14, జూన్ 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (326) : భండారు శ్రీనివాసరావు

 

భార్య చనిపోతే బతకలేరా?

 

ఎందుకు బతకలేరు, బతుకుతారు.

కానీ దాన్ని బతుకు అనరు, బతుకు ఈడ్వడం అంటారు. అయితే ఇది సార్వజనీనం కాదు.  కేవలం నాకు సంబంధించిన అభివ్యక్తి మాత్రమే సుమా!

 

ప్రతీ రచనకూ కృత్యాద్యవస్థ అని ఒకటుంటుంది. అంటే ఒక రచనని ఎలా మొదలుపెట్టాలన్న విషయమై పడే జంజాటం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ విషయంలో నాదీ అలాంటి గుంజాటనే.

 

ఒంటరి ఆలోచనలకు ఒక పొంతన వుండదు. ఒక పద్దతి వుండదు. చీలికలు పేలికలుగా మనసులో సుళ్ళు తిరిగే భావాలను కాగితం మీద పెట్టాలని చూసినప్పుడు ఇది మరింత ప్రస్పుటం అవుతుంది. ఏదో ఒక భావన మాత్రం వీటిని కలపాలని, గుదిగుచ్చాలని ప్రయత్నిస్తుంది. ఆ విఫల ప్రయత్నమే ఇది.

   

భగవంతుడి వయసు ఏడేళ్లు అని నా నమ్మకం. నా భార్య నిర్మల ఏడేళ్ల క్రితం 2019 లో హఠాత్తుగా మరణించింది. ఆమె జీవించి వున్నంత వరకూ నాకు దేవుడి అవసరం పడలేదు. నా మంచి చెడ్డలు అన్నీ తనే ఒక దేవతలా కనిపెట్టి చూసింది. ఆమె పోయిన తర్వాత గత ఏడేళ్ళుగా దేవుడే నాకు పెద్ద దిక్కు అయ్యాడు. అలా అని పెద్దగా గుళ్ళూ గోపురాలు తిరిగింది లేదు. కృతజ్ఞతలు తెలుపుకోవడానికి అంతంత దూరాలు పోనవసరం లేదనేది నా నిశ్చితాభిప్రాయం.

 

గతంలో నా భార్య రూపంలో, ఇప్పుడు నా పిల్లల రూపంలో ఆయనే  నా బాసటకు వచ్చాడు.  నిజానికి అప్పుడు ఇప్పుడు కనిపెట్టి చూసింది,  చూసేది కంటికి కనబడని ఆ పరమాత్ముడే అనే ఎరుకకు ఇంకా ఒక స్పష్టమైన రూపం రాలేదు.

 

మరో కఠిన వాస్తవం ఏమిటంటే జీవించి వున్నప్పుడు నా దృష్టిలో మా ఆవిడ దేవత ఏమీ కాదు, జస్ట్ భార్య అంతే!

 

బర్రె చనిపోయిన తర్వాత పాడి తెలుస్తుందని మా బామ్మ రుక్మిణమ్మ గారు చెబుతుండేది. అందులో ఎంతో నిజముంది.  నిజముంది కాబట్టే చనిపోయి మా ఆవిడ దేవత అయింది.

 

నా చిన్ననాటి స్నేహితుడు వేమవరపు భీమేశ్వరరావు, స్కూల్ మేట్ రామబ్రహ్మాచారి, కాలేజి సహాధ్యాయి వెన్నెలకంటి శ్రీనివాసమూర్తి ఈ ముగ్గురూ నేనిప్పుడు ఎక్కిన పడవలో ఎప్పటినుంచో ప్రయాణిస్తున్నారు. భార్యల్ని కోల్పోయారు కానీ జీవిత నౌకను నిబ్బరంగా నడుపుతూనే వున్నారు. వాళ్లకి నాకు ఒక చిన్న తేడా వుంది. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. జీవిత సహచరిని కోల్పోక ముందు కూడా వారందరూ బాధ్యత తెలిసిన భర్తలు. అంచేత, జీవితంలో ఎదురైన గొప్ప కష్టాన్ని పంటి బిగువున భరించి, తమ జీవితాలను ఒక బాటలో పెట్టుకోగలిగారు.

 

ఆ మధ్య ఒకసారి భీమేశ్వరరావు ఇంటికి వెళ్లాను. అతడి భార్య జీవించి వున్న రోజుల్లో కూడా వెళ్లాను. కాలేజీ ప్రిన్సిపాల్ గా రిటైర్ అయినా, తండ్రి నుంచి వారసత్వంగా లభించిన ఉచిత  హోమియో వైద్యాన్ని వ్యాపకంగా మలచుకున్నాడు. దైవదత్తంగా సంక్రమించిన రచనా పాటవాన్ని చక్కగా వాడుకుంటూ అనేక పుస్తకాలు రాశాడు. ఈ క్రమంలో పరిచయస్తులు, అభిమానులు పెరిగారు. అవసరం అయితే, ఇంట్లో స్వంతంగా వంట చేసుకోగలడు. అంచేత భార్యావియోగం అనంతరం వాటిల్లే మార్పులు ఇబ్బందులుగా మారకుండా చూసుకోగలిగాడు.

భీమేశ్వర రావు ఇంటికి వెళ్ళివచ్చిన తర్వాత నేనూ ఒక ప్రయత్నం చేశాను. అబ్బే! ఏమాత్రం కుదరలేదు. వంట సంగతి తర్వాత, ముందు పాలు కాగబెట్టడంతో ప్రయోగాలు చేశాను. అధరాపురపు  మురళీ కృష్ణ గారి ఎపిసోడ్స్ రిపీట్ అయ్యాయి. మా వంటిల్లు పాలు పొంగిన సిరుల గడ్డ అయింది కానీ నా నోట్లోకి కప్పు కాఫీ చేరలేదు.  

‘పదహారు ఇంటూ పద్నాలుగు ఎంత?’ అని అడిగితే, జవాబు తెలిసిన వాడు చిటికెలో చెప్పేస్తాడు. ఎక్కాలు రాని, జవాబు తెలియని నా బోటివాడు ‘వామ్మో! అంత గొట్టు ప్రశ్న అడిగితే ఎలా! నాకు  తెలియదు’ అంటాడు. వంట విషయంలో నా పరిస్థితి ఇదే. రాదు, ఇప్పుడు నేర్చుకున్నా రాదు.

  

మనలో చాలామందిమి అన్నీ తెలుసు అనుకుంటాము. కానీ తెలిసింది కొందరికే. తెలియని వాళ్ళలో నేను తప్పకుండా వుంటాను. ఇది ఒప్పుకోవడానికి ఎలాంటి భేషజం లేదు.

 

ఈ లోపం అంటే ఈ తెలియనితనం కారణంగా ఇతరులమీద ఆధారపడక తప్పదు. దాంతో కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపః అన్నట్టు, వలలి వచ్చి వంట చేస్తేనే తిన్నట్టు.

పొద్దెలా గడుస్తుంది అనుకునేవాడికి కాలంతో నిమిత్తం ఏమిటి? ఎప్పుడు లేస్తే అప్పుడే ఉషోదయం. నాకు తగ్గట్టే వంటమనిషి, పని మనిషి తమ పని వేళలు తామే మార్చుకున్నారు. ‘ఈయన గారు ఇంత పొద్దున్నే లేస్తాడా పెడతాడా’ అని వంటావిడ పదకొండు గంటలకు, పనావిడ మరింత తీరిగ్గా ఆ తర్వాత రావడం అలవాటు చేసుకున్నారు. పాపం అంత తెల్లవారక ముందే వాళ్ళు వచ్చి చేసేది ఏముంది అని నేనూ అలవాటు పడ్డాను. దాంతో  స్నానం సంధ్యా (రెండోది ఎట్లాగు లేదు, దేవుడి గూట్లో మా ఆవిడ నాకు వదిలిపెట్టి వెళ్ళిన దీపం వెలిగించడం అనే ఒక బాధ్యత తప్పిస్తే),  తిండీ తిప్పలు మధ్యాహ్నానికి, అపరాహ్ణం తర్వాతకు ఆటోమేటిక్ గా మారి పోయాయి.

 

కానీ రోజులు అన్నీ ఒకే రకంగా గడవవు కదా!

 

ఈ ఏడాది (2026)  వేసవిలో నీళ్ళ కరువు వచ్చి పడింది. బోరు ఎండిపోయింది. అపార్ట్ మెంటులో నీళ్ళ సప్లయి అతి దారుణంగా కనిష్ట స్థాయికి పడిపోయింది. ఒకరోజు గవర్నమెంటు ట్యాంకరు, మరునాడు ప్రైవేటు ట్యాంకరు. పదహారు వాటాలు, ఎక్కడ సరిపోతాయి? ఉదయం ఒక్కపూట ఆరున్నర నుంచి ఒక గంట అంటారు, కానీ అరగటంలోనే నల్లాలు నోరు కట్టేసుకుంటాయి. ఇన్నేళ్ళుగా నీళ్ళ కరువు ఎరగకుండా 24X7  రన్నింగ్ వాటర్ సప్లయికి అలవాటు పడిన వాళ్లకు ఇది మింగుడు పడని వ్యవహారం. కానీ ఏం చేస్తాం! నలుగురితో నారాయణ.

 

నీళ్ళ వేళలను బట్టి దినచర్య మారిపోయింది. ఠంచనుగా ఆరున్నరకు లేవడం, అలెక్సాలో వెంకటేశ్వర సుప్రభాతం పెట్టడం, అది పూర్తయ్యే లోగా స్నాన సంధ్యాదులు, దేవుడి గూట్లో దీపం పెట్టడాలు, పాలు కాగించి తాగడాలు, తోడు పెట్టడాలు. బాత్ రూములో బయటా ఓవర్ హెడ్ ట్యాంకులు నింపి పెట్టడాలు. మునుపు ఇవన్నీ పనివాళ్లు చూసుకునేవారు, నేను మంచం మీద శేషతల్ప శాయిలా పడుకుని వుండేవాడిని. ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా ఆగితే ఇంట్లో తాగడానికి కూడా గుక్కెడు నీళ్ళు కూడా  వుండవు.

 

వాళ్ళని  కాస్త ముందు రమ్మని అడగొచ్చు కదా! నిజమే, అడిగే లోపల ఆవిడే చెప్పింది మళ్ళీ అడగకుండా. ‘ఎప్పుడు వచ్చినా నా పని నాదే కదా! నేనే చేసుకోవాలి కదా!’ ఆ రాగం పెరిగి పెద్దది కాకముందే, నేనే,  ‘సరేలే’ అనేశాను.

 

ఏదైతేనేం,  ముందు కొంచెం ఇబ్బంది అనిపించినా, ఇప్పుడు హాయిగానే  అనిపిస్తోంది. ఇబ్బందులు అలవాటు అయితే, ఇబ్బందిగా అనిపించదు అనే మధ్యతరగతి మందహాసం ఒకటి చిందించి ఊరుకున్నాను.

  

పైగా ఈ కష్టాలు నా ఒక్కరివి కావు, అందరివీ. ఈ ఊహ మరింత హాయిని ఇస్తోంది. (ఇదీ మధ్య తరగతి మనస్తత్వమే)  

  

ఇక ఏడున్నర నుంచీ పూర్తిగా ఖాళీ. అంత ఫ్రీ టైం అన్నమాట.

 

ఇటాలియన్ భాషలో ఒక పద బంధం వుంది.

Dolce far niente

అంటే,  ఏమీ చేయకుండా వుండడంలోని  ఆనందం అన్నమాట. దాన్ని ఇప్పుడు పూర్తిగా అనుభవిస్తున్నాను.







(ఇంకా వుంది)

13, జూన్ 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (325) : భండారు శ్రీనివాసరావు

మరో అమ్మాయి కధ

(నిన్నటి తరువాయి)
జీవనయానంలో ఎంతో మంది తారసపడుతుంటారు. అయితే కొద్ది మందే యాదిలో వుంటారు.
ఈ అమ్మాయి అంకిత మా ఇంటికి వచ్చి అప్పటికి ఏడాది అవుతోంది.
నా కొడుకు కోడలు ఉద్యోగస్తులు. మనుమరాలిని చూసుకోవడానికి మా ఆవిడ లేదు.
అంచేత ఏదో ఏజెన్సీని సంప్రదించి ఓ కేర్ టేకర్ అమ్మాయిని పెట్టారు. ఆ అమ్మాయి పేరు తప్ప వాలకం నాకు ఏమాత్రం నచ్చలేదు. గాంధీ గారి కళ్ళజోడులాంటి గుండ్రటి పెద్ద కళ్లద్దాలు. ఆధార్ కార్డు ప్రకారం వయసు 22. కానీ ఆ పిల్ల పీలగా పద్నాలుగేళ్ళ అమ్మాయిలా వుంది.
అయినా ఛాయిస్ నాది కాదు.
మనుమరాలు జీవికని కనిపెట్టి చూసుకోవడమే ఆ అమ్మాయి పని.
ఇంట్లోనే వుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నా కంట్లో పడేది. చీదరించుకున్నట్టు చూసేవాడిని.
ఈలోగా ఘోరం జరిగిపోయి మా వాడు సంతోష్ ఆకస్మిక గుండె పోటుతో చనిపోయాడు.
నాకు ప్రపంచం యావత్తూ శూన్యంగా మారింది. ఆరోగ్యం దెబ్బ తిన్నది. కను చూపు మందగించింది. మా కోడలు నిషా శ్రద్ధ తీసుకుని కంటి ఆపరేషన్ చేయించింది.
కొన్ని రోజులు గంట గంటకీ కంట్లో చుక్కలు వేయాలి. ఆ పని అంకిత చూసింది. అలారం పెట్టుకుని కరక్టు టైముకి వేసింది.
ఆ తర్వాత బీపీ షుగర్ సమస్యలు. ఎప్పటికప్పుడు మిషన్ల మీద రీడింగ్ తీసుకుని ఒక పుస్తకంలో నోట్ చేసుకుని డాక్టర్లు అడగగానే ఫోన్లో చెప్పే బాధ్యత స్వచ్చందంగా తీసుకుంది. వేళకు గుర్తు పెట్టుకొని మందులు ఇచ్చేది.
ఈ నర్సింగ్ సర్వీసుతో ఆ అమ్మాయి పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.
ఆడపిల్లలు లేని నాకు ఈ అమ్మాయిని ఆ దేవుడే పంపాడు అని నిర్ధారణకు వచ్చాను.
అయితే ఒక విషయం చెప్పాలి.
ఇంత మొండి పిల్లను నా జీవితంలో చూడలేదు.
పాలవాడో, పేపరు వాడో వచ్చి డబ్బులు అడుగుతాడు.
‘అమ్మా అంకితా వెళ్లి నా ప్యాంటు జేబులో పర్స్ తీసుకురా’ అంటే ససేమిరా వినదు. ‘హైదరాబాద్ లో ఉద్యోగానికి వచ్చేటప్పుడే మా అమ్మ ఇతరుల డబ్బు తాకవద్దు అని చెప్పి పంపింది’ అంటుంది.
‘నేనే చెబుతున్నా కదా’ అన్నా వినదు. తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు బాపతు.
ఈ కాలంలో ఇంత నిజాయితీ అరుదు.
సంక్రాంతి, దసరా వంటి పండుగలకు, చీరలో డ్రెస్సులో కొనుక్కోమని వంటమనిషి వలలికి, (అసలు పేరు వనిత) పనిమనిషి మమతతో పాటు డబ్బు ఇస్తే అంకిత తీసుకోదు.
'మీరు ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా జీతం పదిహేను వేలు లెక్క కట్టి ఇస్తున్నారు కదా! నా సంపాదనతోనే ఏదైనా కొనుక్కుంటాను, ఇక్కడ నాకు విడిగా పెట్టే ఖర్చు లేదు, నా అవసరాలు అన్నీ మీరే చూసుకుంటున్నారు. ఒక వేయి నేను వుంచుకుని మిగిలింది మా అమ్మకు జీపే చేస్తాను’ అంటుంది ధీమాగా, ఎంతో బాధ్యతగా. ‘ఆ వెయ్యి కూడా నా సినిమాల పిచ్చికి. నెలలో ఒక ఆదివారం సెలవు ఇస్తే ఆ రోజు మెట్రోలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నాలుగాటలు చూసి వస్తాను’ అనేది. ‘మరి భోజనం’ అంటే, ‘పర్వాలేదు, ఏదైనా మెస్సులో, కాదంటే సినిమాహాలుకి దగ్గరలో వుండే గుడిలో పెట్టే ప్రసాదం తినేస్తాను’ నాకు వచ్చే జవాబు ఇదన్న మాట.
‘ఏ రోజు ఎక్కడ ఉంటానో తెలవదు, ఏజెన్సీ వాళ్ళు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. కానీ ఒక్క విషయంలో మాత్రం నాదే నిర్ణయం. నేనా శారీరకంగా బలహీనురాలిని. నేను పెంచే పిల్లలు చిన్నవాళ్లు అయి వుండాలి. పనిచేసే ఇల్లు మెట్రోకి దగ్గరలో వుండాలి. ఇంట్లో కెమెరాలు వుండాలి. నేను ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తున్నానో ఆ ఇంటి వాళ్ళకి తెలియాలి. అనవసరంగా మాట పడే రకం కాదు నేను.
‘నాకు వేరే ఖర్చులు లేవు, సినిమా ఖర్చు తప్ప. డ్రెస్సులు అవీ అవసరం మేరకే. ‘పెద్ద లగేజీతో దిగింది’ అని ఇంటి వాళ్ళు అనుకోకూడదు. ఒక పెద్ద సంచీ, ఒక చిన్న సంచీ, అంతే! తాళం వున్న సూటు కేసు కూడా వాడను. నేను నిజాయితీగా వుంటాను. సరే. కానీ ఆ విషయంలో ఎవరికీ వీసమెత్తు అనుమానం వచ్చినా నేను భరించలేను’.
ఇలా వుంటాయి ఆ అమ్మాయి మాటలు.
మా మనుమరాలు జీవిక అంటే అంకితకు ప్రాణం. రైల్లో ఒక్కతే కటక్ వెళ్ళింది చూడడానికి. భాష తెలియదు. మా కోడలు నిషా భువనేశ్వర్ స్టేషన్ నుంచి కటక్ కు ఉబెర్ బుక్ చేసి ఓటీపీ పంపింది. ధైర్యంగా ఒంటరిగా వెళ్ళింది. ‘అమ్మకు లొకేషన్ షేర్ చేశాను, ఇంకా భయం ఎందుకు?’ అనే ధీమా.
కటక్ వెళ్ళే ముందే గూగుల్ లో అక్కడ చూడాల్సిన ప్రదేశాలు సెర్చ్ చేసింది. అన్నీ దేవాలయాలే. ఆ పేర్లు నేను కూడా వినలేదు. భాష తెలియకపోయినా ఉబెర్ ఆటోలో తిరుగుతూ అన్నీ చూసింది. ఏదో ఒక గుడిలో వాళ్ళు పెట్టిన ప్రసాదమే ఆ పూటకు భోజనం.
‘దాదాపు అయిదేళ్లుగా అనేక మంది ఇళ్ళల్లో చేశాను. ఎక్కడా ఎవ్వరూ మీరు ఇచ్చినంత స్వేచ్ఛ ఇవ్వలేదు. ఎండాకాలం ఏసీ వేసుకుని పడుకున్నా ఏనాడు ఒక్క మాట అనలేదు. మామూలుగా అయితే ఎక్కడైనా ఉద్యోగం మానేసినప్పుడు, కొత్తది దొరికేదాకా గరల్స్ హాస్టల్ లో వుంటాను. రోజుకి మూడు వందల యాభయ్ రూపాయలు. భోజనం టిఫిన్, పడక అన్నీ అందులోనే. బాత్ రూమ్ గీజరు వుంటాయి. మరో ముగ్గురు అమ్మాయిలు గదిలో నాకు తోడు. నేను దాచుకున్న డబ్బు అలాంటి సమయాల్లో ఉపయోగపడుతుంది. ఒక రోజు కాకపోతే ఇంకో రోజు జాబ్ దొరికి తీరుతుంది. ఈ రోజుల్లో మా అవసరాలు అలాగే వున్నాయి. కొందరు ఇరవై వేలు ఇస్తాము అంటారు. కానీ నాకు ఇష్టం లేకపోతె ఒప్పుకోను. పదిహేను చాలు. నెలకు వేయి చొప్పున దాచుకుని లక్ష కూడబెట్టాలనేది నా కోరిక. అదీ పెళ్లి ఖర్చుకి. మా అమ్మావాళ్ళ మీద భారం వేయను. కట్నం లేకుండా చేసుకునేవాడినే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ఖర్చు మాత్రం నాదే’
చూడగలిగిన కళ్ళు వుండాలే కానీ, ఆత్మాభిమానంలో కూడా మనిషి సౌందర్యం ఉట్టి పడుతుంది.
‘ఏడాదికి ఒకసారో, రెండు సార్లో, కరీంనగర్ జిల్లాలో కడగొట్టున వున్న మా ఊరు వెడతాను. రెండు బస్సులు మారి వెళ్ళాలి. బస్సు ఫ్రీ. డైరెక్ట్ బస్సు వుంది కానీ అందులో ఆడవాళ్ళకి కూడా టిక్కెట్టు తీయాలి. ఊళ్ళో మా వాళ్ళు పొలం కూలీలు. అక్కడ వున్నన్నాళ్ళు నేను కూడా కూలీకి వెడతాను.
‘ఏటా నవంబరులో కులదేవత పూజలు అవీ వుంటాయి. నెల రోజులు ఎక్కడా వుండను, వూరికి పోతాను. పనిలో చేరేటప్పుడే ఈ విషయం స్పష్టంగా చెబుతాను’
ఆ వయసు అమ్మాయి మాటల్లో, ఆ క్లారిటీ చూసి ఆశ్చర్య పోయాను.
మొన్నీ మధ్య కోడలు నిషా ఆఫీసు పని మీద, అమెరికా ట్రిప్ కోసం హైదరాబాదు వచ్చి ఓ నాలుగు నెలలు వుంది. మనుమరాలు జీవికని దగ్గర డే స్కూల్లో చేర్పించింది. ఇది తెలియగానే అంకిత వచ్చి మళ్ళీ పనిలో చేరింది. కిందటి నెల చివర్లో జీవికని తీసుకుని కోడలు కటక్ వెళ్ళిపోయింది. ‘ఏజెన్సీ నుంచి పిలుపు వచ్చేవరకు మీ ఇంట్లో ఉండవచ్చా మేడం’ అని అడిగి వుండి పోయింది.
మొన్న ఆదివారం ఆ పిలుపు వచ్చింది. ఎక్కడో జూబిలీ హిల్స్ ఇంట్లో పని కుదిరింది.
తన రెండు సంచులు సర్దుకుని, మధ్యాన్నం లంచ్ తర్వాత కొత్త ఇంటికి బయలుదేరి వెళ్ళింది, ఆటోలో, అత్తవారింటికి వెళ్ళే అమ్మాయిలా, నా కాళ్ళకు దండం పెట్టి మరీ.
కన్న కూతురు కాదు కానీ కన్న బిడ్డే!
వెడుతూ వెడుతూ ఒక మాట చెప్పింది, ‘జనవరిలో నేను కటక్ వెడతాను, అయిదో తేదీ జీవిక పుట్టినరోజు కదా!ముందు బుక్ చేసుకోకపోతే రైల్లో టిక్కెట్లు దొరకవు’
నాకు బుర్ర తిరిగింది. ఎప్పుడు జనవరి. ఇప్పుడు జూన్ లోనే ఉన్నాము, ఇంకా ఆరు నెలలు టైం వుంది.
ఆ అమ్మాయి దిగే స్టేషన్ వచ్చింది. దిగిపోయింది. మంచి జ్ఞాపకాలు మిగిల్చిపోతోంది. అంతే అనుకోవాలి.
ఈ రోజుల్లో పనివాళ్ళు దొరుకుతారేమో కానీ పనిమంతులు దొరకడం కష్టం.
ఈ పోస్టు అంకితకే అంకితం.
తోకటపా:
మా పిల్లలలాగే అంకితకు కూడా తన ఫొటో సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేయడం అస్సలు ఇష్టం వుండదు. మా మనుమరాలు జీవికతో వున్న ఫోటోల్లో తాను వుంటే, అది ఎడిట్ చేసే దాకా వూరుకోదు. అంత పెంకి ఘటం.
కాకపోతే అంకిత INSTA లో వుంది.
అదీ ఎవరికోసం
హీరో మహేష్ బాబు కోసం.
తాను ఆ నటుడికి dhfm అంటే Die hard fan for Mahesh Babu ట.
(ఇంకావుంది)

12, జూన్ 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (324) : భండారు శ్రీనివాసరావు

ఇద్దరు అమ్మాయిలు

‘పొద్దున్నే హైదరాబాదు వచ్చాను. ఆర్మూరులో అంతా బాగే. అపోలోలో చిన్నక్కను చేర్పించారని బావ ఫోను చేశాడు. ఇప్పుడక్కడికే వెడుతున్నా. చూశాక ఎట్లుందీ మళ్ళీ ఫోను చేసి చెబుతా’
కారులో నా వెనుక కూర్చొన్న ఓ అమ్మాయి తన మొబైల్ ఫోనులో చెబుతున్న ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యం అనిపించింది.
2014 లో అనుకుంటాను, (Uber)ఉబెర్ టాక్సీ సర్వీసులు మొదటి సారి హైదరాబాదు నగర ప్రవేశం చేశాయి, కాస్త ముందో వెనుకో ఓలా టాక్సీలు కూడా కుడి కాలు మోపాయి.
కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలు మొదట్లో చాలా ఆకర్షణీయంగా తోస్తాయి. మరీ ముఖ్యంగా పెట్టుబడిదారీ మనస్తత్వం కలిగిన వ్యాపార సంస్థల ఆధ్వర్యంలో నడిచే ఇలాంటి సర్వీసులు. తియ్య నీటికి ఎగబడే చేపల్లాగా ముందు వీరి గాలానికి చిక్కుకునే వాళ్ళు మధ్యతరగతి జనమే!
సిటీ బస్సులో వెళ్ళడానికి నామోషీ. ఆటో వాళ్ళ ఆగడాలు భరించలేరు. అలాంటి వాళ్ళు ఇలాంటి సర్వీసుల పట్ల ఆకర్షితులు అవుతారు. ఆటో కంటే కొంచెం ఎక్కువ అంతే కదా!. చల్లటి ఏసీ కారులో ప్రయాణం. ఎక్కడికి రమ్మని బుక్ చేస్తే అక్కడికి చెప్పిన టైముకు వచ్చి డ్రైవర్ ఫోన్ చేస్తాడు. ‘లెఫ్ట్ తిరుగు, ఆ టీ స్టాల్ దగ్గర రైటు తీసుకో, ఆ గేటు దగ్గర ఆపు’ ఇలా చెబుతూ పోయే పని లేకుండా, గమ్య స్థానానికి గూగుల్ మ్యాపు సాయంతో డ్రైవరే చేరుస్తాడు. చార్జీ కూడా ఫోన్ ద్వారా చెల్లించవచ్చు. ఎంతో కొంత సుఖాన్ని కోరుకునే ఒక మామూలు మనిషికి ఇంతకంటే ఏం కావాలి?
మొదట్లో ఇలాంటి సర్వీసులను చాలా చౌకగా నడుపుతారు, ఆరంభంలో కొన్ని నష్టాలు వచ్చినా సరే. సాధారణ జనం వీటికి అలవాటు పడే దాకా ఆ నష్టాలు భరిస్తారు. తరువాత ఇంతే సంగతులు.
జనాలకు తెలియకుండానే రేట్లు రెండింతలు, మూడింతలు పెంచుకుంటూ పోతారు. కాస్త ముందుగా రావాలి అంటే ఇంత ఎగస్ట్రా చెల్లించాలి అంటారు. ఏసీ కావాలి అంటే మరి కొంత అదనం. అప్పటికే ఈ కొత్త సుఖాలకు అలవాటు పడ్డ మనుషులు ఇక వెనక్కి రాలేరు. కార్పొరేట్ల మాయాజాలం ఇలాగే వుంటుంది.
ఇప్పుడు ఈ షేరింగ్ సదుపాయం వున్నట్టు లేదు కానీ, మొదట్లో షేర్ ఆటోల మాదిరిగా ఈ సర్వీసులకు కూడా, పూల్ ఆప్షన్ వుండేది. కరోనా తర్వాత దీనికి స్వస్తి చెప్పినట్టున్నారు. ఒకే మార్గంలో వెళ్ళే వాళ్ళు ఈ చాయిస్ ఎంచుకుంటే చార్జి బాగా తగ్గుతుంది. అర్జంటు పని లేని నా బోటి వారికి ఇది బాగా కలిసి వచ్చేది.
కాలం గడుస్తున్న కొద్దీ ఆటో డ్రైవర్లకు, ఈ కొత్త సర్వీసుల డ్రైవర్లకు ప్రవర్తనలో పెద్ద తేడా లేకుండా పోయింది. గతంలో ఆటో డ్రైవర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం వుండేది, వాళ్ళు చర్య తీసుకుంటారు అనే ఆశ లేకపోయినా.
ఈ సర్వీసుల మీద ప్రభుత్వ పెత్తనం వున్నట్టు తోచదు. ఈ కంపెనీ యజమాని ఏ దేశంలో ఉంటాడో తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా రవాణా సర్వీసులు నడిపే ఈ కంపెనీ పేరిట ఒక్క కారు కూడా వుండదు. కారు, ఇంధనం, డ్రైవర్ ఖర్చులు వారివి కావు. చిట్ ఫండ్ కంపెనీ లాగా ఇద్దరు అవసరంలో వున్న వారిని టెక్నాలజీతో కలుపుతాడు. వచ్చిన దాంట్లో సింహభాగం తీసుకుంటారు. వీటిని దోపిడీ అనడానికి వీలులేదు, వున్న చట్టాల ప్రకారం. సరే ఇదొక అంతులేని, పరిష్కారం లేని సమస్య.
అలా లోగడ నేను ఉబెర్ బుక్ చేసుకొనేటప్పుడు, ఒక్కడినే అయితే, వీలయినప్పుడల్లా పూల్ (షేరింగ్) పద్దతి ఎంచుకునే వాడిని. డబ్బులు సేవ్ చేయడంకోసం కాదు. రకరకాల వ్యక్తుల్ని కలవడానికి వీలుంటుందని.
అలాగని కారులో వుండగా ఎవరితో మాటలు కలపను. డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చుని మనుషుల్ని చదివే ప్రయత్నం చేసేవాడిని. పుటకలతో పుట్టిన బుద్ది కదా!
అలాగే, ఒక రోజు ఊబెర్ పూల్ ఎక్కాను. అప్పటికే వెనక సీట్లో ఒకమ్మాయి కూర్చుని వుంది. ఎవరో ఫోను చేస్తే ఆ అమ్మాయి అంటున్న మాటలే మొదట్లో రాసినవి. నిజానికి నేను కావాలని విన్నవి కావు, అదాటుగా చెవిన పడ్డవి.
ఊరు నుంచి పట్నం వచ్చింది. నిర్భయంగా ఊబెర్ టాక్సీ పిలుచుకుంది. డేరింగుగా షేరింగు పద్దతి ఎంచుకుంది. ఆసుపత్రిలో వున్న అక్కను పరామర్శించడానికి వెడుతోంది. ఈ దేశానికి ఇంతకంటే ఏం కావాలి? చాలా సంతోషం అనిపించింది.
పర్వాలేదు, గ్రామీణ స్త్రీలు సయితం స్వతంత్రంగా, ధైర్యంగా జీవించడం మొదలైంది. మంచి పరిణామం.
ఇదెప్పుడో పుష్కర కాలం క్రితం, 2014 నాటి అనుభవం.
పొతే, ఇక రెండో అమ్మాయి.
ఈ అమ్మాయి కధ మరీ విచిత్రం.
భయం లేదు స్త్రీ జాతి జాగృతం అయింది అనే అభిప్రాయం నిశ్చయంగా కలుగుతుంది ఈ అమ్మాయి కధ వింటే.
యాభయ్ పాళ్ళు ఆత్మ విశ్వాసం, పాతిక పాళ్ళు, మొండి తనం, మరో పాతిక పాళ్ళు మంచితనం ఇవన్నీ ఒక పాత్రలో వేసి గిలక్కొడితే ఈ అమ్మాయి రూపం వస్తుంది.
చెప్పాలంటే చాలా కధ వుంది ఈ అమ్మాయి వెనక. విషయ విస్తరణ భీతి. అంచేత ఇది ఇక్కడితో ఆపి ఆ అమ్మాయి విజయ గాధ మరో ఎపిసోడ్ లో చెబుతాను.
నిజానికి జెన్ జీ లంటే ఇలాగే వుంటారు కాబోలు.
(ఇంకా వుంది)

11, జూన్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (323) : భండారు శ్రీనివాసరావు

 

నేను కూడా చెప్పలేని నిజం
ఇది ఈ సిరీస్ లో 323 వ భాగం. గతంలో ఏనాడు రాయడానికి సంశయించని, తటపటాయించని కొన్ని సున్నితమైన అంశాలు ఇందులో వున్నాయి. ఇతరుల గౌరవానికి భంగం కలగకుండా, సత్యానికి దూరం జరగకుండా చాలా జాగ్రత్తగా ప్రస్తావించాల్సిన విషయం. రాత్రంతా ఆలోచించి, తెలతెలవారుతుండగా పూర్తి చేశాను. అయినా పోస్టు చేయడానికి ముందు ఎన్నో సందేహాలు. ఒక పదం ఎక్కువ రాకుండా, చిన్న అపార్దానికి కూడా చోటివ్వకుండా రాయడం నిజానికి కత్తి మీద సామే. జీవిత చరిత్రను, లేదా ఆత్మ కధను రాయడంలో ఈ అంశమే ప్రధానంగా రచయితను బాగా కలవర పరుస్తుంది. మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు చెప్పినట్టు ఆత్మ స్తుతి, పర నిందకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.. చదువరికి ఈ రెండు విషయాల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా ఇక ఆ రచన నిరర్ధకం.
పాత్రికేయ మిత్రుడు, చిన్న వయసులోనే పెద్ద పేరు, అదీ మంచి పేరు తెచ్చుకున్న Amar Devulapalli దేవులపల్లి అమర్ డెబ్బయి వసంతాల పండగను అమర్ కుటుంబ సభ్యులు చక్కటి కుటుంబ వాతావరణంలో, బంధు మిత్రుల సమక్షంలో గొప్ప వేడుకగా నిర్వహించారు. జర్నలిజంలో కాకలు తీరిన పెద్దలతో సహా, కేవీపీ రామచంద్రరావు గారి వంటి సీనియర్ రాజకీయ నాయకులను ఒక్కచోట కలుసుకునే అవకాశం కల్పించిన అమర్ కు ధన్యవాదాలు.
అమర్ ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. క్యాబినెట్ హోదా కలిగిన రెండు పదవులను అనేక సంవత్సరాల పాటు నిర్వహించాడు. జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన ఐ.జే. యు. అధ్యక్ష పదవి, సెక్రెటరీ జనరల్ పదవి పొందాడు. ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు. ఇక ప్రింట్ జర్నలిజంలో అనేక ప్రముఖ దిన పత్రికల్లో పెద్ద స్థాయి ఉద్యోగాలు చేశాడు. డేట్ లైన్ పేరుతో పలు దినపత్రికల్లో అమర్ నిర్వహించిన శీర్షిక పాత్రికేయుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులను ద్విగుణీకృతం, త్రిగుణీకృతం చేసింది. తదనంతర కాలంలో టీవీ మీడియా రంగ ప్రవేశం చేసి రాజకీయ చర్చలకు కొత్త సొగసు అద్దాడు. జర్నలిస్టుగా ఇన్ని అవతారాలు ఎత్తినా, ఆహార వ్యవహారాల్లో కానీ, ఆహార్యంలో కానీ, మాట తీరులో కానీ, హాయిగా, భోళాగా, నోరారా నవ్వే పద్దతిలో కానీ, ఇన్నేళ్ళుగా చూస్తూ వస్తున్నాను ఎలాంటి మార్పు ఇసుమంత కూడా లేదు.
ఈ సమావేశంలో ఆయనే చెప్పినట్టు పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళు కోరుకున్నట్టుగా చేశాడు. శృతి, రాహుల్ అమర్ కు కుడి ఎడమ భుజాలు. ముచ్చటగా మనుమడు, మనుమరాలు. కోడలు రిషిక కూడా జర్నలిష్టే. రాత్రి వేడుక నిర్వహణలో కుమార్తె, అల్లుడు, కొడుకు, కోడలు పూర్తి బాధ్యతను తమ భుజాలకు ఎత్తుకున్నారు.
అలనాటి అయోధ్య రాముడికి మాదిరిగా, అమర్ కు అండాదండాగా సదా కనిపెట్టుకుని వుండే తమ్ముళ్లు అజయ్, విజయ్, చెల్లెలు వీణ.
భార్య శ్రీమతి సులోచన గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చాలా కాలం అమర్ బరువు బాధ్యతలను పంచుకున్నారు. నిజానికి నిజమైన జర్నలిస్టును భరించేది అతడి భార్యే. కాబట్టి అమర్ ఉద్యోగ విజయాల్లో సులోచన గారికి సింహభాగం క్రెడిట్ దక్కి తీరాలి.
ఇంతకీ నేను కూడా గత మూడు దశాబ్దాలకు పైగా నోరు విప్పి చెప్పని ఆ నిజం ఏమిటంటారా?
కృతజ్ఞతను బాహాటంగా వ్యక్తం చేయడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి వ్యక్తిని నేను ఈనాడు, అంటే 10-06-2026 నాటి రాత్రి కళ్ళారా చూసాను.
ఒక పాత్రికేయుడి నోటంట వెలువడిన ఈ పలుకులకు నాతో పాటు ప్రముఖ సంపాదకులు, పాత్రికేయులు ప్రత్యక్ష సాక్షులు.
ఆయన నుడివిన మాటలు: (సరిగ్గా ఇలానే కాకపోయినా, భావం బోధపడడానికి కొంచెం మార్పులు చేర్పులు)
‘ఆ రోజుల్లో అంటే, 1990 వ దశకంలో నేను హైదరాబాదులో ఒక ప్రముఖ దినపత్రికకు న్యూస్ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నాను. అప్పటికే అనేక జిల్లాల్లో, జిల్లా కరస్పాండెంటుగా పనిచేసిన అనుభవం వుంది. ఆ రోజుల్లో జిల్లా అధికారులుగా పనిచేసిన అనేకమంది ఐ.ఎ.ఎస్, ఐ.పీ.ఎస్. అధికారులతో నాకు వృత్తిరీత్యా సన్నిహిత సంబంధాలు ఉండేవి. తదనంతర కాలంలో వాళ్ళు కూడా నా లాగే హైదరాబాదు చేరుకుని సచివాలయంలో అత్యంత కీలక స్థానాల్లో కుదురుకున్నారు. ఏ పని కావాలన్నా చిటికెలో చక్కదిద్దగల పరిచయాలు నావి.
‘అయితేనేమి, నా సొంత అవసరం విషయంలో అవి పనికి రాలేదు. పనికి రాలేదు అనడం కంటే వాటిని నేను ఉపయోగించుకోలేదు అనడం సముచితంగా వుంటుంది. నేను ఒక పాత్రికేయుడినే కాదు, నాకు మరో పాత్ర వుంది. జర్నలిస్టుల సంఘానికి నాయకత్వ బాధ్యత. కాబట్టి ఎంత చిన్న తప్పు చేసినా, పొరబాటున, ఏదైనా పొరపాటు పని చేసినా అది అగ్గిలా రాజుకుంటుంది. ఆ ఎరుకతోనే నా వృత్తి జీవితాన్ని కొనసాగించాను.
‘అవసరమా అప్పట్లో పెద్దది. నాకున్న పెద్ద పరిచయాలతో పోల్చుకుంటే చిన్నది. అయినా నా తటపటాయింపు నాది.
‘నాలో ఈ సందిగ్ధతను తోటి పాత్రికేయ మిత్రుడు ఒకరు గమనించాడు. అతడు అప్పటికే రేడియో విలేకరిగా నలుగురికి తెలిసిన వాడు. అతడి మాటకు విలువ వుంది. అతడే నన్ను కదిలించాడు.
‘మనం అడిగేది కేవలం మాట సాయం. ఎవరూ వేలెత్తి చూపలేరు. నాకా మంత్రి గారు బాగా తెలుసు. వెళ్లి అడుగుతాను. చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. పని జరిగితే మంచిది’ అంటూ నన్ను ప్రోత్సహించి, తన గిర్నారు స్కూటరు మీద మంత్రి ఇంటికి వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళాడు. ఆ రోజుల్లో నాకు స్కూటరు కూడా లేదు.
‘ఇదిగో! ఇప్పుడు మనం అందరం కూర్చొన్న ఈ ఎమ్మెల్యే కాలనీ రిక్రియేషన్ సెంటర్ కు దగ్గర లోనే ఆ మంత్రి గారి నివాసం. ఆ రోజుల్లో అక్కడా అక్కడా విసిరేసినట్టు ఒకటి రెండు ఇళ్లు తప్ప అన్నీ పొలాలే. కాలి బాట మీద ఎత్తుపల్లాలలో స్కూటరు నడుపుతుంటే మధ్యలో సైలెన్సర్ ఊడి కిందపడింది. దాన్ని జాగ్రత్తగా తీసి పట్టుకుని మంత్రి ఇంటికి చేరాము. ఇంట్లో పూజ ఏదో జరుగుతున్నట్టు వుంది. ఆయన సాదరంగా వెంటబెట్టుకుని లోపలకు తీసుకు వెళ్ళారు. భార్యను పరిచయం చేశారు. వచ్చిన పని చెబితే ‘ఇదెంత పని?’ అన్నట్టు మాట్లాడారు. దాన్నిబట్టే అర్ధం అయింది ఇది అయ్యే పని కాదని. పని కాదనుకునే వెళ్ళాము కనుక నిరాశ కలగలేదు.
‘ఇక్కడ చెప్పాల్సింది వేరే. మనం జర్నలిస్టులం అనేక ఎగుడు దిగుడ్లు దాటుకుంటూ ఒక స్థాయికి చేరతాము. నాకు ఈ రోజుతో డెబ్బయి నిండాయి. ఇరవై ఏళ్ళ కిందటే పిల్లలు సెటిల్ అయ్యారు. పెళ్ళిళ్ళు అయ్యాయి. బాధ్యతలు అన్నీ పూర్తయ్యాయి.
‘ఆ రోజు నేను అడగకుండానే తన స్కూటర్ మీద వెంట బెట్టుకు వెళ్ళిన మిత్రుడు కూడా ఇప్పుడు మన మధ్యలోనే వున్నారు. నా కంటే వయసులో పదేళ్లు పెద్ద. ఆయనే ఇంకా జీవితంలో పూర్తిగా సెటిల్ అయినట్టు లేదు’
తన పుట్టిన రోజు వేడుకకు హాజరైన పెద్దలు అందరూ తన గురించి చెప్పిన నాలుగు మంచి మాటలకు కృతజ్ఞతలు తెలుపుతూ అమర్ తన ప్రసంగం చివర్లో నా గురించి చెప్పిన మాటలు ఇవి.
థాంక్స్! అమర్! మూడు దశాబ్దాలు దాటిన తర్వాత జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన పిదప నన్నిలా గుర్తు చేసుకున్నందుకు.
YOU ONLY CAN SPEAK OPENLY LIKE THIS.
కింది ఫోటో:
దేవులపల్లి అమర్ డెబ్బయ్యవ పుట్టిన రోజు వేడుకలు.



(ఇంకా వుంది)

9, జూన్ 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (321) : భండారు శ్రీనివాసరావు

 

నాతో జాగ్రత్త!
టీవీ చర్చలకు ముప్పూటలా వెళ్ళే రోజుల్లో ఒక ఛానల్ యాంఖరమ్మాయి నా మొహాన ఓ కాంప్లిమెంటు పారేసింది.
'మీరిలా ప్రశాంతంగా ఎలా వుంటున్నారు. మా నాన్నగారు ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉంటారు.'
పాపం ఆ అమ్మాయికి తెలియదు, నేనూ ఇంట్లో అంతకంటే ఎక్కువ భుగభుగల, బుసబుసల మనిషినని, దూర్వాసుడికి వారసుడిని అని.
ఆ అమ్మాయి పుణ్యమా అని నాకొక విషయం తెలిసొచ్చింది. ప్రతి మనిషిలో ఓ అపరిచితుడు దాగుంటాడని. అందరికీ మంచి మనిషిగా కనిపించే శాల్తీలు నిజానికి అంత నిఖార్సయిన మంచి సరుకు కాకపోవచ్చని. సకల సద్గుణ రాముడని బయటవారు కీర్తించే లక్షణాలు వారిలో ఆట్టే లేకపోవచ్చని.
ఈ రూలు నాకే కాదు మనం అందరం అభిమానించే సినీ తారలు, రాజకీయ నాయకులు, రచయితలు, జర్నలిష్టులకు సైతం వర్తిస్తుంది. వాళ్ళ అందచందాలు, మాటల గారడీలు, రచనలు, రాతలు ఇవన్నీ చూసీ, వినీ, చదివీ పరమవీర అభిమానులం అయిపోతుంటాం. అక్కడే బోల్తాపడిపోతుంటాం. నిజానికి, పైకి కనిపించేవాటికీ, వారికీ ఆమడ దూరం వుంటుందన్న వాస్తవం మరచిపోతుంటాం.
అన్నింటికీ మినహాయింపు వున్నట్టే ఈ సూత్రం నుంచి వేరు చేసి చూడాల్సిన మహానుభావులు లేకపోలేదు.
వారు పుణ్య పురుషులు. మిగిలినవారు కాపురుషులు.
ఎవరో చూస్తున్నారు
ఇదేమీ A Certificate సినిమా టైటిల్ కాదు.
ఈ మాటను రాజకీయ నాయకులు, సినిమా తారలు, రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్న వారు అనుక్షణం గుర్తు పెట్టుకోవాల్సిన రోజులు వచ్చాయి. ఏమి చేసినా, ఏమి మాట్లాడినా, ఎవరో చూస్తున్నారు, ఎవరో వింటున్నారు అనే సోయిలో వుండాలి. (గోడలకు చెవులే కాదు ఈ కాలంలో సీసీ కెమెరాలు, టీవీ కెమెరాలు, సెల్ ఫోన్ కెమెరాలు వంటి కళ్ళు కూడా వచ్చి చేరాయి)
లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు టీవీ తెరల మీదనో, సోషల్ మీడియాలోనో అవే దృశ్యాలు, అవే సంభాషణలు మీరే చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కస్సుబుస్సులు వినబడేది మీ ఇంటి వారి నుంచే సుమా!
కాబట్టి, కావున
తస్మాత్ జాగ్రత!










(ఇంకావుంది)

అయాం ఎ బిగ్ జీరో: (322): భండారు శ్రీనివాసరావు

నాకూ సెంటి మెంట్లు వున్నాయ్!

భగవంతుడు అనే వాడికి ప్రతిరోజూ వంగి వంగి నమస్కారం పెట్టక్కర లేదు. రోజూ, ఆ రోజు ముగిసే సమయానికి ‘దేవుడా! ఓ దండం!’ అంటూ కృతజ్ఞత చెబితే చాలు.
ఆయన నాకు అన్నీ ఇచ్చాడు. కొన్ని తీసుకున్నాడు. అంతే కానీ నా జీవితంతో చెడుగుడు మాత్రం ఆదుకోలేదు. ఆయన చేతిలో వున్న సాయం చేస్తూనే వస్తున్నాడు, ఏనాడూ పూజలు, పునస్కారాలు చేయకపోయినా.
పని లేకుండా పడి వుండడం కూడా ఒక పనేనేమో!
ఏమీ తోచక ఏదో ఒక పని చేస్తుంటాం, మా వయసు వాళ్ళం.
మొన్నశనివారం నాడు, ఇలాంటి పని లేని పనే ఒకటి చేస్తుంటే ఒక పెద్ద పని వచ్చి మీద పడింది. నిజంగా అది నా చేతిలో లేని పనే.
మా వెహికిల్ RC రెన్యువల్ గడువు వారం పది రోజుల్లో ముగియబోతోంది అనే విషయం ఆ వెతుకులాటలో తెలిసింది. ఏం చెయ్యాలో గూగుల్ చెప్పింది. ఆర్సీ ఒరిజినల్, వెహికిల్ ఇన్సురెన్స్, పియుసి . వెహికిల్ ఆర్సీ రెన్యువల్ కు, ఎప్పుడో చదివిన పీయుసీ సర్టిఫికేట్ కు సంబంధం ఏమిటి అని బుర్రబద్దలు కొట్టుకోకుండానే, గూగులమ్మే చెప్పింది, పొల్యుషన్ అండర్ కంట్రోల్ సరిఫికేట్ అని.
సరే! అన్నీ రెడీగానే వున్నాయని, నిన్న సోమవారం నాడు డ్రైవర్ ని పెట్టుకుని ఖైరతాబాదు ఆర్టీయే ఆఫీసుకు బయలుదేరాను.
బయలుదేరాను కానీ, అక్కడ ఎవర్ని కలవాలి? అసలే ఎండ దంచి కొడుతోంది నిన్న పొద్దటి నుంచే.
ఫోను డైరీ ఓపెన్ చేశాను. JCT, Ramesh అనే ఒక నెంబరు కనిపించింది. ఈ అధికారి ఇంకా అక్కడే వున్నారో లేదో కూడా తెలియదు. హిందూ పత్రిక రవికాంత రెడ్డి ద్వారా ఈ నెంబరు తీసుకున్న గుర్తు. ఫోన్ చేద్దామంటే అసలే ముఖ పరిచయం కూడా లేదు. దాంతో ఒక ఎస్సెమ్మెస్ పెట్టాను. ‘ఇదీ నా పని, ఎవరిని కలవాలి?’ అని. అసలే తెలియని నెంబరు నుంచి మెసేజ్, ఎవరు చూస్తారు ఈ రోజుల్లో. నిజానికి నేనే చూడను.
ఆశ్చర్యంగా అయిదు నిమిషాల్లో జవాబు వచ్చింది. ‘సచివాలయంలో మీటింగు వుంది, నేను ఆఫీసులో వుండడం లేదు, కిష్టయ్య గారని వుంటారు, వారిని కలవండి’
‘ఇలాంటి అధికారులు ఈ కాలంలో ఉంటారా’ అని ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపు ఆర్టీయే ఆఫీసు వచ్చింది.
‘ఎవరీ కిష్టయ్య గార’ని అక్కడ ఒక యూనిఫారంలో వున్న మనిషిని వాకబు చేస్తే, ఒక గది చూపించి అక్కడికి వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళడమే కాకుండా, లోపలకు తీసుకుని వెళ్లి కూర్చో బెట్టాడు.
అక్కడ సంగీత్ అనే ఉద్యోగి (పేరు చిత్రంగా వుంది కనుక గుర్తుండిపోయింది) నా వివరాలు కనుక్కుని ‘సార్! వచ్చే టైం అయింది’ అని చెబుతుండగానే, ఒక ఆజానుబాహువు అయిన వ్యక్తి లోపలకు వస్తూనే ‘ ‘మీరు శ్రీనివాసరావు గారు కదా! చెప్పండి ఏమిటి పని? ఇంతకీ మీరు గ్రీన్ టీ తాగుతారా , మామూలు చాయ్ తెప్పించనా?’ అంటూ, నా జవాబు కోసం ఎదురు చూడకుండానే రెండు గ్రీన్ టీ అని వెంటవచ్చిన తన నాలుగో తరగతి అధికారితో చెప్పేశారు.
నాకు ఆశ్చర్యం స్థానంలో, ‘ఇంతకీ నేను ఎవరని అనుకుంటున్నారు’ అనే అనుమానం అలుముకుంది. దాన్ని నివృత్తి చేస్తూ ఆయనే, ఆర్సీ ఒరిజినల్, మిగిలిన డాక్యుమెంట్స్ అడిగి తీసుకుని ‘మీరు అలా కూర్చుని టీ తాగండి, మా సంగీత్ గారు మీ డాక్యుమెంట్స్ సంగతి చూస్తారు’ అంటూ యాంటీ రూమ్ లోకి వెళ్లి సివిల్ డ్రెస్ స్థానంలో ఆఫీసు యూనిఫారం వేసుకుని బయటకి వచ్చారు.
కొత్తగా కలిసిన, ఇంకా పూర్తిగా పరిచయం కాని ఈ ఆర్టీవో కిష్టయ్య గారిలో నాకు కొట్టవచ్చినట్టు కానవచ్చిన ఓ విషయం ఏమిటంటే ఎవరితో మాట్లాడుతున్నా చిరునవ్వు చెదరక పోవడం, తన కింది సిబ్బందితో కూడా మన్ననగా వ్యవహరించడం.
ఒక పక్క నా పని సంగీత్ చూస్తున్నారు. పదిహేను సంవత్సరాల సర్వీసు దాటిన వెహికిల్ కనుక గ్రీన్ టాక్స్, ఇతర ప్రభుత్వ టాక్సులు వెరసి పదివేల చిల్లర అక్కడికక్కడే జీ పే ద్వారా చెల్లించాను. పక్కనే ఫోటో తీసే ఏర్పాటు వుంది. తర్వాత కార్డు ప్రింటయి వచ్చింది.
ఈలోగా రమేశ్ గారు సచివాలయం నుంచి వచ్చి, తన ఛాంబర్ కు వెడుతూ మధ్యలో ఆర్టీవో రూమ్ కు వచ్చి నా గురించి వాకబు చేస్తున్నప్పుడు, వారే రమేశ్ గారనే గ్రహింపు కలిగి ధన్యవాదాలు చెప్పాను. సాయం చేయాలనే మనసు వుండాలే కానీ ముఖ పరిచయాలు అక్కరలేదు. దేవుడికి నేనేం తెలుసని ఇలాంటి మంచి వ్యక్తులను నాతో కలిపాడు?
అమ్మబోతే అడవి లాంటి, పదిహేనేళ్ల నాటి పాత కారు ఆర్సీ రెన్యువల్ కోసం పదివేలు ఖర్చు చేసిన నన్ను చూసి మా డ్రైవర్ నవ్వుకుని వుంటాడు.
ఒకానొక కాలంలో నేను మా ఆవిడతో కలిసి తిరిగిన కారు అది. మరో అయిదేళ్లు దాంట్లోనే తిరగమని సర్కారు వారు ఇచ్చే అనుమతి కోసం నేను ఖర్చు పెట్టిన పది వేలు నిజానికి చాలా చిన్ని మొత్తం. తిరిగినా తిరక్క పోయినా అది నా కళ్ళ ముందు వుంటుంది.
నాకు సెంటిమెంట్స్ గట్రా లేవని పైకి చెప్పుకు తిరుగుతా కానీ,
నేనూ సెంటిమెంట్లకు అతీతం కాదు.
నిరుడు అమెరికా వెళ్ళినప్పుడు మా ఆవిడ నిర్మల నీళ్ళు పోసి పెంచిన తులసికోట ఆ మూడు నెలల కాలంలో పూర్తిగా ఎండిపోయింది. రెండు పూటలా నీళ్ళు పోస్తూ అది మళ్ళీ చిగురించేలా చేయడానికి రెండు నెలలు పట్టింది. అదీ నా సెంటిమెంటు.
కింది ఫోటో:
ఆర్టీవో కిష్టయ్య గారితో





(ఇంకావుంది)