14, డిసెంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 42 - భండారు శ్రీనివాసరావు



జర్నలిస్టుల జీవితాల్లో పైకి కనిపించని ఓ  విషాద కోణం.
జర్నలిస్టు వృత్తి జీవితం తొలినాళ్ళలో నేను కలిసి తిరిగిన అనేకమంది మిత్రులు, తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి వాళ్ళు పనిచేస్తున్న పత్రికలకే ఎడిటర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉచ్చస్తితిలో వున్నప్పుడు వాళ్ళని కలుసుకోవాలంటే మహామహులకే దుర్లభంగా వుండేది. విజిటింగ్ కార్డు పంపి అనేకమంది బయట వెయిట్ చేస్తున్న సమయాల్లో కూడా వాళ్ళు,  నాతో గతకాలంలో గడిపిన రోజులు మరచిపోకుండా, నన్ను తమ సన్నిహిత వర్గంలోని వాడిగానే పరిగణించి ఆదరించేవారు. అది వారి గొప్పతనంగా నేను భావిస్తాను.
 విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించి విలేకరిగానే పదవీ విరమణ చేసినవాడిని నేను. నా బోటి వాళ్ళే  ఈ వృత్తిలో ఎక్కువగా వుంటారు. అతికొద్దిమంది మాత్రమే  తమ ప్రతిభతో పైమెట్లు  ఎక్కగలుగుతారు. నాది ఒక రకంగా సర్కారు ఉద్యోగం కనుక ఎక్కవలసిన మెట్లు తక్కువే. ఎక్కగలిగిందీ తక్కువే. గోదావరిలో ఎన్ని నీళ్ళున్నా, మనం బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు, మన ప్రాప్తాన్నిబట్టి తెచ్చుకోగలుగుతామని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు చెప్పిన విషయం అహరహం గుర్తుండడం చేత ఈ మెట్లెక్కే గొడవ నా మనసుకు ఎక్కలేదు. అయినా ఈనాటి లోకంపోకడ ఇందుకు విరుద్దం. పొజిషన్ ను బట్టి పలకరింపులు, స్తాయిని బట్టి సాన్నిహిత్యాలు, హోదాని బట్టి ఆహాఓహోలు. కానీ నా అదృష్టం, నా మిత్రులెవ్వరు ఈ కోవలోకి రారు. అందుకే ఇన్నేళ్ళ తరవాత కూడా వారు నాతో  ప్రవర్తించే తీరులో ఇసుమంత తేడా లేదు.
కీర్తి శేషులు, శ్రీయుతులు జి కృష్ణ, నండూరి రామమోహన రావు, తుర్లపాటి కుటుంబరావు,  పీటీఐ కృష్ణ, శ్యాం రావు,  హిందూ రాజేంద్రప్రసాద్, లక్ష్మీపతి, ఆంధ్రపత్రిక ముక్కు శర్మ, పాపయ్య శాస్త్రి,  ఈనాడు శాస్త్రి, యుఎన్ఐ డి సీతారాం, పార్ధసారధి,  ఎక్స్ ప్రెస్ సుందరం, నీలంరాజు మురళీధర్, శ్రీకాంత్ విఠల్, ప్రభ దీక్షితులు, ఆంద్రజ్యోతి  ఆదిరాజు వెంకటేశ్వర రావు, కే. రామకృష్ణ, దామోదరస్వామి, సత్యారావు,  ప్రభ నంద్యాల గోపాల్, సలంద్ర,  పీటీఐ ఏ.హెచ్.వి. సుబ్బారావు, జమాల్ , ఉదయం అంజన్  కుమార్  వంటివారితో (వీరందరూ ఇప్పుడు లేరు) కలిసిమెలిసి తిరగగలిగే అదృష్టం నాకు దక్కింది. అలాగే, శ్రీయుతులు,  సుప్రసిద్ధ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఐ. వెంకట్రావు, కే. రామచంద్రమూర్తి, ఎంవీఆర్ శాస్త్రి, ఇండియా  టు డే అమరనాద్ మీనన్,  నరిశెట్టి ఇన్నయ్య, వేమూరి రాధాకృష్ణ, విశాలాంధ్ర శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, హిందూ కేశవరావు, ఎస్.నగేష్ కుమార్, కె. శ్రీనివాస రెడ్డి, సోమశేఖర్,  క్రానికల్ రబీంద్రనాధ్, పి.ఏ. రామారావు, సింహం అనే నరసింహారావు, పెద్ద బాబాయి సీహెచ్వీఎం కృష్ణారావు, కొమ్మినేని శ్రీనివాసరావు, కడెంపల్లి వేణుగోపాల్, పాశం యాదగిరి, ఎం. వేణుగోపాల్, ఔట్ లుక్  ఎం.ఎస్. శంకర్,  నందిరాజు రాధాకృష్ణ, లక్ష్మీ ప్రసాద్, ఎక్స్ ప్రెస్ వాసు, ఆంధ్రపత్రిక శాస్త్రి, విద్యారణ్య, ప్రజాశక్తి వినయకుమార్, ఎన్.ఎస్.ఎస్. కొండా లక్ష్మారెడ్డి ఇలా ఒకరా ఇద్దరా జర్నలిజంలో కాకలు తీరిన అనేకమందితో చనువుగా మసలగలిగే అవకాశాన్ని నా రేడియో విలేకరిత్వం నాకు అందించింది. నిజానికి వీరిలో చాలామందితో నా సాన్నిహిత్యం, గారు వంటి గౌరవ పద ప్రయోగాలతో ముడిపడివుండలేదు. చాలా చనువుగా పలకరించుకోగల సంబంధబాంధవ్యాలు వుండేవి. దాదాపు ప్రతి రోజు సెక్రెటేరియేట్  లోని ప్రెస్ రూం లో కలుసుకునేవాళ్ళం. పత్రికా సమావేశాలు లేనప్పుడు కొన్ని గంటలపాటు మా నడుమ ముచ్చట్లు సాగేవి. పెద్దా చిన్నా తేడా లేకుండా ఒక కుటుంబంలోని సభ్యులమాదిరిగా గడిపేవాళ్ళం. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్   సుందరం  కనపడగానే సుందరం మనమందరం అని ఏదో కవిత్వ ధోరణిలో పలకరించినా ఆయన  ఏమీ అనుకునేవాడుకాదు. పైగా నవ్వి వూరుకునేవాడు. మా ఇద్దరి నడుమా మరో బాదరాయణ సంబంధం వుండేది. గుజరాత్ గవర్నమెంటు వారి గిర్నార్ స్కూటర్ ను మేమిద్దరం ఒకే డీలర్ దగ్గర కొన్నాము.  హైదరాబాదులో అమ్ముడుపోయిన గిర్నార్ స్కూటర్లే బహు తక్కువ. వాటిల్లో రెండింటికి మేమిద్దరమే  ఓనర్లం. ఆ రోజుల్లో వెస్పా స్కూట ర్లకు పెద్ద గిరాకీ వుండేది. కొనుక్కోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వుండేవి. వాటిని ప్రభుత్వ సిఫారసుతో వెనువెంటనే పొందగల అవకాశం జర్నలిస్టులుగా మాకున్నప్పటికీ, వాటి ఖరీదులో కొంతమేరకు మేరకు  మాత్రమే బ్యాంకు రుణాలు పుట్టేవి. మిగిలిన మొత్తం చేతి నుంచి పెట్టుకునే ఆర్ధిక వెసులుబాటు లేకపోయేది.   అందుకే మరో మాట లేకుండా మేమిద్దరం గిర్నార్ స్కూటర్లు కొనుక్కున్నాము. అదీ ఏదో బ్యాంకు అధికారి జర్నలిష్టులమని అప్పివ్వబట్టి. ఆ అప్పు పుట్టడం కూడా విచిత్రంగా జరిగింది.


(గిర్నార్ స్కూటర్ పై  రచయిత)

కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను, హైదరాబాదు వచ్చి అప్పటి బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని పత్రికా రచయితలు ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవధానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర)వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన  ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు.  ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావుగారు  జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఓ పది వేలు రుణం ఇవ్వడం అనేది ఆయనకు ఒక లెక్కలోనిది కాదు. ఆయన వెంటనే స్పందించి  అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి  లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం  తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం. రెండు రోజుల తరువాత కోటీ లోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను.  బాంకు అధికారి స్కూటరు  లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ  మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు. ఆ రోజుల్లోనే,  గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఎక్స్ ప్రెస్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. ఆ విధంగా నా జీవితంలో మొట్టమొదటి స్కూటరు మా ఇంట కాలు పెట్టింది. మా వైభోగం  ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు. కాకపొతే, చివరికి ఆ స్కూటరే నన్ను వార్తల్లోకి ఎక్కించింది.  హెల్మెట్ లేకుండా ఆ స్కూటర్ పై వెడుతుంటే పోలీసులు పట్టుకోవడం, స్టేషన్ కు తీసుకువెళ్ళడం, జర్నలిస్టుల ధర్నాతో ప్రభుత్వం దిగిరావడం మొదలైన అవాంఛిత సంఘటనలకు ఆ గిర్నార్ స్కూటరే నిర్జీవసాక్ష్యం.
ఇదలా ఉంచి అసలు విషయానికి వస్తే, 
 ‘ఐ నో సీఎం. ఐ నో పీఎం’ అనుకునే  జర్నలిస్టుల జీవితాలు పైకి కనిపించినంత గొప్ప కరెన్సీ కాగితాలేమీ కావు.  వారికి వృత్తి రీత్యా  సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో  పరిచయాలకు ఆస్కారం చాలా తక్కువ. అందుకే, కొందరు సాటి జర్నలిస్టులు  చనిపోయినప్పుడు  విషయం  తెలిసికూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్లి పరామర్శించలేకపోవడానికి ఇదే కారణం. చనిపోయిన వ్యక్తి తప్ప ఇతర కుటుంబ సభ్యులు   వేరే ఎవ్వరు తెలవదు. తెలిసిన ఒక్కరికి మనం  వచ్చిన విషయం తెలియదు.
ఇది పైకి చెప్పుకోలేని ఓ  పెనువిషాదం.                               
(ఇంకా వుంది)

3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...



ఆఖరి వాక్యాలు రియాలిటీ.


జిలేబి

అజ్ఞాత చెప్పారు...

ఏ బీ కే ప్రసాద్ మేధావిగా పరిగణింప బడు తున్నాడు. అతడు ఇటీవల వ్రాస్తున్న వ్యాసాల భావజాలం చాలా దారుణంగా ఉంది. భాషా పాండిత్యంతో వామపక్ష , వ్యవస్థ వ్యతిరేక భావనలను ప్రేరేపిస్తు న్నాడు.
ఏ పత్రిక చూసినా ఇదే తంతు. వామపక్ష కుహనా లౌకిక వాదం పత్రికలలో జర్నలిస్టుల లో రాచ పుండులా వ్యాపించి పోయింది.
ఈ కుహనా మేధావుల కన్నా Francois Gautier, David frawley .. they are real friends of india.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆ రోజులే వేరు శ్రీనివాసరావు గారు. బజాజ్ వారిదే రాజ్యం. NRI లకు వెయిటింగ్ కొంచెం తక్కువుండేది. వెస్పా స్కూటరే కావాలనుకుని, వెయిటింగ్ లిస్టు ఇష్టంలేక నేను సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నాను.

//"చనిపోయిన వ్యక్తి తప్ప ఇతర కుటుంబ సభ్యులు వేరే ఎవ్వరు తెలవదు."//. చొలా కరెక్ట్ గా చెప్పారు. నా ఉద్యోగంలోనూ సాటి ఉద్యోగుల కుటుంబాల పరిచయం చాలా చాలా అరుదు. అందువల్లే మన సహోద్యోగి ఎవరైనా పోతే (ముఖ్యంగా రిటైరయిన తరువాత) పరామర్శకు వెళ్ళలేకపోతున్నాం. విచారకరం.