మొన్నీ మధ్యనే తొంభయ్యవ పడికి దగ్గరయి
కన్ను మూసిన మా శారదక్కయ్య, ఆమె పోయిన మూడో రోజునే ఆవిడకు ఇంచు మించుగా
సమవయస్కురాలయిన మా బాబాయి కుమార్తె సుగుణక్కయ్య చూస్తుండగానే దాటిపోయారు.
(కీర్తిశేషులు అయితరాజు (మండవ) సుగుణక్కయ్య)
మా ఏడుగురు అక్కయ్యలు, బాబాయి
కుమార్తెలు ఇద్దరు, సుగుణక్కయ్య, మధురక్కయ్యలు సొంత అక్కాచెల్లెళ్లు మాదిరిగా ఎంతో
అన్యోన్యంగా వుండేవాళ్ళు. ఇప్పుడంటే చుట్టపక్కాలు పెళ్ళిళ్ళలో కలుస్తున్నారు. ఆ
రోజుల్లో అలా కాదు మధ్య మధ్య విధిగా ఏదో ఒక కారణంతో రాకపోకలు సాగేవి.
అందుకే అన్నారు, చుట్టబెడుతుంటేనే
చుట్టరికాలు, మాట్లాడుకుంటూ ఉంటేనే మిత్రత్వాలు అని.
ఇప్పుడో!
వావివరసలన్నీ, ‘కజిన్’ అనే ఒక్క
ముక్కతో చెల్లు.