28, అక్టోబర్ 2022, శుక్రవారం

మనసు పలికే పలుకు – భండారు శ్రీనివాసరావు

 

“నిజమని తెలిసినా నిర్ధారణ చేసుకునే వార్త ఇవ్వాలి” అనేది రేడియోలో బోధించిన మొదటి పాఠం.

ఇంగువకట్టిన గుడ్డకు వాసన ఎలా పోతుంది. అంచేత ఈరోజు  అధికారికంగా సర్కారు వారి నుంచి సమాచారం అందుకున్న తర్వాతనే ఈ పోస్టు పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మగారి పనుపున  ప్రిన్సిపల్ సెక్రెటరీ ముత్యాల రాజు గారు ఒక మనిషికి ఇచ్చి ఈరోజు ఒక లేఖను హైదరాబాదులోని మా ఇంటికి పంపారు.

నవంబరు ఒకటో తేదీన విజయవాడ లబ్బీపేటలోని  ‘A’ CONVENTION హాలులో జరిగే కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రుల సమక్షంలో మీడియా రంగంలో జీవిత సాఫల్య పురస్కారం నాకు అందచేస్తున్నట్టు  ఆహ్వానంతో కూడిన సమాచారం అందులో వుంది.

ఈ విషయం మీలో చాలామందికి ఈపాటికే తెలిసి వుంటుంది. అనేక మంది శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే నేరుగా  ఈ విషయాన్ని  తెలియపర్చక  పోవడం  పొరబాటే. ఒప్పుకుంటున్నాను.  ఇదే అవార్డు వచ్చిన మరో ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు శ్రీయుతులు సతీష్ చందర్, మంగు  రాజగోపాల్, ప్రసాదరెడ్డి  గారలు  ఏ కోణంలోనుంచి చూసినా నాకంటే గొప్ప అనుభవం వున్న జర్నలిస్టులు. ఒక్క వయసులో తప్ప, వారితో పోలిస్తే నేను ఏ విషయంలో అధికుడిని కాను. వారికి నా అభినందన మందారమాల.

నన్నూ, నా పేరును సమాజానికి తెలియచేయడంలో తోడ్పడిన మన ఎమ్మెల్యే వారపత్రిక,  ఆంధ్రజ్యోతి, సూర్య, ఆంధ్రప్రభ, సాక్షి మొదలైన పత్రికలు, ఆకాశవాణి,  అన్ని తెలుగు న్యూస్ ఛానళ్లకు, అనేక వెబ్ ఛానళ్లకు,  ఫేస్ బుక్ వంటి మాధ్యమాలకు, ప్రత్యేకించి ఈ మాధ్యమంలో నన్ను అభిమానిస్తూ ప్రోత్సాహించిన మితృలకు, పెద్దలకు, మా కుటుంబ సభ్యులకు, బంధుమితృలకు ధన్యవాదాలు, నమోవాకాలు.

నన్ను ఎలా చూడాలని అనుకుందో ఆ క్షణం నా జీవితంలో తొలిసారి, ఆఖరిసారి వచ్చినప్పుడు నా తోడు వదిలి వెళ్ళిపోయిన నా భార్య నిర్మలకు, ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని నిండు మనసుతో అర్పిస్తున్నాను.  


 

(29-10-2022)  

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

శుభాకాంక్షలండీ ! మీకు ప్రీతి పాత్రులైన వై యస్సార్ వారి పేరున ఉన్న అవార్డ్ మీకు రావడం పూర్వ జన్మ సుకృతం.

అజ్ఞాత చెప్పారు...

Congratulations!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

జీవన సాఫల్య పురస్కారం వచ్చినందుకు అభినందనలు 💐.

భారతదేశంలో ప్రతిదానికీ ఎవరే ఒకరి పేరు పెట్టడం అన్నది మహా విచిత్రంగా తయారయిందే
- పురస్కారాలకు, ప్రభుత్వ పధకాలకు, ప్రభుత్వ భవనాలకు, విద్యాసంస్థలకు, బస్-స్టాండ్లకు. ఎయిర్-పోర్టులకు, etc etc etc - కాదేదీ అనర్హం అంటూ. కొన్ని రాష్ట్రాల్లోనయితే ఆ రాష్ట్ర చరిత్ర మొత్తంలో ఒక వ్యక్తే ప్రముఖుడు అని నమ్ముతారేమో మరి అన్నింటికీ ఆ పేరే - ఆ వ్యక్తికి ఆ రంగానికి సంబంధం లేకపోయినా కూడా. దేశం మొత్తంలో కూడా చాలా కాలం అలాగే నడిచిందిగా.

అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసయినా సరే భారత ప్రభుత్వం దీన్ని నిషేధించాలి. సలహా ఎవరికి పంపించాలంటారు?

అజ్ఞాత చెప్పారు...

సలహాల్హెడ్దు
కేరాఫ్ పీఎంవో కి పంపాలండి