23, సెప్టెంబర్ 2010, గురువారం

విన్నంతలో కన్నంతలో అమెరికా - 10 - భండారు శ్రీనివాసరావు

అమెరికన్ ఆతిధ్యం

మిసెస్ సూజన్ విల్సన్ బెల్ వ్యూ లోని ఒక పాఠశాలలో టీచరు. ఆవిడ భర్త మిస్టర్ గోర్డన్ - రెడ్మండ్ టౌన్ సెంటర్ లోని కార్యాలయంలో పనిచేస్తారు. వారికి అయిదుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయాయి. మిగిలిన ముగ్గురి చదువులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. హాస్టళ్ళలో వుంటున్నారు. ప్రస్తుతానికి భార్యాభర్తా ఇద్దరే బెల్ వ్యూ లోని సొంత ఇంట్లో వుంటున్నారు. ఒక రాత్రి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. ఇల్లు పొందికగావుంది. ముందూ వెనుకా విశాలమయిన ఖాళీ జాగా. ఇంట్లోకి అడుగు పెట్టగానే నల్లటి రంగులో తళ తళ మెరిసిపోతూ పియానో దర్శనమిచ్చింది. దాని పక్కనే ‘మరింబా’ అనే మరో సంగీత వాయిద్యం.

మరింబా వాయిస్తున్న  మిస్టర్ గోర్డన్ 

 శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లులా ఆ ఇంట్లో అంతా సంగీత వాతావరణం. సాధారణంగా అమెరికన్లు బయటవారిని ఎవరినీ భోజనాలకు ఇళ్లకు పిలవరు, అంతగా పిలవాల్సి వస్తే హోటల్లో డిన్నర్ ఇస్తారని చెప్పుకునేవాళ్ళు. అందుకే మేము వాళ్లు పిలిచినప్పుడు కొంత సందేహిస్తూనే వెళ్ళాము. కానీ వారి ఆదరణలో కృత్రిమత్వం ఏమీ కనిపించలేదు. పైగా ఆ సాయంత్రం మొత్తం మాతోనే గడపడానికి సిద్దమయినట్టు కనిపించారు. ఇండియానుంచి, అదీ దక్షిణ భారతం నుంచి వచ్చిన శాకాహారులమని తెలిసి వంటకాలను తయారుచేసినట్టున్నారు. అందరం కలసి భోజనాల బల్ల దగ్గర కలిసి కూర్చుని భోజనం చేసాము. అంతకు ముందు మిస్టర్ గోర్డన్, మిసెస్ విల్సన్ ప్రార్ధన చేసారు.

“ ఓ! లార్డ్! ఇండియానుంచి వచ్చిన అతిధులు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మా పిల్లలు నిరుడు హైదరాబాదు వెళ్ళినప్పుడు వీరు వారిని చక్కగా చూసుకున్నారు. వారికి ఇలా భోజనం పెట్టగలిగే అవకాశం కల్పించిన నీకు కృతజ్ఞతలు.”

మా బామ్మ గారు జ్ఞాపకం వచ్చారు. భోజనానికి ముందు ఆవిడ తప్పకుండా దేవుడి ప్రార్ధన చేసేవారు.

అమెరికన్లు అనగానే విందుతో పాటు మందు అనే దురభిప్రాయం తొలగిపోయేలా మా భోజనం పూర్తయింది. తరవాత మిసెస్ విల్సన్ చక్కటి పాటలు పాడారు. మిస్టర్ గోర్డన్ పియానోతో సహకారం అందించారు. డిజర్ట్ సర్వ్ చేసేటప్పుడు వారి ఫ్యామిలీ ఫోటోలు చూపించారు. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు నెమరు వేసుకున్నారు. భాష అర్ధం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురయినా వారి ఆప్యాయతను, ఆత్మీయతను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాము.

అక్కడ గడిపిన కొద్ది గంటల సమయంలో ఒక విషయం గమనించాము. ఎక్కడా ఏ గదిలో టీవీ కనిపించలేదు. అడగడం బాగుండదని ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. కానీ, నేను రేడియోలో పనిచేశానని తెలుసుకున్నప్పుడు, మాటల సందర్భంలో చెప్పినట్టుగా తమ ఇంట్లో టీవీ వుండదని చెప్పారు. ‘టీవీ అనేది వినోదాత్మకంగా వుండాలి. వార్తల జోలికి పోకూడదు’ అని అభిప్రాయపడ్డారు. వార్తలకోసం తాము పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ రేడియో వింటామనీ, సంగీతంతోనే పొద్దుపుచ్చుతామనీ చెప్పారు. “మీడియా అంతా ఇప్పుడు ముక్కచెక్కలయింది. వాళ్లు సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ల సొంత అభిప్రాయాలు చెబుతున్నారు” అన్నారాయన. రెండు కార్లు వున్నప్పటికీ, రోజూ ఆఫీసుకు ఏడున్నర మైళ్ళు సైకిల్ పైనే వెడతానని మిస్టర్ గోర్డన్ చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది.

చీటికీ మాటికీ చీకాకులు పడుతూ, పండంటి కాపురాలను పాడుచేసుకుంటారని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకోవడంలో అమెరికన్లు సిద్ధ హస్తులనీ – మన వైపు జనసామాన్యంలో వున్న అభిప్రాయంలో అంత వాస్తవం లేదని గోర్డన్ కుటుంబాన్ని చూసిన తరవాత అనిపించింది.

వెనక మేము మాస్కో వెళ్లి నప్పుడు – స్కూల్లో మా వాడిని వాళ్ల క్లాస్ మేట్ అడిగాడట – ‘మీ ఇంట్లో ఎన్ని ఏనుగులున్నాయ’ని. ఇండియాలో పులులు వీధుల్లో తిరుగుతుంటాయని, ఏనుగుల్ని ఇళ్ళల్లో పెంచుకుంటారనీ, పిల్లలు పాములతో ఆడుకుంటారనీ - ఇవీ ఆ దేశంలో మన దేశం పట్ల వున్న అభిప్రాయాలు. (22-09-2010)
 

22, సెప్టెంబర్ 2010, బుధవారం

విన్నంతలో కన్నంతలో - అమెరికా -9 – భండారు శ్రీనివాసరావు

కనిపించుటలేదు!

జీవితంలో చాలా విషయాలు కనురెప్పల కిందే కరిగిపోతున్నాయి.
సుజాతగారి బ్లాగులో (http://www.narasaraopet-bloggers.blogspot.com/) నరసారావుపేటలో అంతరించిపోతున్న గూడు రిక్షాల గురించి చదివాను.

నరసరావుపేట గూడు రిక్షా

ఒకానొక రోజుల్లో గూడు రిక్షాలు జన జీవనంలో భాగంగావుండేవి. ఆ రోజుల్లో రోడ్డుమీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతిసంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగావున్నారన్న విషయం ఆ బ్లాగు పై వచ్చిన ‘పలకరింపులు’ తెలియచేస్తున్నాయి. రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు.
ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునేవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాతనీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?
అమెరికా నుంచి బయలుదేరుతూ ఆఖరివారంలో చూసిన రెండు విశేషాలతో  పాతలోని మధురిమ మరోసారి అనుభవం లోకి వచ్చింది. పాతను ‘ఉప్పు పాతర’ వేయకుండా ఇక్కడవాళ్ళు యెంత జాగ్రత్త పడుతున్నారో అర్ధం అయింది.

అగ్నికీలల్లో నాటి సియాటిల్ 

1889 లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సియాటిల్ డౌన్ టౌన్ లో చాలాభాగం తగులబడిపోయింది. తరవాత దాని స్తానంలో కొత్త నగరం నిర్మితమయింది. కానీ పాతనగరం జ్ఞాపకాలను అతి పదిలంగా దాచుకుంటున్న తీరే అద్భుతం. ఆదర్శప్రాయం.
దాదాపు నూట యిరవై ఏళ్ల నాటి సియాటిల్ పాత బస్తీలోని కొన్ని ప్రదేశాలను ఎంపికచేసి, బేస్ మెంట్ లో పాతవాటిని మ్యూజియంలో మాదిరిగా జాగ్రత్తచేసి, పైన పలుంతస్తుల సుందర భవనాలను నిర్మించుకున్నారు.

వీటి కిందనే భద్రపరచిన  పాతజ్ఞాపకాలు 

 అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న పాత గృహాలను, గృహోపకరణాలను రూపు చెడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, భద్రపరచి - ‘సియాటిల్ అండర్ గ్రౌండ్ టూర్’ పేరుతొ టూరిస్టులకు చూపిస్తున్నారు. దాదాపు రెండు గంటలపాటు సాగే ఈ టూరులో ఒక గైడ్ వెంటవుండి పాతరోజుల సంగతులను కొత్త కొత్తగా చెబుతుంటాడు.

ఆ  కాలంనాటి  టాయిలెట్
  
 ఆ కాలంలో వాడిన టైపు రైటర్లు, గోడగడియారాలు, సోఫాలు, బాయిలర్లు, ఇంటి పైకప్పులు, దర్వాజాలు అన్నిటినీ చూడవచ్చు. పదిహేను డాలర్ల టిక్కెట్టు కొనుక్కుని ఈ టూర్ లో పాల్గొనడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ప్రతిరోజూ వందల్లో వుంటుందంటే – పాత రోజులపట్ల ఇక్కడి ప్రజలకు వున్న మోజు అర్ధం చేసుకోవచ్చు.

అండర్ గ్రౌండ్  టూర్ లో ఒక దృశ్యం

అలాగే. ఇస్సక్క్వా (Issaquah).
సులభంగా నోరు తిరగని ఈ ఊరు సియాటిల్లోని శివారు ప్రాంతం. మైనింగ్ అవసరాలకోసం ఈ పట్టణాన్ని కలుపుతూ లోగడ ఒక రైలు మార్గం వుండేది. దాన్ని తరవాత మూసివేశారు. ఇస్సక్క్వా హిస్టారికల్ సొసైటీ వారు ఈ పట్టణం డౌన్ టౌన్ ను ఒక చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేసి, అప్పటి రైల్వే స్టేషన్ ను, రైలు పట్టాలను లాగే వుంచేసి పాత జ్ఞాపకాలకు గుర్తుగా మిగిల్చుకున్నారు.

నాటి రైల్వే స్టేషన్

 ఆ రోజుల్లో వుండే పెట్రోల్ (గ్యాస్) బంకులను, సినిమాహాళ్ళను యధాతధంగా వుంచేసారు. ఆధునిక నగరం సియాటిల్ నుంచి వచ్చి ఆ పాత పట్టణంలో కలయ తిరుగుతూ వుంటే, ఒక్కసారిగా ‘టైం మెషిన్’ లో గతకాలంలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.

అలనాటి పాత బజారు

అంతరించి పోతున్న నరసారావుపేట గూడు రిక్షాలను గురించి చదివిన సమయంలోనే ఈ ప్రదేశాలకు వెళ్ళిరావడం కేవలం యాదృచ్చికం.
పోతే- గూడు రిక్షాలేకాదు, కలికానికి కూడా కనబడకుండా పోతున్న వస్తువుల జాబితా తక్కువేమీ లేదు. తిరగళ్లు, రోకళ్లు, రుబ్బురోళ్లు, ఎడ్లబళ్లు – చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అన్నట్టు చాంతాడు కూడా ఇక ఇలాటి సామెతలకే పరిమితం. మొన్న జ్వాలనరసింహారావు ఏదో సందర్భంలో చెప్పాడు. ఈ మధ్య అవసరం పడి, ‘రేడియో కం టేప్ రికార్డర్’ కోసం హైదరాబాదంతా కారు టైర్లు అరిగేట్టు తిరిగాడట. రేడియోనా అదేమిటి అన్నట్టు అందరూ మొహం పెట్టారట.
ఇవి సరే! –
ఇవి కనబడకపోతే ఏదో సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రేమలూ, ఆప్యాయతలూ, అనురాగాలు, అనుబంధాలూ – వీటి సంగతేమిటి? అతివేగంగా అంతరించిపోతున్న వాటిలో వీటిదే ప్రధమ స్థానం.
వీటినెలా కాపాడుకునేటట్టు? కానరాకుండా పోతున్న వీటినెలా కనిపెట్టేటట్టు?
విచిత్రమేమిటంటే ఈ ప్రశ్నలకు జవాబు కూడా- “కనిపించుటలేదు”. (22-09-2010)
NOTE:All images in the blog are copyrighted to the respective owners

18, సెప్టెంబర్ 2010, శనివారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

ఏనుగు శీర్షాసనం వేయడం ఎప్పుడయినా చూసారా!

ఆయనతో పరిచయం ఎలాజరిగిందో గుర్తురావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా , స్తూల కాయానికి ఎక్కువగా వుండేవారు. పేరుమాత్రం కురచగా ప్రసాద్. వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువే. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ విషయాలు ఆయనకు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ సూత్రాలు ఆయనకు కరతలామలకం. భారత, భాగవత, రామాయణ గ్రంధాలన్నీ ఆపోసన పట్టిన వ్యక్తి. అష్టాదశపురాణాల్లో ఏ అంశంపైన అయినా తడుముకోకుండా తర్కించగలిగిన సామర్ధ్యం ఆయన సొంతం. సూర్యోదయం కాకముందే నిద్రలేచి, నిష్టగా అనుష్టానాలన్నీ పూర్తిచేసుకుని, ఇంటినుంచి బయటపడడం తరువాయి, ఆయన జీవన శైలి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.

ఎమర్జెన్సీ తరవాత జనతా సర్కారు ఇందిరాగాంధీపై పెట్టిన కేసుల్లో ఆమె తరపున వాదించిన లాయర్లలో తానొకడినని ఆయనే ఎన్నోసార్లు చెప్పుకున్నారు. జ్వాలానరసింహారావుతో కలసి నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అందుకు దాఖలా అన్నట్టుగా అనేకమంది పెద్దలను పరిచయం చేసారు. పలువురితో అంతంత పరిచయాలు వున్న ఈ వ్యక్తి హైదరాబాదులో మాత్రం స్కూటరుపై తిరిగేవాడు. మాకు స్కూటరు కూడా లేకపోవడంవల్ల అప్పుడు మాకది సందేహించాల్సిన అంశంగా అనిపించేది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరుపై మా ఇంటికి వస్తుంటే, మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.

ఎక్కడ తిరుగుతున్నా త్రికాల సంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఒకరోజు న్యూఢిల్లీ లో కుతుబ్ మినార్ చూసివస్తూ, సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి, దారిపక్కన నీటి చెలమ వున్నచోట కారు ఆపించి, సంధ్యావందనం చేసివస్తుంటే, మాతో పాటు టాక్సీ డ్రయివర్ కూడా ఆశ్చర్యపోయాడు. జనాలని ఆకర్షించడం కోసం ఆయన అలా చేస్తున్నారేమోనన్న అనుమానం కలగకపోలేదు. కానీ పైకి వ్యక్తం చేసేంత చనువు లేక మిన్నకుండి పోయేవాళ్ళం.

అల్లా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లి ఆ హోటల్లోని బుక్ స్టాల్లో పుస్తకాలు చూస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటున్నాము. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఓ నియమం వుండేది. ఎంతమందిలోవున్నా సరే -  తెలుగులోనే మాట్లాడుకోవాలని.

అది కలసి వచ్చింది. ఒకాయన మా వైపు తిరిగి తెలుగువాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి “మీరు శ్రీనివాసరావు కదూ!” అన్నారు. ఆయన ఎవరో కాదు విజయవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాం చదువుతున్నప్పుడు నా క్లాస్ మేట్. అప్పటికే బాగా పేరుతెచ్చుకున్న సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల. చదువుకునే రోజుల్లో పేరు జె వి డి ఎస్ శాస్త్రి.

అందరం కలసి ఆ హోటల్లోనే వున్న జంధ్యాల రూముకి వెళ్ళాము. వెళ్లీవెళ్ళగానే, మాతోవచ్చిన లాయరు గారు ఏమాత్రం మొహమాటపడకుండా, కొత్త చోటని సందేహించకుండా “ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా “ అని అడిగి జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలకు దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే, అక్కడవున్న తివాసీపై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్తమాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగినంత పనయింది. చిన్న తలతో, పెద్ద బొజ్జతో అంత లావు శరీరంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెరపోయినట్టు కనిపించారు. తర్వాత వారిద్దరిమధ్య చాలా సేపు కవి పండిత చర్చ సాగింది. అప్పటికే శంకరాభరణం సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల - విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ వారిద్దరి నడుమ సాగిన సంభాషణ నిజానికి ఇద్దరు  పండిత శ్రేష్టులమధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకరినిమించి మరొకరు అక్షరలక్షలుచేసే విద్యను అమోఘంగా ప్రదర్శించారు.ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిల్లో కొన్నింటిని సప్తపదిలో జంధ్యాల పొందుపరిచినట్టున్నారు కూడా.

ఈ చర్చ సాగిన తీరుచూస్తున్న నాకు - చదువుకునే రోజుల్లో నాకు తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒక్కరేనా అన్న అనుమానం కలిగింది. ఆ రోజుల్లో - మొత్తం కాలేజీకి ఆయనొక్కడే ‘కారున్న’ కుర్రకారు. ప్రిన్సిపాల్ కూడా రిక్షాలోవస్తుంటే, జంధ్యాల మాత్రం కారులో కాలేజీకి వచ్చేవాడు. ’సంధ్యారాగంలో శంఖారావం’ వంటి నాటకాలు రాస్తూ, వేస్తూ సరదాగా వుండేవాడు. అలాటి జంధ్యాలలోని మరో రూపాన్ని ఆరోజు చూడగలిగాను. అల్లాగే మావెంట వచ్చిన లాయరుగారు. ఆయనకువున్న విషయ పరిజ్ఞానాన్నికళ్ళారా చూసి, చెవులారా విన్నతరవాత, ఆయనపై నాకున్న దురభిప్రాయం దూదిపింజలా ఎగిరిపోయింది. వినదగునెవ్వరు చెప్పిన అన్న సూక్తి బోధపడింది. మనం చెప్పిందే ఇతరులు వినాలనే ఆత్రంలో యెంత నష్టపోతున్నామో అర్ధం కావాలంటే యిలాటి సజ్జన సాంగత్యం ఎంతో అవసరం.

ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. (18-09-2010)

ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా! – భండారు శ్రీనివాసరావు

ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా! – భండారు శ్రీనివాసరావు

అందరి సంగతేమో కానీ దేవుడుతో నాకు కొన్ని పేచీలున్నాయి. నేను ఆయన్ని అడిగేవన్నీ చాలా అత్యల్ప స్వల్ప విషయాలని నా ధృఢనమ్మకం. ఆయన్నేమన్నా మణులడిగానా మాన్యాలడిగానా. పూర్వం కాలం రాక్షస భక్తుల మాదిరిగా కోరరాని వరాలేమన్నా  కోరానా!  లేదే!  ఏదో కొంచెం అహంకారం తగ్గించవయ్యా మగడా! అన్నాను.

పనిలో పనిగా, కాస్త  చేయి తీరిక చేసుకుని ఆ చేత్తోనే నా అజ్ఞానం కూడా కొంత తగ్గించమని మొక్కుకున్నాను. పట్టించుకున్న పాపాన పోతేగా! ఆయన లెక్కలు ఆయనకున్నట్టున్నాయి. దేవుడు కదా! కాళ్ళూ చేతుల మాదిరిగా తెలివితేటలు కూడా మనుషులకంటే  ఆయనగారికి ఎక్కువే కాబోలు.

అహంకారం తగ్గిస్తే తనకు ఇక బొత్తిగా పనివుండదన్న సందేహం వల్ల కావచ్చు. అజ్ఞానులు లేకపోతె తననిక నమ్మేవాళ్ళు కూడా వుండరన్న అనుమానం వల్ల కావచ్చు. మొత్తానికి ఏమయితేనేం దేవుడు నా గోడు పట్టించుకోలేదు. దానితో నా అహంకారం, అజ్ఞానం రెండూ ఒకటి నొకటి పెనవేసుకుని  - పాదు చేసి, నీరు పోసి పెంచిన పూలపొదలా నన్ను గట్టిగా అల్లుకుపోయాయి.

అలా అల్లుకుపోయిన ఆ రెండూ ఇప్పుడు ఈ బ్లాగులో మఠం వేసుక్కూర్చున్నాయి. వెనక్కి తిరిగి చూసుకోకుండా  ఎడాపెడా రాసేస్తున్న ఈ  బ్లాగు పోస్టింగుల్లో నక్కి నక్కి చూస్తున్నాయి.

అందువల్ల మీ అందరికీ నా మనవేమిటంటే –
అలాటి అజ్ఞానపు ఆలోచనలు, దురహంకార  ధోరణులూ ఈ రాతల్లో ఎక్కడయినా పంటికింద రాయిలా తగిలితే  పెద్దమనసు చేసుకుని 
 నా అజ్ఞానాన్ని మన్నించండి. నా అహంకారాన్ని క్షమించండి.
ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా!
(17-09-2010)

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

రేడియో రోజులు -7 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు -7            - భండారు శ్రీనివాసరావు

ఒకరు - సాక్షాత్తు దేశానికి ప్రధాన మంత్రి. మరొకరు జిల్లాస్తాయి యంత్రాంగంలో ఓ జీపు డ్రైవర్. వీరిద్దరూ కలసి భద్రాచలం అడవుల్లో ఓ డొక్కు జీపులో కలసి ప్రయాణం చేశారు. నమ్మదగని విషయంగా అనిపించినా ఇది అక్షర సత్యం. పైగా దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని.

గోదావరికి వరదలు రావడం మామూలే. కానీ వరద నష్టం పరిశీలించడానికి ప్రధాన మంత్రి స్వయంగా రావడం మామూలు విషయం కాదు. అందుకే ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరిగాయి. అందులోనూ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం - ఎన్ టీ రామారావు గారి నాయకత్వంలో నడుస్తున్న రోజులాయె.

హెలికాఫ్టర్ లో భద్రాచలం చేరుకున్న రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం - అనేక వాహనాలతో కూడిన ప్రధాన మంత్రి బృందం రోడ్డు మార్గంలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలను చూసేందుకు బయలుదేరింది. ప్రధాని వెంట ముఖ్య మంత్రి రామారావు గారు, మాజీ ముఖ్య మంత్రి, అప్పటి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు గారు అధికారులు, అనధికారులు అంతా వున్నారు. ఆ రోజుల్లో రేడియో విలేఖరికి కొద్దో గొప్పో ప్రాధాన్యత వుండడం మూలాన హైదరాబాదు నుంచి వెళ్ళిన నాకు కూడా ప్రధాని కాన్వాయిలో ఒక జీపు కేటాయించారు. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. టేపు రికార్డర్ చేతబట్టుకుని వీ ఐ పీ ల వెంట తిరగగలిగే వెసులుబాటు వుండేది. భద్రాచలం నుంచి చింతూరు వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రావాలన్నది అధికారుల ప్లాను. మార్గ మధ్యంలో రాజీవ్ గాంధీ అనేక చోట్ల వాహనాన్ని నిలిపి రోడ్డు దిగి కాలినడకన ఇసుక మేట వేసిన పొలాలలోకి వెళ్లి రైతులతో, కూలీలతో మాటా మంతీ కలిపేరు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ప్రజలకు, ప్రధానికి నడుమ దుబాసీగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల కాన్వాయి ఆపడం - చాలాదూరం నడుచుకుంటూ వెళ్లి స్తానికులతో మాట్లాడడం - ఇదంతా యువకుడయిన రాజీవ్ గాంధీకి ఏమాత్రం అలసట కలిగించలేదు కానీ ఆ ఎర్రటి ఎండలో ఎగుడు దిగుడు పొలాల్లో వేగంగా అడుగులువేస్తూ వెడుతున్న రాజీవ్ గాంధీతో పాటు సమానంగా నడవడానికి మిగిలిన నాయకులు నానా హైరానా పడ్డారు. ఈ విధంగా సాగిపోతున్న ప్రధాని పర్యటన అనుకోని మలుపు తిరిగింది.

పైలట్ రాజీవ్

నేను ఖమ్మంలో చదువుకునే రోజుల్లో వంటమ్మగారనే పేద వృద్ధురాలు వుండేది.నాలుగయిదు ఇళ్ళల్లో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆమె మనవడికి చదువు వొంట పట్టకపోవడంతో వారినీ వీరినీ ప్రాధేయపడి ఏదో చిన్న ఉద్యోగం వేయించగలిగింది. అతను కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఓ ప్రభుత్వ శాఖలో డ్రైవర్ గా స్తిరపడ్డాడు. రాజీవ్ గాంధీ కాన్వాయిలో నేనెక్కిన డొక్కు జీపుకు అతనే డ్రైవర్ కావడం కాకతాళీయం. ఇక వర్తమానం లోకి వస్తే -

మరి కాసేపటిలో చింతూరు చేరతామనగా ఓ మలుపు దగ్గర రాజీవ్ గాంధీ వాహనం ఆపించారు. ఆ మలుపులో రోడ్డుకు ఎడమవయిపున దిగువగా అడవిలోకి వెళ్ళే ఓ బాట వుంది.
రాజీవ్ గాంధీ ఆయన కారు దిగి జేబులోనుంచి ఓ మ్యాప్ తీసి చూసుకుంటూ అడవి బాట పట్టారు. ఆ వెనుకే రామారావు గారు, వెంగళరావు గారు, ఒకరిద్దరు భద్రతాధికారులు, నేనూ, నామాదిరిగానే హైదరాబాదు నుంచి వచ్చిన పత్రికా విలేకరి సురేందర్(ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ ) - అంతా ఆయన్ని అనుసరించాము. రాజీవ్ గాంధీ పదే పదే రోడ్డు దిగిపోయి పొలాలవెంట తిరిగిరావడం గమనిస్తూ వచ్చిన పోలీసులూ, ఇతర అధికారులూ రోడ్డు మీదే వుండిపోయారు.

ఆ అడవి బాటలో కొద్ది దూరం వెళ్ళిన తరవాత - 'ఇక్కడికి దగ్గరలో పలానా పల్లెటూరు వుండాలి కదా' అని అడిగారు రాజీవ్ గాంధీ మరో సారి మ్యాప్ కేసి చూస్తూ. ఖమ్మం జిల్లా ఆనుపానులన్నీ తెలిసిన వెంగళరావు గారికి కూడా ఈ గ్రామం గురించి తెలిసినట్టు లేదు. 'పదండి పోదాం' అంటూ రాజీవ్ కదిలారు. దూరంగా రోడ్డుపై జీపు ఆపుకుని వున్న డ్రైవర్ అదే అమ్ముమ్మగారి మనవడు - మేము ముందుకు కదలడం చూసి రివ్వున జీపు స్టార్ట్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మ్యాప్ చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో, రామారావు గారు, వెంగళరావు గారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కేసారు. నేనూ సురేందర్ పరిగెత్తుకుని వెళ్లి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము- సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా.జీపు కదిలింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో రాజీవ్ గాంధీ, ఆయన వెనుక వెంగళ రావుగారు, డ్రైవర్ వెనుక సీట్లో రామారావు గారు , సెక్యూరిటీ వాళ్ళు, నేనూ, సురేందర్- అంత చిన్న జీపులో ఎలా ఇరుక్కుని వెళ్ళామో ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రాకముందు విమానాలు నడిపే పైలట్ గా పనిచేసారు. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం నడుపుతూ, రాడార్ సాయంతో దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించి, నడి రాత్రయినా, పట్టపగలయినా రన్ వేపై ఖచ్చితంగా దించగలిగిన అనుభవం ఆయనకు వుంది. ఎక్కడో భద్రాచలం దగ్గర మారుమూల అరణ్య ప్రాంతంలో మ్యాప్ చూసి గ్రామాలను గుర్తించగలిగిన దక్షతను ఆ అనుభవమే ఆయనకు నేర్పి వుంటుంది.

అందరి ప్రాణాలు (అడవి) గాలిలో దీపాలు

అడవి గాలికి జీపుకు వేళ్ళాడుతున్న పాత టార్పాలిన్ పట్టాలు టపటపా కొట్టుకుంటున్నాయి. నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు రాపాడుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. నక్సల్స్ సంచరించే ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాక గురించి వారికి తెలియచెయ్యడానికి వారి సానుభూతిపరులు చెట్ల కొమ్మలను ఒకదానికి మరొకటి తాటించి చప్పుడు చెయ్యడం ద్వారా సంకేతాలు పంపుతారని చెప్పుకునేవాళ్ళు. నక్సల్స్ కు పట్టు వున్న అడవుల్లో ఇలా సంచరించడం క్షేమం కాకపోయినా - రాజీవ్ గాంధీ మాత్రం ముందుకే పోవాల్సిందని డ్రైవర్ కు సైగ చేశారు. తన పక్కన కూర్చుని సూచనలిస్తున్నది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి అన్న విషయం తెలిసికూడా మా అమ్మమ్మగారి మనమడు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా - నిబ్బరం కోల్పోకుండా - సుశిక్షితుడయిన సైనికుడి మాదిరిగా జీపు నడపడం చూసి నివ్వెరపోవడం మా వంతయింది.

రాజీవ్ ఊహించినట్టుగానే దగ్గరలోనే ఆ లంబాడాగూడెం తారసపడింది. తీరా చూస్తె పట్టుమని పది పూరిళ్లు కూడా లేవు. రాజీవ్ గాంధీ ఎలాంటి భేషజం లేకుండా ఓ చుట్టు  గుడిసె లోకి వెళ్లి ఆ పేద కుటుంబం స్తితిగతులను ఆరా తీసారు. ఓ మూలాన మూడు రాళ్ళ పొయ్యిపై వున్న మూకుడు మీద మూత తీసి - అన్నం మెతుకులను పట్టి చూసి - ఆ పేదరాలి భుజంపై చేయి వేసి - సాయం చేయడానికి సర్కారు ఉన్నదన్న భరోసా కలిగించారు. ఆ మిట్టమధ్యాన్నం వేళ తమ ఇంటికి వచ్చిన అతిధి - దేశ ప్రధాని అన్న సంగతి ఆమెకు తెలుసో లేదో! ఇప్పటి ప్రచార యుగంలో ఈ సంఘటన జరిగి ఉన్నట్టయితే ఎంతటి ప్రాచుర్యం లభించి ఉండేదో!
తర్వాత షరా మామూలే.- రాజీవ్ గాంధీ మళ్ళీ మ్యాప్ సాయంతోనే మమ్మల్నందర్నీ చేరాల్సిన చోటికి చేర్చారు.
ఒక ప్రధాని-ఒక ముఖ్య మంత్రి- ఒక మాజీ ముఖ్య మంత్రి వెంట ఖమ్మం జిల్లా అడవుల్లో కలిసి తిరిగిన విశేషాలను మర్నాటి ఉదయం రేడియో వార్తల ద్వారా బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికి - మట్టికొట్టుకుపోయిన దుస్తులతో తెల్లారేసరికల్లా భద్రాచలం చేరడం అదో కధ.

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

రేడియో రోజులు - 6 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - 6   - భండారు శ్రీనివాసరావు

“ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.

అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికికానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.

చెన్నారెడ్డి గారి వంటి చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్తానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా ఈ మీటింగులు శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సందేశం పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.

ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. “వెడుదుగానిలే! కాసేపు కూర్చో!” అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.

అంజయ్య గారు గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో – కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.

పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ మెటర్నిటీ వార్డులో పురుళ్ళ గదికి ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం చూసి ఆయన సంతోషపడి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం ప్రత్యెక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.

ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు పుట్టివుంటాయి కానీ, అంజయ్య గారు విషయాలను యెంత నిశితంగా పరిశీలించేవారో నాకు తెలుసు.

ఒకసారి కౌలాలంపూర్ లో తెలుగు మహాసభలు జరిగాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

“పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.

‘కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య గారి వ్యవహారం. (13-09-2010)
   

13, సెప్టెంబర్ 2010, సోమవారం

రేడియో రోజులు - 5 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - 5  - భండారు శ్రీనివాసరావు

“నేను ఏది చెబితే అదే జీవో” అనే వారు 1978 లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు.

ఆయన వ్యవహారశైలి విలక్షణంగా వుండేది. తను అనుకున్నది నిమిషాలమీద కాదు క్షణాలలో జరిగిపోవాలని పట్టుబట్టేవారు. యెంత పెద్ద అధికారినయినా ఆయన లెక్కపెట్టేవారు కాదు. ఐ ఏ ఎస్ అధికారి అని కూడా చూడకుండా ‘ఎక్కడ దొరికారయ్యా చావల్ ఖరాబు గాళ్ళు’ అని ఫైళ్లు విసిరేయడం నేను చూసాను. ఆయన ఆఫీసులో వున్నారంటే చాలు – ఆ చాంబర్ అంతా ఒకరకమయిన నిశ్శబ్దం రాజ్యం చేసేది. అధికారులు, అనధికారులు యెంతటి వారయినా సైగలు - మహా అయితే - గుస గుసలు, అంతే కానీ మాట పెదవి దాటేదికాదు.

చెప్పినవెంటనే జరిగిపోవాలనే ఆయన నైజం నిఖార్సయిన అధికారులకు ఒక పట్టాన మింగుడు పడేదికాదు. “రూలు ప్రకారం కుదరదు సార్” అని మొహం మీద చెప్పే ధైర్యం వారికి వుండేది కాదు. ఎందుకంటే చెప్పిన పని కాదన్నవారినీ, చెయ్యనివారినీ ఆయన నలుగురిముందూ మొహమ్మీదే కడిగేసేవారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో దిట్ట అయిన చెన్నారెడ్డి గారికి అధికారులతో ఆడుకోవడం వెన్నతోపెట్టిన విద్య. పైగా ఫైళ్ళపై ఎండార్స్ మెంట్లు రాయడంలో ఆయనకు ఆయనే సాటి.

సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఎస్. ఆర్. రామ్మూర్తి గారు ముఖ్యమంత్రి పేషీలో వుండేవారు. ఆయనకేమో అంతా రూలు ప్రకారం నడవాలి. రూలు పేరెత్తితే రూళ్లకర్ర పట్టుకుని హుంకరించే తత్వం చెన్నారెడ్డి గారిది. ‘ఎవరయ్యా ఈ రూల్స్ పెట్టింది. మనం పెట్టుకున్నవేగా, మార్చుకుంటే పోలా!’ అనే వారు.

‘అలా మార్చుకున్నప్పుడు మాకేమిటి అభ్యంతరం? కానీ, అప్పటిదాకా, ఇప్పుడున్న రూలే మాకు రూలు’ అన్నది రామ్మూర్తి గారి రూలు.

ఏమయితేనేం, కొన్నాళ్ళకి రామ్మూర్తి గారే సర్దుకున్నారు. అంటే రూల్స్ తో సమాధాన పడ్డారని కాదు. రెడ్డి గారి తత్వం అర్ధం చేసుకుని ఒక ఉపాయం కనుక్కున్నారన్న మాట. ముఖ్యమంత్రి గారు ఏదో పని చెప్పి చెయ్యమనగానే మరేదో రూలు చెప్పి కుదరదనే వారితో ఆయనగారికి కుదరదని తెలుసుకున్నారు. అందుకే, ఎప్పటికెయ్యదిప్రస్తుతమన్నట్టుగా – అప్పటికి ఒక్కసారి ‘యస్ సార్’ అంటే పోలా’ అనుకున్నట్టున్నారు. సంబంధిత ఫైలు మళ్లీ సీ ఏం పేషీకి వచ్చేసరికి ఎలాగూ కొంత వ్యవధి పడుతుంది. అప్పుడు నెమ్మదిగా చెబితే ఆయనే వింటారులే అని ఒక మధ్యే మార్గం కనుక్కున్నారు. అప్పటినినుంచి చెన్నారెడ్డి గారు ఏదయినా అడగ్గానే రామ్మూర్తి గారు వెంటనే ‘యస్ సర్’ (తప్పకుండా చేద్దాం సర్) అనేవారు. ఆ ఒక్క మాటతో చెన్నారెడ్డి గారు ఖుష్. ఫైల్ మళ్లీ పేషీకి వచ్చిన తరవాత సీ ఏం గారికి చూపించేటప్పుడు మాత్రం రూలు ప్రకారం ఆ పని చేయడం ఎలా కుదరదో వివరంగా చెప్పి- ‘నో సర్’ (కుదరదు సర్ ) అనేవారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆ ఆనుపానులన్నీ తెలిసిన రెడ్డిగారు కిమ్మనకుండా తలపంకించి వూరుకునేవారు.

ఇదంతా తెలిసిన వారు – ఆయన ఇంటి పేరు ‘యస్ ఆర్’ తో ముడిపెట్టి - ‘ఫైలు రాకముందు యస్ సర్ రామ్మూర్తి - వచ్చిన తరవాత నో సర్ రామ్మూర్తి’ అని సరదాగా అనుకునే వారు. రేడియో రిపోర్టర్ గా ముఖ్యమంత్రి కార్యాలయంలో చనువుగా తిరిగే నాకు ఇలాటి విషయాలు అప్పుడప్పుడు చెవిలో పడేవి. (12-09-2010)