హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఒక సుడాన్ దేశీయుడిని అధికారులు ఎబోలా వ్యాధి సోకిన రోగిగా గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా అతడిని గాంధీ వైద్య శాలకు తరలించి ఐసోలెషన్ లో వుంచి రక్తపు నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం వాటిని పుణే పంపినట్టు ఒక వార్త టీవీ ఛానల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ ఏమిటి ఈ ఎబోలా?
తెలుసుకోవాలంటే ఒక పుష్కర కాలం వెనక్కి పోవాలి.
ఆ రోజుల్లో ప్రపంచ జనాభాలో అత్యధికులను ఓ మూడక్షరాల పదం వణికించింది. 'ఎబోలా' అనే వ్యాధి చాప కింది నీరులా వ్యాపిస్తోందని ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించిందంటే పొంచివున్న పెను ముప్పు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఎబోలా అనే పేరు గల వ్యాధి ఒకటి వుందని కొన్నేళ్ళ ముందు వరకు అనేక దేశాలకు తెలియనే తెలియదు. ఇది సాధారణ వ్యాధి కాదనీ, చాలా ప్రమాదకరమైనదనీ, ప్రాణాంతకమైనదనీ వైద్య నిపుణుల హెచ్చరికలు. గతంలో గడగడలాడించిన స్వైన్ ఫ్లూ వ్యాధి గాలి ద్వారా వ్యాపించేది. అయితే ఎబోలా వైరస్ అంతకంటే చురుగ్గా త్వరగా పాకిపోతుంది. ఈ వ్యాధి యెంత త్వరగా తేలిగ్గా వ్యాపిస్తుందంటే, ఎబోలా రోగిని తాకినా, లేదా ఆ రోగి చెమట చుక్క ఇతరులపై చిందినాకూడా వారికి ఈ వ్యాధి వైరస్ సోకుతుంది.
పశ్చిమాఫ్రికా దేశాల్లో వేలాదిమంది ఈ వ్యాధి కారణంగా అసువులు బాశారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా దేశాలను కూడా ఈ వ్యాధి విడిచిపెట్టలేదు. ఆ దేశాలలోని వైద్య నిపుణులకు ఎబోలా పెను సవాలుగా మారుతూ, అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
ఎబోలా అనేది కొత్త వ్యాధి. ఈ వ్యాధి వైరస్ ఎలా వ్యాపిస్తుందో కనుక్కోగలిగారు కాని దీన్ని అరికట్టే వాక్సిన్ కానీ ఔషధాలను కానీ కనుగొనలేదు. కేవలం రోగిని తాకడం ద్వారా వ్యాపించే గుణం ఉండడంతో ఈ వ్యాధికి చికిత్స చేయగల వైద్య సిబ్బంది కూడా కరువయ్యారు. ఎబోలా వ్యాధిని అరికట్టడంలో పశ్చిమాఫ్రికా దేశాలు ఎదుర్కున్న ప్రధాన సమస్య ఇదే. రోగ లక్షాలను తెలుసుకుని రోగిని గుర్తించడం ఒక సమస్య అయితే, ఆ రోగికి వైద్య సహాయం అందించే సిబ్బందిని వెతికి పట్టుకోవడం మరో సమస్య.
అయితే ఈ సమస్యకు సమర్ధవంతమైన పరిష్కారం కనుగొన్న దేశం ఒకటి వుంది. ఎబోలా అనే ఈ మూడక్షరాల మహమ్మారికి క్యూబా అనే రెండక్షరాల దేశం ముకుతాడు వేసే పనికి పూనుకుంది. ఇంకో విశేషం ఏమిటంటే ఆ వ్యాధి ఇంతవరకు ఆ దేశంలో పొడసూపలేదు.
ఈ వ్యాధి పొటమరించిన ఆఫ్రికా ఖండానికి కొన్ని వేల మైళ్ళ ఆవల వున్న దేశం అయినప్పటికీ, క్యూబా తన బాధ్యతగా ఎబోలా వ్యాధి పీడిత దేశాలకు అండగా నిలిచింది. ఈ విషయంలో క్యూబా నిర్వహించిన పాత్ర అనితర సాధ్యం. ఈ కితాబు ఇచ్చింది ఎవరో కాదు. క్యూబా పొడకూడా గిట్టని అమెరికాలోని ప్రధాన వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్. మిగిలిన దేశాలన్నీ వ్యాధి పట్ల గుండెలు బాదుకుంటూ, చేతులు కట్టుకుని కూర్చుంటే క్యూబా మాత్రం తన వంతు సాయంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బందిని ఈ వ్యాధి పీడిత దేశాలకు సాయంగా పంపింది. వాస్తవానికి ఈ వ్యాధి వేలాదిమందికి సోకినా వారిలో అధిక సంఖ్యాకులు రోగులకు వైద్యసాయం అందించిన సిబ్బందీ డాక్టర్లే కావడం విశేషం. చికిత్స అందించేవారే రోగం బారిన పడుతూ ఉండడంతో సాయం అందించేవారి కొరత ప్రధాన సమస్యగా మారింది. క్యూబా ఈ విషయంలో గణనీయమైన సేవా పాత్ర పోషించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక శ్లాఘించింది.
పశ్చిమాఫ్రికా దేశాలు ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన క్యూబా తక్షణం స్పందించి తన వైద్య బృందాలను, అవసరమైన మందులను హుటాహుటిన ఆదేశాలకు తరలించింది. సొంత దేశంలోని వైద్యులే సాయం చేయడానికి తటపటాయిస్తున్న తరుణంలో క్యూబా అందిస్తున్న ఈ ఆపన్న హస్తం ఆ దేశాలకు వరప్రసాదంగా మారింది. రోగులకు చికిత్స అందిస్తూ వైరస్ సోకిన వారిలో క్యూబన్ వైద్య సహాయక బృంద సభ్యులు కూడా వున్నారు. అయినా వారు వెరవకుండా సహాయక చర్యల్లో పాల్గొనడం ఆ దేశాలవారిని నివ్వెరపరిచింది.
ఈ క్యూబా కధనం అలా ఉంచితే, మన దేశంలో పరిస్తితి వేరే! 'సమస్య ఎదురయినప్పుడు చూసుకుందాం, ఇప్పటినుంచీ ఎందుకు లాయిలాసా' అనేవాళ్ళు ఎక్కువున్న దేశం కాబట్టి ఎబోలా గురించి ఆందోళన పడేవాళ్ళు తక్కువనే చెప్పాలి.
ఎబోలా అనేది ప్రాణాంతక వ్యాధి అని ముందే చెప్పుకున్నాం. రక్తం, చెమట, లాలాజలం ద్వారా ఆ వైరస్ త్వరితగతిన ఇతరులకు సోకుతుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట, కీళ్ళ నొప్పులు, కడుపు నొప్పి, ఆకలి మందగించడం ఈ వ్యాధి లక్షణాలు. అయితే ఇవన్నీ షరా మామూలుగా జనాలకు అలవాటయినవే. ఈ లక్షణాలు వుంటే వారికి ఈ వ్యాధి సోకినట్టుగా కంగారు పడనక్కరలేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యుల సలహా. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని, పరిసరాల్ని పరిశుభ్రంగా వుంచుకోవాలనీ, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనీ వాళ్ళు చెబుతున్నారు. ఇవన్నీ మామూలుగా చెప్పే విషయాలే కావడంవల్ల జనం అంతగా పట్టించుకునే అవకాశాలు కూడా వుండవు. కాకపోతే ఈ వ్యాధి తీవ్రత పట్ల అవగాహన పెంచడం అవసరం. ఎందుకంటె ఒకసారి ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయితే ఇక ఆ రోగి మరణానికి చేరువ అయినట్టే అన్నది వైద్యులు చేసే హెచ్చరిక. చెవులు, ముక్కు, దేహంలోని ఇతర బాహ్య రంధ్రాల ద్వారా అపరిమితమైన రక్తస్రావం జరిగి రోగి, కొన్ని వారాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు అనేది వాళ్ళు చెప్పే మరో బహుపరాక్.
అయితే అదృష్టవశాత్తు ఈ ఎబోలా పెద్ద జననష్టం కలిగించ కుండానే ఆ రోజుల్లో నిశ్శబ్దంగా తప్పుకుంది. బహుశా తనను మించిన మరో భయంకర వ్యాధి మరో పదేళ్ళలో యావత్ ప్రపంచాన్ని స్తంభింప చేయబోతోందని ఎబోలాకు ముందే తెలుసేమో మనకు తెలియదు.
తోకటపా:
కరోనా మన్ కి బాత్
కరోనా రాకచూసి మిగిలిన వ్యాధులన్నీ సర్దుకు కూర్చున్నాయి.
‘ఏమిటలా వున్నావు’ ధైర్యం చేసి అడిగింది కలరా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.
‘ఎలా ఉండను? నిన్న మొన్నటిదాకా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించానని విర్రవీగాను’
‘ఇప్పుడు మాత్రం ఏమైంది? నీ నామ స్మరణ చేయకుండా భూలోకవాసులకు క్షణం గడవడం లేదు కదా!’ అన్నది హెచ్.ఐ.వి.
‘నేనూ అలాగే అనుకున్నాను. ఈ సృష్టి ప్రారంభం అయిన తర్వాత యావత్ ప్రపంచ ప్రజల నోళ్ళలో నా పేరు ఎన్ని కోట్లమారు మారుమోగుతున్నదో చూసి నేనూ పులకరించిపోయాను. వాళ్ళు నా పేరు వింటేనే ఎంతగా భయపడుతున్నారో కళ్ళారా చూసి పొంగిపోయాను. కానీ అది భయం కాదనీ, వాళ్ళు నాతో పరాచికాలు ఆడుతున్నారనీ ఇపుడిప్పుడే గ్రహింపుకు వచ్చి సిగ్గుపడుతున్నాను’
‘అదేమిటే అలా అంటున్నావు. నువ్వు కదా మా అందర్నీ చూస్తుండగానే మించిపోయావు. నీ పేరు వింటేనే వణికిపోయేలా మానవుల్ని మార్చగలిగావు అని మేమిక్కడ అసూయతో రగిలిపోతుంటే, ఏమిటిది ఇలా నీ ఈ మాటలతో మమ్మల్నిలా మళ్ళీ సంతోషపెడుతున్నావు’ అంది ఎబోలా.
‘అలానా! నేను రంగ ప్రవేశం చేసిన తర్వాత మీకెవ్వరికీ సరైన పనిపాటలు లేకుండాపోయాయి కదా! ఆ ఖాళీ టైములో మీరు కాస్త పత్రికలు చదివితే, కొంచెం టీవీలు చూస్తే విషయం బోధపడేది’
‘పత్రికలూ, టీవీలు అంటూ మమ్మల్ని భయపెట్టకు. మేము ఇంతమందిమి కలిసి చేయలేని అపకారాన్ని అవి ఒంటిచేత్తో మానవాళికి చేస్తున్నాయి. అసలేం జరిగిందో నువ్వే చెప్పు, వింటాం’ అంది కేన్సర్.
‘మనుషులకు చావు భయాన్ని మించిన భయం వుండదు అనే ధీమాతో నేను భూలోకంలో అడుగుపెట్టాను. మొదట్లో నా అభిప్రాయం నిజమే అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు మళ్ళీ తమ మునపటి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చావు ముంగిట్లో వుందని తెలిసి కూడా చిన్నారులపై లైంగిక దాడులు చేస్తూనే వున్నారు. చనిపోతే కట్టుకుపోయేది ఏమీ ఉండదని తెలిసికూడా ఆన్ లైన్ మోసాలతో ఇతరులని దోచుకుంటూనే వున్నారు. కరోనా బారిన పడితే రేపు మనది కాదు అనే భయం ఎటు పోయిందో తెలవదు ఎప్పుడో మూడేళ్ళకు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎలాగా, ప్రత్యర్ధిని ఓడించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే వున్నాయి. భూఆక్రమణలు మునుపటి కంటే ఎక్కువయ్యాయి. డబ్బు పోగేసుకోవడం ముమ్మరమయింది. మరణ భయంతో జనంలో అత్యాశ లేకుండా పోతుంది అనుకుంటే ఆ కక్కుర్తి మరీ ఎక్కువయింది. తింటున్నారు, తాగుతున్నారు, క్వారంటైన్లలో చిందులేస్తున్నారు. వైద్యం చేయడానికి లక్షలు గుంజుతున్నారు. చనిపోతే శవాన్ని అప్పగించడానికి డబ్బులు లాగుతున్నారు. నిజం చెప్పాలంటే నా రాకకు ముందుకంటే కూడా ఇప్పుడు ప్రపంచం మరీ పాడయిపోయింది.
‘ఇన్నిరోజుల అనుభవంతో చెబుతున్నా వినండి. కరోనా అంటే భయం కంటే డబ్బు అంటే మమకారమే వాళ్లకు ఎక్కువ అని తేలిపోయింది’
ఇతి వార్తాః