25, ఆగస్టు 2011, గురువారం

“జయ”హో! – భండారు శ్రీనివాసరావు

“జయ”హో! – భండారు శ్రీనివాసరావు


(పూర్తిగా వ్యక్తిగతం – నాకోసం, నావారికోసం రాసుకున్న మనోగతం)




కీర్తిశేషురాలు కొలిపాక జయ  

‘విరిగి పెరిగితి, పెరిగి విరిగితి - కష్టసుఖముల సారమెరిగితి’ అన్న కవి వాక్కు కొందరి విషయంలో అక్షర సత్యం.

కొందరు సుఖపడడానికి పుడతారు. ఇంకొందరు తాము సుఖపడుతూ ఇతరులను కష్టపెడతారు. మరికొందరు కష్టపడడానికి పుడతారు. వారిలో కొందరు కష్టపడుతూ తోటివారిని సుఖపెడతారు. పైన చెప్పిన కవి వాక్కు ఇలాటివారిని గురించే.

మా మేనకోడలు జయ ఈ చివరి కోవ లోనిదే. దానివన్నీ సినిమా కష్టాలే. చిన్న తోటికోడలు వొంటికి నిప్పంటుకుని వొంటింట్లోనే తనువు చాలించింది. అత్తామామలు ఆ తరువాత కొద్దికాలానికే కన్నుమూశారు. కట్టుకున్నవాడు కేన్సర్ బారిన పడి అకాల మృత్యువు పాలయ్యాడు. వున్న ఒక్క కొడుకు డాక్టర్ చదువు పూర్తిచేసి వంశాన్ని ఉద్ధరిస్తాడనుకున్న సమయంలో, చిన్న వయస్సులోనే డాక్టర్లు ఎవ్వరూ కనుక్కోలేని రోగంతో తెలియని లోకాలకు తరలిపోయాడు. తరుముకు వచ్చినట్టు ఒకదానివెంట మరొకటి. రోజులు బాగా గడుస్తున్న రోజుల్లో అవసరాలకు అందరినీ ఆదుకునే ఆమె మనస్తత్వం ఆ తరువాత రోజుల్లో ఆమెకు అక్కరకు వచ్చింది. చిన్నకుటుంబం చింతలు లేని కుటుంబం విధి చూసిన చిన్నచూపుకు చిన్నబోయిన స్తితిలో తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు ఆదరించి చేరదీశారు. ఆత్మీయుల మంచితనం, చనిపోయిన భర్త పుణ్యమా అని వచ్చిన గ్యాస్ ఏజెన్సీ – ఆ చిరు జీవితానికి ఆలంబనగా మారాయి. సొంత కుటుంబంలో ఒక్కొరొక్కరుగా రాలిపోతున్నా గుండె చెడకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకే వేసింది.

జీవితంలో వొడిదుడుకులు, ఆటుపోట్లు అన్నీ వుంటాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడి జీవించడంలోనే మనిషి జీవితానికి సార్ధకత. కష్టనష్టాలకు అదరక బెదరక గుండె నిబ్బరంతో ఎదుర్కొని నిలవాలి. నిలిచి పోరాడాలి. పోరాడి గెలవాలి. తాను అబలని కాదు సబలనే అని నిరూపించుకుంటూ అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలవాలి. ఇదే జయను ముందుకు నడిపించింది. తనవద్ద పనిచేసేవారినే సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ కాలం వెళ్ళదీసింది. కాలుడికి కావలసింది కూడా ఆ మంచితనమే కాబోలు. అందుకే తనవద్దకు చేర్చుకునే క్రమంలో స్వల్ప అనారోగ్యం బారిన పడేశాడు. స్వల్పం అనుకున్నది అనల్పంగా మారింది. అపోలో ఆసుపత్రిలో చేర్పించి నిండా రెండు రోజులు కూడా గడవలేదు. ఈ రోజున జయ ఇక లేదన్న కబురు. నిజంగా ఇది నిజమేనా అన్న సందేహాల నడుమ ఆత్మీయులందరూ కట్టగట్టుకుని ఆసుపత్రికి వెళ్లారు. నిద్రిస్తున్న దేవతలా ధవళ వస్త్రంలో చుట్టిన ఆమె భౌతికదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు.

ప్రతి పుట్టుకా మరణంతో అంతమయ్యేదే. జాతస్య మరణం ధృవం. అన్నీ తెలిసిన విషయాలే. కానీ కొన్ని మరణాలు బాధిస్తాయి. అది మరణించినవారి గొప్పదనం. జయ మరణం అలాటిదే. చప్పున మరచిపోవడం అంత తేలిక కాదు.

‘పెద్దవారిని అమితంగా బాధ పెట్టే విషయమేమిట’ని యక్షుడు ధర్మరాజుని అడిగాడో లేదో తెలియదు. అడిగివుంటే మాత్రం ‘తమ కంటే చిన్న వాళ్లు తమ కంటిముందే రాలిపోవడం’ అని జవాబు చెప్పి వుండేవాడని నేననుకుంటు న్నాను. (25-08-2011)

24, ఆగస్టు 2011, బుధవారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 7 -భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 7 - భండారు శ్రీనివాసరావు

శీర్షికాసనం


రేపు రాయాల్సిన వాక్టూన్ కోసం 
ఆలోచిస్తూ డాబాపై  పచార్లు దోసం 
ఎదురింటి పిల్లకు ఫోజు కోసం 
అనుకుంటే శ్రీమతి అసలుకే మోసం 

(జూన్, 21, 1975  ఆంధ్ర జ్యోతి దినపత్రిక )


క్షుర 'ఖర్మ'






మెడ ముప్పయి డిగ్రీల్లో వంచి 
చెవిదగ్గర కత్తెర టకటక లాడించి 
క్షణాల్లో క్షవరం అయిందనిపించి 
పంపేస్తే ఏం చెప్పాలా క్రాపు గురించి 

(జూన్, 15,1975  ఆంధ్ర జ్యోతి దినపత్రిక )


కార్టూనిష్టులకు/ ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత   

23, ఆగస్టు 2011, మంగళవారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 6 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు  -  6 - భండారు శ్రీనివాసరావు


షరా 'మామూలు'


పండుగ మామూలేమో మనదగ్గర వసూలుచేసి
మనకొచ్చే ఉత్తరాలేమో ఎదురింట్లో ఇచ్చేసి
చక్కాపోయే పోస్ట్ మాన్ని చూసి
పుట్టుకురాదా వొళ్ళంతా కసి

(జూన్, 14, 1975, ఆంధ్ర జ్యోతి దినపత్రిక)


పరీక్షిత్తులు


అర్ధరాత్రి దాకా నిద్దుర కాచి కాచి
చదివిన ఫలితం కోసం వేచి వేచి
పండయితే ఆనందం విరగపూచి
కాయయితే తలిదండ్రితో తప్పదు పేచి 

 (జూన్, 18, 1975,  ఆంధ్ర జ్యోతి దినపత్రిక) 

కార్టూనిస్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత  

22, ఆగస్టు 2011, సోమవారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 5 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 5 - భండారు శ్రీనివాసరావు




ఏ రోడ్డు చరిత్ర చూసినా ......



రోడ్లపైన వరదలా చేరు వాన నీరు
కాలు జారు ప్రమాదాలు అడుగడుగున జోరు
ఒక్క వాన మాత్రంతో రోడ్లతీరు మారు
సైడు కాల్వలుప్పొంగి ఏకమయ్యి పారు

(జూన్, 24, 1975, ఆంధ్రజ్యోతి దినపత్రిక)



కలవని జంట



అద్దానికి దువ్వెనకు వివాదాలు జాస్తి
ఆ రెంటిని  మా ఇంటిలో  కలపాలని చూస్తి
ఎడమొగం పెడమొగం కలవదాయె దోస్తీ
సమయానికి కలిసుంటం ఆ రెంటికి నాస్తి

(జూన్, 19, 1975, ఆంధ్రజ్యోతి దినపత్రిక)

కార్టూనిస్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత

21, ఆగస్టు 2011, ఆదివారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 4 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 4  - భండారు శ్రీనివాసరావు


దర్జాపని



 


చెడకుట్టిన, చెడగొట్టిన  నీవే దిక్కు
అనకుంటే టైలర్ తో అదో పెద్ద చిక్కు
దుస్తులిచ్చునంతవరకు గుండెల్లో బిక్కు
సరిపోవని పక్షంలో తమ్ములకే దక్కు

జూన్, 26, 1975- ఆంధ్ర జ్యోతి దినపత్రిక



 రోడ్డెక్కడ ?





చలి వొంటిని చుట్టినట్టు పట్టె పాడు ముసురు
పొంగి పారు రోడ్డుమీద వాహనాల విసురు
ఎంత వొదిగి నడిచినా బట్టలన్నీ ఖరాబు 
తెల్లదుస్తులన్నింటికి పెట్టెపూజ జవాబు 

జూన్, 29, 1975- ఆంధ్ర జ్యోతి దినపత్రిక 

కార్టూనిస్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత    


ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు – 3 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు – 3 - భండారు శ్రీనివాసరావు


‘ధాం’పత్యం!


సిగరెట్లు తాగడం నిషిద్ధం
అనే శ్రీమతితో రోజూ ఓ యుద్ధం
చేస్తూ వెడితే నా శ్రాద్ధం

అన్యోన్యత అన్నది చక్కటి అబద్ధం


(ఆంధ్ర జ్యోతి, జూన్ 5,1975) 


మాణి౦గ్ వీక్ నెస్



ఉదయం తొమ్మిది గంటలకల్లా

ప్రతి సెంటర్లో అందమయిన బొమ్మల్లా
నిలబడే అమ్మాయిలనల్లా
ఊడ్చుకుపోయే ఉమెన్స్ కాలేజి బస్సు తో ఎల్లా!


(ఆంధ్ర జ్యోతి జూన్ 8,1975)

కార్టూనిస్టులకు, ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు  

20, ఆగస్టు 2011, శనివారం

రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు



బ్రహ్మ లోకంలో విధాత తన పద్మాసనంపై బాసింపట్టు వేసుక్కూర్చుని సృష్టికర్తగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన సతీమణి, హాటుకగర్భురాణి అయిన చదువులతల్లి పక్కనే వుండి ఓరకంట తన భర్త చేతివేళ్లల్లో రూపుదిద్దుకుంటున్న జీవరాశుల్ని తదేకంగా గమనిస్తోంది.

సృష్టికార్యంలో నిమగ్నుడయివున్న బ్రహ్మదేవుడు పక్కన భార్య వున్న సంగతి సయితం మరచిపోయి, ఒక లావణ్యవతి రూపాన్ని రూపొందించి దానికి స్త్రీమూర్తి అని పేరుపెట్టాడు. ప్రాణం పోసి భూమిమీదకు పంపే సమయంలో సరస్వతమ్మకు ‘కరణేషు మంత్రి’ అనే సతీ ధర్మం తటాలున గుర్తుకువచ్చి ‘ఆగండాగండి! తొందరపడి యావత్ సృష్టినే గందరగోళంలోకి నెట్టకండి’ అని వేడుకుంది. వేడుకుంటూనే మరోపక్క మాటల్లో వేడిని కాస్త పెంచి -
‘ఇన్ని తలలున్నాయని పేరే కానీ చేస్తున్నదేమిటో, దాని పరిణామాలేమిటో ఒక్క మారయినా, కనీసం ఒక్క తలకాయతో నయినా ఆలోచించారా ?’ అని వాగ్దేవి తన వాగ్ధాటితో మొగుడ్ని అడ్డుకుంది.

ప్రతిక్షణం లక్షల కోట్ల జీవరాసులను ఒకదానితో మరొకటి పోలిక లేకుండా సృష్టించగల అపారమయిన శక్తియుక్తులున్న ఆ బ్రహ్మదేవుడు కూడా, ఎంతవారలయినా కాంతాదాసులే అన్నట్టు పెళ్ళాం మాటకు బద్ధుడే. అవటాన,

రెండో మాట లేకుండా సతీమణి సలహాకు అంగీకార సూచకంగా మూడు తలలు ఒకేమారు వూపుతూ కాసేపు చేస్తున్న పనికి విరామం ఇచ్చాడు.

అదే అనువుగా తీసుకుని, హితవచన రూపంలో ఆయన అర్ధాంగి వాణి తనదయిన బాణీలో విధాతకు భగవద్గీత బోధించడం ప్రారంభించింది.

‘మీరు సృష్టించిన ఆ స్త్రీ మూర్తి అందాన్ని చూసి ఆడదాన్నయిన నాకే మతిపోతున్నది. ఇక భూలోక వాసుల సంగతి వేరే చెప్పాలా! ఏమయినా సరే ఇటువంటి భూలోక సుందరిని భూలోకానికి పంపడానికి సుతరామూ వీల్లేదు. సత్యలోకంలో కూడా వుంచడానికి ఒప్పుకోను. ఇటువంటి ఆడవాళ్ళ పొడ నాకు గిట్టదు గాక గిట్టదు.’ అని గట్టిగా తెగేసి చెప్పింది.

భగవతి మాటలతో విధాత మూడు తలలు పట్టుకున్నాడు. సత్యలోకం నిబంధనల ప్రకారం ఒకసారి తన చేతులతో సృష్టించిన జీవిని భూలోకానికి పంపకుండా వుండేందుకు వీలులేదు. ఆ సంగతే అర్ధాంగికి అవగతమయ్యేలా చెప్పి తరుణోపాయం కూడా చెప్పి పుణ్యం కట్టుకోమని కోరాడు.

ఎంతకట్టుకున్నవాడయినా, ఎంత తన కట్టుబాట్లలో వున్న మొగుడయినా బ్రహ్మ సామాన్యుడేమీ కాదు. సాక్షాత్తు త్రిమూర్తుల్లో ఒకడు. ఆ ఎరుక ఎరిగినది కనుక సరస్వతి కొంత మెత్తబడింది.

అలా మెత్తబడ్డ వీణావాణి మనసులో ఓ కొత్త ఆలోచన పురుడు పోసుకుంది.

మొగుడు ముచ్చటపడి సృష్టించిన ఆ స్త్రీ మూర్తి అద్భుత సౌందర్య రాశి. అంతే కాదు. పరమాద్భుతమయిన తెలివితేటలూ ఆమె సొంతం. ఇంతటి ప్రతిభాశాలినీ, అసాధారణ ప్రజ్ఞాధురీణనీ అదుపులో వుంచడం మానవమాత్రులకు అసాధ్యం. దాన్ని సాధ్యం చేయాలంటే, ఆ పడతి తన ప్రతిభాపాటవాలను మరచిపోయేలా, అవి మరుగున పడిపోయేలా ఆమె దృష్టిని మళ్లించి, ఆ లలన మనసును ఆకట్టుకోగల మరికొన్నింటిని సృష్టించాలి. చదువులలో సారం తెలిసిన చదువుల తల్లికి ఆ ఆనుపానులేవిటో వెంటనే తెలిసిపోయాయి.

ఫలితం ఆ అందాల సుందరితో పాటే బ్రహ్మ దేవుడు, ఇల్లాలి సలహాపై మరో రెండింటిని సృష్టించి భూలోకానికి పంపాడు. అవే పట్టు చీరెలు, స్టీలు గిన్నెలు.

(ఉపసంహారం: డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి వారం ప్రసారం అయ్యే ‘జీవన స్రవంతి’ అనే కార్యక్రమానికి నేను కర్తా, కర్మా క్రియగా పనిచేస్తున్న రోజుల్లో ఓ వారం ఆ కార్యక్రమంలో భాగంగా పైన పేర్కొన్న ఈ పిట్ట కధ చదివాను. అంతే! ఆనాడు నేను ఆఫీసుకు వెళ్ళగానే రేడియో కార్యక్రమాలలో దిట్టలుగా పేరుగాంచిన నలుగురు మహిళా మూర్తులు, నా సీనియర్లు – తురగా జానకీ రాణి, మాడపాటి సత్యవతి, వింజమూరి సీతాదేవి, సునందిని ఐప్ - నాకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నన్ను చూసిందే తడవుగా ఒక్కుమ్మడిగా నా మీద మాటల దాడికి దిగారు. ‘స్త్రీజాతిని కించబరిచే విధంగా ఇలాటి కాకమ్మ కధలు ప్రసారం చేయడానికి ఎంత ధైర్యం!’ అవటాని కేకలు వేసారు. వయస్సులో, అనుభవంలో వారందరికంటే నేను చాలా చిన్నవాడిని. అంచేత ఆ పెద్దల అక్షింతలను ఆశీస్సులుగా తీసుకున్నాను. హాస్యానికి కూడా ఎవరినీ నొప్పించడం తగదన్న నీతి నాకానాడే బోధపడింది. అందుకే అప్పటినుంచి నా కార్యక్రమంలో నేను ఏనాడు ఎవరినీ కించబరిచే వ్యాఖ్యలు చేయలేదు. ఈ ఉదంతాన్ని కూడా ‘రేడియో రోజులు’ శీర్షిక కింద బ్లాగులో రాయడానికి ఇదే కారణం.

పీ ఎస్: కాకపొతే, ఆనాటి జీవనస్రవంతిని మెచ్చుకుంటూ శ్రోతలు అనేకమంది ఉత్తరాలు రాసారు. అది వేరే సంగతి.)