రేడియో రోజులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రేడియో రోజులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, అక్టోబర్ 2015, మంగళవారం

రేడియో రోజులు



రేడియోలో పనిచేసేవారు ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన  వీ.వీ. శాస్త్రి (వేమూరి విశ్వనాధ శాస్త్రి) చెప్పిన ఆసక్తికర ఉదంతం ఇది.
ఆయన భోపాల్ లో పనిచేసేటప్పుడు  జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన  సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి  కె.పీ.ఎస్. మీనన్ ఏదో కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆ నగరానికి రావడం జరిగింది. ఆయన వద్ద గతంలో పనిచేసిన సంగ్లూ అనే అధికారి అప్పుడు భోపాల్ రేడియో కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన పూనికపై  వీ.వీ. శాస్త్రి వెళ్లి   మీనన్ ను కలుసుకుని  రేడియో కేంద్రానికి ఆహ్వానించారు. నిజానికి ఆయన మరునాడు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. అయినా, రేడియో మీది గౌరవంతో, సంగ్లూ మీది అభిమానంతో తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఆరోజు  రేడియో స్టేషన్ కు వచ్చిన మీనన్, మాటల సందర్భంలో తన అనుభవాలు కొన్ని చెప్పారు.
మీనన్ గారు  ఆరోజు చెప్పిన విషయాల్లో  ఒకటి మన రాష్ట్రానికి సంబంధించింది  కావడం వల్ల శాస్త్రి గారికి బాగా  గుర్తుండిపోయింది.

(కీర్తిశేషులు పండిట్ జవహర్  లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్)

“ భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  అనేక సంస్థానాలను  ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను  హైదరాబాదు పంపే విషయంలో  సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా  ఇలా అన్నారట.
‘ ఇండియన్  ఆర్మీ  ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.’
పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.

నెహ్రూ సంగతి చెప్పక్కర లేదు.

18, ఫిబ్రవరి 2013, సోమవారం

రేడియో రోజులు




ఆనాడు మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆ తరువాత మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.
ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్  అనాలా?)లో  ఇంటికి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది. అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి అంజయ్య గారు బయటకు వచ్చి కారెక్కుతూ అక్కడ గుమికూడిన జనంతో ముచ్చటిస్తూ నన్ను చూసి ‘ శ్రీనివాస్ ఈ పక్కనే కదా నీ ఇల్లు పోదాం పద’ అన్నారు. నాకు ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఇల్లు ఏ పరిస్తితిలో  తెలవదు. ఎందుకంటే పగలల్లా మా ఆవిడ ఇంట్లో ‘అమ్మవొడి’ పేరుతొ చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతుంది. కొంతమంది తల్లులు చాలా పొద్దుపోయిందాకా పిల్లల్ని తీసుకు వెళ్లరు. అలా ఆలోచించే లోపలే – అక్కడినుంచి మూడో ఇల్లే మాది – మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము. అప్పుడే వర్షం పడి రోడ్డంతా చిత్తడిగా వుంది. అందులో మేము వుండే వాటా ఇంట్లో  బాగా వెనగ్గా  వుంటుంది. గేటు తీసుకుని కొంతదూరం వెళ్ళాలి. వాన నీళ్ళు నిలవడంతో  ఎక్కడ గుంటవుందో ఎక్కడ చదునుగా వుందో తెలవడం లేదు. పైగా బయట లైటు లేకపోవడంతో వెలుతురు కూడా  లేదు. అలాగే ఇంట్లోకి వచ్చాము. అదృష్టం. కేర్ సెంటర్ పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా ఆవిడ అప్పుడే ఇల్లు తుడిచి బాగుచేసినట్టుంది. ఒక్క పెట్టున వచ్చిన అంతమందిని  చూసి ముందు కంగారు పడినా వెంటనే సంభాలించుకుంది. గోడకు ఆనించి  పెట్టిన ఇనుప కుర్చీలు మూడు వేసినా అవి ఎవరికీ  సరిపోయేలా లేవు. ఒక కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటే మిగిలిన రెండింటిలో మరో ఇద్దరు సర్దుకున్నారు. వాళ్ళే తరువాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరు  భవనం వెంకట్రాం కాగా రెండవవారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. మిగిలినవారందరూ నిలబడేవుండాల్సిన పరిస్తితి. వారిలో ఇద్దరు ముగ్గురు ఆనాటి మంత్రులు కూడా వున్నారు. మా ఆవిడ హడావిడిగా టీ కలిపి తెచ్చింది. కొందరికి కప్పుల్లో. మరికొందరికి స్టీలు గ్లాసుల్లో. సాసర్లు లేవు. వచ్చిన పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన ఆతిధ్యం(?) స్వీకరించి, మా పిల్లల్ని పలకరించి బయటకు వచ్చారు. మళ్ళీ కారెక్కేటప్పుడు అదే జనం. అసలు అంజయ్య గారంటేనే జనం. జనమే ఆయనకు ఆక్సిజన్. అయితే, ముఖ్యమంత్రిని అలా చెప్పాపెట్టకుండా ఇంటికి తీసుకువెళ్లడం భద్రతాదికారికి నచ్చినట్టులేదు. కార్లో కూర్చుంటూ ‘ఇదేం పద్ధతిగా లేదు’ అన్నాడు.
నాకు కోపం చర్రున లేచింది. ‘ఆయన్నేమన్నా బొట్టుపెట్టి  పిలిచానా?’ అనేశాను. ఆ వయసు అలాటిది. ఇప్పుడు తలచుకుంటే చిన్నతనం అనిపిస్తుంది.
ఏవయినా అవి బంగారు రోజులు.