వైట్ హౌస్
ఈ మధ్య టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ శ్రీ రజనీకాంత్, అమెరికా ప్రెసిడెంట్ నివాస భవనం వైట్ హౌస్ విశేషాలను వివరిస్తున్న ఒక వీడియో సాంఘిక
మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైట్ హౌస్ ప్రాంగణ ప్రవేశం అంత దుర్బేధ్యమైన
పనేమీ కాదు. ఇక వైట్ హౌస్ ప్రవేశం అంటారా అది అంత సులభం కాదు, అలాగని అంత కష్టం కూడా కాదు. ముందుగా అనుమతి తీసుకుంటే
ఇది సాధ్యమే.
నిరుడు ఇదే సమయంలో
అమెరికా వెళ్ళినప్పుడు వైట్ హోస్ ని అతి దగ్గరగా చూడగలిగాము. ఆ ప్రాంగణంలో స్వేచ్ఛగా
తిరిగాము. ఫోటోలు తీసుకున్నాము. అక్కడ ఎవరూ మీరెవరు అని అడిగిన వాళ్ళు
కనిపించలేదు. సీక్రెట్ కెమెరాలు వున్నాయేమో, సీక్రెట్ పోలీసులు మఫ్టీలో వున్నారేమో తెలియదు.
తెలిసిందల్లా అణువణువునా శోధనలు లేవు. తనిఖీలులేవు.
ఎటు తిరిగినా వద్దన్న వాడు లేడు. అడ్డగించిన వాడు లేడు. ఇది నిజమా! మీరు వెళ్ళింది
నిజంగా వైట్ హౌస్ కేనా అనే సందేహాలు రావడం సహజం. కానీ ఇది స్వానుభవం. ఎప్పటిదో
కాదు, నిరుటి అనుభవమే.
ఆ కధా కదన మెట్టిదనిన.
నేను, నా పెద్ద కుమారుడు సందీప్ సియాటిల్ నుంచి బయలుదేరి
సాల్ట్ లేక్ సిటీ మీదుగా రాత్రంతా విమానంలో ప్రయాణం చేసి బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ చేరుకునే సరికి ఉదయం ఆరుగంటలు.
మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు.
రాత్రి నిద్ర బాకీ మొత్తం బుధవారం పగటి వేళ తీర్చుకున్నాము.
ఎందుకంటే మర్నాడు గురువారం, ఆ మర్నాడు శుక్రవారం రెండు
రోజులు హెక్టిక్ స్కెడ్యూలు. మా అన్నయ్య
పిల్లలు అమెరికాలో వుండడం వల్ల నా ప్రయాణం నల్లేరు మీద బండిలా సాగుతోంది.
ఒకరకంగా చెప్పాలి అంటే గవర్నర్ గారి పర్యటన మాదిరిగా
వుంది. అన్నీ ఎరెంజ్ చేసి కారూ, విమానమూ ఎక్కమంటారు.
గురువారం అంతా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సీ అంతా
కలయ తిరిగాము. Nations'
most famous address వైట్ హౌస్ మా
ప్రియారిటీ.
సెక్యూరిటీ హడావిడి వుంటుందని అనుకుంటూ వెడితే అక్కడ
ముగ్గురు నలుగురు సాయుధ పోలీసులు మాత్రమే కనిపించారు. కనిపించారు కానీ, లోపలకు వెడుతున్న మమ్మల్ని ఎవరు మీరు అని తనిఖీలు
చేయలేదు. కనీసం గుర్తింపు కార్డులు చూపించమని కూడా అడగలేదు. సెక్యూరిటీ చెక్
ద్వారాలు లేవు. ముందుగా ఆన్ లైన్లో బుక్
చేసుకుంటే విజిటర్లను లోపలకు కూడా అనుమతించే ఏర్పాటు
వుందట.
విచిత్రం ఏమిటంటే వైట్ హౌస్ కు వెళ్ళే మార్గంలో, దానికి కూతవేటు దూరంలో పేవ్ మెంట్ మీద ఇద్దరు బిచ్చగాళ్లు (హోం లెస్) కనిపించారు. అదే దోవలో దారి పక్కన టోపీలు, టీ షర్టులు
అమ్ముకుంటున్న వాళ్ళు కనిపించారు.
అమెరికా పార్లమెంట్, లింకన్ మెమోరియల్, వాషింగ్ టన్ మెమోరియల్ (ఎత్తైన స్థూపం) చూసాము. ఎటు
తిరిగినా, ఏమి చేసినా, ఫోటోలు తీసుకుంటున్నా, అక్కడ అడిగేవాళ్ళు, అభ్యంతర పెట్టేవాళ్ళు
ఎవరూ లేకపోవడం చిత్రంగా అనిపించింది. అటకాయించే భద్రతా సిబ్బంది మాకు కనబడలేదు.
అమెరికా రాజధానిలో మేము చూసినంత మేరకు , పెద్ద పెద్ద భవనాలు వున్నాయి కానీ, ఆకాశ హర్మ్యాలు కానరాలేదు. దానికి కారణం అడిగితే, వాషింగ్ టన్ మెమోరియల్ స్థూపం కంటే మించి ఎత్తైన భవనాలు
నిర్మించరాదని చట్టం వుందని చెబుతారు.
తోకటపా:
వైట్ హౌస్ పైన ఎగురుతున్న అమెరికన్ జాతీయ పతాకం కిందనే
నలుపు తెలుపులో మరో జెండా ఎగురుతుంటుంది. యుద్ధాల్లో మరణించిన లేదా ఆచూకీ
తెలియకుండా పోయిన అమెరికన్ సైనికుల స్మృత్యర్ధం రూపొందించిన పతాకం అది.
(ఇంకా వుంది)




