24, నవంబర్ 2011, గురువారం

ప్లస్ లూ - మైనస్ లూ


ప్లస్ లూ -  మైనస్ లూ  - భండారు శ్రీనివాసరావు


(ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి నేటికి (25-11-2011)  సరిగ్గా ఏడాది.)





కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో  కిరణ్ కుమార్ రెడ్డి సరయిన తరుణంలో ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి.

కలసివచ్చిన అంశాలు.
1.)  ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించేనాటికి  మరో  మూడున్నరేళ్ల పాలనా  సమయం మిగిలి వుండడం
2.)  అంతకు ముందు పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు తన పార్టీకి చెందినవారే కావడం
3.)  సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏవిధమయిన మరకలు లేకపోవడం
4.) యువకుడు, విద్యాధికుడు కావడం
5.)  అధిష్టానం ఆశీస్సులు  
ఇక కలసిరాని అంశాలు :
1.)  తెలంగాణా సమస్య తీవ్రం కావడం
2.) జగన్ ప్రాబల్యం గురించిన ప్రచారం పెరిగిపోవడం
3.)  సీనియర్లు మొరాయించడం
4.)  జూనియర్లు ఠలాయించడం
5.) పరిష్కారం తన చేతిలో లేని తెలంగాణా వంటి సమస్యలు చుట్టుముట్టడం
6.) అధికారులమీదనే ఎక్కువ ఆధారపడుతూ క్యాంప్ ఆఫీసుకే పరిమితమై ఓ సీనియర్ బ్యూరోక్రాట్ మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్న వదంతులను గట్టిగా ఖండించలేకపోవడం
సాఫల్యాలు :
1.)  శాసనసభ నియోజకవర్గంనుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో చతురత చూపి పార్టీకి వున్న బలాన్ని మించి  అదనంగా ఒక సీటు గెల్చుకోవడం 
 2.)  సకలజనుల సమ్మె సందర్భంగా రైల్  రోఖో కార్యక్రమాన్ని నీరుకారుస్తూ పోలీసులతో కలసి వ్యూహ రచన చేయడం
 3.)  ప్రభుత్వం పడకేసిందన్న నిందను సైతం లెక్కచేయకుండా అనవసరమయిన నిర్ణయాలతో లేనిపోని ఆరోపణలకు గురికాకుండా జాగ్రత్త పడడం
4.) మూడున్నరేళ్లు వ్యవధానం వున్న ముఖ్యమంత్రికి కావాల్సింది ప్రభుత్వం నిలుపుకోవడం కానీ ప్రజా సంక్షేమ పధకాలు కాదన్న రాజకీయ కౌశల్యాన్ని ప్రదర్శించి ‘నెంబర్ గేమ్ ‘ కు ప్రాధాన్యం ఇవ్వడం.
5.) ఏడాది పుణ్యకాలం హారతి కర్పూరంలా కరిగిపోయినా ముందు కుర్చీ పదిలం చేసుకున్న తరువాతనే సంక్షేమ పధకాలను వరుసగా ప్రకటించడం
6.) ముఖ్యమంత్రిని మార్చే అవకాశం లేకుండా వచ్చే ఎన్నికలవరకు తననే కొనసాగించేలా అధిష్టానం వద్ద మార్కులు సంపాదించడం
7.) సొంతపార్టీలో అసమ్మతి గళాలు విప్పిన నోళ్లతోనే భజన గీతాలు పాడించడం
ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి సొంత ప్రతిభకు తార్కాణాలయితే అయాచితంగా  కలసివచ్చిన అంశాలు మరికొన్ని వున్నాయి.
 1.) కోర్టు నిర్ణయాలవల్ల మారిన రాజకీయ వాతావరణం
2.) సీ బీ ఐ దర్యాప్తులతో రెండు ప్రధాన ప్రత్యర్ధి వర్గాలు మల్లగుల్లాలు పడుతుండడం
౩.) గత కాలపు చేదు అనుభవాల నేపధ్యంలో పార్టీ హై కమాండ్ ముఖ్యమంత్రి మార్పు గురించి ఆలోచించే పరిస్తితి లేకపోవడం
4.) ప్రత్యర్ధుల బలహీనతలు ముఖ్యమంత్రికి బలంగా మారడం
ఇవన్నీ వున్నా  ఇంకా పొంచే వున్న రాజకీయ కారు మేఘాలు.
1.) సొంతగూటికి చేరుతున్నట్టు  ప్రకటనలు గుప్పిస్తున్న అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతవరకు నమ్మొచ్చన్న అనుమానాలు
2.) ఇంతవరకు కిరణ్ ప్రభుత్వాన్ని చూసీ చూడనట్టు వొదిలేస్తున్న తెలుగుదేశం పార్టీ -   సీ.బీ.ఐ. దర్యాప్తు ముదిరిన తరువాత కూడా అదే దారిలో వెడుతుందా లేదా అన్న విషయంలో అస్పష్టత
౩.) ముదిరి పాకాన పడుతున్న దర్యాప్తుల నేపధ్యంలో పధకాల రూపకల్పనలోనూ, వాటి అమల్లోను , అధికారుల సహకారం మంత్రులకు, ముఖ్యమంత్రికి  ఏమేరకు వుంటుంది అన్న సందేహాలు
కాబట్టి రాజకీయాల్లో ఇవ్వాళ గడిచినట్టే రేపు గడుస్తుంది అన్న భరోసా లేదు. ఇవ్వాళ స్త్రోత్ర పాఠాలు వల్లిస్తున్న భజన బృందాలు అధికారం వున్నంతవరకే వెనకవుంటాయనీ, వెన్నంటి వుంటాయనీ తెలుసుకోవడానికి చరిత్ర తిరగేయనక్కరలేదు. నిన్నమొన్నటి వరకు ఆ గళాలు ఎవరిని వేనోళ్ళ స్తుతించాయో, ఎవరివెంట తిరిగాయో  తెలుసుకోవడానికి రిసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
కాకపొతే, ఈ నగ్న సత్యం ఈనాటి నాయకులకు తెలియందేమీ కాదు. తెలియనట్టు కానవస్తారంతే! ఎందుకంటె రాజకీయాల్లో ఈ భజనపరుల అవసరం కొండంత. పైపెచ్చు పరస్పరాధీనంగా నడిచే వ్యవహారాలు కావడం మరో కారణం. (25-11-2011)

22, నవంబర్ 2011, మంగళవారం

అప్పుడు - ఇప్పుడు


వార్త – వ్యాఖ్య
( ఆంధ్ర జ్యోతి దినపత్రిక 21-11-2011)
అప్పుడు విజయవాడలో అల్లర్లు జరిగాయి. ఆ ప్రాంతంలో పర్యటించడానికి  ముఖ్యమంత్రి పీ.వీ.నరసింహారావు బయలుదేరుతున్నారు. ఆయన  అక్కడికి వెడితే ... ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతాయని, రావద్దని జిల్లా కలక్టర్,  ఎస్పీ... పీవీని  వారించారు. ముఖ్యమంత్రి హోదా, రాజకీయ ప్రయోజనాలు బేరీజు వేసుకున్న పీవీ వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఇక లాభం లేదనుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వల్లూరి  కామేశ్వరరావు రంగంలోకి దిగారు. వెళ్ళవద్దని ముఖ్యమంత్రికి సూచించారు. ‘నువ్వు సెక్రెటరీవి. నా ఉద్యోగివి.  నీ పని నువ్వు చూసుకో.  నేను చెప్పింది చేయి. నేను పొలిటీషియన్ని. నా పని నేను చేస్తా. ‘ అంటూ ఆఫీసు  మెట్లు దిగి కారెక్కడానికి వచ్చారు పీవీ. కానీ అక్కడ కారు  డ్రైవర్  లేడు.  ఏడని అడిగితే... ‘సీఎస్  గారు కారు తీయవద్దన్నారని’ సమాధానం వచ్చింది. ‘డ్రైవర్  నా ఉద్యోగి. అతడు నేను చెప్పినట్టే వింటాడు. అతను రాడు.’ అని సీఎస్ కరాఖండిగా చెప్పారు. పీవీ పర్యటన ఆగిపోయింది. మరుసటి రోజు పీవీ వల్లూరిని పిలిచి .....’నిన్న నేను వెళ్ళివుంటే గొడవలు పెరిగేవి. నన్ను ఆపి మంచిపని చేసావు’ అని మెచ్చుకున్నారు.
....విధులపట్ల అదీ ఆనాటి అధికారుల నిబద్ధత. మరి ఇప్పుడో...!
ఓసారి శ్రీశైలంలో ఒక జాతీయ పార్టీ సమావేశం జరుగుతోంది. దాన్ని కవర్ చేయడానికి హైదరాబాద్ నుంచి  ఒక విలేకరి వెళ్లాడు. సమావేశం పూర్తయ్యాక ఫాక్స్ ద్వారా వార్త పంపడానికి కొండకిందకు వెళ్ళబోతున్నాడు. అది గమనించిన ఆ పార్టీ ప్రముఖుడొకరు జీపు ఏర్పాటు చేస్తానన్నా అతగాడు వొద్దన్నాడు. పరవాలేదని నచ్చజెప్పి తన  జీపు డ్రైవర్ ను పిలిచి కాఫీ, టీలు, భోజనం, ఫాక్స్ బిల్లు వగైరాలకు కొంత డబ్బు ఇచ్చి తగిన సూచనలు చేసి ఆ విలేకరిని కిందికి  పంపాడు. ఆయన పనులన్నీ పూర్తయి  హైదరాబాద్ బస్సు ఎక్కేదాకా వుండి  రాత్రికి జీపు డ్రయివర్ తిరిగి వచ్చాడు. రాగానే అతడికి ఇచ్చిన మొత్తం యధాతధంగా తిరిగి వాపసు చేయడంతో  ఆ నాయకుడు ఖంగు తిన్నాడు. ‘ఏమీ ఖర్చు కాలేదా’ అని అడిగితే ‘లేదు సార్ ! కాఫీక్కూడా నన్ను డబ్బులివ్వనివ్వలేదు. పైగా నేను వొద్దంటున్నా మన జీపులో  పది లీటర్ల డీజిల్ కొట్టించి డబ్బులు ఆయనే ఇచ్చాడు సార్  ‘ అని చెప్పేసరికి నివ్వెరపోవడం ఆ నాయకుడి వంతయింది.
......ఒకనాటి విలేకరుల నిబద్దత అది. మరి ఇప్పుడో.....!

(22-11-2011)

కనుక్కోండి చూద్దాం !




కనుక్కోండి చూద్దాం !

ఈ కింది వరుసల్లో సున్నాల మధ్య దాగున్న ఇంగ్లీష్ 'C' అక్షరాన్ని పట్టుకోండి.

OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO COOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO

సంతోషం ఈ పరీక్ష గట్టెక్కారు.  ఇప్పుడు కింద వరుసగా కనిపిస్తున్న'9'  అంకెల నడుమవున్న '6' అంకెని గుర్తుపట్టండి.

9999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999
6999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999

పోతే ఇప్పుడు మూడోది. అదేమిటంటే – కింద ఇంగ్లీష్ ‘M’ అక్షరాలు కనబడుతున్నాయి కదా. వాటి నడుమ కనీకనబడకుండా ఇంగ్లీష్ ‘N’ అక్షరం వుంది. దాన్ని కూడా కనిపెట్టేశారంటే ఒక పనయిపోతుంది.

MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMNMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
అబ్బో! గట్టివాళ్ళే! మీవి  డేగ కళ్ళు సుమా. మూడింట్లోను  నెగ్గారు. అంటే అర్ధం ఏమిటి?
చక్కగా పనిచేస్తున్నవి మీ కళ్ళు మాత్రమే కాదు. మీ నాడీ వ్యవస్థ కూడా బాగా వుందన్న మాట. మీ మెదడు యెంత బాగా పనిచేస్తోందంటే - ‘ఆల్జిమీర్స్’ వ్యాధి వచ్చే అవకాశాలు ఆమళ్ల దూరంలో కూడా లేనట్టే.
తోకపిట్ట : నెట్ లో ఇలాటి జోకులు మామూలే! హాయిగా నవ్వేసి వూరుకోండి నాలాగే!
(22-11-2011)

19, నవంబర్ 2011, శనివారం

తెరిపినపడ్డ కాంగ్రెస్


తెరిపినపడ్డ కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు



ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఏంచేయాలి. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పాలి. కానీ సాధారణంగా జరిగేదేమిటి ?  పక్క వాటాలో కూడా కరెంట్ వుందో లేదో అని ఓ కంట కనిపెట్టిచూడడం మానవ నైజం. తనకు నష్టం జరిగిందన్న బాధ కన్నా పక్కవారికి కూడా అదే జరిగితే సంతోషించే రోజులివి.
సీ.బీ.ఐ. దర్యాప్తులకు న్యాయస్తానాలు ఆదేశిస్తున్న ఉదంతాలపై  ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరు కూడా ఈ స్వభావాన్నే సూచిస్తోంది.
ఏమయితేనేం! చేతులారా తెచ్చిపెట్టుకున్న సమస్యలతో కుడితినపడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలం తరువాత చక్కని  ఊరట దొరికింది.
జగన్ అండ చూసుకుని కొరకరాని కొయ్యలుగా తయారయిన కొందరు ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక నిస్సహాయస్తితిలోవున్న అధికార కాంగ్రెస్ కు, కోర్టు ఆదేశాలపై సీ.బీ.ఐ. ప్రారంభించిన జగన్ ఆస్తుల కేసు విచారణ  కొంత ఊరటనిస్తే,  చంద్రబాబు అధికార దుర్వినియోగం గురించి హైకోర్టు ఆ  సీ.బీ.ఐ. నే దర్యాప్తుచేయమని తాజాగా ఆదేశించడం పూర్తి ఊరటను ఇచ్చింది. అటు  సీమాంధ్ర లో పూర్తిగా, ఇటు తెలంగాణలో ఓ మోస్తరుగా  ఏకుమేకై కూర్చున్న వైఎస్సార్ పార్టీని, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా యెలా ఎదుర్కోవాలో తెలియని పరిస్తితిలో బాగా డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామాలు కొత్త ఊపిరి పోస్తున్నాయి. సరికొత్త ఆశలు  చిగురింపచేస్తున్నాయి.
కారణాలు ఏమయితేనేం, కారణ’భూతం’ ఏదయితేనేం చాలాకాలం తరువాత, అదీ ఏడాది పాలన పూర్తిఅవుతున్న తరుణంలో ‘కిరణ్ సర్కార్’ కొంత తెరిపిన పడింది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే కాబోలు (18-11-2011)   


           

15, నవంబర్ 2011, మంగళవారం

ఎటు పోతున్నాం? – భండారు శ్రీనివాసరావు


ఎటు పోతున్నాం? – భండారు శ్రీనివాసరావు

సామాన్యుడికోసం రూపొందిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఇటీవలి కాలంలో అసామాన్యులకోసం నిర్విరామంగా పనిచేస్తున్న క్రమంలోఅవి  క్రమక్రమంగా తమ పూర్వ వైభవాన్ని కోల్పోతున్నాయనే చెప్పాలి. ఈ వ్యవస్థలు దారితప్పినప్పుడు సరిదిద్ది గాడిన పెట్టాల్సిన కర్తవ్యం  భుజస్కందాల మీద వున్న ‘మీడియా’ సైతం ఆరోపణల నీలినీడలను తప్పించుకోలేకుండా వుండడం మరో విషాదం.
ప్రత్యర్ధి పార్టీలను  నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం రాజకీయ రంగంలో చాలా సహజమయిన విషయం. ఎన్నికల్లోనూ, ఇతరత్రా కూడా ఈ లక్ష్య సాధనకోసం రాజకీయ పార్టీలు పనిచేస్తూనే వుంటాయి. నైతికంగా ఇది తప్పే అయినా రాజకీయకోణం నుంచి చూస్తే వాటికి ఇది  తప్పనిసరి వ్యవహారం. అందుకే ఎన్నికల్లో తేలని విషయాలను న్యాయస్తానాల ద్వారా తేల్చుకోవాలని ప్రయత్నించడం ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. ఒకరకంగా చెప్పాలంటే సివిల్ కేసుల్లో సెటిల్మెంట్ మాదిరి. భూములు, ఆస్తి తగాదాలను పరిష్కరించే మిషతో లావాదేవీలు నడిపే పోలీసు అధికారులు, ఇతర సంబంధిత సిబ్బంది - ‘కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో! మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం!’  అనే రీతిలో హామీలు ఇస్తుండడం కద్దు. కోర్టు నిర్ణయాలను ప్రశ్నించడం కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది కాబట్టి సెటిల్మెంట్  వ్యవహారాలు నడిపేవారికి మరింత వెసులుబాటుగా మారింది. ఇప్పుడిది రాజకీయ పార్టీలకు కొత్త అస్త్రంగా తయారయింది.
మొన్నటికి మొన్న జగన్ మోహన రెడ్డి పై ఇదే బాణం ఎక్కుబెట్టారు. మళ్ళీ ఈ రోజున అదే బాణం చంద్రబాబు వైపు తిరిగింది. అధికారం అండగా చేసుకుని ఆర్ధిక నేరాల ఆరోపణల్లో చిక్కుకున్న వారిపై దర్యాప్తులు జరిపి నేరం రుజువు చేస్తే తప్పుబట్టేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అలా కాకుండా ఇది కేవలం రాజకీయ కక్షలను సెటిల్ చేసుకునే  క్రమంలో సాగే వ్యవహారం అయితే పరిణామాలు దారుణంగా వుంటాయి. పొరుగున వున్న  తమిళనాడులో ఈ విష సంస్కృతి ఇప్పటికే  వూడలు దిగివుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అక్కడి పార్టీలు  ప్రత్యర్ధులపై కక్షలు తీర్చుకునే విధానాలు ఏ మేరకు దిగజారాయో అందరికీ తెలిసిన విషయమే. కాకపొతే  గుడ్డిలో మెల్ల అన్నట్టు    అక్కడి ప్రధాన పార్టీల వాళ్లు తమ  పోరాట క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే రీతిగా నడుచుకోరు. కానీ మన రాష్ట్రంలో పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. అందుకే రాజకీయ సెటిల్మెంట్ల వ్యవహారం ఇంతగా ఆందోళన కలిగిస్తోంది.
ఇది ఒక పార్శ్వం. దీన్ని మించిన  ప్రమాదకరమయిన పరిణామం మరొకటి వుంది.
జగన్ మోహన రెడ్డి మీద సీ.బీ.ఐ. దర్యాప్తుకు కోర్టు ఆదేశించినప్పుడు ఆయనకు చెందిన సాక్షి పత్రిక, సాక్షి టీవీ-   కొన్ని పత్రికలు, మరికొన్ని  మీడియా సంస్తలు అందిస్తున్న సమాచారంపై అనేక ఆరోపణలు చేశాయి. దర్యాప్తు క్రమంలో ప్రచురితమవుతున్న వార్తలను అభూతకల్పనలుగా కొట్టివేశాయి. నాలుగు గోడలమధ్య జరుగుతున్నవిచారణ సంగతులను  అక్షరం పొల్లుపోకుండా కళ్లకుకట్టినట్టు వైనవైనాలుగా వర్ణించి రాయడం  ఫక్తు  ‘ఎల్లో జర్నలిజం’ అని అభివర్ణించాయి. మీడియాలో ఒక వర్గం చంద్రబాబుకు కొమ్ముకాస్తోందని ఆరోపించాయి. గత కొద్ది రోజులుగా సాగుతూ వస్తున్న  తతంగం ఇది.
సాక్షి అభియోగాలను ఖండించాల్సిన అగత్యం ఆ మీడియాకు వుండకపోవచ్చు. కాకపొతే తాము ఇన్ని రోజులు నిస్పాక్షికంగా వార్తలు అందిస్తున్నామనీ, ఎవరిపైనో  బురదజల్లే వార్తాకధనాలు అందించడం లేదని నిరూపించుకునేందుకు  వాటికి ఇప్పుడొక సువర్ణావకాశం లభించింది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీ.బీ.ఐ. ఇక ముందు జరపబోయే దర్యాప్తు గరించి కూడా మునుపటి విధంగానే,  అదేవిధమయిన రీతిలో వార్తా కధనాలను అందించగలిగితే సాక్షి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోతుంది. రాజకీయ దురుద్దేశాలతో వార్తలు వండివారుస్తున్నారన్న అపప్రధ కూడా తొలగిపోతుంది. (15-11-2011)                   

రాజకీయ నీరజాక్షులు - భండారు శ్రీనివాసరావు


 వార్త – వ్యాఖ్య

“........తను నిర్దోషినని నమ్ముతున్నట్టయితే  సీ.బీ.ఐ. దర్యాప్తుని నిర్భయంగా ఎదుర్కోవాలి.”
“........ఏ తప్పూ చేయకపోతే దర్యాప్తుకు సహకరించి అగ్ని పునీతుడిలా బయట పడాలి”
“........కోర్టు ఆదేశాల ప్రకారం జరిగే దర్యాప్తు. రాజకీయకక్షతో చేస్తున్నారన్న అనుమానాలు నిరాధారం”
నిన్నా ఇవ్వాళా వినబడుతున్న ఈ మాటలన్నీ ఈ మధ్యనే ఎక్కడో  విన్నట్టుంది కదూ. ఎవరో ఒకరు అన్నట్టుంది కదూ.
ఇదే రాజకీయం అంటే. ఈ రాజకీయ నీరజాక్షులు సమయం కోసం ఎదురు చూస్తుంటారు. రాగానే మాటకు మాట అప్పజెప్పి ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పు వారిది కాదు కదా. అంతకు ముందు ‘ఈ ఆట’ మొదలుపెట్టినవారికి కూడా ఇందులో  కొంత భాగముంటుంది కదా.
అందుకే అన్నారు ఒకరిపై వేలెత్తి చూపితే నాలుగువేళ్ళు మనవైపు చూస్తుంటాయని. కాకపొతే, ఇది తెలియని అజ్ఞానులెవరూ లేరు. తెలియనట్టు వుంటారంతే. (15-11-2011)    

6, నవంబర్ 2011, ఆదివారం



మితిమీరిన మీడియా ఉత్సాహం




(సత్యం రామలింగరాజు ఆర్ధిక నేరాల ఆరోపణల ఉచ్చులో చిక్కుకుని అరెస్ట్ అయినప్పుడు – ఆ నాటి సత్యం సామ్రాజ్యానికి ‘షేర్ల’ రూపంలో పెట్టుబడులు పెట్టి ఆ తరవాత గగ్గోలు పెడుతున్న నేపధ్యంలో - ఆరోజుల్లో నేను  రాసిన ఒక ఆర్టికిల్  ని  – రాజు గారికి బెయిల్ దొరికి ఇంటికి చేరుకున్నారన్న సంగతి తెలిసి  దాన్ని మళ్ళీ  పోస్ట్ చేస్తున్నాను. రాజు గారికీ నాకూ ఏవిధమయిన వ్యక్తిగత పరిచయం లేదన్న విషయం గమనంలో వుంచుకోవాల్సిందిగా మనవి – భండారు శ్రీనివాసరావు - 06-11-2011-)









నిప్పులు చిమ్ము కుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు -

నెత్తురు కక్కుకుంటూ
నేలకు నేరాలిపోతే
నిర్ధాక్షిణ్యంగా వీరే!                     -శ్రీశ్రీ


ఒక మహావృక్షం కూకటి వేళ్లతో కూలిపోతున్న దారుణ దృశ్యం గతవారం విశ్వవ్యాప్తంగా ఆవిష్కృతమైంది.  శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని జీవిస్తున్న లెక్కకు మిక్కిలి బుద్ధిజీవులు,  సమృద్ధిజీవులు, మాన్యులు, సామాన్యులు, లబ్ధిదారులు, ప్రారబ్ధదారులు ఆ విషాదాంతాన్ని మౌనంగా, జాలిగా, కసిగా, ఆగ్రహంగా, బరువెక్కిన గుండెలతో, చెమ్మగిల్లిన కళ్లతో గమనిస్తూ వచ్చారు. కొందరికిది కడుపుకోత. మరికొందరికి కడుపుమంట. కొందరిది వేదన. మరికొందరిది ఆవేదన.



ఏళ్ల తరబడి శిలా సదృశ్యంగా నిలబడి,  నిరంతర శ్రమతో,  నిర్విరామ కృషితో,  మొక్కవోని పట్టుదలతో-  ఆకాశం అంచులు తాకేలా నిర్మించుకున్న సువిశాల, సుందర సౌధం పునాదులు కళ్లెదుటే కదలిపోయాయి.


సత్యమేరా జీవితం - సత్యమేరా శాశ్వితం
 `సత్యమైట్లు' గా -  సగర్వంగా చెప్పుకుంటూ, వర్తమాన సమాజంలో పరువుతో, పరపతితో నెగ్గుకొస్తున్న వేలాదిమంది యువతీ యువకుల కలలన్నీ వారి కనురెప్పల కిందే కరగిపోయాయి. నిన్నటివరకూ ఎదురులేని సత్యం. నేటికది  చెదిరిన స్వప్నం.

ఒక మెగా సంస్థ మహా పతనం గురించీ, దానికి కారణాలు గురించీ పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలతో, వార్తలతో, వార్తా కథనాలతో మీడియా రగిలించిన వేడి అంతా ఇంతా కాదు. సత్యం సంస్థ ఉత్థాన పతనాలకు కారకుడైన రామలింగరాజు కథ చంచల్‌గూడా జైలుకు చేరింది. ఈ పరిణామ క్రమాన్ని గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఈ ఉదంతంలో దాగున్న మరో కోణాన్ని స్పృశించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఆర్ధిక నేరాలు మనదేశానికి కొత్తవేమీకాదు. నూతన ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కూడా ఇవి జరిగాయి. స్వతంత్ర భారతంలో స్వదేశీ నౌకా పరిశ్రమ ఆవిర్భావానికి, అభివృద్ధికీ ఆద్యుడూ, మూలకారకుడూ అయిన తెలుగుతేజం జయంతి షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థాపకుడు ధర్మతేజ చరిత్రే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

సత్యం రామలింగరాజును హర్షద్‌మెహతా, కృషి వెంకటేశ్వరరావు, కోలా కృష్ణమోహన్‌ వంటి వారితో ముడిపెట్టి వార్తాకథనాలు వెలువరించిన మీడియా అత్యుత్సాహం అర్థం చేసుకోలేని అధమస్థాయిలో ఉంది. సామాజిక సేవా కార్య కలాపాల విషయంలో కానీ, నిర్మాణాత్మక దక్షాదక్షతల విషయంలోకానీ, సిబ్బంది మంచి చెడులను కొసకంట కనిపెట్టి చూసేవిషయంలో కానీ -  రాజుకీ, వారికీ ఏమాత్రం సాపత్యం లేదు సరికదా నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆశ, అత్యాశ, దురాశల నడుమ ఉన్న అంతరాన్ని అర్ధం చేసుకోవడంలో విశ్లేషకులు విఫలమయ్యారు. ఆశ చచ్చినా, దురాశపుట్టినా ఆ మనిషి చచ్చిన వాడితో సమానమంటారు. పెంచి పెద్ద చేసిన సంస్థను కాపాడుకోవాలనే ఆత్రంతో, అత్యాశతో వేసిన అడుగు రామలింగరాజుదయితే, రెండో వర్గంవారిది దురాశతో కూడిన దుస్తర మనస్తత్వం.

ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఆ నేరాన్ని తమంతతాముగా, విచారణకు ముందే ఒప్పుకోవడం చాలా అరుదయిన విషయం. ఒక రకమైన విషవలయంలో చిక్కుకుపోయి మింగలేకా, కక్కలేకా డోలాయమానంలో కొట్టుకుంటుంటారు. అలాంటిది చేసిన దానికి, జరిగిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటూ, మరెవరి మీదా నెపం మోపకుండా, గరళం మింగిన శివుడిలా రామ `లింగ' రాజు జారీచేసిన `ఒప్పుకోలు' ప్రకటన ఆయన ధీరోదాత్త వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. స్వయం నిర్మిత సువిశాల వ్యాపార సామ్రాజ్యం కళ్లెదుటే కుప్పకూలిపోతున్న స్థితిలో కూడా తన వద్ద పనిచేసే సిబ్బంది బాగోగులను గమనంలో ఉంచుకోవడం ఆయన స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం.


ఇక ఈ మొత్తం ఉదంతంలో రామలింగరాజుకూ, రాష్ట్రప్రభుత్వానికీ లంకెపెడుతూ వెలువడిన వార్తా కథనాలు పత్రికా విలువలకు తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. మితిమీరిన మీడియా ఉత్సాహం ఒక ప్రముఖ సంస్థ పతనాన్ని మరింత వేగిరం చేసింది. తప్పుదిద్దుకునే అవకాశాన్ని దూరం చేసింది.


 `బర్డు ఫ్లూ' వార్తలతో బెంబేలెత్తించి, లక్షలాది కోళ్ల సామూహిక సంహారానికి కారణమైన మీడియా, వేలాదిమంది సత్యం సిబ్బంది ప్రయోజనాలను కాపాడడానికి, తన సొంత ప్రయోజనాలను వదులుకోగలదని ఆశించడం అత్యాశే అవుతుంది.
అదే  జరిగింది కూడా.



 


 ఇక వాటాదారులు విషయం అంటారా!
 మోసం చేసి డబ్బు సంపాదించాలనుకునే నేరగాళ్లకీ, జూదం ఆడి డబ్బు గడించాలనుకునే జూదగాళ్లకీ పెద్ద తేడాలేదు.

సత్యం షేరు ధర చుక్కల్లో ఉన్నప్పుడు ఆ వాటాలు కలిగిన బడాబాబులు ఎంతగా బడాయిలకు పోయారో అందరికీ తెలుసు. ఆడేది జూదం అయినప్పుడు ఆటుపోట్లకి కూడా సిద్ధంగా ఉండాలన్న విషయం కూడా వారు తెలుసుకోవాలి. లక్షలు కోల్పోయామని బాధపడేవారు లక్షణమైన సంస్థను తిరిగి ఎలా నిలబెట్టాలా అన్న విషయం ఆలోచించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నది అదే. నేరాలు చేసిన వారిని విచారించి, నిర్ధారణ చేసే సంస్థలు వేరే ఉన్నాయి. కానీ, తెలుగు గడ్డపై పురుడుపోసుకుని, దిగంతాలకు ఒక వెలుగు వెలిగిన సంస్థ ఆరిపోకుండా చూసుకోవాలి. తమ తెలివితో, మేధస్సుతో ఒక మహా సంస్థ నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బంది భవితవ్యాన్ని కాపాడుకోవాలి. పుడమితల్లి నలుదిక్కులా తెలుగు వెలుగులను విస్తరించిన దీపం కొడిగట్టకుండా కనిపెట్టి చూడాలి. రాజకీయాలన్నవి ఆ పరిధికే పరిమితం కావాలి కానీ, తెలుగు యువత ఉజ్వల భవితకు రేచీకటిగా మారరాదు. ఆ దిశగా అడుగులు వేయడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం.
 అంతేకానీ, ఎద్దుల పోట్లాటలో లేగదూడలు నలిగిపోకూడదు.

-భండారు శ్రీనివాసరావు - జనవరి 2009

NOTE:All the images in the blog are copy righted to the respective owners