బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు
'బుడ్గూ' అంటాడు గోపాళం
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ
'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ పేరు లేదా
ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లు
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ
అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం
'ఏంగురూ ఈ పేర్ల గోల' అంటుంది సీగానపెసూనాంబ
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా
అన్నా, ఏం గురూ అన్నా ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఇక ఏమిటి సమస్య.
అలానే దేవుడొక్కడే!
కావాల్సింది నమ్మకం. దేవుడున్నాడనే నమ్మకం.
దేవుడి పేరుతొ మనుషులు ఘోరాలు చేయకుండా కనిపెట్టి చూడడం.
మిగిలినవి ఆ దేవుడే చూసుకుంటాడు.
'కలడు కలండనెడి వాడు కలడో లేడో' అని పోతన్న గారికే అనుమానం వచ్చింది.
మనమనగానెంత?