12, అక్టోబర్ 2022, బుధవారం

దరిద్రం యెలా వుంటుంది? – భండారు శ్రీనివాసరావు

 

ఈ ముచ్చట ఇప్పటిది కాదు, ఎప్పుడో పదేళ్ల క్రితం 2012 లో నిజంగా జరిగింది. ఆంగ్ల దినపత్రిక హిందూలో ఈ కధనం వచ్చింది. దానికి నా స్వేచ్ఛానువాదం అన్నమాట.
చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ కష్టం మరోటి వుండదంటారు.
కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్ళు.
తుషార్ హర్యానాలో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు ఉద్యోగాలు చేసాడు. డబ్బుకు లోటులేని జీవితం గడిపాడు.
మరో కుర్రాడి పేరు మట్. పేరు చూసి వేరే దేశం వాడని పొరబడేవీలుంది. కానీ మన తోటి భారతీయుడే. తలిదండ్రులతో కలసి చిన్నతనంలోనే అమెరికా వెళ్లాడు. అక్కడే చదువుసంధ్యలు గట్రా పూర్తిచేసుకున్నాడు.
ఈ ఇద్దరికీ ‘ఇండియా దటీజ్ భారత్’ కు తిరిగిరావాలని చిరకాల కోరిక. చివరికి ఎలాగయితేనేం మాతృదేశానికి వచ్చేసారు. బెంగళూరులో ఓ ప్రాజెక్టులో చేరారు. ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ‘ఒకే కంచం ఒకే మంచం’ అనే తీరుగా కలగలసిపోయి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఇద్దరి ఆశలు ఒకటే. ఆశయాలు ఒకటే. ఇది మరో కారణం.
హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. అలా గడవడం, గడపడం వారికి సుతరామూ ఇష్టంలేదు. అలా అయితే వారిని గురించి ఇంతగా రాయాల్సిన పనే లేదు.
ఒక ఐడియా జీవితాన్నిమారుస్తుందంటారు.
దేశంలో దారిద్యం గురించిన ఒక గణాంకం వారిని ఆకర్షించింది. అదేమిటంటే భారతదేశంలో పేదవారు చాలామంది రోజుకు అక్షరాలా ఇరవై ఆరు రూపాయల ఆదాయంతో బతుకు బండి లాగిస్తున్నారని. ‘అదెలా సాధ్యం?’ అన్నది వారి మదిలో మెదిలిన మొదటి ప్రశ్న. ‘అదెలా సాధ్యమో తెలుసుకోవాలన్నది’ కలిగిన కుటుంబంలో పుట్టిన వారిద్దరికీ కలిగిన మరో ఆలోచన.
అసలే మార్పు కోరే తత్వం. ఆలోచనలను అమలు చేయడంలో ఇద్దరిదీ ఏకత్వం. ఇక అడ్డేముంది. రాజభోగాలు వొదులుకుని సన్యసించిన బుద్ధుడిలా ఇద్దరూ కలసి సగటు భారతీయుడు యెలా బతుకుతున్నాడో అలా బతకాలని బయలుదేరారు. చదువుకున్నవారు కనుక ఈ ప్రయోగానికి ముందు అన్ని లెక్కలు వేసి చూసుకున్నారు.
సగటు భారతీయుడి సగటు ఆదాయం నెలకు 4,500 రూపాయలు. అంటే రోజుకు నూట యాభయ్ రూపాయలు. ప్రపంచ వ్యాప్తంగా జనం వారి నెలసరి ఆదాయంలో మూడో వంతు ఇంటి అద్దెకు ఖర్చు పెడతారు. ఆ లెక్కన రోజు రాబడి నూట యాభయ్ లో మూడో వంతు తీసేసి వందరూపాయలతో రోజు గడపాలనే ప్రయోగానికి పూనుకున్నారు. దేశ జనాభాలో 75 శాతం మంది ఇంతకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న విషయం వారికి తెలియంది కాదు.
ఖరీదయిన అపార్టుమెంటును వొదిలేసారు. ఇంట్లో పనిచేసే పనిమనిషిని వొప్పించి ఆమె వుంటున్న ఇరుకు గదిలోకి మారిపోయారు. మొదట ఈ ఇద్దరి తరహా చూసి పిచ్చివాళ్లనుకుంది. కానీ, వారి దీక్ష, పట్టుదల చూసి చలించి పోయింది.
కొత్త జీవితంలో వారికి ఎదురయిన ప్రధాన సమస్య చౌకగా తిండి సంపాదించుకోవడం ఎలాగా అన్నది. అంత తక్కువ ఆదాయంలో బయట భోజనం చేయడం అన్నది అసాధ్యం. దాబాల్లో తినాలన్నా కుదరని పని. పాలూ, పెరుగు, నెయ్యి, వెన్న అన్నింటికీ స్వస్తి చెప్పారు. విదేశాల్లో చదువుకున్నారు కనుక స్వయంపాకం వారికి వెన్నతో పెట్టిన విద్య. కానీ వంట వండడం వచ్చుకాని, వండడానికి వనరు లేదు. అందుకని చౌకకు చౌక, మంచి పోషక విలువలు వుండే గింజలను ఉడకబెట్టి ఆహారంగా తీసుకునే పద్దతికి శ్రీకారం చుట్టారు. అలాగే పార్లే బిస్కెట్లు. కేవలం ఇరవై అయిదు పైసలు పెడితే ఇరవై ఏడు కేలరీలు. అరటి పండు ముక్కల్ని వేయించి బిస్కెట్లతో కలిపి తింటే ఆరోజు విందు భోజనం చేసినట్టు.
రోజుకు వందలో బతకాలి కాబట్టి వారికి వారే కొన్ని బంధనాలు, పరిమితులు విధించుకున్నారు. అయిదు కిలోమీటర్లకు మించి బస్సులో ప్రయాణం భారం అని తెలుసు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పరిస్తితి వుంటే నటరాజా సర్వీసే గతి. నెలవారీ విద్యుత్ వాడకాన్ని బాగా తగ్గించుకున్నారు. రోజుకు అయిదారు గంటలే లైట్లు, ఫాన్ వాడేవారు. కొంత విద్యుత్ ను కంప్యూటర్లు, మొబైల్ ఫోనులు చార్జ్ చేసుకోవడానికి వీలుగా పొదుపు చేసుకునే వారు. ఒక్క లైఫ్ బాయ్ సబ్బు కొని, దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరు వాడుకోవాల్సిన పరిస్తితి. కోరి తెచ్చుకున్న కష్టాలే కనుక చింతించాల్సిన పరిస్తితి ఎదురు కాలేదు.
రోడ్డు వెంట వెడుతున్నప్పుడు అద్దాల అరమరాల్లోనుంచి అనేక రకాల వస్తువులను, దుస్తులను చూస్తూ వెళ్ళేవారు. వాటిని కొనగల తాహతు తమకు లేదని తెలుసు కనుక వాటిల్లో అడుగుపెట్టేవారు కాదు. ఇక సినిమాలు చూడడం అనేది స్తితికి మించిన పని. వారు కోరుకున్నది ఒక్కటే. అనారోగ్యం పాలు కాకుండా వుంటే చాలని.
వారు ఎదుర్కోవాల్సిన మరో పెద్ద సవాలు అలాగే వుండిపోయింది. అధికారికంగా ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకు తెలియచెప్పిన వివరాల ప్రకారం దార్రిద్య్ర రేఖకు దిగువన వుండేవారి ఆదాయం పట్టణాల్లో రోజుకు 32 రూపాయలు అయితే, గ్రామాల్లో 26 రూపాయలు.
ఇదేదో తేల్చుకోవాలని ఇద్దరూ కలసి మట్ పూర్వీకుల గ్రామానికి వెళ్లారు. అది కేరళలో వుంది. రోజుకు 26 రూపాయలతో గడిపే జీవితాన్ని కరుకాచల్ అనే ఆ వూర్లో మొదలు పెట్టారు. చౌకగా దొరికే ఉప్పుడు బియ్యం, అరటి పండ్లు, పాలు కలపని బ్లాక్ టీ - ఇవే ఆహారం.
కానీ అంత తక్కువ డబ్బుతో జీవించడం చాలా కష్టమని వారికి తేలిపోయింది. అసలే అరకొరగా వున్న కొన్ని సౌకర్యాలను కూడా వొదిలేసుకున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవడానికి బట్టల సబ్బు కొనడం మానేశారు. మొబైల్, కంప్యూటర్ పక్కన పడేసారు. జబ్బున పడితే ఎలా అనే భయం ఒక్కటే వారిని అహరహం వేధించేది. సంపన్న కుటుంబంలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఇరవై ఆరేళ్ళ యువకులకి ‘దరిద్రంలో బతకడం’ అన్న ఈ అనుభవం భరించలేనిదిగా బాధించేది.
అయినా పట్టిన పట్టు విడవకుండా వారు తాము అనుకున్నది సాధించారు. దీపావళి నాడు వారి ప్రయోగం ముగిసింది. ఆ రోజున వారు తమ స్నేహితులకు ఉత్తరాలు రాశారు.
‘మేము మళ్ళీ మా మామూలు జీవితాల్లోకి అడుగు పెడుతున్నాం. మా ప్రయోగం ముగియడానికి ముందు రోజు, ఇన్నాళ్ళుగా మేము ఎవరితోనయితే కలసి మెలసి జీవించామో వారంతా కలసి మాకు వారి స్తాయిలో ‘విందు భోజనం’ ఏర్పాటు చేశారు. ఆ భోజనంలో ఎన్ని పదార్ధాలు వున్నాయో తెలియదు కాని ప్రతిదాంట్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయతా కూరిపెట్టారని మాత్రం చెప్పగలం. ఇంతవరకు అలాటి భోజనం చేయలేదని కూడా చెప్పగలం.
‘కానీ, ప్రతి ముద్దా నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక వాస్తవం కనుల ముందు కదలాడేది. ఈ మాత్రం భోజనం అన్నది కలగా మిగిలిన మరో నలభయ్ కోట్ల మంది భారతీయులు ఈ దేశంలో మనతో పాటే జీవిస్తున్నారు. వారి కల నెరవేరడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలియదు.
‘మేము మళ్ళీ మా విలాస జీవితాల్లోకి అడుగుపెడుతున్నాము. కానీ వాళ్లు మాత్రం ఆ ఆగర్భదారిద్ర్యంలోనే వుండిపోతున్నారు. రేపు గడవడం కాదు ఈ క్షణం గడవడం యెలా అన్న బతుకులు వాళ్లవి. తీరని కోరికలు, అపరిమితమయిన పరిమితుల నడుమ వారు తమ జీవన పోరాటాన్ని కొనసాగిస్తూనే వుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వారి ఆకలి పెద్దది. తీరే మార్గం అతి చిన్నది.
‘ఈ ప్రయోగం తరువాత మా ఆలోచనల్లో మరింత మార్పు వచ్చింది.
‘ఇన్నేళ్ళుగా అనేక వస్తువులు జీవితావసరాలుగా భావించి వాడుతూ వచ్చాము.
‘మనిషి బతకడానికి ఇన్నిన్ని సబ్బులూ, షాంపూలు అవసరమా? వారాంతపు సెలవు దినాల్లో బయటకు వెళ్లి ఖరీదయిన హోటళ్ళలో అతి ఖరీదయిన విందు భోజనాలు చేయకపోతే బతుక్కి అర్ధం మారిపోతుందా? బ్రాండెడ్ దుస్తులు ధరించక పోతే జనం మనల్ని గుర్తించరా?
‘స్తూలంగా ఆలోచిస్తే మనం ఇంత సంపన్న జీవితాలకు అర్హులమా? ఇన్నిన్ని వైభోగాలు అనుభవించి ఆనందించే అర్హత వుందా? కొందరు గర్భ దరిద్రులుగా, మరికొందరు ఆగర్భ శ్రీమంతులుగా జన్మించడానికి కేవలం వారి వారి అదృష్టాలే కారణమా?
‘సౌకర్యాలు, సదుపాయాలూ నిత్యావసరాలుగా పరిగణించే జనం ఒక పక్కా, పూటగడవడం యెలా అని అనుక్షణం మధన పడే ప్రజలు మరో పక్కా వుండడం సృష్టి విచిత్రమా? ప్రకృతి వైపరీత్యమా?
‘ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగల వయస్సు మాకు లేదు. కానీ వున్న పరిస్తితిని అవగాహన చేసుకోవాలనే తాపత్రయం మాత్రం మాకుంది.
‘చివరగా మరొక్క మాట. ఈ ప్రయోగం ద్వారా సాధించింది ఏముంది అంటే వుంది. ఒక కఠోర వాస్తవం మాకు బోధపడింది.
‘ఇన్నాళ్ళుగా, ఇన్నేళ్ళుగా మేము పేదవారిని పరాయివారిగా చూసాము. కానీ మేము వారితో గడిపిన రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వారు మమ్మల్ని అలా చూడలేదు సరికదా అక్కున చేర్చుకుని ఆదరించారు. నిజానికి పేదలం మనమే. అన్నింటికన్నా ముందు చేయాల్సిన పని ఏమిటంటే, మనలో వున్న ‘ఈ పేదరికాన్ని’ రూపుమాపుకోవడమే!’
పదేళ్లు గడిచిన తర్వాత వాళ్ళ ఆలోచనల తీరు ఎలా ఉందన్నది మళ్ళీ ఆ పత్రికే రాస్తే బాగుంటుంది.

https://www.thehindu.com/opinion/columns/Harsh_Mander/barefoot-the-other-side-of-life/article2882340.ece

2 కామెంట్‌లు:

కిషోర్ చెప్పారు...

మీ బ్లాగులు చదవడం అలవాటుగా మారిపోయింది గురువు గారు. మంచి మంచి విషయాలు పంచుకుంటున్నారు.

అజ్ఞాత చెప్పారు...

I heard it was a made up story to awaken reality not sure