రేపు
ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా వున్నామని రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాటల్లో
ఎంత వాస్తవం వుందో తెలియదు కానీ, రేపే
ఎన్నికలు అనే స్పృహలోనే పార్టీలు అనుక్షణం అప్రమత్తంగా వుంటాయి అనడం మాత్రం నిజం.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధానం ఉన్నప్పటికీ, అప్పుడే ఎన్నికలు వచ్చిపడ్డట్టు రాజకీయ
పార్టీలు హడావిడి పడుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జిత్తుల మీద చర్చోపచర్చలు
జరుగుతున్నాయి. సంవత్సరం తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునే
వ్యూహాలకు తెర తీస్తున్నాయి.
రాజకీయ
పార్టీలకి అనేక లక్ష్యాలు వుంటాయి. కానీ అన్నింటిలో ఉమ్మడిగా కానవచ్చేది ఒక్కటే.
అది విజయం వైపు పయనం.
2019లో
జరిగిన ఎన్నికల్లో తన పార్టీని అధికార అందలం ఎక్కించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, పరాజయం పాలయిన టీడీపీ నాయకుడు
చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మువ్వురు కూడా 2024లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా
తీసుకుని ఎన్నికల వ్యూహాలను రూపొందించుకునే కార్యక్రమంలో తలమునకలుగా
వున్నారు. ఈ లక్ష్యసాధన కోసం వారు ఏ
మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదు. రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని నాలుగేళ్ల క్రితం ఎవరయినా
అంటే ఎవరూ నమ్మేవాళ్ళు కాదు. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతున్న
పరిస్తితులకు అనుగుణంగా, వారి వారి రాజకీయ అవసరాలకు, ప్రయోజనాలకు తగ్గట్టుగా మారిపోతూ
ఉంటాయనడానికి ఏపీలో రోజురోజుకి మారుతున్న
పరిణామాలే మంచి ఉదాహరణ. కానీ ఈ విషయాలు
వారెవ్వరూ బయటకి ఒప్పుకోరు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం. చెప్పీ
చెప్పనట్టుగా కొన్ని చెబుతుంటారు, వాటిల్లో
దాగున్న అర్ధాన్ని విశ్లేషిస్తూ చర్చలు సాగుతాయి. ప్రజలని తాము కోరుకున్న
పద్ధతిలోనే ఆలోచించేలా చేయడం వీటి అంతిమ లక్ష్యం.
నేటి
రాజకీయాల పట్ల కనీస అవగాహన ఉన్నవారికి ఈ పరిణామాలు గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు.
ఎందుకంటే గతంలో సిద్ధాంతాల ప్రాతిపదికపై నడిచిన రాజకీయాలు, ఈనాడు అవసరాల పునాదులపై
నిలదొక్కుకుంటున్నాయని వారికి తెలుసు కాబట్టి.
2024లో
జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నదే ఈ ముగ్గురు నాయకుల
ధ్యేయం. కాకపోతే ఈ లక్ష్యసాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం.
విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా
విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.
పాలకపక్షం
వైసీపీ పూర్తిగా బలహీన పడిందని నమ్ముతూ తద్వారా ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఆక్రమించుకునే
ఉద్దేశ్యంతో కొత్త పొత్తుల ఆలోచన రూపుదిద్దుకుని ఉండవచ్చు. పొత్తులు ఫలితం ఇస్తాయి
అనడానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏమీ లేదు. అవసరాలకోసం రాజకీయ నేతలు సర్దుబాటు
చేసుకున్నట్టుగా ఆ పార్టీల కార్యకర్తలు అంత సులభంగా కలిసిపోరు. ముఖ్యంగా గ్రామీణ
ప్రాంతాలలో ఓట్ల బదలాయింపుకు అవకాశాలు తక్కువ.
రాజకీయ
శూన్యత వున్నప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయాల వికాసానికి అవకాశం వుంటుంది. ప్రభుత్వ
వ్యతిరేకత అనేదాన్ని ఏ అధికార పక్షం అయినా ఎన్నికల్లో ఎదుర్కోక తప్పదు. అయితే
వ్యతిరేకత ఒక్కటే పాలక పక్షం ఓటమికి దోహదం చేయదు. వ్యతిరేకత అసంతృప్తిగా మారి, ఆ అసంతృప్తి అసహనంగా మారి, ఆ అసహనం ఆగ్రహంగా మారినప్పుడే ప్రజలు
ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. ఆ పరిస్థితిలో బలమైన ప్రత్యామ్నాయంగా కనపడిన
పార్టీకి, ఏ పార్టీ అని కూడా చూడకుండా ఓట్లేసి
గెలిపిస్తారు.
రాజకీయ
పార్టీల మాదిరిగా ప్రజలు తమ ఆగ్రహాన్ని అనునిత్యం ప్రదర్శించరు. తమలోనే
దాచుకుంటారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు.
బ్రహ్మాండంగా
విజయవంతమైన సినిమా ఫార్ములాతోనే, అందుకు ఏమాత్రం తగ్గకుండా మరో సినిమా తీస్తే అది
విజయవంతమైన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఈ పొత్తులు. మళ్ళీ వీటిలో కొన్ని రకాలు.
ఎన్నికలకు ముందు పెట్టుకునేవి కొన్ని అయితే, ఎన్నికల
తరవాత, ఎవరికీ సరైన మెజారిటీ రానప్పుడు కుదుర్చుకునేవి మరి కొన్ని. ఎన్నికలకు ముందు
ప్రతి పార్టీ తాను బలమైన పార్టీ అనే నమ్ముతుంది. కనుక సీట్ల సర్దుబాటు ఒక సమస్యగా
మారుతుంది. వామపక్షాల వైఖరి కొంత విచిత్రంగా వుంటుంది. పలానా నియోజక వర్గంలో
గెలిచే అవకాశం లేకపోయినా,
కేడర్ ని సుస్తిరం చేసుకోవడానికి ఆ
సీటు కోసం పట్టు పడతాయి.
1982
ఎన్టీ రామారావు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ
పెట్టినప్పుడు, కాంగ్రెసేతర పార్టీలతో పొత్తుల
ప్రతిపాదనలు వచ్చాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసి 120 సీట్లు కావాలని కోరాయి. సంప్రదింపులు జరిగిన
తర్వాత కనీసం 90 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టాయి. ఎన్టీఆర్ 80 ఇస్తామన్నారు. కమ్యూనిస్టులు తమకు అలవాటయిన
చారిత్రక తప్పిదం చేశారు. ఒక్క సీటు తగ్గినా ఒప్పుకోమని తేల్చి చెప్పారు. చర్చలు
విఫలం అయ్యాయి. మరో పక్క జనతా పార్టీ తరపున బాబుల్ రెడ్డి ఎన్టీఆర్ ని కలిసి 60 సీట్లు అడిగారు. 20 వరకు ఒప్పుకోవాలని ఎన్టీఆర్ యోచన. ఈలోగా లోక్
దళ్, రిపబ్లికన్ మొదలైన పార్టీలు మరికొన్ని
అడిగాయి. ఈ పార్టీల వైఖరితో విసుగుచెందిన ఎన్టీఆర్, అసలు పొత్తులకే స్వస్తి చెప్పి ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించారు.
ఆఖర్లో మాత్రం సంజయ్ విచార్ మంచ్ కి అయిదు సీట్లు ఇచ్చారు. మిగిలిన అన్ని సీట్లలో
టీడీపీ పోటీ చేసింది.
అప్పటికే
కాంగ్రెస్ పాలనతో విసిగి ప్రత్యామ్నాయం
కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలకు టీడీపీ వెలుగు రేఖలా కనిపించింది. ఎన్టీఆర్ తొందరపడి ఇతర పార్టీలకు
వారు అడిగిన సంఖ్యలో సీట్లు ఇచ్చి వుంటే, ప్రజలు టీడీపీని కాంగ్రెస్ కు
ప్రత్యామ్నాయంగా భావించి వుండేవారు కాదని ఓ అభిప్రాయం. ఓ పది సీట్ల కోసం
కమ్యూనిస్టులు పట్టిన పట్టు, రాష్ట్ర రాజకీయాల తీరుతెన్నులనే మార్చివేసింది.
ఇక
ప్రస్తుతానికి వస్తే.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలు ఒకేమారు తలపడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గణనీయంగా చీలిపోయి అధికార వైసీపీ
లాభపడుతుందని కొందరి ఉద్దేశ్యం. ఈసారి ఏదీ
ఊహకు అందకుండా ఉంటుందని మరికొందరు అంటున్నారు. అంచేత బరిలో ఉన్న అన్ని పార్టీల
వాళ్ళూ ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తారు. హామీలు, ప్రలోభాలు, ఎత్తులు, పొత్తులు, అవగాహనలు, పైకి ఒకటి చెబుతూ మరొకటి చేసే రాజకీయ
రణతంత్రాలు, మిత్రబేధాలు, ఇలాటివన్నీ ఆ జాబితాలో వుంటాయి. డబ్బు
ప్రాధాన్యం ఎలాగూ వుంటుంది. అయితే తమను ఎవరు పరిపాలించాలో ప్రజలు ముందే ఒక
నిర్ణయానికి వస్తే మాత్రం,
ఈ టక్కు ఠమారవిద్యలు అన్నీ కొరగాకుండా
పోతాయి.
ప్రతి
రాజకీయ పార్టీకి చెప్పుకోవడానికి కొన్ని మూలసిద్ధాంతాలు ఉన్నప్పటికీ, కాలమాన పరిస్తితులను బట్టి ఆ
సిద్ధాంతాలను కొంత పక్కన బెట్టి వ్యవహరించే పరిస్తితి ఈనాడు చూస్తున్నాము. ఇప్పుడు
ప్రతి అంశాన్ని, విజయావకాశాలు, రాజకీయంగా ఒనగూడే లాభనష్టాల నిష్పత్తి
కోణం నుంచే ఆయా రాజకీయ పార్టీలు పరిశీలిస్తున్నాయి. అధికారమే పరమావధి అయినప్పుడు
సిద్ధాంతాలకు నీళ్ళు వదిలి,
అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేయడంలో
ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుతో మొదలయ్యే ఈ కప్పదాట్లు అధికార
పీఠం అధిరోహించిన తరువాత మరింత వికృత రూపాన్ని, స్వభావాన్ని
సంతరించుకుంటున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదిరించడం కోసం, నిలువరించడం కోసం పలు విపక్షాలతో
రాజీపడి దానికి భావసారూప్యం అనే అందమైన అర్ధంలేని పదాన్ని అడ్డు పెట్టుకోవడం
రాజకీయాలను గమనించేవారికి అనుభవమే. అలా మొదలయ్యే ఈ అవకరం క్రమంగా రాజకీయ కూటముల
ఆవిర్భావానికి మార్గం వేసింది. అయితే, అధికారంలో
పై చేయి కోసం వెంపర్లాటలు,
పదవుల పంపిణీలో కీచులాటలు, సిద్ధాంత ప్రాతిపదికలేని ఈ రాజకీయ
కూటముల అస్తిత్వానికే ముప్పు తెచ్చిన సందర్భాలు కూడా గతంలో అనేకం.
పాలకపక్షాన్ని
నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షాలు ఏకమైనట్టు, ప్రతిపక్షాలను కనుమరుగు చేయడానికి పాలక
పక్షాలు అంతే పట్టుదలగా పనిచేస్తున్నాయి. ప్రతిపక్షాలను గౌరవించడం సంగతి అటుంచి, అసలు వాటి ఉనికిని గుర్తించడానికి కూడా
విముఖత చూపుతున్నాయి. ఉనికే లేకుండా చేయాలని యోచించడం ఇందుకు పరాకాష్ట. చట్టసభల్లోనే కాకుండా చట్ట సభల వెలుపల కూడా
ప్రతిపక్షాల పొడగిట్టని తత్వాలు, ఎదుటి
పార్టీలను చీల్చి సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు కొత్త రాజకీయ సంస్కృతిగా రూపుదిద్దుకుంటున్నాయి.
కొద్ది హెచ్చు తగ్గులు మినహా ఏపార్టీ కూడా దీనికి మినహాయింపు కాదనే చెప్పాలి.
రాజకీయులు
నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే సాధించిన విజయాలు
ఎప్పటికీ శాశ్వతం అని భావించకూడదు. పరాజయం పొందినవారు అది శాశ్వతం
అనుకోకూడదు. శిఖరం ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు. ఎప్పుడో ఒకప్పుడు కిందికి
దిగకతప్పదు. అలా దిగినప్పుడు మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకోకూడదు.
అధికారం
దక్కినప్పుడు కాలయాపన చేయకుండా, జనం
తమకు అధికార పగ్గాలు అందించిన నిర్దిష్ట కాల వ్యవధిలోనే ప్రజలకు చేసే నాలుగు మంచి
పనులే శాశ్వతంగా మిగిలిపోతాయి.
ఇది
నిజం. కానీ ఈ నిజాలు ఈనాటి రాజకీయ నాయకులకు పట్టవు. నిజానికి వారికి ఆ అవసరం
ఉన్నట్టు కూడా లేదు.
Below Photo: Courtesy Google Images