భయపెట్టే సమాచారం ఎందుకు? ‘భయపడకండి, నిబ్బరంగా ఎదుర్కోండి, నన్ను చూడండి’ అని ఉత్తేజపరిచే ఇటువంటి అనుభవాలు మీడియాలో ప్రముఖంగా, పత్రికల్లో మొదటిపుటల్లో రావాలి. గతంలో ఇద్దరి ముగ్గురి అనుభవాలు ఫేస్ బుక్ లో చదివాను. వారితో పెద్ద పరిచయం లేకపోవడం వల్ల, వాళ్ళు మహిళలు కావడం వల్ల షేర్ చేయలేకపోయాను. ఇతరుల పోస్టులను సాధారణంగా నేను షేర్ చేయను. కానీ ఇలాంటి రచనలు నలుగురికీ చేరాలి.
రామకృష్ణ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరగానే నాకూ ఒక మెస్సేజ్ పెట్టాడు. ‘నీ అనుభవాలు షేర్ చేయి రామకృష్ణా’ అని అడిగాను. చాలా సంతోషం అనిపించింది, ఇది చదవగానే.
ఇదిగో ఇలాంటి రచనలే ఈనాటి అవసరం. భయపెట్టే సమాచారం ఎందుకు? ‘భయపడకండి, నిబ్బరంగా ఎదుర్కోండి, నన్ను చూడండి’ అని ఉత్తేజపరిచే ఇటువంటి అనుభవాలు మీడియాలో ప్రముఖంగా, పత్రికల్లో మొదటిపుటల్లో రావాలి.
రామకృష్ణ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరగానే నాకూ ఒక మెస్సేజ్ పెట్టాడు. ‘నీ అనుభవాలు షేర్ చేయి రామకృష్ణా’ అని అడిగాను. చాలా సంతోషం అనిపించింది, ఇది చదవగానే.
రామకృష్ణ కధనం:
“ఇంట్లోకి వచ్చి ఇంటిల్లిపాదినీ చుట్టేసింది
కరెక్ట్ గా నెల రోజుల క్రితం నాకు జ్వరం రావడంతో మొదలైన మా పాట్లు ఇవాళ్టి తో
తీరాయి.
మా ఇంటిల్లిపాదీ అనుభవించిన ఆర్డియల్ అంతా ఇంతా కాదు.
నెల రోజుల క్రితం నాకు జ్వరం రావడంతో మొదలైన మా టెన్షన్.. నాకు టెంపరేచర్ తగ్గకపోగా మరో మూడు రోజుల్లో నా భార్య శ్రీదేవి, అబ్బాయి రాహుల్ కి కూడా జ్వరం సోకడంతో పడిన హైరానా అంతా ఇంతా కాదు.
మరెందుకు జాప్యం చేయడం ఎందుకనుకుని నేను, శ్రీదేవి, రాహుల్, ఏ అనారోగ్య లక్షణాలు లేకపోయినా మా కోడలు సోనాలి.. టెస్ట్ లకు సిద్ధం అయ్యాం. అసలైన ఆర్డియల్ మొదలైంది.
ఈ నెల 2న టెస్ట్, రెండు రోజుల తరువాత నలుగురికీ పాజిటివ్, పాజిటివ్ అని తెలిసిన రోజు రాత్రి పడిన టెన్షన్, హాస్పటల్ అడ్మిషన్ కోసం ఎంత మందిని అడిగానో.. ఎవరూ నో అనరు కానీ సాయం చెయ్యలేని పరిస్థితి..మా ఆఫీసు వాళ్లు ఒక వైపు, నా చిరకాల మిత్రుడు దేవులపల్లి అమర్ ఇంకో వైపు, నా సోర్సెస్ ద్వారా నేను మరోవైపు.. ప్రయత్నాలు ఫలించకపోవడంతో నిరాశ.. పెరుగుతున్న టెన్షన్..
మా రమణ అన్నయ్య (Asian Institute of Gastroentrogy -AIGలో పేషెంట్స్ కేర్ మేనేజర్)పట్టు వదలకుండా చేసిన ప్రయత్నం ఫలించి వాళ్ల గచ్చిబౌలి హాస్పటల్ లో నాకు, శ్రీదేవికి అడ్మిషన్ ఇస్తామంటే.. రాహుల్, సోనుని వదలి ఎలా వెళ్లాలని మరో టెన్షన్.. మర్నాడు వాళ్లకు అడ్మిషన్ ఇప్పిస్తానని అన్నయ్య భరోసా ఇచ్చాక హాస్పటల్ కి బయలుదేరాం.
ఇంత టెన్షన్, బాధ, నిస్సహాయత మధ్య ఏదో ఒకటి తినాలికదా.. ఏ లక్షణాలు లేకపోయినా తనకు పాజిటివ్ వచ్చిందన్న షాక్ లో ఉన్న సోను తేరుకుని, అప్పటికప్పుడు మా ఇద్దరికీ అట్లు పోస్తే ఎలా తిన్నామో? హాస్పటల్ కి ఏమేమి తీసుకు వెళ్లాలి, మేం రెంట్ కి ఉంటున్న ఇంటి వాళ్లకి ఎలా చెప్పాలి.. వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో.. హాస్పటల్ కి వెళ్లేందుకు ట్రాన్స్ పోర్ట్ ప్రయత్నాలు.. మా ఆఫీసు వాళ్లు కూడా పాజిటివ్ కదా.. టాక్సీ వాళ్లు రారేమో (అప్పటికి రాత్రి తొమ్మిది) అన్న అనుమానం..
మరోవైపు.. రాహుల్.. మా ఇంటివాళ్ల అబ్బాయికి విషయం చెబితే.. అతగాడు పెద్ద మనసుతో అలాగా.. అనడమే కాకుండా ఏమైనా సాయం కావాలంటే చెప్పమంటే.. అతడిలో భగవంతుడు కనిపించాడు.. అరగంట లో వెహికిల్ (టాక్సీ ఏర్పాటు చేసుకున్నాం) రావడం.. తో బయలుదేరాం.
ఏఐజి గచ్చిబౌలిలో అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూంటే మరేమీ చెయ్యలేక నేను, శ్రీదేవి బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు.. ఇద్దరికి రూం ఇవ్వమని కోరితే... వేర్వేరు వార్డుల్లో ఇస్తున్నామని కోఆర్డినేటర్ చెప్పిన క్షణం పడిన వేదన.. ఆ వెంటనే తేరుకుని ఒకే రూం ఇచ్చే విషయం కన్సిడర్ చేయమని బతిమిలాడు కోవడం...అర్థరాత్రి దాటి ఒకటిన్నర సమయంలో ఓకే ఇద్దరికీ ఒకే రూం ఇస్తున్నట్టు చెప్పడంతో హమ్మయ్య అనుకుంటూ వదిలిన నిట్టూర్పు...అడ్మిట్ అయిన మరు క్షణం నుంచి ట్రీట్మెంట్ కి అవసరమైన వైద్య ప్రక్రియ మొదలుకావడంతో కాస్త కుదుటపడ్డా ఇద్దరి ఆలోచనలు ఇంట్లో ఉన్న అబ్బాయి, కోడలు గురించే... పాపం ఎలా ఉన్నారో అనే...
మా అదృష్టానికి మర్నాడు వాళ్లిద్దరికి అడ్మిషన్ ఇవ్వడమే కాదు.. ఒకరికొకరు తోడు ఉండడానికి వీలుగా ఓకే రూం అలాట్ చేయడం తో ముందు రోజు రాత్రి నుంచి పడిన టెన్షన్ తగ్గింది.
ఏఐజి ది గ్రేట్.. సర్వీస్, అటెన్షన్.. ట్రీట్మెంట్.. మెడికల్ టీం మిరాకిల్.. వెంటనే కోలుకోవడం మొదలైంది..మా అబ్బాయి, కోడలు నాలుగు రోజుల్లో డిశ్చార్జి అయితే నేను, శ్రీదేవి పూర్తిగా కోలుకుని తొమ్మిది రోజుల్లో ఇంచక్కా ఇంటికి వచ్చేశాం.
మేం హాస్పటల్ ఉండగానే మా ఆరోగ్యం గురించి ఫోన్ చేసి వాకబు చేసిన మాతో పాటు మా బిల్డింగ్ లో మరో రెండు పోర్షన్స్ లో రెంట్ కు ఉంటున్న కుటుంబాల వారు..మా పట్ల ఎంతో కన్ సర్న్ చూపించి.. ఏ హెల్ప్ కావాలన్నా తామున్నామని ఇచ్చిన భరోసా మర్చిపోలేనిది.
డాక్టర్స్ సూచించిన15 రోజుల హోం క్వారంటైన్ ఈ సోమవారం తో ముగియడంతో, కట్టడి చేసిన కరోనాని తరిమి కొట్టేమా లేదా నిర్ధారించుకోవడానికి నిన్న మరోమారు కోవిడ్ పరీక్ష లు చేయించుకున్నాం. ఇవాళ ఉదయం మా నలుగురిని ఆవరించిన కరోనా కనుమరుగైందంటూ.. నెగిటివ్ ఫలితం రావడంతో.. ఆ సంతోషం అందరితో పంచుకుంటున్నాను.
బిఎస్ రామకృష్ణ (BSR).
30-07-2020 – గురువారం”