స్థాయి కార్యకర్తల చూపు వై.ఎస్.ఆర్. పార్టీ వైపు వుండడం ఆయా పార్టీల అధినాయకులకు మింగుడు పడడం లేదు. వున్న పార్టీల్లో పొసగలేక, బయటకు పోయేదారిగా భావించి పోయేవాళ్ళేకానీ అలాటివారివల్ల తమ పార్టీలకు వచ్చే నష్టం ఏముండదు అని పైకి సర్ది చెప్పుకుంటున్నా లోలోపల ఎవరి భయాలు వారికి వున్నాయి. అందుకే ‘యువ రక్తం’ పేరుతొ కొత్త నాయకులను పార్టీలోకి తీసుకువస్తే  ఎన్నికల  ముహూర్తం నాటికయినా పరిస్తితి  కొంతలో కొంతయినా మారక పోతుందా అన్నది వారి ఆశ. ముఖ్యంగా ఎలాటి మచ్చా లేని, అవినీతి ఆరోపణల మరకలు అంటని విద్యాధిక యువకుడు రంగప్రవేశం చేస్తే జగన్ పార్టీని కట్టడి చేయడం సాధ్యమని భావించేవాళ్ళు కూడా లేకపోలేదు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఆవశ్యకత హెచ్చుగావున్నట్టు తోస్తోంది. ఎందుకంటే టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీ రెండు పర్యాయాలకంటే ఎక్కువ కాలం అధికార పీఠానికి దూరంగా వుండడం అంటే చాలా ఇబ్బంది. కాంగ్రెస్ పరిస్తితి వేరు. జాతీయ పార్టీ కాబట్టి, రాష్ట్ర స్థాయి నాయకులు కొంతకాలం అధికారానికి దూరంగా వున్నా ఏదోవిధంగా ఓపిక పట్టగల స్తితిలో వుంటారు. మళ్ళీ అధికారానికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే భరోసా వారిలో పుష్కలం. తమంతట తాముగా అధికారంలోకి రాలేకపోయినా, ఎదుటివారి  వైఫల్యాలే తమకు రక్షరేకుగా  భావించి,  ప్రత్యామ్నాయం కింద ప్రజలే  తమకు అధికార పగ్గాలు అప్పగించక పోతారా అన్నది వారి మరో ధీమా.
కానీ టీడీపీ పరిస్తితి ఇందుకు విభిన్నం. గత ఎన్నికల్లో గెలుపు వూరించి వూరించి చేయి జారి,  మరో ‘చేతి’లోకి పోయిందని టీడీపీ నేతలు ఇప్పటికీ చింతిల్లుతూ వుండడం చూస్తున్నాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అరంగేట్రం చేయడం వల్లనే మహాకూటమి మహా ఓటమి పాలయిందని లెక్కలు చెబుతుంటారు. ఇది ఒక రకంగా నిజం. కానీ, ప్రజాస్వామ్యంలో అంతా అంకెల మహత్యమే. ఒంటి చేత్తో లెక్కించగల అతికొద్ది వోట్ల తేడా వచ్చినా గెలుపు గెలుపే.


నారా లోకేష్ 

అందుకే, చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఒక కొత్త కార్డు కావాలి. టీడీపీ కంటే కూడా ఆయనకే వ్యక్తిగతంగా ఈ అవసరం ఎక్కువ. ఎన్టీ రామారావు గారు  తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ‘ఆంధ్రులు – ఆత్మగౌరవం’ నినాదంతో పాటు నెహ్రూ  కుటుంబం వారసత్వ రాజకీయాలను కూడా ఆయన ఎండగడుతూ చేసిన విమర్శలు కూడా  జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పార్టీ స్తాపించిన తొమ్మిది నెలలల్లోనే అది అధికార అందలం ఎక్కడానికి పార్టీ అనుసరించిన ఆ విధానం బాగా  దోహదపడింది. మరి ఇప్పుడు అదే పార్టీ రాజకీయ వారసత్వ విధానాలను అనుసరిస్తే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది బాబు  గుంజాటన. దీనికి తోడు పైకి వొప్పుకున్నా వొప్పుకోకపోయినా నందమూరి, నారా కుటుంబాల నడుమ చాపకింది నీరులా పాకుతున్న  వారసత్వ ‘రాజకీయాలు’ కూడా టీడీపీ అధినేత, తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం విషయంలో మీనమేషాలు లెక్కించడానికి కారణమనే వారు కూడా వున్నారు.
ఏమయితేనేం, కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, ఎట్టకేలకు  ‘మంచు గడ్డను’ బద్దలు కొట్టారు. తాను టీడీపీ లో ‘కార్యకర్తగా’ పనిచేయబోతున్నట్టు ప్రకటించి ఆయన రాజకీయ అరంగేట్రం విషయంలో అలముకునివున్న అనుమానాలన్నింటినీ  ఆయనే పటాపంచలు చేశారు.        
పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగానే  పనిచేస్తానని ఓ పక్క చెప్పుకుంటూనే, యువతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంటూ పార్టీలో తాను నిర్వహించబోయే పాత్ర ప్రాముఖ్యాన్ని చెప్పకనే లోకేష్  చెప్పారు.
అనేక అనూహ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, భవిష్యత్తు పట్ల ఆందోళనతో వున్న టీడీపీ శ్రేణులకు   ఎంతో ఉత్సాహం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి మరెంతో  వూరట కలిగించే వార్త.  పార్టీ ప్రతిష్ట వేగంగా కొడిగడుతున్న తరుణంలో చంద్రబాబు ఇటీవల స్వయంగా పూనుకుని పునరుజ్జీవ చర్యలు చేపట్టారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ,  తెలంగాణా పై కేంద్రానికి  మరో లేఖ ఇవ్వడం వంటి పలు కీలక నిర్ణయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘పాదయాత్ర’ చేయాలనే సంకల్పాన్ని కూడా  ప్రకటించారు. ఈ నేపధ్యంలో – లోకేష్ వంటి యువకుడి దన్ను వుంటే లభించే ప్రయోజనాన్ని  ఆయన అంచనా వేయకుండా వుండరు. వేయరని,  బాబు గురించి బాగా  తెలిసిన వారెవ్వరూ అనుకోరు.  (14-09-2012)                                  

10, సెప్టెంబర్ 2012, సోమవారం

నేడే చూడండి - భండారు శ్రీనివాసరావు


నేడే చూడండి   

తప్పనిసరయి ఇక  తప్పదురా  అనుకున్నప్పుడు అనుభవించి ఆనందించమని ఇంగ్లీష్ లో ఓ  సామెత వుంది.
మంచికో చెడుకో టీవీ అనేది ఇప్పుడు ‘నెసిసరీ ఈవిల్’ గా తయారయిందన్నది మాత్రం నిజం.  తిట్టుకుంటూ అయినా చూడక తప్పని అవసరంగా మారిందన్నది మరో నిజం.  కాదనలేని ఈ నిజాల దృష్ట్యా - తిట్టుకోవడం కూడా మానేసి టీవీని  చూస్తూపోతూవుంటే  నష్టపోయేదేమీ వుండదు కరెంటు ఖర్చు  తప్ప – అన్నాడో టీవీ విప్లవకవి.

వెనుకటి రోజుల్లో, ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది అంటే ‘దూరదర్శన్ లో ‘ అనేవారు నవ్వుతాలుగా. కానీ ఇప్పడు యిరవై నాలుగ్గంటల న్యూస్ చానళ్ళు వచ్చేశాక మొదలయిన ఊకదంపుడు చర్చలు చూస్తునప్పుడు – ఆ  పేడా పిడకలే నయమనే వారు ఎక్కువయ్యారు. వార్తల అధారంగా వ్యాఖ్యలు, వ్యాఖ్యల ఆధారంగా వార్తలు, మళ్ళీ వీటి ఆధారంగా చర్చలు, వాటిపై తిరిగి  ‘ఫోన్ ఇన్ లు’, మధ్యమధ్యలో విలేకరుల విరుపులు, యాంకర్ ల విన్యాసాలు, ‘లక్ష వొత్తుల నోములు’ లక్ష సార్లు నోచుకోవాల్సిన న్యూస్ ప్రెజెంటర్ల మూకుమ్మడి  తెలుగు భాషా హత్యాప్రయత్నాలు, బుల్లి తెర నిండుగా ‘ఇప్పుడే అందిన ఎప్పటివో వార్తలు’,  తాబేలు, కుందేలు మాదిరిగా డేకుతూ, పాకుతూ వెళ్ళే స్క్రోలింగులు, పంటికింది రాళ్ళలా ‘యాడ్ లు ‘ - ఒకటా రెండా యేమని చెప్పుదు ఆ  టీవీల లీలలు. యేమని వర్ణింతునూ ఆ  ఛానళ్ళ సొగసులు – అన్నాడో వికట కవి.                                
టీవీల్లో చూపించే చర్చలని చూస్తూ వాటిపై  చర్చోపచర్చలు చేసేవాళ్ళని చూస్తూవుంటాము. బుల్లి తెరలపై కానవచ్చే  విశ్లేషణ కర్తలే- భుజాలపై శంఖు చక్రాలు పొడిపించుకుని, ‘భుజకీర్తులు’ తగిలించుకున్న భజన బృందగాన బృందావన విహారులుగా చెలరేగిపోతున్నప్పుడు – మేము మాత్రం తీసిపోయామా అన్నట్టు చూసేవాళ్ళు కూడా సినీహీరోల వీరాభిమానుల మాదిరిగా చీలిపోయి ఆయా రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులను కూడా మించిపోయి శ్రుతి మించి ‘రాగాలు’ అందుకుంటున్న తీరుతెన్నులు గమనించేవారికి ‘బ్రోచే వారెవరురా ‘ అన్న కీర్తన జ్ఞాపకం వచ్చి- ప్రకటితమో అప్రకటితమో  ‘కరెంటు కోత’ ఒక్కటే తమను కాపాడగలగలదని ‘గజేంద్ర మోక్షం’ పద్యాలను తిరగేసి అరగదీస్తుంటారంటూ – ఇవా ఈనాడు జనానికి కావలసినవి? ఇదా ఈ రోజు జనం కోరుకుంటున్నది?’అని  ఆవేశపడిపోయాడో వికటాట్ట కవి.
 కానీ, ఇక్కడే కరెక్టుగా పైన చెప్పిన సామెత అక్కరకు వస్తుంది. అన్ని వేలుపోసి టీవీలు కొనుక్కున్నదెందుకు? వున్న   చీకాకులను మరచిపోయి హాయిగా కాలక్షేపం చేసేందుకు.  అంతేకానీ, ఇలా అడ్డమయిన చర్చల్లో తలదూర్చి లేని తలనొప్పులు తెచ్చుకునేందుకు కాదుకదా. అందుకని తెలివయిన వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే –టీవీ రోట్లో పెట్టిన తలను ఆ రోట్లోనే వుంచేసి  ‘రోకటి పోటు’ని ’ ఆహ్వానించి ఆస్వాదించండంటూ సెలవిస్తున్నాడో ఉచిత గౌరవ సలహాదారుడు.
అందుకాయన ఇస్తున్న ఉదాహరణలను సోదాహరణంగా గమనించండి.
‘రాత్రి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్ర కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఏం మాట్లాడుకున్నారు?
‘ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు వచ్చే ఎన్నికల వరకూ కొనసాగుతారని ఆజాద్ మరో మారు షరా మామూలు ప్రకటన చేసి ఢిల్లీ విమానం ఎక్కేస్తారా?
‘ఆజాద్ హైదరాబాద్ వచ్చింది పార్టీ వ్యవహారాలు చక్కదిద్దదానికా షబ్బీర్ ఆలీ ఇంట్లో పెళ్లి భోజనం చేయడానికా?
‘ముఖ్యమంత్రికి మళ్ళీ ఢిల్లీ పిలుపు తప్పదా?
‘అమెరికా నుంచి  సోనియా వచ్చినదాకా ఢిల్లీ లో వెయిట్ చేస్తున్న కేసీఆర్ కి తోడుగా  సీఎం అక్కడే వుండిపోతారా?  

‘సోనియా గాంధీ ఆయనకు అప్పాయింట్మెంట్ ఇస్తారా ?
‘లేకపోతె అహ్మద్ పటేల్ లేదా అందుబాటులో వున్న మరో నాయకుడినో కల్సి సరిపెట్టుకుంటారా?
‘ఈ పరిణామాలను టీడీపీ  ఎలా గమనిస్తోంది?
‘తెలంగాణా విషయంలో బాబు కొత్త కళ్ళ వైఖరిపై సీమాంధ్ర నాయకుల వైఖరి ఎలావుండబోతోంది?
‘విజయమ్మ ముందు  చెప్పి తరువాత ‘తూచ్’ అన్నట్టుగా జగన్ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ లో కలుస్తుందా? అసలు కాంగ్రెస్సే జగన్ కాంగ్రెస్ లో కలిసిపోతుందా?
‘ఈ పరిణామాల పట్ల చిరంజీవి వర్గం  ఏమనుకుంటోంది?
‘ఇంతకీ చిరంజీవికి ఒక వర్గం అంటూ సొంతంగా వుందా?
‘జగన్ వ్యతిరేక వర్గమే ఆయన వర్గమా? ‘వర్గ’మూలాల ప్రాతిపదికపై కొత్త పార్టీ పెట్టి  అది పూర్తిగా పాతపడక ముందే మూసేసి కాంగ్రెస్ తీర్ధం అడిగిపుచ్చుకున్న చిరంజీవికి   ఢిల్లీ లోని అధిష్టాన వర్గమే ఆయనకు మిగిలిన ఏకైక  వర్గమా?
‘ఇలా ఇన్ని రకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ లో  రానున్న రోజుల్లో రాగల పరిణామాలెలా వుండబోతున్నాయి?
‘ఎంతో ఆసక్తిని రగిలిస్తున్న ఈ అంశాలపై  మేము అంటే  మా ఛానల్ మాత్రమే  నిర్వహిస్తున్న చర్చను మా ఛానల్ లోనే -  ఈ రోజే, ఇప్పుడే చూడండి.’ 
వంటా వార్పూ కార్యక్రమంలో ‘ఇలా చేసి మాడండి’ తరహాలో వెలువడే ఈ రకం ప్రకటనలు వింటుంటే నవ్వు రావడం లేదా? ఇంతటి హాస్యాన్ని ఇరవై నాలుగ్గంటలపాటు ఇంటింటికీ పంచుతున్న తెలుగు టీవీ చానళ్ళ  నిర్విరామ, నిస్వార్ధ, నిర్వికార సేవా నిరతిని కొనియాడడానికి మీకు మాటలు రావడం లేదా? అయినచో – మీకు నిష్కృతి యెట్లు? మీబోటి  బోంట్లకు అదే సరయిన మార్గం. తలను రోటిలోనే వుంచండి. రోకటి పోటుకు  వెరవకండి. 

8, సెప్టెంబర్ 2012, శనివారం

ఓ మొగుడి ‘ఆత్మ’కధ



ఓ మొగుడి ‘ఆత్మ’కధ

మా ఆవిడ కంటే మా కోడలు అదృష్టవంతురాలు. ఆమెకు ప్రేమించే మొగుడు దొరికాడు.
ఆ మాటకు వస్తే  నేనూ ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ఈ వయస్సులో అబద్ధం చెప్పడం యెందుకు? నన్ను ప్రేమించిన మా ఆవిడను నేను పెళ్ళాడాను.
నన్ను పెళ్ళిచేసుకుని ఆవిడ ఏం సుఖపడిందో నేను గ్యారంటీగా చెప్పలేను కాని ఆవిడ్ని చేసుకుని నేను చాలా లాభపడ్డాను.
అంటే బోలెడు బోలెడు కట్నం డబ్బులతో మా ఇంటిని మెట్టిందని కాదు. కట్టుడు చీరేతోనే కాపురానికి వచ్చినా ఆ తరువాత నా జీవితానికి ఎక్కడా లేని నిశ్చింతను తెచ్చిపెట్టింది. నా భార్య కుడికాలు మోపిన దగ్గరనుంచి నేను కాలు మీద కాలు వేసుకుని బతగ్గలిగే బతుకు నా సొంతమయింది.
మొదటినుంచీ నాది స్వతంత్ర ప్రవృత్తి. దానికి తోడు ఏదో కధలూ కాకరకాయలు గిలుకుతానని నమ్మకం.
ఈ చేతకానితనానికి నేను ఓ సిద్ధాంతాన్ని  తగిలించి ప్రచారం చేసుకున్నాను.   తన రెండు కాళ్ళమీద తాను నిలబడలేని వాడే ఉద్యోగం చేస్తాడని, తనపై తనకు నమ్మకం వున్న ఏ మనిషయినా సరే  తనకు తానుగా పైకి ఎదగడమే కాకుండా తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తాడని బీరాలు పలుకుతూ, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు వచ్చినా చేయకుండా రెండు కాళ్ళు ముడుచుకుని ఇంట్లోనే వుండిపోయాను. దాంతో మా ఆవిడే నన్నూ, నా వల్ల పెరిగిన సంసారాన్నీ ఒంటిచేతిపై  సాకడం మొదలు పెట్టింది. ఇందుకోసం ఆమె తేనెటీగలా నిరంతరం శ్రమించింది. నన్ను నా మానాన వొదిలేసిందన్న సంతోషంతో నా బాధ్యతారాహిత్య జీవితాన్ని మరింత ఆనందంగా గడపడం మొదలుపెట్టాను.
మా అందరికోసం అంతగా కష్టపడే మా ఆవిడ పట్ల నేనెప్పుడూ రవంత జాలి చూపిన జ్ఞాపకం లేదు. అదేదో ఆవిడ బాధ్యత అనుకునేవాడిని. నేనూ నా స్నేహితులూ, కధలూ, సభలూ, సమాజాన్ని మార్చడానికి అడ్డమయిన చర్చలూ, అలా అలా అదోవిధమయిన మత్తులో జీవితం గడిచిపోయింది.
దేవుడనేవాడు వున్నాడో లేదో తెలియదుకాని, వుంటే వాడి దయవల్ల  వున్న ఒక్క కొడుకు ప్రయోజకుడయ్యాడు. అందులో నా ప్రయోజకత్వం యెంత మాత్రం లేదు. ఆ విషయం నాకు తెలుసు కానీ నలుగురికీ తెలియదు కదా. వాడి ఎదుగుదలలో నా పాత్రను గురించి  తెలిసిన నలుగురూ పదిమందిలో పొగుడుతుంటే తెలియని ఆనందంతో పొంగిపోయేవాడిని. కనీసం  మర్యాదకు కూడా అలాటి సందర్భాలలో మా ఆవిడ ప్రసక్తి తెచ్చేవాడిని కాదు.
ఇలా ఇలా మా కధ సాగిపోతూవుండగా – సినిమాలో ఇంటర్వెల్ ముందు చిన్న క్లైమాక్స్ మాదిరిగా -
కన్నతండ్రిని,  నాతో  ఒక్క మాట కూడా చెప్పకుండా నా ఒక్కగానొక్క కొడుకు, వాడి ఆఫీసులో పనిచేసే ఒకమ్మాయిని గుళ్ళో పెళ్ళాడి ఇంటికి తీసుకువచ్చాడు. బుద్దులెక్కడికి పోతాయి చెప్పండి.
కానీ నా బుద్దులు వాడికి వొంటబట్టిన దాఖలాలు ఆ తరువాత కనబడలేదు. కొత్త పెళ్ళాన్ని కాలుకందనీయకుండా చూసుకునే వాడి వైనాన్ని చూస్తుంటే నాకు వొళ్ళు మండిపోయేది. అదేమిటో ఆ క్షణంలో నాకు వాడు కొడుకన్న సంగతి కూడా మరచిపోయి కోడలిపట్ల వాడు చూపుతున్న ప్రేమా,ఆదరణా చూసి, పైకి అనకూడదు కానీ లోలోపల   అసూయపడేవాడిని. కానీ,  మా ఆవిడ మాత్రం కోడలంటే ప్రాణం పెట్టేది.  కూతురు లేని కొరతను కోడలుతో తీర్చుకుంటున్నట్టుగా వుండేది ఆమె ప్రవర్తన. నిజానికి మా ఆవిడ పడాలి అసూయ, నన్ను కట్టుకున్న అనుభవంతో, నాతో  కాపురం చేసి పొందిన  అనుభవాలతో. 
పాపీ చిరాయువు అంటారు. కానీ, జీవుల జమాలెక్కలు పైనుంచి చూసే ఆ భగవంతుడికి అది తెలిసినట్టు లేదు.
అందుకే  ఓ  రోజు ఇంట్లో కాళ్ళు బారజాపి  టీవీలో సీరియల్ చూస్తున్న నన్ను ఎవరినో అడ్డంపెట్టి పిలిచాడు. మామూలుగా సహజ బద్ధకంతో  పట్టించుకోని నేను వెంటనే బయలుదేరిపోయాను. నేను వెడుతున్న ఆటో సందు మలుపు తిరుగుతుండగానే ఓ లారీ వచ్చి కొట్టింది. అంతే. అంతవరకే తెలుసు.
కాకపొతే ప్రాణాలు పోతున్నప్పుడు మా ఆవిడ జ్ఞాపకం వచ్చింది. ఆవిడ మా కుటుంబం కోసం పడ్డ కష్టం జ్ఞాపకం వచ్చింది. బహుశా ఈ ఒక్క కారణం తోనే అనుకుంటా నేను నమ్మని ఆ దేవుడు ఈ నాలుగు ముక్కలు నలుగురితో చెప్పి గుండె బరువు తగ్గించుకునే ఈ వెసులుబాటు ప్రసాదించాడు. ఇందులో మరో మతలబు కూడా వుండవచ్చేమో. ఇది చదివి నాలాటి వారిలో ఏదయినా కొద్ది మార్పు అయినా వస్తుందన్న ఆశతో చేసివుంటాడేమో! అందుకే దేవుడు పిచ్చివాడన్నారు.పిచ్చి దేవుడన్నారు.
ఇలాటివి నేను ఎన్ని రాయలేదు గనుక.  ఎవరయినా మారారా! అంతెందుకు. నేనేమయినా మారానా!

(08-09-2012)                       
        

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

కాంగ్రెస్ కు కావాల్సింది ముఖ్యమంత్రి మార్పా? ముఖ్యమంత్రిలో మార్పా? – భండారు శ్రీనివాసరావు



కాంగ్రెస్ కు కావాల్సింది ముఖ్యమంత్రి మార్పా? ముఖ్యమంత్రిలో మార్పా? – భండారు శ్రీనివాసరావు
(11-09-2012 సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
కలయో వైష్ణవ మాయయో అన్నట్టు ప్రభుత్వంలో ఏదో కదలిక. దాదాపు రెండేళ్ళకు పైబడి  నిర్వికారంగా, నిస్తేజంగా, నిస్సత్తువుగా,  చేష్టలుడిగి  నిష్క్రియాపరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా వున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఒక  చిన్న వూపు.
ఉప ఎన్నికల కదన రంగంలో వరుస పరాజయ పరంపరతో చావుదెబ్బలు తిని, కన్నులొట్టబోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ జవసత్వాలు కలిగించే సంకల్పంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  మొదలు పెట్టిన ఇందిరా పల్లె బాటకు జనాలనుంచి నీరాజనాలు లభించకపోయినా వ్యతిరేకత కూడా పెద్ద స్తాయిలో ఎదురుకాకపోవడం  చాలాకాలం తరువాత కిరణ్ సర్కారుకు దక్కిన  ఊరట.
ఆ వూరట కలిగించిన ధైర్యమో యేమో కానీ మరో ఆరు  నెలల కాలానికి ఈ కార్యక్రమాన్ని ఖరారు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల రెండో వారం తరువాత ముఖ్యమంత్రి మార్పు తధ్యం అని వస్తున్న వూహాగానాలను పటాపంచలు చేసేందుకే ముఖ్యమంత్రి ఈ అస్త్రాన్ని ప్రయోగించారని చెప్పుకుంటున్నారు.
ముఖ్యమంత్రి మార్పు, పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి వాళ్లు కుర్చీలో కూర్చున్న రెండో రోజునుంచే వార్తలు వదంతులు చెలరేగడం అన్నది కాంగ్రెస్ పార్టీలో మామూలే. అందుకే కాబోలు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చే చోటా మోటా అధిష్టాన ప్రతినిధులు తిరిగి వెడుతూ ‘ప్రస్తుత ముఖ్యమంత్రే ఎన్నికల వరకు వుంటారని’ ఓ కితాబు ఇచ్చి ఢిల్లీ విమానం ఎక్కుతుండడం  ఈ మధ్య పరిపాటిగా మారింది. అలాగే, పనిలో పని అన్నట్టు పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి వస్తున్న వార్తలు కూడా  ‘కేవలం మీడియా  సృష్టి’ అని షరామామూలు సంక్షిప్త ప్రకటనలు చేస్తుంటారు.
ఇలా ఎప్పటికప్పుడు పదవీ కాలం పొడిగింపు గురించి తరచుగా చేసే ప్రకటనల ప్రభావం  ప్రభుత్వ యంత్రాంగంపై  పడే అవకాశం గురించి వాళ్లు లేశమాత్రం కూడా ఆలోచిస్తున్నట్టు కనబడదు. వారి బాధ్యతా రాహిత్యానికి ఇది  అద్దం పడుతుంది. రాష్ట్ర నాయకులపట్ల వారికున్న చులకన భావాన్ని తెలియచెప్పుతుంది.
ఇటీవల కాలంలో రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు నాయకుల భవిష్యత్తు గురించి ఒక రోజు రోజల్లా ఆందోళన కలిగించే వార్తలు షికారు చేసినప్పుడు వారి పదవీ గండం ఖాయమనే అనుకున్నారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించిన వదంతులు ఏమేరకు వెళ్ళాయంటే, అ పదవికి ఖాళీ ఏర్పడడం తధ్యం అని నమ్మిన నాయకులు కొందరు తమ పేరును పరిశీలించాల్సిందిగా విలేఖరుల సమావేశాలు పెట్టి మరీ అధిష్టాన దేవతలకు విన్నపాలు చేసుకున్నారు. అలాగే కాబోయే ముఖ్యమంత్రి గురించిన వూహాగానాలు కూడా ముప్పిరిగొనడంతో ఆశా వహులందరూ కొన్నాళ్ళపాటు హస్తిన లోనే మకాం వేసి, అనుకున్నది ఏదీ జరక్కపోవడంతో  నిరాశతో హైదరాబాదుకు  తిరిగొచ్చేశారు.  ఈ పరిణామాలన్నీ సహజంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినీ, పీసీసీ నేత  బొత్స సత్యనారాయణనూ  ఒకరకమైన నిర్వేదంలోకి నెట్టివేసి వుండాలి. బహుశా,  ఈ నేపధ్యంలోనే, ఈ వదంతులను  గట్టిగా తిప్పికొట్టడానికే  ముఖ్యమంత్రి తన పల్లెబాట కార్యక్రమం షెడ్యూలును మరో ఆరుమాసాల కాలానికి ప్రకటించి వుండాలి.
రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో మున్నెన్నడు కనీ వినీ ఎరుగని స్వేచ్ఛనూ, వాక్స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ వాదులు ఈనాడు  అనుభవిస్తున్నారనుకోవాలి. ముఖ్యమంత్రి అంటే  లెక్కలేనట్టు వ్యవహరించే మంత్రులు ఓ పక్క, మంత్రులకు మంత్రులకు నడుమ గిల్లికజ్జాల వార్తలు మరోపక్క – ఇలా రాష్ట్ర కాంగ్రెస్ కట్టడి లేని విధంగా తయారయింది. ఈ పరిస్తితిని చక్కదిద్దాల్సిన అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన  సీనియర్ నాయకులు టీవీ తెరలపై  చేసే వాగ్యుద్ధాలు చూసేవారికి ఈ అభిప్రాయం కలగడం సహజం.  మెడలో వేసుకున్న మువ్వన్నెల కాంగ్రెస్ కండువాలను మినహాయిస్తే,  వారంతా  ఒకే పార్టీకి చెందినవారంటే నమ్మకం కుదరడం కష్టం.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి  విషయానికి వస్తే,  కాంగ్రెస్ పార్టీలో ఆయన అంత అదృష్టవంతుడూ వుండడు. అంత దురదృష్టవంతుడూ వుండరు. నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయస్సులో  అధిష్టానం ఆయనకు పెద్ద పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. కిరణ్ ఈ వరాన్ని చక్కగా వినియోగించుకున్న దాఖలాలు లేవని  ఆయన సన్నిహితులే పరోక్ష సంభాషణల్లో వొప్పుకుంటూ వుంటారు.
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను – రుజువు చేసుకోవడంలో ఆయన చాలావరకు   వైఫల్యం చెందారనే చెప్పాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని  కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ  తక్షణం  హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  ఈ విషయంలో
అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం. క్యాంప్ కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతారు.
అయితే, ముఖ్యమంత్రిని మార్చడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అదనంగా వొనగూడే లాభం ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు దొరక్కుండా అధిష్టానం ఆయన్ను మార్చే ఆలోచన చేయకపోవచ్చు. తరచుగా ముఖ్యమంత్రులను మార్చడంవల్ల కలిగే అనర్ధం ఏమిటన్నది కాంగ్రెస్ అధినాయకులకు తెలియంది కాదు.  ముఖ్యమంత్రిని మార్చడం వల్ల వచ్చే లాభం కన్నా  ఒనగూడే నష్టం ఎక్కువ అన్న వాస్తవం తెలుసు కనుక వాళ్ళూ కిమ్మిన్నాస్తిగా వుండిపోతున్నారు. అధిష్టానం నిస్సహాయత,  ప్రధాన  ప్రతిపక్షం అయిన తెలుగు దేశం నిష్క్రియాపరత్వం కలసి  వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని భాష్యం చెప్పేవారికి కూడా ఆ పార్టీలో కొదవ లేదు.
కిరణ్ కుమార్ రెడ్డి నెమ్మది నెమ్మదిగా కుదురుకుంటున్నారనీ,   క్రమంగా,  పార్టీపై,  ప్రభుత్వంపై  గట్టి పట్టు చిక్కించుకుంటున్నారనీ  ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటినుంచి ఆయన ఎదుర్కుంటూ వస్తున్న  సమస్యలను ఏకరువు పెడుతూ,  వాటన్నింటినీ ఆయన  యెలా వరుస క్రమంలో పరిష్కరిస్తూ వస్తున్నారో అన్న విషయాన్ని నొక్కి చెబుతూ,  ఎలాటి  ‘మచ్చా, మరకా’ లేకుండా చేస్తున్న పరిపాలనే ఆయనకు జనంలో మంచి పేరు తీసుకు వస్తుందనీ,  అదే కాంగ్రెస్ నావని ఎన్నికల విజయ  తీరానికి  చేరుస్తుందనీ   మూస బాణీలో మాటలు వల్లెవేస్తున్నారు. కాకపొతే ఇలా ముఖ్యమంత్రిని సమర్ధిస్తూ మాట్లాడే కాంగ్రెస్ నాయకుల సంఖ్య గతంతో పోలిస్తే తక్కువ. పైగా వారికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కూడా  తక్కువని  ముఖ్యమంత్రి వ్యతిరేకులు  సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.          
నిజమే. ఇప్పుడు  ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, నమ్మి అధికారం వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను  దూరం చేసిన నాడు  పాలకులకు వారు  దగ్గరవుతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం. 
పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి శాశ్వితంగా పనికొచ్చేపనులను  ఆ  పదవిని లెక్కచేయకుండా   ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.
ఇది దృష్టిలో వుంచుకుంటే  సమర్ధవంతమయిన పాలన సాగించేందుకు మార్గం సులువవుతుంది.
ఇప్పుడు జరగాల్సింది ముఖ్యమంత్రి మార్పా? ముఖ్యమంత్రిలో మార్పా ? అనేది  కాంగ్రెస్ అధిష్టానమే తేల్చుకోవాల్సివుంది. (07-09-2012)

6, సెప్టెంబర్ 2012, గురువారం

నమ్మలేని నిజం


నమ్మలేని నిజం
కంప్యూటర్ యుగంలో చదవడం బాగా తగ్గిపోయిందనేవాళ్లున్నారు. కానీ నాకెందుకో ఈ మధ్యనే  చాలా ఎక్కువగా చదివేస్తున్నానని అనిపిస్తోంది. నెట్ ప్రపంచంలో విహరిస్తుంటే కాలం ఇట్టే గడిచిపోతోంది. నా ముందు తరం వాళ్ళు ఎన్నో విషయాల్లో నాకంటే అదృష్టవంతులని ఒప్పుకుంటాను కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం దురదృష్టవంతులని  చెప్పాలి. అయితే, నెట్లో కంటికి కనబడ్డ రచనలన్నీ  గొప్పవి కాకపోవచ్చు. వాటిల్లో నిజానిజాలేంటో తెలియకపోవచ్చు. కానీ కొన్నింటిని మాత్రం వెంటనే ఇతరులతో పంచుకోవాలనిపిస్తుంది. పరాయి భాషల్లో వాటిని కాస్త వీలు చేసుకుని తెనిగించి తెలుగువాళ్ళకు తెలియచెప్పాలనిపిస్తుంది. ఇదిగో అలాటిదే ఒకటి ఈనాటి ఈ రచనకు ప్రేరణ.
ఇక చదవండి.  వీలయితే, చదివించండి.
“జర్మనీ చిన్న దేశమయినా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశం. బెంజ్, బి ఎం డబ్ల్యు వంటి ఖరీదయిన మోటారు వాహనాలన్నీ అక్కడే తయారవుతాయి.   సంపన్నులు మాత్రమే వాడే ఇలాటి వాహనాలు  తయారుచేసే దేశం అంటే దాని గురించి జనం అంచనాలు కూడా ఎక్కువగానే వుండడం సహజం.  అక్కడి ప్రజలు  విలాసవంతమయిన జీవితాలను గడుపుతుంటారని భావించడం అంతే  సహజం.  ఈ మధ్య ఆఫీసు పని మీద    ఆ దేశానికి వెళ్లే  సందర్భం తటస్థ పడేవరకూ నాకు కూడా అలాటి అభిప్రాయమే వుండేది.
“ నేను జర్మనీలోని హాంబర్గ్ నగరానికి చేరుకున్న రోజు మా కంపెనీ లోని భారతీయ  సహోద్యోగులు కొందరు కలసి ఒక హోటల్లో విందు భోజనం ఏర్పాటు చేశారు. మేము వెళ్లేసరికి చాలా టేబుళ్లు  ఖాళీగా కానవచ్చాయి. భారత దేశం నుంచి వెళ్ళిన నాకు ఇది కొంత విచిత్రంగా అనిపించింది. శనాదివారాల్లో  ఖరీదయిన రెస్టారెంట్లలో టేబులు దొరకడానికి చాలాసేపు వేచివుండిన సందర్భాలు అనేకం.మేము కూర్చున్న టేబుల్ దగ్గర్లో ఓ యువ జంట మినహా దాదాపు అంతా ఖాళీ. నేను గమనించిన మరో విషయం మరింత విచిత్రంగా  అనిపించింది. అదేమిటంటే  మాకు దగ్గర్లో కూర్చుని వున్న ఓ యువజంట తీరు. ఆ యువతీ యువకులిరువురూ మంచి పరువంలో వున్నారు.  సాధారణంగా స్నేహితురాలిని హోటలుకు తీసుకువచ్చే యువకులు  ఆహార పానీయాలను ఆర్డర్ చేయడంలో అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ వుంటారు.  ‘గాళ్ ఫ్రెండ్’ ని మెప్పించడానికి, మురిపించడానికి  లేని పోని  భేషజాలకు పోయి   అవసరం వున్నా లేకపోయినా   అనేక ఐటంలు  ఆర్దరిస్తుంటారు. ఇలాటి అనుభవాల నేపధ్యంలో చూసినప్పుడు  అక్కడి దృశ్యం నాకు వింతగా అనిపించింది. వాళ్ళిద్దరూ  చాలా మితంగా భోజన పదార్ధాలు ఆర్డర్ చేసినట్టు ఆ టేబుల్ చూస్తేనే తెలుస్తోంది.  ఆ యువకుడి పిసినారి తనాన్ని ఆ అమ్మడు ఎంతో కాలం భరించలేదనీ,  రెండు చేతులతో ధారాళంగా ఖర్చుపెట్టే  మరో శాల్తీని  వెతుక్కుని త్వరలోనే  అతడితో స్నేహానికి స్వస్తి చెబుతుందనీ   అప్పటికప్పుడే మనసులో ఏదేదో వూహించుకున్నాను.
ఇంతలో మరో ఇద్దరు వృద్ధ వనితలు ఆ రెస్టారెంటులో ప్రవేశించి  ఇంకో టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్లు కూడా తమకు కావాల్సిన భోజన పదార్ధాలను మితంగా ఆర్డర్ చేసుకున్నారు. వెయిటర్  వడ్డించే పద్దతి  కూడా అలాగే వుంది. ప్లేటులో పదార్ధాలు వాళ్లు తిన్నదాకా ఆగి మరీ మారు వడ్డన చేస్తున్నాడు.
ఇక వాళ్ల మానాన వాళ్ళను వొదిలేసి మేము మాకు కావాల్సినవి ఆర్డర్ చేసే ప్రయత్నంలో పడ్డాము. మా అందరికీ బాగా ఆకలిగా వున్న మాట నిజమే.  కానీ మేము మెన్యూ ఆర్డర్ చేస్తున్న  విధానం  చూసి వెయిటరే  కొంత కంగారు పడుతున్నట్టు అనిపించింది. అలవాటు ప్రకారం  మెన్యూ కార్డులో వున్న వాటన్నిటినీ  పట్టుకు రమ్మన్నాము, రుచిగా వున్నవి తిని మిగిలినవి వొదిలేయొచ్చనే ఉద్దేశ్యంతో.
కస్టమర్లు అంతగా లేకపోవడం వల్లనో యేమో మేము ఆర్దర్ చేసినవన్నీ వెంటనే  సర్వ్ చేశారు. వాటన్నిటినీ బల్ల మీద సర్డుతున్నప్పుడు వెయిటర్ కళ్ళల్లో అనుమానంతో కూడిన ఆశ్చర్యం లీలగా కనిపించింది. వీటన్నిటికీ బిల్లు యెంత అవుతుందో తెలిసి ఆర్డర్ ఇచ్చారా లేక తెలియక  చెప్పారా అని అతడి భావానికి మేము భాష్యం చెప్పుకున్నాము. కానీ, అతగాడి ఆశ్చర్యంతో కూడిన అనుమానానికి అసలు కారణం త్వరలోనే మాకు తెలిసిపోయింది.
మొత్తం  మీద మా భోజనం పూర్తయింది. వడ్డించే ‘పోర్షన్ల’  పరిమాణం యెంత వుంటుందో ఒక అవగాహన లేక ఆర్డర్ ఇచ్చినట్టున్నాము.  తినుబండారాలు చాలా మిగిలిపోయాయి. వాటిని అలాగే వొదిలేసి బిల్లు పట్టుకురమ్మని బేరర్ ను కోరాము.
లేచివస్తుండగా వెనుకనుంచి  ఏవో గుసగుసలు వినిపించాయి.  మాకు దగ్గర్లో కూర్చుని భోజనం చేస్తున్న ఆ ఇద్దరు ముసలి ముదితలు మమ్మల్ని చూపిస్తూ రెస్టారెంట్ మేనేజర్ తో ఏదో చెబుతున్నారు. అంతటితో ఆగిపోకుండా మా వద్దకు వచ్చి, టేబుల్ మీద మేము తినకుండా  వొదిలిపెట్టిన పదార్ధాలను చూపిస్తూ తమ మనసులోని మాటను బయట పెట్టారు. వచ్చీరాని ఇంగ్లీష్ లో వాళ్లు చెబుతున్నది మాకు బాగానే అర్ధం అయింది.  మేము ఆ విధంగా ఆహారాన్ని వృధా చేయడాన్ని వారు ఇష్టపడడం లేదని తెలిసిపోయింది. అయినా  ‘మా డబ్బు , మాయిష్టం . తింటాం, పారేస్తాం. బిల్లు మీరేమీ కట్టడం లేదుగా’ అనేది మా ధీమా.  దాన్నే కొద్దిగా మార్చి వాదనగా కూర్చి వాళ్ళను వొప్పించాలని చూసాం.
అప్పుడు  చూడాలి ఆ ముసలి వాళ్ల కళ్ళల్లో కోపం. ఒకావిడ ఆగ్రహాన్ని అదుపుచేసుకుంటూ  సెల్ ఫోన్ తీసింది.  ఎవరితోనో  మాట్లాడింది. మాకు ఏమి జరిగిందో అర్ధం కాలేదు కానీ ఏదో జరగబోతోందన్న విషయం బోధపడింది. జర్మనీలో వుంటున్న మా భారతీయ సహచరుడు ఒకడికి  అప్పటికి  మత్తు దిగిపోయినట్టుంది. ‘ప్రమాదంలో పడ్డాం గురూ’  అని సైగలతో హెచ్చరించాడు.
మేము బిత్తరపోయి చూస్తుండగానే  యూనిఫారం వేసుకున్న అధికారుల బృందం అక్కడికి చేరుకుంది. అందులో ఒకతను తన గుర్తింపు కార్డు చూపించి పరిచయం చేసుకున్నాడు.  ఆహారం వృధా చేసినందుకు యాభయ్ మార్కులు (కొంచెం అటూ ఇటుగా  రెండు వేల     రూపాయలు)  జరిమానా విధించాడు. మాకు నోట మాట రాలేదు.
కట్టిన జరిమానా మొత్తానికి రసీదు ఇస్తూ అతడన్నాడు.
‘జెంటిల్మన్ – హోటల్లో యెంత  తినగలరో అంతే ఆర్డర్ చేయండి. అంతే కాని డబ్బు మీది కదా అని ఇష్టం వొచ్చినట్టు  ఆర్డర్ చేసే అధికారం, వృధా చేసే హక్కు మీకు లేవు. డబ్బు మీది కావచ్చు కానీ వనరులు సమాజానివి. అవి మీ సొత్తు కాదు.’                                    

ఆ దెబ్బతో మా మొహాలు తెల్లగా పాలిపోయాయో, అవమానంతో ఎర్రగా కందిపోయాయో తెలియదు. తెలిసిందల్లా ఒకటే!  ఇంత ధనిక దేశానికి చెందిన పౌరుల  ఆలోచనావిధానంలోని ఓ కొత్త కోణం.
మనకన్నా జర్మనీ  ఎంతో సంపన్న దేశం. కానీ వృధాను ఏమాత్రం  సహించలేని  దేశం. మరి మనం. అంత సంపన్నులం కాదు.  వృధాను అరికట్టడం మాత్రం  మన రక్తంలో లేదు.”
గమనిక : ఇది యెంత వాస్తవమో తెలియదు. నెట్లో ఇంగ్లీష్ లో తిరుగాడుతున్న వ్యాసం ఇది. నిజమయినా కాకపోయినా ఒక వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి, ఆచరించడానికి ఓ ‘నీతి కధ’ మాదిరిగా ఉపయోగపడగలదన్న ఉద్దేశ్యంతో అనువదించి బ్లాగులో పెడుతున్నాను. – భండారు శ్రీనివాసరావు  (06-09-2012)      

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

గురుద్దేవో నమో నమః ! - భండారు శ్రీనివాసరావు


గురుద్దేవో నమో నమః ! - భండారు శ్రీనివాసరావు


‘సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి

యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః’


మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.

ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ పడనివాడే ఉత్తమ గురువు. ‘నేను పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నాను’ అని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా వుంటుంది. అలాగే ‘పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడు’ అని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.

గురు శిష్యుల గురించి చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న కధ (?) గుర్తుకువస్తోంది.

“ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది. 

“తమరు నాకు పనికి వచ్చే చదువు చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు”

ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.”

మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.

1921 వ సంవత్సరం. అంటే దాదాపు తొంభయ్ ఏళ్ళ పైమాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.”

పంతుళ్ళ చెవులకు శిష్యులు తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే. 

ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. 

ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.

అక్షర బిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.



అప్పయ్య పంతులు గారు  



నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు. తెలిసినదల్లా మాష్టారంటే అప్పయ్య పంతులు గారు. నిస్వార్ధంగా పిల్లలకు చదువు చెప్పిన పుణ్యమే ఆయన్ని ఈ రోజుకు కూడా ఆరోగ్యవంతుడిగా కాపాడుతోంది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్లు కొంతమంది జీవితంలో పెద్దవాళ్ళయ్యారు. మరికొందరు వయస్సులో పెద్దవాళ్ళయ్యారు. కానీ ఆయన ఇప్పటికీ అప్పటిమాదిరిగానే సాధారణ జీవనం సాగిస్తున్నారు.

గురుపూజా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మహానుభావుడికి మరోసారి మనః పూర్వకంగా - 

“గురుద్దేవో నమః” 

(05-09-2011) 

26, ఆగస్టు 2012, ఆదివారం

నా బాధ ఎవరితో చెప్పుకోను?


నా బాధ ఎవరితో చెప్పుకోను?
దేశ జనాభా అక్షరాలా నూట పదికోట్లు 
ఇందులో ఇరవై  కోట్లమంది రిటైర్ అయికూర్చున్నారు 
[][][][]ముప్పయ్యేడు కోట్లమంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగులు

మరో ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది.  (వీళ్ళు పనిచేస్తారంటే ఎవరో కాదు వాళ్ళే నమ్మరు)
[][]


కోటిమంది ఐ టి రంగంలోవున్నారు. వీళ్ళు పని చేస్తారు కాని మన దేశం కోసం చెయ్యరు. 


[]Error! Filename not specified.[][]

ఇరవై ఐదు కోట్ల మంది స్కూళ్ళలో చదువుకుంటున్నారు.
[][][]


కోటిమంది అయిదేళ్ళ లోపు వాళ్లు. 



[][]


పదిహేను కోట్లమంది నిరుద్యోగులు


[][][]


కోటీ ఇరవై లక్షలమంది ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. 

[][][][][][]

79,99,998 మంది జైళ్ళలో మగ్గుతున్నారు. 


ఇక మిగిలింది నువ్వూ, నేనూ -
 

నువ్వేమో ఇలా తీరి కూర్చుని కంప్యూటర్లో మెయిల్స్ చెక్ చేసుకోవడమో, వచ్చిన వాటిల్లో నచ్చిన వాటిని  స్నేహితులకు ఫార్వార్డ్  చేస్తూ ఎప్పుడూ  బిజీగా వుంటావు.
 

[][][][][][]

మిగిలింది నేనొక్కడిని. ఈ దేశ  భారం అంతా ఒక్కడినే మోయాలి. వ్చ్! ఖర్మ. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి?
 
[]
(నెట్లో సంచారం చేస్తున్న జోక్ కు తెలుగులో స్వేచ్చానువాదం)