మరణం అంటే ఏమిటి? – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మరణం అంటే ఏమిటి? – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జులై 2026, గురువారం

మరణం అంటే ఏమిటి? – భండారు శ్రీనివాసరావు

మహామహులే ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు. ఇది కూడా సరయిన జవాబు కాకపోవచ్చు
కానీ చాలా సంవత్సరాల క్రితం ఓ కధలోనో, నవలలోనో చదివాను.
“నువ్వు కూర్చునే కుర్చీ వుంటుంది. పక్కనే అతిధులు కూర్చునే సోఫాలు వుంటాయి. గోడమీద గడియారం వుంటుంది. టేబుల్ మీద టీవీ వుంటుంది. ఇంతెందుకు మీ ఇల్లు ఎలా వుండాలని అన్నీ అమర్చుకున్నావో అవన్నీ అలాగే వుంటాయి.
“ఒక్క నువ్వు తప్ప”
జిడ్డు కృష్ణ మూర్తి గారు మరో మాట చెప్పారు.
మరణ భయం అంటే కోరిక అని.
కోరిక తీరదేమో అనే సందేహమే భయంగా మారుతుంది అని వారి తాత్పర్యం.
ఒక విద్యార్థి పరీక్షలను లెక్కపెట్ట కుండా ఏడాది పొడుగునా అడ్డమైన తిరుగుళ్లతో కాలక్షేపం చేస్తాడు. పరీక్షలు దగ్గర పడేసరికి భయపడిపోతాడు, సరిగ్గా రాయలేనేమో అనే సందేహంతో. పరీక్ష పాసవాలి అనే కోరిక తీరదేమో అనే భయంతో. ఎందుకంటే పరీక్ష రాయడానికి అతడు సంసిద్ధంగా లేడు. అందుకు తగిన సన్నాహం చేసుకోలేదు.
అలాగే జీవితం అనే పరీక్ష రాయడానికి కూడా కొంత సంసిద్ధత కావాలి. అది లేకపోతే భయం వేస్తుంది.
ఇక్కడ పరీక్ష అంటే మరణం. మరణ కాలం దగ్గర పడుతుంటే మనసులో ఆందోళన మొదలవుతుంది. అప్పటిదాకా ఎందుకూ పనికిరాని లౌకిక విషయాలతో మమేకమై, సంపాదన యావలో మునిగిపోయి, ప్రాపంచిక ప్రలోభాలకు లోనయి అసలు జీవిత పరమార్థం ఏమిటో మరిచిపోతాడు మనిషి. అల్లరిచిల్లరగా తిరిగిన విద్యార్ధికి మల్లేనే మానవుడికి కూడా మరణం అంటే భయం వేస్తుంది. కోరికలు తీరకపోవడమే దానికి కారణం. బాగా శ్రద్ధగా చదివిన విద్యార్థి ఎలాంటి భయ సంకోచాలు లేకుండా పరీక్షకు తయారవుతాడు. కోరికలు లేని మనిషి కూడా మరణ భయానికి దూరం అవుతాడు.
కాబట్టి జీవితం అనే విలువైన సమయాన్ని మంచి పనులకు ఉపయోగిస్తే, మంచి విద్యార్ధికి పరీక్ష భయం లేనట్టే మంచి మనిషికి కూడా మరణ భయం మాయమై పోతుంది.