గాలితో నేల అన్నది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గాలితో నేల అన్నది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జూన్ 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (319) : భండారు శ్రీనివాసరావు

 

గాలితో నేల అన్నది, నను తాకరాదనీ..

ఈ పాటలో చెప్పినట్టు కరోనా అనే భయంకరమైన వ్యాధి
ఒకింటిలో నివసించే మనుషులనే ఒకరినొకరు తాకకుండా విడతీసింది. పొరుగువారినే దూరం చేసింది.
ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి, ఆత్మీయులను అనేక మందిని దూరం చేసి, రెండు దశల్లో తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించిన ఆ రోజులను మరవడం కష్టం.
2020 సంవత్సరం.
అప్పటికే కరోనా మొదటి దశ మొదలైంది. దేశం లాక్ డౌన్ లోకి వెళ్లి పోయింది. మరీ భయంకరమైన రెండో దశ ఇంకా మొదలు కాలేదు. కానీ అప్పటికే తన ప్రతాపాన్ని, ప్రభావాన్ని దేశ వ్యాప్తంగా చూపి, ప్రజలకు, ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా వణికిస్తోంది.
మే నెలలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫోను రింగయింది.
“భండారు శ్రీనివాసరావు గారా! లైన్లో వుండండి, వైస్ ప్రెసిడెంటు గారు మాట్లాడుతారు”
వెంకయ్య నాయుడు గారు దేశంలో చాలామందికి ఇలా ఫోను చేసి మాట్లాడుతున్నారని తెలుసు, కానీ ఆ ఫోను నాకు వస్తుందని ఊహించలేక పోయాను. ఇంతలోనే నాయుడు గారు లైన్లోకి వచ్చారు.
“శ్రీనివాసరావు గారు ఎలా వున్నారు? నేను వెంకయ్య నాయుడిని”
“నమస్కారం సార్! నేను బాగున్నానండీ! మీరెలా వున్నారు?”
“నేను బాగానే వున్నాను. మీ ఆవిడ చనిపోయిన తర్వాత ఫోను చేసి మాట్లాడలేకపోయాను, వెరీ సారీ”
“..........”
“హైదరాబాదులో మన మిత్రులందరూ కులాసానే కదా!”
“అందరూ బాగున్నారండీ. నాకు అర్ధం కాని విషయం అండీ. పేపర్లో చదివాను. మీరు ఈ కరోనా సమయంలో ఇలా అందరితో ఫోను చేసి మాట్లాడుతున్నారని. ఇంత తీరిక ఎలా దొరికింది”
“ఇలాంటి సమయాల్లోనే కదా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కోవాల్సింది”
“....................”
“ఇక్కడ నేను నా భార్య ఇద్దరమే. పిల్లలు దగ్గర లేరు. బహుశా పెళ్ళయిన తర్వాత ఇలా ఇద్దరం ఒక్కచోట ఇన్నాళ్ళు కలిసివుంది ఇప్పుడేనేమో”
“చాలా సంతోషంగా వుందండీ మీతో మాట్లాడడం”
“నాకూ అలానే వుంది. అందరం పెద్ద వయసులో పడ్డాం. ఆరోగ్యం జాగ్రత్త! వుంటాను శ్రీనివాసరావు గారు”
తర్వాత సిగ్గనిపించింది. ఈ కరోనా సమయంలో నేనూ ఖాళీనే. కానీ ఎంతమంది స్నేహితులను పలకరించగలిగాను. నా ఈ ప్రశ్నకు నా దగ్గరే జవాబు లేదు.
అలాగే అదే సంవత్సరం అదే నెలలో మరో రోజు.
“నా పేరు రజనీష్ శర్మ, సిమ్లా రాజ్ భవన్ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నర్ సాబ్ మీతో మాట్లాడుతారు లైన్లో వుండండి” అన్నాడో వ్యక్తి స్వచ్చమైన హిందూస్థానీలో.
కాసేపటి తర్వాత బండారు దత్తాత్రేయ గారు లైన్లోకి వచ్చారు.
“ఏం శ్రీనివాస్ ఎలా వున్నారు” అని పలకరించారు సాదరంగా. కానీ గొంతు చాలా మార్దవంగా, పీలగా వినబడింది.
“మీ ఆరోగ్యం ఎలా వుంది” నా పరామర్శ.
“బాగానే వున్నాను. కాకపోతే తెలిసిన వాళ్ళు అందరికీ దూరంగా ఇలా’
అప్పుడు ఆర్ధం అయింది ఆయన ఎందుకు అంత నీరసంగా అనిపించారో.
అంజయ్య గారికి, దత్తాత్రేయ గారికి చుట్టూ జనం వుండాలి. గొప్ప గొప్ప వాళ్ళు కాదు. సాధారణ జనం. వాళ్ళ మధ్యలో వుంటేనే వాళ్లకు అదే ఆక్సిజన్. వాళ్ళతో మాట్లాడుతూ వుంటే అదే టానిక్కు.
లాక్ డౌన్ పరామర్శలు పూర్తయిన తర్వాత ఆయన పాత రేడియో రోజులను గుర్తు చేసుకున్నారు.
“నన్ను చాలామంది అడిగేవారు, ఆ రేడియో శ్రీనివాసరావు (భండారు) మీకేమైనా చుట్టమా అని. నేను చెప్పేవాడిని, ఆయన నా కుటుంబ సభ్యుడు అని. ఆ రోజులు నిజంగా వేరు. విలేకరులు అందరూ నన్ను ప్రేమించేవారు. అభిమానించేవారు, నిజంగా వారికి నేను చేసింది ఏమీ లేదు, అప్పుడప్పుడూ రైలు టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించడం తప్ప” దత్తాత్రేయ గారు చెప్పుకు పోయారు.
నిజమే. ఆయన రైల్వే మంత్రిగా వున్నప్పుడు మాలో ఎవరం రైల్వే రిజర్వేషన్ల కోసం ఇబ్బంది పడలేదు. నిజానికి ఆయన్ని మేమే చాలా ఇబ్బంది పెట్టి ఉంటాము. ఆయన వ్యక్తిగత సహాయకుడు కైలాష్ నగేష్ కి ఫోను చేసేవాళ్ళం. అంతే! కాసేపట్లో బోగీ నెంబరు, బర్త్ నెంబరు వచ్చేసేవి. బండారు దత్తాత్రేయ గారికి నగేష్ నమ్మిన బంటు. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కాగానే హైదరాబాదు నుంచి సిమ్లాకు వెంటబెట్టుకుని వెళ్ళింది నగేష్ నే. దత్తాత్రేయ గారి లాగే నగేష్ కు కూడా ప్రజాసంబంధాలు ఎక్కువే. అందరికీ చేతనయినంత సాయం చేయాలనే మనస్తత్వం.
కాసేపు మాట్లాడిన తర్వాత దత్తాత్రేయ గారు చెప్పారు, హైదరాబాదులో మన మిత్రులను అందరినీ అడిగినట్టు చెప్పమని. మర్యాదకు అలా అన్నారు కానీ నాకు తెలుసు ఆయనే ఫోను చేసి వాళ్ళని పలకరిస్తారని. నేను అనుకున్నట్టు ఆయనే చెప్పారు.
“మన కృష్ణారావు (ఆర్వీవీ కృష్ణారావు, ఆలిండియా రేడియో మాజీ న్యూస్ ఎడిటర్)తో కూడా మాట్లాడాను. నేనూ ఆయనా రాం నగర్ లో వుండేవాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో మార్నింగ్ వాక్ లో కలుస్తుండేవాళ్ళం”
బండారు దత్తాత్రేయ గారు ఒకసారి సికిందరాబాదు నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ ఆకాశవాణి వాళ్ళు ఆయన వాయిస్ అడిగారు. నగేష్ ని రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా రాత్రి పదకొండు దాటిన తర్వాత ఆయన్ని వెంటబెట్టుకుని రేడియో స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఎన్నికల ఫలితాలు కదా, మాకు ఇరవై నాలుగు గంటల వార్తాప్రసారాలు నడుస్తున్నాయి. ఇళ్ళకు పోకుండా ఆఫీసులోనే వుండి పనిచేస్తున్నాము. ఆయన ఢిల్లీ ఇంటర్వ్యూ వెంటనే అయిపోయింది. లైవ్ కాబట్టి ఆయన కూడా విన్నారు. మేము మా పనిలో పడ్డాము.
పొద్దుటి నుంచి బాగా అలసిపోయినట్టున్నారు. న్యూస్ రూమ్ కుర్చీలోనే కాసేపు అలా పడుకుండి పోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి వెళ్ళిపోయారు. అంత సాదా సీదా మనిషి.
“ఇదిగో ఈ లాక్ డౌన్ అవగానే హైదరాబాదు వస్తాను, అప్పుడు కలుద్దాం” అన్నారు దత్తాత్రేయ గారు ఆప్యాయంగా.
“లేదా మీరే సిమ్లా వద్దురు కానీ” అనేసారు వెంటనే.
నూటికి నూరుపాళ్ళు జనం మనిషి. సందేహం లేదు.
మూడు రోజుల కింద బండారు దత్తాత్రేయ గారు రాసిన ఆయన ‘ప్రజల కధే నా ఆత్మ కధ’ అనే ఒక పెద్ద బౌండ్ పుస్తకం మా ఇంటికి చేరింది. పేజీలు తిరగేసి చదివే పుస్తకం కాదు, ప్రతి పేజీ శ్రద్ధగా చదవాల్సిన పుస్తకం. అందుకే తీరికగా చదువుతున్నాను. కొన్ని చాప్టర్లు పూర్తయ్యాయి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) నాకు చిన్ననాటి నుంచీ తెలుసు. అందులో దిగువ స్థాయి నుంచీ పనిచేసిన ఒక కార్యకర్తగా దత్తాత్రేయ గారు రాసిన విషయాలు చదివితే ఒకానొక కాలంలో ఆ సంస్థ నిర్వహించిన కార్యకలాపాలు నివ్వెర గొలిపేలా వున్నాయి అనిపిస్తుంది.
ఈ మధ్య పది రోజుల క్రితం ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి కార్యక్రమంలో కలిసినప్పుడు, వెంకయ్య నాయుడు గారు, నేను అడిగితే చెప్పారు, మా శర్మ గారు రాస్తున్న తన జీవిత చరిత్ర కూడా ముద్రణా దశలో వుందని, త్వరలో విడుదల అవుతుందని.
వీరిద్దరూ ఒక రాజకీయ పార్టీకి చెందిన వారయినా, వారి జీవితాలతో తెలుగు వారి చరిత్రలో చాలా భాగం ముడిపడి వుంది. అవి చదవడం ద్వారా మనం మన గతంలోని కొన్ని వెలుగు చూడని విషయాలు తెలుసుకోవచ్చు.
నేను గ్రహించిన నీతి:
అవసరం పడ్డప్పుడు మనుషులు గుర్తుకు రావడం సహజం. కానీ అధికారంలో వున్నప్పుడు, పెద్ద పదవిలో వున్నప్పుడు మనుషులను గుర్తు పెట్టుకోవడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో వీరిరువురూ వున్నారు.


With Shri M.Venkayya Nayudu








(ఇంకా వుంది)