(Published in ANDHRA PRABHA today, SUNDAY, 20-11-2022)
'యాభయ్ ఏళ్ళక్రితానికి, ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి?' అని అడిగితే, 'ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట, బీడీ, సిగరెట్లు తాగేవారు, ఇప్పుడది లేద'ని, ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు.
అప్పటికీ, ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. 'సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామ'ని బెదిరించారా అంటే అదీ లేదు, 'హాలులో పొగ తాగరాదు' అంటూ, ఏదో మొక్కుబడిగా ఓ స్లయిడ్ వేయడం తప్ప. 'అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా' అని ప్రశ్నించుకుంటే 'లేద'నే సమాధానం వస్తుంది. 'పొగరాయుళ్ళను వెతికి పట్టుకుని కౌన్సిలింగులూ గట్రా నిర్వహించారా' అంటే అదీ లేదు. 'ప్రేక్షకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా' అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు, సిగరెట్ల జోలికి పోకుండా థియేటర్లలో కూర్చుని సినిమాలు ఎలా చూస్తున్నారు?
ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అదేమిటంటే, చూసి నేర్చుకోవడం. డేరా టాకీసులూ, టూరింగ్ హాళ్ళు, రేకుల సినిమాషెడ్లు, సిమెంటు ధియేటర్ల కాలం ముగిసి, ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే 'సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాద'ని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు.
జనంలో వున్న ఈ సుగుణాన్ని, జనంతో సంబంధం వుండి వారిపై పెత్తనం చేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గమనించి నడుచుకుంటే, ఈనాడు మనం ఎదుర్కుంటున్న అనేక చిక్కు సమస్యలకి చిరు పరిష్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయనడానికి ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చెప్పడం జరిగింది.
ముఖ్యంగా నగరాల్లో పెచ్చు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకి పరిష్కారం కోసం నానా మార్గాలు వెతుకుతున్న అధికారులు, ఈ సూత్రాన్నే అమలు చేస్తే అనేక సమస్యలకు కనీసం సగం పరిష్కారం అయినా లభిస్తుంది.
హైదరాబాద్ వంటి సువిశాల నగరంలో ట్రాఫిక్ ని చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు.
అయితే, కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు.
అన్నింటికంటే ముందు చేయాల్సింది, ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని, కొంతకాలం పాటయినా, ట్రాఫిక్ చిక్కుముళ్ళని చక్కదిద్దే దిశగా మరల్చాలి. ఎక్కడ, ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని ఆయా కూడళ్ళలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేసినా తప్పులేదు.
రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. వాణిజ్య ప్రకటనలకు మినహా, వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. హైదరాబాదు నగరంలో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సదుపాయం వుంది. కానీ వాడుతున్న దాఖలా లేదు.
ప్రైవేటు విద్యాసంస్థల వద్ద నిర్మించిన కాలి వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్ద భారం కాబోదు.
ఇలాటి ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక రద్దీ కూడళ్ల వద్ద రోడ్డు దాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం ఈదడం కంటే రోడ్డు దాటడం కష్టంగా భావిస్తుంటారు.
బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో రోడ్డుదాటడానికి పుష్ బటన్ వ్యవస్థలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా పచ్చ దీపం వెలుగుతుంది. వారు రోడ్డుదాటి వెళ్ళేవరకు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.
విద్యుత్ దీపాలతో కూడా పని లేకుండా, జండాలను ఉపయోగించే ఒక విధానం కొన్ని విదేశాల్లో అమల్లోవుంది. అదేమిటంటే, రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ స్తంభాలకు తగిలించిన బాస్కెట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డు దాటాలనుకునేవారు ఒక జండాను తీసుకుని చేతిలో పట్టుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డు దాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కెట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు. ఇరుకైన రోడ్లు వున్న పాత బస్తీ వంటి ప్రాంతాల్లో ఈ పద్దతి ఉపయుక్తంగా వుంటుంది. అయితే ఇచ్చిన సదుపాయాన్ని దుర్వినియోగం చేయడమే పరమావధిగా భావించే జనం అధికంగా ఉన్న మన పౌరసమాజం కారణంగా, ఇటువంటి చిట్కాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయనేది అనుమానమే మరి.
పోతే, థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడానికి వీలుపడుతుంది.
కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా పార్కింగ్ కి అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.
ప్రయివేటు బస్సులని ఎలాగూ అదుపు చేయలేరు కనుక, రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్థలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్థలకే ఇవ్వాలి. ఇలా చేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.
స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే రద్దీ సమయాల్లో చెకింగులు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. కన్నూ మిన్నూ కానని అతి వేగంతో ద్విచక్ర వాహనాలపై దూసుకుపోయేవారిని, సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. అసలు ఇలాటి వాహనదారుల వల్లనే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
అలాగే, రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో 'వీ.ఐ.పీ.' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో మార్పులు చేయాలి. వారికోసం రోడ్లపై వాహనాలను అంతూపొంతూ లేకుండా నిలిపివేసే పద్దతికి స్వస్తి చెప్పడానికి అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు వాడుకోవాలి. 'ప్రజలకోసమే మేము, ప్రజాసేవలో మేము' అంటూ నిత్యజపం చేసే నాయకులు, ఇందుకు ఏమాత్రం సహకరిస్తారో చూడాలి.
ప్రధానమైన ఆస్పత్రులు వున్న వీధుల్లో రాస్తారోఖోలు, ధర్నాలు, ఊరేగింపులను నిషేధించాలి.
ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి. (EOM)