3, డిసెంబర్ 2011, శనివారం

రామాయణం పుక్కిటి పురాణమా ?



 

రామాయణం పుక్కిటి పురాణమా ? 
 

(రామాయణాన్ని పుక్కిటి పురాణం కింద కొట్టిపారేసే విమర్శకుల వాదాలను పూర్వపక్షం చేసే  ప్రయత్నంలో భాగంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కు చెందిన సరోజ బాల ఆంగ్లంలో రాసిన ఒక వ్యాసాన్ని నెట్ లో చదవడం జరిగింది. తెలుగు పాఠకుల కోసం చేసిన   స్వేచ్చానువాదం ఇది. పండితుల సలహాలు,సూచనలు తీసుకుని మూలానికి  న్యాయం చేసే విధంగా అదనంగా మరి కొన్ని వివరాలను జోడించడం జరిగింది.
వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో శ్రీరాముని గాధను వర్ణించారు. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తరువాతనే వాల్మీకి రామాయణాన్ని రచించారు. అందువల్ల జరిగిన గాధనే ఆయన జీవిత చరిత్ర మాదిరిగా  లిఖించారని భావించే వాళ్లు వున్నారు. సరోజ బాల వారిలో ఒకరు. తమ వాదానికి మద్దతుగా అనేక  దాఖలాలు చూపుతున్నారు. -భండారు శ్రీనివాసరావు)   


వాల్మీకి మహర్షి  గొప్ప పండితుడే కాదు ఖగోళ శాస్త్రవేత్త కూడా. అందుకే ఆయన శ్రీరామ చరితాన్ని రాస్తూ  కొన్ని ముఖ్యమయిన సందర్భాలు, ఘట్టాలు గురించి వర్ణించే క్రమంలో అప్పటి గ్రహాలూ, నక్షత్రాల స్తాన వివరాలను కూడా ఉటంకించగలిగారు. ఇలాటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అప్పటి తిధి  నక్షత్రాలకు సమానమయిన ఇంగ్లీష్ తేదీలను కనుగొనే ప్లానటేరియంఅనే సాఫ్ట్ వేర్ ను పుష్కర్ భట్నాగర్ అనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఒకరు  అమెరికా నుంచి సంపాదించారు. సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించే తేదీలను ఖచ్చితంగా లెక్కగట్టడానికి, భూమికీ, ఇతర గ్రహాలకీ నడుమ వున్న దూరాన్ని గణించడానికీ ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది.

రామాయణంలో వాల్మీకి పేర్కొన్న గ్రహ రాశుల గతులను,  నక్షత్రాల స్తానాల వివరాలను కంప్యూటర్ లోకి ఫీడ్ చేసి ఈ సాఫ్ట్ వేర్ సాయంతో చాలా ఆసక్తికరమయిన సమాచారాన్ని భట్నాగర్ తెలుసుకున్నారు. శ్రీరాముడి  జననం నుంచి పదునాలుగేళ్ళ వనవాసం అనంతరం  సీతాలక్ష్మణ సమేతుడై రాముడు  అయోధ్యకు తిరిగివచ్చి పట్టాభిషిక్తుడయ్యేవరకు రామాయణంలోని అనేక ముఖ్య ఘట్టాల కాల పట్టికలను దాదాపు నిర్ధారించే విధంగా ఈ ఫలితాలు వున్నాయి.              

రామాయణం బాలకాండ పందొమ్మిదో సర్గ, ఎనిమిది, తొమ్మిది శ్లోకాలలో శ్రీరాముడు చైత్ర మాసంలో నవమినాడు జన్మించినట్టు వాల్మీకి పేర్కొన్నారు. శ్రీరాముని  జనన సమయంలో రవి మేషంలో, గురువు కర్కాటకంలో, శని తులలో, శుక్రుడు మీనంలో, కుజుడు కర్కాటకంలో ఉచ్చస్తులై వున్నారు. జాతకాలు తెలిసిన వారు చెప్పేదేమిటంటే ఈ జాతకుడు మానవమాత్రుడు కాదు. నిజమే కదా! మానవుడిగా జన్మించిన సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే కదా ఈ శ్రీరాముడు. 

శ్రీరాముడు జన్మించింది చాంద్రమానం ప్రకారం  చైత్రమాసంలో. తిధి  నవమి. కర్కాటక  లగ్నం. లగ్నంలో గురువు ఉచ్ఛస్తితిలో వున్నాడు. చంద్రుడు మిధునంలో  వున్నాడు. అంటే  మిధున రాశి.  పునర్వసు నక్షత్రం.  పగటి పూట, మధ్యాహ్న సమయం.

ఈ వివరాలను అన్నిటినీ ఈ సాఫ్ట్ వేర్ లోకి ఫీడ్ చేసి చూసారు.  ఫలితం!  వీటికి సరిపోలిన  విధంగా అంటే ఇదేక్రమంలో  గ్రహరాశులు కూడిన రోజు క్రీస్తుకు పూర్వం 5114 జనవరి పదో తేదీ అని తేలింది. అంటే, ఈ పరిశోధనావ్యాసం రాసే సమయానికి 7121 సంవత్సరాలక్రితం ఆ తేదీన శ్రీరాముడు జన్మించాడన్నమాట. మన తిధుల ప్రకారం   ఆ తేదీని పరిశీలిస్తే  ఆ రోజు చైత్ర మాసం, శుక్ల పక్షం, నవమి. సమయం మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట  మధ్య. అధిక మాసాలు, శూన్య మాసాలు ఈ తేదీల లెక్కింపులో వచ్చిన కొన్ని  తేడాలకు కారణం అయివుండవచ్చు.

శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. భారతీయ భాషల్లో వెలువడిన అనేక రామాయణాలు అంటే వాల్మీకి రామాయణం, తులసీ రామాయణం,  కాళిదాసు రఘువంశం  మొదలయిన మహా కావ్యాల్లోనే కాకుండా బౌద్ధ జైన సాహిత్యాలతో పాటు  క్రీస్తుకు పూర్వం, ఆ తరువాత వచ్చిన విదేశీ రచయితల గ్రంధాల్లో సయితం రాముడు అయోధ్యలో  జన్మించినట్టు ప్రస్తావనలు వున్నాయి. అయోధ్యలోను,  అయోధ్య రాజధానిగా వున్న సామ్రాజ్యంలోను  ఆనాడు నెలకొనివున్న అద్భుతమయిన ఆలయాలు, ఆ దేవాలయాల్లో నిక్షిప్తమయిన  సుసంపన్న  శిల్ప కళా వైభవం  గురించి కూడా ఈ  గ్రంధాల్లో పేర్కొన్నారు.

అయోధ్య సరయూ నదీ తీరంలో వుంది. ఏడువేల ఏళ్ళ క్రితం సంగతి అంటే చాలా పురాతనమయిన విషయం. సుదీర్ఘమయిన ఈ మధ్య కాలంలో భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి సహజమయిన విపత్తులు అనేకం సంభవించి వుండవచ్చు. వీటి ఫలితంగా నదుల ప్రవాహ దిశలు మారడానికి అవకాశం వుంటుంది. అలాగే  విదేశీ దురాక్రమణలు, దండయాత్రల వల్ల నగరాలు నాశనం అయిపోవడానికి, సరిహద్దులు మారిపోవడానికి వీలుంటుంది. అందువల్ల ఆనాటి నైసర్గిక వాస్తవాలను వెలికి తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు.  ఈ నాటి అయోధ్యను ఆనాటి అయోధ్యతో పోలిస్తే విస్తీర్ణంలో కుదించుకునిపోయి వుండవచ్చు. అలాగే, నదీ పరివాహక దిశలు కూడా ఉత్తర, దక్షిణంగా సుమారుగా  నలభయ్ కిలోమీటర్లు అటూఇటుగా మారిపోయి వుండవచ్చు.
    
వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షితో కలసి యాగ సంరక్షణార్ధం తపోవనానికి వెళ్ళిన  సమయంలో ఆయన వయస్సు పదమూడు సంవత్సరాలు. అక్కడి నుంచి జనక మహారాజు రాజధాని మిధిలకు వెడతారు. శివ ధనుర్భంగం అనంతరం శ్రీరాముడు సీతను పెళ్ళాడతాడు. ఈ విషయం మీద శోధనకు పూనుకున్న పరిశోధకులు, వాల్మీకి రామాయణంలో పేర్కొన్న రీతిలో అదే మార్గంలో ప్రయాణించి 23 ప్రదేశాలను గుర్తించారు. శృంగి ఆశ్రమం, రాం ఘాట్, తడ్కా వన్, సిద్దాశ్రం, గౌతమాశ్రం, జనక్పూర్ (ప్రస్తుతం నేపాల్ లో వుంది), సీతాకుండ్ మొదలయినవి వీటిల్లో వున్నాయి. ఈ ప్రదేశాల్లో రామాయణంలో వర్ణించిన ఘట్టాలకు తగిన చారిత్రిక ఆధారాలు కూడా వారికి లభించాయి.   


దశరధ మహారాజుది మీన రాశి. రేవతీ నక్షత్రం. వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో పెద్ద కుమారుడయిన శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని దశరధుడు సంకల్పిస్తాడు. దీనికి ఒక కారణం వుంది. దశరధుడికి జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యం వుంది.  రవి, కుజుడు,   రాహువు ఒకే కూటమిగా ఏర్పడినప్పుడు, ఆ సమయంలో రాజ్య పాలకుడికి మరణం సంభవించే అవకాశం వుంటుంది. లేదా కుట్రలు కుతంత్రాలకు బలి అయ్యే ప్రమాదం పొంచి వుంటుంది. రవి, కుజ, రాహు కూటమి ఏర్పడిన విషయం తెలిసిన వాడు కనుకనే యువ రాజయిన రాముడిని  సింహాసనం ఎక్కించాలనే తొందరలో రామ పట్టాభిషేకానికి దశరధుడు అంతగా  ఆరాటపడ్డాడనుకోవాలి.   

క్రీస్తుకు పూర్వం 5089 సంవత్సరం  జనవరి ఐదో తేదీన ఇదే  విధమయిన అంటే రవి,కుజ, రాహువులతో కూడిన గ్రహ కూటమి ఏర్పడి వున్న దాఖలాలు వున్నాయి. అదే రోజున తండ్రి ఆజ్ఞను శిరసావహించి శ్రీరాముడు పదునాలుగేళ్ళ వనవాసం నిమిత్తం అయోధ్యను వొదిలి వెడతాడు. అంటే ఆ నాటికి శ్రీరాముడి వయస్సు (5114- 5089) పాతికేళ్ళు. వనవాసం కోసం శ్రీరాముడు అయోధ్య నగరాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆయన వయస్సు పాతికేళ్ళు అని పేర్కొంటూ వాల్మీకి  రామాయణంలో అనేక శ్లోకాలు వున్నాయి.
   
వనవాసకాలం పదమూడో సంవత్సరం  ద్వితీయార్ధంలో ఖరదూషణుడితో రామలక్ష్మణులు యుద్ధం చేస్తారు. ఆ సమయంలో సూర్యగ్రహణం సంభవించినట్టు రామాయణంలో ప్రస్తావన వుంది. ఆరోజు అమావాస్య అని, కుజుడు  కేంద్రంలో  వున్నాడనీ పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని అమెరికన్ సాఫ్ట్ వేర్ కు అందించినప్పుడు కంప్యూటర్లో లభించిన సమాచారం కూడా దీన్ని నిర్దారించేదిగా వుంది. క్రీస్తుకు పూర్వం ఒకానొక సంవత్సరంలో అక్టోబర్ ఏడో తేదీ అమావాస్య నాడు సూర్యగ్రహణం సంభవించినట్టు సమాచారం వుంది. అప్పటి గ్రహాల అమరిక కూడా రామాయణంలో పేర్కొన్న విధంగానే వుండడం విశేషం.

అదేవిధంగా రామాయణంలోని వివిధ స్కంధాలలో పేర్కొన్న గ్రహ రాశుల స్తితిగతులను  పరిశీలించి చూస్తే, క్రీస్తుకు పూర్వం 5076  డిసెంబర్ నాలుగో  తేదీన శ్రీరాముడితో జరిగిన  పోరాటంలో రావణుడు  మరణించాడని తెలుస్తుంది. శ్రీరాముడి పదునాలుగేళ్ళ వనవాసం చైత్ర మాసం శుక్ల పక్ష పక్షం నవమినాడు పూర్తయింది. దానికి సరిపోలిన ఇంగ్లీష్ తేదీ క్రీస్తుకు పూర్వం 5075  జనవరి రెండు గా కంప్యూటర్ సూచించింది. ఆ విధంగా లెక్క చూస్తే, శ్రీరాముడు వనవాసం, రావణ  వధ అనంతరం తన 39 వ ఏట (5114 – 5075)  అయోధ్యకు తిరిగి వచ్చాడు. 

పోతే, డాక్టర్ రామావతార్ అనే పరిశోధకులు - శ్రీరాముడు వనవాస సమయంలో దర్శించిన అనేక ప్రాంతాలపై లోతుగా అధ్యయనం జరిపారు. శ్రీరాముడు సంచరించినట్టు రామాయణంలో పేర్కొన్న ప్రదేశాలనన్నింటినీ  ఆయన స్వయంగా కలయ తిరిగాడు. ఈ క్రమంలో  రామావతార్ అయోధ్య నుంచి మొదలు పెట్టి రామేశ్వరం వరకు పర్యటించారు.  రామాయణంలో సీతారాములకు సంబంధించి పేర్కొన్న 195 ప్రదేశాలను ఆయన స్వయంగా చూసారు. తమ్సాతల్ (మాండా), అలహాబాద్ సమీపంలోని భరద్వాజ ఆశ్రమం, అత్రి మహాముని ఆశ్రమం, మార్కండేయ మహాముని ఆశ్రమం , గోదావరి నదీ తీరంలోని  పంచవటి, పర్ణశాల, నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్ లోని రాం కుండ్, కిష్కింధ, ధనుష్కోటి, రామేశ్వరం మొదలయినవి డాక్టర్ రామావతార్ దర్శించిన ప్రదేశాలలో వున్నాయి.

“రామేశ్వరం, రావణుడి లంక నడుమ సముద్రంపై శ్రీరాముని సైనికులయిన వానరులు వారధి నిర్మించినట్టు రామాయణంలో  వుంది.  ఈ  వారధి మీదుగా  లంక చేరిన శ్రీరాముడు రావణుడిని యుద్ధంలో ఓడించి  అతడిని సంహరిస్తాడు.

దీనికి  రుజువు అన్నట్టుగా నాసా’, ఇటీవల మానవ నిర్మిత వంతెన తాలూకు అవశేషాల చిత్తరువులను విడుదల చేసింది. రామేశ్వరం లంకల నడుమ పాక్ జలసందిపై నిర్మించిన వారధి చిత్రాలు అవి. శ్రీలంక లోని సీతావాటికను పర్యాటక  ప్రదేశంగా అభివృద్ధి చేయాలనే అభిలాషను ఈ మధ్యనే  శ్రీ లంక ప్రభుత్వం వ్యక్తం చేసింది. క్రీస్తుకు పూర్వం 5076 లో రావణుడు తను అపహరించి తీసుకువచ్చిన సీతాసాధ్విని   ఈ వాటిక లోనే వుంచాడన్న నమ్మకం ఆ దేశీయులలో ఇప్పటికీ వుండడమే ఇందుకు కారణం. 


శ్రీరాముడు సూర్య వంశానికి చెందిన రాజుల్లో అరవై నాలుగోవాడని భారత ఇతిహాసాల్లో పేర్కొనడం జరిగింది. రావు బహదూర్ సీతారాం ఎనభై ఏళ్ళ క్రితం రాసిన అయోధ్య కా ఇతిహాస్  అనే గ్రంధంలో శ్రీరాముడితో పాటు ఆయనకు ముందు రాజ్యం చేసిన అరవై ముగ్గురు రాజుల పేర్లను ఉదహరించారు. రాజా దశరధుడితో పాటు రఘు, దిలీప్ చక్రవర్తులు  వీరిలో వున్నారు. రిగ్వేదంగురించి ప్రొఫెసర్ సుభాష్ కక్ రాసిన ఒక గ్రంధంలో ఈ వివరాలను పొందుపరిచారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ప్రతిచోటా, ప్రత్యేకించి హిమాచల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఈశాన్య భారతంలోని గిరిజన ప్రాంతాలలో శ్రీరాముడు చరిత్ర నిజమేనని నమ్మేవారు  అధిక సంఖ్యలో ఈనాటికీ కానవస్తారు.

రామాయణంలోని మరో విశిష్టత ఏమిటంటే రామరాజ్యంలో- పుట్టుక ప్రాతిపదికపై ఏర్పడిన చాతుర్వర్ణ వ్యవస్థ తాలూకు అవాంఛిత  ప్రభావాలు కానరావు. నిజానికి వాల్మీకి మహర్షి ఈనాటి షెడ్యూల్డ్ జాతులకు చెందిన కులానికి చెందినవాడు. భర్తచే పరిత్యజించబడిన సీత అడవులకు చేరి వాల్మీకి ఆశ్రమంలోనే తలదాచుకుంటుంది. సీతారాముల కవలపిల్లలయిన లవకుశులు వాల్మీకి ఆశ్రమంలోనే పుట్టి పెరుగుతారు. వాల్మీకి గురించి మనం గర్వంగా చెప్పుకోదగిన మరో విషయం ఏమిటంటే ఆయన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు.   ఆయన రామాయణంలో పేర్కొన్న గ్రహరాశులు, నక్షత్ర సముదాయాల గురించి పేర్కొన్న అనేక విషయాలు కాలపరీక్షకు తట్టుకుని ఈ నాటికీ నిలిచాయి. ఈ విషయంలో  ఆయన గణించి పేర్కొన్న అంశాలన్నీ  సరయినవేనని అమెరికన్ సాఫ్ట్ వేర్ రుజువుచేసింది.
(02-12-2011)

29, నవంబర్ 2011, మంగళవారం

ఒక మహర్షి అస్తమించాడు



కీర్తిశేషులు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారు 


ఈ రోజు నిజంగా దుర్దినం. స్వార్ధాన్ని జయించిన ఒక వ్యక్తి ఈ స్వార్ధ సంకుచిత ప్రపంచం నుంచి నిష్క్రమించాడు. తొమ్మిదిపదుల వయస్సు దాటిన  తరువాత  కాలు విరిగి కోలుకుంటున్నారు అన్న దశలో అందరిని హతాశులను చేస్తూ అస్తమించాడు. జీవన మార్గంలో అనేకమందికి నడక నేర్పిన మనిషికి నడక దూరమవడం విధి వైపరీత్యం. తన జీవితాన్ని చమురుగా మార్చి ఎన్నో ఇళ్ళల్లో దీపాలు వెలిగించిన ఆ మహా జ్యోతి ఆరిపోయింది. ఆఖరి చూపులు అందడం కోసం హడావిడిగా విజయవాడ  వెడుతూ ఆ మహానీయుడుకి అర్పిస్తున్న అశ్రు నివాళి.  
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
(29-11-2011)

28, నవంబర్ 2011, సోమవారం

తోట్లవల్లూరును మరచిపోలేను. - డాక్టర్ నోరి దత్తాత్రేయుడు



క్షణం తీరికలేని మనిషికి దొరికిన మధుర క్షణాలు. - భండారు శ్రీనివాసరావు

అనుక్షణం వార్తలమధ్య గడిపే జర్నలిష్టులను ప్రతిరోజూ  పత్రికల్లో వచ్చే వార్తలు అంతగా ఆకట్టుకోవు. కానీ, నవంబర్ ఇరవై ఐదో తేదీన ఈనాడు లో పడ్డ  వార్తను చూసి,  లోగడ ఆలిండియా రేడియో, దూర దర్శన్ లలో  న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన ఆర్.వీ.వీ. కృష్ణారావు కాసేపు చకితులయ్యారు. దానికో కారణం వుంది. అది తెలుసుకోవాలంటే అంతకు ముందు శనివారం నాడు హైదరాబాదులో  జరిగిన ఒక పెళ్లి. అది చెప్పుకునే ముందు ఈనాడులో పడ్డ వార్త సారాంశం తెలుసుకుందాం.

తోట్లవల్లూరును మరచిపోలేను.


డాక్టర్ నోరి దత్తా త్రేయుడు 


(తోట్లవల్లూరు, న్యూస్ టుడే-  కేన్సర్ చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాత  కీర్తి గడించిన  డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గురువారం కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో పర్యటించి తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను చిన్నప్పుడు నివసించిన ఇంటిని సాంబశివరావు కొనుగోలు చేసి కొత్తగా  నిర్మించుకున్న ఇంటికి వెళ్లి అంతా  కలయతిరిగిచూసారు. ‘ఇక్కడో బావి వుండాలే!’ అని ఆ ఇంట్లోవారిని వాకబు చేశారు.   పమిడిముక్కల మండలం ఘంటాడలో తాను జన్మించినా, కుటుంబ సభ్యులతో చిన్నతనంలో  గడిపిన తోట్లవల్లూరును జీవితంలో మరచిపోలేనని చెప్పారు. తనకు నామకరణం చేసిన కలగా పూర్ణచంద్ర శాస్త్రి ఇంటివద్ద కొద్దిసేపు గడిపి వేణుగోపాలస్వామి ఆలయంలో  అర్చకులు ప్రసాదంగా ఇచ్చిన చిట్టి గారెలు తిని దాదాపు యాభై అరవై  ఏళ్ళ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.)

ఈ వార్త కళ్లబడగానే  కృష్ణారావు గారికి నెప్పల్లి  ప్రసాద్ గారి అబ్బాయి పెళ్ళిలో జరిగిన సంఘటన సినిమా రీలులా కళ్ళముందు కదలాడింది.
ప్రసాద్ గారు అమెరికాలో పేరుమోసిన చార్టర్డ్ అక్కౌంటెంట్. వారి ఆహ్వానం మేరకు కృష్ణారావు గారు ఆ పెళ్ళికి వెళ్లారు. అక్కడ ఆయనకు  వూహించని అతిధి తారసపడ్డారు. ఆయనే నోరి దత్తాత్రేయుడు గారు. ఆయన హస్తవాసికి తిరుగులేదు. క్షణం తీరికలేని వైద్యులు. కేన్సర్ రక్కసి పీచమడిచే పనిలో పడి దేశదేశాలు తిరుగుతుంటారు. ఇటీవల సోనియా గాంధీ గారికి వైద్యం చేసిన డాక్టర్ల  బృందానికి ఆయనే నేతృత్వం వహించారని పత్రికల్లో  వచ్చింది.  దత్తాత్రేయుడి గారికి  నెప్పల్లి ప్రసాద్ గారు  అత్యంత ఆత్మీయులు. అందుకే వారి కుమారుడి వివాహానికి అమెరికానుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. వారిని పెళ్ళిలో చూడగానే కృష్ణారావు గారికి చిన్నప్పటి తోట్లవల్లూరు సంగతులు మదిలో మెదిలాయి. దత్తాత్రేయుడు గారి కుటుంబం, కృష్ణారావు గారి కుటుంబం యాభయ్ , అరవై ఏళ్ళనాడు ఆ వూళ్ళో ఒకే ఇంట్లో నివాసం వుండేవి. చిరకాలం నాటి  బాల్య మిత్రుడు అన్నేళ్ల తరువాత   తారసపడగానే కృష్ణారావు గారు ఆయనతో మాటలు కలిపారు. మాటల మధ్యలో తోట్లవల్లూరు సంగతి ఎత్తారు. పెళ్ళిలో నలుగురి మధ్యవున్న కారణంగానో యేమో ఆయన  నుంచి వెంటనే  స్పందన కాన రాలేదు. అయినా కృష్ణారావు గారు నిరుత్సాహ పడలేదు. పెళ్ళయిన తరువాతో అంతకు  ముందో కానీ, భోజనాల సమయంలో మరోసారి దత్తాత్రేయుడు  గారితో ముచ్చటించే వీలు చిక్కించు కున్నారు. చిన్నప్పటి సంగతులు కొన్ని  గుర్తు చేశారు. ఈ సారి ఆయన గుర్తుపట్టినట్టే అనిపించింది.
“ఎన్నో ఏళ్ళయింది తోట్లవల్లూరు వెళ్లి. మేము అమ్మేసిన ఇల్లెలా వుంది? వూరేలా వుంది ?” అని అడిగారు.
‘వీలయితే ఈసారి కలసివెడదాం’ అని కూడా అన్నారు.  
“కోట పోయింది. చదువుకున్న స్కూలు అలాగే వుంది. మనం ఆడుకున్న గుడీ అలానే వుంది. పక్కన కృష్ణానది అందరి  జ్ఞాపకాలను వొడిలో దాచుకుని అలాగే పారుతోంది.” బదులు చెప్పారు.
అంతటితో ఆగలేదు. చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, మసలిన మనుషులు అన్నింటినీ  గుర్తుచేశారు.
“వేణుగోపాలస్వామి ఆలయం, గుళ్ళో ప్రసాదంగా పెట్టే చిట్టిగారెలు, కట్టు పొంగలి రుచి, వాళ్లు వున్న ఇల్లు, ఇంటి ముందు గిలక బావి, దొడ్లో బాదం చెట్టు” ఇలా ఒకటేమిటి గుర్తుకొచ్చినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పేశారు కృష్ణారావు గారు.
విందు పూర్తయింది. పెళ్లయిపోయింది. ఇంటికి తిరిగివచ్చిన తరువాత కూడా కృష్ణారావు గారికి తోట్లవల్లూరు గురించిన తలపులు వొదలలేదు. అది ఆయన సొంత వూరు  కాకపోయినా, దత్తాత్రేయుడు గారి మాదిరిగానే కృష్ణారావు గారికి కూడా ఆ వూరితో మరచిపోలేని అనుబంధాలు, జ్ఞాపకాలు అనేకం వున్నాయి.
కృష్ణారావు గారి నాన్న గారు రాయసం గంగన్న పంతులు గారు. దేవాదాయ శాఖలో ఉద్యోగి. చిన్న చిన్న దేవాలయాలను పర్యవేక్షించే అధికారి. బదిలీ మీద కుటుంబాన్ని వెంట తీసుకుని తోట్లవల్లూరు వెళ్లారు.
ఆ వూళ్ళో నోరి సత్యనారాయణ గారింట్లో ఓ వాటా అద్దెకు తీసుకున్నారు.
సత్యనారాయణ గారికి   నలుగురు కుమారులు. పెద్దబ్బాయి  నోరి రాధాకృష్ణ మూర్తి గారు. ఐ.పి.ఎస్. అధికారి. పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ గానో ఆ పై పదవిలోనో రిటైర్ అయ్యారు. పోలీసు ఉద్యోగంలో చేరక మునుపు ఆయన బందరు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేవారు.
రెండో కుమారుడు ఎన్.మధురబాబు గారు. స్టేట్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామీణ బ్యాంకుల  వ్యవస్థలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొల్పిన మొట్టమొదటి గ్రామీణ  బ్యాంక్ – నాగార్జున గ్రామీణ బ్యాంక్ కు మొదటి  చైర్మన్ గా పనిచేసి సమర్ధుడయిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జ్యోతిష శాస్త్రంలో కూడా దిట్ట, మూడో కుమారుడు రామతీర్ధ కాగా కనిష్ట  కుమారుడు నోరి దత్తాత్రేయుడు గారు. చిన్నప్పుడు ‘దత్తు’ అని పిలిచేవాళ్ళు.
కొత్త వూరిలో కృష్ణారావుగారికి కొత్త స్నేహితులు లభించారు. ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. ‘అమ్మా నాన్నా ఏదయినా పనిమీద బెజవాడ  వెళ్ళాల్సి వస్తే ఆ నాలుగు రోజులు తన భోజనం పడకా కూడా నోరి  వారింట్లోనే’ అని కృష్ణారావు గారు నాతో  ఈ విషయాలు చెబుతూ గుర్తు చేసుకున్నారు.   
వారి తండ్రిగారి అకాల మరణం తరువాత నోరి వారి మకాం బందరుకు మారిపోయింది.
కృష్ణారావు గారు మాత్రం తండ్రిగారి  ఉద్యోగరీత్యా  తోట్లవల్లూరులోనే మరికొంత కాలం గడిపారు.
ఆ నాటి రోజులు గురించీ, అప్పటి వాతావరణం గురించీ ఆయన మాటల్లోనే.              
‘నదికి ఆనుకునే కాలవ. బెజవాడ నుంచి లాంచీలు తిరుగుతుండేవి. శివ కామేశ్వరి, శివ పార్వతి, గంగ వాటి పేర్లు.         
‘నోరి వారి కుటుంబం యావత్తూ కుసుమ హరనాధ బాబా భక్తులు.  ఇంట్లో  రోజూ భజనలు. పూజలు. తండ్రి చని పోయిన తరువాత వారి కుటుంబం బందరు వెళ్ళగానే ఆ వాటాలోకి అప్పయ్య శాస్త్రి గారు అద్దెకు దిగారు.
‘తోట్లవల్లూరులో వాళ్లు వున్న ఇల్లు బాగా పెద్దదేమీ కాదు. ఉత్తర ముఖంగావున్న ఆ ఇంటి ముందు గిలక బావి. దొడ్లో బాదం చెట్టు. కుడి పక్క  తాడికొండ వారి నివాసం. ఆ ఇంట్లోనే రామమందిరం. దాపునే తోట్లవల్లూరు కరణం గారయిన అడిదం వారి ఇల్లు. మరోపక్క గోవిందరాజుల వాళ్లు వుండేవాళ్ళు. పోతే,  శివలెంక వీరేశ లింగం గారి  ఇల్లు కూడా పక్కనే. వీరేశ లింగం గారు పేరు మోసిన  పెద్ద జ్యోతిష్కులు. సినీ నటుడు   ముదిగొండ లింగమూర్తి గారి  వియ్యంకులు. మద్రాసునుంచి భానుమతి వంటి ప్రముఖ సినీ  కళాకారులు కూడా ఆయనను కలవడానికి తోట్లవల్లూరు వచ్చేవాళ్ళు. వీరేశలింగం గారి  అబ్బాయి ఎస్.వి.ఎం. శాస్త్రి గారు  దక్షిణ  మధ్య రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తోట్లవల్లూరులోని శివాలయానికి శివలెంక వారు అనువంశిక ధర్మ కర్తలు.
‘వూళ్ళో వున్న పెద్దగుడి వేణుగోపాలస్వామిది. ఆ గుడికి తగ్గట్టు  పెద్ద గాలి గోపురం. దాని మీద పావురాళ్ళు. వాటి రక్తం పూస్తే పక్షవాతం వంటి రోగాలు నయమవుతాయని చెప్పుకునే వాళ్లు. అది బొమ్మదేవరపల్లి  జమీందారులు కట్టించిన గుడి కావడం వల్ల వైభోగానికి  తక్కువలేదు. పూజలు, పునస్కారాలు, ప్రసాదాల వితరణ ఘనంగానే  జరిగేవి. తిరునక్షత్రం నాడు పులిహోర చేసేవాళ్ళు. పర్లాంగు దూరంలో  కృష్ణానది. ధనుర్మాసంలో ఆలయ అర్చకులు ఆ బావినుంచి మంగళ వాయిద్యాలతో తీర్ధపు బిందెలు తెచ్చేవాళ్లు. మా  పిల్లల  ఆటలన్నీ గుళ్ళో పొగడ చెట్టు కిందనే.
‘మా వీధి లోనే పోస్టాఫీసు. అన్నంభొట్లవాళ్లు టపా పని చూసేవారు. ఉయ్యూరు నుంచి ప్రతిరోజూ ఒక భారీ మనిషి  (పోస్టల్ రన్నర్) తపాలా సంచీ మోసుకుంటూ అయిదుమైళ్లు గబగబా నడుచుకుంటూ  తోట్లవల్లూరు వస్తుండేవాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ, చేతిలో వున్న పొడుగుపాటి బల్లేన్ని నేల మీద పోటు  పొడుచుకుంటూ  అతగాడు నడిచివస్తుంటే ఆ బల్లెం పైన కట్టిన మువ్వలు అదోరకం శబ్దం  చేస్తుండేవి.
‘తోట్లవల్లూరు  జమీందారులు బొమ్మదేవర వంశీకులు వేణుగోపాలస్వామి దేవాలయానికి అనువంశిక ధర్మకర్తలే కాదు,  దానికి కర్తా కర్మా క్రియా అన్నీ వాళ్ళే.  జమీందార్ల దగ్గర ఏనుగుల్ని సంరక్షించే నాగయ్య అనే వ్యక్తి తరువాతి రోజుల్లో ఈ గుడి వ్యవహారాలూ కనిపెట్టి  చూసేవాడు. కృష్ణారావు గారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు ప్రభుత్వం తరపున అంటే దేవాదాయ శాఖ తరపున ఆలయం బాధ్యతలు  చూస్తుండే వారు. అప్పట్లో ఆయన నెల  జీతం  అరవై రూపాయలు. కరవుభత్యం కింద  ఇరవై రూపాయలు. పైన మరో అర్ధ రూపాయి. ఆ వూరి మొత్తంలో  నెలసరి అంత జీతం వచ్చేవాడు మరొకడు లేకపోవడం వల్ల అది చిన్న జీతంగా ఆయన ఎప్పుడూ భావించలేదు. కాకపొతే అంత జీతం అన్నది ఆయనకు వూళ్ళో ఒక ప్రత్యేకతను,అయాచిత  గౌరవాన్ని కట్టబెట్టింది.



గరుడవాహనంపై వేణుగోపాలస్వామి వారు 

(1955 లో తీసిన ఈ ఫోటోలో కుడి నుంచి రెండో వ్యక్తి ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్  అడిదెం కనక వీరభద్ర రావు గారు  మూడో  వ్యక్తి  రాయసం గంగన్న పంతులు గారు, స్వామి వారి పక్కన ఆలయం ప్రధాన అర్చకులు పరాంకుశం అప్పలాచార్యులు గారు. పోతే, కూర్చున్న వారిలో కుడివైపు మొదటి కుర్రవాడు ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు)     

‘ఆ రోజుల్లో బెజవాడ నుంచి  తోట్లవల్లూరుకు  ప్రైవేటు సర్వీసులవాళ్లు బస్సులు నడిపేవాళ్ళు. ఒకటి  రామాంజనేయ మోటార్ సర్వీస్, రెండోది గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్. బస్సులమీద ఆ  పేర్లు రాసివుండేవి. గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్  అని రాసి  పక్కనే ‘ఇన్ లిక్విడేషన్’ అని కూడా వుండేది. దాని అర్ధం ఇప్పటికీ తెలియదు. వీటిల్లో   రామాంజనేయా సర్వీసు బస్సు ఖచ్చితంగా  టైం ప్రకారం నడిచేది. ఒక బస్సు డ్రైవర్  పేరు సుబ్రహ్మణ్యం అని గుర్తు.
‘వెనుక బెజవాడ నుంచి  రావాలంటే చుట్టూ తిరిగి  రావాల్సివచ్చేది. ఇప్పుడు కృష్ణానది కరకట్ట మీదుగా హంసలదీవి దాకా రోడ్డు వేసారు. దాంతో  రాకపోకలు సులువయ్యాయి.
‘తోట్లవల్లూరులో  వున్న హైస్కూలే చుట్టుపక్కల వూళ్ళకు దిక్కు. వల్లూరిపాలెం నుంచి ఆడపిల్లలు  నడుచుకుంటూ స్కూలుకు వచ్చేవాళ్ళు. పక్కనున్న భద్రిరాజుపాలెం నుంచి కూడా చదువుకోవడానికి పిల్లలు  తోట్లవల్లూరు  రావడం గుర్తు.
‘వూళ్ళో గుర్రబ్బళ్లు  కూడా వుండేవి. ఒకరోజు బండి చక్రం కింద ఓ కుక్క పిల్ల నలిగి చనిపోవడం చూసిన పిల్లలకు ఆ రోజు అన్నం తినబుద్దికాలేదు.’
తోట్లవల్లూరు గురించిన  పాత సంగతులు  కృష్ణారావు గారికి  ఇంకా అనేకం గుర్తున్నాయని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకనిపించింది.
పెళ్ళిలో కలసి కాకతాళీయంగా  ఆయన    చెప్పిన నాలుగు ముచ్చట్లు నోరి దత్తాత్రేయుడి గారి తోట్లవల్లూరు పర్యటనకు ‘ప్రేరణ’ కావడం  నా ఈ రచనకు ‘ప్రేరణ’గా మారింది. (28-11-2011)   

    

25, నవంబర్ 2011, శుక్రవారం

కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు



కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు  
వార్త
ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘ఈనాడు-ఈటీవి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక  ప్రశ్న, దానికి సమాధానం ఇలా వున్నాయి.
ప్రశ్న: “పీసీసీ అధ్యక్షునితో ఎలాంటి సంబంధాలున్నాయి?”
సమాధానం: “బాగున్నాయి. కాంగ్రెస్ దానంతట అది వోడించుకుంటుంది తప్ప వేరే పార్టీకి కాంగ్రెస్ ని వోడించే బలం లేదు.”  మేమంతా ఐకమత్యంగా ఉంటేనే తిరిగి గెలుస్తాం.
(నవంబరు శుక్రవారం నాడు ఈనాడు దినపత్రిక లో ప్రచురించిన ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ)
వ్యాఖ్య
“కుఠార మాలికాం దృష్ట్యా
కంపంతతి తరోవనే!
తత్ర వృద్ధ తరుహ్  ప్రాహుహ్
మామకోనాస్తి కిం భయం”
ఈ సంస్కృత శ్లోకానికి  తెలుగు అనువాదం:
“ఒకడు పది గొడ్డళ్లను, వాటిని మాలగా గుచ్చి, భుజాన వేసుకుని తన వూరికి, ఒక అడవి దోవగుండా వెళ్తున్నాడు. అడవిలో కుర్ర చెట్లు ఇది చూసి హడలిపోయాయి. అది చూసి, ఒక వృద్ధ వృక్షం “ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు! ఆ గొడ్డళ్ళు  మనలనేం చేస్తయ్యి! వాటిలో మన వాడు (కర్ర) లేడు గదా!” అని అభయం ఇచ్చింది.
“అదీ కాంగ్రెస్ వాళ్లు పొందికగా కూర్చుని నేర్వవలసిన పాఠం.”
(కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు శ్రీ జి. కృష్ణ రాసిన ‘అప్పుడు –ఇప్పుడు’ గ్రంధం నుంచి)
25-11-2011