ఈ స్వగతం నాది కాదు, మాజీ
ఐజీ,
సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి రావులపాటి సీతారామా రావు గారిది.
అట్ట చాలా అట్టహాసంగా వుంది. చాలా ఖరీదైన ఆర్ట్
పేపరు. ముఖచిత్రం మీద కొలువుతీరిన వారందరూ సుప్రసిద్ధులు, మాజీప్రధాన
మంత్రులు, ముఖ్యమంత్రులు,
గవర్నర్లు,
పత్రికారచయితలు, ఆధ్యాత్మిక వేత్తలు, సినీ ప్రముఖులు. అంటే అర్ధం అయిపోతుంది, రచయిత
స్వగతం ఎవరి గురించో. పోలీసు అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో
పనిచేసిన అనుభవాల్లోని గతం అన్నమాట. అన్నట్టు తిరుపతి వెంకన్నతో అనుభవాలు కూడా
వున్నాయి సుమా.
పోలీసు అధికారిగా ఆయన లాఠీ పదును అయినా,
రచయితగా ఆయన కలం చాలా మృదువైనది. అంచేత నొప్పించక, తానొవ్వక తరహాలోనే ఈ అనుభవాల పరంపర
అక్షరరూపం ధరించింది. ఇప్పుడే చేతికి అందితే అప్పుడే చదివేశారా అనేదానికి జవాబు
వుంది. ఈ వ్యాసాలు అన్నీ ఇటీవలి కాలంలోనే ఆంధ్రప్రభ దినపత్రికలో వారం వారం స్వగతం శీర్షిక రూపంలో వెలువడ్డాయి. ఆ విధంగా నా
తొలి రీడింగ్ అయిపోయింది అన్నమాట.
పుస్తకం ఎవరికైనా నచ్చుతుంది అని ఘంటా పదంగా
చెప్పడానికి కూడా కారణాలు వున్నాయి. రావులపాటి వారి శైలి వాటిల్లో ముఖ్యమైనది. మరోటి పుస్తకం సైజు. చక్కనమ్మ అయితే చిక్కినా
అందమే. నూటపాతిక పేజీల్లో స్వగతం పొందికగా అమిరింది. కూర్చుని,
పడుకుని,
మాట్లాడుతూ,
ముచ్చట్లు చెబుతూ చదువుకునేలా వుంది.
ఒకరకంగా ఇది ఆయన బర్త్ డే బుక్. నిన్న ఆయన
పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యుల నడుమ ఎంచక్కా స్వయం ఆవిష్కరణ
చేసుకున్న పుస్తకం ఇది.
(సాహితి ప్రచురణలు, వెల : రు. 90/-)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి