మనం ఎన్ని పాట్లుపడి ముందస్తు ఏర్పాట్లు చేసుకుని
తిరుమల వెళ్ళినా మనకు ఎలాంటి దర్శనం రాసిపెట్టి
వుందో అదే స్వామి అనుగ్రహిస్తాడని పీవీ
ఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడో రాసారు. అంచేత
తిరుపతి విమానం ఎక్కడానికి ముందే దేవుడిని కోరుకుంది అదే సులభతరమైన మంచి దర్శన
భాగ్యం కలిగించమని. గత బుధవారం నాడు మిత్రుడు సూర్య కలిసినప్పుడు తిరుపతి అంశం
ప్రస్తావనకు వచ్చింది.
“మీరు
వస్తాను అంటే నేను రెడీ. అయితే ఒకే ఒక్క షరతు.
దర్శనం, వసతి ఇలా ఏ విషయంలోనూ ఎవరి సిఫారసు కోరవద్దు.
ఆడవాళ్ళతో ప్రయాణం కాదు కాబట్టి ఎలాగో సర్దుకుపోదాం”
ఈ మధ్య ఎవరో చెప్పారు. ఆన్ లైన్లో శ్రీ వాణి
ట్రస్టు టిక్కెట్లు కొంటే దర్శనం అకామడేషన్ వాళ్ళే ఏర్పాటు చేస్తారని.
ఇదేదో బాగుందనుకుని మర్నాడే చెరి పదివేల అయిదు వందలు, వసతి కోసం
వెయ్యి రూపాయలు కాషన్ డిపాజిట్ కింద మరో వెయ్యి చెల్లించి యాత్రకు కావాల్సిన రెండు
ప్రధాన అంశాలపై ఎవరి మీద దేనికి ఆధారపడే అవకాశం లేకుండా చూసుకున్నాము.
శ్రీ వాణి (Sri Venkateswara Aalaya Nirmana) ట్రస్టు
టిక్కెట్లు కనుక స్వామివారి మూల విరాట్ వున్న గర్భాలయం గడప వరకు వెళ్లి దర్శనం
చేసుకున్నాము. తోపులాటలు, నెట్టడాలు,
వగైరాలు లేవు. విగ్రహం ముందు నిలబెట్టి శఠారి
ఇచ్చారు. స్వామి ప్రసాదం అంటూ ఒక పండు చేతిలో పెట్టారు. బయటకి వచ్చి వెలుతురులో
చూస్తే అదో చిన్న సైజు బత్తాయి కాయ. మహా
ప్రసాదం అనుకున్నాము. ఆ దేవదేవుడు నా వేడుకోలు చెవిన పెట్టాడు అని సంతోష పడ్డాను.
సులభంగా చక్కటి దర్శనం అయితే అయింది కానీ, ఆ
తర్వాత పట్టపగలే చుక్కలు చూపించారు దేవస్థానం వారు. ఆ ప్రయాస ఇంతా అంతా కాదు. ఆ
దెబ్బకు హైదరాబాదు వచ్చిన తర్వాత కూడా రెండు రోజులు మంచానికి అంటుకు పోయాను. కరోనా
ముమ్మరంగా ఉన్నరోజుల్లో కూడా జిర్రున చీది ఎరుగని నేను ఈ తిరుపతి యాత్రలో పడిన
ప్రయాసకు వడదెబ్బ తగిలి అడ్డం పడ్డాను. అందుకే రోజూ పోస్టుల మీద పోస్టులు పెట్టే
వాడిని రెండు మూడు రోజులుగా కంప్యూటర్ ముందు కూచోలేక పోయాను.
“దర్శనం భేషుగ్గా జరిగింది, అయితే....”
అని శీర్షిక పెట్టడానికి కారణం ఏమిటన్నది మరో పోస్టు పెడతాను.
అయితే ఆ చెప్పబోయేది అంతా దేవస్థానం
ఉన్నతాధికారుల కోసం. వాళ్ళు చూస్తారా లేదా అనేది నాకు అనవసరం.
“మంచి దర్శనం ఇప్పించు స్వామి” అనే నా మొర ఆ
దేవదేవుడే విన్నాడు. అధికారులు పట్టించుకున్నా
లేకపోయినా నేను పట్టించుకోను.
ధర్మారెడ్డి గారు! ఓసారి నాతొ వస్తారా అక్కడ
పరిస్త్తితులు ఎలా వున్నాయో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను ఆ పోస్టు ద్వారా.
(24-09-2022)