అమెరికన్ కాలమానం ప్రకారం
మంగళవారం నాడు ఆ దేశంలోని అత్యధికశాతం జనాభా టెలివిజన్ సెట్లకు అతుక్కుపోతారు.
ప్రతి నాలుగేళ్ళకు ఓసారి ఇలా జరగడం అనేది గత అరవై ఏళ్ళుగా ఓ ఆనవాయితీగా మారింది.
వచ్చే నవంబరులో జరిగే
అమెరికా అధ్యక్ష ఎన్నికలకోసం మంగళవారం నాడు ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్
ట్రంప్, ఎన్నికల్లో ఆయనతో తలపడనున్న ప్రత్యర్థి జో బిడెన్ ఓహియో రాష్ట్రంలోని క్లీవ్ లాండ్ లో ఒకే వేదికపై
తలపడనున్నారు. తమని గెలిపిస్తే దేశానికి ఏమి చేయబోతున్నారో ప్రజలకు తెలియచెప్పడానికి ఈ ఏర్పాటు. రిపబ్లికన్
పార్టీ,
డెమోక్రాటిక్ పార్టీ అభిమానులే కాకుండా యావత్ దేశ ప్రజలకు ఈ కార్యక్రమం పట్ల
ఆసక్తి మెండు. బరిలో ఉన్న అభ్యర్ధుల ప్రసంగ శైలి, హావభావాలు,
వేదికపై వారి ప్రవర్తన ఇవన్నీ ఓటింగు సరళిపై ప్రభావం చూపుతాయనే నమ్మకం ప్రబలంగా
ఉన్న కారణంగా రాజకీయ పార్టీలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్ తీసుకుంటాయి.
ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రసంగ పాఠాలను తయారు చేస్తారు. రిపబ్లికన్
పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో
బిడెన్ ముఖాముఖి తలపడే ఈ చర్చకు ఫాక్స్
న్యూస్ ఛానల్ ప్రతినిధి క్రిస్ వాలెస్
మోడరేటర్ గా వ్యవహరిస్తారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా
కొన్ని కోట్ల మంది వీక్షిస్తారని అంచనా.
1960 నుంచి ఈ ఆనవాయితీ మొదలయింది. ఆ కార్యక్రమాన్ని
టీవీల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రసారం చేశారు. ఈ చర్చలో నాటి డెమోక్రాటిక్ అభ్యర్ధి
జాన్ ఎఫ్. కెనడీ,
రిపబ్లికన్ అభ్యర్ధి రిచర్డ్ నిక్సన్ పాల్గొన్నారు. వయసు రీత్యా చిన్నవాడయిన కెనడీది సహజంగానే పైచేయి అయింది. అప్పటికే అస్వస్థతకు గురై
ఆసుపత్రిలో వుండి వచ్చిన నిక్సన్ నీరసంగా కనిపించారు. ఆ రోజుల్లో అమెరికాలో రంగుల
టెలివిజన్లు లేవు. కెనడీ ధరించిన బ్లూ సూట్
బ్లాక్ అండ్ వైట్ టీవీల్లో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. నిక్సన్
వేసుకున్న కోటు బూడిద రంగు. స్టూడియోలో
బ్యాక్ గ్రౌండ్ రంగు కూడా బూడిద రంగు కావడంతో అందులో కలిసి తేలిపోయింది. మొత్తం
మీద కెనడీ గెలుపుకు ఆనాటి చర్చ చాలావరకు దోహదం చేసిందనే నమ్మకం ప్రజల్లో
ఏర్పడింది. చెప్పినదానికన్నా ప్రజలు చూసిందే గుర్తు పెట్టుకున్నారు అనే వ్యాఖ్యలు వినవచ్చాయి.
మొత్తం
మీద అరవై ఏళ్ళ క్రితం మొదలయిన ఈ ముఖాముఖి చర్చాకార్యక్రమం ఓ సాంప్రదాయంగా
కొనసాగుతూ వస్తోంది.
2016 లో
జరిగిన ఎలెక్షన్ డిబేట్ కొంత వివాదాస్పదం
అయింది. అప్పుడు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ పోటీ పడ్డారు. ట్రంప్ మహాశయుడు
మాట తూలడంలో ప్రసిద్ధి. స్టేజీ మీదనే హిల్లరీ క్లింటన్ ను రాక్షసి అనేసారు.
అంతేకాకుండా ఆమె మాట్లాడుతున్నంత సేపూ వెనకాలే తిరుగుతూ,
దాదాపు మీదకు ఒరిగినంత పనిచేశారు. ఇదంతా
టీవీల్లో ప్రజలు చూసారు.
‘ఆ
సమయంలో ట్రంప్ ప్రవర్తన నాకు ఏవగింపు కలిగించింది. వెనక్కు జరుగు అని గట్టిగా
గద్దిద్దామనిఅనుకున్నాను. కానీ సభామర్యాదకు కట్టుబడి ఊరుకున్నాను.” అని ఆ తరువాత
తన ఆత్మకధలో రాసుకున్నారు,
మిసెస్ క్లింటన్.
ఈ సారి
ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూడాలి మరి. (29-09-2020)
కింది ఫోటో : 1960 లో జరిగిన మొదటి డిబేట్