11, మార్చి 2011, శుక్రవారం

తెలివి ఎవరి సొత్తు? – భండారు శ్రీనివాసరావు

తెలివి ఎవరి సొత్తు? – భండారు శ్రీనివాసరావు


ఓడంటే ఏదో చిన్న ఓడ కాదు. ఓ పెద్ద మేడంత అతి పేద్ద ఓడ. వున్నట్టుండి అంత పెద్ద ఓడా ఓ చిన్న యంత్రం చెడి పోయి ఠక్కున ఆగిపోయింది. ఓడ యజమానికి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఓడ నడిస్తేకానీ ఆయన వ్యాపారం నడవదు. అందుకని ఓడను వెంటనే బాగుచేసేందుకు తక్షణం పెద్ద పెద్ద ఇంజినీర్లకు కబురు పెట్టారు. అంతా హుటాహుటిన వాలిపోయారు కానీ, అంత పెద్ద ఇంజినీర్లకు కూడా ఆ చిన్న యంత్రాన్ని సరిచేయడం వల్ల కాలేదు. దాంతో సిబ్బంది మళ్ళీ ఒడ్డునపడి వెతికి వేసారి మొత్తం మీద ఓ చిన్న మెకానిక్కుని పట్టుకొచ్చారు. చిన్నప్పటినుంచీ ఇలా చిన్నా చితకా రిపేర్లు చేస్తున్న ఆ చిన్న మెకానిక్కు వచ్చీరాగానే అంతా కలయచూసాడు. లోపం ఎక్కడ వున్నదా అని చుట్టూ తిరిగి చూసాడు.
ఓడ యజమాని దగ్గరే వుండి అతడేమి చేస్తున్నాడన్నది అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. వచ్చిన మెకానిక్కు మరో ధ్యాస లేకుండా తన పనిలోనే మునిగిపోయాడు. చెడిపోయిన యంత్రం లోని అన్ని భాగాలను జాగ్రత్తగా తడిమాడు. ఒక చోట ఏదో అనుమానం వచ్చి అక్కడే మరోమారు తడిమి చూసాడు.వెంట తెచ్చుకున్న చేతి సంచీ నుంచి చిన్న సుత్తిని బయటకు తీసాడు. దానితో అక్కడ సున్నితంగా ఓ దెబ్బ వేసాడు. అంతే! ఓడలో ఇంజిను పనిచేయడం ప్రారంభించింది.

ఓడ యజమానికి అతడు చేసిన రిపేరు ఏమిటో అర్ధం కాలేదు. ఎందరో చేయి తిరిగిన ఇంజినీర్లు చేయలేని పని ఇతగాడు ఇంత తక్కువ వ్యవధిలో ఎలా చేయగలిగాడని ముందు ఆశ్చర్య పోయాడు. అతడి ఆశ్చర్యం రెట్టింపయింది ఆ మామూలు మెకానిక్కు అడిగిన మజూరీ విన్న తరవాత. అతడు ఏకంగా లక్ష రూపాయలు అడిగాడు. సుత్తితో చిన్న దెబ్బ వేసినట్టువేసి అంత డబ్బు అడగడం యజమానికి సుతరామూ నచ్చలేదు. అందుకని చెల్లింపు దగ్గర ఓ మెలిక పెట్టాడు. చేసిన పనికి ఐటం వారీ బిల్లు ఇమ్మన్నాడు. ఆ మెకానిక్కు క్షణం ఆలశ్యం చేయకుండా యజమాని కోరిన విధంగా రాసిచ్చాడు. అందులో ఇలావుంది.

“సుత్తితో కొట్టినందుకు కూలీ – రెండు రూపాయలు.
“ఎక్కడ సుత్తితో కొట్టాలో తెలిసి కొట్టినందుకు కూలీ - అక్షరాలా తొంబయి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబయి ఎనిమిది రూపాయలు."
నీతి: పని ప్రధానమే. అయితే ఆ పని ఎప్పుడు ఎలా చేయాలో తెలియడం కూడా ముఖ్యమే. (11-03-2011)



















వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ!– భండారు శ్రీనివాసరావు

వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ!– భండారు శ్రీనివాసరావు


‘అసలేంజరుగుతోంది?’ - ఒక కేసుకు సంబంధించి, దేశంలో పరిస్తితులపై అత్యున్నత న్యాయస్తానం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య ఇది.

గత కొద్దిమాసాల పాత పేపర్లు తిరగేసినా, టీవీ చర్చలు పునశ్చరణ చేసుకున్నా – సామాన్య జనానికి సయితం మనసులో మెదిలే ప్రశ్న ఇదే.

ఎంత చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంత చెడిపోయిన రాజకీయపార్టీకయినా ఏవోకొన్ని సిద్ధాంత మూలాలుంటాయి. కొన్ని స్తిరమయిన భావజాలాలుంటాయి.కానీ ఈనాడు దాదాపు అన్ని రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు చెల్లు చీటీ రాసినట్టే కానవస్తోంది.

అలాగే అన్ని రాజకీయ పార్టీలకు, పేరు ఏదయినా అధిష్టానం అంటూ ఒకటుంటుంది. ‘అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువ’ అని గొప్పలు చెప్పుకునే పార్టీలలో కూడా ఎవరూ నోరెత్తి అధిష్టానాన్ని బాహాటంగా ఎగర్తించే సాహసం చెయ్యరు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? చోటామోటా నాయకులు సయితం తమ పార్టీ అధినాయకులను విలేఖరుల ముందే పూచికపుల్లలుగా తీసివేస్తున్నారు. ‘ఔరా! వీరికెంత ధైర్యం!’ అని నలుగురూ అనుకునేలా నలుగురిముందే తమ నాయకులను చెరిగి పారేస్తున్నారు.

నాయకురాలి జాతీయతను ప్రశ్నించినా, నాయకుడి రెండు కళ్ళ విధానాన్ని విమర్శించినా ఇదేరకమయిన తెగింపు. ఏం చేస్తారులే అనే ధైర్యం.

ఏకంగా పార్లమెంటును, శాసన సభను వేదికగా చేసుకుని తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తూ, సొంత పార్టీనే నగుబాటు చేసినా ఏం కాదన్న ధీమా.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ ధిక్కార స్వరాన్ని బాహాటంగా వినిపించినా పోయేదేమీలేదన్న మొండితనం.

రాష్ట్రం రెండు ముక్కలవుతుందా మూడు చెక్కలవుతుందా తేలే రోజు ఎప్పుడో తేలకముందే పార్టీలన్నీ రెండుముక్కలుగా పైనుంచి కిందవరకూ చీలిపోయాయి. ప్రాంతాల విషయం వచ్చేసరికి ఎవరికీ పార్టీల సంగతి పట్టడం లేదు. విధానాల సంగతి గుర్తు రావడం లేదు. పార్టీలు వేరయినా మాట్లాడేది ఒక్కటిగానే వుంటోంది. ఎదుటి వారిని చీల్చి చెండాడడానికి నాలుకలన్నీ ఒక్కటవుతున్నాయి. విద్వేషాగ్నులు రగల్చడానికి, నిందారోపణలు చేయడానికి సొంత పార్టీ వారు, పరాయి పక్షం వారు అన్న తేడా లేకుండా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్తితిని గమనించేవారికి ఎవరు యే పార్టీ వారో చప్పున ఒక పట్టాన చెప్పడం కష్టమవుతోంది. పైపెచ్చు వీరిలో అనేకమంది  ఏదో ఒక పార్టీని నిజాయితీగా అంటిపెట్టుకుని నిష్కళంక రాజకీయాలు చేస్తున్నవారు కాకపోవడం వల్లకూడా అయోమయం పెచ్చుపెరుగుతోంది. మొన్న మొన్నటి వరకూ వేరే పార్టీలో వుండి ఆ గూటి పలుకులు పలికి ఇప్పుడు మళ్ళీ అదే నోటితో వేరే పలుకులు వల్లె వేయడం చూసి విస్తుబోవడం వీక్షకుల వంతు అవుతోంది. కళ్ళకు గంతలు కట్టి - ‘వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ’ అని అడిగినట్టు అడిగితె ఎవరు ఎవరో చెప్పలేని దుస్తితి.

గతంలో పార్టీ విధానాలను మీడియాకు వివరించడానికి ప్రతి పార్టీకి అధికార ప్రతినిధులు వుండేవారు. ఇప్పటికీ లేకపోలేదు. కానీ పార్టీ పేరుపెట్టుకుని ప్రతిఒక్కరూ మీడియాతో మాట్లాడేస్తున్నారు. దానికి పార్టీ అనుమతి వుందా లేదా అన్నది వారికి అప్రస్తుతం. వారు చెప్పేది పార్టీ విధానమా కాదా అన్నది మీడియాకు అప్రస్తుతం. ఇలా - ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా అప్పటికామాటలాడేవారితోనే మరింత గందరగోళం ఏర్పడుతోంది.

ఒక పార్టీ వారు చెప్పిన దానిని మరో పార్టీ వారు ఖండించే పద్దతి పోయి ఎవరి పార్టీవారిని వారే దుయ్యపట్టే కొత్త సంస్కృతి తాజాగా రూపుదిద్దుకుని వున్న అయోమయాన్ని మరింత పెంచింది. అలాగే ఒక పార్టీని మరో పార్టీ సమర్ధించే విధానం కూడా పరిస్తితిని మరింతగా గందరగోళపరుస్తోంది. అవసరాన్నిబట్టి అవలంబిస్తున్న ఈ రెండు నాల్కల ధోరణి రాజకీయపార్టీల దివాళాకోరుతనాన్ని ఎత్తి చూపుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలదీ ఇదే వరస కావడం మరో విషాదం.

వీటన్నిటికీ తోడు, క్రికెట్ పరిభాష లోని ‘మ్యాచ్ ఫిక్సింగ్’ పదం రాజకీయాల్లోకి దూసుకువచ్చింది. వీరు వారితో ఫిక్సయ్యారని ఒకరంటే, వారు వీరితో కుమ్మక్కయ్యారని మరొకరంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే – ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, స్తానిక సంస్తల నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో – ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. బహుశా ఈ అపవాదును తప్పించుకోవడానికే శాసన సభలో వారిద్దరూ రైతుల సమస్యను అడ్డం పెట్టుకుని పోటాపోటీగా మాటల యుద్ధం సాగించాల్సివచ్చిందనే వారు కూడా లేకపోలేదు. కాకపొతే, ముఖ్యమంత్రి అయిన నాటినుంచి అనేక రకాల సమస్యల వలయంలో చిక్కుకుని మనసారా నవ్వుకునే అవకాశం కోల్పోయిన కిరణ్ కుమార్ రెడ్డికి – నిండు సభలో చిరునవ్వులు చిందించే అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడిని అభినందించాలి. (11-03-2011)



10, మార్చి 2011, గురువారం

తిరుక్షవరం – భండారు శ్రీనివాసరావు


తిరుక్షవరం – భండారు శ్రీనివాసరావు

పిల్లలకు చెడ్డీలు మార్చినంత సులభంగా రాజకీయనాయకులు పార్టీలు మార్చగలరన్న అపవాదును వారు మోస్తున్నారు. ఈ దేశంలో ప్రతిదీ తమ సొంతం , ప్రతిదీ తమకు ఉచితం అనే భావన వారిలో ప్రబలిపోయిందనడానికి సంకేతంగా ఇంటర్ నెట్ లో ప్రచారంలోకి వస్తున్న ఓ కధనం మీ కోసం.

క్షవరం చేయించుకుందామని పువ్వులమ్ముకునే ఓ చిరు వ్యాపారి ఓ రోజు ఓ క్షవరశాలకు వెళ్లాడు. పని పూర్తయిన తరవాత డబ్బులు ఇవ్వబోయాడు. ‘ఈ వారం రోజులూ నేను నా తోటివారికి నా చేతనయిన సర్వీసు ఉచితంగా చేద్దామనుకుంటున్నాను. అందువల్ల డబ్బులు తీసుకోను’ అని అతగాడు మృదువుగా తిరస్కరించాడు. ఆ మాటలకు ముగ్ధుడయిన ఆ పూల వ్యాపారి అక్కడినుంచి నిష్క్రమించాడు. మరునాడు క్షురకుడు తన దుకాణం వద్దకు వెళ్లేసరికి అందంగా తయారు చేసిన పూల బొత్తి షాపు ముందు కనిపించింది. ‘మీ సేవకు ధన్యవాదాలు’ అని దానికో చీటీ పెట్టివుంది.

తరువాత, ఆ షాపుకు ఓ పోలీసు వచ్చాడు. బిల్లు చెల్లించబోయేటప్పుడు అతడికి కూడా అదే సమాధానం వచ్చింది. ఈ వారమంతా అందరికీ ఉచిత సేవ అందించాలన్న నిర్ణయానికి అనుగుణంగా డబ్బులు తీసుకోనని క్షురకుడు తెగేసి చెప్పాడు. మరునాటి ఉదయం అతడు దుకాణం తెరవడానికి వచ్చినప్పుడు ఆ పోలీసు పంపిన ధన్యవాదాల సందేశం, దానితో పాటు అతడి ఇల్లాలు స్వయంగా తయారు చేసిన మిఠాయిలు కనిపించాయి.

ఆ మరునాడు, ఘనత వహించిన పార్లమెంట్ సభ్యుడు ఒకరు క్షవరం చేయించుకుందామని ఆ దుకాణానికే వెళ్లాడు. క్షురకుడు యధావిధిగా డబ్బులు తీసుకోకపోవడానికి కారణం ఆయన గారికి నివేదించుకున్నాడు. ఈ వారమంతా ఉచిత సేవ చేయాలని అనుకున్నానని పార్లమెంటు సభ్యుడితో చెప్పాడు. అస్తమానం ప్రజాసేవలో తరించే ఆ ప్రజా ప్రతినిధి ఆ మాటలు విని ఎంతో మురిసిపోయి వెళ్లి పోయాడు.

మరుసటి రోజు ఉదయం క్షురకుడు తన దుకాణం తెరవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బారులు తీరి జనం కనబడ్డారు . విచారిస్తే తెలిసినదేమిటంటే వారంతా గౌరవ పార్లమెంటు సభ్యులేనని. ఉచితంగా దొరికే క్షవర సేవను అందుకుందామని వచ్చారని. తీరిగ్గా విచారించడమే ఇక అతగాడికి మిగిలింది.
సాధారణ జనాలకు, వారిని పాలించే రాజకీయ నాయకులకు - మనస్తత్వాల్లో స్తూలంగా వున్న తేడాను ఎత్తిచూపుతూ వెలువడిన ఈ కధనం ముక్తాయింపు ఇలా వుంది.

‘చంటి పిల్లలకు వాడే ‘డైపర్’ లనూ, రాజకీయనాయకులనూ తరచూ మారుస్తుండడం చాలా అవసరం.’

(10-03-2011)

7, మార్చి 2011, సోమవారం

వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు


వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు


ఆనందమే జీవితమే మకరందం అని హాయిగా జీవించేవాడి ముందు ఎంతటి శక్తిమంతుడయినా బలాదూరే.

వయసు పైన పడుతున్న కొద్దీ మనలో నవ్వగలిగే లక్షణం తగ్గిపోతున్నదని అనుకోవడం సరికాదు. నవ్వడం మానేసిన తరువాతనే మనకు ముదిమి మీద పడుతున్నదనుకోవాలి.

ఏదయినా లక్ష్యం ఏర్పరుచుకోవడానికి విశ్వాసం సాయపడుతుంది. అయితే, ఆ లక్ష్య సాధనకు ఆత్మ విశ్వాసం ఉపయోగపడుతుంది.

కరిగిపోయిన కాలాన్నీ, చేజారిపోయిన గతాన్నీ తిరిగి సంపాదించుకోవడం ఎంతటి భాగ్యవంతుడికీ సాధ్యం కాదు. అందుకే, వర్తమానం గతం లోకి జారిపోయేలోగా జీవితంలోని ప్రతి క్షణాన్ని అనుభవించాలి.

ఇతరులు మీకు ఏదో చేయాలని ఆశించి అది జరగకపోతే పడే బాధ అంతా ఇంతా కాదు. అదే, మీనుంచి మీరుగా ఆశించింది జరిగితే అది అందించే ప్రోత్సాహం మాత్రం లెక్కపెట్టలేనిది.

అంధుడయిన వ్యక్తి ఓ మేధావిని అడిగాడు. చూడలేకపోవడం కన్నా జీవితంలో ఇంకేదయినా విషాదం వుంటుందా అని.

‘ఎందుకు లేదు. వుంది – దూరదృష్టిలేక పోవడం అన్నది దృష్టిని పోగొట్టుకోవడం కంటే చాలా దారుణం’ మేధావి జవాబు.

క్షమాపణను మూడురకాలుగా వ్యకం చేయవచ్చు.

‘అయాం సారీ’

‘నేను తప్పుచేసాను’

‘తప్పు సరిచేసుకోవడానికి నేనేం చేయాలి?’

కాకపొతే, చాలామంది మూడోదాని జోలికిపోరు.


చిన్నపిల్లదగ్గరనుంచి అందరం నేర్చుకోవాల్సిన మంచి విషయాలు రెండున్నాయి.

ఒకటి- కారణం లేకుండానే సంతోషంగా వుండడం.

రెండోది- ఏదో ఒకటి చేస్తూ అస్తమానం బిజీ గా వుండడం.


కంప్యూటర్ పరిభాష ప్రకారం జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించడానికి మూడు పద్ధతులు వున్నాయి. అవి: CTRL+ALT+DEL

CTRL అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం.

ALT అంటే సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం అన్వేషించడం.

DEL అంటే మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్న అంశాన్ని వెంటనే తొలగించుకోవడం.


భార్యను ఎవడయినా రాక్షసుడు అపహరించుకుపోతే ఆ భర్త ఏం చేయాలి? ఏమీ చేయక్కరలేదు. తప్పుచేసినవాడే దాని ఫలితాలను కూడా అనుభవిస్తాడని జాలిపడి వూరుకోవాలి.

పెద్ద పెద్ద విషయాలకంటే అత్యల్ప విషయాలే మనుషుల్ని కష్టపెడుతుంటాయి. పెద్ద కొండ మీద ఎక్కి నిలబడగలం కానీ, ఓ సూదిమొనపై నిలబడడం అయ్యే పనా!
మనిషి జీవితంలో మరచిపోలేని మూడు విషయాలుంటాయని ఓ పెద్దమనిషి చెప్పాడు. అవేమిటంటే- ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాన్నం భోజనం, రాత్రికి మళ్ళీ డిన్నర్.

జీవితంలో వారంటీలు, గ్యారంటీలు అంటూ ఏమీ వుండవు. సాధ్యాసాధ్యాలను, అవకాశాలను మాత్రమే అది అందిస్తుంది. అందిపుచ్చుకోవడం మాత్రం మీ చేతుల్లోనే వుంటుంది.

మనం ఎవరు, ఏం చేస్తున్నాం అన్నది నలుగురూ చూస్తున్నప్పుడు గమనంలో వుంచుకోవడం మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

ఎవరూ గమనించడం లేదని తెలిసినప్పుడు కూడా మనం ఎవరు? ఎలా మసలుకుంటున్నాం అని గుర్తుపెట్టుకోవడం సహజ స్వభావాన్ని తెలియచేస్తుంది.

ఓ పిల్లిని కుక్క అడిగింది: రతిక్రీడ సమయంలో ఎందుకంత గోప్యత పాటిస్తారని.

‘అలాటి సమయాల్లో మనుషులు మమ్మల్ని గమనించడం మాకిష్టం వుండదు. ఇప్పటికే వాళ్ళు ఈ విషయంలో మీ పద్ధతులను అనుకరిస్తున్నారు కూడా.’ పిల్లి ఠకీమని జవాబు చెప్పింది. (07-03-2011)

6, మార్చి 2011, ఆదివారం

వర్కింగ్ కమిటీ వాలకం – భండారు శ్రీనివాసరావు

వర్కింగ్ కమిటీ వాలకం – భండారు శ్రీనివాసరావు


(06-03-2011 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)

- సంకీర్ణం పేరిట అన్నింటా అవమానాలే

- రాష్ట్ర ఎంపీల మనో వేదన

- పార్టీ పదవులకూ భంగపాటేనా?

- కల్లలైన సీనియర్ల కలలు

- సీడబ్ల్యుసీ ప్రాధాన్యతను తగ్గించిన ‘కోర్‌ కమిటీ’

‘ధర్మము ధర్మమటంచు వితండ వితర్కము లాడదేల ఆ ధర్మము నేనెరుంగుదు’ అంటాడు శ్రీరాముడు ఆంజనేయుడితో ఓసారి తగవు పడిన సందర్భంలో. బహుశా ధర్మకోవిదుడయిన రాముడికి కూడా సంకీర్ణ ధర్మం అనే ధర్మం తెలిసి ఉండదు. ఆయనకీ తెలియని ఈ ధర్మం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకి క్రమంగా తేటతెల్లం అవుతున్నట్టుంది. ‘మన రాష్ట్రం నుంచి అక్షరాలా ముప్పయి మూడు మందిమి కాంగ్రెస్‌ పార్టీ తరపున లోక్‌ సభలో కాలు పెట్టాము. నిజానికి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నదంటే దానికి ఆక్సిజన్‌ ఇస్తోంది మా ముప్పయి మూడు మందే. కానీ మనకు దక్కిన మంత్రి పదవులెన్ని? దక్కినవాటిల్లో పనికొచ్చేవెన్ని? రైల్వే బడ్జెట్‌లో కానీ, కేంద్ర బడ్జెట్‌లో కానీ రాష్ట్రానికి ఏమాత్రం గిట్టుబాటయింది? కేవలం ఒకరిద్దరు ఎంపీలతో మద్దతిస్తున్న చిన్నా చితకా పార్టీలకు ఇస్తున్న గౌరవ మర్యాదలు కానీ, పదవుల పంపకంలో వారికి ఇస్తున్న ప్రాధాన్యతలు కానీ ఇంతమంది సభ్యులు ఉన్న మన రాష్ట్రం వారికి ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వం మనదన్నమాటే కానీ మన మాట ఏమాత్రం చెల్లుతోంది? ప్రతి చిన్న పనికీ ఢిల్లీలో అందరిముందూ సాగిలపడాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది? సంకీర్ణ ధర్మం పేరుతో ఇంకా ఎన్నాళ్ళు ఈ అవమానాలు భరించాలి?’- ఢిల్లీలో మన కాంగ్రెస్‌ ఎంపీలు ప్రైవేటు సంభాషణల్లో పబ్లిక్‌గా చెప్పే మాటలు ఇవి. సరే, ప్రభుత్వ వ్యవహారాల్లో సంకీర్ణ ధర్మం పేరు చెప్పి దాటవేస్తున్నారు కానీ, పార్టీ పదవుల దగ్గర కూడా భంగపాటు తప్పకపోవడమే రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను మరింత కుంగదీస్తోంది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ పునర్వ్యవస్థీకరణ తరవాత వారి మాటల్లో వాడీ వేడీ మరింత పెరిగింది. కానీ ఏం లాభం? అధిష్ఠానం మాటే శిరోధార్యం అని అనునిత్యం వల్లించే వారికి, తమకు జరిగిన అన్యాయం గురించి నిలదీసే హక్కు ఎక్కడ ఉంటుంది? కాకపొతే, తనదాకా వస్తేగాని తత్త్వం బోధపడదు అన్న చందంగా ఇప్పుడు వారికి అధిష్ఠానం తమ పట్ల ప్రదర్శిస్తున్న చిన్న చూపు గురించి పెద్ద మనోవ్యధ పట్టుకుంది. ఢిల్లీ పెద్దల దృష్టిలో తమ స్థానం ఏమిటో వారికి బోధపడింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిశ్చితి, తెలంగాణ అంశం పార్టీలో తెచ్చిన చీలికలు, జగన్‌ మోహన రెడ్డి తిరుగుబాటు- నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచడానికి సీడబ్ల్యుసీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం మరింత పెరగగలదని కన్న కలలన్నీ కల్లలయ్యాయి.

పునర్వ్యవస్థీకరణకు ముందు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీలో సభ్యులుగా చక్రం తిప్పిన రాష్ట్ర నేతలు నలుగురికి కొత్త కమిటీలో మొండిచేయి చూపారు. పార్టీలో కురువృద్ధుడు అన్న ప్రాతిపదికపై దేశంలోనే అత్యున్నత పదవిపై ఆశ పెట్టుకుని అది నెరవేరకపోవడంతో నేరుగా పార్టీ అథినేత్రిపైనే నిప్పులు చిమ్మిన జి. వెంకటస్వామిని కమిటీ నుంచి తప్పించి, అవిధేయతను సహించేది లేదన్న స్పష్టమయిన సందేశాన్ని పార్టీ నాయకులకు పంపారు.

అలాగే, కె. కేశవరావు! పశ్చిమ బెంగాల్‌, అండమాన్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జ్‌గా పనిచేసిన కేకేను ఆ బాధ్యతలనుంచి తప్పించడమే కాకుండా, శాశ్వత ఆహ్వానితుడుగా కమిటీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాన్ని కూడా ఆయనకు దూరం చేశారు. తెలంగాణ కోసం సీ డబ్ల్యుసీ పదవిని తృణప్రాయంగా త్యజిస్తానని లోగడ కేకే చేసిన గర్జింపుకు ఇది అధిష్ఠానం ఇచ్చిన జవాబుగా పరిశీలకులు భావిస్తున్నారు. పోతే, ఉద్వాసనకు గురయిన మరో నాయకుడు నేదురుమల్లికి మళ్ళీ పదవి రాకపోవడానికి ఆయన వయసు అడ్డుపడి ఉండవచ్చు.

మరో సీనియర్‌ నాయకుడు కిశోర్‌ చంద్రదేవ్‌కు కూడా చోటు లభించలేదు. అందుకు కారణం రెండు మూడు నెలల్లో జరగలదని అనుకుంటున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించాలన్న యోచనలో పార్టీ అథినాయకత్వం ఉండడమేనని చెబుతున్నారు. అధిష్ఠానం రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరి పట్ల కాస్త కరుణ చూపిందనుకోవాలి. పార్టీ కార్యదర్శులుగా ఉన్న వి.హెచ్‌. హనుమంతరావు, పి.సుధాకరరెడ్డి- లకు మరో మారు అవకాశం కల్పించారు. సుధాకర రెడ్డిని గోవాకు, హనుమంతరావును మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, హర్యానా రాష్ట్రాల పార్టీ ఇంచార్జి బి.కె. హరిప్రసాద్‌కు సహాయకుడిగా నియమించారు.

మన రాష్ట్రానికి సంబంధించినంతవరకూ మరో ప్రధానమయిన మార్పు వీరప్ప మొయిలీని ఇంచార్జిగా తప్పించి ఆ స్థానంలో గులాం నబీ ఆజాద్‌ను నియమించడం. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలన్నీ ఆయనకు కొట్టినపిండి. గతంలో ఈ బాధ్యతను ఆజాద్‌ చాలా విజయవంతంగా నిర్వహించిన రికార్టు ఉంది. పార్టీని పట్టి కుదుపుతున్న జగన్‌ అంశం, తెలగాణ వాదంతో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర పార్టీని ఆజాద్‌ తన వ్యూహ చతురతతో గట్టెక్కించగలరనే నమ్మకంతోనే అధినాయకత్వం ఈ మార్పు చేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఇక ఈ మార్పు చేర్పులన్నింటినీ అధిష్ఠానం దృష్టితో పరికిస్తే చాలా ముందు చూపుతోనే పునర్వ్యవస్థీకరణ కసరత్తును అది పూర్తి చేసిందనుకోవాలి. మరో మూడేళ్లదాకా ఎన్నికలు లేని ఆంధ్ర ప్రదేశ్‌ పై దృష్టి సారించడం దండుగ అన్న భావనలో అధిష్ఠానం ఉండి ఉండవచ్చు. అందువల్ల అనవసరం అనుకున్న వారిని తప్పించేందుకు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ఉండవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి వీరి అవసరంకూడా పార్టీకి ఉండకపోవచ్చు. కొన్ని విషయాలలో అధిష్ఠానాన్ని తప్పు దోవ పట్టించారన్న అనుమానం ఢిల్లీ పెద్దలకు కలిగి ఉండవచ్చన్న వాదన కూడా కొట్టిపారవేయతగినది కాదు. అలాగే పార్టీ అధినేత్రిపై గానీ, అధిష్ఠానం పై గానీ లేనిపోని వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్న హెచ్చరిక కూడా ఇందులో దాగి ఉండవచ్చు.

కాంగ్రెస్‌ పార్టీ నియమావళి ప్రకారం వర్కింగ్‌ కమిటీ అనేది అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ. అయితే, కోర్‌ కమిటీ పేరుతొ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసుకున్న మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ సీడబ్ల్యూసీ ప్రాధాన్యాన్ని కొంతవరకు తగ్గించిందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల అనంతరం రాహుల్‌ గాంధీని ప్రధానిగా ప్రతిష్ఠించాలనే లక్ష్యం నెరవేరడానికి సీడబ్ల్యూసీలో చేసిన ఈ మార్పులు, చేర్పులు ఏమాత్రం సహకరిస్తా యో చెప్పడం కష్టం. కొత్త కమిటీలో రాహుల్‌కు రెండు ప్రధాన బాధ్యతలు అప్పగించినప్పటికీ, యువతరాన్ని ఆకర్షించేవిధంగా దానిపై ఆయన ముద్ర లేదన్నది మరో అభిప్రాయం. అనుభవానికే పెద్ద పీట వేసి, కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కించడంలో అధినాయకత్వం అంతగా శ్రద్ధ చూపలేదని పరిశీలకుల ఉవాచ.

ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలలో రాహుల్‌ గాంధీ ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వకపోవడం కూడా ఇందుకు కారణం అయి ఉండవచ్చు. కొత్త కమిటీలో స్థానం సంపాదించుకున్న వారందరూ వయసు మళ్లినవారే కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. తలపండిన పెద్దల అనుభవ సారాన్ని ఉపయోగించుకుంటూ పార్టీని పటిష్ఠం చేయడం అన్న ఒక్క విషయమే అధినాయకత్వం ముందున్న ప్రాధాన్యం అయి ఉండాలి.రోజురోజుకూ చీమల పుట్టల్లా అనేక అవినీతి కుంభకోణాలు వెలుగు చూస్తూ, పార్టీ అస్తిత్వానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్న దశలో ఉడుకు నెత్తురు కంటే, అనుభవాన్ని నమ్ముకోవడమే మంచిదన్న నమ్మకానికి అధిష్ఠానం వచ్చి ఉంటుంది!



3, మార్చి 2011, గురువారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-పద్దెనిమిదో భాగం) – భండారు శ్రీనివాసరావు

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-పద్దెనిమిదో భాగం) – భండారు శ్రీనివాసరావు


పాలయినా పెట్రోలయినా ఒకటే ధర

ఎముకలు కొరికే చలిలో ఏమి చెయ్యాలనిపిస్తుంది ? నాకయితే ఇంట్లో కూర్చుని వేడి వేడి పకోడీలు తింటూ రేడియోలో పాత పాటలు వినాలనిపిస్తుంది. కానీ రష్యన్లు చలి ముదురుతున్న కొద్దీ చల్లటి బీరు తాగాలనో, ఇంకా చలచల్లటి ఐస్ క్రీములు తినాలనో ఉత్సాహపడతారు. మంచుకురిసే వేళలో – ఆపాదమస్తకం ఉన్ని దుస్తులు ధరించి ఐస్ క్రీములకోసం ఆడామగా, పిల్లాపెద్దా తేడాలేకుండా వీధి దుకాణాల ముందు ఆరుబయట బారులుతీరి నిలబడే రష్యన్లను చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆనాటి మాస్కోలో ఎక్కడికిపోయినా ముందు కనిపించేవి పెద్ద పెద్ద క్యూలే. ఆఖరికి పాలుకొనాలన్నా, పెరుగుకొనాలన్నా క్యూలను తప్పించుకోలేము. ధరాభారం లేకపోవడంవల్లనో, మళ్ళీ ఈ చలిలో బయటకు రావడం ఎందుకనో, అవసరంవున్నా లేకపోయినా ప్రతివస్తువును దొరికినప్పుడే కొనుక్కోవడం మంచిదనో కారణం ఏదయితేనేమి కానీ ప్రతిచోటా పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తాయి. ఉత్పాదక వ్యయంతో నిమిత్తం లేకుండా ప్రజల అవసరాలనుబట్టి ధరలను బాగా అదుపులో వుంచడంవల్ల కొనుగోలు శక్తి బాగా పెరిగిపోయి, వారు చేసే అనవసర కొనుగోళ్ళతో కృత్రిమ కొరతలు ఏర్పడి, ఏది ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్తితి ఏర్పడిందని మాస్కోలో చాలా కాలం నుంచి వుంటున్న మా తోటి ఉద్యోగులు చెబుతుండేవారు. మాటవరసకు పాల విషయమే తీసుకుందాం. ప్రతి నివాసానికి చేరువలోనే పాలు, పాల ఉత్పత్తులు అమ్మే ‘ప్రోదుక్తి’ దుకాణం వుంటుంది. పాలు లీటరు ముప్పయి కోపెక్కులు. ఇంత చలిలో మళ్ళీ ఏం వస్తామనుకునే బద్దకస్తులు అవసరానికి మించి కొనుగోలుచేసేవారు. వాడకానికి పోను మిగిలిన పాలను డస్ట్ బిన్ లో పారేసి మర్నాడు మళ్ళీ కొనుక్కునేవాళ్లను చూసాము. ధర బహు తక్కువగా వుండడం వల్ల ఇలా దుబారా జరుగుతోందని చెప్పుకునేవాళ్ళు. అలాగే పెట్రోలు. లీటరు పాల ధర, లీటరు పెట్రోలు ధర ఒకటే విధంగా వుండడం ఆ దేశంలోనే చెల్లు. ట్యాంకు నిండిన తరవాత పెట్రోలు లీటర్లకు లీటర్లు కారిపోతున్నా చోద్యం చూస్తూ నిలబడేవాళ్ళు, ఒకటో రెండో రూబుళ్ళు అదనంగా విదిలిస్తే పోలా అనుకునేవాళ్ళు అక్కడే కానవస్తారు.

అక్కడ ప్రతివారు ఒక చేతి సంచిని సిద్ధంగా దగ్గరవుంచుకుంటారు. వీధిలోకి వెడితే ఎప్పుడు ఏది దొరుకుతుందో తెలవదు. క్యూ పొడుగ్గావుంటే చాలు అక్కడ ఏమి అమ్ముతున్నారన్నదానితో నిమిత్తం లేకుండా వెంటనే అందులో దూరిపోతారు. జనం బాగా వున్నారంటే క్యూబానుంచి దిగుమతి చేసుకున్న అరటి పండ్లో లేక ఇంకా అపురూపమయిన టమాటాలో అక్కడ అమ్మకానికి పెట్టారనుకోవచ్చు. టమాటాలు కనబడితే కిలోలకు కిలోలు కొనేస్తారు. వాటిని ఇంటికి చేర్చడానికి పడే ప్రయాస ఆ క్షణంలో ఎవరికీ గుర్తు వుండదు.ఎందుకంటె అవి ఏడాది పొడుగునా దొరికేవికావు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ తో పాటు పెద్ద పెద్ద డీప్ ఫ్రిజ్ లు కూడా వుంటాయి. ఇలా కొనుక్కొచ్చిన టమాటాలను వాటిల్లో భద్రం చేస్తుంటారు. అవి గట్టిపడి రాళ్ళ మాదిరిగా తయారవుతాయి. టమాటాలు దొరకని రోజుల్లో వాటిని బయటకు తీసి వేడి నీటిలో ఉడకపెట్టుకుని వంటల్లో వాడుకుంటూ వుంటారు.

ఇక ఇండియన్లకు, ప్రత్యేకించి దక్షిణాది శాకాహారులకు సంబంధించి ప్రధాన సమస్య రోజూ తినే బియ్యం. రష్యన్ బియ్యం బాగా మొద్దుగా వుంటాయి. చూడడానికి ఇంపుగా వుండకపోవడమే కాకుండా వాటితో వండిన అన్నం నోటికి హితవుగా వుండదు. అందుకే ఏ షాపులోనయినా ఇండియా నుంచి వచ్చిన బియ్యం అమ్ముతున్నారని తెలిస్తే అందరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఆ షాపుపై ఎగబడేవారు.దీనికి సంబంధించి ఒక జోకు ప్రచారంలో వుండేది. మాస్కోలోని బారత రాయబారి కార్యాలయానికి కొత్తగా ఓ ఉన్నతాధికారి వచ్చారు. ప్రతి రోజూ ఉదయం జరిగే అధికారుల సమావేశానికి ఒకరు ఆలస్యంగా వచ్చారు. కొత్త అధికారి పాత అధికారిని ఆలస్యానికి కారణం అడిగారుట. దోవలో ఒక షాపులో బియ్యం అమ్ముతున్నారని తెలిసి అక్కడ ఆగడం వల్ల ఆలస్యం అయిందని ఆయన వివరణ ఇచ్చారుట. అంతే, ఆ మీటింగులో ఒక్కరు వుంటే ఒట్టు. అందరూ ఒక్క పెట్టున లేచి పొలోమని ఆ దుకాణం వైపు పరిగెత్తారట.(03-03-2011)

2, మార్చి 2011, బుధవారం

క్రెడిట్ కార్డు మోసాలు – బ్యాంకుల బాధ్యత - భండారు శ్రీనివాసరావు

క్రెడిట్ కార్డు మోసాలు – బ్యాంకుల బాధ్యత - భండారు శ్రీనివాసరావు


ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు కానీ, ఓ నలభయ్ ఏళ్ళ క్రితం ప్రతి హోటల్ ముందు ఒక బోర్డు వేలాడదీసేవారు. “మీ సైకిళ్ళకు మా పూచీ లేదు. మీ సొంత బాధ్యతపై పెట్టుకోవాలి-ఇట్లు హోటల్ యాజమాన్యం” అని దానిపై రాసివుండేది.

అలాగే ఇప్పుడు క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు కూడా ఇదే పరిస్తితి. ఏది జరిగినా మీదే బాధ్యత. ఎందుకంటె ఎలాటి అవకతవకలు జరిగినా ఆ క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంకులు  ఆ విషయంలో ఏమాత్రం బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేవు.

ఈమధ్య ఒక సర్వే జరిపారు. క్రెడిట్ కార్డు భద్రత విషయంలో భారత దేశంలోని బ్యాంకులు  ఏవిధమయిన ముందస్తు చర్యలు తీసుకోవడం లేదన్నది ఆ సర్వే సారాంశం. కార్డు వినియోగదారులు బ్యాంకులకు తెలియచేసే వ్యక్తిగత సమాచారం సమాచారాన్ని గోప్యంగా వుంచే విషయంలో కూడా బ్యాంకులు  ఏరకమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని ఆ సర్వేలో వెల్లడయింది. క్రెడిట్ కార్డుల లావాదేవీల భద్రత పట్ల కూడా బ్యాంకులు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని  ఆ సర్వే ద్వారా తెలియవచ్చింది.

‘క్రెడిట్ కార్డు మోసాలు’ గురించి అనేకరకాల వార్తలు ప్రతిరోజూ బయటపడుతున్న నేపధ్యంలో – మన దేశంలోని చాలా బ్యాంకులు - కార్డు భద్రతతకు సంబంధించి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని – ఈ సర్వే నిర్వహించిన సంస్తలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భారత డేటా కౌన్సిల్, కేపీఎంజి సంయుక్తంగా ఈ సర్వే జరిపాయి. దేశంలోని ఇరవై ప్రభుత్వ రంగ బ్యాంకులు, వాటికి సంబంధించిన ప్రధాన సమాచార భద్రతను పర్యవేక్షించే  అధికారులను  ఈ సర్వే నిర్వహించినవారు ప్రశ్నించి వివరాలు  రాబట్టారు.

మోసాలకు ఆస్కారమిచ్చే పాత, కాలం చెల్లిన విధానాలనే భారతీయ బ్యాంకులు  ఇంకా అనుసరిస్తున్నాయని సర్వే తెలిపింది. క్రెడిట్ కార్డుల మోసాల్లో ముఖ్యంగా ప్రధాన భూమిక వహించే సీ వీ వీ నెంబర్లు, కార్డుల చెలామణీ ముగిసిపోయే తేదీల వివరాలను భద్రపరిచే విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న పద్ధతులు ప్రామాణికంగా లేవని సర్వే వెల్లడించింది. కార్డు భద్రతకు సంబంధించి అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా లేవని తేల్చిచెప్పింది.

అయితే, చాలాబ్యాంకులు - కార్డుపై లావాదేవీ జరిగిన వెంటనే ఆ వివరాలను ఆయా ఖాతాదారులకు వెనువెంటనే ఎస్ ఎం ఎస్ ద్వారా తెలియచేస్తూ వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ, ఇది ఒక్కటీ ఎంతమాత్రం సరిపోదన్నది సర్వే తాత్పర్యం.

ఎందుకంటె, ఎలెక్ట్రానిక్ కార్డు పేమెంట్ సిస్టం ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు వినియోగదారుడికి చెందిన  వ్యక్తిగత సమాచారం సర్వీసు ప్రొవైడర్లకు, లేదా లావాదేవీలతో సంబంధంవున్న ఇతర భాగస్వామ్య వ్యాపార సంస్తలకు నేరుగా చేరే అవకాశం వుంటుంది. కాకపొతే ఇటువంటి సమీకృత విధానం లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ వుండడంవల్ల వినియోగదారులు వీటిల్లో వుండే ‘రిస్క్’ ను గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ఖాతాదారులకు తెలియకుండా ఖాతాల్లోని డబ్బును వేరే ఖాతాలకు మళ్ళించుకోవడానికి ఈ సమాచారం చాలా చక్కగా వుపయోగపడుతుంది.

ఖాతా ప్రారంభించిన వెంటనే పాస్ వర్డు మార్చుకోవడం, ఖాతాను వినియోగదారుడి అభ్యర్ధనపై తాత్కాలికంగా స్తంభింప చేయడం, ఆన్ లైన్ బ్యాంకింగు లో ఖాతాదారులు వాడుకునే సమయాన్ని కుదించడం మొదలయిన కొన్ని చర్యలు భారతీయ బ్యాంకులు  ఇప్పటికే అమలుచేస్తున్నాయి. ఒక నిర్దిష్ట వ్యవధి తరవాత పాస్ వర్డులను మార్చాల్సిన  అవసరాన్ని గురించి వినియోగదారులను జాగృతం చేయాల్సిన అవసరం వుందని సర్వే పేర్కొంటోంది. అధ్యయనం చేసిన బ్యాంకుల్లో ముప్పయ్యేడు శాతం బ్యాంకులు ఎక్స్ టర్నల్ అప్లికేషన్లను, మొబైల్ కోడ్ లను డౌన్ లోడ్ చేసుకునే వ్యవస్తలను ఏర్పాటు చేసుకోలేదని, వీటివల్ల మోసాలను అరికట్టే అవకాశాలను ఈ బ్యాంకులు దూరం చేసుకుంటున్నాయని సర్వే అభిప్రాయపడింది.

ఆన్ లైన్ బ్యాంకింగ్ లో భద్రతను పరిరక్షించడం అన్నది తమకు సవాలుగా మిగిలిపోతోందని సర్వే లో సమాధానాలు ఇచ్చిన బ్యాంకుల సమాచార భద్రతాధికారులు చెప్పారు. అలాగే, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కకుండా చూడడం అనేది మరింత క్లిష్టంగా వుంటోందని కూడా వారు అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించి - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ చట్టం – 2008 లో అనేక నిబంధనలు పొందుపరచడం జరిగింది కానీ, వాటికి సంబంధించి నిర్దిష్టమయిన వ్యవస్తలను అనేక బ్యాంకులు ఇంకా ఏర్పాటుచేసుకున్న దాఖలాలు లేవు. సర్వే చేసిన బ్యాంకుల్లో దాదాపు ఎనభయ్ శాతం బ్యాంకుల్లో సమాచార గోప్యతకు సంబంధించి విడిగా ఏవిధమయిన ఏర్పాట్లు లేని విషయం ఈ సర్వేలో తేలింది. నాలుగింట మూడువంతుల బ్యాంకుల్లో సెక్యురిటీ టీముల్లో పనిచేసేవారి సంఖ్య పదికంటే తక్కువగావుంది.

అత్యంత ఆధునికమయిన వ్యవస్తీకృత పద్ధతులతో బ్యాంకులను మోసంచేసే ప్రమాదకర పరిస్తితిని బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కుంటోందని సర్వే తెలిపింది. అలాగే, వినియోగదారులు సయితం ఆన్ లైన్ బ్యాంకింగ్ విధానం లో తమ డబ్బు ఏపాటి సురక్షితం అన్న ఆందోళనతో వున్నట్టు సర్వే సూచిస్తోంది.

పరిస్థితులు ఇలా వున్నప్పటికీ,  మోసం జరిగిన సంగతిని కస్టమర్లు, లేదా సిబ్బంది తెలియచేసిన తరవాతనే తదనంతర చర్యలకు ఉపక్రమించే స్తితిలో చాలా  బ్యాంకులు వుండడం విషాదకరమని సర్వే పేర్కొన్నది. మోసం జరిగిన వెంటనే దాన్ని తమంత తాముగా కనుక్కునే యంత్రాంగాన్ని బ్యాంకులు ఏర్పాటు చేసుకోలేదని సర్వే తెలిపింది.  

ఈనాటి డిజిటల్ యుగానికి తగినట్టుగా, బ్యాంకులు అంతర్గత నిర్వహణ వ్యవస్తలను మేరుగుపరుచుకోలేదన్న విషయం కూడా ఈ సర్వేలో వెల్లడయింది. సెక్యూరిటీ విషయంలో ఉదాసీనంగా వుండడంవల్లనే, బ్యాంకుల్లో తరచుగా ఆర్ధిక పరమయిన మోసాలు జరుగుతున్నాయని సర్వే అభిప్రాయపడింది.

సమాచార భద్రత అన్నది తమకు సంబంధించిన అంశంగా భారతీయ బ్యాంకులు భావించడం లేదనీ, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన విషయంగా పక్కనపెడుతున్నాయని సర్వే పేర్కొన్నది. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్తలు అనుసరిస్తున్న విధానానికి ఇది వ్యతిరేకమని సర్వే అభిప్రాయపడింది. అయితే, సర్వే మొత్తంలో ఒక్క మంచి విషయం కూడా లేదని అనుకోనక్కరలేదు. బ్యాంకుల నడుమ డబ్బు బదిలీ విషయంలో భారతీయ బ్యాంకులు తగిన సెక్యూరిటీ పద్ధతులు పాటిస్తున్నాయని చక్కటి కితాబు ఇచ్చింది.

కార్డు నెంబర్లను, ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని భద్రపరిచే సందర్భాల్లో బ్యాంకులు కోడింగ్ విధానాన్ని పాటిస్తున్నాయి. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం గట్టిగా నొక్కిచేబుతున్న డాటా భద్రత ప్రాధాన్యం గురించిన అవగాహన లోపం బ్యాంకుల్లో కానవస్తోందని ఐ టీ మంత్రిత్వశాఖకు చెందిన డిఎస్ సీఐ సీ.ఈ.ఓ. డాక్టర్ కమలేష్ బజాజ్ చెప్పారు.

పటిష్టమయిన భద్రతా వ్యవస్తలను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకులకు నిధుల కొరత లేదు. వీటిపట్ల దృష్టి సారించకపోవడానికి ప్రధాన కారణం, వాటి నడుమ వున్న పోటీ తత్వం. ఏదోవిధంగా కష్టమర్లకు సులభమయిన, సుఖప్రదమయిన బ్యాంకింగ్ సర్వీసులను అందచేయడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవడం ఒక్కటే వాటి ముందు వున్న ప్రధాన లక్ష్యం. అందువల్ల భద్రతకు సంబంధించి ఎంతో కొంత రాజీ పడాల్సిన పరిస్తితి. భద్రత పేరుతొ బ్యాంకింగ్ లావాదేవీలను మరింత క్లిష్టం చేస్తే సంతోషించే కష్టమర్లు వుండరన్నది వాటి అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ, తమ ఖాతాదారులకు భద్రతా ప్రమాణాల ప్రాధాన్యతను వివరించి, నచ్చచెప్పి, ఒప్పించాల్సిన బాద్యత బ్యాంకులపై వుందని సర్వే సలహా ఇచ్చింది.ఇప్పటికే, కొన్ని బ్యాంకులు ఆన్ లైన్ బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు వీలుగా  వినియోగదారులను జాగృతం చేసే దిశగా ప్రచారం చేస్తున్న విషయాన్ని సర్వే పేర్కొన్నది. దీన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరాన్ని ఆ సర్వే  ప్రస్తావించింది. (02-03-2011)