28, సెప్టెంబర్ 2011, బుధవారం

వాదించి వగచిన ఏమి ఫలము ? - భండారు శ్రీనివాసరావు



వాదించి వగచిన ఏమి ఫలము ?   - భండారు శ్రీనివాసరావు



తమలపాకుతో నేనిట్లంటే తలుపుచెక్కతో తానిట్లనే



ప్రతి విషయంలో మన వాదనే నెగ్గాలనుకోవడం అవివేకం. కొన్ని కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు. మనకు నచ్చినవి ఎదుటివారికి నచ్చకపోవచ్చు. వాటిని అంగీకరించనంతమాత్రాన పుట్టేమీ మునిగిపోదు.అంగీకరించినంత మాత్రాన నట్టేటిలో కొట్టుకుపోము.  సాటివారితో సర్దుకుపోవడం, సిద్ధాంతాలతో రాజీపడకపోవడం అన్నదే ప్రధానం.

ONE CAN COMPROMISE WITH PERSONS BUT NOT WITH PRINCIPLES.

మొండి వాదనల వల్ల వచ్చేదేమీ  వుండదు - మొండి మనిషన్న  చెడ్డ పేరు రావడం తప్పిస్తే.

(28-09-2011)

(ఇమేజ్ సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత)   

26, సెప్టెంబర్ 2011, సోమవారం

ఆటో నెంబర్ – MH 02 Z 8508 - భండారు శ్రీనివాసరావు





ఎక్కగానే తెలిసిపోయింది మాకు అది అలాటిలాటి అల్లాటప్పా ఆటో కాదని.





మేము కూర్చున్న సీటు ఎదురుగా విమానంలో అమర్చినట్టు ఓ సంచీలో కొన్ని పత్రికలు కనిపించాయి. మాముందు ఓ చిన్న టీవీ సెట్టు వుంది. అందులో కేవలం దూరదర్శన్ కార్యక్రమాలు మాత్రమే పెడతానని డ్రైవర్ చెప్పాడు.


ఆటో ఎక్కిన నాకూ నా భార్యకూ కాసేపు ఆశ్చర్యంతో మాటలు పెగల్లేదు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, డెట్టాల్, దూది కొన్ని మందులు అందులో చూసిన తరువాత.


అంతే కాదు. టీవీ తో పాటు రేడియో, వాల్ క్లాక్, చిన్నపాటి మంటలను అదుపు చేసే పరికరం, కేలండర్, ఇలా చాలా కనిపించాయి. వివిధ మతాలకు చెందిన సింబల్స్ తో పాటు ముంబై ఉగ్రవాదుల దాడిలో హీరోలు గా పేరుతెచ్చుకున్న కామ్టే, కర్కరే, సలాస్కర్, ఉన్నికృష్ణన్ ల ఫోటోలు వున్నాయి.



మేమెక్కిన ఆటోనే కాదు దాని డ్రైవర్ కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలున్నవాడని కొద్ది సేపటిలోనే మాకు తెలిసివచ్చింది.


దారిలో మెల్లగా అతడితో మాటలు కలిపాను. ముందు నా మాటల్లో ధ్వనించిన వ్యంగాన్ని నేను గుర్తించక పోలేదు. కానీ ఆ వెటకారం కాసేపటిలోనే ఆవిరై పోయింది. దాని స్తానంలో అతడిపట్ల తెలియని గౌరవభావం చోటుచేసుకుంది.



హీరోలకే హీరో సందీప్ బచ్చే


ఆ ఆటో రిక్షా డ్రైవర్ పేరు సందీప్ బచ్చే. పెద్దగా చదువుకోలేదు. అందుకే ఓ చిన్న ప్లాస్టిక్ ఫాక్టరీ లో చిన్న ఉద్యోగంలో కుదిరాడు. దురదృష్టం. ఆ ఫాక్టరీ ఎన్నో రోజులు నడవలేదు. అది మూతపడడంతో సందీప్ రోడ్డున పడ్డాడు. కాకపొతే కిరాయి ఆటోతో. ఆటో నడుపుతుండగానే పదేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో కిరాయి ఆటో బదులు సొంత ఆటో నడుపుకునే స్తితికి చేరాడు. ఇద్దరు పిల్లల్నీ స్కూల్లో చేర్చాడు. బతుకు బండి ఓ గాటన పడింది. కానీ అతడు బాట తప్పలేదు. కష్టపడడం మానలేదు. ఉదయం ఎనిమిది గంటలకు ఆటో ఎక్కితే మళ్ళీ ఇంటికి చేరేది రాత్రి పది తర్వాతనే.

“ఇంట్లో వుండి చేసేది ఏమిటి సార్ టీవీ చూడడం తప్పితే. అదే ఆటో పని చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదిస్తే ముందు ముందు పనికొస్తాయి కదా!” అంటాడు అతగాడు.

నిజమే పనికొస్తాయి. తన కోసం కాదు సమాజంలో తనకంటే ఆర్ధికంగా వెనకబడ్డ వాళ్ళ కోసం. ఎంత చక్కటి ఆలోచన.


మాకర్ధమయింది మాకు పరిచయం అయిన వ్యక్తి మామూలు మనిషి కాదని. పని విలువ, జీవితం విలువ తెలిసిన ముంబై నగరానికి అసలు సిసలు ప్రతినిధి అని.

తేనెటీగ లాగా పనిచేసే అతడికి తీరుబాటు సమయం అంటూ ఏమయినా వుందా? వుంటుందా? అదే అడిగాను.

కాస్త మొహమాట పడుతూనే జవాబు చెప్పాడు.

వారానికోసారి అంధేరీలోని వృద్ధ మహిళల ఆశ్రమానికి వెడతాడు. అదనంగా ఏదయినా ఆదాయం లభిస్తే వారికి అవసరమయిన టూత్ బ్రష్ లు, సబ్బులు, తలనూనెలు మొదలయినవి కొనుక్కుని తీసుకువెడతాడు.

ఆటో దిగుతుంటే కళ్ళబడింది.


 


ఆటో మీటర్ కింద ఇలా రాసి వుంది.

“వికలాంగులకు మీటర్ చార్జి లో పాతిక శాతం రాయితీ. యాభయి రూపాయల వరకు అంధులకు ఆటో ప్రయాణం ఉచితం.”

నాకూ మా ఆవిడకు అతడు ఆటో డ్రైవర్ లాగా కనిపించలేదు. నిజంగా అతడొక హీరో.

మా ప్రయాణం ముగిసింది. ఆ నలభై అయిదు నిమిషాల్లో జీవితం గురించిన కొత్త కోణం మాముందు ఆవిష్కృతమైంది. హీరోలు సినిమాతెరలపైనే కాదు నిజ జీవితాల్లోనూ తారసపడతారు. నిజానికి నిజమయిన హీరోలు సందీప్ బచ్చే లాటి వాళ్ళే.

ఈసారి ఎప్పుడయినా ముంబై వెడితే ఆ ఆటో నెంబర్ గుర్తు పెట్టుకోండి.

-MH 02 Z 8508-


“లక్ష మంది మొహాల్లో నవ్వులు పూయడానికి కారణం కండి. ఒక్కరి వేదనకు కూడా కారణభూతులు కాకండి.” సందీప్ వల్ల మేము నేర్చుకున్న జీవిత సత్యం ఇదే.


(నెట్లో సంచరిస్తున్న ఒక ఆంగ్ల వ్యాసానికి స్వేఛ్చానువాదం – భండారు శ్రీనివాసరావు ) 

ఇందులో ఉపయోగించిన ఫోటోల సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత



23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఏం చేస్తే తెలంగాణా వస్తుంది? – భండారు శ్రీనివాసరావు

ఏం చేస్తే తెలంగాణా వస్తుంది? – భండారు శ్రీనివాసరావు
( 24-09-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 


‘విధులకు గైర్హాజరు అవుతే తెలంగాణా వస్తుందా?’ అని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కోర్టు సిబ్బందిని ప్రశ్నించినట్టు పేపర్లలో వచ్చింది.

సకల జనుల సమ్మె జరుగుతున్నా రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మరో పక్క కితాబు ఇచ్చారు. ఇంకో అడుగు ముందుకు వేసి, వొత్తిళ్ళ ద్వారా కేసీఆర్ తాననుకున్నది సాధించాలనుకుంటే అదెలా కుదురుతుందని ఆమె ప్రశ్నించారు. పరిస్థితులు ప్రశాంతంగా వుండి తమకు అనుకూలంగా వున్నప్పుడే నిర్ణయాలు తీసుకుంటామని అన్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది.

రాష్ట్రంలో తెలంగాణా సాధనకోసం దాదాపు వారం రోజులనుంచి దశలవారీగా సకల జనుల సమ్మె సాగుతున్న నేపధ్యంలో వెలువడిన ఈ రకమయిన వ్యాఖ్యానాలకు ఎవరికి వారు తమదయిన రీతిలో భాష్యాలు చెబుతున్నారు. రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు పార్టీ ప్రతినిధిగా కాకుండా వ్యక్తిగత హోదాలో చేశామని మరో రోజు సమర్ధించుకోవచ్చు. ఆ సంస్కృతి ఈ నాటి రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. కానీ, సకలజనుల సమ్మె ఓ పక్క ఉధృతంగా సాగుతున్న సమయంలో, భావోద్వేగాలు బాగా పెచ్చరిల్లి వున్న తరుణంలో - ఈ రకమయిన వ్యాఖ్యలు వెలువడ్డాయంటే కొద్దో గొప్పో అధిష్టానం మద్దతు లేకుండా ఆమె తన మనసులోని భావాలు బయట పెట్టి వుంటారని అనుకోవడానికి లేదు.

సకల జనుల సమ్మె అనుకోకుండా మొదలయింది కాదు. దీనిని గురించి కడు వివరంగా ఉద్యమకారులు చాలా ముందస్తు సమాచారం ఇచ్చే దాన్ని మొదలు పెట్టారు. అయితే, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తమ రివాజు ప్రకారం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టులేదు. కానీ రాష్ట్రంలోని తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు ఇది మింగుడుపడని వ్యవహారంగా తయారయింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఇతమిద్ధంగా తన విధానాన్ని స్పష్టం చేయకపోయినా, అంత సానుకూలంగా వెంటనే స్పందించే అవకాశాలు మృగ్యమని అప్పడప్పుడు ఢిల్లీ నుంచి వెలువడే ఈ మాదిరి ప్రకటనలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణా విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏ తీరున వుందో టీఆర్ఎస్ నాయకులకు పూర్తిగా తెలియకపోయినా అది ఏ తీరున సాగుతున్నదో ఒక అవగాహనకు వచ్చినట్టు మధ్య మధ్య వారి నాయకులు చేసే ప్రకటనలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. సకల జనుల సమ్మె విజయవంతంగా, ఉధృతంగా సాగుతోందని బాజా భజాయించి చెప్పగల పరిస్థితులు వున్న నేపధ్యంలో మరోసారి కేసీఆర్ నిరాహారదీక్షకు పూనుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వెలువడడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఈ నెలాఖరులో హైదరాబాద్ వస్తున్నారు. ఆయన వచ్చి ఇక్కడి పరిస్తితులను అంచనావేసి పార్టీ అధినాయకురాలికి ఇచ్చే నివేదికే ఈ మొత్తం వ్యవహారంలో కీలకం కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఆజాద్ కు కొట్టిన పిండి. ఆయన హైదరాబాద్ పర్యటనలో కొత్తగా తెలుసుకుని నాయకురాలికి నివేదించే అంశాలు కొత్తగా ఏముంటాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. సీమాంధ్ర నాయకులతో ఆయన ఇప్పటికే అనేకమార్లు సమావేశాలు జరిపారు. వారి అభిప్రాయాలు విన్నారు. తెలంగాణాకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ నివేదికే సిద్ధంగా వుంది. రాష్ట్ర గవర్నర్ కూడా తన నివేదికలు ఎప్పటికప్పుడు పంపుతూనే వుండి వుంటారు. రాష్ట్రంలో పరిస్తితులను గురించి తాజా నివేదికలను కేంద్రానికి పంపుతుండడం గవర్నర్ల బాధ్యత కూడా. ఇన్ని వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది ఈ సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది. వారికి కావాల్సింది మరో రెండేళ్ళ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు. మరో సంగతి. తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహ కర్తల ఆలోచన కావచ్చు.

‘ఇలా’ చేయడంవల్ల తెలంగాణా వస్తుందా? అని ఎద్దేవాగా అడగడంలో బహుశా అంతరార్ధం ఇదేనేమో.



వెనకటికి ఇంట్లో అమ్ముమ్మలు పిల్లలకు చెప్పే కధల్లో ఓ ముసలమ్మ బావి గట్టుమీద కూర్చుని సూదిలో దారం ఎక్కిస్తుంటే సూది బావిలో పడిపోతుంది. ‘ఊ’ కొడుతూ కధ వింటున్న పిల్లలు ‘ఊ’ అంటారు. ‘ఊ’ అంటే వస్తుందా అని కధ చెప్పే అమ్ముమ్మ ప్రశ్న. అది అర్ధం కాని పిల్లలు ‘ఆ!’ అంటారు. ‘ఆ!’ అంటే వస్తుందా అని మరో ప్రశ్న. ఆ కధ ఎప్పటికీ పూర్తవదు, ఈ లోగా కధ వినే పిల్లలు ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. (20-09-2011)

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సర్కారు దోపిడీ - భండారు శ్రీనివాసరావు




సర్కారు దోపిడీ - భండారు శ్రీనివాసరావు

"భార్యతో పాటు రెండు కార్లను కూడా పోషించాలి" 


పెట్రోలుకు మండే గుణం సహజం. పెట్రోలు ధరలు కూడా మండిపోతూ వుండడం గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం. అలాగే ఈ ధరలు మండినప్పుడల్లా ప్రతిపక్షాలు ఒక్క తాటిపై లేచి మండిపడడం కూడా కొత్తేమీ కాదు. కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఒకతీరుగా, ప్రతిపక్షాల పాత్రలో వున్నప్పుడు మరో విధంగా స్పందించడం చూస్తుంటే రాజకీయ పార్టీల్లో చిత్తశుద్దికన్నా ఏదో మొక్కుబడి ప్రకటనలు చేసి వూరుకోవడం అన్న ధోరణే బాగా కనబడుతోంది. నాటకీయంగా నాలుగురోజులు ఎడ్లబండ్ల ప్రయాణాలు, ధర్నాలు , రాస్తారోఖోలు చేయడం మినహా పెట్రో ధరలను అదుపు చేయడం అంత సులభం కాదని రాజకీయాల్లో అక్షరాభ్యాసం చేసిన వారికి కూడా ఈ పాటికి వొంటబట్టే వుంటుంది.

పెట్రోలు ధరలు మళ్ళీ పెంచారు.మళ్ళీ పెంచారు అనడం కంటే ఇంకోసారి పెంచడానికి వీలుగా మరోసారి పెంచారు అనడం సబబుగా వుంటుంది. ఎందుకంటె పెంచడం ఇది ఆఖరు సారీ కాదు, మళ్ళీ పెంచరన్న పూచీ కూడా లేదు.

పెట్రోలు ధరలు పెంచాల్సినప్పుడల్లా, దానికి కారణమయిన కేంద్ర ప్రభుత్వం – అది ఇప్పటి యూ.పీ.యే. కావచ్చు ఒకప్పటి ఎన్.డీ.యే. కావచ్చు – చెప్పే సంజాయిషీ ఒక్కటే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడంలేదన్న పడికట్టు పదాన్నే అటుతిప్పీ ఇటు తిప్పీ వారు జనం మీదికి వొదులుతుంటారు. కానీ ఈ సారి లీటర్ ఒక్కింటికి మూడు రూపాయల పైచిలుకు ఒక్కమారుగా పెంచిన సందర్భంలో పాలకులు ఇచ్చిన వివరణ వేరుగావుంది. మన రూపాయి మారకం విలువ అతి దారుణంగా పడిపోయిందట. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ – రూపాయి మారకం విలువలో వచ్చిన తేడాల భారత ఆయిల్ కంపెనీలకు లీటరుకు రెండు రూపాయల పైచిలుకు నష్టం వస్తున్నదట. ఆ కారణంగా పెట్రోల్ రిటైల్ ధరను లీటరుకు మూడు రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు దయతో అనుమతి ఇచ్చిందట. అందువల్ల భారీగా పెంచిన ధరను జనం మంచిమనసు చేసుకుని భరించాలట. పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా గ్రామఫోన్ రికార్డులా వినిపించే వివరణే ఇది. ఇక ఏమి చెప్పుదు సంజయా అని విలపించడం ఒక్కటే పాలితులకు మిగిలింది. రూపాయి విలువ పడిపోయినప్పుడు ఎగుమతుల ద్వారా ఆదాయం పెరగాలి. కానీ ఈ విషయం ఏ వివరణల్లోను కానరాదు. సమయానుకూల మతిమరపుకు ఇది చక్కని ఉదాహరణ.

చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని, ఆ నష్టాలను భరిస్తూ రావడం వల్ల సర్కారు ఖజానాకు గండి పడుతోందని, అప్పుడప్పుడు ఇలా ధరలను పెంచడం ద్వారా ఆ గండిని ఓ మేరకయినా పూడ్చుకోవాలని

ప్రభుత్వం వాదిస్తుంటుంది. నిజమే నష్టాలు వచ్చే వ్యాపారం చేయమని ఎవరూ కోరరు. కానీ ఈ వాదనలో వున్న పస ఎంతన్నదే సాధారణ జనం అడిగే ప్రశ్న. పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరల్లో సగభాగానికి పైగా వున్న పన్ను భారాన్నితగ్గించి సామాన్యులకు ఎందుకు వూరట కలిగించరు? అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వాలనుంచి సమాధానం దొరకదు.

ఆయిల్ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయా, నష్టాలను మూటగట్టుకుంటున్నాయా అనేది వినియోగదారుడికి సంబంధించినంత వరకు ఒక ప్రశ్నే కాదు. వాటి నిర్వహణ శైలి గమనించే వారికి అవి నష్టాల్లో వున్నాయంటే ఒక పట్టాన నమ్మబుద్ది కాదు. అసలిన్ని కంపెనీలు అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒక్కొక్క కంపెనీ, తన అధికారులు, సిబ్బంది జీత భత్యాలపై పెడుతున్న ఖర్చు చూస్తుంటే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. అలాగే, పెట్రో కంపెనీలు ప్రకటనలపై పెడుతున్న ఖర్చు అంతా ఇంతాకాదని ఓ మోస్తరు లోకజ్ఞానం వున్న వాళ్లకు కూడా ఇట్టే అర్ధం అవుతుంది. పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు ఇచ్చి వ్యాపారాభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకు వుందో ఆ కంపెనీలే ఆలోచించుకోవాలి. నిజంగా నష్టాలు వస్తున్నప్పుడు ఆధునికీకరణ పేరుతొ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఎంత వుంది? నష్టాలు వస్తున్నప్పుడు వాటినుంచి బయటపడడానికి ఖర్చు తగ్గించుకోవడం ఒక్కటే సులువయిన మార్గం. ఇది తెలుసుకోవడానికి అర్ధశాస్త్రంలో పట్టాలు అక్కరలేదు. ఇవన్నీ చూసేవారికి నష్టాలు, సబ్సిడీల పేరుతొ ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతున్నట్టు చేస్తున్న ప్రకటనల్లో ఏదో డొల్లతనం వున్నట్టు ఎవరయినా అనుమానిస్తే వారిని తప్పు పట్టలేము.

లెక్కలు,డొక్కలు అన్నవి సాధారణ వినియోగదారుడికి అక్కరలేని విషయాలు. అతనికి తెలిసిందల్లా ధర పెంచినప్పుదల్లా అతడి జేబుకు ఎంత చిల్లి పడుతున్నదన్నదే. దాన్నిబట్టే అతడి స్పందన వుంటుంది. కానీ అది అరణ్య రోదనే కూడా అతడికి తెలుసు. అతడి అసహాయత సర్కారుకు తెలుసు. తరుణం వచ్చేవరకు జనం ఏమీ చెయ్యలేరన్న ధీమా పాలకుల చేత చెయ్యకూడని పనులు చేయిస్తుంటుంది. కానీ, విషాదం ఏమిటంటే ఆ తరుణం అంటే వోటు ద్వారా పాలకులను మార్చే సమయం ఆసన్నమయినప్పుడు అప్పటి సమస్యలు తెరమీదకు వస్తాయి. ఇప్పటి సమస్యలు తెర మరుగుకు వెడతాయి. సామాన్యుడి ఈ బలహీనతే సర్కారు బలం. ఈ సూక్ష్మం తెలిసినవారు కనుకనే రాజకీయ నాయకులు వారు ఏ పార్టీ వారయినా ఇన్ని నాటకాలు యధేచ్చగా ఆడగలుగుతున్నారు.

ఈరోజున దేశంలో సాధారణ పౌరులు అనేక వర్గాలనుంచి దోపిడీలకు గురవుతున్నారు. పెట్రో ధరలను పెంచడం ద్వారా, లేదా కనీసం వాటిపై పన్నులను తగ్గించకపోవడం ద్వారా సర్కారు కూడా ఈ దోపిడీదారుల సరసన చేరుతోంది.(16-09-2011)

(కార్టూనిస్ట్ / ఇమేజ్ సొంతదారుడికి కృతజ్ఞతలు - రచయిత)



14, సెప్టెంబర్ 2011, బుధవారం

మోసం గురూ - భండారు శ్రీనివాసరావు


మోసం గురూ



అనగనగా ఒక వూరు.


వున్నట్టుండి ఓ రోజున ముక్కూమొహం తెలియని వ్యక్తి ఒకడు తన సహాయకుడిని వెంటబెట్టుకుని ఆ వూరు వచ్చాడు. వచ్చీరాగానే రచ్చబండ దగ్గర వూళ్ళో వాళ్ళతో భేటీ అయ్యాడు.


‘నాది కోతుల వ్యాపారం. ఒక్కో కోతికీ పది వరహాల చొప్పున ఇస్తాను. పోయి కోతుల్ని పట్టుకు రండి.’ అని చెప్పాడు.


గ్రామస్తులకి మతి పోయింది. వూరికి వున్నదే కోతుల బెడద. పట్టుకువచ్చి ఒప్పచెబితే పది వరహాలంటు న్నాడు. బేరం భేషుగ్గావుంది. కోతుల పీడా వొదలడంతో పాటు నాలుగు రాళ్ళు కూడా వొళ్ళో పడతాయి.


వూరి జనమంతా పొలోమని కోతుల వేటలో పడ్డారు. మాట ఇచ్చినట్టే ఆ కోతుల బేహారి, కోతికి పది వరహాల చొప్పున లెక్కకట్టి మరీ చేతులో పెడుతున్నాడు. తెచ్చిన కోతిని తెచ్చినట్టు ఒక పెద్ద బోనులో పడేసి మేపుతున్నాడు.


కొన్నాళ్ళకు వూళ్ళోనే కాదు చుట్టుపక్కలకూడా కోతుల సంఖ్య తగ్గడం మొదలయింది. దాంతో బేహారి ధర పెంచాడు. ఒక్కో కోతి రేటు ఇప్పుడు అక్షరాలా పదిహేను వరహాలు.


కొన్నాళ్ళకి కోతుల కొరత మరీ ఎక్కువయింది. పదిహేను కాదు పాతిక వరహాలన్నాడు. జనం పెరుగుతున్న ధర చూసారు కానీ అందులో మర్మం ఏమిటో ఎవ్వరికీ అర్ధం కాలేదు. బేహారి కూడా కొన్న కోతుల్ని మారు బేరానికి అమ్మడం లేదు. తెచ్చిన కోతుల్ని తెచ్చినట్టు బోనులోనే వుంచుతున్నాడు. మనకు రావాల్సింది మనకు చెల్లిస్తున్నప్పుడు అతడా కోతుల్ని ఏం చేసుకుంటే మనకెందుకు అని జనమే సర్దిచెప్పుకున్నారు.


అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ వ్యాపారి రేటు యాభయి వరహాలకు పెంచాడు.


తమ పంట పండిందనుకున్నారు గ్రామస్తులు.


ఓ రోజు ఆ వ్యాపారి కోతుల కొనుగోలు వ్యవహారం సహాయకుడికి ఒప్పచేప్పి వ్యాపారపు పనులమీద పట్నం వెళ్లాడు.


అతడలా వెళ్ళగానే అతడి సహాయకుడు వూల్లోవాళ్లని పిలిచి చెప్పాడు.


‘ఆ బోనులో మేం కొన్న కోతులన్నీ అలాగే వున్నాయి చూశారు కదా. నేను మీకు వాటిని ముప్పయ్ అయిదు వరహాలచొప్పున అమ్ముతాను. మా వాడు వూరినుంచి రాగానే మీరు వాటిని యాభయికి అమ్మేయండి. శ్రమలేకుండా మీకు పదిహేను వరహాలు మిగులుతాయి.’


గ్రామస్తులకు మతులు పూర్తిగా పోయాయి. కోతులు అమ్మి సంపాదించిందే వారి దగ్గర చాలా వుంది. ఇక ఇప్పుడో ఇలా ఇచ్చి అలా తెచ్చుకోవడమే. వ్యాపారి సహాయకుడు చెప్పిన మాటలతో వారికి కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరపడ్డారు.పెళ్ళాం నగలు కుడువబెట్టీ, హెచ్చు వడ్డీలకు అప్పులు తెచ్చి కోతికి ముప్పయి అయిదు వరహాల చొప్పున ఆ సహాయకుడికి చెల్లించి వున్న కోతులనన్నింటినీ కొనుగోలుచేశారు.


అంతే. మర్నాటి నుంచి ఆ వ్యాపారి కానీ అతడి సహాయకుడు కానీ మళ్ళీ వాళ్లకు కనిపిస్తే వొట్టు.


ఆనాటి వరహాల రోజులనుంచి ఈ నాటి రూపాయల కాలం దాకా ఇదే తంతు.


మోసం చేసేవాళ్ళు మారలేదు. మోసగించబడే వాళ్లు మారలేదు.


మోసం చేసే తీర్లు ఏమన్నా మారుతున్నాయేమో.

(షేర్ సింగ్ లు చేసే మాయాజాలాల గురించి అంతర్జాలంలో షికారు చేస్తున్న ఆంగ్ల గల్పికకు స్వేచ్చానువాదం)

14-09-2011






















13, సెప్టెంబర్ 2011, మంగళవారం

9/11 - తలకెక్కని చరిత్ర పాఠాలు - భండారు శ్రీనివాసరావు

9/11 - తలకెక్కని చరిత్ర పాఠాలు - భండారు శ్రీనివాసరావు


9/11




ఈ రెండంకెలు అమెరికన్ ప్రజల మనస్సులో ఎంత బలంగా నాటుకు పోయాయంటే పదేళ్లు గడిచిన తరువాత కూడా సెప్టెంబర్ 11 వ తేదీన జరిగిన ఘోర సంఘటనను వారెవ్వరూ మరచిపోలేకుండా వున్నారు. న్యూ యార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాదుల వైమానిక దాడికి గురయి పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు కదలాడుతూనే వుండి వుండాలి.

ఈ దాడి జరిగి మొన్నటికి పదేళ్లు గడిచాయి. ఇందులో ప్రాణాలు కోల్పోయిన దాదాపు మూడువేలమంది తాలూకు కుటుంబ సభ్యులు ఆ దుఖం నుంచి, ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనబడదు. అలాగే, అమెరికన్ అగ్రరాజ్య అభిజాత్య అహంకార పూరిత చర్యల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ఇన్నేళ్ళుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. వారి కుటుంబాల పరిస్తితి ఇదే. ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరికోసం అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో ఇదొకటి.

తన అధికారానికీ, తన పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి కబళించడానికి వచ్చిన తరువాత కానీ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రతీకారేచ్చలతో అట్టుడికి పోతున్న రెండు వైరి వర్గాల మధ్య పోరు నిరంతరంగా సాగుతోంది. ఈ కారణంగా ప్రపంచదేశాలకు నిష్కారణంగా జరుగుతున్న కీడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు.



సెప్టెంబర్ దాడి గురించి మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.

2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని దానితో డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.

అత్తా పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, బహుశా 1968 సెప్టెంబర్ లోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు.

అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.

కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.

అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.

1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విదిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు.

చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.

దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఈ పదేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.

హైదరాబాదులో, ముంబైలో, మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన పేలుళ్లు జనంలో పెచ్చరిల్లుతున్న అభద్రతా భావానికి పునాది రాళ్ళుగా మారుతున్నాయి.

ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు. (13-09-2011)







11, సెప్టెంబర్ 2011, ఆదివారం

సరదాకి - భండారు శ్రీనివాసరావు

సరదాకి - భండారు శ్రీనివాసరావు





‘మీ కుక్క పెరటి గుమ్మంలో అదేపనిగా మొరుగుతోంది. అదేసమయంలో ఇంటి ముందు మీ ఆవిడ తలుపు తీయమని గట్టిగా అరుస్తోంది. ముందు ఎవరికి తలుపు తీస్తావ్?’ అడిగాడు ఏకాంబరం లంబోదరాన్ని.
‘ఇందులో పెద్దగా ఆలోచించేది ఏముంది. ఎంత మాత్రం మతి వున్నవాడయినా ముందు కుక్కనే ఇంట్లోకి రానిస్తాడు. లోపలకు రాగానే అది మొరగడం ఆపేస్తుంది కాబట్టి.' జవాబిచ్చాడు లంబోదరం.



ఏకాంబరం తన తల్లి చనిపోయిన రోజు ఆమె సమాధి వద్ద పూలుపెట్టి తిరిగివస్తుంటే మరో సమాధి వద్ద మోకాళ్ళ మీద నిలబడి ప్రార్ధన చేస్తున్న ఓ వ్యక్తి కనిపించాడు.


‘ఎందుకు అలా హటాత్తుగా చనిపోయి నన్ను తీరని వేదనలో ముంచి వెళ్ళావ్ ! ఇది నీకు ధర్మమేనా!’ అంటూ అతగాడు పెద్దగా ఏడుస్తూవుండడం చూసి ఏకాంబరం ఆశ్చర్య పోయాడు.


‘చనిపోయినవాళ్ల కోసం ఇంతగా బాధపడేవాళ్ళను నేను ఇంతవరకు చూడలేదు. ఇంతకీ పోయిందెవరు’ అని ఆరాతీశాడు.


‘మా ఆవిడ మొదటి మొగుడు’
టపీమని జవాబుచెప్పాడు అతగాడు కాసేపు ఏడుపాపి.







యాత్రలు చేస్తున్న దంపతులకి గైడ్ ఒక బావిని చూపించి చెప్పాడు.
‘అది ఎంతో మహిమ కలిగిన బావి. దానిలోకి తొంగి చూస్తూ మనసులో ఏమి కోరుకున్నా సరే అది వెంటనే జరిగి తీరుతుంది.'


ముందు భర్త బావిలోకి తొంగి చూశాడు.


తరువాత భార్య కూడా అందులోకి తొంగిచూస్తూ ప్రమాద వశాత్తు కాలు జారి అందులో పడి మునిగి పోయింది.
కంగారు పడుతున్న గైడ్ తో మొగుడు అన్నాడు నింపాదిగా.


‘నువ్వు చెప్పింది నిజమే! ఇది చాలా మహిమలు కలిగిన బావి అనడంలో ఎలాటి సందేహం లేదు. మనసులో ఇలా అనుకున్నానో లేదో అలా జరిగిపోయింది.’





ఇంటి ఖర్చులు గురించి భార్యా భర్తా గొడవ పడుతున్నారు.
‘ఎంత డబ్బూ నీ ఖర్చుకు చాలడం లేదు. నాకీ డబ్బే లేకుండా వుంటే ఈ సంసారం ఈ గోల వుండేవి కావు.’ మొగుడు తలపట్టుకుంటూ అన్నాడు.
‘ఇన్నాల్టికి ఓ మంచి మాట చెప్పావు. నీకు ఈ డబ్బే లేకపోతే నీ భార్యగా నేనూ వుండేదాన్ని కాదు.’



చేతిలో మిగిలేవి చిల్లిగవ్వలే !

‘పెళ్లి చేసుకుని సంసారం పెట్టాలంటే ఎంత ఖర్చవుతుంది?’ అడిగాడు ఓ బ్రహ్మచారి ఓ సంసారిని.
‘పెళ్ళయి పాతికేళ్లయింది. ఇంకా చెల్లిస్తూనే వున్నాను కానీ బాకీ చెల్లు కావడం లేదు.’

ఆడ మనసు

‘ఆడవారిని అర్ధం చేసుకోవడం అంటే మాటలు కాదు. పెళ్ళికి ముందు కాబోయే మొగుడి నుంచి ఏవేవో ఆశిస్తారు. పెళ్ళయిన తరువాత అతగాడిని శాసిస్తారు. భర్త చనిపోయిన తరువాత పూజిస్తారు'




పరాశరం ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆ మాట ఆమెతో చెబుతూ ఆమెకోసం నరకానికి వెళ్ళడానికయినా సిద్ధం అన్నాడు


ఇద్దరికీ పెళ్లయింది.


తరువాత అతడన్నదే నిజమయింది.




'పెళ్ళాం దిగడానికి ఎవడయినా కారు డోరు తెరిచి పట్టుకున్నాడంటే ఒకటి మాత్రం నిజం.
ఆ కారయినా కొత్తదయివుండాలి లేదా కొత్త భార్య అయినా అయివుండాలి.'





భార్యను ఎత్తుకుపోయిన కిడ్నాపర్ల నుంచి ఏకాంబరానికి ఫోను వచ్చింది.
‘నీ భార్యను విడిచి పెట్టాలంటే వెంటనే యాభయి లక్షలు ఇస్తానని మాకు మాట ఇవ్వాలి. నువ్వలా ప్రామిస్ చేయకపోతే నీ భార్య తలకోసి పార్సెల్ చేస్తామని మేము వాగ్దానం చేయాల్సివుంటుంది. జాగ్రత్త!’
ఏకాంబరం జవాబు చెప్పాడు.
‘అంత డబ్బు ఇస్తానని మాట ఇచ్చి తప్పలేను. కనీసం మీరయినా మీ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను.’





‘ఎందుకలా సర్వస్వం పోయినట్టు విచారంగా వున్నావు?’


‘భార్యతో గొడవగా వుంది.’


‘అసలేమి జరిగింది?’
‘నాతొ లడాయి పెట్టుకుని ముప్పయి రోజులు నాతో మాట్లాడేది లేదని భీష్మించుకుంది.'
‘దీంట్లో బాధ పడడానికి ఏముంది? అన్నాళ్ళు మాట్లాడకుండా వుంటే మంచిదేగా’
‘కరక్టే. కానీ ఈరోజే చివరి రోజు’

(11-09-2011)



(ఇమేజ్ సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత)