20, జులై 2023, గురువారం
అన్ని రోడ్లు అటువైపే - భండారు శ్రీనివాసరావు
19, జులై 2023, బుధవారం
మౌనమే నీభాష – భండారు శ్రీనివాసరావు
మొన్న జ్వాలా ఫోన్ చేశాడు.
‘
ఎప్పుడూ మేము చేయడమేనా! నువ్వు ఫోన్ చేయవా?’
నిజమే!
కాల్ లిస్టు తీసి చూస్తే అవుట్ గోయింగ్ ఒకటి రెండు కూడా లేవు. అన్నీ ఇన్ కమింగే.
సాయంత్రం
అన్నయ్య కుమార్తె వేణి ఖమ్మం నుంచి ఫోన్ చేసింది.
ఏమిటి
విశేషం అన్నాను మామూలుగా.
అదే
బాబాయ్ నేను చెబుదామని అనుకున్నది. విశేషం ఉంటేనే ఫోన్ చేయాలా! మామూలుగా ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటే చాలా
బాగుంటుంది అన్నది. అంతే కాదు చిన్నతనం నాటి ఒక వృత్తాంతం చెప్పింది. అన్నయ్య ఉద్యోగ రీత్యా వైజాగ్ లో
వున్నప్పుడు పోస్టాఫీసు నుంచి ఓ డజన్ కార్డులు కొనుక్కు వచ్చి వేణి చేతికి ఇచ్చి
చెప్పాడుట. ‘అడ్రసు కూడా రాసి పెట్టాను. నువ్వు చేయాల్సింది అల్లా వారానికి ఒక
కార్డు కంభంపాడులో ఉన్న బామ్మకు పోస్టు చేయి. పెద్ద విశేషాలు రాయక్కరలేదు. మేము
క్షేమం, మీరు కులాసాగా
వున్నారని భావిస్తాను అని రాయి చాలు. పల్లెటూళ్ళో ఉంటున్న ఆమెకు ఈ సమాచారం ఎంతో
ఊరట ఇస్తుంది. మనమంతా తనకు మానసికంగా దగ్గరగా వున్నామనే భావన పెద్దవాళ్లకు చాలా
సంతోషం కలిగిస్తుంది. ఈ వయసులో వారికి కావాల్సింది ఇంతకంటే ఏమీ వుండదు అని.
‘నాన్న
చెప్పింది నా మనసులో ముద్ర పడింది. అందుకే మీ వంటివారికి తరచుగా ఫోన్ చేసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’
మంచి నిర్ణయం వేణీ అన్నాను.
జ్వాలా
చెప్పింది, వేణి
చెప్పింది ఒకటే.
నిజానికి
ఇలాంటి మాటలు అన్నీ నేనే ఒకప్పుడు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ వచ్చాను.
‘మధ్య
మధ్య కలుస్తూ వుంటేనే కుటుంబ బంధాలు, మధ్య మధ్య మాట్లాడుకుంటూ వుంటేనే
స్నేహ సంబంధాలు’ అంటూ గొప్పగా నీతులు చెప్పాను. కానీ నేను చేస్తున్నది ఏమిటి?
పక్కవారికి
చెప్పేటందుకే నీతులు వున్నాయి అనుకోవాలా!
చేతిలో
ఫోన్ అస్తమానం వుంటుంది. వెనుకటి మాదిరిగా గుండె గుభిల్లుమనే చార్జీల బాధ లేదు.
మరి ఎందుకీ నిర్లిప్తత.
నాకూ
చిన్నతనం గుర్తుకు వచ్చింది. సొంతంగా ఇంట్లో ఫోన్ లేకపోయినా మిత్రులతో, చుట్టాలతో మాట్లాడాలని తాపత్రయ
పడేవాళ్ళం. పుట్టిన రోజు సందర్భాల్లో ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుకునే వాళ్ళం.
ఇప్పుడూ చెబుతున్నాం. ఫేస్ బుక్ లోనూ, వాట్సప్ లోనూ మొక్కుబడిగా షరా
మామూలు గ్రీటింగ్ పెట్టి ఊరుకుంటున్నాం. అదీ ఫేస్ బుక్ వాడు గుర్తు చేస్తేనే సుమా.
వాళ్ళు చూస్తారో తెలియదు. ఒక పని అయిపొయింది అనుకుంటాం. అలా కాకుండా ఆ ఒక్కరోజు
ఫోన్ చేసి శుభకామనలు తెలియచేస్తే ఎంత బాగుంటుంది.
అంత
తీరికలేని పనులు ఏమీ లేవు కదా!
కానీ
ఇంత చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తాం!
Courtesy Cartoonist
శ్రీ రమణ ఇక లేరు
1975 లో ఆంధ్ర జ్యోతి నుంచి నా నిష్క్రమణ అనంతరం ఎడిటర్ నండూరి రామమోహనరావు గారి కోరికపై శ్రీ రమణ గారు జ్యోతిలో చేరారు. తర్వాత కాలంలో శ్రీ రమణ గారు హైదరాబాద్ వచ్చారు. వారిని ఐ. వెంకట్రావు గారు నాకు మహా టీవీలో పరిచయం చేశారు. రాతల్లో వుండే శ్లేష, వ్యంగం ఆయన మాటల్లో కూడా తొంగి చూసేది. నేనంటే ఇష్టపడేవారు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. నిజానికి ఆయన మాట్లాడేవారు నేను వింటూవుండేవాడిని. అలా వినడం నాకు ఇష్టం. ఇక మిధునం విడుదల అయినప్పుడు హైదరాబాద్ లో వున్న పది కుటుంబాల వాళ్ళం కట్టకట్టుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో కి వెళ్ళాం. బహుశా శంకరా భరణం తర్వాత అలా ఇంటిల్లపాది కలిసి చూసిన చిత్రం మిథునం మాత్రమే. ఆ సినిమాకు నేను ఫేస్ బుక్ లో రాసిన రివ్యూ చదివి శ్రీ రమణ గారు నాకు ఫోన్ చేసి అభినందించడం గర్వంగా ఫీలవుతాను. బాపు గారి చూసి రాతతో పబ్లిష్ చేసిన మిథునం పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
17, జులై 2023, సోమవారం
తట్టిలేపే జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు
మధ్య తరగతి వాళ్ళు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒక పగటి కల కంటూ వుంటారు. ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని.(చిన్నిల్లు, పెద్దిల్లు అనే పాడు అపార్థాలు చేసుకోవద్దు ప్లీజ్)
అలా నేనూ మా ఆవిడా విడివిడిగా, కలివిడిగా కలలు కనే రోజుల్లో కలలో మేము కట్టుకోబోయే ఆ కొత్త ఇంటికి పూజ గది విడిగా వుండాలని కోరుకునేది తాను. అద్దె ఇళ్ళు మారుస్తూ హైదరాబాదును ఏళ్ళ తరబడి చుట్టబెడుతున్న తరుణంలో పూజ గది వుండే అద్దె ఇల్లు దొరకడం అసాధ్యం. అంచేత చిక్కడపల్లి దాకా వెళ్లి ఇదిగో ఈ కింద ఫోటోలోని పూజ అల్మరా ఒకటి కొనుక్కొచ్చుకుంది. అందులో దేవుళ్ల విగ్రహాలు, ఫోటోల సంచితాన్ని భద్రపరచుకుంది. నేనెప్పుడూ లెక్కపెట్టలేదు కాని ముక్కోటి దేవతలు అందులో కొలువు తీరారు అనిపించేది.
ఈరోజు జులై 17. అంచేతే కాబోలు ఓ జ్ఞాపకం మనసుని తట్టి లేపింది.
నాలుగేళ్ల క్రితం అంటే 17-07-2019 నాడు పొద్దున్నే ఏదో ఛానల్ డిబేట్ కి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి మా ఆవిడ పూజ అల్మరాలో దేవుళ్ళు అందరూ కట్టగట్టుకుని మాయం అయిపోయారు. ఏమిటీ విష్ణు మాయ అనుకుని ఆశ్చర్య పోతూ ఉండగానే శుభ్రంగా తోమిన దేవుడి విగ్రహాలను మరింత మెరిసేలా తుడుస్తూ మా ఆవిడ ప్రత్యక్షం అయింది.
“ అమ్మయ్య! దేవుళ్ళు అందరూ తలంట్లు పోసుకుని గూటికి చేరుతున్నారు “ అని ఓ జోకు జోకాను.
ఈ జోకు మా ఆవిడ విన్నదో లేదో కాని ఆమె చేతిలో ఉన్న దేవుళ్ళు విన్నారు, విని కోపగించుకున్నారు అన్న సంగతి నెల తర్వాత తెలిసి వచ్చింది.
సరిగ్గా నెలలోపే ఆగస్టు 18న, ఇంట్లో దేవుళ్ళు అందరూ అలాగే వున్నారు. వాళ్లకు నిత్య పూజలు చేసే దేవతే లేకుండా వెళ్లి పోయింది.
దేవుళ్లా! మజాకా!
17-07-2023