(PUBLISHED IN 'SURYA' ON 20-11-2016, SUNDAY)
ఎదుటి దృశ్యం సరిగా కనబడాలంటే కంటి
చూపు తేటగా వుండాలి. కంటికి పెట్టుకున్న అద్దాలను బట్టి కూడా ప్రపంచం కానవచ్చే తీరు మారుతూ వుంటుంది.
పెద్ద నోట్లను చెలామణీ లోనుంచి
తప్పిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా సాగుతున్న చర్చల
సరళి ఇందుకు చక్కని ఉదాహరణ. ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలోనూ మోడీ నిర్ణయానికి
అనుకూలంగా, ప్రతికూలంగా వెల్లువెత్తుతున్న వ్యాఖ్యానాలు ఒక విషయాన్ని స్పష్టం
చేస్తున్నాయి. అనుకూలంగా మాట్లాడే వాళ్ళు మోడీ పట్ల అవ్యాజానురాగాలతో కూడిన స్వామి
భక్తిని ప్రదర్సిస్తుంటే, వ్యతిరేకులు పూర్తిగా మోడీ పట్ల తమకున్న నిరసన భావాన్ని
వ్యక్తం చేయడానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. ఎటువంటి రాగద్వేషాలు లేకుండా
విషయాన్ని అవలోకన చేసేవారికి ఉభయ పక్షాల వాదనలు ఒకరకంగా సరయినవే అనిపిస్తున్నాయి,
అదే సమయంలో వాటిల్లో డొల్లతనమూ కానవస్తోంది.
నల్ల ధనం రాకాసి విషపు కోరలనుంచి
దేశాన్ని విముక్తం చేయడానికి మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదే. ఈ విషయంలో మమత బెనర్జీ వంటి
కొద్దిమందికి మినహా అందరిదీ ఏకాభిప్రాయమే. అనేకుల అసహనం, ఆవేశం ఈ నిర్ణయం అమలు
చేసిన తీరుపట్లనే. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా ప్రభుత్వం తీసుకుంటున్న
అనేకానేక దిద్దుబాటు చర్యలే ఇందుకు
సాక్ష్యం. ఈ చర్యలు మరో విషయాన్నీ అన్యాపదేశంగా తెలియచేస్తున్నాయి. అదేమిటంటే,
అత్యంత ప్రభావిత నిర్ణయం తీసుకునే ముందు తగిన ముందు జాగ్రత్త చర్యలు గురించి
ప్రభుత్వం ఆలోచన చేయలేదని. ఎవరు విభేదించినా, విమర్శించినా ఈ ఒక్క విషయంలోనే.
దురదృష్టం ఏమిటంటే ఈ కోవకు చెందిన సద్విమర్శకులను కూడా జాతి వ్యతిరేకుల గాటనకట్టేసే
ప్రయత్నం మరింత దురదృష్టకరం. ఇక నిర్ణయానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలు కూడా
లక్ష్మణ రేఖను దాటుతున్నాయి. మోడీని వ్యక్తిగతంగా చిన్నబుచ్చే రీతిలో ఇవి సాగుతుండడం
మరో దురదృష్టకర పరిణామం. ఈ రెండు విభిన్న వాదనల్లో అయితే భజనలు, లేకపోతె ఖండనలు మినహా తార్కిక దృష్టి పూర్తిగా లోపిస్తోంది. విచక్షణ పక్కకు తప్పుకుని
అభిమానదురభిమానాలు వెర్రితలలు వేస్తున్నాయి.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే శ్రీ
దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తూ గతంలో
శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.
“ఈ ఏడాది (2016) సెప్టెంబరు నుంచి వచ్చే సంవత్సరం (2017) జనవరి వరకు దేశానికి సంక్షుభిత సమయం. ప్రజలు, ప్రత్యేకించి రాజకీయ నాయకులు సంయమనం పాటించాల్సిన అగత్యం వుంది”
హైదరాబాదులో కార్తీక మాసం కోటి దీపోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా స్వామి
మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. “అంశం ఏదైనా సరే, రాజకీయ నాయకులు
ఆచితూచి మాట్లాడ్డం మంచిద”ని ఆయన మరోమారు హితవు పలికారు.
కొద్ది రోజులు ఓపిక పడితే అంతా
సర్దుకుంటుందని ప్రభుత్వ పెద్దలు కూడా
చెబుతున్నారు. మంచిదే! సంయమనం ఎప్పుడూ మంచిదే. ఎవ్వరూ కాదనరు.
ఎదుటి దృశ్యం సరిగా కనబడాలంటే కంటి చూపు తేటగా వుండాలి. కంటికి పెట్టుకున్న అద్దాలను బట్టి కూడా ప్రపంచం కానవచ్చే తీరు మారుతూ వుంటుంది.