3, డిసెంబర్ 2024, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (25) - భండారు శ్రీనివాసరావు

 


మా బావగారింట్లో చిన్న క్లాసులు, పెద్ద క్లాసులు చదువుకునే నలుగురు స్కూలు  పిల్లలం వుండేవాళ్ళం. మా బావగారి అన్నగారి పిల్లలు ఇద్దరు, రమణారావు, వెంకటేశ్వర రావు, నేను, శాయిబాబు. నేను అక్కడ వుండి చదువుకుంటున్న కాలంలోనే, మా అక్కయ్యకు ఇద్దరు మగపిల్లలు, (రాఘవరావు, భైర్రాజు), నలుగురు ఆడపిల్లలు (సత్యవతి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, సుబ్బలక్ష్మి) పుట్టారు. నా చిన్నతనంలోనే, వారి చిన్నతనాన్ని, వారి పెంపకాన్ని కళ్ళారా చూశాను. పసివాళ్ళుగా వున్నప్పుడు వాళ్ళని కాళ్ళమీద పడుకోబెట్టుకుని డబ్బా పాలు పట్టేది మా అక్కయ్య. బాగా పనిలో వున్నప్పుడు ఆ బాధ్యత పెద్దపిల్లల్లో ఎవరో ఒకరి మీద పడేది. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు చంకనెత్తుకుని, పక్కనే పాండురంగ మహత్యం ఆడుతున్న లక్ష్మీటాకీసు దగ్గరికి తీసుకు వెళ్ళేవాళ్ళం.  ఆ రోజుల్లో ఏసీ హాళ్ళు కాదు కనుక, మాటలు పాటలు స్పష్టంగా పెద్దగా బయటికి వినపడేవి. హే కృష్ణా ముకుందా మురారీ పాట అయిపోయేసరికి పసిపిల్ల భుజం మీదే నిద్రపోయేది.

నాకూ, శాయిబాబుకు ఒక స్పెషల్ డ్యూటీ. బావగారికి నశ్యం అలవాటు వారి తండ్రి భైర్రాజు గారి నుంచి వారసత్వంగా వచ్చింది. అది కూడా  స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకునే వారు. బజారులో శ్రేష్టమైన పొగాకు కాడలు కొనుక్కుని వచ్చి మాకు ఇచ్చేవాడు.  కుంపట్లో బొగ్గులు వెలిగించి,  వాటిపై ఆ కాడలు ఒక రంగులోకి మారేవరకు కాల్చేవాళ్ళం. తరువాత కొంత సున్నం, ఒకటి రెండు నేతి చుక్కలు కలిపేవాళ్ళం. ఆ మిశ్రమాన్ని కల్వం లాంటి దానిలో వేసి, నూరి  పొడి పొడిగా చేసేవాళ్ళం.  మా బావగారు వచ్చి, మధ్య వేలు, బొటనవేలుతో ఆ నశ్యం పట్టుకుని ఒక పట్టు పట్టి పీల్చి, సరే అన్న తర్వాత కానీ మా పని పూర్తయ్యేది కాదు.  అది ఫైనల్  క్వాలిటీ టెస్టింగ్ అన్నమాట. తరువాత ఆ నశ్యాన్ని డబ్బాల్లో కూరేవాళ్ళం.  బావగారు పెద్ద వకీలు కాబట్టి,  వాటిని ఏమంటారో తెలియదు కానీ, వెలక్కాయల వంటి కాయల్లో లోపల గుజ్జు తీసి, వెండిపొన్నుతో  బిరడాలు చేయించి ఇచ్చేవారు.  నాకు గుర్తున్నంత వరకు ఇది నశ్యం తయారీ విధానం. గుర్తు చేయడానికి నా దురదృష్టం శాయిబాబు ఇప్పుడు లేడు. గుర్తు చేసుకునే జ్ఞాపక శక్తి నాకు లేదు. ముందే చెప్పా కదా నేనో బిగ్ జీరో అని. వున్నది మూడు గదులే. బావగారి ఆఫీసు గది కొంచెం పెద్ది. కానీ దాని నిండా లా పుస్తకాలు వున్న అద్దాల తలుపుల అల్మరాలే. వాటి మధ్య ఒక పెద్ద మేజాబల్ల. రెమింగ్టన్ టైపు రైటర్.  రివాల్వింగ్ చైర్. రివాల్వింగ్ అల్మరా. బయట వరండాలో మరో రెండు బీరువాలు. పక్కనే ప్లీడరు గుమాస్తా గారు ముందు చిన్న వ్రాత బల్ల పెట్టుకుని ఏరోజుకారోజు కోర్టు దావా తేదీలను గురించి అడిగిన క్లయింట్లకు చెబుతుండేవారు.  ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పినాయిల్ తో ఇల్లు శుభ్రం చేసేవారు. దుమ్ము కనపడితే ఆయనకు కోపం నషాళానికి అంటేది. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇంటికి నాలుగు వైపులా అన్నిద్వారాలకు వట్టివేళ్ళ తడికెలు కట్టేవాళ్ళం. వాటిని ఎప్పటికప్పుడు తడుపుతూ వుండడం పిల్లల పని.   

బావగారి ఇంటి పక్కన మరి కొన్ని వాటాలు ఉండేవి. మొత్తం ఆ ఇళ్ళ సముదాయాన్ని ఆవనం అనేవారు. ఆ పేరు ఎలా వచ్చిందో నాకిప్పటికీ తెలియదు. ఆ మొత్తం సామ్రాజ్యానికి  సోవమ్మ గారనే అమ్ముమ్మ గారు మకుటం లేని మహారాణి. కాపురానికి వచ్చి ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆస్తినీ, పిల్లల్నీ  కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అంచేత ఆవిడకి డబ్బు విలువ తెలుసు.   మగసంతు లేదు.  ఆడపిల్లలకు పుట్టిన  మగపిల్లలనే తన దగ్గర పెట్టుకుని పెంచింది. మనసు మంచిది, ఆపేక్షలు తెలిసిన మనిషి. కానీ నోటి దాష్టీకం జాస్తి.

ఆవనంలో వున్న అన్ని వాటాలకి కలిపి సోవమ్మ గారి ఇంటి ముందు ఒక మునిసిపల్ పంపు (నల్లా) వుండేది. ఆమె మడి స్నానం చేసి, మడిబట్టలు కట్టుకునే దాకా ఎవరూ అటు పోవడానికి వీల్లేదు. పిల్లలు ఎవరన్నా పంపు తిప్పి మరచిపోతే ఇంటి పైకప్పులు ఎగిరిపోయేట్టు తిట్లు, శాపనార్ధాలు లంఖించుకునేది.  దాంతో మా బావగారు సొంత ఖర్చుతో, తన వాటాలో ఇంటి వెనుక  ఒక బోరింగ్  పంపు వేయించారు.

సోవమ్మగారు,  వాళ్ళు కాపురం వుండగా మిగిలిన వాటాలను అద్దెకు ఇచ్చింది. ఎవరూ ఖాళీ చేసేవాళ్ళు కాదు, అద్దె పెంచడానికి ఒప్పుకునే వాళ్ళూ కాదు. దాంతో ప్రతినెలా మొదటి వారంలో హోరాహోరీ మాటల యుద్ధాలు జరిగేవి.  నిజానికి న్యాయం ఆవిడ వైపే వున్నా, ఆమె చేసే ఆ యాగీ చూసిన వాళ్ళు, తప్పు ఆమెదే అనుకునే వాళ్ళు.

ఒక వాటాలో కృష్ణమూర్తి గారు అనే  నాటకాల నటుడు  కుటుంబంతో వుండేవారు. భార్య మీనాంబ గారు. చాలా మంచి మనిషి. ఇంట్లో  మంచి కలపతో చేసిన తూగుటుయ్యాల వుండేది. మేము ఊగుతున్నా అభ్యంతర పెట్టేది కాదు. వారికి  ఇద్దరు మగపిల్లలు, ధర్మరాజు, అంభి, ఇద్దరు ఆడపిల్లలు  తంగం,  ఆడి. తమిళ నాడు నుంచి వచ్చి బెజవాడలో సెటిల్ అయ్యారు. భాషలో కొంత అరవ యాస వున్నా తెలుగు బాగానే  మాట్లాడే వాళ్ళు. కృష్ణమూర్తి గారు నాటకాల్లో కృష్ణుడి వేషాలు వేసేవారు. కృష్ణపాత్రలో తాను నటించిన సన్నివేశాల్లోని భంగిమలతో దిగిన పెద్ద పెద్ద ఫోటోలు  గోడలకు ఉండేవి.  నెమలి పింఛం కలిగిన   కిరీటం, దాని వెనుక గుండ్రటి వెలుగు రేఖలు విరజిమ్మే  ఫోటోలు ఎలా తీశారబ్బా  అని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం.  పైగా ఒకే ఫ్రేములో  నాలుగయిదు క్లోజప్ లు. ఫొటోలు  తెలియదు, ట్రిక్ ఫోటోగ్రఫీ సంగతి అసలే  తెలియని వయసు. పొద్దున్నే లేచి స్నానపానాదులు ముగించుకుని, తుంగ చాపమీద కూర్చుని,  హార్మనీ పెట్టె ముందేసుకుని, కృష్ణ రాయబారం పద్యాలను పెద్ద శృతిలో సాధన చేస్తుండేవాడు. ఆ రోజల్లా లోపల, వాళ్ళ సాధన. బయట సోవమ్మ గారి సాధింపు. అంత సంసారాన్నినాటకాల మీద వచ్చే రాబడితో ఎలా లాక్కువచ్చేవాడన్నది  ఇప్పటికి మిస్టరీనే. వారి సంతానంలో ఒకడైన అంభి ఇప్పుడు దుబాయ్ లో ఇల్లు కొనుక్కుని చక్కగా సెటిల్ అయ్యాడు. అలాగే మిగిలిన పిల్లలు కూడా.   

   

అమ్మమ్మ గారి మనుమలు రామచంద్రం, సోము, శాయి, సత్యం అందరూ మా కంటే చిన్నే అయినా, వాళ్ళతోనే మా స్నేహం. అందరూ ఈనాడు పెద్దవాళ్లు అయి జీవితంలో మంచిగా కుదురుకున్నారు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు, పేరంటాల్లో కలుస్తూ వుంటారు. అలా పెరిగిన వాళ్ళు ఎలా బాగుపడతారు? ఎలా  బాగుపడ్డారు అనే అలనాటి, ఈనాటి  నా సందేహానికి  నేనే ఉదాహరణ.

మా బావగారి ఇంటి ముందు ఒక పెద్ద మామిడి చెట్టు. తుర్లపాటి హనుమంతరావు, ఎమ్మే ఎల్ ఎల్ బీ అడ్వొకేట్,  అని ఇంగ్లీష్ లో, తెలుగులో ఎనామిల్ పెయింటుతో  నీలం బ్యాక్ గ్రౌండ్ పై తెల్లటి అక్షరాలతో  రాయించిన బోర్డు ఉన్నప్పటికీ,  బస్సు దిగి వచ్చేవాళ్ళు మాత్రం,   గవర్నర్ పేటలో  మామిడి చెట్టు ఇల్లు అని రిక్షావాడితో చెప్పేవాళ్ళు.  ఇంటి అడ్రసుకు అదో  కొండ గుర్తు. వేసవి కాలం వచ్చేముందు పూత పూసేది. ఇక అప్పటి నుంచి అమ్మమ్మ గారికి కంటి మీద కునుకు వుండేది కాదు. అది కాయలు కాస్తే ఎవరో వచ్చి తెంపుకు పోతారని తెగ వెంపర్లాడేది. బాగా కాయలు కాసే పెద్ద కొమ్మ ఒకటి మా బావగారి డాబా మీద చేతికి అందే ఎత్తులో వుండేది. ఇక ఆ కొమ్మకు వున్నపిందెల లెక్క చూసుకునేది. ఒకటి తక్కువైతే అందర్నీ లెక్క అడిగేది. మాకేం తెలుసు కింద ఎక్కడో రాలిపడి ఉంటుందని బూకరించేవాళ్ళం. ఇలా వాదులాట జరిగే సమయంలో మా అక్కయ్య కల్పించుకుని అమ్మమ్మగారు, నిన్న ఏదో అడిగినట్టున్నారు ఇస్తా రండి అంటూ వంటింట్లోకి తీసుకుపోయేది.  

బజారుగోడకి  మామిడి చెట్టుకి నడుమ చిన్న రేకుల షెడ్డు. ఆవనంలోని ఆడవాళ్ళు అప్పుడప్పుడూ అందులోకి వెళ్లి రెండు మూడు రోజులు బయటకి వచ్చేవాళ్ళు కాదు. వచ్చినా ఎవరూ చూడకుండా వచ్చేవాళ్ళు.  దాన్ని ముట్లగది అనేవాళ్ళు. ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియని  వయసు మాది.

కింది ఫోటోలు :  కర్టెసీ: తుర్లపాటి భైర్రాజు, అడ్వొకేట్ , విజయవాడ 


75 ఏళ్ల క్రితం మా బావగారు చేయించుకున్న నేమ్ బోర్డు


ఆయన వాడిన మేజాబల్ల


 లా పుస్తకాల రివాల్వింగ్ అలమరా





(ఇంకా వుంది)




2, డిసెంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (24) - భండారు శ్రీనివాసరావు

 

 

మా కుటుంబంలో ఇద్దరు ప్రసిద్దులయిన స్త్రీ మూర్తులు వున్నారు. ఇద్దరి పేర్లు ఒకటే అచ్చమాంబ. ఒకరు భండారు అచ్చమాంబ. రెండవవారు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ. మొదటి ఆవిడ రెండో అచ్చమాంబకు స్వయానా మేనత్త.

డాక్టర్ అచ్చమాంబ కొమర్రాజు లక్ష్మణరావుగారనే సుప్రసిద్ధ సాహితీవేత్త కుమార్తె. లక్ష్మణరావుగారు భండారు అచ్చమాంబ గారి సోదరులు. వారిది కృష్ణా జిల్లా నందిగామ వద్ద పెనుగంచిప్రోలు. ఆకాలపు ఆచారాల దృష్ట్యా అచ్చమాంబ గారికి తలితండ్రులు చదువు చెప్పించలేదు. అయితే ఎమ్మే వరకు చదివిన సోదరుడి పక్కనే వుండి సొంతంగా చదువు నేర్చుకుని అనేక భాషల్లో పండితురాలు కాగలిగిన పట్టుదల అచ్చమాంబ గారిది. తెలుగులో మొదటి కధ రాసింది భండారు అచ్చమాంబ అనే ప్రచారం ఒకటి వుంది. ఆవిడ మేనకోడలు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ బెజవాడలో పేరెన్నికగన్న వైద్యురాలు. విజయ టాకీసు ఎదురుగా ఉన్న రామచంద్రరావు రోడ్డు ( ఆయన మా పెద్ద మేనమామ, గొప్ప వకీలు) లో అచ్చమాంబ గారి ఆసుపత్రి వుండేది. తెల్లగా పొడుగ్గా తెల్లటి చీరె కట్టుకుని హుందాగా చేతిలో స్టెతస్కోప్ పట్టుకుని ఆస్పత్రిలో ప్రతి మంచం వద్దకు వెళ్లి రోగుల యోగక్షేమాలు విచారిస్తూ వుండేది. నిజానికి అక్కడ వేరే రోగాలతో బాధపడే వాళ్ళు ఎవరూ వుండేవారు కాదు. అందరూ రేపోమాపో పండంటి బిడ్డను కనడానికి ఆసుపత్రిలో చేరిన గర్భిణులే. పేరుకు నర్సింగ్ హోం అయినా నిజానికి పురుళ్ల ఆసుపత్రి. ఆమె హస్తవాసి మంచిది అనే మంచి పేరు వుండేది. మా బెజవాడ అక్కయ్య కానుపులన్నీ అచ్చమాంబ గారి ఆసుపత్రి లోనే. సాధారణంగా ఆవిడ కాలు బయటపెట్టి ఇళ్లకు వెళ్లి చూసేది కాదు. కానీ మా బావగారు కూడా బెజవాడలో సీనియర్ లాయర్. వారిద్దరి మధ్య గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం వుండేది. అంచేత మా అక్కయ్య గారు కడుపుతో వున్నప్పుడు ఎప్పుడైనా అవసరం పడి కబురు చేస్తే ఇంటికి వచ్చేవారు. ఆవిడ ఇంట్లోకి అడుగుపెట్టగానే, పాత సినిమాల్లో చూపించినట్టు, ఆమె చేతినుంచి తోలు పటకా  సంచిని మర్యాదగా అందుకుని ఆమెను వెంటబెట్టుకుని రావడం మా పిల్లల డ్యూటీ. రాగానే డాక్టరుగారు ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కునేవారు. సంచీలోనుంచి ధర్మామీటరు తీసి మా అక్కయ్య నోట్లో పెట్టి, కళ్ళజోడు కాసింత పైకి ఎత్తి పట్టి రీడింగ్ చూసేవారు. స్టెతస్కోప్ తో ఏవో పరీక్షలు చేసే వారు. రెండు మూడు ప్రశ్నలు అడిగి చేతికి బీపీ మిషన్ తగిలించి రబ్బరు తిత్తిని నొక్కుతూ మిషన్ లో పాదరసం పైకి కిందికి తిరగడం గమనించి సాలోచనగా కాసేపు పరికించి చూసి సంచీ నుంచి ఓ చిన్న పుస్తకం తీసి అవసరమైన మందులు రాసి ఇచ్చేవారు. ఎంతో అవసరం అనుకుంటే తప్ప ఇంజక్షన్ చేసేవారు కాదు. ఒకవేళ చేయాల్సివస్తే పిల్లలం అందరం భయంతో ఆ గదిలోనుంచి పారిపోయేవాళ్ళం.

ఇవన్నీ అయిన తర్వాత మేము పిలుచుకు వచ్చిన రిక్షా ఎక్కి ఆసుపత్రికి వెళ్ళిపోయే వారు. పోయే ముందు మా బావగారితో ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడేవారు. ఆమె ఆయనా తప్ప, ఇంట్లో మిగిలినవాళ్ళు అందరూ గప్ చుప్. 

మా బావగారి ఇంట్లో, మా బంధువుల ఇళ్ళల్లో పురుళ్ళూ పుణ్యాలు అన్నీ ఆవిడ ఆసుపత్రిలోనే. ఆవిడ పుణ్యమే!

ఇంట్లో అంతమంది పిల్లలు వున్నా కూడా పెద్దగా ఆసుపత్రులతో పని పడేది కాదు. చిన్నా చితకా వాటికి కస్తూరి మాత్రలు, అల్లం, జీలకర్ర, వాము రసాలతో సరిపుచ్చేవారు. కాకపొతే, మా పిల్లలు అందరిలో   శాయిబాబుది కొంచెం బలహీనమైన శరీరం. సన్నగా పీలగా వుండేవాడు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం అని ఒక ప్రసిద్ధ ఆయుర్వేద ఔషదాల సంస్థ వారిని సంప్రదించి అక్కడి నుంచి మందులు తెప్పించి వాడేవారు. అలాగే బెజవాడలో రామ్మోహన ఆయుర్వేద వైద్య శాలలో తయారైన మందులు వాడేవారు. అయితే ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఈ మందులతో పని లేకుండా శాయిబాబు ఆరోగ్యం కుదుటపడింది. అతడి తెలివితేటలు మాత్రం  అమోఘం. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి ప్రతిఫలించినట్టు ఆయన పక్కన తిరిగి నేనూ కొంత చదువుల్లో బాగుపడ్డాను. అయినా అది కొంత మేరకే. పెద్ద పెద్ద  మార్కులు రాకపోయినా, అతడితో కలిసి చదువుకున్నన్నాళ్ళు ఏ పరీక్షలో తప్పే భాగ్యం నాకు  కలగలేదు.  

మా బావగారు మా ఇద్దర్నీ ముందు ఇంటికి నడక దూరంలోవున్న అరెండేల్ (అరండల్) సత్రంలో నడుస్తున్న మునిసిపల్ ప్రాధమిక పాఠశాలలో చేర్పించారు. ఆ సత్రం బ్రిటిష్ వాళ్ళ హయాములో నిర్మించి వుంటారు. బాగా పాతది అయినా చాలా అందంగా చక్కగా కళాత్మకంగా వుండేది. దానికి వాడిన కలప, చెక్కిన నగిషీలు అలాంటివి. సత్రం అంటే ఏమిటో తెలియని వయసులో ఆ సత్రంలోని ఒక భాగంలో నడిచిన మునిసిపల్ స్కూల్లో కొన్ని తరగతులు చదివాము. ఆ రోజుల్లోనే అప్పటి భారత ప్రభుత్వం, అంతవరకూ చెలామణీలో ఉన్న పాత నాణేలు, కాణి, అర్ధణా, బేడ, అర్ధరూపాయి, రూపాయి స్థానంలో కొత్త డెసిమల్ పద్దతి ప్రవేశ పెట్టింది. పైసా, అయిదు పైసలు, పది పైసలు, పాతిక పైసలు (పావలా), యాభయ్ పైసలు (అర్ధరూపాయి), నూరు పైసలు (రూపాయి) ఇలా అన్నమాట. పైసా నాణెం తళతళా మెరిసే రాగి నాణెం. చూడ ముచ్చటగా వుండేది. అది దగ్గర వుంటే చాలు  మనం ఓ కింగ్ అనే ఫీలింగ్. అది చేతిలో వుంటే  వొలకబోసే ఆ దర్జానే వేరు. కొత్తగా వచ్చింది కాబట్టి నయా పైసా అనేవాళ్ళు.  పైసాకు కూడా విలువ వుండే రోజులు. పాతిక పైసల వరకూ అన్నీ నికెల్ నాణేలు. అర్ధరూపాయి, రూపాయి సిల్వర్. అంటే వెండి కాదు.  

తరువాత మా బడి సీవీఆర్ హైస్కూలుకు మారింది. అది సిటీ సివిల్ కోర్టు భవనాలకు ఎదురుగా వుండేది. బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ (చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్  హైస్కూలు) భవనం,  విశాలమైన ప్రాంగణంలో వుండేది. నడిమధ్యలో రాజసం వొలకబోసే రాతికట్టడం. దానికి ఇరువైపులా తరగతి గదులు. ప్రధాన భవనంలో మెట్లకింద,  తెల్లని పంచె, లాల్చీ కండువా  ధరించిన సంస్కృతం మాస్టారు గారి  నోటివెంట  'రామః రామౌ, హే రామ హే రామౌ........'  అంటూ మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.

 అలా ఆయన  చదువుతుంటే,  మేము ఒక పదిమందిమి కాబోలు సంస్కృతం రెండో భాషగా తీసుకున్నవాళ్ళం,  శ్రద్ధగా వింటూ మాస్టారు చెప్పింది వల్లె వేస్తూ వుండేవాళ్ళం. ఇంగ్లీష్, తెలుగు, లెక్కలు, ఇతర సబ్జక్టులు బోధించడానికి తరగతి గదులు విడిగా ఉండేవి కాని సంస్కృతం క్లాసు మాత్రం, శబ్ధమంజరి, అమరకోశం చెప్పుకుంటూ   మెట్ల కిందే నడిచేది. ఆ భాషకు ఇచ్చిన ప్రాముఖ్యం అది.  అది ఒకప్పటి జ్ఞాపకం.

వీవీఎస్ శర్మగారు (ఫేస్ బుక్ పెద్దాయన ) బతికి వున్నప్పుడు సంస్కృతం భాష వైశిష్ట్యాన్ని గురించి ఇలా రాసారు.

“ అందరికీ ఎస్వీ రంగారావు, సావిత్రి నటించిన నలుపు తెలుపు మాయాబజార్ సినిమా గుర్తుండే వుంటుంది. ఘటోత్కచుడి బృందానికి చిన్నమయ్య పాఠాలు చెబుతుంటాడు. లంబు, జంబు ఇత్యాది శిష్యులకు చిన్నమయ్య మాటల్లో వినబడే శబ్దాలు గమనించండి. ‘ ఔ, జస్, అం, ఔట్, బిస్, భ్యాం, భ్యస్. సంస్కృత శబ్దాలు రామః, రామౌ, రామా, రామేణ, రామాభ్యాం, రామై వలె ధ్వనిస్తాయి అని ఆయన రాసారు.  

పొతే అప్పుడెప్పుడో నెట్లో కానవచ్చిన ఒక ఆసక్తికర సమాచారాన్ని మిత్రులు శ్రీ పీ.వీ.వీ.జీ. స్వామిగారు అమెరికా నుంచి  పంపారు. ఆ ఇంగ్లీష్ వార్తకు నా తెలుగు అనువాదం నా సొంత బాణీలో :    

ఒకానొకకాలంలో సూర్యుడు అస్తమించని సువిశాల సామ్రాజ్యానికి అది రాజధాని. అన్ని భాషలకు మాతృభాషగా పేరొందిన సంస్కృతం పరిఢవిల్లిన  అఖండ భారతాన్ని వందల సంవత్సరాలపాటు బానిస దేశంగా పాలించిన బ్రిటిష్ ప్రభువుల రాజధాని నగరం.  అలాటి ఇంగ్లీష్ గడ్డ అయిన లండన్ నగరంలో సంస్కృతాన్ని బోధించే పాఠశాల. వినడానికే విచిత్రం అనిపించినా ఇది నిజం. లండన్ లోని సెంట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్లో సంస్కృత భాషా విభాగం అధిపతి వార్విక్ జేస్సప్ మాటల్లో మిగిలింది తెలుసుకుందాం.

"ప్రపంచం మొత్తంలో సంస్కృతంతో పోల్చచదగిన ఉత్కృష్టమైన భాష మరొకటి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మన్ ప్రజలు జర్మన్ మాట్లాడతారు. మాట్లాడే ప్రజల పేరుతోనే ఆ భాషలకు నామకరణం చేసారు. సంస్కృతం ఒక్కటే మినహాయింపు. ఆ ఒక్క భాష చక్కగా నేర్చుకుంటే చాలు, సైన్సు, గణితం వంటి ఇతర అంశాలపై పట్టు చిక్కించుకోవడం సులభం అవుతుంది'   

ఇక ఆ స్కూలు హెడ్ మాష్టర్ పాల్ మాస్ గారు సంస్కృతం గురించి మరింత గొప్ప కితాబు ఇచ్చారు.

'దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకుంటే విద్యార్ధులకు తమ చేతివేళ్ళపై గట్టి పట్టుచిక్కుతుంది. సంస్కృతంలో మాట్లాడడం  వస్తే ఇక ఆ నాలుకకు అడ్డే వుండదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది'  

పాల్ మహాశయులు అంతటితో ఆగలేది.ఇంకా ఇలా వివరించారు.

'యూరోపియన్ భాషలు మాట్లాడేవాళ్ళు నాలుకలో వుండే అన్నిభాగాలను  ఉపయోగించరు. నాలుక కొసతో మాట్లాడేస్తుంటారు. రాసేటప్పుడు కూడా వేళ్ళల్లోని అన్నికదలికలను వాడరు. అదే సంస్కృతం మాట్లాడడం అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది'

తోక టపా: ఈ ఇంగ్లీష్ స్కూల్లో సంస్కృతం సెకండ్ లాంగ్ వేజ్ గా తీసుకునేవాళ్ళు విధిగా ఆరేళ్ళపాటు ఆ భాషను అధ్యయనం చేయాల్సివుంటుంది. (మెట్ల కింద కాదు. చక్కటి తరగతి గదులు వున్నాయి) సంస్కృత విద్యార్ధులకు స్కూల్లో శాకాహార భోజనమే లభిస్తుంది.”

మంచి విషయాలు విన్నట్టు వుంది కదూ!    

కింది ఫోటోలు:


 నా నేస్తం, నా గురువు తుర్లపాటి సాంబశివరావు (శాయిబాబు)



భండారు అచ్చమాంబ


డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ








(ఇంకావుంది)

1, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (23) - భండారు శ్రీనివాసరావు

 

మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి వారు. మా ఊరు కంభంపాడుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి గుట్ట అనే స్వామివారి పుణ్య క్షేత్రం వుంది. మా కుటుంబంలో పుట్టిన పిల్లల పుట్టు వెంట్రుకలు, అన్నప్రాసన మొదలైనవి   ఆ గుట్ట మీద స్వామివారి సన్నిధిలో జరపడం ఆనవాయితీ. మా ఊరు నుంచి నాలుగయిదు బండ్లలో బయలుదేరేవాళ్ళం. అందులో పైన ఎండ తగలకుండా గుడిసె వున్న రెండు బండ్లు పెద్దవాళ్లకు, ఆడవాళ్ళకు, పసిపిల్లలకు. రెండు బండ్లలో ఇంటి పురోహితులు, వంట బ్రాహ్మణులు, పెద్దపిల్లలు. ఇంకో బండిలో గుండిగెలు మొదలైన వంట పాత్రలు, బియ్యం తదితర వంట సామాగ్రి, కట్టెలు, పనివాళ్లు. వాళ్ళు వంతులు వేసుకుని బండ్ల వెంట కాపలాగా రాత్రంతా  నడిచేవాళ్ళు. దొంగల భయం వల్ల కాదు. బండి బాట ఎగుడుదిగుడుగా వున్న చోట బండి పక్కకు ఒరిగి పోకుండా వాళ్ళు దన్నుగా వుండేవాళ్ళు.   రాత్రి అన్నాలు తిని అర్ధరాత్రి తర్వాత  ఎప్పుడో సామాన్లు సర్దుకుని బయలుదేరితే, తెలతెలవారుతుండగా తిరుమలగిరి చేరుకునేవాళ్ళం.

గుట్టమీద దేవుడు. గుట్టకింద అన్నీ ఊడలు దిగిన మర్రి చెట్లు. భక్తులు వంట చేసుకోవడానికి మూడు రాళ్ళతో ఏర్పాటు చేసుకున్న  పొయ్యిలు అనేకం  ఆ చెట్ల కింద కానవస్తాయి. దాదాపు అడవి మాదిరిగా అన్నీ చెట్లు, ప్రధానంగా ఈత, తాటి చెట్లు. ఎక్కడ చూసినా గుబురుగా మిన్నాగులు తిరిగే మొగలి  పొదలు. కిందనే  స్నానాలు చేసి మెట్ల మీదుగా గుడి చేరుకోవాలి. దైవ దర్శనం చేసుకునే దాకా ఎవరూ ఏమీ తినకూడదు. పైగా పైకి వెళ్ళిన వాళ్ళు చీకటి పడేలోగా కిందికి వెళ్లి తీరాలని హెచ్చరికలు. పూజారులు కూడా చీకటి పడితే కొండపైన వుండేవాళ్ళు కాదు. రాత్రి వేళల్లో  ఒక మహా సర్పం ఆ గుట్టను చుట్టుకుని కాపలా కాస్తుందని చెప్పుకునే వారు.

మా కుటుంబం, పురోహితులు గుట్ట పైకి వెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చేలోగా కింద వంటలు తయారయ్యేవి. ప్రతి మెట్టు మీద అందుకు విరాళం ఇచ్చిన దాతల పేర్లు వుంటాయి. మెట్ల దారిలో కొంత దూరం పైకి వెడుతున్నప్పుడు కుడిపక్క రాతి కొండ మధ్యలో  కోనేరు.  అందులోని నీటిని అటూ ఇటూ చేతితో తొలిపి కాళ్ళు కడుక్కుని నెత్తిన నీళ్ళు చల్లుకునే వాళ్ళం. ఎందుకంటే ఆ కోనేటి నీళ్ళు  పచ్చగా పాచిపట్టి వుండేవి. దీనికో ఐతిహ్యం చెప్పేవాళ్ళు. ఆ గుట్టమీద నుంచి చూస్తే సుదూరంలో చాలా ఎత్తైన కొంగర మల్లయ్య గుట్ట కనిపిస్తుంది. దాని మీద చిన్న సైజులో కనబడే కొంగర మల్లయ్య (మహాశివుడు) గుడి. ఒకసారి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామికి, కొంగర మల్లయ్య శివుడికి ఏదో పేచీ వచ్చి ఒకరినొకరు శపించుకున్నారట. నువ్వు ఉన్న  గుట్ట భక్తులకు అందనంత ఎత్తుకు  పెరిగిపోయి నీకు నిత్య ధూప నైవేద్యాలు లేకుండా పోతాయి అని తిరుమలగిరి స్వామి శపిస్తే, దానికి ప్రతిగా నీ కోనేరు సతతం పాచిపట్టి, భక్తుల పవిత్ర స్నానాలకు, నీ అభిషేకాలకు పనికి రాకుండా పోతుందని మల్లయ్య తిరుగు శాపం ఇచ్చాడు. దాంతో ఇక్కడి కోనేరు పాచిపట్టిన నీటితో పచ్చగా వుంటుంది.  అలాగే,  హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారిలో చిల్లకల్లు దాటిన తర్వాత కుడి వైపు కొంగర మల్లయ్య గుట్ట,  దానిపై  గుడి చాలా ఎత్తులో వుంటుంది. అంత ఎత్తులో వుండడం వల్ల ఆ గుడిలో నిత్య పూజలు, పునస్కారాలు వుండవు. చిన్నతనంలో బెజవాడ బస్సులో  పోతూ  ఈ కొండ కనిపించినప్పుడల్లా నాకు మా పెద్దలు చెప్పిన ఈ కధ గుర్తుకు వచ్చేది. ఇందులో నిజానిజాలు ఎంత అన్నది చెప్పేవాళ్ళు నాకు తారసపడలేదు.

కొన్ని దశాబ్దాల తరువాత ఈ కొండపైకి నిటారుగా చిన్న మెట్ల వరుస నిర్మించారు. ఆ కొండ పైన టవర్ నిర్మించడానికి కేంద్ర టెలికాం శాఖ ఈ మెట్ల దారి నిర్మించింది. పైన గుడితో పాటు, టెలికాం టవర్ ని కూడా కిందనుంచి చూడవచ్చు. అయితే ధూపదీపవైవేద్యాలు జరుగుతున్నాయా లేదా అనే విషయంలో నాకు నిర్దిష్టమైన సమాచారం లేదు. తిరుమలగిరిలో పాచి కోనేరు మాత్రం ఇప్పటికీ అలాగే వుంది.

వెంకటేశ్వరస్వామి మా ఇలవేలుపు అని చెప్పాకదా! మా కుటుంబంలో పిల్లల అన్నప్రాసనలు, పుట్టు వెంట్రుకలు అన్నీ తిరుమలగిరి స్వామి సన్నిధిలోనే జరిపేవారు. అదొక సాంప్రదాయంగా మారింది. 

మా రెండో అన్నగారు రామచంద్రరావు గారి పెద్ద పిల్లవాడు జవహర్ లాల్, మూడో కుమారుడు లాల్ బహదూర్ ల వివాహాలు తిరుమలగిరిలోనే జరిగాయి. పెద్ద కోడలు రేణు మా రెండో అక్కయ్య కుమార్తె. అలాగే లాల్ బహదూర్ పెళ్లాడింది మా మేనల్లుడు కొమరగిరి రామచంద్రం ఏకైక కుమార్తె దీప. ఒకే కుటుంబానికి చెందిన రెండు కుటుంబాలు కలిసి చేసిన పెళ్ళిళ్ళు కాబట్టి ఆడపిల్లవాళ్ళు, మగపిల్లవాళ్లు అనే తేడా లేకుండా హాయిగా అందరం ఒక తీర్ధయాత్రకు వెళ్లి వచ్చినట్టు, మరో విధంగా చెప్పాలి అంటే ఓ పిక్నిక్ కు వెళ్లినట్టు, అతి నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్ళిళ్ళలోని మాధుర్యాన్ని ఆడుతూ పాడుతూ ఆస్వాదించాము. బయటవారు అంటూ ఎవరూ లేరు, బెజవాడ నుంచి వచ్చిన మండ్రాజుపల్లి అయ్యగారి వంటమనుషులు తప్ప. వధూవరుల దగ్గరి స్నేహితులు కూడా ఎవరూ లేరు. కాకపోతే, ఖమ్మంలో వధువు బాల్య స్నేహితురాలు తిరుమల అనే అమ్మాయి, కధాచిత్ గా పెళ్ళికి ముందు రోజు సాయంత్రం మా బావగారి ఇంటికి రేణుని చూడడానికి వెడితే ఇంటికి తాళం వేసి వుంది.  అందరూ రేణు పెళ్ళికి తిరుమలగిరి వెళ్ళారు అని ఎవరో చెబితే, నేను లేకుండా రేణు పెళ్ళా అంటూ  మొగుడ్ని అప్పటికప్పుడు పట్టుబట్టి ఒప్పించి పిలవని పేరంటం అని భేషజాలకు పోకుండా నైట్ బస్సులో అర్ధరాత్రి ప్రయాణం చేసి చిల్లకల్లులో దిగి కాలినడకన ముహూర్తం టైముకి  తిరుమలగిరి చేరుకుంది. వాళ్ళని చూసి  పెళ్లి కూతురే కాదు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయి స్నేహానికి ఇచ్చిన విలువను అంతా మెచ్చుకున్నారు.

ఇక ఒక ఇంటి వేడుకలా జరిగిన పెళ్లి ఏర్పాట్లను వధువు సోదరులు, స్వయంగా కళా హృదయం కలిగిన మా మేనల్లుళ్లు రాంబాబు, లచ్చుబాబు (ఫేస్ బు క్ లో పేరు   కొలనరావు) భుజాలకు ఎత్తుకున్నారు. ప్రతి విషయంలో నవ్యత్వం కనిపించాలని పడ్డ తాపత్రయం అంతా ఇంతా కాదు. తండ్రి లేని లోటు ఎక్కడా కనపడకూడదని, మేనరికం పెళ్ళే కదా అని, అందులోను  పిల్లవాడి తండ్రి పేచీలు పెట్టని మన మేనమామే కదా అని  తేలికగా తీసుకోకుండా వున్నంతలో ఏలోటు లేకుండా పెళ్లి జరిపించారు. మా బావగారు లేనందువల్ల మా పెద్ద మేనల్లుడు, నా బాల్య స్నేహితుడు రాజన్న (కొలిపాక రాజేంద్రప్రసాద్) గీత  దంపతులు, 1995 ఫిబ్రవరి అయిదో తేదీన జరిగిన ఆ పెళ్ళిలో  కన్నెధార పోశారు. హైదరాబాదులో వున్న బంధువులం అందరం ఒక బస్సులో బయలుదేరి పెళ్ళికి వెళ్ళాం. ఎదురుబదురుగా రెండు సత్రాలు. ఒక దానిలో ఆడపెళ్లి వాళ్ళు, రెండో దానిలో మగపెళ్లి వాళ్ళు. అవి పేరుకు మాత్రమే.  కానీ ఒకే కుటుంబం కావడం వల్ల ఎవరు ఎక్కడ అనే తేడా కానరాలేదు. పెళ్లి కొడుకు పేరు జవహర్ కనుక నెహ్రూకు ఇష్టం అయిన ఎర్ర గులాబీలతోనే, స్వామివారి గుడికి వెళ్ళే దారిలో ముఖ ద్వారానికి ఎదురుగా వున్న కళ్యాణ మంటపాన్ని అలంకరించారు. వధువు పూలజడపై వధూవరుల పేర్లు వచ్చేట్టు పూలను అల్లారు. పెళ్లి పీటల మీదకు వధువును మేనమామలు తీసుకువచ్చే బుట్టను విచ్చుకున్న తామరపువ్వులాగా తయారు చేశారు. వధువు అరచేతుల్లో వుండే కొబ్బరి బొండాంను ముత్యాలతో అలంకరించి దానిపై వధూవరుల పేర్లు రాసారు. అలాగే వారి నడుమ పట్టుకునే అడ్డు తెరపై  లచ్చుబాబు,  బాపూ లిపితో ‘వంగి వంగి చూడమాకు మేనబావా!’ అని రాశాడు. ఈవెంట్ మేనేజ్ మెంట్లు వచ్చిన ఈ రోజుల్లో ఇలాంటివి కొత్త కాకపోవచ్చు కానీ పాతిక ముప్పయ్ ఏళ్ళ క్రితం చూసేవారికి కొత్తగానే వుండేవి.

పెళ్లి ముహూర్తానికి ముందు వధువు తాలూకు వాళ్ళు, వారి వెనుకనే మేము మెట్లదారిలో బయలు దేరాము కానీ మధ్యలో అందరం కలగలిసిపోయాం. పెళ్లిని ఎంత సింపుల్ గా చేయవచ్చో, నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా ఎలా చేయవచ్చో ఈ పెళ్ళికి వెళ్ళిన వాళ్లకు తెలిసివచ్చేలా ఈ పెళ్లి జరిగింది.

మళ్ళీ మూడేళ్ల తరువాత 1998లో రెండో అన్నయ్య రామచంద్రరావు గారి మూడో కుమారుడు లాల్ బహదూర్ వివాహం కూడా ఇంతే సింపుల్ గా తిరుమలగిరిలోనే జరిగింది. (మా అన్నయ్యకు నలుగురు కుమారులు. జవహర్ లాల్, సుభాష్ చంద్ర బోస్, లాల్ బహదూర్, రాజేంద్ర ప్రసాద్) వధువు మా  ఐదో అక్కయ్య అన్నపూర్ణక్కయ్య మనుమరాలు, మా మేనల్లుడు కొమరగిరి రామచంద్ర మూర్తి , కరుణ దంపతుల కుమార్తె దీప. ఈ పెళ్ళిలో కూడా ఆడ, మగ పెళ్లివాళ్ళు  అనే తేడా లేదు. అందరూ అమ్మమ్మ సంతానమే. బయటివాళ్ళు, స్నేహితులు లేరు. అరుపులు, విరుపులు లేవు,  అలకలు లేవు. ఆడంబరాలు లేవు. ఇచ్చిపుచ్చుకోవడాలు అసలు ఇంటావంటా లేవు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే సింపుల్ దాన్ ది వర్డ్ సింపుల్.

మా మేనల్లుడు శ్రీరామచంద్రమూర్తి విశాఖ గ్రామీణ బ్యాంకులో సీనియర్ అధికారిగా పనిచేసి వీ ఆర్ ఎస్. తీసుకున్నాడు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు ఆ బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారు. వాళ్ళ ఇళ్లు శ్రీకాకుళంలో పక్కపక్కనే ఉండేవి. రామచంద్రం కుమార్తె దీప అప్పటికి చాలా చిన్న పిల్ల. మూడు చక్రాల సైకిల్ వేసుకుని మా అన్నయ్య గారి ఇంటికి వెడుతుండేది. ఆ ఆమ్మాయిని చూసి మా వదిన గారు, రావే అమ్మా! ఎప్పటికైనా మా ఇంటికి రావాల్సిన దానివే కదా! అనేదిట. ఆ మాటే నిజమైంది. తరువాత మా అన్నగారు అమెరికాలో స్టేట్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్  గా పనిచేసి, ఇండియా తిరిగి వచ్చిన తరువాత మద్రాసులో ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న రోజుల్లో దీపను తన ఇంటి కోడలుగా చేసుకుంటాను అని కబురు చేశారు. సంబంధం  నిశ్చయం చేసుకునే ముందు కూడా  అన్నగారు, వదిన గారు పిల్లని చూస్తామని మాటమాత్రంగా కూడా  అనకపోవడం తమకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని  దీప తల్లి కరుణ గుర్తు చేసుకుంది. మా అమ్మ నాన్నల వివాహ సమయంలో కూడా అప్పటి పెద్దవాళ్లు  కుటుంబ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి నాకు గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు చూడడం తప్పిస్తే, మళ్ళీ పెళ్లిలోనే వాళ్ళు  దీపను చూడడం. పెళ్లికూతురిగా పెళ్లి పీటల మీద తనను మొదటిసారి చూసినప్పుడు అత్తయ్య, తన జడ చూసి ఎంత బాగుందో అనడం తనకు గుర్తుండిపోయిందని దీప చెబుతూ వుంటుంది. అప్పుడు తను వున్న పరిస్థితుల్లో అమ్మాయికి పది రోజుల్లో పెళ్లి చేయడం తనకు చేతకాని వ్యవహారం అయినా, త్యాగయ్యకు (త్యాగరాజ స్వామి) కూతురు వివాహం చేయడంలో దైవసహాయం లభించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు అనే త్యాగరాయ కృతిని గురించి  రామచంద్రం నాతో చెబుతుండే వాడు.

ఈ పెళ్ళిళ్ళు జరిగి పాతిక ముప్పయ్యేళ్లు దాటింది. రేణు, జవహర్ దంపతులు, దీప, లాల్ దంపతులు ఇరు కుటుంబాల నడుమ మాట రాకుండా,  హాయిగా పిల్లాపాపలతో కాపురాలు చేస్తున్నారు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. వీటన్నిటికీ  దైవసన్నిధిలో పెళ్ళిళ్ళు జరగడం ఒక కారణం కావచ్చు, కానీ ఆ మనుషుల మంచితనమే వారికి శ్రీరామరక్షలా కలిసివచ్చిందనేది నా అభిప్రాయం.

 

కింది ఫోటోలు:


తిరుమలగిరి గుట్ట వద్ద రేణు, జవహర్  పెళ్ళి


తిరుమలగిరి గుట్ట వద్ద దీపలాల్ పెళ్లి 


ఒకప్పుడు తిరుమలగిరి మెట్లు ఎక్కుతూ మా ఆవిడ నిర్మల, మా వదిన గారు విమల





(ఇంకావుంది)