(Published in ANDHRA PRABHA, on 30-10-2022, SUNDAY, Today)
మా తాతగారి కాలంనాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా, కరెంట్ బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్నగారి కాలం వచ్చేసరికి కరెంట్ రాలేదు కానీ, రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు, మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మావూరి మొత్తం జనాభాలో, యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప, రైలుని చూసిన వాళ్ళు కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ,
పొగచూరిన వంటింట్లో, కట్టెల పొయ్యి ముందు కూర్చుని, ఒంటిచేత్తో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట, కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగా వేసి, పాలకుండని వాటిపై ఉంచి, పైన ఒక రాతిపలకని దాలిగుంటకు మూతలా కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టేవాళ్ళు. ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి ఆటల్లోకి జారుకునే వారు. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే, అంట్లగిన్నెలు సర్దేసి, వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టేవారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈ పనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. శ్రమతెలియకుండా పాటలు పాడుతుండేవాళ్ళు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మా రోజులు వచ్చే సరికి, రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి గ్యాస్ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు, పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్ పెన్నులుగా, బాల్‌పాయింట్ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్క కాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కానులూ, చిల్లికానులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్ రాళ్ళు రోడ్లపై వెలిసాయి. ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు నిత్యకృత్యంగా మారి, అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోయాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆ రోజుల్లో సెలవులు ఇస్తే చాలు, పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు. ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు, ఒకటేమిటి, ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని, ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని, పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి, మాయాబజారు సినిమాలో మాదిరిగా, కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ, ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు, ఆడిన ఆటలు, పాడిన పాటలు కనురెప్పలకిందే కరిగిపోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే, జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ, లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం,
రోజూ తినే వరి అన్నానికి ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి, పని వాళ్ళు వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం, వరికళ్లాల సమయంలో కొత్త వడ్లు కొలిచి, కొనుక్కుతినే కట్టె మిఠాయి, సాయంత్రం చీకటి పడేవేళకు, మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు, వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ,
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒకనాడు వున్నాయని అన్నా, కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు నమ్ముతారా? కళ్లతో చూసిందే నమ్ముతాం అని వాళ్లంటే మీరేం చేస్తారు?