ఊణషాణ మాసికం
సరిగ్గా రెండేళ్ల క్రితం, జులై 21.
ఒక మనిషి చనిపోయిన తర్వాత ముందు రోజులు, తర్వాత నెలలు, ఆ పిదప సంవత్సరాలు (దిన, మాస, వార్షికాలు) ఇలాంటి లెక్కలు. బతికి వున్న రోజుల్లో భారంగా గడిచిన కాలం, పోయిన తర్వాత జవనాశ్వం మాదిరిగా పరుగెడుతుంది.
ప్రేత సంబంధ కర్మలు అయినా, యాగ సంబంధ క్రతువులు అయినా నమ్మకం ప్రధానం అనేది నా నమ్మకం. నా తల కొరివి పెట్టాల్సిన వాడికి నేనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి 2024 ఫిబ్రవరిలో నాకు ప్రాప్తించినప్పుడు నా మనసు నా మనసులో లేదు. ఏదో కలలో జరుగుతున్న విధంగా అన్నీ సశాస్త్రీయంగా జరిగిపోయాయి, నా అన్నగారు భండారు రామచంద్ర రావు గారు, పెద్ద కుమారుడు సందీప్ పర్యవేక్షణలో.
ఆనాడు శ్రాద్ధ కర్మలకు నేతృత్వం వహించింది వసిష్టుల వారు శ్రీ సి.హెచ్. యు.ఎస్. ప్రసాద శర్మ గారు. వాటిల్లో భాగంగా నా చేత అనేక దానాలు చేయించారు. కర్మలలో భాగంగా చేసే ప్రతి విధి విధానానికి సవివరమైన విశేషాలు వివరిస్తూ నా చేత కర్మకాండ పూర్తి చేయించారు. నమ్మడం నమ్మకపోవడం నమ్మే వారి నమ్మకాలను బట్టి వుంటుంది.
మరణించిన మనిషి తాలూకు జీవి సంవత్సరం పాటు వేలాది మైళ్ళు ప్రయాణిస్తుందని, ఆ ప్రయాణంలో జీవుడు అనేక రకాల ఈతి బాధలకు గురవుతాడని, ఎర్రటి ఎండల్లో, వానల్లో, దుర్గమ మార్గాల్లో ఆ ప్రయాణం సాగుతుందని, ఉపశమనంగా ఉండడానికి గొడుగు, పాదరక్షలు, వంట దినుసులు, కాయగూరలు, వంట పాత్రలు, నీళ్ళ పాత్ర, చెంబు వగైరాలు దానాలుగా ఇప్పించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో, 45 వ రోజున (త్రిపక్షం), 171 వ రోజున జీవుడు మరింత శ్రమకు గురవుతాడు. అంచేత ఈ రోజుల్లో కూడా తప్పనిసరిగా మాసికాలు పెట్టాలి.
జీవించి వున్న వారికి ఒక మాసం మరణించినవారికి ఒక రోజుతో సమానం కనుక నెలకోసారి మాసికం పెట్టి పిండ ప్రదానం చేస్తే, వారికి ప్రతిరోజూ భోజనం పెట్టినట్టు అవుతుందని ఓ నమ్మకం. ఇలా పన్నెండు నెలలు గడిచిన తర్వాత ఏడాది చివర్లో పెట్టే హూణ మాసికం, సాంవత్సరీకం, ఆబ్దీకంతో ఈ కర్మ కాండ పూర్తవుతుంది. జీవుడి పాప పుణ్యాల ప్రాతిపదికన పునర్జన్మ, లేదా స్వర్గ, నరక లోక ప్రాప్తి నిర్ధారణ అవుతుంది.
ఈ విషయాలు అన్నీ శర్మగారు సవిస్తరంగా నాకు అప్పుడే తెలిపారు.
కానీ అప్పుడు నా గుండె, మనసు, శరీరం అన్నీ ఘనీభవించి వున్నాయి.
ముందే చెప్పినట్టు అంతా నమ్మకం.
చనిపోయింది స్వయంగా నా రెండో కుమారుడు. నా ఇహ లోక ప్రయాణం సజావుగా సాగడానికి వాడు బతికి వున్నప్పుడు ఎన్నో ఎన్నో చేశాడు. పై లోక ప్రయాణంలో వాడికి ఇబ్బందులు రావు అని నమ్మకంగా చెబుతున్నప్పుడు, నమ్మకంగా పాటించక తప్పదు. అదే చేశాను.
అసలు ఈ చెప్పులూ, గొడుగులు మనిషి జీవితంలోకి ఎలా ప్రవేశించాయి? దానికీ పురాణాల్లో సమాధానం వుంది. సావధానంగా చిత్తగించండి.
"ఇదిగో బాణం విడిచిపెడుతున్నా! " శరాన్ని సంధించి జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి వైపు చూశాడు.
"ఊ"
"చాలా దూరం వెడుతుంది సుమా!"
"ఎంత దూరం వెళ్లినా తేగలను."
"అలాగేం? సరే! చూడు మరి."
జమదగ్ని బాణం విడిచాడు. రేణుకా దేవి పరుగెత్తింది.
ఒకరోజు వాళ్లిద్దరికి సరదాగా ఆటపాటలతో గడపాలని బుద్ధి పుట్టింది. అందుకే పొద్దున్నే బాణాలూ, విల్లూ తీసుకుని బయలుదేరారు. చాలా దూరం నడిచి ఒక ఆరు బయలు ప్రదేశం చేరుకున్నారు.
జమదగ్ని బాణాలు వేయడం, ఆమె పరుగెత్తి ఆ బాణం ఎక్కడ పడిందో కనుక్కుని తెచ్చి ఇవ్వడం .. ఇదీ ఆట.
ఆ ఆట ఇద్దరికీ నచ్చింది.. కాని జమదగ్నికి జాలేసింది తన భార్య కనుక్కోగలదో లేదో అని.
"ఇదిగో బాణం తెచ్చాను!" అని నవ్వుతూ అందించింది రేణుకా దేవి.
అలా జమదగ్ని బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఆమె కనుక్కుని తెస్తూనే ఉంది. కాని ఒకసారి అలా వెళ్లిన రేణుకా దేవి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. జమదగ్ని చాలా సేపు ఎదురు చూశాడు. చివరికి నీరసంగా , మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది.
"రేణుకా! ఏమైంది ఈసారి ఆలస్యం చేసావు?"
" అదిగో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్ళు బొబ్బలెక్కి ఆయాసంగా ఉంటే కాస్సేపు ఒక చెట్టు కింద కూర్చుని వస్తున్నాను."
అలిసిపోయి ముఖం మీది చెమటను చీర చెంగుతో తుడుచుకుంటున్న రేణుకా దేవిని చూసి జమదగ్ని బాధపడి " ఈ సూర్యుడు నిన్ను ఇంతగా బాధపెట్టాడా? అతని పని చెప్తానుండు " అంటూ కోపంతో సూర్యుడివైపు అస్త్రం సంధించాడు.
ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబ గబా వచ్చి ఆయన చేతిని పట్టుకున్నాడు.
"మహర్షీ! శాంతించు. సూర్యుడు లేకుండా ముల్లోకాలు నిలుస్తాయా? ఆలోచించు."
"నాకు అదంతా తెలీదు. సూర్యుడు నా భార్యను బాధపెట్టాడు. అతను శిక్ష అనుభవించి తీరాలి" అని గర్జించాడు.
మరుక్షణమే ఆ బ్రాహ్మణుడు "అయ్యా! నన్ను క్షమించు. నేనే సూర్యున్ని. దయ చూపుము" అని ప్రార్ధించాడు.
ఆ వెంటనే చెప్పులు, గొడుగూ సృష్టించి " ఇవిగో! ఈ పాదరక్షలు ధరించి, ఈ చత్రముతో శిరస్సుకు నీడ పడితే, నా వేడి సోకదు. ఇవి తల్లి రేణుకా దేవికి ఇవ్వండి" అని జమదగ్ని మహర్షికి సమర్పించుకున్నాడు.
అది చూసి జమదగ్ని శాంతించాడు. సూర్యుడు అంతర్ధానమయ్యాడు.
ఆ గొడుగును , చెప్పులనూ చూసి ప్రజలంతా కూడా సంతోషించారు. తాపసుల కోపం కూడా లోకకళ్యాణానికే దారితీస్తుందనే నానుడిని నిజం చేస్తూ రకరకాలుగా గొడుగులూ, చెప్పులనూ తయారు చేసి వినియోగించడం ప్రారంభించారు.
సూర్యుడి చేత సృష్టించబడినవి గనుక అవి పవిత్రమైనవి. వాటిని సజ్జనులకు, బీదసాదలకు, సాధువులకు దానం చేస్తే చాలా పుణ్యం. అవి చాలా పవిత్రమైనవి కాబట్టి పెళ్ళిళ్ళలో, పితృకార్యాలలో కూడ వినియోగిస్తారు.
(ఇంకావుంది)